Monday 30 March 2015

గోదావరిని ఒడిసిపట్టాలె!

* తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం
* ప్రతి నీటిబొట్టూ వాడుకుందాం
పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి
* దేవాదులను గుణపాఠంగా తీసుకోండి
ప్రాజెక్టులపై ఆమూలాగ్రం పరిశీలన జరపండి
* అవసరమైతే 15 రోజుల్లో మళ్లీ సర్వే
* పక్క రాష్ర్టాలతో పంచాయతీలు వద్దు
* ఒక్క ఎకరం ముంపునకు అవకాశమివ్వొద్దు
* నిర్వాసితుల సమస్య తీరాకే ప్రాజెక్టులు
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
* గోదావరిపై సీఎం బృందం ఏరియల్ సర్వే 
* కంతానపల్లి, దేవాదుల, ఇచ్చంపల్లి, కాళేశ్వరం పరిశీలన 
* కంతానపల్లి బాధితులను ఆదుకుంటామని భరోసా 
దేవాదులలో ఉన్నతస్థాయి సమీక్ష
  గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్నదైనా, నూతనంగా చేపట్టేదైనా ప్రాజెక్టులన్నీ తెలంగాణను సస్యశ్యామలం చేసి భవిష్యత్తు తరాలకు కూడా శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఉద్బోధించారు.
      ఈ దృష్టితో ఆయా ప్రాజెక్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో లోపాలు సవరించి రీ డిజైన్ చేయాలని సూచించారు. ఇష్టారాజ్యపు ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాలకు దేవాదుల ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని, వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందని దుస్థితినుంచి గుణపాఠం నేర్చుకోవాలని కేసీఆర్ అన్నారు. లోపాలన్నీ సమర్థంగా సవరించుకున్నప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా, బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల డిజైన్లను, నీటి స్థిరీకరణ, ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వంటి అంశాలను అన్నింటికీ మొత్తానికి మొత్తం సమీక్షించి అన్నీ సరిచూసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ర్టాలతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్దేశించారు. గోదావరి నదిపై ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ అన్ని విషయాలు తేల్చలేక పోవచ్చు.. మరో 15 రోజులు సమయం తీసుకొని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సంపూర్ణ నీటి వినియోగ ప్రణాళికలు రూపొందించండి అని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరోసారి గోదావరి నదిపై ఇంజినీరింగ్ నిపుణులతో పూర్తిస్థాయి ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. 
ప్రతి చుక్కా వాడుకోవాల్సిందే..!
గోదావరి నదికి సంబంధించిన ఒక్క చుక్క నీరు కూడావదలకుండా ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. సీమాంధ్రుల పాలనలో ఇప్పటిదాకా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. తెలంగాణ వచ్చాక కూడా అందుకు అవకాశం ఇవ్వరాదని ఆయన భావిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పక్కరాష్ర్టాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నది కేసీఆర్ స్థిర నిశ్చయంగా ఉంది. ఆదివారం గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్ అనేక విషయాలను గమనించారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ రాష్ర్టానికి ఉపయోగపడదని నిర్ధారించారు. దేవాదుల, కంతానపల్లి ప్రాజెక్టులను రీ సర్వే చేయాలని నిర్ణయించారు. కంతానపల్లి దగ్గర మరో ప్రాజ్టెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దేవాదుల, ఇచ్ఛంపల్లి, మెట్టగడ్డ ప్రాంతాల్లో కొత్త బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రజలకు నష్టం కలుగకుండా, ఒక్క ఎకరం ముంపునకు గురికాకుండా చూడాలని సీఎం మనోగతంగా ఉంది. సీమాంధ్రుల పాలనలో ప్రాజెక్టులు ఇష్టానుసారం రూపొందించారని, వాటికి జీవం కల్పించాలంటే మళ్లీ సర్వే చేయాల్సిన అవసరం ఉందని భావించారు. 
ఏరియల్ సర్వే చేసిన సీఎం..
గోదావరి నదిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. నదిపై నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాలను ఆయన విహంగ వీక్షణం చేశారు. హన్మకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఏటూరునాగారం మండలం కంతానపల్లి, దేవాదుల, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని ఇచ్ఛంపల్లి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఒక హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, మరో హెలిక్యాప్టర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగరరావు, నీటిపారుదల ఉన్నతాధికారులు మురళీధరరావు, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ముందుగా కంతానపల్లిలో దిగిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నీటిపారుదల అధికారులు గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ మ్యాపులు, స్పిల్‌వే, బ్యారేజ్ నమూనాలు తదితర విషయాలను ఇంజనీరింగ్ నిపుణులు సీఎంకు వివరించారు.
ముంపు గ్రామాలపై సీఎం ఆరా..
ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రజల ఆర్థిక స్థితిగతులను సీఎం ఈ సందర్భంగా ఆరా తీశారు. ఏటూరునాగారం మండలం కంతానపల్లి, సింగారం, ఏటూరు గ్రామాలు పూర్తిగా, మరో ఐదు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. సీఎం మధ్యలో కలుగజేసుకొని ఈ గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇండ్లుంటాయి? అని ఆరా తీశారు. జిల్లా యంత్రాంగంతోపాటు నీటిపారుదల అధికారులు ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 890 ఇండ్లు ఉంటాయని అధికారులు బదులిచ్చారు.
             ఆ ఇండ్ల స్వభావం ఎటువంటిది? అని కూడా సీఎం అడిగారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ మనకు అందిన సమాచారం ప్రకారం అన్ని ఇండ్లు కూడా సెమీపర్మనెంట్, కొన్ని పర్మినెంట్ ఇండ్లుంటాయని చెప్పారు. కంతానపల్లి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 10,500 కోట్లని, అందులో స్పిల్‌వే, బ్యారేజ్ నిర్మాణం తదితర అంశాల వారీగా అంచనాలను సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టు వద్ద దాదాపు అర గంటసేపు గడిపిన కేసీఆర్ గోదావరి నదిని పరిశీలించారు. గోదావరి ఆవల ఖమ్మం జిల్లా వాజేడు మండలానికి చెందిన ఆర్లగూడెం, గెర్రగూడెం, పెరూర్, చంద్రుపట్ల, గంగారం, టేకులగూడెం గ్రామాలున్నాయని అందులో అందులో దాదాపు మూడు గ్రామాల దాకా కంతానపల్లి పరిధిలోకి వస్తాయని అయితే అవి పూర్తిస్థాయిలో ముంపునకు గురవుతాయా? లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంటుందని బదులిచ్చారు. అనంతరం అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో గోదావరిపై సర్వేకు బయలుదేరారు. దేవాదుల, కాళేశ్వరం, ఇచ్ఛంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థలాలన్నీ ఏరియల్ సర్వే నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో దేవాదులకు చేరుకున్నారు. అక్కడ ఇంటెక్‌వెల్‌ను సందర్శించారు. దేవాదుల అతిథిగృహంలో మధ్యాహ్న భోజన విరామం ముందూ అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, కలెక్టర్ వాకాటి కరుణ, హైదరాబాద్ నుంచి వచ్చిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, దేవాదుల, కంతానపల్లి ఎస్‌ఈ, ఈఈలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
పరిహారం చెల్లించాకే....
కంతానపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో వ్యహరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వారికి సంతృప్తి కరమైన నష్టపరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. కంతానపల్లి, దేవాదులలో తనను కలిసిన కంతానపల్లి నిర్వాసితులతో సీఎం మాట్లాడారు. మీరు బాగుంటేనే ప్రాజెక్టు బాగుంటుంది. మీరు సంతోషంగా ప్రభుత్వానికి సహకరించండి. మిమ్మల్ని ఎల్లకాలం సంతోషంగా ఉంచే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి కంతానపల్లి నిర్వాసితులతో అన్నారు. 
                   నష్టపరిహారం విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది.. ఈ విష యం లో భూ నిర్వాసిత చట్టాలకన్నా ఎక్కువగా మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని సీఎం అధికారులకు హితవు పలికారు. ఈ విషయంలో భూ నిర్వాసితులకు ఏం చేస్తే న్యాయం జరుగుంది? వారి జీవితాలు శాశ్వత ప్రాతిపదికన బాగుండాలంటే ఏం చేయాలో ఆలో చించి ఒక నివేదికను అందజేయాలని కలెక్టర్ వాకాటి కరుణ, ఇతర శాఖల అధికారులు ఆదేశించారు. ఆదివాసీ సంఘాలతోనూ సీఎం మాట్లాడారు. సీఎం పర్యటనలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.- (నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment