Tuesday 28 July 2015

ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితి 44 ఏండ్లు!

* ఏడాదిపాటు అన్ని నియామకాలకు వర్తింపు* 15,522 ఖాళీలకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 
* స్థానికత, జోన్, జిల్లా నియమాలు వర్తింపు
* రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు యథాతథం
  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే అన్ని ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏండ్లకు పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. టీఎస్‌పీఎస్‌సీ, ఇతర సెలక్షన్ కమిటీలు చేపట్టే ఉద్యోగాల నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే యూనిఫారం సర్వీసులకు మాత్రం ఇది వర్తించదు. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ తొలిదశలో భాగంగా 15వేల ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పదేండ్ల వయోపరిమితి పెంపు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ నుంచి అంటే 27.07.2015 నుంచి ఏడాది పాటు అంటే 26.07.2016 వరకు ఈ సడలింపు వర్తిస్తుంది. 
ఇవీ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నది. ఈ క్రమంలో డైరెక్టు రిక్రూట్‌మెంట్ విధానంలో అర్హులైన విద్యావంతులను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీతో పాటు ఇతర సెలక్షన్ కమిటీలకు ఖాళీలను అందజేసింది. ఇదే సమయంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. ఈ విషయంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం పదేండ్ల వయోపరిమితి పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌కి వర్తిస్తుంది. 
     ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో కూడా ప్రచురితం అవుతుంది అంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు అదే జీవోలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 309 కింద కల్పించిన అధికారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది అడ్‌హాక్ రూల్ వెలువరిస్తున్నది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్ ప్రకారం వయోపరిమితిని పదేండ్లు అంటే...34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం జరిగింది. జీవో విడుదల అయిన తేదీ నుంచి ఏడాది పాటు రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాలకు ఇది వర్తిస్తుంది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌లోని రూల్ 12కి కూడా ఈ మార్పు వర్తిస్తుంది. యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ తదితర ఉద్యోగాలలోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఇది వర్తించదు అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఆర్థిక శాఖ ఆదేశాలు...
ఉద్యోగాల భర్తీలో భాగంగా గుర్తించిన 15,522 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్ శివశంకర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, ఇతర నియామక సంస్థల బాధ్యులు తగు చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికత, జోన్, జిల్లా, రోస్టర్‌పాయింట్లు, ఇతర అర్హతలు తదితర విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. 
         సంబంధిత శాఖలు, విభాగాల బాధ్యులు నియామక ప్రక్రియకోసం తగు వివరాలు అందించాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా కాకుండా ఎంపిక ప్రక్రియను నిర్వహించే జిల్లా ఎంపిక కమిటీలు, కార్పొరేషన్లు, విభాగాలు నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిష్పక్షపాత విధానంలో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలని నిర్దేశించారు. ఎంపిక ప్రక్రియ కోసం తగు విధమైన చర్యలను వెంటనే ఆయా విభాగాలు చేపట్టాలని స్పష్టం చేశారు. 
                                                                             
 (-నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment