Wednesday 19 February 2014


Saturday 8 February 2014

తెలంగాణకు ఆమోదముద్ర


* విభజన బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా.. 32 సవరణలు 
* హైదరాబాద్‌ కేంద్రపాలితానికి, రాయలకూ ససేమిరా 
* అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లు యథాతథంగా రాష్ట్రపతికి.. 
* పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రకు 
* ఉత్తరాంధ్ర, సీమల అభివృద్ధికి పన్ను రాయితీ 
* సీమాంధ్రకు ప్యాకేజీ సిఫార్సు బాధ్యత 14వ ఆర్ధిక సంఘానికి 
* సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని భరించేది కేంద్రమే 
* హైదరాబాద్‌ ఆదాయ పంపిణీకి మంత్రివర్గం తిరస్కృతి 
*12న రాజ్యసభ ముందుకు? 

     రాష్ట్ర విభజన బిల్లు మరో మజిలీ దాటింది. కేంద్ర మంత్రివర్గం దీనికి శుక్రవారం ఆమోదముద్ర వేసింది. సీమాంధ్రులు అడిగిన ముఖ్యమైన డిమాండ్లలో ఒక్కటి తప్ప వేటినీ మంత్రివర్గం పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్‌కు కేంద్ర పాలిత ప్రాంత(యూటీ) హోదా కల్పించటంతో పాటు రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనల్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. 

హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని సీమాంధ్రకూ పంపిణీ చేయాలన్న సూచననూ తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్ని సీమాంధ్రకు బదలాయించాలని నిర్ణయించడమొక్కటే కొంత వూరట. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. సొంత పార్టీలోనూ, బయట తీవ్ర ఒత్తిళ్లు, వ్యతిరేకత వస్తున్నప్పటికీ... ఈ బిల్లును ఈ నెల 12వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

రాష్ట్ర శాసనసభ, మండళ్లలో చర్చ తర్వాత వేలాది సవరణ ప్రతిపాదనలతో వచ్చిన రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును యథాతథంగా రాష్ట్రపతికి పంపాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణానికయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని, దీంతో సహా కొత్త రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్యాకేజీని సిఫార్సు చేసే బాధ్యతను 14వ ఆర్థిక సంఘానికి అప్పగించాలని నిర్ణయించింది. పునర్‌వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, మండళ్లు తిరస్కరిస్తూ తీర్మానం చేసినా... దానిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కేంద్రం- ముందుగా భావించినట్లుగానే తెలంగాణ ఏర్పాటుపై వేగంగా ముందుకెళుతోంది. శాసనసభ, మండళ్ల అభిప్రాయంతో వచ్చిన బిల్లును యథాతథంగా రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించినందున- బిల్లును తిరస్కరిస్తూ చేసిన తీర్మానంతో సహా కేంద్రమంత్రివర్గం చేయదలచిన 32 సవరణ ప్రతిపాదనలు సైతం రాష్ట్రపతికి వెళతాయి. రాజ్యాంగంలో ప్రస్తావించిన నియమ నిబంధనల మేరకే ఇలా వ్యవహరించాలని మంత్రివర్గం భావించింది.
ప్రభుత్వ పరంగా 32 సవరణలు 
పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ప్రభుత్వపరంగా 32 సవరణలు తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. వీటిల్లో కీలకమైంది పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోని ముంపు గ్రామాలన్నింటినీ సీమాంధ్రలో కలిపే సవరణ.

విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... మంత్రివర్గ సమావేశంలో చోటుచేసుకున్న చర్చ, తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి... శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన 9,072 సవరణల ప్రతిపాదనలతో పాటు మండలిలో ఎమ్మెల్సీలు ప్రతిపాదించిన సవరణల సారాంశంపై రాష్ట్రం నుంచి 60 పేజీలతో వచ్చిన నివేదికను కేంద్ర హోంశాఖ పరిశీలించింది. దాని ఆధారంగా తయారుచేసిన నివేదికను మంత్రివర్గానికి సమర్పించింది. సవరణల్ని అంతగా పరిగణనలోకి తీసుకోలేదు. వీటిల్లో గరిష్ఠంగా 20 మాత్రమే నిర్దిష్టమైన సవరణ ప్రతిపాదనలున్నాయని తేల్చినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌కు ఇచ్చినట్లుగా... ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో ఏర్పాటుచేసే పరిశ్రమలకు వివిధ రూపాల్లో పన్ను రాయితీలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

సీమాంధ్ర మంత్రుల మొర ఆలకించలేదు! 
సీమాంధ్ర కేంద్ర మంత్రులు పలు ప్రతిపాదనల్ని మంత్రివర్గ సమావేశంలో గట్టిగా ప్రతిపాదించారు. వీటిల్లో అత్యంత కీలకంగా, బిల్లు స్వరూపాన్నే పూర్తిగా మార్చేయగల హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటం, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయటం తదితరాలున్నాయి. వీటిని సమావేశం తిరస్కరించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని సీమాంధ్రకూ పంపిణీ చేయాలన్న సూచననూ ఆచరణ సాధ్యం కాదని తేల్చేసింది.

శాంతిభద్రతలు గవర్నర్‌కు ఎలా బదలాయిస్తారు: శరద్‌పవార్‌ 
హైదరాబాద్‌ నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు ఎలా బదలాయిస్తారని కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన కీలకమైన శాంతి భద్రతలు గవర్నర్‌కు అప్పగిస్తే ఆచరణలో ఇబ్బందులొస్తాయని ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల రాజధానులు ఉండే ప్రాంతం కాబట్టి తప్పదని, ఆర్టికల్‌ 3 ప్రకారం ఈ మేరకు ఏర్పాట్లుచేయొచ్చని జైరాం రమేష్‌ బదులిచ్చారు. పార్లమెంటులో బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలన్న అశం కేంద్ర మంత్రివర్గంలో చర్చకు రాలేదు.

వ్యతిరేకించిన జైపాల్‌ 
సీమాంధ్రకు వెసులుబాట్లు కలిగేలా కీలక సవరణల్ని మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, కిశోర్‌ చంద్రదేవ్‌ ప్రతిపాదించగా... వీటిని జైపాల్‌రెడ్డి వ్యతిరేకించారు. బిల్లుపై లేవనెత్తిన సందేహాల్ని జైరాం రమేష్‌ నివృత్తి చేశారు. ఒక దశలో చిదంబరం కూడా జోక్యం చేసుకున్నారు. చివరిగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ 2004 నుంచి తెలంగాణ అంశం పరిశీలనలో ఉందని, రాష్ట్రపతి ప్రసంగంలో ఉంచామని, ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించామని, ఇప్పటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బిల్లును తిరస్కరిస్తూ దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయరాదని రాష్ట్రపతికి విన్నవిస్తూ శాసనసభ, మండలి తీర్మానం చేసిన నేపథ్యంలో... దీనిపై రాష్ట్రపతి అనుసరించే వైఖరి, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి ఇతర పక్షాలను కూడా అంగీకరింపజేసేందుకు ప్రభుత్వం అవలంబించే వ్యూహంపై బిల్లు భవితవ్యం ఆధారపడిందన్న భావన వ్యక్తమవుతోంది.

బిల్లును లోక్‌సభలోనే పెట్టాలి: సిబల్‌కు కిశోర్‌ సలహా 
ఆర్థిక అంశాలతో ముడిపడిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సమావేశానంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్‌కు సూచించారు. వ్యవహారంలో ఒక్క రూపాయి ఇమిడి ఉన్నా అలాంటి బిల్లును కచ్చితంగా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుందని న్యాయమంత్రి కపిల్‌సిబల్‌కు చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించారని, ఇదివరకు మూడురాష్ట్రాల బిల్లులు కూడా లోక్‌సభలోనే పెట్టినట్లు సిబల్‌ తనతో అన్నట్లు కిశోర్‌చంద్రదేవ్‌ తెలిపారు.