Monday, 29 June 2015

'తెలంగాణ' హరిత మణిహారం!

పొగలు కమ్మేస్తున్న పరిసరాలు.. దుమ్మురేపుతున్న రోడ్లు.. హరితవనాల్లాంటి ఊర్లు కాంక్రీట్ జంగల్స్‌గా.. బూడిద దూళితో సహవాసం చేస్తున్నాయి.. దీన్నిలా వదిలేస్తే.. వానలు వెనకడుగువేస్తాయి. పంటలు కంటనీరు పెడతాయి! రండి.. తెలంగాణ మణిహారం.. హరితహారంలో భాగస్వాములమవుదాం.. గొప్ప సంకల్పానికి సహకారమందించి హరిత తెలంగాణ ను నిర్మించుకుందాం. మొక్కలు నాటడాన్ని రెస్పాన్సిబుల్.. ప్యాషన్.. ట్రెండ్‌గా మార్చుకొని తెలంగాణను గ్రీన్ కవర్‌గా మార్చేద్దాం! 
తెలంగాణకు నిలిచి.. కురిసే వానలు వాపస్ రావాలె. ఊర్లల్ల ఉంటున్న కోతులు అడవికి వాపస్ పోవాలె నినాదంతో హరితహారాన్ని సాకారం చేసేందుకు నడుంబిగించారు సీఎం కేసీఆర్. పచ్చదనమే పుడమికి అందం.. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యం అనేది ఈ ప్రాజెక్ట్ ఫార్ములా. మూడేళ్లలో రాష్ట్రమంతటా 230 కోట్ల మొక్కలు నాటి తెలంగాణకు హరితహారాన్ని అలంకరిస్తారు. జులై 3వ తేదీన యాదాద్రి నుంచి 10వ తేదీ వరకు హరితహారం వారోత్సవాలు పేరిట అన్ని జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ బాధ్యతను మనపై వేసుకుని కేసీఆర్ మానస పుత్రిక హరితహారాన్ని సక్సెస్ చేయాల్సింది మనమే! అందుకే ఇప్పుడెక్కడ చూసినా.. విద్యార్థులు.. అధికారులు.. ప్రజాప్రతినిధులు ఈ తెలంగాణకు హారాన్ని అలంకరించే పనిలో బిజీగా ఉన్నారు. 
సంస్కృతిగా..
పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలి. తెలంగాణ మొత్తం హరితహారం కావాలి. పారిశ్రామిక అనివార్యమైన పరిస్థితుల్లో ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వర్షాభావ పరిస్థితులకు.. కరువు కాటకాలకు అడవి లేకపోవడమే కారణం కాబట్టి.. ఈ స్పృహ, అవగాహన ప్రజల్లో రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థల్లో హరితహారం ప్రోగ్రామ్సే ఎక్కువగా జరుగుతున్నాయి. స్కూల్స్.. కాలేజెస్‌లో ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెల్‌కమ్ పార్టీస్.. ఫ్రెషర్స్ పార్టీస్ మాత్రమే చూశాం. కానీ గత వారం రోజులుగా ఏ కాలేజ్‌లో.. స్కూళ్లో చూసినా గ్రీన్ కవర్ ప్రోగ్రామ్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. హరితహారాన్ని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ కల్చర్‌గా తీసుకెళ్లాలనే ప్రభుత్వ ఆలోచనలో మేముసైతం అంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాం అని చెప్పారు జాగృతి ఇంజినీరింగ్ కాలేజ్ సెక్రెటరీ ఎస్.వెంకటేశ్వర్లు. మొక్కల ఆవశ్యకత గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నర్సరీ స్టేజ్‌లో తెలియాల్సింది ఎంబీఏ చదివే స్టేజ్‌లో తెలిసింది. అయినా చెట్లే మానవ మనుగడకు మూలం అని తెలుసుకుని కాలేజ్‌లో.. ఇంటివద్దా ఈ యాక్టివిటీస్‌లో ముందుంటున్నాం అని పేర్కొన్నారు శ్రీఇందు ఇంజినీరింగ్ కాలేజ్ ఎంబీఏ స్టూడెంట్ రాఘవేంద్ర సాయి. 
పూలబాటగా..
బంగారు తెలంగాణకు హరితహారం పూలబాట. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌజ్ గ్యాసెస్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అనేక దేశాల్లో ఈ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాయి. భూగోళంపై ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ కవర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. హరితహారం కూడా అలాంటిదే. ఇకపై మనం హరితం.. శివం.. సుందరం అని స్మరించుకోవాలి అనేది ప్రభుత్వ ఆశయం. పోయిన అడవులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం. ఉపాధిహామీతో అనుసంధానం చేసి తో ఈ పథకం నడుస్తుంది. ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 20లక్షలు.. ప్రతి గ్రామానికి 40వేల మొక్కలు నాటి బంగారు తెలంగాణకు పూలబాట వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనిత. చైనా ప్రజలు గోబీ ఎడారి విస్తరించకుండా వందల కోట్ల మొక్కలు నాటారు. గోబీ ఎడారిని స్ఫూర్తిగానే మన ముఖ్యమంత్రి హరితహారానికి అంకురార్పణ చేశారు. చెట్లు పెంచితే వర్షాలు పడుతాయి. చెరువులు నిండుతాయి. పంటలు పండుతాయి అని పర్యావరణవేత్త పుట్టపాక రామారావు వివరించారు. 
సైనికుల్లాగా..
సైనికుల్లా పనిచేసే సామాజిక కార్యకర్తలు, విద్యార్థులే రితహారం విజయవంతం కావడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. పిల్లల భవిష్యత్ కోసం హరితహారం సైనికులు కవాతుల్లా తరలిరావాలని కోరుకుందాం. 
    బడుల్లో మాకు.. గుడుల్లో పూజారులు.. మసీదులో ముల్లాలు.. చర్చీల్లో పాస్టర్‌లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమం కూడా పిడికెడు మందితోనే స్టార్ట్ అయి కోట్లాది ప్రజల భాగస్వాములై ఉవ్వెత్తున్న తీసుకెళ్లాం. తెలంగాణకు హరితహారం కూడా ఓ ఉద్యమంలాంటిదే. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ సంబంధ కార్యక్రమం అని అన్నారు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్. ఇన్ని కోట్ల మొక్కలు నాటడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రపంచ భూభాగంలో 33శాతం గ్రీనరీ ఉంటేనే ప్రజలు సురిక్షితంగా ఉంటారని ప్రపంచ దేశాల సదస్సుల్లో చాలాసార్లు ప్రముఖులు ప్రసంగించిన దాఖలాలున్నాయి. కాబట్టి అటువంటి ప్రతిష్టాత్మకమైన బాధ్యతను మనపై వేసుకున్నందకు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. సుభిక్షంగా ఉంటామని చెప్పవచ్చు అని వివరించారు రెవెన్యూ అధికారి లింగం.
ఆకుపచ్చగా
తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే హరితహారం. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 4213 నర్సరీల్లో 40కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా అవి పెరగడానికి అవసరమైన సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలా కాకుండా రెస్పాన్సిబుల్‌గా తీసుకున్నాం అని వివరించారు రంగారెడ్డిజిల్లా సోషల్ ఫారెస్ట్ ఇబ్రహీంపట్నం రేంజ్ ప్రతినిధి వెంకట్రామమ్మ. ప్రభుత్వ దిశా నిర్దేశాల మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు జులై 3వ తేదీ నుంచి మొక్కల్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హరితవనాల రోజులొస్త్తాయి అన్నారు నర్సరీ పర్యవేక్షకుడు బి.శ్రీనివాస్‌రెడ్డి. 

Saturday, 20 June 2015

మన నీళ్లపై మనకు స్వేచ్ఛ..

*  కృష్ణాజలాల్లో మన వాటా 299 టీఎంసీలు
* ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు.. 
* ఇప్పటికి బచావత్ కేటాయింపులే!
* ఏడాది కాలానికి కుదిరిన ఒప్పందం
*  రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ
* కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయాలు
* ఇది చారిత్రక విజయం: విద్యాసాగర్‌రావు
కృష్ణా నదీ జలాల్లో మన రాష్ర్టానికి కేటాయించిన నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై మనకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది బేసిన్‌లో మనకు లభించిన వాటా మేరకు మనం నీటిని ఏ ప్రాజెక్టు నుంచైనా పొందడానికి, వినియోగించుకోడానికి పూర్తి అధికారం లభించింది. గత సంవత్సరం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బోర్డు సమావేశంలో మనం పెట్టిన ప్రతిపాదన చివరకు నిర్ణయంగా మారింది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా మనం మనకు దక్కిన నీటిని వినియోగించుకునే అవకాశం లభించింది.
దీంతో ఇప్పటికి బచావత్ కేటాయింపులే అమల్లో ఉంటాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని, మినిట్స్‌ను బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. అక్కడినుంచి ప్రత్యేకమైన నోట్‌తో పాటు ఈ ఒప్పందం రెండు రాష్ర్టాలకూ చేరుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తర్వాత కేంద్రం నుంచి వచ్చే ఆదేశం మేరకు బోర్డు వీటిని రెండు రాష్ర్టాలకు మళ్ళీ పంపుతుంది. అప్పటినుంచి ఇది అమలులోకి వస్తుంది.
చారిత్రక విజయం
రెండు రాష్ర్టాలకు చేసిన కేటాయింపు మేరకు ఆ నీటిని వాటి ఇష్టప్రకారం వినియోగించుకునే స్వేచ్ఛ లభించడం ఈ సమావేశం సాధించిన చారిత్రక విజయం. గతంలో ఉన్న విధానం ప్రకారం ఆయా రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటాయింపులను మాత్రమే వినియోగించుకోవాలని, ఇష్టప్రకారం తరలించడం, ఇతర ప్రాజెక్టుల పరిధిలో వినియోగించడం సాధ్యం కానందువల్ల తెలంగాణ చాలా నష్టపోతున్నది. ముఖ్యంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు లభించిన నీటి కేటాయింపులను ఇష్టప్రకారం, అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ లభించడం చాలా పెద్ద విజయమని నీటిపారుదల నిపుణులు హర్షం ప్రకటిస్తున్నారు.
కీలక అంశాల్లో ఏకాభిప్రాయం
కృష్ణా నది నిర్వహణ బోర్డు అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్ అధ్యక్షతన ఇరు రాష్ర్టాల సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజినీర్లు, తెలంగాణ రాష్ట్ర సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు హాజరైన ఈ సమావేశం రెండు రోజుల పాటు జరిగింది. అనేక అంశాలపై చర్చలు జరిగిన అనంతరం రెండు రాష్ర్టాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మొత్తం 811 టీఎంసీల కృష్ణా నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీటి వాటా కేటాయించి ఉండగా.. మనకు కేటాయించబడిన నీటిని ఏ విధంగానైనా మనం వాడుకునే అవకాశం లభించింది. రానున్న ఏడాదికి మాత్రమే ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా ఈ నీటిని పొందవచ్చు. అదే సమయంలో ఇతర రాష్ర్టాల హక్కులకు కూడా భంగం కలగని రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది.
* ఉదాహరణకు మనకు నెట్టెంపాటు, బీమా ప్రాజెక్టులకు గతంలో నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తికానందువల్ల ఈ నీటిని మరో ప్రాంతానికి తరలించి వినియోగించుకునే అవకాశం ఇన్నాళ్ళూ లేదు. కానీ ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రెండు ప్రాజెక్టుల కింద లభ్యమయ్యే 30 టీఎంసీల నీటిని మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా తరలించుకుని వినియోగించుకునే వీలు కలిగింది. 
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు
- విద్యుత్ ఉత్పత్తికోసం శ్రీశైలం డ్యామ్‌ను మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సార్బీసీ)కి సరఫరా చేస్తున్న 19 టీఎంసీల నీటికి ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. 
- రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద తుంగభద్ర జలాలు మనకు దీర్ఘకాలంనుంచి రావడంలేదు కాబట్టి కేసీ కెనాల్ దగ్గర గేట్లు బద్దలు కొట్టే లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఒకవేళ నికర జలాల్లో హెచ్చు తగ్గులు ఏర్పడినట్లయితే ప్రస్తుతం అమలవుతున్న నిష్పత్తి (512:299) లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంకోసం ఇరు రాష్ర్టాల తరఫున ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, బోర్డునుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఒకరు సభ్యులుగా ఉండే వర్కింగ్ మేనేజ్‌మెంట్ కమిటీ పర్యవేక్షణ, సమీక్ష జరుపుతుంది. ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి రెండు రాష్ర్టాల నుంచి నీటి అవసరాలకు సంబంధించి ఇండెంట్‌ను తీసుకుని నీటిని కేటాయించడం, విడుదల చేయడం తదితరాలను పర్యవేక్షిస్తుంది. ఏ రాష్ట్రం ఎంత మేర నీటిని వినియోగించుకున్నదనే వివరాలను బోర్డు నిర్వహిస్తుంది. 
- ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవీ కూడా ట్రిబ్యునల్ వెలువరించిన ఉత్తర్వులకు, వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించిన అభిప్రాయాలకు విరుద్ధంగా లేనందువల్ల ఏడాదికోసం కుదిరిన ఈ ఒప్పందాన్ని రెండు రాష్ర్టాలూ ఆరోగ్యకరమైన తీరులో అమలు చేయాలని, ఘర్షణకు తావులేని విధంగా వ్యవహరించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. గత సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా ఇబ్బంది పెట్టినందున ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆంక్షలూ ఉండరాదని నిర్ణయం జరిగింది. అయితే చెన్నై, ఎస్సార్బీసీలకు చేసిన కేటాయింపులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా ఏకాభిప్రాయం కుదిరింది. 
తెలంగాణకు మేలు చేసే నిర్ణయం: విద్యాసాగర్‌రావు
రెండు రాష్ర్టాల మధ్య ఘర్షణలను నివారించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, రెండు రోజుల చర్చల అనంతరం చాలా మంచి నిర్ణయం జరిగిందని, ఇది తెలంగాణకు చాలా మేలు చేస్తుందని సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు నమస్తే తెలంగాణతో అన్నారు. కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
            గత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తితో పాటు నీటి వినియోగంలో రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు ఏర్పడి వివాదంగా మారినప్పుడు గవర్నర్ ద్వారా పరిష్కారం కుదిరిందని, ఈసారి అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకముందే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. రెండు రాష్ర్టాలూ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇతర రాష్ర్టాల హక్కులకు భంగం కలగని రీతిలో నీటి వినియోగంకోసం చర్చించి ఏకాభిప్రాయానికి రావడం ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండే పరిస్థితికి శ్రీకారం చుట్టినట్లయిందని అన్నారు. 
       ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున విద్యాసాగర్‌రావుతో పాటు ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, నీటిపారుదల లీగల్ వ్యవహారాల నిపుణులు విద్యాసాగర్, చీఫ్ ఇంజినీర్ నాగేంద్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వర్లు, బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాల్గొన్నారు.
- నమస్తే తెలంగాణ.

Monday, 15 June 2015

665 ఎస్టీ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్

సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా 665 ఎస్టీ పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గతంలో 175 పోస్టులకే పరిమితమైన పోస్టులను అధనంగా మరో 490కి పెంచి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో కోల్‌బెల్టులోని గిరిజన నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
   పెద్ద ఎత్తున ఎస్టీ పోస్టుల భర్తీ కోసం సింగరేణిలో జారీ అయిన నోటిఫికేషన్‌లో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు. 665 బదిలీ వర్కర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఈ ఏడాది జూన్ ఒకటి నాటికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సుకలిగిన ఎస్టీ అభ్యర్థులు అర్హులు. కనీస విద్యార్హత ఎస్‌ఎస్‌సీ. తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. జూన్ 25 లోపు తమ దరఖాస్తులను సింగరేణి వెబ్‌సైట్ www.scclmines.com వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధారిత డాక్యుమెంట్లతో ప్రింట్‌అవుట్ ధరఖాస్తులను జూన్ 30 లోపు సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. 
   రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 80 శాతం పోస్టులు కోల్‌బెల్టు ప్రాంతంలోని షెడ్యూల్డ్ ఏరియాలో నివసించే గిరిజనులకు రిజర్వు అవుతాయి. మిగతా 20 శాతం పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ఆరు జిల్లాల ఎస్టీ అభ్యర్థులకు వర్తిస్తాయి.

Saturday, 13 June 2015

‘అవినీతికి తావులేకుండా పరిశ్రమలకు అనుమతులు’

రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐ-పాస్)కు శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఇవాళ నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతాలాపన అనంతరం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి టీఎస్ ఐపాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. అప్లికేషన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాదాపు 2 వేల 5 వందల మంది పారిశ్రామిక వేత్తలు, 250 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిటన్, అమెరికా, టర్కీ, మలేషియాకు చెందిన రాయబారులు హాజరయ్యారు. బీహెచ్‌ఈఎల్, మిథాని, బీడీఎల్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు విచ్చేశారు. 
          టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే 1 లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది. నూతన పారిశ్రామిక విధానం అమలులోకి రావడంతో ఇకపై పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడి దారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం రెండు వారాల్లోగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వనుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నారు. 
సీఎం ప్రసంగంలోని ప్రధానాంశాలు:
- పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది
- కోరుకున్న చోట పరిశ్రమలకు కావాల్సినంత భూమి ఇస్తాం
- ఆన్‌లైన్‌లో పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా అనుమతులు మంజూరు
- జాప్యం చేస్తే సంబంధిత అధికారికి రూ.1000 జరిమానా వేస్తాం
- సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు
- పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
- అన్ని పరిశ్రమల ఏర్పాటుకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా
- వాటర్‌గ్రిడ్ పైపులైన్ల ద్వారా పరిశ్రమలకు చాలినంత మంచినీటి సరఫరా
- వంద శాతం అవినీతి రహితంగా (కరప్షన్ ఫ్రీ) అనుమతులు మంజూరు
- సెల్ఫ్ సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం
- పరిశ్రమల అనుమతులకు పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం
- రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు ఐటీసీ ముందుకు వచ్చింది
- పరిశ్రమలకు తగిన రక్షణ కల్పిస్తాం
- హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రాంతం
- హైదరాబాద్‌లో భద్రతను పెంచాం
- లక్షా 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం
- మహిళల కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశాం

Friday, 12 June 2015

మొబైల్స్.. మేడిన్ తెలంగాణ

* పరిశ్రమల స్థాపనకు పలు సంస్థల ఆసక్తి
* సీఎంను కలిసిన తైవాన్ సంస్థ
* పరిశ్రమ స్థాపనపై పరిశీలిస్తామన్న ఫాక్స్‌కాన్ 
* 500 కోట్లతో సెల్‌కాన్ ఉత్పత్తి కేంద్రం
* 200 కోట్లతో మైక్రోమ్యాక్స్ ప్రాజెక్టుపై నేడు ప్రకటన?
* మొబైల్ క్లస్టర్‌లో 2 లక్షల ఉద్యోగాలు: సీఎం
  హైదరాబాద్ నగరం మొబైల్ ఫోన్లకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్ పట్ల సెల్‌ఫోన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రముఖ మొబైల్ ఫోన్లు, విడిభాగాల తయారీ సంస్థలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న రాష్ట్రం ఇక మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా మారనున్నది. హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నామని వీడియోకాన్ సంస్థ ఇదివరకే ప్రకటించగా, తాజాగా మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ సంస్థలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చాయి. 
* మరోవైపు ఆపిల్ వంటి ప్రముఖ మొబైల్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని పరిశ్రమ స్థాపనపై చర్చించింది. సంస్థ ప్రెసిడెంట్ కాల్విన్ ఛిన్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్‌లు రాష్ట్ర మంత్రి కే తారకరామారావుతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్ర భుత్వం తీసుకువస్తున్న టీఎస్‌ఐపాస్ ఎంతో ఉదాత్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. 
*  ఐఫోన్‌లాంటి అత్యాధునిక ఫోన్లను తయారుచేసే తమ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే నగరంలో యూనిట్లు స్థాపించడానికి పలు సెల్‌ఫోన్ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం ఈ సందర్భంగా వారికి వివరించారు. హబ్‌కోసం అనువైన స్థలం కేటాయించడంతోపాటు, అన్ని విధాల పారిశ్రామిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆహ్వానించారు. మొబైల్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి లభించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా తాము రూపొందించిన పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధిని కల్పించడంతోపాటు రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
* ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రెసిడెంట్ విన్సెంట్ టాంగ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఈ నెల 6న తైవాన్ పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించి, పరిశ్రమల స్థాపన వల్ల పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించాలని ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన సీఈఓ టాంగ్ వారం తిరగకుండానే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోవడం విశేషం. హైదరాబాద్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని టాంగ్ పేర్కొన్నారు. 
      ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్‌లో రూ.400-500 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సెల్‌కాన్ సీఎండీ వై గురు గురువారం తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ఐదు నుంచి పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌లో నెలకు 20 లక్షల మొబైళ్లు ఉత్పత్తి అవుతాయని గురు చెప్పారు. ఈ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నెలకొల్పేందుకు మరో ఏడాది కాలం పట్టవచ్చని అన్నారు. అందువల్ల ప్రస్తుతానికి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. వచ్చే వారం ఈ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో నెలకు మూడు లక్షల మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేయవచ్చని చెప్పారు. తైవాన్, చైనా దేశాలనుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఈ యూనిట్ సామర్థ్యాన్ని వచ్చే రెండు నెలల్లో 6 లక్షల మొబైళ్లకు పెంచనున్నట్లు గురు పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకం స్పూర్తితో ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సబ్సిడీ, పన్నుల్లో రాయితీలు లభించడం తమకు ఆసక్తి కలిగించాయని ఆయన పేర్కొన్నారు. (-నమస్తే తెలంగాణ)