Saturday, 5 April 2014

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో హైలైట్స్


*
 రాష్ట్ర పండుగగా బతుకమ్మ
* అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. కుటుంబంలో అర్హులకు   ఉద్యోగాలు.
* రాబోయే ఐదేళ్లలో దళితుల అభివద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు.
* బీసీల సంక్షేమం కోసం రూ.25 వేల కోట్లు ఖర్చు. ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్
* బలహీనవర్గాలకు 450 చదరపు అడుగుల్లో నూరుశాతం సబ్సిడీతో 2బీహెచ్‌కే ఇళ్లు.
కమతాల ఏకీకరణ.. దేశానికే విత్తన భాండాగారంలా తెలంగాణ.
* కేజీ నుంచి పీజీ వరకూ రెసిడెన్షియల్ వ్యవస్థలో ఉచిత విద్య.
* హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివద్ధి. నగరంలో మరో విమానాశ్రయం.
*  రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానాన్ని అవలంబించి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్, కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు
* పెట్టుబడుల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ.
* ధార్మిక పరిషత్తు ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ. రూ.50 కోట్లతో అర్చక సంక్షేమనిధి.
హైదరాబాద్, ఏప్రిల్ 4 (టీ మీడియా): రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగానే ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందులోని అంశాలు విపులీకరిస్తూనే, అవసరమైన చోట్ల కొన్ని వివరణలు ఇచ్చారు. సంక్షేమం, వ్యవసాయం, విద్యారంగాలపై ప్రధానంగా దష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. సొంత రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏమేం కావాలి? తెలంగాణ ఏం కోరుకుంటున్నది? అనే అంశాలను ఔపోసనపట్టిన కేసీఆర్.. ఈ మేరకు గతంలో పలు సందర్భాల్లో ప్రకటించిన అంశాలనే మేనిఫెస్టోలో చేర్చారు. ఇవీ టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో విశేషాలు.. 
స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్
ప్రభుత్వానికి సలహా, సంప్రదింపులకోసం రాష్ట్ర సలహా మండలి ఉంటుంది. పత్రికా సంపాదకులు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, ఆయారంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారు.
విద్యుత్ రంగం
రాబోయే రెండు, రెండున్నరేళ్లలో 13వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలి. 13వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వల్ల లక్ష ఉద్యోగాలు తెలంగాణలో అదనంగా వస్తాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ఇప్పటికే అక్కడున్న మన తెలంగాణ ఐఏఎస్ మాట్లాడిండు. 4వేల మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సౌత్, నార్త్‌గ్రిడ్‌ను కనెక్టు చేస్తే విద్యుత్ సమస్య ఉండేదే కాదు. ఇది కనెక్టు చేయడానికి 7, 8 నెలలు పడుతుంది. రాబోయే రోజుల్లో 10 థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం. కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యం. 
- భూపాలపల్లి స్టేజ్ 2 :600 మెగావాట్లు, సింగరేణి (జైపూర్) :1200 మెగావాట్లు, రామగుండం-2 :1320 మెగావాట్లు, సత్తుపల్లి థర్మల్ పవర్ స్టేషన్-జెన్‌కో :500 మెగావాట్లు. మొత్తంగా 5400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం. సోలార్ పవర్ ద్వారా మరో రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను డెవలప్ చేయడం.
అనుమతులకు సింగిల్ విండో
తెలంగాణలో పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పిస్తాం. రాజకీయ అవినీతిని జీరో చేస్తాం. అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలోనే లేనివిధంగా ఇండస్ట్రీయల్ పాలసీ తెస్తాం. పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్‌విండో విధానం ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి పెట్టడానికి వచ్చే వ్యక్తి విమానాశ్రయంలో దిగగానే ప్రొటోకాల్ ఆఫీసర్ వెళ్లి స్వాగతం పలుకుతాడు. మొత్తం అన్ని అనుమతులు ఒకే ఫైల్‌పై ఉంటాయి. పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ఇటీవల నన్ను కొందరు పారిశ్రామిక రంగ ప్రతినిధులు కలిస్తే మీరే ఒక రిపోర్టు ఇవ్వండి దాన్నే అమలు చేస్తా అన్నా. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతాయి. 
- మూతపడ్డ పరిశ్రమల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ పరిశ్రమల ఏర్పాటు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ పునరుద్ధరణ. పన్ను మినహాయింపు తెలంగాణకు మరో ఐదేళ్లకు పొడిగించాలి. కుటీర, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. నిరుద్యోగ యువతకు వత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ, ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్, డ్రైవింగ్ తదితరాల్లో ఉపాధి మార్గాలు
రాష్ట్ర పండుగగా బతుకమ్మ
ప్రపంచంలో ఎక్కడా పూలను పూజించే విధానం లేదు. కానీ తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉంది. పండుగ సమయంలో ప్రతి గ్రామంలో సాంస్కతిక కార్యక్రమాలు, తెలంగాణ సంబురాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. పునర్నిర్మాణంఅంటే కొందరు పిచ్చిపిచ్చిగా కూలగొట్టి కడుతరా? అంటున్నారు. తెలంగాణలో సాంస్కతి, భాష, జీవన విధ్వంసాలు జరిగాయి. సాంస్కతిక పునరుజ్జీవం జరగాలి. తెలంగాణ సంస్కతి వికసించాలి.
- ప్రాచీన కట్టడాల పరిరక్షణ, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపునకు కషి. వెయ్యికోట్లతో పర్యాటకరంగంలో మౌలిక వసతుల కల్పన. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రాంత మహానీయుల విగ్రహాల ఏర్పాటు. వద్ధ కళాకారులకు రూ.1500పింఛన్. గోల్కొండ, చార్మినార్, వెయ్యి స్తంభాల గుడి, రామప్పగుడి, వరంగల్ కోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెస్తాం. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి. తెలంగాణలో పురావస్తు ప్రదర్శనశాలలు ఏర్పాటు.
చలనచిత్ర, టీవీ పరిశ్రమ
- రూ.100 కోట్లతో సినిమా, టీవీ, మాస్ కమ్యూనికేషన్ అకాడెమీ ఏర్పాటు. పుణె తరహాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. తెలంగాణ సినిమాలకు, సందేశాత్మక సినిమాలకు ప్రోత్సాహకాలు. సినీ వర్కర్లు, కార్మికులకు బీమా
ధార్మిక రంగం
- ధార్మిక పరిషత్తు ఆధ్వర్యంలో దేవాలయాల నిర్వహణ. రూ.50కోట్లతో అర్చక సంక్షేమనిధి. ధూప దీప నైవేద్యాల కోసం ఒక్కొక్క గుడికి నెలకు రూ.6వేలు. ఇందులో నాలుగువేలు అర్చకుడికి, రెండువేలు ధూప దీప నైవేద్యాలకు. రూ.10కోట్లకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే ధార్మిక పరిషత్తు పరిధిలో. అంతకు ఎక్కువుంటే ప్రభుత్వ పరిధిలో. ఆలయాల్లో ఉద్యోగ విరమణ చేసిన వద్ధ వేద పండితులు, అర్చకులకు సంక్షేమ నిధి నుంచి నెలకు రూ భతి. దేవాలయ ఆస్తుల రక్షణకు పటిష్టమైన చట్టాలు, కబ్జాలకు గురైన భూముల తిరిగి అప్పగింత.
కేసుల ఎత్తివేత
- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉన్న కేసులు ఎత్తివేతపైనే మొదటి సంతకం. సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో నక్సల్స్ సమస్యపై దష్టి. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పునాదులపై తెలంగాణ పునర్నిర్మాణం. శిక్షాకాలం ముగిసిన, దీర్ఘకాలంగా జైలులో ఉన్న ఖైదీల విడుదలకు సానుభూతితో చర్యలు. పోలీసులు, జైళ్ల మ్యాన్యువల్స్ కచ్చితంగా అమలు. కోర్టులు, జడ్జీల సంఖ్య పెంచి, త్వరగా న్యాయవిచారణ. హ్యూమన్ రైట్స్ కమిషన్ బలోపేతానికి కషి.
అమరుల కుటుంబాలకు రూ.10లక్షలు
తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల రుణం తీర్చుకోలేనిది. వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం రూ.10లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించాం. రేపటి తెలంగాణలో 24 జిల్లాలుంటాయి కనుక ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం కట్టిస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా అక్కడికి వచ్చి శాల్యూట్ చేసిన తరువాతే అధికారిక కార్యక్రమాలు మొదలవుతాయి. అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ఒక ఉద్యోగం, ఇద్దరు అర్హులుంటే ఇద్దరికీ ఉద్యోగాలు. హైదరాబాద్‌లో ల్యాండ్‌మార్క్‌గా ఒక స్మతిచిహ్నం. భూమిలేని అమరవీరుల కుటుంబాలకు భూమి. కుటుంబ సభ్యుల ఆరోగ్య బాధ్యతను కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుంది.
బలహీనవర్గాలకు టూబీహెచ్‌కే
గతంలో బలహీనవర్గాల గహనిర్మాణ పథకం కింద ఒక్క గదినే కట్టించేవారు. ఇటీవల ఇంజినీర్లతో సమావేశమైన. మొత్తం ఫ్లాట్ సైజు 125 గజాలుంటుంది. అందులో 450 చదరపు అడుగుల్లో రెండు బెడ్‌రూంలు, ఒక కిచెన్, ఒక హాలు, లావెట్రి, బాత్‌రూం ఉంటాయి. ఈ ఇల్లును పిల్లర్స్‌తో కట్టిస్తాం. ఈ కాలనీకి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ, రోడ్లువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం. రూపాయి కూడా లోను ఉండదు. గత ప్రభుత్వం ఇచ్చిన లోన్లు రద్దు. ఎవరూ అప్పులు కట్టొద్దు. 
- మూడు లక్షలతో ఇల్లు నిర్మాణం. ఇళ్లులేని దుస్థితి నుండి పేదలను దూరం చేయడమే లక్ష్యం.
ఆటో రవాణాపన్ను మినహాయింపు
తెలంగాణలో రెండు లక్షలకుపైగా ఆటోరిక్షా కార్మికులున్నారు. వీళ్లంతా పేదలు. వీరు ప్రస్తుతం కడుతున్న రవాణాపన్నును మినహాయిస్తాం. ఆటో కార్మికులపై వేధింపులు లేకుండా చూస్తాం. ఇక వికలాంగులకు రూ.1500పెన్షన్, వితంతువులకు, వద్ధులకు రూ.1000పెన్షన్ ఇస్తాం.
-ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాల పెంపు, సకల జనుల సమ్మె కాలం వేతనం చెల్లింపు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా. ఇతర రాష్ర్టాల్లో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం. సంఘటితరంగ కార్మికుల సమస్యలు పరిష్కారం.
వ్యవసాయ రంగం
తెలంగాణ వ్యవసాయ భూములు ఆద్భుతం. ఇక్రిశాట్‌ను ఇక్కడున్న భూములను చూసే పెట్టారు. ఇక్కడున్న భూములతో దేశం మొత్తానికి విత్తనాలు సరఫరా చేయొచ్చు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంవస్తే కమతాల ఏకీకరణ చేయిస్తాం. గతంలో నిజాం చేయించాడు. దీన్ని అప్పుడు రద్దు బదిలీ అనేవారు. అధికారులు రైతులను సంప్రదించి ఏకీకరణ చేస్తారు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. ప్రతి రైతు భూమిని పరీక్షించి అది ఎటువంటిదో కంప్యూటర్‌లో పొందుపరుస్తాం. విత్తన ఉత్పత్తి కేంద్రాలు, గ్రీన్‌హౌస్ వ్యవసాయం ఇక్కడే సాధ్యం. ఇక్కడ ఉత్పత్తి జరిగితే ఇజ్రాయిల్‌లో ఉత్పాదకత జరుగుతుంది. అక్కడి వ్యవసాయానికి ఇక్కడి వ్యవసాయానికి 300% తేడా ఉంది. మనం ఒక చెట్టుకు కిలో టమాటా పండిస్తే వారు 300కేజీలు పండిస్తారు. గ్రీన్‌హౌస్‌లను డెవలప్ చేయడానికి 75% సబ్సిడీ ఇస్తాం. ముందుగా దీన్ని తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో చేపడతాం. దగ్గర్లోనే కోల్డ్‌స్టోరేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం. దేశానికే విత్తనభాండాగారంలా తెలంగాణ మారాలి. సీడ్స్ కార్పొరేషన్ పెట్టి దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండి విత్తనాలు వెళ్లేలా చేస్తాం. రైతులతా విత్తనాలు పండించి, లక్షాధికారులు కావాలి. 
- రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ. 8గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మూడేళ్ల తరువాత 24 గంటల విద్యుత్. పంపుసెట్లపై సర్‌చార్జి రద్దు. తెలంగాణ వ్యాప్తంగా పరిశోధన కేంద్రాలు. సాగునుండి మార్కెటింగ్ వరకు ప్రభుత్వ సహకారం. నిజామాబాద్‌లో చెరుకు పరిశోధన కేంద్రం, మోతెలో పసుపు పరిశోధన కేంద్రం.
సంక్షేమానికే మా మొదటి ప్రాధాన్యం
బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీలు, దళితులు, గిరిజనులు చాలా మంది పేదరికంలో ఉన్నారు. వీరి సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యం. దళితుల కోసం స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్‌ను తెచ్చారు. దీని కోసం రాష్ట్రంలో బిల్లు కూడా పాస్ చేశారు. దీని ఉద్దేశం ఏదంటే ప్రభుత్వం నుండి అన్ని శాఖలకు దళితుల డబ్బులు పోవాలి. అక్కడి నుండి దళితులకు ఖర్చు కావాలి. ఇలా ఖర్చు చేయడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్లాన్ బడ్జెట్టే రూ.40-50వేల కోట్లు ఉంటుంది. తెలంగాణలో ఎస్సీలు 15.4% ఉంటే ఆంధ్రలో 16.4% ఉన్నారు. అంటే తెలంగాణ ప్లాన్ బడ్జెట్‌లోని మొత్తంలో 15.4శాతం నిధులు దళితులకు కేటాయిస్తే దాదాపు ఐదువేల కోట్లు అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రూ.46వేల కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్రవాటాగా రూ.2500కోట్లు తెచ్చుకుంటే మొత్తంగా రూ.7500కోట్లు అవుతాయి. అంటే ఇప్పుడున్న 10 జిల్లాలకు ప్రతియేటా రూ.750 కోట్లు కేటాయిస్తం. 
- వచ్చే ఐదేళ్లలో ఎస్సీల కోసం 50వేల కోట్లు ఖర్చు, దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి. మండల స్థాయిలో అంబేద్కర్ వికాస కేంద్రాలు ఏర్పాటు. ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు. ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ అందిస్తుంది. ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కోటి వరకు ఆర్థిక సహకారం.
జర్నలిస్టుల సంక్షేమం
జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇస్తాం. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు అందిస్తాం. హైదరాబాద్‌లో అన్ని హంగులతో జర్నలిస్టు భవన్‌ను నిర్మిస్తాం. జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
- వత్తి ప్రమాణాలు పెంచడానికి, భాషా ప్రమాణాలు రూపొందించడానికి అకాడెమీలు. ప్రతి జర్నలిస్టు భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు వర్తించేలా హెల్త్ కార్డులు. 10కోట్ల రూపాయలతో జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు.
బీసీ, మహిళా సంక్షేమం
బీసీల సంక్షేమం కోసం రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తం. వీరికి రూ.1000కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. అవసరమైతే ఇంకా పెంచుతాం. వీరి సంక్షేమం కోసం వాగ్దానం చేశాం.. అమలు పరుస్తాం. ముస్లింల కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన సచార్ కమిటీ రిపోర్టును తు.చ. తప్పకుండా అమలు చేస్తాం. లక్షకోట్ల వక్ఫ్‌భూములు అన్యాక్రాంతం అయ్యాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికీ హైకోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని వక్ఫ్‌బోర్డుకు అప్పగిస్తాం. ఈ బోర్డుకే జ్యూడిషియల్ అధికారాలు కల్పిస్తాం. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తిస్తాం. 
- చట్టసభల్లో 33% రిజర్వేషన్, బీసీ కార్పొరేషన్‌కు యేటా రూ.1000కోట్లు. హైదరాబాద్‌లో కల్లు డిపోలపై నిషేధం ఎత్తివేత. తెలంగాణలో ప్రత్యేక టెక్స్‌టైల్ జోన్, కులవత్తుల వారికి గౌరవంగా ఆర్థిక సహాయం. తెలంగాణలో బీసీ కమిషన్ ఏర్పాటు, చేనేత కార్మికుల భద్రతా నిధి ఏర్పాటు. అన్ని గ్రామాల్లో దోభీఘాట్ల నిర్మాణం, మంగలిషాప్‌లకు కావాల్సిన పరికరాల కొనుగోలులో సబ్సిడీ. మహిళలకు చట్టసభల్లో 33.3% రిజర్వేషన్లు, మహిళా బ్యాంక్ ఏర్పాటు. జిల్లా కేంద్రాల్లో మహిళా పారిశ్రామికవాడలు, మహిళా సంక్షేమ బోర్డు ఏర్పాటు. తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు. నిరుపేద గర్భిణీకి ఆరునెలల పాలు ఆర్థికసాయం.
- ఆడపిల్ల పుడితే 10వేలు డిపాజిట్ చేసి, 18 ఏళ్లకు లక్ష అందేలా చర్యలు. అత్యాచారాల నిరోధానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, నియోజకవర్గాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు.
సింగరేణి కార్మికులు, ప్రవాసీల సంక్షేమం
- సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్. డిపెండెంట్ ఉద్యోగాల విధానం అమలు, సింగరేణి ప్రాంతాల్లో మెరుగైన వైద్యశాలలు. మైనింగ్ వర్సిటీ, కొత్తగా భూగర్భ గనుల తవ్వకం. ప్రత్యేక ప్రవాస భారతీయుల విభాగం ఏర్పాటు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు ప్రోత్సాహం. గల్ఫ్ కార్మికుల భద్రత, రక్షణకు కషి.
రేస్‌కోర్సు, చెంచల్‌గూడ జైలు తరలింపు
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న రేస్‌కోర్సును అక్కడి నుండి తరలిస్తాం. చెంచల్‌గూడ జైల్‌ను చర్లపల్లి జైలు సమీపంలో ఏర్పాటు చేస్తాం. అవి ఇప్పుడున్న స్థానాల్లో కాలేజీలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు రావాలి.
ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు
సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు 6శాతమే. కానీ తెలంగాణలో గిరిజనులు 12%. ఆంధ్రలో ఎస్టీలుగా ఉన్న వాల్మీకి బోయలు తెలంగాణలో బీసీలు. వారిని కూడా ఎస్టీలో కలిపితే సరిగ్గా 12% అవుతరు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేసి తీరుతం. వారి నినాదం మా తండాలో మా రాజ్యం. దాన్ని అమలు చేసి చూపిస్తాం. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వాళ్లను పట్టించుకోలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తాం. తమిళనాడులో రిజర్వేషన్ల పెంపు కోసం 46/94 అధికరణ కింద రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా తొమ్మిదో షెడ్యూల్‌లో సవరణ చేయిస్తాం. దాని ద్వారా ముస్లిం, మైనార్టీలకు 12% రిజర్వేషన్‌ను అమలుచేస్తాం.
-హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో ఆదివాసీ భవన్. కులాంతర వివాహం చేసుకుంటే లక్ష బహుమతి, ఒకరికి ఉద్యోగ అవకాశం. విదేశాల్లో విద్యకోసం రూ.25లక్షల ఆర్థిక సదుపాయం. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ. ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేస్తాం. ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులకు కావాల్సిన శ్మశాన వాటికలు ఏర్పాటు.
ఉద్యోగుల సంక్షేమం
-తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. సకల జనుల సమ్మెలాంటి సమ్మెను ప్రపంచంలో మరెక్కడా చేయలేదు. కానీ ఇక్కడ ఎంతో అకుంఠిత దీక్షతో చేశారు. రాబోయే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. పెన్షనర్లకు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇస్తున్నట్లుగానే ఇస్తాం. చీటికిమాటికి ఉద్యోగుల బదిలీ ఉండదు. కనీసం మూడు సంవత్సరాలు ఒక్కచోట పనిచేయాలి. ఎమ్మెల్యేకో, ఎంపీకో కోపం వస్తే బదిలీ చేసే అనారోగ్యకర వాతావరణం తెలంగాణలో ఉండదు.
- ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ఉద్యోగుల బదలాయింపు. 
- ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో తెలంగాణ నవనిర్మాణాన్ని చేపడతాం.
విద్యారంగం
ఉచిత నిర్బంధ విద్య నాకున్న పెద్ద కల. దీన్ని వందశాతం అమలు చేసి తీరుతా. ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల్లో ఈ విధానం అమల్లోకి వస్తుంది. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే రెసిడెన్షియల్ స్కూళ్లతో 40లక్షల మంది దీని పరిధిలోకి వస్తారు. దీంతో కార్పొరేట్ విద్య దానంతట అదే కుప్పకూలుతుంది. విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ అందిస్తాం. 
- 15 ఎకరాల్లో గురుకుల పాఠశాలలు. నూతన యూనివర్సిటీల నిర్మాణం. పాఠ్యప్రణాళికలో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కతిక అంశాలు.
- ఈ స్కూళ్ల సంఖ్య 600-1000, ప్రతి జిల్లాకు ఒక సాంకేతిక కళాశాల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ, రాష్ట్రస్థాయిలో అన్ని రకాల యూనివర్సిటీల ఏర్పాటు.
వైద్య రంగం
నిజాం సమయంలో వైద్యం ఉచితంగా లభించేది. గతంలో ధర్మాస్పత్రులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో ఆరోగ్య విధానం ఉంటుంది. గ్రామాల్లో పనిచేసే డాక్టర్లకు అవసరమైతే లక్ష రూపాయలు ఇచ్చి అయినా పనిచేయించుకుంటం. సిటీలో ఉన్నవారిని కొంతకాలం రూరల్‌కు, రూరల్‌లో ఉన్నవారిని కొంత కాలం సిటీకి తెస్తాం. ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రిని, నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఏర్పడునున్న 24 జిల్లాల్లో 24 నిమ్స్‌లు వస్తాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇవి ఉంటాయి. అంటే ప్రతి 40-50కిలోమీటర్లకు ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఇవి ఉంటాయి. 
- నలుగురు డాక్టర్లతో మండల స్థాయిలో 30 పడకల ఆస్పత్రి, నియోజకవర్గంలో వందపడకల ఆస్పత్రి. పీఎంపీ, ఆర్‌ఎంపీ డాక్టర్లకు శిక్షణా సర్టిఫికెట్లు. 108, 104 పథకాలను మరింత పటిష్టంగా అమలు చేస్తాం. 
విశ్వనగరంగా హైదరాబాద్
హైదరాబాద్ విశ్వనగరంగా మారింది. ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎంత గొప్పగా తెస్తామనేదానికోసం ప్రపంచం అంతా మనవైపు చూస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి. సిలికాన్‌వ్యాలీలోని సాఫ్ట్‌వేర్, చైనాలోని షంజాన్‌లో ఉన్న హార్డ్‌వేర్ హబ్‌లు కలిసి హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్నాయి. దీని వల్ల 50లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఐటీఐఆర్ వల్ల మరో రెండుకోట్ల మంది హైదరాబాద్‌కు వస్తారు. అంటే ఇప్పడున్న హైదరాబాద్‌కు మరో నగరాన్ని అతకడమే. ఇది చేయాలంటే డైనమిక్ నాయకత్వం కావాలి. రవాణా, డ్రైనేజీ, ఇళ్లు ఇలా అన్ని రకాల డెవలప్‌మెంట్ రావాలి. ఈ ఐటీఐఆర్‌కు ప్రతిక్షణం కరెంటు సరఫరా ఉండాలి. దీనికి నాలుగువేల మెగావాట్ల కరెంటు నిరంతరం ఉండాలి. 400సంవత్సరాల క్రితమే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా విరాజిల్లింది. హైదరాబాద్‌లోని అన్యాక్రాంతమైన భూదాన, అసైన్డ్, గురుకుల భూములను వెనక్కి తీసుకుంటాం. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఒప్పుకోం. 
- మూసీనది పునరుజ్జీవనానికి ప్రణాళిక. మూసీనది, హుస్సేన్‌సాగర్‌ల శుద్ధి. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివద్ధి. ఏడాదిలో ఔటర్‌రింగురోడ్డు నిర్మాణం పూర్తి. 60కిలోమీటర్ల పరిధిలో మరో ఔటర్ రింగురోడ్డు. నగర ప్రజలకు 24 గంటలు నీళ్లు, కరెంటు. నగరంలోని చెరువుల పునరుద్ధరణ, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ. మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పన, నగరంలో మరో విమానాశ్రయం ఏర్పాటు. 10-15సంవత్సరాల్లో 2.19లక్షల కోట్ల పెట్టుబడులు.
లక్ష ఎకరాలకు సాగునీరు
ఇరిగేషన్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ ఇప్పుడు తన వాటా తనకు కావాలంటున్నది. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు రావాలి. తెలంగాణ మొత్తంగా అన్నిరకాల సాగునీటి పద్ధతుల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందాలి. మైనర్ ఇరిగేషన్‌ను ధ్వంసం చేశారు. గతంలో ఉన్న పాత పద్ధతులకు వైభవం తెస్తాం. అవసరమైతే చెరువులు, కుంటలు పెంచేందుకు ఐదారు ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేస్తాం. 
- తెలంగాణలో 72 నియోజకవర్గాలకు సాగునీరు లేదు. వీటిల్లో లక్ష ఎకరాలకు సాగునీరు. పాలమూరుఎత్తిపోతలతో మహబూబ్‌నగర్‌కు సాగునీరు. చేవెళ్లపాణహితకు జాతీయహోదా కోసం ఒత్తిడి, ఐదేళ్లలో పూర్తికి కషి. జూరాల- పాకాల ఎత్తిపోతల పథకం చేపట్టడం. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ను టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
కేసీఆర్ ఏం మాట్లాడినా అపోహలు సష్టించే వాళ్లు కొందరున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులది శ్రమదోపిడి. వారిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించాం. చేసి చూపిస్తాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానాన్ని అవలంబించి రెగ్యులరైజ్ చేస్తాం. దీని వల్ల నిరుద్యోగులకు ఎలాంటి బాధ లేదు. విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టే ప్రాజెక్టుల వల్ల లక్ష ఉద్యోగాలు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకుంటే మరో లక్ష ఉద్యోగాలు, సింగరేణిలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల వల్ల మరో 50వేల ఉద్యోగాలు వస్తాయి. గ్రామాల్లో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ కార్యదర్శి, రేషన్ డీలర్లుంటారు. వారికి జీతాలు రాక హైదరాబాద్‌కు వచ్చి ఆందోళన చేస్తారు. తెలంగాణలో ఇలా ఉండదు. చిన్నపిల్లల కోసం కిండర్‌గార్టెన్ స్కూళ్లు ప్రభుత్వమే నడిపిస్తుంది. వీటిల్లో పేద పిల్లలే ఉంటారు. వీటి నిర్వహణ బాధ్యత గ్రామంలోని అంగన్‌వాడీలు, ఆశా, రేషన్‌డీలర్లదే. వీళ్లకు సరైన విధంగా జీతాలు కూడా ఇస్తాం. ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీళ్లతో గ్రామంలో ఏయే పనులు చేయించుకోవచ్చు అనే దానిపై అధ్యయనం చేయిస్తాం. 
అర్బనైజేషన్‌ను పెంచుతాం
తెలంగాణలో అర్బనైజేషన్‌ను పెంచుతం. చైనాలో దీని వల్లే కొత్త నగరాలు వచ్చాయి. నగరాల్లోనే టాక్స్‌లు ఎక్కువ కడతారు కాబట్టి అభివద్ధికి ఆస్కారం ఉంటుంది. చైనాలో ప్రజలను గ్రామాల నుండి తరలించారు. తెలంగాణలో ప్రస్తుతం 39శాతం అర్బనైజేషన్ ఉంది. దాన్ని 50శాతానికి పెంచాలి. 
-కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అధికారాల బదలాయింపు. జనాభాకు అనుగుణంగా సమతుల్య అభివద్ధి. జిల్లా కేంద్రాలకు రింగురోడ్లు, హైదరాబాద్-జిల్లా కేంద్రాలకు మధ్య నాలుగులైన్ల రోడ్లు. అన్ని పట్టణాల్లో సోలార్ వీధి దీపాలు, అన్ని పట్టణాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా. హైదరాబాద్‌కు నలువైపులా సినిమా సిటీ, టెక్స్‌టైల్ సిటీ, క్రీడామైదానాల కోసం స్పోర్ట్స్ సిటీ, ఎడ్యకేషనల్ సిటీ ఏర్పాటు. వరంగల్ విమానాశ్రయాన్ని వినియోగంలోకి తెస్తాం.

Thursday, 3 April 2014

ఎవరెన్ని శాపాలు పెట్టినా.. టీఆర్‌ఎస్ సర్కారుఖాయం


* అది తెలంగాణకు అవసరం.. 
* కాంగ్రెస్, టీడీపీ పాలనలో దోపిడీ.. 
* ఆ పార్టీలను పక్కన పెట్టాలి.. 
* టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 
* టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, 
* పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి బాబుమోహన్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (టీ మీడియా):ఎవరెన్ని శాపాలు పెట్టినా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ మంత్రి బాబుమోహన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, నల్గొండ జిల్లా నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదన్నారు. తెలంగాణలోని కష్టాలకు, బాధలకు కరెంటు లోటుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం, ప్రజల తలరాత మారాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం అవసరమని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీల 60 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని కేసీఆర్ చెప్పారు. రాజకీయ అవినీతిని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతికి పాతర వేసేవరకు తాను విశ్రమించబోనని చెప్పారు. వందల కోట్లు.. లక్ష కోట్లను దోచుకున్నవారికి అధికారం ఇస్తే భవిష్యత్‌లో కూడా దోపిడీ జరుగుతుందన్నారు. చావు కింద తలపెట్టి 14 సంవత్సరాలు ఉద్యమం నడిపామని కేసీఆర్ పేర్కొన్నారు. పోరాట ఫలితాలను సార్థకం చేసుకోవాలన్నారు. నిరర్థకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు గోల్‌మాల్ చేసేందుకు ప్రయత్నిస్తాయని, ప్రజలెవ్వరూ ఆగం కావద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో రూ.3 లక్షలతో పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని కాన్వెంట్ స్కూల్ ప్రమాణాలతో తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తామన్నారు. రెండేళ్ళలో కోటి ఎకరాలకు నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. విద్యుత్‌లోటును పూడ్చుకునేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన నాయకులే పునర్నిర్మాణంలో నాయకత్వం వహించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. 

టికెట్ల కేటాయింపులో వీరికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఫ్రొఫెసర్ సీతారాం నాయక్‌కు వరంగల్ జిల్లా నుంచి రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. బాబూమోహన్ పార్టీలోకి రావడం సంతోషమని కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా బాధ్యునిగా ఉన్న బండ నరేందర్‌రెడ్డి తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించారని, నరేందర్‌రెడ్డికి మొట్టమొదటి ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని ప్రకటించారు. పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను బాధిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య పోవాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖకవి నందిని సిధారెడ్డి సంపాదకత్వంలో రానున్న జంబి త్రైమాసిక పత్రికను కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ నాయకులతో పాటు వారి అనుచరులు వేల మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

Wednesday, 2 April 2014

మన రాష్ట్రం.. మన పత్రిక..మన మ్యానిఫెస్టో


రు దశాబ్దాల పోరాటం ఫలితంగా.. యాచించే స్థితి పోయింది! పన్నెండు వందలకుపైగా బలిదానాల ఫలితంగా.. మనల్ని మనమే పాలించే స్థితి కళ్లెదుట సాక్షాత్కరించింది! ఇప్పుడు ఆ శాసనాలు ఎలా ఉండాలి? ఆ శాసనకర్తల దృష్టి ఏ అంశాలపై ఉండాలి? తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సంబురాలు చేసుకుంటున్న నాలుగు కోట్ల మందికి కోటి ఆశలున్నాయి! బతుకు మారాలనే ఆకాంక్షలున్నాయి! వారి హృదయ స్పందన ప్రతి క్షణం బంగారు తెలంగాణ కోసం!

మరి బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? దానికి పునాదులేమిటి? ఆ పునాదుల నుంచి ఉద్భవించి.. భావి తెలంగాణ జనసౌధాన్ని నిలబెట్టే మూలస్తంభాలేవి? ఆ సౌధాన్ని.. ఇంకా పొంచే ఉన్న ముప్పుల నుంచి కాపాడే మహాకుడ్యమేది? ఎన్నికలు ముగించుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు కావడం తెలంగాణకు ఒక విశేషం. తనకు కావాల్సిన పాలకులను ఎన్నుకుని తెలంగాణ తొలి అడుగు వేయబోతున్న అపురూప సందర్భం.. తెలంగాణ దిశను నిర్ణయించే అద్భుత అవకాశం! అందుకే ఏ రాజకీయ పార్టీ తెలంగాణ కోసం ఏం చేసిందనేది ఒక అంశమైతే.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు పరిపూర్తి కావడానికి విధానపరంగా ఏం చేయబోతున్నదనేదే ఇప్పుడు అసలు లెక్క!

గడిచిన అరవై ఏళ్లలోనూ తెలంగాణ ఎదుర్కొనని కష్టం లేదు. ఇబ్బందిపడని వర్గం లేదు. రెండు జీవనదులు తెలంగాణలో పారుతున్నా.. గుక్కెడు నీళ్ల కోసం తెలంగాణ తపించిపోయింది. చెలుకపారే దిక్కులేక లక్షల ఎకరాల పొలం పడావు పడింది. ఒకప్పుడు తెలంగాణలో చెరువులు వంటి చిన్ననీటిపారుదల వనరులే భారీ నీటి వనరులుగా వర్థిల్లిన వైనం. చెరువు చుట్టూ ఒక సమగ్ర జీవన వ్యవస్థే విలసిల్లింది. కానీ.. ప్రపంచీకరణ విధానాలతో, పరాయిపాలకుల వివక్షాపూరిత వైఖరులతో ఆ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. 

చేతి వృత్తులు, హస్తకళలు, కుల వృత్తులు, తెలంగాణ కుటీర పరిశ్రమలు చిన్నాభిన్నమయ్యాయి. వారి వృత్తులను మింగేసిన ఇతరేతర శక్తుల నుంచి కాపాడే ప్రత్యామ్నాయాలు కరువయ్యాయి. ఫలితం.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి. చేనేతకే తలమానికంగా వెలుగొందిన సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి వంటి ప్రాంతాలు ఆకలిచావులు.. ఆత్మహత్యలతో పెను జీవన విధ్వంసానికి సాక్షీభూతంగా నిలిచాయి. మొన్నటిదాకా రైతునని గర్వంగా చెప్పుకున్న ఆసాములు.. నగరాల్లో యూనిఫాం వేసుకుని సెక్యూర్టీ గార్డులైపోయారు! ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూపోవడమే తప్పించి..

చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు రాక.. యువత తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి.. కనీస హక్కులు సాధించుకోవడానికే తెలంగాణ ఉద్యోగులు నానా యాతనలు పడాల్సిన పరిస్థితి. అడ్డదిద్దంగా రూల్స్ మార్చేసి.. తెలంగాణ పోస్టుల్లో ఆంధ్ర అధికారులు తిష్ఠవేసుకున్నారు. సచివాలయం లాంటి చోట్ల నూటికి 90 మంది ఆంధ్రా ఉద్యోగులే ఉండటం దీనికి నిలువెత్తు నిదర్శనం. మాకంటే గొప్పగా ఎవరూ అభివృద్ధి చేయలేదన్న నేతల వాదనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతూ తెలంగాణ జిల్లాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచాయి. మరోవైపు సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతిపై తీవ్ర అభ్యంతరకర పద్ధతిలో దాడి జరిగింది. తెలంగాణ యాసను, భాషను చిన్న చూపు చూశారు. 

తెలంగాణ సంస్కృతిని దారుణంగా అపహాస్యం చేశారు. ఇన్ని రంగాలు.. ఇన్ని వ్యవస్థలు దోపిడీని, దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నాయి కాబట్టే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సబ్బండ వర్ణాలూ పాల్గొన్నాయి. సామాజిక న్యాయం కోరుకునే శక్తులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష భావజాల శక్తులు కలిసొచ్చాయి. అన్నింటికి మించి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం పాత్ర గణనీయమైనది. భిన్నమైన సెక్షన్ల కలయికతో పెల్లుబికిన ఉద్యమంలో తెలంగాణపై ఆకాంక్షలు సైతం భిన్నంగానే ఉంటాయి. అనేక రకాల భావోద్వేగాలను తనలో తెలంగాణ ఉద్యమం తనలో ఇముడ్చకుంది కాబట్టే వాటన్నింటినీ సంతృప్తిపర్చే విధానాలు ఇప్పుడు అవసరం. తెలంగాణ పునర్నిర్మాణం అంటారో.. నవ నిర్మాణం అంటారో.. వినిర్మాణం అంటారో.. లేక అభివృద్ధి అంటారో! ఏదైతేనేం.. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఇప్పుడు ఒక భరోసా కావాలి. నెరవేర్చుతామన్న నమ్మకం కలిగించాలి. తెలంగాణను తెలంగాణే పాలించుకునేలా రాజకీయ అస్తిత్వానికి హామీ ఇవ్వాలి. తెలంగాణవాడు తెలంగాణవాడిగా తలెత్తుకుని బతుకగలిగేలా ఉండాలి. మన పాలన మన చేతిలోనే ఉండాలి. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా.. సమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత చేకూరుతుంది! తక్షణం సాంత్వన కల్గించే అంశాలుంటాయి. కొంత కాలపరిమితిలో పూర్తిచేయగలవి ఉంటాయి! దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుని సాధించాల్సినవీ ఉంటాయి.

అందుకే.. గతకాలపు చేదు అనుభవాలు దాటి.. వర్తమాన ఆందోళనలపై నిలబడి.. భవిష్యత్‌ను చూసే ప్రయత్నం ఇది. తెలంగాణకు నడిచొచ్చిన కొడుకుగా.. ఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించిన నమస్తే తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేసే అంశాలను రాజకీయ పార్టీలకు గుర్తు చేయడం కూడా బాధ్యతగా స్వీకరిస్తున్నది! ఆ మాటకొస్తే అది తన హక్కుగానే భావిస్తున్నది! అందుకే ఈ ప్రయత్నం! ఇది తెలంగాణ ప్రజల తరఫున వెల్లడిస్తున్న మ్యానిఫెస్టో! ఇది రాజకీయ పార్టీ మ్యానిఫెస్టో కాదు.. నికరమైన జనం మాట! అమరవీరుల త్యాగాలు వృథాపోరాదన్నదే మా వేదన! అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అనుభవించిన వివక్ష సొంత రాష్ట్రంలో సమసిపోవాలనేదే మా ఆలోచన! నీళ్లు.. నిధులు.. నియామకాల్లో వలసపాలకుల దోపిడీ ముగిసి.. తెలంగాణ తనకంటూ కొత్త అధ్యాయం లిఖించుకునే సమయాన.. 

ప్రాధమ్యాలను రాజకీయాలకు అతీతంగా ముందుకు తేవడమే మా ఉద్దేశం! తెలంగాణను అభివృద్ధి చేయడమే కాదు.. అభివృద్ధిని తెలంగాణీకరించడం మా సూత్రం! తనదైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వైవిధ్యతను కలిగి ఉన్న తెలంగాణ సమాజంలో లిడ్‌క్యాప్ మొదలుకుని ఐటీ వరకూ! బడుగు బలహీన వర్గాల సంక్షేమం మొదలుకుని.. పారిశ్రామికరంగం వరకూ! సాగునీరు.. తాగునీరు.. గుడులు.. బడులు.. ఆస్పత్రులు.. కోర్టులు.. సకలరంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రతిపాదనలే రేపటి నుంచి మేం ప్రచురించబోయే మ్యానిఫెస్టోలోని అంశాలు! ఇది మన రాష్ట్రంలో మన పత్రిక మన తెలంగాణ ప్రజలకు అందిస్తున్న మన మ్యానిఫెస్టో!!