Thursday, 5 July 2012

స్వచ్చమైన నది మూసి..?


                      
మూసీ నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో కృష్ణా నది యొక్క ఉపనది. హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది. మూసి అంటే అర్థం స్వచమైన అని.
  
  మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%, సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.  20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.

నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువనఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
   సీమాంధ్రుల పాలనలో మూసి:-
    1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.
    ఎ ప్రాంతంలో అయితే సహజవనరులు పరి రక్షించబడుతాయో ఆ ప్రాంతం నిజంగా అభివృద్ది చెందినట్టు అని చెప్తుంది ఐక్య రాజ్య సమితి, మరి సమైక్యంద్ర పాలకులు ఒక జీవనదిని అందున స్వచ్చమైన నీటిని కలిగిన మూసి నదిని మృతనదిగా మార్చారు, మరి అభివృద్ది అంటే ఇదేనా..? 
                                                                  - నా తెలంగాణ బ్లాగు నుంచి  

Monday, 2 July 2012

బోనాల పండగ

ఆషాఢం: గ్రామ దేవతల ఆరాధన 

                                   
షాఢం అమ్మతల్లికి అంకితం చేశారు జానపదులు. జాతరలు, కొలువులు, పండగలు పేరు ఏదైనా అన్నీ గ్రామదేవతల ఆరాధనలే. గ్రామదేవతల ఆరాధన అతి పురాతన సంప్రదాయం. ఆదిమానవులు తమ పూజనీయ విధానాలు ఎలా కాపాడుకున్నారో తెలుసుకునే పండగలు గ్రామ దేవతల ఆరాధనలు.
                                     
తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమంతా అమ్మతల్లికి బోనాలు సమర్పిస్తూ జాతరలు జరుపుకుంటారు. ఇక్కడి గ్రామ దేవతలు -పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళి అని ఏడుగురిని ప్రసిద్ధమైన వారుగా ఆరాధిస్తారు. వీరికి తోడు ‘పోతురాజు’ అనే తమ్ముడు కూడ వీరి వెంట రక్షకుడుగా, గ్రామాధికారిగా వ్యవహరిస్తున్నాడని గ్రామీణుల విశ్వాసం. అందుకే గ్రామదేవతల ఆరాధనలో పోతురాజు వేషానికి, విన్యాసానికి అమిత ప్రాధాన్యం ఉంటుంది.
                                      
గ్రామదేవతల ఆరాధనలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. నేడు గ్రామదేవతలకు గుళ్ళు నిర్మిస్తున్నారు. కానీ, ఇది సంప్రదాయం కాదు. తొలినాళ్ళల్లో ఈ దేవతలకు గుళ్ళులేవు. ఊరి బయట చెరువు కట్టలు, ఊరిలో గడీలు, దొడ్లల్లో ‘గూడు’లు మాత్రమే ఈ దేవతల నెలవులు. ఎవరికి వారు ఈ ప్రదేశాల్లో ఓ బండరాయికి సున్నం కొట్టి పసుపు కుంకుమలతో అలంకరించి దేవతలుగా ఆరాధించేవారు.
                                      
ఈ దేవతలు ఒక్కో శక్తికి ప్రతీక. పోచమ్మ బ్రోచే అమ్మ. మశూచికి అది దేవత. ఈమెను ఆరాధిస్తే ‘మశూచి’ నుండి కాపాడుతుందని నమ్ముతారు. ఈమె వేపచెట్టు మొదట్లో ఉంటుంది. ‘కల్లు’ అంటే ప్రీతి, బోనాలు ఇష్టం. అందుకే ‘పోచమ్మకు బోనాలు... పీరిలకు కందూరు’ అనే సామెత పుట్టింది. పోచమ్మ సోకితే మశూచి సోకిందని అర్థం. ఆమెకు మొక్కితే వేప ఆకు పై పూతగా పూస్తే ఈ వ్యాధిని నివారిస్తుందని కనిపెట్టారు. అందుకే ఆమె నివాసం వేపచెట్టు మొదట్లో ఏర్పాటు చేశారు. అంతేగాదు, బోనాలు జరిపే వేళ వేపమండలు ఇంట్లో అలంకరిస్తారు. ఊరేగింపులో శివసత్తులు చేతుల్లో వేపమండలు ధరించి చిందులు వేస్తారు. ఈ దేవతలకు ప్రత్యేకించి పూజారులు ఉండరు. అందువల్ల ఇంట్లో ఎవరికి వారే పండగ జరుపుకోవచ్చు. వివాహాది శుభకార్యాలకు ముందు ‘పోచమ్మలకు చేసుడు’ అనే పండగను జరుపుతారు. ఊరి బయట నెలకొన్న పోచమ్మకు అసాదులు, బైయిండ్ల వారు, చాకలి, మంగలి, తెనుగ కులాలకు చెందిన వారు పూజారులుగా వ్యవహరిస్తారు.
                                         
గ్రామదేవతల్లో మైసమ్మ (మహిషమ్మ) పశువులను రక్షించే దేవత. ఈ తల్లి చెరువు కట్టలు కూడా కాపాడుతుంది. అందుకే ‘కట్ట మైసమ్మ’ అనే పేరుతో ఆరాధిస్తారు. ‘బాలమ్మ’ పిల్లలను సంరక్షించే దేవత. ఈ దేవత బాలారిష్టాల నుంచి పిల్లలను సంరక్షిస్తుందని నమ్ముతారు. ఈమెకు ఇంట్లోనే ‘గూడు’ ఏర్పాటు చేసి ఆరాధిస్తారు. ‘ఎల్లమ్మ’ ఎల్లలు, ఊరి పొలిమేరలు కాపాడుతుంది. అలాగే, దుష్టశక్తులు గ్రామాల్లోకి రాకుండా రక్షిస్తుందని నమ్ముతారు. పెద్దమ్మ, మహంకాళి శక్తి స్వరూపురాలు. రాక్షసులు, దెయ్యాలు, భూతాలు వంటి వాటి నుండి రక్షిస్తుందని నమ్ముతారు. 
                                     
 ఇలా గ్రామదేవతలంతా స్త్రీ మూర్తులే. వారి మహిమలను అనేకంగా వర్ణిస్తూ కధలు చెబుతారు. ఈ కథలు చెప్పే జానపద గాయకులు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ప్రత్యేకించి కొన్ని కులాల్లో కనిపిస్తారు. అన్నట్టు, ఈ దేవతలకు జంతు బలి ఇష్టం. అందుకే ‘ఏట కోస్తం’, ‘కోడి ఇస్తం’ అంటూ మొక్కుకుంటారు. ‘కల్లు’ సాక పోస్తామని కూడా మొక్కుకుంటారు. ‘కల్లు, మాంసం తొలినాటి ఆది మానవుల పూజల అవశేషంగా భావించాలి. నేటికీ ఇవన్నీ గ్రామదేవతల ఆరాధనలో కనిపిస్తాయి. అయితే, ఈ దేవతల ఆరాధనకు ప్రత్యేకంగా తిథి నక్షత్రాలతో పని లేదు. ఆషాఢంలో, ఆది, గురువారాల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. తొలినాళ్ళల్లో దైవభావన లేదు. ‘తల్లి’ సర్వస్వం. ఆమె పిల్లలను కంటుంది, రక్షిస్తుంది. ఆమె వ్యవసాయం కనిపెట్టి కడుపునింపింది. అందుకే ఆమె దేవతగాక మరేమవుతుంది!

బోనాలు:
                                           

బోనం’ అంటే ‘అన్నం’. కొత్త కుండలో దేవతలకు నైవేద్యంగా వండిన అన్నమే ‘బోనం’. బోనాల పండగ రోజు, ఇల్లంతా సందడిగా చుట్టపక్కాలతో ఉంటుంది. గ్రామ దేవతలకు బోనాలు ఇష్టం. సాధారణంగా పోచమ్మకు మన సికింవూదాబాదులో మహంకాళికి బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీన్ని ‘మహంకాళి జాతర’ అంటారు. ఇది బోనాల పండగే. ఈ పండగలో బోనాలు, ఊరేగింపు, ఘటాల ఊరేగింపు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రామాల్లో పోచమ్మలకు బోనాలు ఎత్తుతామని మొక్కుకుంటారు. తమ కోరికలు తీరగానే బోనాల పండగ వేళ అందరితో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొంటారు. ఇళ్ళల్లో శుభకార్యాల్లో ఎవరికి వారే వైయక్తికంగా కూడ పండగ జరుపుకుంటారు.
ప్రాథమికంగా ఏడుగురిని గ్రామదేవతలుగా ఆరాధించినప్పటికీ ఆయా ప్రాంతాల్లో మరి కొందరు గ్రామదేవతల్లో చేరిపోయారు. మన సంప్రదాయ ఆరాధనలో కూడ అదే జరిగింది. ‘‘బ్రాహ్మీ మహేశ్వరీచైవ కౌమాదీ వైష్ణవీ తథాఃవారాహి చైవ చెంద్రాణి చాముండీ సప్త మాధరః’’ ఇందులో కూడ ఆదిశక్తి స్త్రీ మూర్తిగా ఆమె ఏడు రూపాలతో అలరారుతున్నట్లుగా పేర్కొనడాన్నిబట్టి మొదట్లో తల్లి దేవతలు ఏడుగురని భావించవచ్చు. పండగలు జాతీయ సమైక్యతకు అనివార్యం అనే మాట ‘బోనాల’ పండగను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ పట్టణం చేరుకున్న శ్రామికులు అయా గ్రామ దేవతలకు చిన్నపాటి గుళ్ళు కట్టి పూజలు చేయడమే ఇందుకు నిదర్శనం.
                                           
  పండగ రోజు తలస్నానం చేసి ముత్తైదువులు కొత్త బట్టలు ధరించి కుమ్మరింటికి పోయి కొత్త కుండ తెస్తారు అందులో పొంగలి, బోనం వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు కుంకుమలతో అలంకరించి దీనిపై కంచుడులో నూనే పోసి వెలిగిస్తారు. దీనిని ‘బోనం జ్యోతి’ అంటారు. ఈ కుండను ఊరేగింపులో తలమీద కుదురుగా పెట్టుకొనిఎత్తుకుంటారు. బోనం ఎత్తుకున్న వాళ్ళను పవివూతంగా దేవత వలే చూస్తారు. ఊరేగింపులో బోనం ఎత్తుకున్న వాళ్ళపై నీడ కొరకు నలుగురు మగవాళ్ళు తెల్లని చాందినీ బట్ట నలువైపుల కప్పులా పట్టుకుంటారు. దీన్ని ‘ఉప్లూడ’ అంటారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు ఊర్లో చప్పుళ్ళు మొదలవుతాయి. ప్రతి ఇంటా అందరూ సిద్ధంగా ఉంటారు. పంబ, డప్పు మోతలతో ఊరేగింపు సాగుతుంది. మొదట్లో వాయిద్యాలు, తర్వాత బలి ఇచ్చే జీవి-గొర్రె, మేక వంటి వాటిని వేప మండలాలతో అలంకరించి, దాన్ని పట్టుకొని ఒకరు నడుస్తారు. తరువాత ‘శివసత్తులు’ శివమూగుతారు. 
                                       
శివమెత్తడమే శిగమూగుడు. అయా దేవతలతో తాధాత్మ్యం చెందడం అన్నమాట. వీళ్ళు చిందులు వేస్తుంటారు. కొన్ని చోట్ల పోతురాజులు ఒళ్ళంతా పసుపుతో, చేత కొరడాతో విన్యాసం చేస్తూ భయంకరంగా కనిపిస్తారు.
                                         
 వీరంతా ఊరేగింపుగా ఊరి బయటకు చేరగానే అప్పటికే అక్కడ శుభ్రం చేసిన చోట ముఖ్యంగా దేవతలు ఉన్న చోట బోనాలు దించి అందులోని అన్నం (బోనం) రాశిగా పోస్తారు. తరువాత గుడిలో దేవతల స్తోత్రాలు చదివి నాలుగు కాళ్ళ జీవిని గుడి ముందుకు తీసుకు రమ్మంటారు. ఓ యువకుడు ఈ జీవి తలను ఒక్క వేటులో నరకమని చెబుతాడు. అతను మెడ నరికి రక్తం బోనం రాశిలో పోస్తారు. బలి ఇచ్చిన జంతువు నోట ఆ జంతువు ‘కాలు’ పెడతారు. కల్లు చల్లి సాకగా పోసారని అంటారు. చుట్టూ నీళ్ళు పోసి అన్నం రాశిలోని కొంత అన్నం ఊరి పోలిమేరల్లో, పంటపొలాల్లో చల్లి రమ్మంటారు. తరువాత ఊరంతా అక్కడే భోజనాలు చేసి దేవతలకు మొక్కు చెల్లించామని సంతృప్తి చెందుతారు. మళ్ళీ బోనాల పండగకై ఎదురు చూస్తారు. కాగా, ఈ గ్రామదేవతల్లో కొందరు అయా కులస్థులకు ఇలవేల్పులుగానూ ఉంటారు. గౌడవాళ్ళకు ‘ఎల్లమ్మ’, తెనుగువారికి ‘పెద్దమ్మ’, మాలమాదిగలకు ‘మైసమ్మ’, ‘ముత్యాలమ్మ’ ఇలా వేర్వేరు కులస్థులు ప్రత్యేకించి ఆయా దేవతలను ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. వారి సేవలో భాగంగా ప్రత్యేకమైన గాథలు గానం చేస్తారు. వీరికి పురాణాలు కూడా ఉన్నాయి.
                                    
గ్రామదేవతల వృత్తి-వికాసం అనేకానేక విశేషాలతో శిష్ట సాంప్రదాయ సాహిత్యంలోని విశేషాలకు తీసిపోని విధంగా ఉంటుంది.మొత్తం మీద తెలుగునాట జానపద సంస్కృతిని కాపాడుతున్న వాటిలో గ్రామదేవతల ఆరాధన ప్రముఖమైంది. పండగలు జాతీయ సమైక్యతకు అనివార్యం అనే మాట ‘బోనాల’ పండగను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ పట్టణం చేరుకున్న శ్రామికులు అయా గ్రామదేవతలకు చిన్నపాటి గుళ్ళు కట్టి పూజలు చేయడమే ఇందుకు నిదర్శనం.