Tuesday 8 November 2016

గుండెనొప్పిగా అనిపిస్తే ఇలా చేయండి...!

రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్-300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ ''డిస్ప్రిన్-300'' మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత ''సార్బిట్రేట్'' మాత్ర కూడా వేయవచ్చు. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. డిస్ప్రిన్ మాత్ర డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి  తాగించడం వల్ల... వెంటనే ఒంటిలో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
     గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండె దడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు.                                                                  
 - సాక్షి

Monday 12 September 2016

5 సెకన్ల లోపు తిన్నా ప్రమాదమే!

‘కింద పడిన ఆహారాన్ని ఐదు సెకన్ల లోపు తీసుకొని తింటే ఏ హానీ జరగదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధిలో బ్యాక్టీరియా వాటిలోకి ప్రవేశించదు’... ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఓ భావన ఇది. అయితే, ఈ భావన తప్పని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. కిందపడిన ఆహారంలోకి బ్యాక్టీరియా ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలోనే వచ్చి చేరే అవకాశముందని స్పష్టంచేసింది. అమెరికాలోని రుట్జెర్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య డోనాల్డ్‌ స్కాఫ్నర్‌ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తుప్పుపట్టని ఉక్కు, సిరామిక్‌, కలప, కార్పెట్‌ ఉపరితలాలపై పుచ్చకాయ, వెన్న పూసిన బ్రెడ్డు వంటి వేర్వేరు ఆహార పదార్థాలను కిందపడేసి.. వేర్వేరు కాల వ్యవధిలో వాటిని పైకి తీసి పరిశీలించారు. పుచ్చకాయ వంటి తేమ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లోకి అత్యంత వేగంగా బ్యాక్టీరియా వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. చాలా సందర్భాల్లో ఇతర ఆహార పదార్థాల్లోకి కూడా ఐదు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే బ్యాక్టీరియా వచ్చేసిందని వివరించారు.
- ఈనాడు.

పంచకర్మ చికిత్సతో గుండె పదిలం!

శరీరంలో నూతనోత్తేజాన్ని నింపే ఆయుర్వేద చికిత్స పంచకర్మతో మరో ఉపయోగం బయటపడింది. వారం రోజులపాటు దీన్ని తీసుకుంటే గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుందని వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా వైద్య విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేపట్టింది. పంచకర్మలో ధ్యానం, యోగా, నూనెలతో మర్దనా తదితర క్రియలుంటాయి. దీన్ని తీసుకునేటప్పుడు శాకాహారమే తినాలి. హానికర విష పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపే ఆయుర్వేద చికిత్సగా ఇది ప్రసిద్ధిగాంచింది. తాజాగా రక్తంలోని కొవ్వు స్థాయిల నియంత్రణతోపాటు హృద్రోగ సమస్యల ముప్పును కూడా ఇది తగ్గిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. జీవక్రియా విధానంపై పంచకర్మ గణనీయమైన ప్రభావం చూపుతున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్త దీపక్‌ చోప్రా తెలిపారు. 30 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 119 మందిపై అధ్యయనం చేపట్టిన అనంతరం తాము ఈ అవగాహనకు వచ్చామన్నారు.                                   
 - ఈనాడు.

Saturday 3 September 2016

ఏడు గంటలకే భోజనం... గుండెపోటు దూరం!

రాత్రి భోజనాన్ని ఏడు గంటలకల్లా తినడం ద్వారా గుండెపోటు ముప్పును చాలామటుకు తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది! బాగా పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకోవడం అధిక రక్తపోటుకు దారితీసే ప్రమాదముందనీ, తద్వారా హృద్రోగ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు... ఏడు గంటలకు ముందే భోజనం ముగించడం వల్ల రాత్రంతా రక్తపోటు స్థాయిలు సాధారణంగానే ఉండి, గుండె పదిలంగా ఉంటుందట. ఈ అంశంపై టర్కీలోని డోకుజ్‌ యెలూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హృద్రోగ నిపుణుడు ఆచార్య డా.ఇబ్రూ ఓపెలిట్‌ ఇటీవల పరిశోధించారు. సగటు వయసు 53 ఏళ్లున్న 721 మంది అధిక రక్తపోటు బాధితుల ఆహార అలవాట్లను గమనిస్తూ వచ్చారు. వారు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఉప్పు వాడకం ఎలా ఉంది, ఉదయం వేళ ఏం తింటున్నారు, రాత్రి భోజనం ఎప్పుడు చేస్తున్నారనే వివరాలను సేకరించారు. తర్వాత వారి రక్తపోటు స్థాయిలను గమనించారు. ‘‘సాధారణంగా రాత్రి వేళల్లో రక్తపోటు స్థాయిలు తక్కువగా ఉంటాయి. కానీ, పడుకునే ముందు ఆహారం తీసుకుంటే శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. ఒత్తిడికి దారితీసే హార్మోన్ల స్థాయి అధికమవుతుంది. హైబీపీతో బాధపడేవారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదముంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆహార వేళలు కూడా అంతే ముఖ్యం. పడుకోవడానికి మూడు గంటల ముందే తేలికపాటి రాత్రి భోజనాన్ని ముగించాలి’’ అని డా.ఇబ్రూ వివరించారు. ‘‘బాగా రాత్రయ్యాక భోజనం చేయడం వల్లే చాలామందిలో రక్తపోటు అదుపులో ఉండటం లేదు. ఈ పరిశోధన ఫలితాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది’’ అని బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ సంచాలకులు వీస్‌బెర్గ్‌ పేర్కొన్నారు. యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ ఇటీవల రోమ్‌లో నిర్వహించిన ప్రపంచస్థాయి సదస్సులో ఈ పరిశోధన ఆకర్షణగా నిలిచింది.
 - ఈనాడు

Monday 15 August 2016

దేశం దృష్టిని 'తెలంగాణ' ఆకర్షిస్తోంది...

* సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఇదే గోల్కొండ కోట నుంచి మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ. ఒక్కొక్కటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పాలన అందిస్తూ రెండేళ్ల తక్కువ సమయంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 
     నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే మన రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ర్టాలతో స్నేహపూర్వక వైఖరి అవలంభిస్తోందని చాలా స్పష్టంగా ప్రకటించాను. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. 
          నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో సయోధ్యను సాధించుకోగలిగాము. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింది. మరో నాలుగు నెలల్లో రాష్ర్టానికి విద్యుత్ అందుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం గత ప్రభుత్వాల విధానం వల్ల వివాదాల్లో చిక్కుకొని ముందుకు సాగలేదు. మహారాష్ట్రతో వివాదాలు పరిష్కరించుకునే విషయంలో గత పాలకులు సరైన విధానాన్ని అవలంభించకపోగా, మరింత జఠిలం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. రెండు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆగస్టు 23న ముంబయిలోచారిత్రక ఒప్పందం జరగనుంది. 
            మరోవైపు కర్ణాటక ప్రభుత్వంతో కూడా స్నేహ సంబంధాలు బలపడ్డాయి. దీని వల్ల మహబూబ్‌నగర్‌కు నీరందించే ఆర్డీఎస్ పనులు వేగవంతం అయ్యాయి. పోయిన ఎండకాలంలో తాగునీటి కోసం పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకోగలిగాము. కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తున్నది. కేంద్రంలో సఖ్యంగా వ్యవహరిస్తున్నది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ వేదికగా ఇంటింటికీ నల్లా నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
        సాగు, తాగునీటి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నిబద్ధతను మోడీ ప్రశంసించారు. జాతీయ రహదారుల విషయంలో మన రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాము. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేది. ఈ రెండేళ్లలో కొత్తగా 1951 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేయించుకోగలిగాం. దీంతో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు మొత్తం 4,590 కిలోమీటర్లకు చేరింది. 
          కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి. అందుకోసం అటు కేంద్రంతోను, ఇటు పొరుగు రాష్ర్టాలతోను సత్సంబంధాలు కొనసాగిస్తాం. నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు భరోసా ఇవ్వడం, భద్రత ఇవ్వడం. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీకందరికి తెలుసు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని సంతోషకరంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తున్నాం. 
            ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై విద్యా బోధన జరుగుతున్నది. మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయి. బీసీ విద్యార్థుల కోసం కూడా త్వరలోనే 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీనవర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పటికే 40 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతాం. 
        తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎస్టీలు, మైనార్టీలు పేదరికంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు, మైనార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు, మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి నియమించిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇటీవలే నివేదికలు అందించాయి. త్వరలోనే ఎస్టీలు, మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు పెంచుతాం. పేద బ్రహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించడం జరిగింది. వారి అభివృద్ధి కోసం తగిన పథకాలు త్వరలోనే రూపొందించబడుతాయి. 
            భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపే విధంగా లుంబినీ పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది’ అని సీఎం స్పష్టం చేశారు.

Thursday 11 August 2016

పాలమూరులో ‘సంజీవని’ పర్వతం!

* తిరుమలయ్య గుట్టపై 450కి పైగా ఔషధ మొక్కలు 
* గుర్తించిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య 

రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు ఔషధ మొక్కల కోసం వెళ్లి ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకళించి తీసుకొచ్చినట్లు చదివాం. అచ్చం అలాంటి సంజీవని పర్వతం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలయ్యగుట్టగా పిలిచే ఈ పర్వతంపై కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలనాథుడుగా పూజలందుకుంటున్నాడు.
వనపర్తి డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ సదాశివయ్య విద్యార్థి బృందంతో కలిసి గుట్టపై పరిశోధనలు నిర్వహించారు. ఏపీలోని అనంతపురం జిల్లా రామగిరి మండలం, కుంటమద్దికి చెందిన సదాశివయ్య నల్లమలలో అటవీమొక్కలు అంశంపై పరిశోధించి పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనేక వ్యాధులను నయంచేసే 450కి పైగా వనమూలికలు గుట్టపై ఉన్నాయని ఆయన గుర్తించారు. 6 కీటకాహార మొక్కలతోపాటు ప్రపంచంలోనే తొలిసారి కొత్తరకం మొక్కను కూడా గుట్టపై గుర్తించారు. మనిషి ప్రాణాలు నిలిపే గరుడ సంజీవని మొక్కతోపాటు ఆయుర్వేద ఔషధాల్లో అధికంగా ఉపయోగించే నెమలిపింఛం, శతావరి, నాభి, రత్నపురిష, కుందేటి కొమ్ములు, పాలగడ్డలు, అడవి నువ్వులు, దేవదారు, కలబంద, తిప్పతీగ, నులికాయలు, గురువింద, మేక మేయనితీగ, నేలములక, మగసిరి గడ్డలు, చిన్నసుగంధి పాల, సఫేద్‌ముస్లీ మొక్క జాతులు గుట్టపై పెరుగుతున్నాయి. 100 రకాల పక్షులు, 75 రకాల కీటకాలు, 17 రకాల పాములు, 10 రకాల సరీసృపాలు, 10 జాతుల కప్పలు ఈ గుట్టపై ఉన్నాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కనుగొనని కొత్తరకం కీటకాహార మొక్కను గుర్తించిన సదాశివయ్య కొత్త పేరుపెట్టాలని యోచిస్తున్నారు. ఈ గుట్టను ప్రత్యేక ప్రదేశంగా గుర్తించి సంరక్షించాలి.. ప్రభుత్వం అటవీ అనుమతులు, తగిన నిధులు సమకూరిస్తే మరిన్ని పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదాశివయ్య పేర్కొన్నారు. - నమస్తే తెలంగాణ

Sunday 22 May 2016

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

రుకుల పరుగుల జీవితంలో పడి మనిషి తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆకలి తీర్చుకునేందుకు ఏదో ఒకటి తినడం.. సమయానికి నిద్రపోకపోవడం.. మానసిక ప్రశాంతత కోల్పోయి రోగాలు కొనితెచ్చుకోవడం ప్రస్తుతం సాధారమైంది. ఈ నేపథ్యంలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలులాంటి చిరుధాన్యాలు తీసుకోవడంవల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, మధుమేహం, ఉబకాయం, గుండెపోటులాంటివి దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
జొన్నలు
గుండె జబ్బులను అడ్డుకునే శక్తి జొన్నలకు ఉందని వైద్య పరిశోధనల్లో తేలింది. ఇందులో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థంలాంటి పోషకాలు ఉంటాయి. 349 కేలరీల శక్తి, 10.4 గ్రాముల మాంసకృతులు, 1.6 గ్రాముల పీచు పదార్థం, 0.37 మిల్లీ గ్రాముల రబోప్లెవిన్, 3.1 మిల్లీగ్రాముల నయాసిన్, 25 మిల్లీ గ్రాముల కాల్షియం, 4.1 మిల్లీ గ్రాముల ఐరన్, 1.6 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
సజ్జలు
వేసవిలో సబ్జా నీరు తాగితే శరీరానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకూ దోహదపడుతుంది. దాహం తీర్చడంతో పాటు ఎండలో శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూస్తుంది. బరువు తగ్గేందుకూ సహకరిస్తుంది. అంతేగాక వాంతులు, అజీర్తిని తొలగించేందుకు, హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా అడ్డుకునేందుకు, గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం నివారణకు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. 67.5 గ్రాముల పిండి పదార్థాలు, 11.6గ్రాముల మాంసకృతులు, 5గ్రాముల కొవ్వుపదార్థాలు, 8 మీల్లీ గ్రాముల ఇనుము, 42 మిల్లీ గ్రాముల కాల్షియం, 296 మిల్లీ గ్రాముల పాస్పరస్, 296 మిల్లా గ్రాముల థయామిన్, 0.25 మిల్లీ గ్రాముల రైబోప్లేవిన్, 2.3 మిల్లీ గ్రాముల నయాసిన్ ఉంటాయి.
కొర్రలు..
కొర్రలు చిన్నారులు, గర్భిణులకు మంచి బలవర్ధకమైన ఆహారం. ఉబకాయంతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 60.9 గ్రాముల పిండి పదార్థాలు, 12.3 గ్రాముల మాంసకృత్తులు, 4.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 2.8 మిల్లీ గ్రాముల ఇనుము, 0.59 మిల్లీ గ్రాముల థయామిన్, 3.2 మిల్లీ గ్రాముల నయాసిన్, 31 మిల్లీ గ్రాముల కాల్షియం, 473 కేలరీల శక్తి ఉంటుంది.
సామలు
సామల్లో 7.7 గ్రాముల ప్రోటీన్లు, 5.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 7.6 గ్రాముల ఫైబర్, 1.5 గ్రాముల మినరల్స్, 9.3 మిల్లీ గ్రాముల ఇనుము, 17 మిల్లీగ్రాముల కాల్షియం, 207 కేలరీల శక్తి ఉంటుంది.
రాగులు..
చిరుధాన్యాలలో రారాజు రాగులు. వీటిని తైదలు అని కూడా అంటారు. చిన్నారులకు రాగులతో కూడిన ఆహారాన్ని అందిస్తే పెరుగుదల అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బియ్యం, గోధుమలకంటే రాగుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. బీ కాంప్లెక్స్ అధికంగా ఉండి, చౌకధరల్లో లభిస్తాయి. రాగులను చాలా రకాలుగా వాడాతారు. అందులో అంబలి, సంకటి, చపాతీ, పూరిలాంటివి చేసుకొని తింటారు. 100 గ్రాముల రాగులలో పోషకాలు, 72 గ్రాముల పిండి పదార్థాలు, 7.3 గ్రాముల మాంసకృతులు, 3.9 గ్రాముల ఇనుము, 344 మిల్లీ గ్రాముల కాల్షియమ్, 283 మిల్లీ గ్రాముల ఫాస్పరస్, 0.42 మిల్లీ గ్రాముల థయామిన్, 0.19 మిల్లీ గ్రాముల రైబోప్లేవిన్, 1.1 మిల్లీగ్రాముల నయాసిన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
అరికెలు
అరికెల్లో 8.3 గ్రాముల ప్రోటీన్లు, 3.6 గ్రాముల కొవ్వు పదార్థాలు, 9 గ్రాముల ఫైబర్, 2.6 గ్రాముల మినరల్స్, 05 మిల్లీ గ్రాముల ఇనుము, 27 మిల్లీ గ్రాముల కాల్సియం, 309 కేలరీల శక్తి ఉంటుంది.

Wednesday 20 April 2016

ఈ వేసవి చల్లగా...

సమ్మర్ మళ్లీ వచ్చింది. వచ్చిన టైమ్‌లో తేడా లేదు. కానీ, తెచ్చిన హీట్‌లో మాత్రం చాలానే తేడా వుంది. అందుకే ఈ కవర్‌స్టోరీ. ఇంటిపట్టునే తయారు చేసుకోగల గృహ పానీయాలతో ఈ వేసవి చల్లగా గడపండి మరి! 
  పాత రోజుల్లో వేసవి అంటే వేపపూత వగరు, మామిడి కాయ పులుపు, తాటిముంజల చల్లదనం, నోరూరించే చెరకు రసం, మళ్లీ మళ్లీ తాగాలనిపించే నిమ్మరసం, మరోవైపు ఈతకాయలు, చీమ చింతకాయలు, సాయంత్రాలు మల్లెలు మోసుకొచ్చే పరిమళాలు, సెలవుల్లో పిల్లల హడావుడులు అంతా సందడి. ఇపుడు ఎండాకాలంలో వేడిదెబ్బకు వీధులు, పంటపొలాలు ఠారెత్తిపోతున్నాయి. ఉదయం ఎనిమిది దాటితో పల్లెల్లో, పట్టణాల్లో రోడ్డు మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ హీట్‌నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి మార్కెట్‌లో దొరికే కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ ఎసెన్స్‌లు, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ వీటివల్ల చల్లదనం సంగతేమో గానీ మనం మరింత డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదమూ వుంది. వీటివల్ల రక్తంలో ఫాస్పరస్ అధికంగా పెరిగి ఎముకలు దెబ్బతింటాయి. దంతాలు, కిడ్నీలు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో మనం ఇంట్లోనే అందుబాటులో వున్న వాటితో ఆరోగ్య అమృతాలు తయారు చేసుకోవడం మంచిది. సులభంగా తయారు చేసుకున్న శీతల పానీయాలను హాయిగా సేవిస్తూ మండు వేసవిని ఎదుర్కొందాం. మరి చదవండి... తయారు చేసుకోండి... 
 వాటర్ మెలన్
ఎండాకాలంలో ఒంటి నిండా నీటిని దాచుకునే వాటర్ మెలన్ సమ్మర్ హీట్‌ను కూల్ చేయడంలో నెంబర్‌వన్. ఇది ఉదరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని ఆమ్లాలను తగ్గిస్తుంది. దీన్ని షుగర్ లేకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. ఇది ప్రత్యేకంగా కిడ్నీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్
కావలసిన పదార్ధాలు:
పుచ్చకాయ: సగం 
పుదీనా: 2-3 రెమ్మలు 
నల్ల ఉప్పు : ఒక టీ స్ఫూన్ 
నిమ్మకాయ: అర ముక్క 
ఐస్ క్యూబ్స్: నాలుగు
తయారీ: మిక్సీ జార్‌లో గింజలు లేని పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకలు, ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేయాలి. ద్రావణాన్ని గ్లాస్‌లో పోసి నల్ల ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసుకొని సేవించడమే... ప్రకృతి ఏ రుతువులో మనకు కావలసిన ఆహారాన్ని ఆ కాలంలో అందుబాటులోకి తెచ్చింది. వాటిని సవ్యంగా వాడుకుంటే సరి! 
మామిడితో మజా మజా
మామిడితో ఆమ్‌కా పనా, క్యారట్ మ్యాంగో జ్యూస్, మ్యాంగో పైనాపిల్ జ్యూస్ వంటి పలు రకాల పానీయాలను తయారుచేసుకోవచ్చు. ఇది మొఘల్ చక్రవర్తులను సైతం తన మాధుర్యంలో ముంచెత్తింది. మామిడి ప్రత్యేకత ఏమిటంటే తక్కువ కొలెస్ట్రాల్ కలిగివుండి రోగనిరోధకశక్తిని, దృష్టిని, జ్ఞాపక శక్తిని పెంపు చేస్తుంది. 
ఆమ్‌కా పనా
కావలసిన పదార్ధాలు:
మామిడికాయలు: అర కేజీ
బెల్లం : 150 గ్రా 
నీళ్లు : లీటర్ 
జీలకర్ర: టీ స్పూన్ (వేయించి పొడి చేయాలి) 
ఉప్పు: తగినంత 
నల్ల ఉప్పు: టీ స్పూన్ 
పుదీనా: ఆరు రెమ్మలు 
ఐస్ క్యూబ్స్ : రెండు
తయారీ: మామిడికాయలను కడిగి తగినంత నీరుపోసి ఉడికించాలి. చల్లారిన తరువాత గుజ్జు తీసి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. నీళ్లలో బెల్లం, గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర, పుదీనా వేసి కలపాలి. రెండు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. 
ఉపయోగాలు: ఎండ వేడిమి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎండాకాలం విపరీతంగా కారే చెమట నుంచి సోడియం, ఐరన్‌లను నష్టపోకుండా నివారిస్తుంది. జీర్ణ సంబంధ, రక్త సంబంధ లోపాలను నియంత్రిస్తుంది. కొత్త రక్తకణాల తయారీలో తోడ్పడుతుంది.
సబ్జా సమ్మర్ డ్రింక్
కావలసిన పదార్ధాలు:
సబ్జా గింజలు : 1 టీ స్పూన్
నిమ్మకాయ : అర ముక్క
పంచదార: ఒక టేబుల్ స్పూన్ 
జీలకర్ర పొడి : టీ స్ఫూన్ 
ఉప్పు : చిటికెడు 
నల్ల ఉప్పు: కొంచెం 
నీరు: తగినంత
తయారీ: మొదటగా నానబెట్టిన సజ్జాగింజలను ఒక గిన్నెలో వేసి 20 నిముషాల పాటు నానబెట్టుకుంటే అవి ఉబ్బుతాయి. తరువాత ఒక గ్లాస్‌లో ఐస్ ముక్కలను మెత్తగా చేసుకుని, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో సబ్జాగింజలను నీటితో సహా కలపాలి. ఇందులో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇది డీహైడ్రేషన్ నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఎండకు చర్మం నల్లబడి పోతుందనుకోండి, నిమ్మరసానికి కొద్దిగా అల్లం రసాన్ని కలిపి తాగితే ఒంటిపై నలుపన్నదే కానరాదు. 
రాగి మజ్జిగ
కావలసిన పదార్ధాలు: 
రాగి పిండి: ఒక కప్పు
పెరుగు: ఒక కప్పు
నిమ్మకాయ: అర ముక్క
అల్లం : చిన్న ముక్క
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : రెండు రెమ్మలు 
నీరు: 3 కప్పులు
తయారీ: ఒక పాత్రలో రాగి పిండి వేసి మూడు కప్పుల నీటిలో ఒక కప్పు రాగిపిండి కలపాలి. 5 నిముషాల పాటు ఉండలు లేకుండా కలిపి తక్కువ మంటతో ఉడికించాలి. జావగా అయిన తరువాత కొంత సేపు చల్లార బెట్టుకోవాలి. ఈ లోపు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేపి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. రాగి జావలో గ్రైండ్ చేసిన పేస్ట్ కలిపి, దానికి పెరుగును జత చేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా మజ్జిగలా గ్రైండ్ చేసి తరువాత నీరు కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ఫిల్టర్ చేసుకుని, ఐస్‌క్యూబ్స్ కలుపుకుని తాగితే శరీరం క్షణాల్లో చల్లబడుతుంది.చెమట రూపంలో కోల్పోయిన లవణాలను తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లాంటివి తరచూ తీసుకోవాలి.
మసాలా బట్టర్ మిల్క్
కావలసిన పదార్ధాలు:
పెరుగు : పావు కప్పు
జీలకర్ర : పావు టీ స్పూన్
మసాలా : పావు టీ స్పూన్
నల్ల ఉప్పు : కొంచెం
అల్లం : కొంచెం
ఇంగువ : కొంచెం
పుదీనా : 5 నుంచి 8 ఆకులు
కొత్తిమీర : కొన్ని ఆకులు
పచ్చి మిరపకాయ : 1
నీరు : 1 గ్లాస్ 
తయారీ: ఒక మిక్సర్‌లో కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉప్పు మినహా మిగిలినవి వేసి మెత్తని ద్రావణం చేసుకోవాలి. తరువాత రుచి కొరకు ఉప్పును కలిపి గ్లాస్‌లో పోయాలి. సర్వ్ చేసేటపుడు కొత్తిమీర, పుదీనాతో అలంకరించుకుని సేవించండి.
ఉసిరి తులసి డ్రింక్ 
కావలసిన పదార్ధాలు: 
ఉసిరికాయలు: నాలుగు 
తులసి ఆకులు: రెండు కొమ్మలు 
నీళ్లు: 1 లీటర్
తయారీ: మొదట తులసి ఆకులను తుంచి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉసిరిని ముక్కలుగా ముక్కలుగా చేయాలి. ఈ రెండింటిని మెత్తగా నూరి నీటిలో వేసి మరగబెట్టాలి. తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి సర్వ్ చేయాలి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. 
పోమోగ్రనేట్ లస్సీ
కావలసిన పదార్ధాలు:
దానిమ్మ : 2 
పెరుగు : 1 కప్పు
కుంకుమ పువ్వు : కొద్దిగా
పటిక బెల్లం పొడి : 6 స్పూన్లు
బ్లాక్ సాల్ట్ : కొంచెం
తయారీ: మొదటగా జార్‌లో పెరుగు, దానిమ్మ గింజలు, పటిక బెల్లం పొడి, బ్లాక్ సాల్ట్, కుంకుమ పువ్వు వేయాలి . దీన్ని మిక్సర్‌లో వేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్ అయ్యేంత వరకు వుంచాలి. దీనికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. 
నిమ్మకాయ షర్బత్
కావలసిన పదార్ధాలు:
నిమ్మకాయ : ఒకటి
అల్లం : చిన్న ముక్క
పంచదార : రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు : తగినంత
తయారీ: ఒక గ్లాస్‌లో నిమ్మరసం పోసి అందులో పంచదార, ఉప్పు కలిపి, మెత్తగా నూరిన అల్లాన్ని కలిపి బాగా కలపాలి. దీనికి చల్లని నీటిని కలిపి తీసుకోవడమే తరువాయి.
గ్రేప్ జ్యూస్
కావలసిన పదార్ధాలు:
ద్రాక్ష : పావు కేజీ
అల్లం : చిన్న ముక్క
తేనె : ఒక టేబుల్ స్పూన్
ఐస్ క్యూబ్స్ : 4
తయారీ: మొదటగా ద్రాక్షను ఒక మిక్సర్‌లో వేసి మెత్తగా చేసి, కొంచెం నీటిని కలిపి పూర్తి ద్రావణంగా మారే వరకు మిక్సీలో వుంచాలి. తరువాత దీనిని వడగట్టి కొంచెం అల్లం రసం కలిపి, ఐస్ క్యూబ్స్‌ను జతచేస్తే చల్లచల్లని ద్రాక్ష రసం తయారవుతుంది. 
ద్రాక్ష ఉపయోగాలు : వేసవిలో తాజాగా దొరికే ద్రాక్షపళ్లు దేహాన్ని సులువుగా చల్లబరుస్తాయి. ద్రాక్ష మన రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది. నల్ల ద్రాక్షలోని విత్తనాలు కేన్సర్‌ను అరికట్టడంలో బాగా ఉపయోగపడతాయి. 
మల్లెల ద్రావణం.. పరిమళాల సౌరభం 
కావలసిన పదార్ధాలు:
నీరు : 1 లీటర్
చక్కెర: 1 కేజీ
యాలకుల పొడి : కొంచెం
మల్లెపూలు : గుప్పెడు
తయారీ: 1 లీటర్ నీటిలో 1 కేజీ చక్కెర కలిపి స్టవ్ మీద మరగబెట్టాలి. పాకం వచ్చిన తరువాత స్టవ్ మీద నుంచి కిందకు దించి కొంచెం చల్లారిన తరువాత మల్లెపూలను వేసి కలపకుండా అలాగే ఎనిమిది గంటలపాటు వుంచాలి. ఆలోపు మల్లెల సుగంధం చక్కెర పాకంలోకి దిగుతుంది. దానిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. కావలసినపుడు పావుగ్లాస్ మల్లె పూల జ్యూస్‌కి, తగినంత నీరు కలిపి సర్వ్ చేయాలి.    ఇలా మనకు అందుబాటులో వున్న వాటితో, ఈ సీజన్‌లో దొరికే పళ్లతో రకరకాల పానీయాలను తయారుచేసుకోవచ్చు. అతిధులు ఇంటికి రాగానే ఏ కూల్‌డ్రింక్సో, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్డ్ డ్రింక్సో ఇవ్వకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పానీయాలను కూల్‌కూల్‌గా అందిస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా అదనం. 
పల్లె బ్రాండ్స్ ....
చల్ల: చల్ల తాగిన వాడే మొనగాడుని, కవ్వం తిరగాడినచోట కరవుకు తావుండదని పాత సామెతలు. ఇవెలా ఉన్నా మన పాతకాలంలో పాలు, పెరుగు, చల్ల దొరకని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. మరి చల్ల వల్ల ఏం ప్రయోజనాలూ అంటే చాలా ఉన్నాయి. చల్ల తాగితే అది ఉదరాగ్నిని పూర్తిగా హరించివేస్తుంది. అరకప్పు చల్లలో పావు స్పూన్ శొంఠిపొడి కలిపి తాగితే కడుపు మంటగా ఉంటే వెటనే ఉపశమనం కలుగుతుంది. చల్లలో వేయించిన జీలకర్ర కలిపి తాగితే వడదెబ్బ తగలదు. వాంతులయ్యేటప్పుడు జాజికాయను మెత్తగా చేసుకుని చల్లలో కలుపుకుని సేవిస్తే అవి తగ్గుతాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఒక గ్లాస్ చల్లలో చెంచా శొంఠి కలుపుకుని సేవించవచ్చు. ప్రతిరోజు చల్ల తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
చెరకు రసమే చేవ: వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో చెరకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి చెరకు రసాన్ని అందిస్తే, శరీరానికి కావలసిన షుగర్, ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్ అంది ఉపశమనం కలుగుతుంది.ఈ రసం మూత్ర సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అలాగే శరీర బరువునూ తగ్గిస్తుంది. కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుందనీ వైద్యులు చెబుతారు.
తాటిముంజలు: వీటి వల్ల శరీరానికి బాగా చలువ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో అలాగే జీర్ణక్రియను సాఫీగా నడిపించడానికీ ముంజలు చాలా మేలు. వీటిలో ఐరన్ ఎక్కువగా వుంటుంది. అంతేకాదు, కొవ్వు శాతం తక్కువగా వుండటం వల్ల చిన్నపిల్లలకు, హృద్రోగులకు ఇవి చాలా మంచిది. దాహార్తికి కూడా ఇవి మంచి విరుగుడని వేరే చెప్పనవసరం లేదు. 
వంటిల్లే వైద్యశాల..మన వంటిల్లే వైద్యశాల. మన ఆహారమే మన మొదటి ఔషధం. అందులో మనం వాడే సమస్త వస్తువులు ఆరోగ్య హేతువులే. ఇదే భారతీయ ఆహార వేదం. అయితే వంటల్లో వాడే వీటిని మనం తయారు చేసుకునే పానీయాల్లో కూడా వాడుకోగలిగితే కలిగే ప్రయోజనాలు బోలెడు...
అల్లం: జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
పుదీనా: పుదీనా రుచి వాసనతో పాటు చాలా ఔషధ గుణాలను కలిగివుంది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్‌లలో, కూరలలో వాడతారు. ఇది పొట్టనొప్పిని తగ్గించి జీర్ణవ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మపు మంటలను పోగొడతాయి. పుదీనా రక్తాన్ని శుభ్రపరుస్తుంది కూడా.
కొత్తిమీర: కొత్తిమీర ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి వుండటం వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి, కె తో పాటు ప్రొటీన్స్ కూడా ఎక్కువే. అన్నట్టు, కొత్తిమీర మహిళల్లో నెలసరి ఇబ్బందులను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు ఇది మంచి ఔషధం. కొత్తిమీర నుంచి వచ్చే ధనియాలు రకరకాల రోగాలను తగ్గిస్తాయి కాబట్టి వీటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం ఉంది. ధనియాలను ఆయుర్వేదంలో కుస్తుంబురు, వితున్నక అనే పర్యాయదాలతో వాడుతారు. వితున్నక అంటే వేడిని తగ్గించేది అని అర్ధం.
మిరియాలు: మిరియాల చూర్ణం, బెల్లం, పెరుగు కలిపి తింటే జలుబు తగ్గుతుంది. 
నిమ్మ: వీటిలో సి విటమిన్ పుష్కలంగా కలిగి జలుబును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నిమ్మలో వుండే సిట్రిక్ ఆసిడ్ ఎంజైమ్‌ల విధిని మెరుగు పరచడమే కాకుండా, కాలేయాన్ని డీటాక్సిఫై చేసి శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తుంది.
యాలకులు: దీనిని ఆయుర్వేదంలో ఇలద్వయ అంటారు. సువాసన కలిగిన సుగంధ ద్రవ్యాలలో ఇది ప్రధానమైంది. ఇవి రుచితో పాటు సువాసనను కలిగి వుంటాయి. యాలకులు అనాదిగా ఆయుర్వేద వైద్యంలో వున్నట్టు చరక సంహిత, శుశ్రూత సంహితలో వుంది. శరీరానికి చలువ చేసే గుణాలు వీటికి ఎక్కువ. యాలకుల కషాయం సేవిస్తే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధం.
జీలకర్ర: ఇది శ్వాస సంబంధ వ్యాధులను నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో పనిచేస్తుంది. అన్నట్టు, నిద్రలో నడిచే వ్యాధిని సైతం తగ్గించడం జీలకర్ర ప్రత్యేకత. ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.
నల్ల ఉప్పు: శరీరాన్ని చల్లబరచడంలో నల్ల ఉప్పు ముందుంటుంది. ఇది సముద్రపు ఉప్పు కన్నా మేలైంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, అధిక రక్తపోటు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలో సల్ఫర్ ఎక్కువగా వుండటం వల్ల మామూలు ఉప్పుకన్నా తక్కువ పరిమాణంలో తీసుకోవలసి వుంటుంది.

Monday 4 January 2016

తెలంగాణ 'గ్రూప్‌-2' నోటిఫికేష‌న్ విడుద‌ల‌

* 439 పోస్టులకు నియామకాలు
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) 439 గ్రూప్‌-2 ఉద్యోగాలకు డిసెంబరు 30న ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 9 దాకా గ్రూప్‌-2 దరఖాస్తులు స్వీకరిస్తారు. 2016 ఏప్రిల్‌ చివరి వారంలో (24, 25 తేదీల్లో) పరీక్ష నిర్వహించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. సెప్టెంబరులోనే గ్రూప్‌-2కు సంబంధించిన పాఠ్యప్రణాళిక విడుదల చేశారు. మొత్తం 439 గ్రూప్‌-2 పోస్టుల్లో అత్యధికంగా 220 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులే ఉన్నాయి. యూనిఫాం సర్వీసులైన వీటికి గతంలో 28 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉండేది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన మూడేళ్ల సడలింపుతో ఈసారి గరిష్ఠ వయోపరిమితి 31 సంవత్సరాలుగా ఉండబోతోంది. మిగిలిన పోస్టులకు జనరల్‌ కేటగిరీలో 18-44 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు మరో అయిదేళ్లు సడలించారు. 
మొత్తం పోస్టులు: 439 
1. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్‌-III (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీస్): 19 పోస్టులు
2. అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ టాక్స్ సబ్ సర్వీస్): 110 పోస్టులు 
3. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్‌-II (రిజిస్ట్రేషన్ సబ్ సర్వీస్): 23 పోస్టులు 
4. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సబ్ సర్వీస్): 67 పోస్టులు
5. ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ఎక్సైజ్ సబ్ సర్వీస్): 220 పోస్టులు
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ. ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల‌కు శారీరక కొలతలు అవసరం.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ: 09.02.2016.
రాత పరీక్ష తేదీలు: 24.04.2016 & 25.04.2016.
Online Application

* గ్రూప్-2తో పాటు మరో 357 ఉద్యోగాలకు ప్రకటన‌లు
     తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) 439 గ్రూప్‌-2 పోస్టులతో పాటు మరో 357 ఇతర పోస్టులకు కలిపి మొత్తం 796 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. వీటికి కూడా ఫిబ్రవరి 9 దాకా దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిలో అత్యధికంగా 311 వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులున్నాయి. ఐటీఐ అర్హతతో కూడా 44 ఉద్యోగాలు ఉండటం విశేషం. వీటికి పరీక్ష తేదీని ఖరారు చేయాల్సి ఉంది. హైదరాబాద్‌ జలమండలిలో ఉన్నతస్థాయి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులు రెండింటిని కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఈ రెండు పోస్టులూ రోస్టర్‌ ప్రకారం మహిళలకే (జనరల్‌ మహిళ, ఎస్సీ మహిళ) రిజర్వ్‌ అయినట్లు సమాచారం. ఈ 357 పోస్టుల ప్రకటనల‌తో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్‌ మినహా తమకు అనుమతిచ్చిన అన్ని ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలు విడుదల చేసినట్లైంది. ఆయా శాఖల నుంచి కొన్ని సాంకేతిక వివరణలు ఇంకా రానందున ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుళ్ల ఉద్యోగాల ప్రకటన ఆగింది.
* అగ్రిక‌ల్చర్ ఎక్స్‌టెన్షన్ పోస్టులు: 311 
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ (అగ్రికల్చర్). లేదా బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రిక‌ల్చర్ (ఒకేషనల్). లేదా డిప్లొమా ఇన్ అగ్రిక‌ల్చర్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఇన్ అగ్రిక‌ల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాల‌జీ/ ప్లాంట్ ప్రొటెక్షన్‌/ ఆర్గానిక్ ఫార్మింగ్‌).          
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులకు చివరి తేదీ: 25.01.2016.
---------------------------------------------------------------------
* టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులు: 44 
1. టెక్నీషియన్ గ్రేడ్ - II (సివిల్ బ్రాంచి - వాట‌ర్‌ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డ‌బ్ల్యూఎస్ & ఎస్‌బీ: 10 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్ - II (ఎలక్ట్రికల్ బ్రాంచి - వాట‌ర్‌ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డ‌బ్ల్యూఎస్ & ఎస్‌బీ: 19 పోస్టులు
3. టెక్నీషియన్ గ్రేడ్ - II (మెకానిక‌ల్‌ బ్రాంచి - వాట‌ర్‌ సప్లై) ఇన్ హెచ్ఎమ్‌డ‌బ్ల్యూఎస్ & ఎస్‌బీ: 15 పోస్టులు
అర్హతలు: స‌ంబంధిత‌ ట్రేడులోఐటీఐ ఉత్తీర్ణత‌తోపాటు రెండేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ: 28.01.2016.
1) డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులు: 02 
2) డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు: 02 పోస్టులు
అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్/ఐసీడ‌బ్ల్యూఏతో పాటు రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ సమర్పణ చివరి తేదీ: 22.01.2016.