Thursday 11 August 2016

పాలమూరులో ‘సంజీవని’ పర్వతం!

* తిరుమలయ్య గుట్టపై 450కి పైగా ఔషధ మొక్కలు 
* గుర్తించిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య 

రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు ఔషధ మొక్కల కోసం వెళ్లి ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకళించి తీసుకొచ్చినట్లు చదివాం. అచ్చం అలాంటి సంజీవని పర్వతం మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలయ్యగుట్టగా పిలిచే ఈ పర్వతంపై కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలనాథుడుగా పూజలందుకుంటున్నాడు.
వనపర్తి డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డాక్టర్ సదాశివయ్య విద్యార్థి బృందంతో కలిసి గుట్టపై పరిశోధనలు నిర్వహించారు. ఏపీలోని అనంతపురం జిల్లా రామగిరి మండలం, కుంటమద్దికి చెందిన సదాశివయ్య నల్లమలలో అటవీమొక్కలు అంశంపై పరిశోధించి పీహెచ్‌డీ పూర్తిచేశారు. అనేక వ్యాధులను నయంచేసే 450కి పైగా వనమూలికలు గుట్టపై ఉన్నాయని ఆయన గుర్తించారు. 6 కీటకాహార మొక్కలతోపాటు ప్రపంచంలోనే తొలిసారి కొత్తరకం మొక్కను కూడా గుట్టపై గుర్తించారు. మనిషి ప్రాణాలు నిలిపే గరుడ సంజీవని మొక్కతోపాటు ఆయుర్వేద ఔషధాల్లో అధికంగా ఉపయోగించే నెమలిపింఛం, శతావరి, నాభి, రత్నపురిష, కుందేటి కొమ్ములు, పాలగడ్డలు, అడవి నువ్వులు, దేవదారు, కలబంద, తిప్పతీగ, నులికాయలు, గురువింద, మేక మేయనితీగ, నేలములక, మగసిరి గడ్డలు, చిన్నసుగంధి పాల, సఫేద్‌ముస్లీ మొక్క జాతులు గుట్టపై పెరుగుతున్నాయి. 100 రకాల పక్షులు, 75 రకాల కీటకాలు, 17 రకాల పాములు, 10 రకాల సరీసృపాలు, 10 జాతుల కప్పలు ఈ గుట్టపై ఉన్నాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కనుగొనని కొత్తరకం కీటకాహార మొక్కను గుర్తించిన సదాశివయ్య కొత్త పేరుపెట్టాలని యోచిస్తున్నారు. ఈ గుట్టను ప్రత్యేక ప్రదేశంగా గుర్తించి సంరక్షించాలి.. ప్రభుత్వం అటవీ అనుమతులు, తగిన నిధులు సమకూరిస్తే మరిన్ని పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదాశివయ్య పేర్కొన్నారు. - నమస్తే తెలంగాణ

No comments:

Post a Comment