Saturday, 31 May 2014

పోలవరంతో 600 గ్రామాలు మునకే..


- పోలవరంపై నిజాలు దాస్తున్న అధికారులు
- వరద పోటెత్తితే అనూహ్య పరిణామాలు
- సాక్ష్యంగా నిలుస్తున్న గత అనుభవాలు
- ఇప్పటికి రెండుసార్లు 180 అడుగుల వరద నీరు
- 1986లో 183 అడుగులకు చేరిన వరద
- మునిగిపోయిన భద్రాచలం ఆలయ మెట్లు
- ప్రాజెక్టు కడితే ఆలయానికి పెను ప్రమాదం
      పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు.
    పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. పోలవరం డ్యామ్‌ను 150 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తే దాదాపు 35ఱగామాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ నిజానికి పోలవరంలో వరద శివాలెత్తితే కనుక దాదాపు ఐదారు వందల గ్రామాలను ముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పక్క రాష్ర్టాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు పసిగట్టాయి. ఆంధ్ర అధికారులు మాత్రం ప్రాజెక్ట్ అంత ప్రమాదకరమైనది కాదని బుకాయిస్తున్నారు.
         ప్రాజెక్ట్ పై మరింత వ్యతిరేకత రాకుండా నిజాలు దాస్తున్నారు. అదే సమయంలో సమీపభవిష్యత్‌లో ముంపుగ్రామాలను క్రమంగా పెంచే విధంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతసేపు డ్యామ్‌లో నీటినిల్వ చేస్తే ఉండే నీటిమట్టం వరకే లెక్కలు కట్టి ముంపును కేవలం 150అడుగులకే కుదించి లెక్కగడుతున్నారని, అయితే వరదలు పోటెత్తితే నీటిమట్టాలు గణనీయంగా పెరిగిపోతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వరద ఉధతి వల్ల భవిష్యత్తులో భద్రాద్రి రాముడు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 
      గతంలో జరిగిన అనుభవాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. 1986లో ఎలాంటి అడ్డుకట్ట లేని కాలంలోనే దాదాపు 183అడుగుల ఎత్తులో వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం గుడి మెట్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా సరిహద్దుల్లోని కుంటామోటు వద్ద దాదాపు 180అడుగుల మేరకు వరదనీరు చేరి అనేక గ్రామాలను ముంచి వేసింది. ఇక్కడ ఎలాంటి ఆనకట్టలేకుండానే దాదాపు 179 అడుగుల మేరకు వరద నీరు చేరుతుందని 2006 జనవరి 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. నాలుగు దశాబ్దాలలో భద్రాచలం వద్ద ఇప్పటికి రెండు సార్లు వరద 168నుంచి 180 అడుగుల వరకు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
  ప్రస్తుతం 150 అడుగులనే లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో 270 ఆంధ్ర,ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లలో మరో వంద గ్రామాలు నీట మునుగుతాయని తాజాగా లెక్క తేల్చారు. కానీ భవిష్యత్తులో వచ్చే వరద ప్రళయాలను విస్మరించి కొందరు అధికారులు ఏదో ఒక రకంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే తర్వాత చూసుకోవచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 1986 మాదిరిగా 36లక్షల క్యూసెక్‌ల వరద వస్తే ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే ఊహకందని విధంగా మునక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్, ఒరిస్పా రాష్ర్టాలు మన అధికారులు వేసిన అంచనా కంటే ఐదు రెట్లు ముంపు ఎక్కువ ఉంటుందని లెక్క వేసుకున్నారు. ఆ రాష్ర్టాల్లో కేవలం 30నుంచి 50 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు లెక్కలు వేస్తే.. కాదు 150 నుంచి 200 గ్రామాలకు ముంపు ముప్పు ఉందని వాళ్లు అంచనా వేశారు. అంటే ఆ రెండు రాష్ర్టాల అధికారులు ఎంతో ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది.
     భద్రాద్రి వద్ద గోదావరి వరద ఉధతి 36 లక్షల క్యూసెక్‌లను దాటే అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనక జరిగితే ప్రాజెక్ట్ కారణంగా బ్యాక్ వాటర్ మరింత పెరిగి మొత్తం భద్రాచలం ఆలయానికే ప్రమాదముంటుందని ఈ ప్రాజెక్ట్‌పై పరిశోధన జరిపిన తెలంగాణకు చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ భీమయ్య అంటున్నారు. 
మరింత నష్టం....
   డిజైన్ మార్చుకుని ముంపును తగ్గించటానికి అన్ని అవకాశాలున్నా మొండి పట్టుదలతో ఆదివాసీలను ముంచటానికే యంత్రాంగం సిద్ధమైంది. ఫలితంగా పోలవరం లో మరిన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. 2005లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఆదివాసీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో తీర్మానాలు చేశారు.
     గ్రామ సభలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించాయి. ముంపు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటాన్ని అన్ని మండల పంచాయితీలు వ్యతిరేకించినా ప్రజల మనోభావాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీల ఉనికిని దెబ్బ తీయటానికి వీల్లేదు. వాళ్ల అభీష్టం, మనోభావాలకు వ్యతిరేకంగా వేరే ప్రాంతానికి పంపించటానికి వీల్లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టాల్లో 3,500 హెక్టార్ల అడవి అదశ్యమవుతుంది. దాదాపు 2.5లక్షలమంది ఆదివాసీలు నిరాశ్రయలు కానున్నారు. మూడు రాష్ర్టాల్లోని ఆదివాసీ ప్రాంతాలతో కలిపి మొత్తానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి. అటవీ భూముల్లో ఎక్కడ వారికి పునరావాసం కల్పిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం ఫలించిన తరుణంలో ఈ సంస్కతిలో భాగమైన ఆదివాసీలు మనుగడను కోల్పోతున్నారు.

Friday, 23 May 2014

ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరూ ఉండరు


- సచివాలయంలోనూ వారికి స్థానం లేదు
- కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా రెడీ
- ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
- సకల జనుల సమ్మె కాలానికి ప్రత్యేక సెలవు
- విద్యుత్ సెక్టార్ ఇక పబ్లిక్ సెక్టార్
- ఆర్‌టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు 
- ఉద్యమం నుంచి వచ్చిన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవులు
- తెలంగాణ ఉద్యోగ సంఘాల సమావేశంలో కేసీఆర్
హైదరాబాద్, (టీ మీడియా): తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులను అనుమతించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఏర్పడనున్నదని తెలిపారు. ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ, ఏ సమస్యలపైన కూడా తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 
తెలంగాణ రాష్ర్టానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ మాత్రమే పూర్తయిందని ఆయన చెప్పారు. ఈ అధికారులెవ్వరూ బ్రిటిష్ పాలనలో ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను టర్రుబుర్రుమంటూ భయపెట్టడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. విభజన ప్రక్రియకు జూన్ రెండో తేదీ తర్వాతనే స్పష్టత వస్తుందని, ఒకవేళ ఈలోగానే సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి కేటాయిస్తే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్రెటేరియట్‌లో కల్తీ ఉండటానికి వీల్లేదన్నారు. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఉండగా క్షేత్ర స్థాయిలో సీమాంధ్ర ఉద్యోగులు కొనసాగడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
    అందుకని తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని హామీ ఇచ్చారు. గురువారం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సాధారణంగా ఎవ్వని అయ్యకు తెల్వకుండా సమస్యలు పరిష్కరించుకునే సంస్కృతి, సత్తా తెలంగాణకు ఉన్నది. ఒక వేళ సామరస్యంగా వినకపోతే, కొట్లాడాల్సి వస్తే కేసీఆర్ కొట్లాడేందుకు సిద్ధం. ఎవ్వరికి భయపడేది లేదు.
       ఏడికైతే గాడికాయే అని టీఆర్‌ఎస్ అధినేత హెచ్చరించారు. రాష్ట్రం వేరైనా దేశం ఒక్కటే అనే మహోన్నత సంస్కారాన్ని పాటించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పండుగను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సందర్బంలో సీమాంధ్రులు కయ్యానికి కాలుదువ్వడం సమంజసం కాదన్నారు. రాష్ర్టాలు విడిపోయిన సందర్భాల్లో విభజనలో తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి తెలంగాణకు కావాల్సిన విధానాలను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛలో సీమాంధ్రులు జోక్యం చేసుకోవద్దు ఆయన హెచ్చరించారు. 
కొట్లాటకు కూడా తయ్యారుగా ఉన్నాం అని ఆయన చెప్పారు. కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా సిద్ధమేనని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన న్యాయం ధర్మం ఉన్నదని, సహనంలో తెలంగాణ ప్రజలకు ఎవ్వరూ సాటిరారని అన్నారు. అందుకే పంచాయతీలు వద్దనుకున్నామని, భారతదేశానికే ప్రజాస్వామ్య సంస్కారాన్ని చాటిచెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆశల వెలుగులో పని చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యానించారు.
   ఉన్నతాధికారులు, ప్రభుత్వ పథకాలను అమలుచేసే ఉద్యోగులు సంయమనంతో, ప్రజాస్వామ్య పద్ధతిలో, సంతోషంతో, ఉల్లాసంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల మెప్పును పొందుతూ పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జెన్కో ఇక నుంచి పబ్లిక్ సెక్టార్ విధానంలో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
      తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కె. స్వామిగౌడ్, వి. శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని సమావేశంలో నినాదాలు రావడంతో ఈ మేరకు వెంటనే కేసీఆర్ ఓకే..ఓకే అంటూ తమ సమ్మతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఒక గంట ఎక్కువ సమయం పనిచేసి అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. తెలంగాణలో ప్రతి శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పూర్తి వివరాలను టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వార్‌రూంకు వివరించాలని, వివిధశాఖల నాయకులు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. తద్వారా సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడం వీలుకలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నవ్వుతూ నవ్విస్తూ, సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారాలను తెలియచేస్తూ కేసీఆర్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉద్యోగుల విభజన సందర్భంలో ఉత్పన్నమయ్యే ప్రతీ సమస్యను పరిష్కరించేందుకే టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం ఏర్పాటు చేశామని చెప్పారు.
       ఆంధ్రప్రదేశ్ పునరవ్యస్థీకరణ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన డీపీసీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. జిల్లా, జోనల్ కేడర్లలో ఎక్కడోళ్లు అక్కడే ఉంటారని సీమాంధ్ర ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని కేసీఆర్ అన్నారు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో వారి పోరాట పటిమ ప్రపంచమంతా చూసిందన్నారు. ఉద్యోగులు నడిపిన సకల జనుల సమ్మె అపురూప దృశ్యకావ్యంగా నిలిచిపోతుందని చెప్పారు. 
       సకలజనుల సమ్మె జరిగిన 42రోజులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర పే స్కేల్ విధానాన్ని రాష్ట్ర ఇంక్రిమెంట్ పద్ధ్దతులను తెలంగాణ ఉద్యోగులకు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డుల విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. రెండు మాసాలలో ప్రతీ శాఖలో డీపీసీలు ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తామని క్షేత్రస్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
     కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ విధానం తెలంగాణ ప్రభుత్వంలో ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. రెండు నెలల్లో కొత్త ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌ను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా సింగరేణి, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమస్యలు వేర్వేరుగా చర్చించి వారి ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వేదికగా వార్ రూంను ఏర్పాటు చేశామని శుక్రవారం నుంచి టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే వార్‌రూంకు మెసేజ్, విజ్ఞాపన, మరే ఇతర పద్ధ్దతుల్లోనైనా సమాచారం అందించాలని కోరారు. 
      తెలంగాణ పవర్‌సెక్టార్ పబ్లిక్ సెక్టార్‌గా మారనున్నదని ఆయన చెప్పారు. గడువులోపే తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండే విధంగా పదో పీఆర్సీ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వారికి ప్రసూతి సెలవు దినాలను పెంచడం జరుగుతుందన్నారు. విభజన సందర్భంలో సీమాంధ్రులు చేస్తున్న కుట్రల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదని, మన శ్రీకాంతాచారిని, మన వేణుగోపాల్‌రెడ్డిని, మన జయశంకర్ సారును ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందామని కేసీఆర్ ఉద్వేగంతో అన్నారు.
      ప్రభుత్వంలోని విధానకర్తలు, వార్‌రూం బాధ్యులు, మంత్రిమండలి సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసి చర్చించి రేపటి తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు సమస్యలు ఏర్పడకుండా చక్కని విధానాలను రూపొందిస్తారని ఆయన వివరించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు రావడానికి ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వ్యతిరేకించారని అయితే తెలంగాణ ఉద్యోగులే మా సైనికులని తాను వివరించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చారిత్రాత్మక భూమిక పోషించి కేసుల పాలయ్యారని, భార్యా బిడ్డలను వదిలి ఉద్యమంలో అనేక బాధలు పడ్డారన్నారు. ఉద్యమ జెండాను వదిలిపెట్టకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ రాష్ట్రం సిద్దించే వరకు మడిమతిప్పలేదని కేసీఆర్ ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు.

Friday, 9 May 2014

నవ తెలంగాణా...నయా జిల్లాలు


తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్.. కొత్త రాష్ర్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తును కూడా అప్పుడే పూర్తి చేసింది. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అంశంపై నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. ఏయే కేంద్రాలను జిల్లాలుగా మార్చాలి.. వాటిలో ఏయే నియోజకవర్గాలు ఉండాలనే దానిపై నిపుణులతో చర్చింది పూర్తిస్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసింది.
          ఈమేరకు తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా మార్చేందుకు నిర్ణయించింది. 23 జిల్లాల్లో ఐదేసి నియోజకవర్గాలు, ఆచార్య జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించింది. జనాభా, భౌగోళిక స్థితిని బట్టి చార్మినార్, వికారాబాద్, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ల పరిధిలో నియోజకవర్గాల సంఖ్యను సర్దుబాటు చేయాలని భావిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందనే వాదన కూడా ఉంది. జిల్లాలను పెంచి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సకల వసతులను ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ప్రపంచస్థాయి(గ్లోబల్ సిటీ) నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకునే వీలుంటుంది. ఈ ప్రాతిపదికతోనే తెలంగాణలోని జిల్లాలను 15 లక్షల సగటు జనాభాతో ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది.           ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు అదనంగా 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అందుకు రూ.14 వేల కోట్లు అవసరం. కొత్త జిల్లా కేంద్రాల్లో పాలనా ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి దాదాపుగా రెండు లేదా మూడేళ్లు పట్టవచ్చు.
టీఆర్‌ఎస్ ప్రతిపాదిత కొత్త జిల్లాలు..
1. సిద్దిపేట, 2. మెదక్, 3. మహబూబ్‌నగర్, 4. వనపర్తి, 5. నాగర్‌కర్నూలు, 6. నల్లగొండ, 7. సూర్యాపేట, 8. ఖమ్మం, 9. భద్రాచలం, 10. ఆదిలాబాద్, 11. మంచిర్యాల, 12. వరంగల్, 13. జనగాం, 14. ఆచార్య జయశంకర్ జిల్లా(భూపాలపల్లి), 15. జగిత్యాల, 16. కరీంనగర్, 17. నిజామాబాద్, 18. రంగారెడ్డి(జిల్లా కేంద్రం వికారాబాద్), 19. హైదరాబాద్ సెంట్రల్, 20. చార్మినార్, 21. గోల్కొండ, 22. హైదరాబాద్ ఈస్ట్ (జిల్లా కేంద్రం భువనగిరి), 23. సికింద్రాబాద్, 24. సంగారెడ్డి

Thursday, 8 May 2014

స్థానికేతరులను పంపాల్సిందే!

                           
  ఉ
ద్యోగుల పంపిణీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ మేరకు తెలంగాణ ఎన్జీవోలు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టి పారేయలేనిది. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసే ప్రమాదం ఉన్నదనీ, దీని వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని టీఎన్జీవోలు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వారు మంగళవారం తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని కలిసి హామీలు పొందారు. జోనల్, మల్టీ జోనల్ స్థానాల్లో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపాలనడంలో కూడా తప్పేమీ లేదు. ప్రొవిజనల్ జాబితాకు తుదిరూపం ఇచ్చే ముందు తమను సంప్రదించాలన్న టీ ఎన్జీవోల డిమాండ్ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనది. పైగా ఇంతకాలం నష్టపోయింది తెలంగాణ ఉద్యోగులే కనుక కీలక నిర్ణయాలను తీసుకునే ముందు బాధితుల అభిప్రాయాలను దష్టిలో పెట్టుకోవాలె. ఉద్యోగుల విభజనకు ఆంటిసిడెంట్, సర్వీసు బుక్‌లో నమోదు చేసిన స్థానికతే ప్రాతిపదిక కావాలనే సూచన కీలకమైంది. గిర్‌గ్లానీ కమిషన్ స్థానిక, స్థానికేతర ఉద్యోగుల విషయమై పరిశీలన జరుపుతున్నప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం హాస్యాస్పదమైనది. ఉద్యోగి స్థానికుడా కాదా అనేది అతడినే మాట మాత్రంగా అడిగారు. అతడు స్థానికుడినే అని చెబితే దానినే ప్రాతిపదికగా తీసుకున్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసమే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం స్థానికతను తేల్చడంలో తూతూ మంత్రంగా వ్యవహరించింది. గిర్‌గ్లానీకి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదనేది వాస్తవం. 
తెలంగాణ ఎంత నష్టపోయిందీ లెక్క తీయాలె. వీలైనంత మేర బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందే. అందరిపై చర్య తీసుకోవడం సాధ్యం కాకపోయినా, ఎంత మేర అన్యాయం జరిగిందో గుర్తించడం అవసరం. తెలంగాణకు నిధులు, నీళ్ళు, కొలువులు ఇతర రంగాలలో జరిగిన అన్యాయంపై లెక్క తీయడానికి ప్రత్యేకించి ఒక విచారణ సంఘాన్ని వేయాలె.

స్థానికేతరులను పంపించి వేయాలనే డిమాండ్‌ను తెలంగాణ ఉద్యోగులు తమ స్వార్థం కోసం చేయడం లేదు. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే కొనసాగినా ఈ టీఎన్జీవోల జీతభత్యాలకు ముప్పేమీ లేదు. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయి. తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరదు. అక్రమంగా చేరిన ఈ సీమాంధ్ర ఉద్యోగులను కొనసాగించడం వల్ల ఇంతకు మించిన ప్రమాదం కూడా ఉన్నది. పరిపాలనా రంగం సీమాంధ్ర ఉద్యోగుల చేతిలో ఉండడం వల్ల తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేతులు కట్టేసినట్టు అవుతుంది. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వ్యాపార వర్గం, ఈ పరిపాలనా బందం కుమ్మక్కై తెలంగాణను శాసిస్తాయి. తెలంగాణ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలోని ఆంతర్యం ఇదే. ఉదాహరణకు జేఎన్‌టీయూను మూడు ప్రాంతాలలో మూడు విభాగాలుగా విభజించినప్పటికీ, సీమాంధ్రులు హైదరాబాద్ విభాగంలోనే కొనసాగారు. దీనివల్ల సీమాంధ్ర అధ్యాపక, పరిపాలకవర్గం తెలంగాణ విద్యార్థులను అరిగోస పోసుకుంటున్నదనే ఆరోపణలు ఉన్నాయి. రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సీమాంధ్ర పెద్దలు తెలంగాణ ప్రజల పట్ల వివక్షతో లేదా కక్షతో వ్యవహరించే అవకాశాలను కాదనలేమని ఆందోళన వ్యక్తమవుతున్నది. సీమాంధ్ర పాలకవర్గాల అక్రమ ఆస్తులను, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక కుట్రలో భాగంగానే స్థానికేతర ఉద్యోగులను ఇక్కడే కొనసాగించడానికి యత్నాలు సాగుతున్నాయనే ఆరోపణ ఉన్నది. అందువల్ల తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండడం అవసరం. 

ఉద్యోగుల విభజన సందర్భంగా ఆరు దశాబ్దాలుగా జరిగిన ఉల్లంఘనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. 1956లో విలీ నం జరిగిన తరువాత సచివాలయం మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలను తమ పిడికిటిలో పెట్టుకోవడానికి సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలు అమలు జరిపారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరించినట్టు జస్టిస్ బేగ్ కమిటీ విచారణలో వెల్లడి కావడం గమనార్హం. తెలంగాణ అధికారి శాఖాధిపతిగా ఉంటే అతడి అధికారాలను తొలగించడం కోసం ఆయనపై మరో కొత్త పదవి సష్టించి, ఆ పదవిలో ఆంధ్ర అధికారిని నియమించిన దష్టాంతాలు ఉన్నాయని బేగ్ కమిటీ స్పష్టంగా వెల్లడించింది. గిర్‌గ్లానీ సిఫారసులు, జైభారత్ రెడ్డి కమిటీ తేల్చిన స్థానికేతరులను తేల్చడం మొదలైనవన్నీ ప్రాతిపదికలుగా తీసుకోవాలె.

సీమాంధ్ర ఉద్యోగులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరపాలని, ఆ విచారణ ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలని తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా న్యాయబద్ధమైనది. విచారణ జరపడమే కాదు, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన ఉద్యోగులపై చర్య తీసుకోవాలె. వేలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు నియామకాలు, బదిలీలు, డిప్యూటేషన్ల పేర తెలంగాణలో అడ్డా వేయడానికి దారితీయడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలె. ఒక్కోసారి నిబంధనలనే మార్చిన ఉదంతాలు ఉన్నాయి. జోనల్ స్థాయి పోస్టులను రాష్ట్ర స్థాయివిగా మార్చి సీమాంధ్ర అధికారులనే నియమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ అక్రమాల వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందీ లెక్కతీయాలె. వీలైనంత మేర బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందే. అందరిపై చర్య తీసుకోవడం సాధ్యం కాకపోయినా, ఎంత మేర అన్యాయం జరిగిందో గుర్తించడం అవసరం. తెలంగాణకు నిధులు, నీళ్ళు, కొలువులు ఇతర రంగాలలో జరిగిన అన్యాయంపై లెక్క తీయడానికి ప్రత్యేకించి ఒక విచారణ సంఘాన్ని వేయాలె.