Friday 23 May 2014

ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరూ ఉండరు


- సచివాలయంలోనూ వారికి స్థానం లేదు
- కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా రెడీ
- ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
- సకల జనుల సమ్మె కాలానికి ప్రత్యేక సెలవు
- విద్యుత్ సెక్టార్ ఇక పబ్లిక్ సెక్టార్
- ఆర్‌టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు 
- ఉద్యమం నుంచి వచ్చిన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవులు
- తెలంగాణ ఉద్యోగ సంఘాల సమావేశంలో కేసీఆర్
హైదరాబాద్, (టీ మీడియా): తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులను అనుమతించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఏర్పడనున్నదని తెలిపారు. ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ, ఏ సమస్యలపైన కూడా తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 
తెలంగాణ రాష్ర్టానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ మాత్రమే పూర్తయిందని ఆయన చెప్పారు. ఈ అధికారులెవ్వరూ బ్రిటిష్ పాలనలో ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను టర్రుబుర్రుమంటూ భయపెట్టడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. విభజన ప్రక్రియకు జూన్ రెండో తేదీ తర్వాతనే స్పష్టత వస్తుందని, ఒకవేళ ఈలోగానే సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి కేటాయిస్తే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్రెటేరియట్‌లో కల్తీ ఉండటానికి వీల్లేదన్నారు. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఉండగా క్షేత్ర స్థాయిలో సీమాంధ్ర ఉద్యోగులు కొనసాగడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
    అందుకని తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని హామీ ఇచ్చారు. గురువారం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సాధారణంగా ఎవ్వని అయ్యకు తెల్వకుండా సమస్యలు పరిష్కరించుకునే సంస్కృతి, సత్తా తెలంగాణకు ఉన్నది. ఒక వేళ సామరస్యంగా వినకపోతే, కొట్లాడాల్సి వస్తే కేసీఆర్ కొట్లాడేందుకు సిద్ధం. ఎవ్వరికి భయపడేది లేదు.
       ఏడికైతే గాడికాయే అని టీఆర్‌ఎస్ అధినేత హెచ్చరించారు. రాష్ట్రం వేరైనా దేశం ఒక్కటే అనే మహోన్నత సంస్కారాన్ని పాటించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పండుగను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సందర్బంలో సీమాంధ్రులు కయ్యానికి కాలుదువ్వడం సమంజసం కాదన్నారు. రాష్ర్టాలు విడిపోయిన సందర్భాల్లో విభజనలో తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి తెలంగాణకు కావాల్సిన విధానాలను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛలో సీమాంధ్రులు జోక్యం చేసుకోవద్దు ఆయన హెచ్చరించారు. 
కొట్లాటకు కూడా తయ్యారుగా ఉన్నాం అని ఆయన చెప్పారు. కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా సిద్ధమేనని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన న్యాయం ధర్మం ఉన్నదని, సహనంలో తెలంగాణ ప్రజలకు ఎవ్వరూ సాటిరారని అన్నారు. అందుకే పంచాయతీలు వద్దనుకున్నామని, భారతదేశానికే ప్రజాస్వామ్య సంస్కారాన్ని చాటిచెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆశల వెలుగులో పని చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యానించారు.
   ఉన్నతాధికారులు, ప్రభుత్వ పథకాలను అమలుచేసే ఉద్యోగులు సంయమనంతో, ప్రజాస్వామ్య పద్ధతిలో, సంతోషంతో, ఉల్లాసంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల మెప్పును పొందుతూ పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జెన్కో ఇక నుంచి పబ్లిక్ సెక్టార్ విధానంలో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
      తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కె. స్వామిగౌడ్, వి. శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని సమావేశంలో నినాదాలు రావడంతో ఈ మేరకు వెంటనే కేసీఆర్ ఓకే..ఓకే అంటూ తమ సమ్మతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఒక గంట ఎక్కువ సమయం పనిచేసి అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. తెలంగాణలో ప్రతి శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పూర్తి వివరాలను టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వార్‌రూంకు వివరించాలని, వివిధశాఖల నాయకులు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. తద్వారా సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడం వీలుకలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నవ్వుతూ నవ్విస్తూ, సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారాలను తెలియచేస్తూ కేసీఆర్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉద్యోగుల విభజన సందర్భంలో ఉత్పన్నమయ్యే ప్రతీ సమస్యను పరిష్కరించేందుకే టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం ఏర్పాటు చేశామని చెప్పారు.
       ఆంధ్రప్రదేశ్ పునరవ్యస్థీకరణ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన డీపీసీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. జిల్లా, జోనల్ కేడర్లలో ఎక్కడోళ్లు అక్కడే ఉంటారని సీమాంధ్ర ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని కేసీఆర్ అన్నారు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో వారి పోరాట పటిమ ప్రపంచమంతా చూసిందన్నారు. ఉద్యోగులు నడిపిన సకల జనుల సమ్మె అపురూప దృశ్యకావ్యంగా నిలిచిపోతుందని చెప్పారు. 
       సకలజనుల సమ్మె జరిగిన 42రోజులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర పే స్కేల్ విధానాన్ని రాష్ట్ర ఇంక్రిమెంట్ పద్ధ్దతులను తెలంగాణ ఉద్యోగులకు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డుల విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. రెండు మాసాలలో ప్రతీ శాఖలో డీపీసీలు ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తామని క్షేత్రస్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
     కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ విధానం తెలంగాణ ప్రభుత్వంలో ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. రెండు నెలల్లో కొత్త ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌ను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా సింగరేణి, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమస్యలు వేర్వేరుగా చర్చించి వారి ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వేదికగా వార్ రూంను ఏర్పాటు చేశామని శుక్రవారం నుంచి టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే వార్‌రూంకు మెసేజ్, విజ్ఞాపన, మరే ఇతర పద్ధ్దతుల్లోనైనా సమాచారం అందించాలని కోరారు. 
      తెలంగాణ పవర్‌సెక్టార్ పబ్లిక్ సెక్టార్‌గా మారనున్నదని ఆయన చెప్పారు. గడువులోపే తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండే విధంగా పదో పీఆర్సీ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వారికి ప్రసూతి సెలవు దినాలను పెంచడం జరుగుతుందన్నారు. విభజన సందర్భంలో సీమాంధ్రులు చేస్తున్న కుట్రల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదని, మన శ్రీకాంతాచారిని, మన వేణుగోపాల్‌రెడ్డిని, మన జయశంకర్ సారును ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందామని కేసీఆర్ ఉద్వేగంతో అన్నారు.
      ప్రభుత్వంలోని విధానకర్తలు, వార్‌రూం బాధ్యులు, మంత్రిమండలి సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసి చర్చించి రేపటి తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు సమస్యలు ఏర్పడకుండా చక్కని విధానాలను రూపొందిస్తారని ఆయన వివరించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు రావడానికి ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వ్యతిరేకించారని అయితే తెలంగాణ ఉద్యోగులే మా సైనికులని తాను వివరించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చారిత్రాత్మక భూమిక పోషించి కేసుల పాలయ్యారని, భార్యా బిడ్డలను వదిలి ఉద్యమంలో అనేక బాధలు పడ్డారన్నారు. ఉద్యమ జెండాను వదిలిపెట్టకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ రాష్ట్రం సిద్దించే వరకు మడిమతిప్పలేదని కేసీఆర్ ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు.

No comments:

Post a Comment