Saturday, 31 May 2014

పోలవరంతో 600 గ్రామాలు మునకే..


- పోలవరంపై నిజాలు దాస్తున్న అధికారులు
- వరద పోటెత్తితే అనూహ్య పరిణామాలు
- సాక్ష్యంగా నిలుస్తున్న గత అనుభవాలు
- ఇప్పటికి రెండుసార్లు 180 అడుగుల వరద నీరు
- 1986లో 183 అడుగులకు చేరిన వరద
- మునిగిపోయిన భద్రాచలం ఆలయ మెట్లు
- ప్రాజెక్టు కడితే ఆలయానికి పెను ప్రమాదం
      పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు.
    పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. పోలవరం డ్యామ్‌ను 150 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తే దాదాపు 35ఱగామాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ నిజానికి పోలవరంలో వరద శివాలెత్తితే కనుక దాదాపు ఐదారు వందల గ్రామాలను ముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పక్క రాష్ర్టాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు పసిగట్టాయి. ఆంధ్ర అధికారులు మాత్రం ప్రాజెక్ట్ అంత ప్రమాదకరమైనది కాదని బుకాయిస్తున్నారు.
         ప్రాజెక్ట్ పై మరింత వ్యతిరేకత రాకుండా నిజాలు దాస్తున్నారు. అదే సమయంలో సమీపభవిష్యత్‌లో ముంపుగ్రామాలను క్రమంగా పెంచే విధంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతసేపు డ్యామ్‌లో నీటినిల్వ చేస్తే ఉండే నీటిమట్టం వరకే లెక్కలు కట్టి ముంపును కేవలం 150అడుగులకే కుదించి లెక్కగడుతున్నారని, అయితే వరదలు పోటెత్తితే నీటిమట్టాలు గణనీయంగా పెరిగిపోతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వరద ఉధతి వల్ల భవిష్యత్తులో భద్రాద్రి రాముడు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 
      గతంలో జరిగిన అనుభవాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. 1986లో ఎలాంటి అడ్డుకట్ట లేని కాలంలోనే దాదాపు 183అడుగుల ఎత్తులో వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం గుడి మెట్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా సరిహద్దుల్లోని కుంటామోటు వద్ద దాదాపు 180అడుగుల మేరకు వరదనీరు చేరి అనేక గ్రామాలను ముంచి వేసింది. ఇక్కడ ఎలాంటి ఆనకట్టలేకుండానే దాదాపు 179 అడుగుల మేరకు వరద నీరు చేరుతుందని 2006 జనవరి 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. నాలుగు దశాబ్దాలలో భద్రాచలం వద్ద ఇప్పటికి రెండు సార్లు వరద 168నుంచి 180 అడుగుల వరకు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
  ప్రస్తుతం 150 అడుగులనే లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో 270 ఆంధ్ర,ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లలో మరో వంద గ్రామాలు నీట మునుగుతాయని తాజాగా లెక్క తేల్చారు. కానీ భవిష్యత్తులో వచ్చే వరద ప్రళయాలను విస్మరించి కొందరు అధికారులు ఏదో ఒక రకంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే తర్వాత చూసుకోవచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 1986 మాదిరిగా 36లక్షల క్యూసెక్‌ల వరద వస్తే ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే ఊహకందని విధంగా మునక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్, ఒరిస్పా రాష్ర్టాలు మన అధికారులు వేసిన అంచనా కంటే ఐదు రెట్లు ముంపు ఎక్కువ ఉంటుందని లెక్క వేసుకున్నారు. ఆ రాష్ర్టాల్లో కేవలం 30నుంచి 50 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు లెక్కలు వేస్తే.. కాదు 150 నుంచి 200 గ్రామాలకు ముంపు ముప్పు ఉందని వాళ్లు అంచనా వేశారు. అంటే ఆ రెండు రాష్ర్టాల అధికారులు ఎంతో ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది.
     భద్రాద్రి వద్ద గోదావరి వరద ఉధతి 36 లక్షల క్యూసెక్‌లను దాటే అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనక జరిగితే ప్రాజెక్ట్ కారణంగా బ్యాక్ వాటర్ మరింత పెరిగి మొత్తం భద్రాచలం ఆలయానికే ప్రమాదముంటుందని ఈ ప్రాజెక్ట్‌పై పరిశోధన జరిపిన తెలంగాణకు చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ భీమయ్య అంటున్నారు. 
మరింత నష్టం....
   డిజైన్ మార్చుకుని ముంపును తగ్గించటానికి అన్ని అవకాశాలున్నా మొండి పట్టుదలతో ఆదివాసీలను ముంచటానికే యంత్రాంగం సిద్ధమైంది. ఫలితంగా పోలవరం లో మరిన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. 2005లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఆదివాసీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో తీర్మానాలు చేశారు.
     గ్రామ సభలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించాయి. ముంపు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటాన్ని అన్ని మండల పంచాయితీలు వ్యతిరేకించినా ప్రజల మనోభావాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీల ఉనికిని దెబ్బ తీయటానికి వీల్లేదు. వాళ్ల అభీష్టం, మనోభావాలకు వ్యతిరేకంగా వేరే ప్రాంతానికి పంపించటానికి వీల్లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టాల్లో 3,500 హెక్టార్ల అడవి అదశ్యమవుతుంది. దాదాపు 2.5లక్షలమంది ఆదివాసీలు నిరాశ్రయలు కానున్నారు. మూడు రాష్ర్టాల్లోని ఆదివాసీ ప్రాంతాలతో కలిపి మొత్తానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి. అటవీ భూముల్లో ఎక్కడ వారికి పునరావాసం కల్పిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం ఫలించిన తరుణంలో ఈ సంస్కతిలో భాగమైన ఆదివాసీలు మనుగడను కోల్పోతున్నారు.

No comments:

Post a Comment