Friday 27 February 2015

తెలంగాణ కచ్చితంగా ధనిక రాష్ట్రం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశంలో గుజరాత్, తెలంగాణ రాష్ర్టాలు ధనిక రాష్ర్టాలుగా 14వ ఆర్థిక సంఘం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ విడిపోతే సర్‌ప్లస్ స్టేట్ అవుతుందని, రిచ్ స్టేట్ అవుతుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమనే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని తెలిపారు. అయితే తాను ఈ విషయమై గుజరాత్ సీఎంతో మాట్లాడనని, ఎక్కువ రుణ పరిమితిని కోరుదామని తెలిపానని చెప్పారు. త్వరలో కేంద్రం వద్దకు వెళ్లి రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. గతంలో తాను ప్రధానిని కలిసినపుడు కోరానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత బడ్జెట్‌లో పక్కా అంచనాలు లేవని ఈసారి పక్కా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. మరింత ఆర్థిక సౌష్టవం దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు.

Saturday 21 February 2015

గ్రేటర్‌పై కేసీఆర్ ‘విశ్వ’ దృష్టి

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నడిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ పటంలో గ్రేటర్ హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అమెరికాలోని డల్లాస్ తరహా రవాణా వ్యవస్థ, టర్కీలోని ఇస్తాంబుల్ స్థాయిలో పాతబస్తీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. 
విశ్వనగర నిర్మాణం వైపు అడుగులేస్తూ ప్రభుత్వ తీసుకున్న కీలక నిర్ణయాలు... 
- రూ.20వేల కోట్ల అంచనా వ్యయంతో ఎక్స్‌ప్రెస్‌వేలు, స్కైవేలు, ఫ్లైఓవర్ల నిర్మాణం. 
- స్లమ్ ఫ్రీ సిటీ పథకం రూపకల్పన. ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభం. 
- జీవో 58, 59తో క్రమబద్ధీకరణకు వెసులుబాటు. 
- చెరువులకు మహర్దశ. ముందుగా 36 చెరువులు, 36 శ్మశానవాటికలు ఆధునీకరణ.
- హరిత నగరం లక్ష్యంగా 10 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు.
- డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద 405 మంది నిరుద్యోగ యువతకు కార్ల పంపిణీ
- రూ.5లకే భోజన పథకం కేంద్రాల విస్తరణకు నిర్ణయం. 
- ఇస్తాంబుల్ తరహాలో పాతబస్తీ అభివృద్ధి.
- హుస్సేన్‌సాగర్ శుద్ధి...ఆకాశహర్మ్యాలు నిర్మించాలని నిర్ణయం.
- అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు త్వరలో చర్యలు. 
- గ్రేటర్ దాహార్తి తీర్చేందుకు రూ.1670 కోట్ల వ్యయంతో నగరానికి కృష్ణా మూడో దశ జలాలు. గోదావరి జలాల తరలింపునకు రూ.3725 కోట్లతో ప్రణాళిక. 
- ఔటర్ పరిధిలో జలమండలి విస్తరణ. రూ.19 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ఫ్లాన్.
- కాలుష్యరహిత నగరంగా రూపొందించేందుకు నూతనంగా ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రణాళిక. గ్రేటర్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను సత్వరం తరలించేందుకు చర్యలు. 
- హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెట్రోరైల్ అలైన్‌మెంట్ మార్పు. 
- సీఎం కేసీఆర్ చొరవతో మెట్రో మార్గాల్లో రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ముందడుగు. 
- గ్రేటర్ పరిధిలోని లక్షలాది కుటుంబాల లబ్దికి కొత్త రేషన్ విధానం
- హైదరాబాద్‌లో 1,50,000 కుటుంబాలు లబ్దిపొందడానికి ఆటో డైవర్లకు పన్ను మాఫీ. 
- మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ఏర్పాటు. 
- గ్రేటర్‌లో కొత్తగా 80 బస్సులు.
- వరల్డ్‌క్లాస్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. 
-హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌తోపాటు ఠాణాలకు వైఫై సౌకర్యం, ఫేస్‌బుక్ ఖాతా. ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లు 
- గ్రేటర్ పరిధిలో లక్ష కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు.(ప్రభుత్వ, ప్రైవేట్) 
- రూ. 340 కోట్లతో కొత్త ఇన్నోవా కార్లు, ద్విచక్ర వాహనాలు
- పోలీసు వాహనాలకు జీపీఎస్ సిస్టం. 
- క్రైం మ్యాపింగ్.(నేరాలు జరిగే ప్రదేశాల గుర్తింపు) 
- సిబ్బంది పనితీరుపై తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు.
- పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన సులభతరం చేస్తూ, మొబైల్ అలర్ట్ సిస్టమ్ ప్రారంభం.
- అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సన్నాహాలు. 
- ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్స్.
- పేకాట అడ్డాలైన క్లబ్బులపై ఉక్కుపాదం.
- రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లు, అక్రమ వడ్డీవ్యాపారులు, ల్యాండ్‌గ్రాబర్స్, వ్యభిచార గృహాల నిర్వాహకులపై పీడీ యాక్టు అమలు. 
- చోరీ వాహనాలు గుర్తించేందుకు వెహికిల్ స్టోలెన్ ట్రాకింగ్ సిస్టం ప్రారంభం.
- సైబరాబాద్ పరిధిలో నాలుగు నూతన పోలీస్‌స్టేషన్ భవనాలు ప్రారంభం. 
- ట్రాఫిక్ విభాగంలో క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలాన్ పేమెంట్ సిస్టమ్ అమలు.
- పోలీసు, హోంగార్డుల అలవెన్సులు, జీతాలు పెంపు. 
- ఠాణాల నిర్వహణ కోసం రూ.25 నుంచి రూ.75 వేలు చెల్లింపు. 
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాలకు నూతన వాహనాలు.
- అంతర్జాతీయ ప్రమాణాలతో సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు. 
- గ్రేటర్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు
- మసీదులు, దర్గాలకు గ్రాంట్లు.. వితంతువులకు పింఛన్లు
- సాంస్కృతిక కళాభవన్,కళాభారతి భవన్‌నిర్మాణాలకు ఆమోదం. 
- ప్రభుత్వ హస్టళ్లలో సన్న బియ్యం.
- (నమస్తే తెలంగాణ).

Thursday 5 February 2015

అద్భుతాలను ఆవిష్కరిద్దాం!

* పట్టుదలతో పనిచేద్దాం.. బంగారు నగరాన్ని   నిర్మించుకుందాం
* విశ్వనగరానికి అంతర్జాతీయ హంగులు
* హైదరాబాద్‌ను డల్లాస్‌లా మారుస్తాం
* ఈ వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధికి శ్రీకారం
* గుడిసెలకు చెల్లుచీటీ.. పేదలందరికీ పక్కా ఇండ్లు
తెలంగాణ రాష్ర్టాన్ని ఎలాగైతే పట్టుబట్టి సాధించుకున్నామో.. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు అంతే పట్టుదలతో పనిచేసి, అద్భుతాన్ని ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. విశ్వనగరానికి అంతర్జాతీయ హంగులద్ది.. నిరుపమానమైన నగరంగా తీర్చిదిద్దుదామని అన్నారు. డల్లాస్‌లా మారుస్తామని చెప్పారు. హైదరాబాద్‌కు విశ్వసనీయత పెరగాలని ఆకాంక్షించారు. నగరంలో కబ్జాలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. నగరంలో భూ మాఫియా ఉండకూడదని, ఆక్రమణలు ఆగిపోవాలని అన్నారు. నగర విస్తరణ, అభివృద్ధి క్రమంలో కొన్నిచోట్ల కొన్ని ఇండ్లు తీసేయాల్సి రావడం అనివార్యమన్న సీఎం.. అవసరమైతే సదరు ఇండ్లు కోల్పోయేవారికి రెండింతలు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. 
          ప్రభుత్వ స్థలాలను స్వాధీనంలో ఉంచుకున్నవారు తక్షణమే వాటిని క్రమబద్ధీకరించుకోవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమన్న కేసీఆర్.. నగరంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రతినబూనారు. ఇండ్లు లేని పేదలుండకూడదనేదే తమ విధానమని చెప్పారు. ఇది మన తెలంగాణ.. మనందరి తెలంగాణ. నా తెలంగాణ, నా గుండెల మీద తెచ్చుకున్న తెలంగాణ అని ఉద్వేగంగా అన్నారు. ప్రణాళికబద్ధమైన నగరంగా హైదరాబాద్‌ను మార్చుకుందామని, మన నగరాన్ని మనమే బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. సరస్సులు, పార్కులను సంరక్షించుకుందామని చెప్పారు. 
      ఈ వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. నగర అవసరాలకు సరిపడా మార్కెట్లు లేవన్న కేసీఆర్.. ప్రభుత్వ స్థలాల్లో కొత్తగా వెయ్యి మార్కెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగర పార్కింగ్ అవసరాల కోసం కనీసం 40 మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రదేశాలు కావాలని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు నగరంలో 24 అంతస్తులతో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి.. ఆ క్రమంలో నగరం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తన ఆలోచనలు, నగరం రూపు రేఖలు మార్చే క్రమంలో చోటు చేసుకోబోయే అద్భుతాలను టీ న్యూస్ చానల్‌లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రజలతో పంచుకున్నారు. 
     వివిధ అంశాలపై తన మనోగతాన్ని విస్తృత స్థాయిలో ఆవిష్కరించారు. నేరుగా ప్రజలతో టెలిఫోన్‌లో సంభాషిస్తూ, వారి సూచనలూ స్వీకరించారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు మొదలైన కార్యక్రమం.. అనేకానేక అంశాలను స్పృశిస్తూ సుదీర్ఘంగా సాగి.. 11.30 గంటలకు ముగిసింది. ఆద్యంతం ఉత్సాహంగా.. ఉద్వేగంగా, ఉత్తేజపూరితంగా మాట్లాడిన సీఎం.. మార్పును సాధించాలంటే కల్పన (ఇమాజినేషన్) కావాలని అన్నారు. కల్పనను ఆచరణలో పెట్టాలి. అంటే ఆలోచనల ప్రసారం (ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఐడియా) జరగాలి. కల్పనను క్రియాశీలకంలోకి తీసుకుంటే విజయం సాధించొచ్చు. అయితే అదంతా నిజాయితీతో జరగాలి అని నొక్కి చెప్పారు.
సుదీర్ఘ ఉద్యమంతోనే రాష్ట్రం సాకారమైంది
        తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించినప్పుడు కూడా ఎవరూ నమ్మలేదు. కానీ ఆలోచనను కార్యాచరణలోకి తీసుకొచ్చాను. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. సుదీర్ఘంగా ఉద్యమం చేశాం. చివరికి కల సాకారమైంది అని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించాలని వ్యూహరచన చేస్తున్నామని తెలిపారు. దీనికి కూడా అనేక విమర్శలు ఎదురవుతున్నాయన్న సీఎం.. ఇట్లా అవుతుందా? ఎన్ని వేల కోట్లు కావాలి? 
    ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఇవి ఎక్కడి నుంచి తెస్తరు? అంటూ విమర్శించే వారున్నారని చెప్పారు. సంప్రదాయ పద్ధతిలో ఆలోచించే వారు ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఇచ్చిన అవకాశంతో 100 శాతం అన్ని రకాలుగా బాగుపడేటట్లుగా తీర్చిదిద్దుతం. పేదల సంక్షేమం, సమగ్ర వ్యవసాయ విధానం, పరిశ్రమలు-పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పని చేస్తం అని హామీ ఇచ్చారు. 
ఒకప్పుడు ఢిల్లీకంటే పెద్దనగరం
హైదరాబాద్ ఒకప్పుడు ఢిల్లీకంటే పెద్ద నగరమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ 
    ఓ గ్లోరియస్ సిటీ. నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. మద్రాస్‌కంటే ముందుగానే విద్యుచ్ఛక్తి కలిగిన నగరం. కులీకుతుబ్‌షా కాలం నుంచి విస్తరిస్తనే ఉన్నది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా 42 సంవత్సరాలపాటు హైదరాబాద్ నగరం ఢిల్లీకంటే పెద్దది. ఈ విషయం వెలుగులోకి తీసుకురాలేదు అని కేసీఆర్ చెప్పారు. పాలకులకు విజన్ ఉండి ఉంటే నగరంలో సమాంతరంగా మౌలిక సదుపాయాలను కల్పించే వారు.
     పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను కల్పించేవారు. కానీ అది జరుగలేదు. విప్రో అజీంప్రేమ్‌జీ నన్ను కలిసినప్పుడు ఒకటే మాటన్నారు. బెంగుళూరుకంటే హైదరాబాద్‌కే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అక్కడ ఎయిర్‌పోర్టులో దిగి సిటీలోకి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఇక్కడ అలాంటి సమస్య లేకుండా చేయాలి. అప్పుడు హైదరాబాద్‌కు అద్భుతమైన పెట్టుబడులు వస్తాయి అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్లాన్ తయారు చేయించినం. మొదటిదశగా రూ.1250 కోట్లతో ప్రాజెక్టును అమలు చేస్తున్నం. ఇక్కడ ప్రాజెక్టులను అమలు చేసేందుకు, నిర్మాణాలు చేపట్టేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయి అని కేసీఆర్ అంచనా వేశారు.
జంట నగరాలకు శస్త్ర చికిత్స అవసరం
ప్రణాళికారహితంగా తయారైన హైదరాబాద్‌కు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. జంట నగరాల్లో బతుకులు ఇట్లా ఉన్నాయి. అయితే.. తెలంగాణ భూమి పుత్రుల చేతిలోకి వచ్చినంక మారాలి. పూర్తి స్థాయిలో శస్త్ర చికిత్సచేయాలి. దీనికి ప్రజల సహకారం అవసరం. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. అయితే ప్రజల సహకారం లేకపోతే ఏమీ చేయలేం. నగరాభివృద్ధికి ప్రజలు సహకరిస్తేనే పెట్టుబడులు వస్తాయి. జంట నగరాల్లోని ప్రజలు, ప్రధానంగా స్టేక్ హోల్డర్స్ ఈ విషయం గుర్తించాలి అని సీఎం కోరారు. నగర అభివృద్ధిలో భాగంగా చాలా మలుపుల దగ్గర సాఫ్ట్ కర్వ్‌లు తప్పనిసరి. దానికి కొన్ని ఇండ్లను తీసేయాల్సి ఉంటుంది. ప్రజలకు నష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఎవరైనా నష్టపోతే రెండింతలు నష్టపరిహారం చెల్లిస్తాం అని సీఎం స్పష్టం చేశారు. 
హైదరాబాద్‌కు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజీ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం పురాతన కట్టడాల స్థానంలో కొత్త కట్టడాలు చేపట్టడం తప్పనిసరని అన్నారు. ఠాగూర్ శతజయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రస్తుత రవీంద్రభారతి స్థానంలో ఆల్చిప్పను పోలిన అద్భుతమైన కట్టడాన్ని హఫీజ్ అనే అర్కిటెక్ట్ రూపొందించి ఇచ్చారు. అలాంటి భవనాలను కట్టుకుందామా? లేక అరవైఏండ్లక్రితం కట్టిన రవీంద్రభారతిలోనే ఇంకా సమావేశాలు నిర్వహించుకుందామా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అని అన్నారు. 
         ఇది మన తెలంగాణ, మనందరి తెలంగాణ. నా తెలంగాణ, నా గుండెల మీద తెచ్చుకున్న తెలంగాణ ఇది అంటూ భావోద్వేగంతో చెప్పారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్, అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణకు వీలైన అద్భుతమైన నిర్మాణాలను చేపట్టుకుందాం. లకా్ష్మగౌడ్, పీటీ రెడ్డివంటి ప్రముఖ చిత్రకారుల ఆర్ట్‌గ్యాలరీలు అందులో వస్తాయి. ఇలాంటి భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. మనం(రాష్ట్రం) కొంత భరించాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్‌కు అందం, చందం వస్తుంది. నాలుగువేల వాహనాలు ఒకే చోట పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇలాంటి నిర్మాణాలకు ప్రభుత్వం బిడ్స్ పిలుస్తుంది. టెండర్ల ప్రక్రియలో ఎంపికైన సంస్థలు వాటిని నిర్మించి ఇస్తాయి అని సీఎం చెప్పారు. రవీంద్రభారతిని కూల్చేస్తారని కొందరు పెడబొబ్బలు పెడుతున్నారన్న సీఎం.. తెలంగాణ కోసం తాను బయలుదేరినపుపడు కూడా ఇదే విధంగా మాట్లాడారని గుర్తు చేశారు.
వర్షం వస్తే పడవల్లో తిరగాలి!
వర్షంవస్తే నగర లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితులపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాజ్‌భవన్, సీఎం క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ ముందు కూడా మోకాలు లోతు నీళ్లు నిలబడుతున్నాయి. మిత్రులు దీని గురించి అడిగితే.. ఇది హైటెక్ నగరం. అందుకే వర్షం వచ్చినప్పుడు పడవలు వేసుకోవాలి అని చెబితే నవ్వారు అని చెప్పారు. ఇది బాగు పడాలంటే ఏం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను అడిగితే వాళ్లు చేతులెత్తేశారన్నారు. 
వర్షపు నీళ్లు వెళ్లే నాలాలు 99 శాతం కబ్జాకు గురయ్యాయని, అండర్‌గ్రౌండ్‌లో నీళ్లు వెళ్లే మార్గం ఏర్పాటుకు రూ.10 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారని తెలిపారు. ఇది గ్లోబల్ సిటీ కావాలన్న కేసీఆర్.. కచ్చితంగా చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులను కోరితే తప్పక సహకరిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
రవాణా వ్యవస్థను మార్చేస్తాం
హైదరాబాద్‌లో అన్నింటా నిర్లక్ష్యం జరిగిందనేది వాస్తవమని సీఎం అన్నారు. దూర ప్రాంతాల వారు సిటీలోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల నుంచి ఎంత దూరం పడుతుందో, సిటీలోకి రావడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతున్నది. దీని పరిష్కారానికి అయిదు స్కై వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినం. పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నం. సిటీ రవాణా వ్యవస్థ మెరుగుదలకు 70 మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ అసోసియేషన్ ఈ అధ్యయనం చేస్తున్నది. వారికి జీహెచ్‌ఎంసీ పూర్తి వివరాలను అందించింది అని సీఎం తెలిపారు. వారు తొలి దశలో రూ.1250 కోట్లతో పనులు మొదలు పెట్టాలని సూచించారన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్ మాదిరిగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
ముచ్చర్లలో ఫార్మా వర్సిటీ
ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం 11వేల ఎకరాల భూములను గుర్తించామని సీఎం తెలిపారు. అక్కడ త్వరలో ఫార్మా, వాటి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. వెయ్యికోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా సంస్థలు ముందుకొస్తున్నాయి. కేంద్రం ప్రత్యేకంగా ఫార్మా వర్సిటీ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తంచేసింది. పలు సంస్థలు యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఫార్మాసిటీకి చేరుకోవచ్చు అని సీఎం తెలిపారు.
రాచకొండలో ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీలు
రాచకొండలో ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. గతంలో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రశాంత, గ్రీన్ ప్రాజెక్టులు రావాలని వారు ఆశిస్తున్నారు. అక్కడ 27వేల ఎకరాల స్థలం ఉంది. అందులోని అటవీ భూములకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాము. నేను కూడా ఏరియల్ సర్వే నిర్వహించాను. రాజధానికిదగ్గర్లో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఎక్కడా లేదు. ఓఆర్‌ఆర్ నుంచి 15 నిమిషాల ప్రయాణంతో రాచకొండకు చేరుకోవచ్చు అని సీఎం వివరించారు.
ఇందిరాపార్కు వద్ద తెలంగాణ కళాభారతి
ఇందిరాపార్కుకు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలనే ప్రతిపాదన తమవద్ద ఉందని సీఎం తెలిపారు. నగరంలో అద్భుతమైన కళాభారతి కట్టాల్సిన అవశ్యకత ఎంతైన ఉంది. అందులో విశాలమైన నాలుగు సమావేశమందిరాల నిర్మాణాలు, రెండు ఎకరాల ఓపెన్ ఏరియాలో దాదాపు 10-15వేల మంది కూర్చుని సమావేశాలు నిర్వహించుకునే వసతులుంటాయి. ఒకటి 2,750 మంది, మరోటి 1,750 మంది, మూడోది వెయ్యి మంది, నాల్గోది 600- 700 మంది కూర్చునేలా సభా ప్రాంగణాలుంటాయి అని సీఎం తెలిపారు.
2018లో కరెంటు కోతలు కనుమరుగు రాష్ట్రంలో 2018 నాటికి కరెటు కోతలు కనుమరుగు అవుతాయని సీఎం విస్పష్టంగా ప్రకటించారు. అప్పటికి 22వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మనమే విక్రయించే స్థాయికి ఎదుగుతాం. ఏపీ సీలేరు, కృష్ణపట్నం ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు కరెంటు ఇవ్వాల్సి ఉన్నా వారు ఇవ్వకపోవడాన్ని వారి విజ్ఞతకు వదిలేశాం. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కోర్టుకు కూడా పోతాము. సమస్యలుంటాయనే వరి వేయవద్దని ముందే విజ్ఞప్తి చేశాం. ఐదారు గంటలకు మించి కరెంటు ఇవ్వలేమని కూడా చెప్పాం. అక్కడక్కడ వరి పంటలు వేసినట్లుగా హెలికాప్టర్‌లోంచి చూశాను. ఈ సీజన్ దాటితే ఇబ్బందులుండవు. 2016 మధ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. టీఎస్ జెన్‌కో పవర్ ప్రాజెక్టు (మణుగూరు), ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. 2017 నాటికి అదనంగా 8వేల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది అని సీఎం వివరించారు.
మా ప్రభుత్వం పేదల పక్షం
మేము కచ్చితంగా పేదల పక్షపాతంగా ఉంటాం. గతంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఐడీహెచ్ కాలనీకి వెళ్ళి వస్తుంటే దారిలో అంబేద్కర్‌నగర్‌లో ఒక ఇంటిని చూశాను. 7 x6 అడుగుల జాగలో ఇద్దరు మహిళలు ఉంటున్నారు. దసరా పండుగ కావడంతో దేవుడినికూడా పెట్టుకున్నారు. నేను ఆగి ఆ ఇంట్లోకి వెళ్ళాను. దేవుడి బొమ్మ ఉంది సార్.. చెప్పులు విడిచి రండి అని ఆ ఇంట్లోని మహిళలు చెప్పారు. ఆ చిన్న జాగలో వారి జీవితం చూస్తే చాలా బాధేసింది. అంత చిన్న జాగలో ఎలా జీవనం గడుపుతున్నారోనని ఆశ్చర్యం వేసింది. ఇదో మచ్చుతునక. ఇలాంటి దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. గతంలో నందనవనం పేరుతో ఇలాంటి పేదలను తీసుకెళ్ళి బొందన పడేశారు. అందుకే.. ఎక్కడున్న వారికి అక్కడే ఇండ్లు కట్టిస్తాం. డెఫినెట్లీ మా ప్రభుత్వం పేదల పక్షపాతి.
పేదలందరికీ పక్కా ఇండ్లు
జీవో 58కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.42 లక్షల దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ జిల్లాలో 1.51 లక్షల దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాల నుంచి 63.52 వేల దరఖాస్తులు కలుపుకొని దాదాపు 2.34 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఇండ్లలేని నిరుపేదలందరికీ కచ్చితంగా 100కు 100 శాతం పట్టాలు జారీ చేస్తా, ఇండ్లు ఇస్తాం. క్రమబద్థీకరణ విషయంలో 100 గజాల వరకు ఉచితంగా చేస్తామని చెప్పాం. ఆ పైన స్థలం ఉన్న వారికి చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సమీక్ష జరిపినప్పుడు ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి. మేరకు కొన్ని సవరణలు చేశాం. మూడు, నాలుగు వాయిదాల్లో చెల్లింపులకు అంగీకరించాం. ఇంత అవకాశం ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోక పోతే కోర్టులు కూడా మిమ్మల్ని కాపాడలేవు. క్రమబద్ధీకరించుకోని అక్రమ నివాసాల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్‌లో ల్యాండ్ మాఫియా, భూబకాసురులు పోవాలి. ఇంటి జాగ లేని పేదలకు ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. భూముల కోసం దిక్కుమాలిన హత్యలు, కొట్లాటలు నగరంలో తగ్గాలన్నదే లక్ష్యం. హైదరాబాద్‌కు అంతర్జాతీయ బ్రాండ్ ఉండాలనేది మా పట్టుదల. పిచ్చి పిచ్చి పనులు తగ్గాలి. క్లీన్ హైదరాబాద్ రావాలి. 
వెయ్యి మార్కెట్లు ఏర్పాటు చేస్తాం
మార్కెట్ల విషయంలో జంటనగరాల పరిస్థితి చూస్తే చాలా బాధేస్తున్నది. 143 ఏండ్ల క్రితం, నిజాం నవాబుల పాలనలో నిర్మించిన సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఒక్కటే ఏడు ఎకరాల విశాలమైన స్థలంలో ఉంది. ఆ రోజుల్లో ఆ మార్కెట్‌ను ఎంత బాగ కట్టారో నేటికీ అక్కడి కట్టడాలు చూస్తే అర్థం అవుతుంది. వెలుతురుకోసం చెక్కలతో ఏర్పాటు చేసిన చక్కటి జాలీలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కూరగాయలు భూమి మీద పెట్టి అమ్మే దరిద్రం ఏమిటండి? బ్యాక్టీరియా కూరగాయల్లో చేరే ప్రమాదం ఉంది. కూరగాయలు, మాంసంవంటివి ఎత్తులో పెట్టి అమ్మాలి. కోటి జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో పది వేల మందికి ఒకటి చొప్పున వెయ్యి మార్కెట్లు ఉండాల్సిందే. 
సచివాలయాన్ని అమ్మేస్తారు అని కొంత మంది అమాయకంగా అంటుంటారు. మెహదీపట్నం బస్‌స్టాండ్ వద్ద నిలబడితే అంతా అయోమయ పరిస్థితి. అక్కడే బస్‌స్టాపు, అక్కడే కూరగాయల మార్కెట్, అక్కడే వాహనాల సందడి, జనం రాక పోకలు! ఇలాంటి చోట కింద బస్సులు, పై భాగంలో మార్కెట్లు ఉండేలా అద్భుతంగా నిర్మాణం చేపట్టవచ్చు. చాలెంజ్‌గా తీసుకున్నాం. చేసి చూపిస్తాం. కృష్ణ ఒబెరాయ్ హోటల్ నుంచి ఎర్రమంజిల్ వైపు వెళుతుంటే ఇరువైపుల ప్రభుత్వ క్వార్టర్లు ఉన్నాయి. పురాతనమైనవి కావడంతో అధికారులకు కొత్తవి నిర్మిస్తున్నాం. ఇక్కడ అద్భుతంగా మార్కెట్ కట్టవచ్చు. మలక్‌పేటలో ఆఫీసర్స్ కాలనీ ఉంది. అక్కడ కట్టవచ్చు. పాటిగడ్డ, బేగంపేట పోలీసు క్వార్టర్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ప్రాంతాల్లో మార్కెట్లు నిర్మించే వీలుంది. అయితే కొన్ని పత్రికలు ఖజానా ఖాళీ చేయడానికి, దోచుకోవడానికేనంటూ రాతలు రాస్తున్నాయి. వాటిని పట్టించుకోం. 
వేసవిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధి
గత పాలకుల నిర్లక్ష్యంతో హుస్సేన్‌సాగర్ జలాశయం కలుషితమైపోయింది. 1562లో హుస్సేన్ సాగర్‌ను 1400 ఎకరాల స్థలంలో తవ్వారు. ఇప్పటికీ కొందరు ఆ చెరువు భూములు తమవని, నీళ్ళ కింద ఉన్న భూములు తమవేనని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు 995 ఎకరాలే మిగిలింది. ఇక అంగుళం భూమి కూడా పోకుండా సాగర్‌ను పరిరక్షించాలని ఆదేశించాం. ఈ వేసవిలో సాగర్‌ను పూర్తిగా శుద్ధి చేయాలని తలచాం. నేను, మంత్రులు, జంటనగరాల వాసుల సహకారంతో శ్రమదానం నిర్వహించి, హుస్సేన్‌సాగర్ జలాశయంలో పేరుకు పోయిన పూడిక తీసి, శుద్ధిచేస్తాం. కోటి జనాభా ఉన్న నగరానికి కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసుకోగలిగే సామర్ధ్యం లేక పోవడం బాధాకరం.
పచ్చదనాన్ని పెంపొందిస్తాం
హెచ్‌ఎండీఏ పరిధిలో లక్షా50 వేల ఎకరాల్లో రిజర్డ్ ఫారెస్ట్ ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూ లూప్ రోడ్డు వచ్చింది. ఎల్బీనగర్ ప్రాంతంలో వనస్థలిపురంనుంచి మూసీనది వరకు 300 ఎకరాల్లో మహావీర్ హరిణి పార్క్ ఉంది. మహావీర్ హరణి పార్క్, బొటానికల్ గార్డెన్‌ల చుట్టూ కూడా లూప్ రోడ్లు వేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుంది. బొటానికల్ గార్డెన్‌ను కాపాడటంలో ఇంద్రకర్‌రెడి ్డ(మంత్రి), కొత్త ప్రభాకర్‌రెడ్డి(ఎంపీ) గతంలో చేసిన కృషి అమోఘం. దానికి సంబంధించిన కేసును కూడా గెలిచాం. ఏరియల్ సర్వేకు వెళుతున్నప్పుడు కంటోన్మెంట్ ప్రాంతం మొత్తం పచ్చదనంతో కనిపిస్తుంది. మిగతా ఏరియాలో అలాంటిది కనిపించదు. అందుకే హైదరాబాద్ నగరాన్ని హరితవనంగా పరిశుభ్రతతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఏడాదికి మూడు కోట్ల మొక్కలు చొప్పున 10 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాం.
నగరం అందరినీ అక్కున చేర్చుకుంటుంది
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. నిజాంకాలం నుంచి గజరాతీలు, మార్వాడీలు, సిక్కులు చాలా మంది వచ్చి ఇక్కడ ఉన్నారు. కేరళవాళ్లు కూడా ఇక్కడ ఉంటున్నారు. కేరళ మళయాళీలు సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లినా.. ఆడిటోరియం నిర్మించకుంటానంటే రూ.కోటి మంజూరు చేశాను. అన్నిరకాలవారిని హైదరాబాద్ అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఉద్యమం చేపట్టిన సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నందుకు ఆంధ్రా వాళ్లపై కాస్త ఘర్షణ వైఖరి అవలంభించాల్సి వచ్చింది. ఇప్పుడా అవసరం లేదు. హైదరాబాద్ వందశాతం కాస్మొపాలిటన్ సిటీ, కాస్మొపాలిటన్ కల్చర్‌ను కాపాడుకుందాం. పెంపొందిద్దాం. నగరాలను ఎవ్వరు నిర్మించరు. అవే పెరుగుతాయి. ఒకాయన పిచ్చాసుపత్రికి వెళ్లాడు. నేను హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పాడు. అక్కడ ఉన్న మరొకాయన.. నేను మొదట ఇక్కడకు వచ్చినప్పుడు ఢిల్లీని నేనే కట్టినా అని చెప్పాను. పిచ్చితగ్గిన తరువాత వాస్తవం గుర్తుకు వచ్చింది. నీకు కూడా అలాగే ఉంటదని చెప్పాడు. పిచ్చిముదిరితే అలాగే ఉంటుంది. నగరాలను ఎవ్వరు నిర్మించరు.. కట్టరు. కొద్దోగొప్పో మౌలిక వసతులు కల్పిస్తారు. గత ప్రభుత్వాల హయాంలో ఇక్కడ అదికూడా చేయలేదు. 300 సులభ్ కాంప్లెక్స్‌లను నిర్మించామని లెక్కలు చెప్తున్నారు. అవి కూడా లేనట్లుంది. అభివృద్ధి సంగతి తరువాత విధ్వసం చేసిన విషయాన్ని మా ప్రకాశ్ బాగా చెప్తాడు. పక్కా తెలంగాణవాది అయిన ఆయన అభివృద్ధి కంటే విధ్వంసం విషయం ముందు చెప్పాలని అంటాడు. నిజాం కాలంలో 143 ఏండ్ల క్రితం నిర్మించిన మోండా మార్కెట్‌ను పరిశీలించడానికి మంత్రి శ్రీనివాస్‌యాదవ్ నన్ను తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లినప్పుడు నాడు నిజాం నగరాన్ని అభివృద్ది చేశారని, ఇప్పుడు మీరు అభివృద్ది చేస్తున్నారని, మధ్యలో ఇప్పటి వరకు ఎవ్వరు పట్టించుకోలేదని ఓ పెద్దమనిషి చెప్పాడు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నన్ను కలిసినప్పుడు హైదరాబాద్‌లో 1.5 లక్షల మంది ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నారని చెప్పారు. అది నా హృదయాన్ని కదలించింది. దేవుడిచ్చిన శక్తితో ఏవిధంగానైనా చేసి నూటికి 99 శాతం కష్టపడి అందరికీ ఆశ్రయం కల్పిస్తా. ఆ తరువాత కూడా ఎవరైనా నిరాశ్రయులుగా ఉంటే వారికోసం నైట్ షెల్టర్లు ఏర్పాటు చేస్తాం.. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్లాన్ తయారు చేస్తున్నారు. హెరిటేజ్ భవనాలపై మాకు చాలా స్పష్టత ఉన్నది. హెరిటేజ్ పేరుతో ఉస్మానియా దవాఖానలో పెచ్చులు ఊడుతున్నా ఏమి చేయకుండా ఆలాగే ఉంచితే కుప్ప కూలుతుంది. నిజంగా వాటిని పరిరక్షించుకోవడానికి వేరే పద్ధతి ఉంది. శాస్త్రీయ పద్ధతిలో ఆ భవనాలను కాపాడుకోవాలి. 
మహిళా రక్షణకు కఠిన చట్టాలు
రాష్ట్రంలో మహిళల రక్షణకు కఠినంగా చట్టాలను అమలుచేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సింగపూర్ తరహాలో హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. నగరంలో ప్రతి చోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూర్‌లో మహిళలకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదన్నారు. హైదరాబాద్, మెదక్‌లో పేకాట క్లబ్‌లు మూసివేశామన్నారు. ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పటికీ పేకాట క్లబ్‌లను మూసివేశామన్నారు. ఆ మేరకు మరింత నిఘా ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో 24 అంతస్తులతో కంట్రోల్ కమాండ్ రూమ్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
 -(నమస్తే తెలంగాణ)

Tuesday 3 February 2015

సింగరేణిలో కొలువుల జాతర ..

* 5,472 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
* ఇంటర్వ్యూల పద్ధతి రద్దు.. 
* రాతపరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు 
* ఇంటర్నల్ పోస్టులు 564 
* ఎక్స్‌టర్నల్‌పోస్టులు 2,164, డిపెండెంట్లు 2,744
హైదరాబాద్: వందేండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 5,472 పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాతపరీక్ష ద్వారా 2,164 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10వ తేదీన తొలి నోటిఫికేషన్ జారీకానుంది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మైనింగ్ విభాగాలకు సంబంధించిన 1,127 పోస్టులు డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలకు సంబంధించినవే కావడం గమనార్హం. మార్చి 3వ తేదీన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మైన్ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్స్ విభాగాల్లో 771 పోస్టులకు రెండవ నోటిఫికేషన్ వెలువడుతుంది. తదుపరి మార్చి 31న పారామెడికల్, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించి 266 పోస్టులకు మూడవ నోటిఫికేషన్ జారీచేస్తారు. సుదీర్ఘ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 
  సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన సింగరేణి సంస్థను వ్యాపార, వాణిజ్య ప్రక్రియలో ముందుంచేందుకు మరో 17 కొత్త మైనింగ్‌లను చేపట్టే లక్ష్యంతోపాటు సింగరేణి సిరులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. ఇప్పటి వరకు ఏటా రెండు శాతం, మూడు శాతం పెరుగుదలకే పరిమితమైన సింగరేణి సంస్థ వచ్చే ఏడాది (2015-16)నుంచి 10శాతం చొప్పున పెరుగుదల(గ్రోత్)ను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తొలుత సంస్థాగతంగా మానవవనరుల(ఉద్యోగాలు) సమీకరణ దిశగా యాజమాన్యం ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రం తొలి ఏడాది సంబరాలనాటికి సింగరేణి కొలువుల జాతర ముగించాలన్న దృఢసంకల్పంతో సీఎండీ ఉండడం విశేషం.
      సింగరేణిలో డిపెండెంట్లు 2004 సంవత్సరంనుంచి ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత దశాబ్దకాలంగా వారిగోడును ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు లెక్కలు తీసిన యాజమాన్యం.. 2004 మార్చి వరకు 2,744 మంది డిపెండెంట్లు వెయిటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. వీటిల్లో 753 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించగా.. మిగతా 1,991 మంది డిపెండెంట్లకు వచ్చే ఆగస్టునాటికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు సింగరేణిలో పదోన్నతులకు నోచుకోని 564 మంది ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించనున్నారు. వివిద హోదా(కేడర్)ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాలను సిద్ధంచేశారు. వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు. 
    నోటిఫికేషన్ ప్రక్రియద్వారా భర్తీ చేయతలపెట్టిన 2,164 డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల(ఆర్వోర్)కు లోబడి పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. అవినీతికి, సిఫార్సులకు ఏమాత్రం ఆస్కారంలేకుండా రాతపరీక్షలో ప్రతిభ (మెరిట్) ఆధారంగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కృతనిశ్చయంతో సింగరేణి ఉంది. ఇందుకోసం రాతపరీక్ష తర్వాత ఇంటర్వూల పద్ధతికి స్వస్తి పలికింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న సింగరేణి రిక్రూట్‌మెంట్ విభాగాన్ని ప్రక్షాళన చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అనువుగా నిబద్ధత కలిగిన 50 మంది అధికారులు, సిబ్బందిని అదనంగా ఈ విభాగంలో పనిచేసే అవకాశాన్ని కల్పించింది.