Thursday, 29 January 2015

మహా 'వరంగల్'..

* గ్రేటర్ కార్పొరేషన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు 
* రాష్టంలో రెండో నగరానికి గ్రేటర్ హోదా
* 42 పంచాయతీల విలీనంతో10లక్షలకు చేరిన జనాభా
* చారిత్రక, పర్యాటక ప్రత్యేకతల నెలవు
కాకతీయ వైభవానికి నిలువుటద్దంగా నిలిచి, జాతీయస్థాయిలో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహానగర హోదా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి ఎంజీ గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితర శాఖల అధికారులతో జనవరి  28న సమీక్ష సమావేశం నిర్వహించారు. 
      వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారమైన వరంగల్ నగరం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక, విద్యారంగంలో రాష్ట్ర రాజధానికి దీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొద్దికాలంక్రితం 42 గ్రామపంచాయతీలను కలుపడంతో నగరం బాగా విస్తరించిందని.. దీంతో జనాభా 10 లక్షలకు చేరుకుందని సీఎం వివరించారు. చారిత్రక, పర్యాటకపరంగా వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.
1934లో మేజర్ మున్సిపాలిటీగా:
అద్భుతమైన చారిత్రక వారసత్వ సంపద కలిగిన వరంగల్ సీమాంధ్రుల పాలనలో తీవ్ర వివక్షకు గురైంది. నిజాంల కాలంలో 1934(1344 ఫస్లీ)లోనే మేజర్ మున్సిపాలిటీ స్థాయికి అభివృద్ధి చెందిన వరంగల్ పట్టణాన్ని సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఏనాడో గ్రేటర్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించాల్సిన వరంగల్ ఇప్పటివరకు నిరాదరణకు గురైంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణానికి నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయుల రాజధానిని గ్రేటర్ కార్పొరేషన్ చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే వరంగల్‌కు కేంద్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం తాను అభివృద్ధి చేయతలపెట్టిన వంద స్మార్ట్ సిటీల జాబితాలో వరంగల్‌ను చేర్చింది. 
     వరంగల్ నగరం 1934లో మేజర్ మున్సిపాలిటీగా అవతరించింది. రాచరిక పాలన తరువాత 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా రాగా, 1960లో సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. 1994 ఆగస్టు 18న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆనాటిప్రభుత్వం డిక్లేర్ చేసింది. 20 ఏండ్ల తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించారు.
గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 409 చదరపు కిలోమీటర్లు: 
కొంతకాలం కిందటే 42 గ్రామ పంచాయతీల విలీనంతో వరంగల్ విస్తీర్ణం 100 చదరపు కిలోమీటర్ల నుంచి 409 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వరంగల్ నగరంలో కాకతీయ యూనివర్సిటీతోపాటు ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐటీ ఉన్నది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటన్నిటి నేపథ్యంలో ఏకశిలా నగరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వరంగల్ గ్రేటర్ కావడంతో మరింత అభివృద్ధి అయ్యే అస్కారం ఉన్నది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలు
         అల్లాపూర్,  అయోధ్యపురం,  భట్టుపల్లి, కడిపికొండ, కుమ్మరిగూడెం, పైడిపల్లి,  చింతగట్టు, పెద్దపల్లి, ఎల్లాపూర్, మొగిలిచర్ల, రాంపూర్, వంగపహాడ్, ఆరెపల్లి, ఎనుమాముల, గోపాలపరం, గుండ్లసింగారం, కొత్తపల్లి(హెచ్), కొత్తపేట, మడికొండ, మామునూర్, నక్కలపల్లి, పలివేల్పుల, టేకులగూడెం, తరాలపల్లి, తిమ్మాపూర్, భీమారం, దేవన్నపేట, హసన్‌పర్తి, కోమటిపల్లి, ముచ్చెర్ల, మునిపల్లి, ధర్మారం, దూపకుంట, గొర్రెకుంట, పొతరాజుపల్లి, స్థంభంపల్లె, వసంతపూర్, జన్‌పాక, ఉంకిచర్ల, సింగారం, బొల్లికుంట, గడిపల్లె.
- (నమస్తే తెలంగాణ)

Tuesday, 27 January 2015

దటీజ్ 'హైదరాబాద్ హౌస్' .. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మాణం

* ప్రతిష్ఠాత్మక చర్చలకు ఏకైక వేదిక.. నిజాం నిర్మాణ కౌశలానికి ప్రతీక
   ఒబామా భారత పర్యటన సందర్భంగా హైదరాబాద్ హౌస్ మరోసారి వార్తలకెక్కింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా చర్చలకు వేదికగా నిలిచిన ఈ హైదరాబాద్ హౌస్‌ను నిర్మించింది మన నిజాంనవాబే. అంటే ఆ భవనం ఒకనాటి మన హైదరాబాద్ సంస్థానం ఆస్తే. స్వాతంత్య్రానంతరం దశాబ్దాల అనంతరం కూడా ఇవాల్టికీ ఢిల్లీ నగరంలో విదేశీ ప్రముఖులతో భేటీలకు ఇంతకు మించిన భవనం నిర్మాణం జరగలేదంటే హైదరాబాద్ హౌస్ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. 1919లో కొత్తఢిల్లీ నిర్మాణం ప్రారంభమైంది. నాడు నిజాం వంశంలో ఏడవ నవాబుగా ఉన్న ఉస్మాన్ ఆలీ ఖాన్ ఢిల్లీలో హైదరాబాద్ సంస్థానానికి ఒక భవనం ఉండాలని ప్రతిపాదించారు. నాడు ఢిల్లీలో బ్రిటిష్ భవనాలకు రూపకల్పన చేస్తున్న అప్పటి బ్రిటిష్ ఇంజనీరు సర్ ఎడ్విన్ ల్యూటెన్స్‌ను నిజాం సంప్రదించారు. ఆయన ఇచ్చిన డిజైన్ ప్రకారం 1920వ దశకం చివర్లో బాబూఖాన్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ఇండియా గేట్‌కు సమీపంలో ఈ భవనం నిర్మాణమైంది. సుమారు 8.77 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో మొఘల్-యూరోపియన్ భవనాల తరహాలో సీతాకోకచిలుక ఆకారంలో దీన్ని నిర్మించారు. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో (1929-31)నే నిర్మాణం పూర్తయింది. ఈ భవనంలో 36 గదులున్నాయి. అయితే ఈ భవనంలో ఎక్కువగా పశ్చిమ దేశాల పోకడలు ఉండడం నచ్చని నిజాం కుటుంబ సభ్యులు దీన్ని చాలా తక్కువసార్లు మాత్రమే వాడుకున్నారు. హైదరాబాద్ నిజాం నవాబు ప్యాలెస్‌గా ప్రాచూర్యం పొందిన ఈ భవనాన్ని భారత యూనియన్‌లో నిజాం సంస్థానాన్ని విలీనం చేసేంత వరకూ నిజాం వంశస్తులు నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్రం ఈ భవనాన్ని సంవత్సరానికి రూ. 1.24 లక్షల చొప్పున లీజు ప్రాతిపదికన దీన్ని కేంద్ర ప్రభ్వుత్వం తీసుకుంది. 
             యాజమాన్య హక్కులు మాత్రం హైదరాబాద్ రాష్ట్రం వద్దే ఉండేవి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించబడ్డాయి. 1976 నాటికి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన కేంద్రం రాష్ర్టాన్ని సంప్రదించింది. ఇరు ప్రభుత్వాల బేరసారాలు చాలా కాలం సాగాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా, పీవీ నర్సింహారావు ప్రధానిగానూ ఉన్న 1993లో బదలాయింపు పూర్తయింది. ఈ భవనానికి బదులుగా సమీపంలోనే ఉన్న పటోడీ హౌస్ ప్రాంగణాన్ని ఇచ్చింది. అయితే అక్కడ స్థలం 7.64 ఎకరాలు మాత్రమే ఉండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ వెనకవైపున 3.78 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓల్డ్ నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ర్టానికీ ఢిల్లీలో అధికారిక భవన్‌ను నిర్మించుకోడానికి స్థలం ఇస్తున్న క్రమంలో 1వ నెంబర్ అశోకారోడ్డులో ప్రస్తుతం ఉన్న భవనానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది సుమారు 8.42 ఎకరాల మేరకు ఉన్నది. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8.42 ఎకరాల స్థలం, హైదరాబాద్ హౌస్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన 11.42 ఎకరాల స్థలం ఇపుడు ఇరు రాష్ర్టాల మధ్య పంపకానికి సిద్ధంగా ఉంది.
- (నమస్తే తెలంగాణ)

Monday, 26 January 2015

ఘ‌నంగా గ‌ణ‌తంత్ర వేడుక‌లు.. ఆక‌ర్షణీయంగా తెలంగాణ శ‌కటం

                                      తెలంగాణ శకటం                              
స్తినలోని రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా హాజరయ్యారు. ఉదయం 9.50 గంటలకు రాజ్‌పథ్‌కు ఒబామా దంపతులు చేరుకున్నారు. ఒబామా దంపతులకు ప్రధాని మోడీ, హమీద్ అన్సారీ ఘన స్వాగతం పలికారు. ఒబామా వచ్చిన అనంతరం రాజ్‌పథ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేరుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ పాటు పలువురు కేంద్ర మంత్రులు రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మిషెల్లి ఒబామా, ప్రధాని మోడీ, హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, షీలాదీక్షిత్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
అమర్ జవాన్ జ్యోతి వద్ద మోడీ నివాళి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోడీ అమర జవాన్లకు నివాళులర్పించారు. పుష్పాంజలి ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. 
వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు ‘అశోక చక్ర’
ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన జవాన్లు మేజర్ ముకుంద్ వరదరాజన్, నీరజ్‌కుమార్ సింగ్‌కు అశోక చక్ర పురస్కారాలు వరించాయి. ఈ పురస్కారాలను 66వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. షోపియాన్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వరదరాజన్ అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్ కుప్వారాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నీరజ్‌కుమార్ అమరుడయ్యాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను నీరజ్‌కుమార్ హతమార్చాడు.
ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్‌పథ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ర్టాలు శకటాలను ప్రదర్శించాయి. తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. బోనాల ఇతివృత్తంతో తెలంగాణ శకటం ముందుకు సాగింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శకటాన్ని ప్రదర్శించారు. పోతు రాజుల విన్యాసాలు, బోనాలు ఆకట్టుకున్నాయి. శకటంపై జమ్మి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ శకటాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. ఢిల్లీలోని తెలంగాణవాసులు తెలంగాణ శకటాన్ని చూసి చప్పట్లతో స్వాగతం పలికారు.

Wednesday, 21 January 2015

స్వైన్‌ఫ్లూ నిరోధానికి అయిదు మార్గాలు


* స్వైన్‌ఫ్లూ వైరస్  సాధారణంగా పందుల్లో కనిపిస్తుంది. పందుల నుండి మానవులకు ఈ వైరస్ సోకినపుడు 'జూనోటిక్ స్వైన్‌ఫ్లూ' అంటారు.  
* రోజుకు వీలయినన్ని సార్లు యాంటీ బాక్టీరియా సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.                                                             
* రోజుకు పది గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. దీని వల్ల శరీరం నుండి టాక్సిన్‌లు బయటికి పోతాయి. ఇంకా ఇన్ఫెక్షన్ లాంటి అవకాశాలుండవు.
* కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. దీనితో ఇమ్యూనిటీ పెరుగుతుంది. 
* విటమిన్లు సమృద్ధిగా ఉండే కూరగాయలు, ఫలాలు తీసుకోవాలి. దగ్గినపుడు, తుమ్మినపుడు చేతి రుమాలు అడ్డుగా పెట్టుకోవాలి. 

Saturday, 17 January 2015

రాజధానిలో రియల్‌ఎస్టేట్ దూకుడు..


* నివాస, వాణిజ్య భవనాలకు భారీగా దరఖాస్తులు
* బల్దియాకు నెలరోజుల్లో రూ.90కోట్ల ఫీజులు
* క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రఖ్యాత సంస్థల ప్రణాళికలు
   హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ దూసుకుపోతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతన భవనాల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నవంబర్ మాసంలోనే అనుమతి ఫీజుల కింద జీహెచ్‌ఎంసీకి రూ. 90కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది నవంబర్ నెలతో పోల్చుకుంటే రూ. 30కోట్లు అధికం. నగరంలోని అన్ని జోన్లలోనూ ఇదే తీరు. మొత్తానికి మొత్తం ఐదు జోన్లలోనూ నూతన నిర్మాణాలకు భారీగా దరఖాస్తులొస్తున్నాయి. వీటికితోడు పలు ప్రఖ్యాత సంస్థలు సైతం నగరంలో నూతన క్యాంపస్‌లు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని జీహెచ్‌ఎంసీకి వస్తున్న దరఖాస్తులు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాకే నూతన నిర్మాణాలకు దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు జీహెచ్‌ఎంసీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 
           తాజా గణాంకాలను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 30 శాతం నిర్మాణాల్లో వృద్ధి కనిపించింది. ఇప్పటికే ఖాళీ జాగాలే లేవంటూ ప్రచారాలు జరిగిన సెంట్రల్‌జోన్ సహా అన్ని జోన్లలోనూ కొత్త అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు అందాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సౌత్‌జోన్‌లో కూడా భారీగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ జోన్‌లో అత్తాపూర్ ప్రాంతంలో 25ఎకరాల్లో దాదాపు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది నగరంలో మెరుగుపడ్డ శాంతిభద్రతలకు అద్దం పడుతున్నది. అలాగే నార్త్‌జోన్‌లోని కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, అల్వాల్‌లో ఐదు అంతస్తుల నివాస, వాణిజ్య భవనాల నిర్మాణం కోసం ప్రతినెలా 12నుంచి 15వరకూ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తులొస్తున్నాయి. ఇక వెస్ట్‌జోన్ మొదటినుంచి బంగారు బాతుగుడ్డే. గచ్చిబౌలీ ప్రాంతంలో సుమారు 23ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15లక్షలకుపైచిలుకు ఎస్‌ఎఫ్‌టీ నివాస, వాణిజ్య భవనాలు నిర్మించేందుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. బయోడైవర్శిటీ పార్కు సమీపంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో సుమారు 250ఎకరాల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య భవనాల నిర్మాణానికి పలు సంస్థలు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాయి.అంతేకాదు, గచ్చిబౌలీ ప్రాంతంలోని నాలెడ్జ్‌సిటీ ప్రాంతంలో దాదాపు 200ఎకరాల్లో నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాయి. 
ఏడు నెలల్లో ఆరువేల దరఖాస్తులు..
        ఇంటి అనుమతులకోసం జనవరి 1, 2011నుంచి జూన్ 30, 2014వరకు దాదాపు మూడున్నరేళ్లలో జీహెచ్‌ఎంసీకి 34,614దరఖాస్తులొచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జూన్ 2, 2014నుంచి ఈ ఏడాది జనవరి 16వ తేదీవరకు ఇప్పటికే 5970దరఖాస్తులు రావడం విశేషం. అంటే, దాదాపు ఏడు నెలల్లో ఆరువేల దరఖాస్తులొచ్చినట్లు చెప్పవచ్చు. వచ్చే మార్చిలోగా ఈ సంఖ్య 12వేలు దాటే అవకాశముందని అధికారులు చెబుతున్నాయి. గతంలో ఏటా సగటున పదివేలలోపు దరఖాస్తులు రాగా, తాజాగా ఏడు నెలల్లోనే దాదాపు ఆరు వేల దరఖాస్తులు రావడం గమనార్హం. 
ఇవీ అనుకూలంశాలు....
నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించడం రియల్ రంగానికి మంచి ఊపునిచ్చింది. ప్రథమంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏ రాష్ట్రం చేపట్టని స్థాయిలో ఏర్పాట్లు చేయడం సత్పలితాలనిచ్చింది. అలాగే నగరంలో అభివృద్ధి కోసం దాదాపు 20వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది. మరోవైపు నిర్మాణసంస్థలకు సంబంధించి వివిధ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. పలు రకాల పన్నుల మినహాయింపునకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. సిమెంటు ధరలు పెరిగినపుడు ప్రభుత్వం కల్పించుకుని ఉపశమనం కలిగించింది. ఇవన్నీ భవన నిర్మాతల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాయి. 
       దీనికితోడు సమశీతోష్ణస్థితి, భూకంపాలు, ప్రకృతి విపత్తులకు అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో పలు ప్రఖ్యాత సంస్థలు మన నగరంలో సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తిచూపుతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే మన నగరంలో ఇళ్లు ఎంతో చౌకగా ఉన్నాయి. ఇక్కడ అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లలో ఇప్పటికీ ఒక చదరపు అడుగు ధర మూడున్నర వేలనుంచి నాలుగువేలకు మించలేదు. అదే బెంగుళూరులో సుమారు రూ. ఏడు వేలు, చెన్నయ్‌లో రూ. ఎనిమిది వేలు ఉండగా, ముంబాయిలో తక్కువలో తక్కువ ఒక ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 12వేల వరకూ ఉంది. వడ్డీరేట్లను తగ్గిస్తూ గత గురువారం ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకునే వీలుందని జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కొత్తగా రానున్న నివాస, వాణిజ్య భవనాల్లో కొన్ని..
* అత్తాపూర్‌లో సుమారు 25ఎకరాల్లో 10అంతస్తుల్లో సుమారు 10లక్షల చదరపు అడుగులమేర అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు. బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ వీటి నిర్మాణం చేపట్టనుంది.
గచ్చిబౌలీలో బయోడైవర్సిటీ పార్కు సమీపంలో 23ఎకరాల్లో భారీ నివాస, వాణిజ్య అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రణాళికలు. ప్లానింగ్ తయారీ, అనుమతుల కోసం బల్దియా అధికారులతో చర్చలు
బయోడైవర్శిటీ పార్కువద్ద ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో ఏడు నక్షత్రాల హోటల్‌కు మొదలైన పనులు.
* నార్త్‌జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి సర్కిళ్లలో ప్రతినెలా 10నుంచి 12 ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు.
* ఈస్ట్‌జోన్ పరిధిలోని ఎల్బీనగర్‌లో ప్రతినెలా 150నుంచి 200ఇండ్లకు అనుమతులు.
* గోపనపల్లిలో సుమారు 100ఎకరాల స్థలంలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నిర్మాణానికి సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్. అనుమతుల కోసం బల్దియా అధికారులతో సంప్రదింపులు.
* గోపన్‌పల్లిలో 23ఎకరాల్లో ప్రతిష్టాత్మక ది ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ నిర్మాణానికి ప్రణాళికలు. అనుమతులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చలు. 
* గచ్చిబౌలీ స్టేడియం ఎదురుగా 100ఎకరాల స్థలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీస్థాయిలో డేటా సెంటర్‌సహా క్యాంపస్ నిర్మాణానికి ఏర్పాట్లు. ఇప్పటికే అక్కడ ప్రాథమికంగా ఓ డేటా సెంటర్‌తోపాటు ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పగా త్వరలో దీన్ని దేశం మొత్తానికి సరిపోయే విధంగా డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. భూకంపాలు, తుపానులు తదితర ప్రకృతి విపత్తులకు అవకాశం లేదనే ఉద్దేశంతో ఇక్కడ డేటా సెంటర్ నెలకొల్పాలని నిర్ణయించారు. 
* ప్రఖ్యాత బీపీఓ సంస్థ డెలాయిట్ నగరంలోని గచ్చిబౌలీలో క్యాంపస్ ఏర్పాటుచేసేందుకు మూడు మిలియన్ల ఎస్‌ఎఫ్‌టీ కమర్షియల్ భవనాన్ని 30ఏళ్లకు అద్దెకు తీసుకుంది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది.
                                                                             - (నమస్తే తెలంగాణ)

Monday, 12 January 2015

హైదరాబాద్‌లో స్మార్ట్‌సిటీ!


హైదరాబాద్‌లో దుబాయ్ తరహా స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సిటీ ఏర్పాటు చేయాలని దుబాయ్ స్మార్ట్ సిటీ (దుబాయ్ హోల్డింగ్) కంపెనీ ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ కంపెనీ బృందం నేడు నగరానికి వస్తున్నది. దుబాయ్ హోల్డింగ్ కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. వివిధ దేశాల్లో స్మార్ట్‌సిటీలు నిర్మించిన అనుభవం ఉంది. ఇప్పటికే మన దేశంలోని కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లో కూడా స్మార్ట్‌సిటీ నిర్మాణం జరుపుతున్నది. దుబాయ్ బృందం రాష్ట్రంలో రెండు రోజులపాటు విస్తృతంగా పర్యటించనుంది. 
పారిశ్రామిక విధానానికి స్పందనగా..
దుబాయ్ హోల్డింగ్ కంపెనీ రాష్ట్ర పర్యటనకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం బాట వేసింది. ఇటీవల దుబాయ్‌లో పర్యటించిన రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు బృందం.. టీఎస్-ఐ పాస్, టీ-ఐడియా, టీ-ప్రైడ్ వంటి పారిశ్రామిక విధానాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సదస్సులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలను, ప్రోత్సాహకాలను వివరించారు. దానికి అనేక కంపెనీలు సానుకూలతను వ్యక్తం చేశాయి. లూలూ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు అక్కడికక్కడే సంసిద్ధత ప్రకటించి ప్రభుత్వంతో చర్చించింది. అలాగే దుబాయ్ స్మార్ట్ సిటీ(దుబాయ్ హోల్డింగ్) కంపెనీ కూడా పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించింది. హైదరాబాద్ నగర శివార్లల్లో స్మార్ట్ సిటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్‌లు దుబాయ్ స్మార్ట్ సిటీని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. ఆ నేపథ్యంలోనే దుబాయ్ హోల్డింగ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబ్దుల్‌లతీఫ్ అల్‌ముల్లా, స్మార్ట్ సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అనిరుధ్ డామ్కీ, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ బాజు జార్జ్‌లతో పాటు మరో ఇద్దరు అధికారులు సోమవారం రాత్రి హైదరాబాద్‌కు వస్తున్నారు.
గతంలోనూ వచ్చిన బృందం..
వాస్తవానికి దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రతినిధి బృందం నాలుగేండ్ల క్రితం కూడా స్మార్ట్ సిటీ ప్రతిపాదనతో సమైక్య రాష్ట్ర పాలకుల దగ్గరికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాడు నేతల బేరసారాలకు దిగడంతో విసిగి మన దేశంలోనే కొచ్చిన్ సిటీకి వెళ్లినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నమస్తే తెలంగాణకు వివరించారు. అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో స్మార్ట్‌సిటీ అక్కడికి తరలింది. కొచ్చిలో గవర్నమెంట్ ఆఫ్ మాల్టా, స్థానిక ప్రభుత్వం సంయుక్తంగా 120 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ మల్టాను నిర్మిస్తున్నాయి. దీనితో కొచ్చి ఈయూ, నార్త్ ఆఫ్రికా కంపెనీలకు గేట్‌వేగా మారే ఛాన్స్ వచ్చింది. ఈ కంపెనీకి స్మార్ట్‌సిటీల నిర్మాణంలో దశాబ్ద కాల అనుభవం ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో నిర్మించిన స్మార్ట్ సిటీ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. హైదరాబాద్‌లో కూడా భూములు, ప్రాంతాన్ని బట్టి ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నారో కూడా పర్యటన పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో తెలియజేస్తారని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ తెలిపారు.
అభివృద్ధిపై అధ్యయనం..
దుబాయ్ బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు 150 ఎకరాల వరకు స్థలం అవసరమని కంపెనీ ప్రాథమికంగా ప్రతిపాదించింది. తెలంగాణ పురోగతిని సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టే అంశాన్ని కంపెనీ వెల్లడించనుంది. 
         బృందానికి ప్రధానంగా పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్‌లోని రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని భూములను టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ ప్రత్యక్ష్య పర్యవేక్షణలో చూపించనున్నారు. ఈ మూడు జిల్లాలకు ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానంగా ఉంది. దానికి తోడు మరో ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో ఉన్నాయి. ఇవి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నుంచి 45 నిమిషాల్లోనే చేరుకునే మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. అలాంటి భూములనే దుబాయ్ బృందానికి చూపించనున్నట్లు తెలిసింది.
(టీ మీడియా సౌజన్యంతో)

Friday, 9 January 2015

ఆయుర్వేదం .. 'ఔషధ' గని


నిండు నూరేళ్లపాటు ఆరోగ్యంతో జీవించమని దీని అర్థం. ఆరోగ్యం అనేది వ్యక్తి ప్రవర్తన, పరిసరాలు, ఆహార, దైనందిన కార్యక్రమాలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తులు ఏదైనా వ్యాధికి గురైతే చికిత్స తప్పనిసరి. ఓ వ్యాధి నివారణకు పొందే చికిత్స వల్ల మరోవ్యాధి(సైడ్ ఎఫెక్ట్) కల్గితే అది విశ్వసనీయత కోల్పోతుంది. ఏ వ్యాధి మందులు ఆ వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించడమేగాకుండా కొత్త వ్యాధులకు కారణం కాకుండా ఉండడమే అసలైన వైద్యం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఆయుర్వేద వైద్యం మాత్రమే. ప్రకృతి సిద్ధంగా లభించే వనమూలికలను ఉపయోగించి చేసే ఈ చికిత్స ఎంతో పురాతనమైనది. ప్రస్తుతం ఇంగ్లీషు వైద్యానికి ఆదరణ పెరగడంతో ఆయుర్వేదం ప్రాభవాన్ని కోల్పోతోంది. ఔషధ మొక్కల కొరత కారణంగా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. ఈ నేపథ్యంలో మునగాల మండల కేంద్రంలోని ఆయుర్వేద ఔషధ మొక్కల నర్సరీని మీ ముందుంచుతోంది నమస్తేతెలంగాణ, ఇది జిల్లాలోనే ఏకైక ఆయుర్వేద నర్సరీ తెలుసా...!
బ్రహ్మణి (సరస్వతి): ఈ మొక్క ఆకులు జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఉపయోగపడతాయి. నిత్యం నాలుగు ఆకులు తీసుకోవడం ద్వారా మేథస్సు పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ మొక్క ఆకులు మానవ మెదడు ఆకారంలో ఉండడం విశేషం.
సర్పగంధ: ఈ మొక్క వేర్లు తీసుకోవడం వలన అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. మానసిక రుగ్మతలను నయం చేయడంలోనూ ఉపకరిస్తుంది.
వావిళ్ల: నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. బాలింతలకు గతంలో ఈ మొక్క ఆకులను వినియోగించేవారు. సేంద్రియ వ్యవసాయ ఎరువు తయారీలో ఉపయోగిస్తారు. దోమలు, కీటకాల నివారణకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను ఉపయోగించి పొగవేస్తే ఇంట్లో దోమలు ఉండవు.
రేల: ఈ మొక్క ఆకులు, పూల, బెరడు, కాయలు ఉపయోగపడతాయి. ఈ మొక్క అంతరించిపోయే దశలో ఉంది. చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
నీలి: ఈ మొక్క ఆకులు జుట్టు నలుపు రంగులో ఉండేలా చేస్తుంది. లివర్ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. 
నీలవేము: మధుమేహం, లివర్ వ్యాధుల నివారణకు దోహదపడుతుంది.
కస్తూరి బెండ: దంత సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రైతులు ఈ మొక్కలను పెంచడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చు.
పసుపుపూల గుంటగలగర: ఈ మొక్క ఆకులు వెంట్రుకలు, లివర్ సంబంధిత సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
పాశనబేడి: కిడ్నీలో రాళ్లు తొలగించడానికి ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఈ మొక్కలు తీసుకోవడం ద్వారా కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.
అర్జున (తెల్లమద్ది): ఈ వృక్షం ఆకులు గుండె సంబంధిత రుగ్మతలు నయం చేయడానికి ఉపయోగపడతాయి. పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కలు చెరువుల చుట్టూ నాటినట్లయితే వేసవి కాలంలో చెరువులోని నీరు ఆవిరి కాకుండా ఉండేలా చేస్తుంది.

Thursday, 8 January 2015

ఓరుగల్లులో 'ఔటర్‌'కు శ్రీకారం!


              * 300 అడుగులతో రింగ్ రోడ్డు.. రూ.1600 కోట్లతో అంచనాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వరంగల్ వేదిక కానుంది. 300 అడుగుల వెడల్పుతో వరంగల్ చుట్టూ 73 కిలోమీటర్ల ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవ లం హైదరాబాద్ చుట్టు మాత్రమే 500అడుగు ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీశాఖ ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాలతోపాటు మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు చోట్ల ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) అధికారులు ట్రైసిటీ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత 2011-2031 మాస్టర్‌ప్లాన్ ప్రకారం 200అడుగుల వెడల్పుతో వరంగల్ చుట్టూ 73 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. కానీ సీఎం కేసీఆర్ సూచనతో 300 అడుగులుగా నిర్ణయించారు. వరంగల్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, నర్సంపేట, ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారుల్లో ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద 500 అడుగుల వెడల్పుతో ఐదు జంక్షన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్‌కు రూ.20కోట్ల నుంచి రూ.23 కోట్లు ఖర్చు కాగలవని అంచనా. 73 కిమీ రోడ్డు కోసం రూ.1600 కోట్లు అవసరమని సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డులో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ములుగు, నర్సంపేట రూట్లలో రాంపూర్, చింతగట్టు, ఐనవోలు క్రాస్‌రోడ్డు, ఆరెపల్లి, ధర్మారం వద్ద 500 అడుగుల వెడల్పుతో జంక్షన్లు నిర్మించనున్నట్లు కుడా ప్లానింగ్ అధికారి ఏ అజిత్‌రెడ్డి టీ మీడియాకు చెప్పారు. ఈ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

Monday, 5 January 2015

నిజామూ నిజాలూ

కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు. తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగాణ ఎక్కువగా వివక్షలపాలైంది వారి ఏలుబడిలోనే. తెలంగాణ రాష్ట్ర కాంక్షకు అడ్డంగా నిలబడి, ప్రత్యక్షంగా ఉద్యమకారులతో తలపడిందివారే. వీరంతా హైదరాబాద్‌లో ప్రైవేటు సామ్రాజ్యాలు నిర్మించడానికి, సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి పాటుపడ్డారు. నిజాం వేల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు, భూములు, చెరువులు తెలంగాణకు అందించిపోయారు. అందుకే వారికంటే నిజాంఉన్నతంగా కనిపిస్తారు. ఇది చేదు నిజం. అందరికీ అంత తొందరగా జీర్ణం కాదు. 
    నిజాం గురించి మాట్లాడిన ప్రతిసారి వివాదం తలెత్తుతున్నది. టీడీపీ నాయకులు మొదలు కమ్యూనిస్టుల వరకు అందరూ అదిగో ఒక నియంతను పొగుడుతున్నాడు చూడండి అని విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రిని. నిజాం పాలన గురించి ఇప్పుడయినా నిజాలు మాట్లాడుకోవాలి. నిజాం పాలనలో తప్పులు జరిగినమాట నిజమే. అది భూస్వామిక పాలన నిజమే. ప్రజలపై స్వారీ చేసింది కూడా నిజమే.
       ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా నిజాం రాజు కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణకు ఆయన సృష్టించిన సంపదను, సమకూర్చిన సదుపాయాలను ఎలా విస్మరిస్తామని, ఆ మాట చెప్పకుండా ఎలా ఉంటామని చెబుతున్నారు. ఏ రాజులు ఏ రాజధానిలో నిర్మించని అద్భుత సౌధాలను నిజాం రాజు హైదరాబాద్‌లో నిర్మించారు. నిజాంసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఇంకా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎవరి సొమ్ముతో ఇవన్నీ చేశారని ఎవరయినా ప్రశ్నించవచ్చు.
   ఇక్కడ ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసిన సొమ్మును బ్రిటన్‌కో, ఫ్రెంచికో, డచ్చికో ఓడల్లో తరలించుకుపోయినవాళ్లనే చూశాం. కానీ ఇది తన రాజ్యమని, ఇక్కడే శాశ్వతంగా రాజ్యం చేస్తానని ఆశించి, అదే సొమ్ముతో నిర్మాణాలు చేశారు నిజాం. అస్తిత్వ ఉద్యమంలో ఎదిగివచ్చిన నాయకులు ఎవరయినా తమ చరిత్రను పునస్సమీక్షించుకుంటారు. చరిత్రలో జరిగిన మంచి చెడులను తడిమి చూస్తారు. రజాకార్ల అరాచకాలను అనుభవించిన పల్లెలు, కుటుంబాల నుంచి వచ్చిన నా వంటి వారికి నిజాం రాజుపై ఇసుమంతయినా సదభిప్రాయం ఉండే అవకాశం లేదు. నాకు ఆయన ఇప్పటికీ తెలంగాణను తన ఉక్కుపాదాల కింద తొక్కిపెట్టిన నిరంకుశ ప్రభువు. అయితే చరిత్రను కేవలం వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాలు, రాజకీయాల దృష్టితో చూస్తే మనకు ఒక పార్శమే కనిపిస్తుంది. మరో పార్శాన్ని అసలు చూడడానికే ప్రయత్నించం. ఇది ఆత్మాశ్రయ(సబ్జెక్టివ్)వాద దృష్టి. వాస్తవిక(ఆబ్జెక్టివ్) దృష్టి మరుగున పడిపోతుంది. నిజాంను పొగిడినంత మాత్రాన మిగతా పార్శాలను విస్మరించినట్టు ఎలా వక్రీకరిస్తారు? తెలంగాణలో అస్తిత్వ ప్రతీకలన్నింటినీ తలకెత్తుకుని మోసింది కేసీఆరే. కొమురం భీమ్‌ను తెలంగాణ పోరాటానికి ప్రతీకగా చెప్పుకున్నది కేసీఆరే. బందగి, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలను అస్తిత్వ చిహ్నాలుగా ముందుపెట్టుకుని నడిచింది తెలంగాణ ఉద్యమమే. అదే సమయంలో నిజాం చేసిన మంచి పనులను కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోనే చెప్పారు. ఆయనను అప్పుడు కూడా తెలంగాణ ప్రజలు తప్పుగా అర్థం చేసుకోలేదు. స్వరాష్ట్రంలో తెలంగాణ చరిత్రను సరికొత్త దృక్పథంతో చూడాలన్నది ఆయన భావన. చరిత్ర పురుషుల గురించి ఒకే పార్శం చూడాలని, వ్యతిరేక పార్శమే చూడాలని చెప్పేవారు ఒక్కసారి సమకాలీన చరిత్రలోకి వెళ్లి చూడండి...
      తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసి, వందలాది మంది తెలంగాణ యువకుల పచ్చినెత్తురు తాగిన ఒక మహానుభావుడి విగ్రహం హైదరాబాద్ గుండెలపై ఇప్పటికీ భద్రంగా గంభీరంగా నిల్చున్నది. ఆయన పేరిట పార్కులుంటాయి. సంస్థలుంటాయి. హైదరాబాద్‌లో కూడా వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తుంటారు. ఎందుకని? నాగార్జునసాగర్‌ను తెలంగాణకు సరిగ్గా అక్కరకు రాకుండా చేసిన మహానుభావులు కొంతమందికి అపర భగీరథులు. వారి పేరిట పురస్కారాలు, భవనాలు వెలుస్తాయి. ఎందుకని? రైతులను కాల్చి చంపించిన వారు, ఎన్‌టిఆర్‌ను పదవి నుంచి దింపి, చంపిన వారు, హైదరాబాద్‌ను ఒక వలస కాలనీగా మార్చిన వారు, తెలంగాణకు వ్యతిరేకంగా అన్నిరకాల కుట్రలు చేసినవారు ఎవరు? వారు తెలంగాణకు ఏమవుతారు? ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎవరి పక్కన నిలబడి నిజాంను విమర్శిస్తున్నారు? తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించాలని సకల ప్రయత్నాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు ఏం వరుస అవుతారు? వ్యతిరేక దృష్టితో చూస్తే ప్రతి నాయకుడిలో ఒక నిజాం కనిపించడం లేదా? కమ్యూనిస్టులు ముందుగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత నెహ్రూ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు.
    పార్లమెంటు పందులదొడ్డి అని ఎన్నికలకూ దూరంగా ఉన్నారు. కొందరయితే దేశానికి స్వాతంత్య్రమే రాలేదన్నారు. కానీ సాయుధ పోరాటం కొనసాగించడం తప్పని ఆ తర్వాత నిర్ణయించుకున్నారు. స్వాతంత్య్రం కూడా వచ్చిందన్నారు. పార్లమెంటుకూ దూరంగా ఉండడం మంచిది కాదనీ తీర్మానించుకున్నారు. నెహ్రూపై తమ వైఖరి మార్చుకున్నారు. సుభాష్‌చంద్రబోస్‌ను ఒకప్పుడు నాజీ ఏజెంటు అని నిందించినవారు తమ అభిప్రాయాలు సత్యదూరమనుకున్నారు. దేశభక్తుడంటున్నారు. అంటే చరిత్రలో అభిప్రాయాలు నిశ్చలంగా ఏమీ లేవు. తెలంగాణలో మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, పేదలకు భూములను పంచిన నాలుగు వేల మంది మెరికల్లాంటి కమ్యూనిస్టు యోధులను ఊచకోత కోయించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, జనరల్ చౌదరి బీజేపీ వారికి ప్రీతిపాత్రులు. కమ్యూనిస్టులకు పరమ వ్యతిరేకులు.
      గుజరాత్‌లో మారణహోమం జరిగిన సందర్భంలో మోడీని దేశం ఎలా చూసింది? ఇప్పుడు ఎలా చూస్తున్నది? ఎంతోదూరం ఎందుకు? జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తునిగా మలిచే మహానుభావులూ తయారయ్యారు. మనలను ప్రభావితం చేసిన పరిణామాల నుంచి ఆయా కాలాల ప్రముఖులపై అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. అదే వాస్తవం కాదు, అదొక్కటే వాస్తవం కాదు.
         వ్యతిరేక దృష్టితో చూస్తే గతమంతా చీకటిగానే కనిపిస్తుంది. నిజాంను చూసిన కళ్లతోనే సమైక్యపాలనను చూస్తే ఎలా ఉంటుంది? సమైక్యపాలన అంతా దోపిడీపాలనగానే చూడడం న్యాయమవుతుందా? విద్య, వైద్యం, రోడ్డు రవాణా, నీటిపారుదల, ఐటి రంగాల్లో వచ్చిన అభివృద్ధిని పూర్తిగా విస్మరించగలమా? స్కూళ్లు, ప్రాజెక్టులు వస్తే జనం తెలివిన పడతారు. మన మాట వినరు. మన పెత్తనం నడవదు అని తమ ఊర్లకు వాటిని రాకుండా చూసిన భూస్వామ్యవర్గాల నాయకులు తెలంగాణలో కొల్లలు. 
      ఆలస్యమయితే అయ్యింది కానీ మా ఊరికి ఉన్నతపాఠశాల వచ్చింది 1975లో. అంతకు ముందు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవలసివచ్చేది. 1948 వరకు మా వాళ్లంతా విధిగా ఉర్దూలోనే చదువుకోవలసి వచ్చేది. తెలుగులో చదువుకునే అవకాశాలు లేవు. నిజాం తెలంగాణ ప్రజలను తెలుగు భాషకు దూరం చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సంపర్కం వల్ల కొన్ని రంగాలలో అభివృద్ధి వేగవంతమైన మాట వాస్తవం. ప్రపంచ వాణిజ్యపటంలో హైదరాబాద్ పేరు వినిపిస్తున్నదీ అంటే ఇక్కడ గత యాభైయ్యేళ్లలో జరిగిన అభివృద్ధి కూడా కారణం. ఔషధ, ఐటి పరిశ్రమల విషయంలో దేశంలో ఏ నగరానికీ తీసిపోని పేరు ప్రఖ్యాతులు హైదరాబాద్‌కు దక్కాయి. నాగార్జునసాగర్, జూరాల, శ్రీరాంసాగర్, ఎస్సెల్‌బీసీ వంటి కొన్ని ప్రాజెక్టులయినా పూర్తయింది సమైక్యపాలనలోనే.
         కాసు బ్రహ్మనందారెడ్డి, ఎన్‌టిఆర్, చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి వంటివారు అసలే మంచి చేయకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. ఎన్‌టి రామారావు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చారు. బూజుపట్టిన రాజకీయాలను బదాబదలు చేసి పూర్తిగా ఒక కొత్త తరం నాయకత్వాన్ని తెలంగాణకు పరిచయం చేశారు. కానీ కాసును, చంద్రబాబును, రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ఎందుకు ప్రేమించడం లేదు. తెలంగాణకు ఎక్కువగా అన్యాయాలు జరిగింది వారి పాలనలోనే. తెలంగాణ ఎక్కువగా వివక్షలపాలైంది వారి ఏలుబడిలోనే. తెలంగాణ రాష్ట్ర కాంక్షకు అడ్డంగా నిలబడి, ప్రత్యక్షంగా ఉద్యమకారులతో తలపడిందివారే. వీరంతా హైదరాబాద్‌లో ప్రైవేటు సామ్రాజ్యాలు నిర్మించడానికి, సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి పాటుపడ్డారు. నిజాం వేల కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు, భూములు, చెరువులు తెలంగాణకు అందించిపోయారు. అందుకే వారికంటే నిజాం ఉన్నతంగా కనిపిస్తారు. ఇది చేదు నిజం. అందరికీ అంత తొందరగా జీర్ణం కాదు.