* 300 అడుగులతో రింగ్ రోడ్డు.. రూ.1600 కోట్లతో అంచనాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వరంగల్ వేదిక కానుంది. 300 అడుగుల వెడల్పుతో వరంగల్ చుట్టూ 73 కిలోమీటర్ల ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవ లం హైదరాబాద్ చుట్టు మాత్రమే 500అడుగు ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌బీశాఖ ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాలతోపాటు మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూడు చోట్ల ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) అధికారులు ట్రైసిటీ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత 2011-2031 మాస్టర్‌ప్లాన్ ప్రకారం 200అడుగుల వెడల్పుతో వరంగల్ చుట్టూ 73 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. కానీ సీఎం కేసీఆర్ సూచనతో 300 అడుగులుగా నిర్ణయించారు. వరంగల్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, నర్సంపేట, ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారుల్లో ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద 500 అడుగుల వెడల్పుతో ఐదు జంక్షన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్‌కు రూ.20కోట్ల నుంచి రూ.23 కోట్లు ఖర్చు కాగలవని అంచనా. 73 కిమీ రోడ్డు కోసం రూ.1600 కోట్లు అవసరమని సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డులో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ములుగు, నర్సంపేట రూట్లలో రాంపూర్, చింతగట్టు, ఐనవోలు క్రాస్‌రోడ్డు, ఆరెపల్లి, ధర్మారం వద్ద 500 అడుగుల వెడల్పుతో జంక్షన్లు నిర్మించనున్నట్లు కుడా ప్లానింగ్ అధికారి ఏ అజిత్‌రెడ్డి టీ మీడియాకు చెప్పారు. ఈ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment