Monday, 30 March 2015

గోదావరిని ఒడిసిపట్టాలె!

* తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం
* ప్రతి నీటిబొట్టూ వాడుకుందాం
పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి
* దేవాదులను గుణపాఠంగా తీసుకోండి
ప్రాజెక్టులపై ఆమూలాగ్రం పరిశీలన జరపండి
* అవసరమైతే 15 రోజుల్లో మళ్లీ సర్వే
* పక్క రాష్ర్టాలతో పంచాయతీలు వద్దు
* ఒక్క ఎకరం ముంపునకు అవకాశమివ్వొద్దు
* నిర్వాసితుల సమస్య తీరాకే ప్రాజెక్టులు
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
* గోదావరిపై సీఎం బృందం ఏరియల్ సర్వే 
* కంతానపల్లి, దేవాదుల, ఇచ్చంపల్లి, కాళేశ్వరం పరిశీలన 
* కంతానపల్లి బాధితులను ఆదుకుంటామని భరోసా 
దేవాదులలో ఉన్నతస్థాయి సమీక్ష
  గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్నదైనా, నూతనంగా చేపట్టేదైనా ప్రాజెక్టులన్నీ తెలంగాణను సస్యశ్యామలం చేసి భవిష్యత్తు తరాలకు కూడా శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఉద్బోధించారు.
      ఈ దృష్టితో ఆయా ప్రాజెక్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో లోపాలు సవరించి రీ డిజైన్ చేయాలని సూచించారు. ఇష్టారాజ్యపు ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాలకు దేవాదుల ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని, వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందని దుస్థితినుంచి గుణపాఠం నేర్చుకోవాలని కేసీఆర్ అన్నారు. లోపాలన్నీ సమర్థంగా సవరించుకున్నప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా, బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల డిజైన్లను, నీటి స్థిరీకరణ, ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వంటి అంశాలను అన్నింటికీ మొత్తానికి మొత్తం సమీక్షించి అన్నీ సరిచూసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ర్టాలతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్దేశించారు. గోదావరి నదిపై ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ అన్ని విషయాలు తేల్చలేక పోవచ్చు.. మరో 15 రోజులు సమయం తీసుకొని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సంపూర్ణ నీటి వినియోగ ప్రణాళికలు రూపొందించండి అని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరోసారి గోదావరి నదిపై ఇంజినీరింగ్ నిపుణులతో పూర్తిస్థాయి ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. 
ప్రతి చుక్కా వాడుకోవాల్సిందే..!
గోదావరి నదికి సంబంధించిన ఒక్క చుక్క నీరు కూడావదలకుండా ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. సీమాంధ్రుల పాలనలో ఇప్పటిదాకా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. తెలంగాణ వచ్చాక కూడా అందుకు అవకాశం ఇవ్వరాదని ఆయన భావిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పక్కరాష్ర్టాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నది కేసీఆర్ స్థిర నిశ్చయంగా ఉంది. ఆదివారం గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్ అనేక విషయాలను గమనించారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ రాష్ర్టానికి ఉపయోగపడదని నిర్ధారించారు. దేవాదుల, కంతానపల్లి ప్రాజెక్టులను రీ సర్వే చేయాలని నిర్ణయించారు. కంతానపల్లి దగ్గర మరో ప్రాజ్టెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దేవాదుల, ఇచ్ఛంపల్లి, మెట్టగడ్డ ప్రాంతాల్లో కొత్త బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రజలకు నష్టం కలుగకుండా, ఒక్క ఎకరం ముంపునకు గురికాకుండా చూడాలని సీఎం మనోగతంగా ఉంది. సీమాంధ్రుల పాలనలో ప్రాజెక్టులు ఇష్టానుసారం రూపొందించారని, వాటికి జీవం కల్పించాలంటే మళ్లీ సర్వే చేయాల్సిన అవసరం ఉందని భావించారు. 
ఏరియల్ సర్వే చేసిన సీఎం..
గోదావరి నదిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. నదిపై నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాలను ఆయన విహంగ వీక్షణం చేశారు. హన్మకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఏటూరునాగారం మండలం కంతానపల్లి, దేవాదుల, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని ఇచ్ఛంపల్లి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఒక హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, మరో హెలిక్యాప్టర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగరరావు, నీటిపారుదల ఉన్నతాధికారులు మురళీధరరావు, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ముందుగా కంతానపల్లిలో దిగిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నీటిపారుదల అధికారులు గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ మ్యాపులు, స్పిల్‌వే, బ్యారేజ్ నమూనాలు తదితర విషయాలను ఇంజనీరింగ్ నిపుణులు సీఎంకు వివరించారు.
ముంపు గ్రామాలపై సీఎం ఆరా..
ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రజల ఆర్థిక స్థితిగతులను సీఎం ఈ సందర్భంగా ఆరా తీశారు. ఏటూరునాగారం మండలం కంతానపల్లి, సింగారం, ఏటూరు గ్రామాలు పూర్తిగా, మరో ఐదు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. సీఎం మధ్యలో కలుగజేసుకొని ఈ గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇండ్లుంటాయి? అని ఆరా తీశారు. జిల్లా యంత్రాంగంతోపాటు నీటిపారుదల అధికారులు ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 890 ఇండ్లు ఉంటాయని అధికారులు బదులిచ్చారు.
             ఆ ఇండ్ల స్వభావం ఎటువంటిది? అని కూడా సీఎం అడిగారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ మనకు అందిన సమాచారం ప్రకారం అన్ని ఇండ్లు కూడా సెమీపర్మనెంట్, కొన్ని పర్మినెంట్ ఇండ్లుంటాయని చెప్పారు. కంతానపల్లి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 10,500 కోట్లని, అందులో స్పిల్‌వే, బ్యారేజ్ నిర్మాణం తదితర అంశాల వారీగా అంచనాలను సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టు వద్ద దాదాపు అర గంటసేపు గడిపిన కేసీఆర్ గోదావరి నదిని పరిశీలించారు. గోదావరి ఆవల ఖమ్మం జిల్లా వాజేడు మండలానికి చెందిన ఆర్లగూడెం, గెర్రగూడెం, పెరూర్, చంద్రుపట్ల, గంగారం, టేకులగూడెం గ్రామాలున్నాయని అందులో అందులో దాదాపు మూడు గ్రామాల దాకా కంతానపల్లి పరిధిలోకి వస్తాయని అయితే అవి పూర్తిస్థాయిలో ముంపునకు గురవుతాయా? లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంటుందని బదులిచ్చారు. అనంతరం అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో గోదావరిపై సర్వేకు బయలుదేరారు. దేవాదుల, కాళేశ్వరం, ఇచ్ఛంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థలాలన్నీ ఏరియల్ సర్వే నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో దేవాదులకు చేరుకున్నారు. అక్కడ ఇంటెక్‌వెల్‌ను సందర్శించారు. దేవాదుల అతిథిగృహంలో మధ్యాహ్న భోజన విరామం ముందూ అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, కలెక్టర్ వాకాటి కరుణ, హైదరాబాద్ నుంచి వచ్చిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, దేవాదుల, కంతానపల్లి ఎస్‌ఈ, ఈఈలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
పరిహారం చెల్లించాకే....
కంతానపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో వ్యహరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వారికి సంతృప్తి కరమైన నష్టపరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. కంతానపల్లి, దేవాదులలో తనను కలిసిన కంతానపల్లి నిర్వాసితులతో సీఎం మాట్లాడారు. మీరు బాగుంటేనే ప్రాజెక్టు బాగుంటుంది. మీరు సంతోషంగా ప్రభుత్వానికి సహకరించండి. మిమ్మల్ని ఎల్లకాలం సంతోషంగా ఉంచే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి కంతానపల్లి నిర్వాసితులతో అన్నారు. 
                   నష్టపరిహారం విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది.. ఈ విష యం లో భూ నిర్వాసిత చట్టాలకన్నా ఎక్కువగా మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని సీఎం అధికారులకు హితవు పలికారు. ఈ విషయంలో భూ నిర్వాసితులకు ఏం చేస్తే న్యాయం జరుగుంది? వారి జీవితాలు శాశ్వత ప్రాతిపదికన బాగుండాలంటే ఏం చేయాలో ఆలో చించి ఒక నివేదికను అందజేయాలని కలెక్టర్ వాకాటి కరుణ, ఇతర శాఖల అధికారులు ఆదేశించారు. ఆదివాసీ సంఘాలతోనూ సీఎం మాట్లాడారు. సీఎం పర్యటనలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.- (నమస్తే తెలంగాణ)

Thursday, 26 March 2015

ప్రకృతి ఒడిలో ప్రయాణం..ఫరహాబాద్ ఫారెస్ట్‌

    రుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం కావాలనుకుంటే సరదాగా విహారానికి వెళ్లాలనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడని వెతక్కోగలం? ఎంతోదూరం కాదు.. ఎంతో సమయం కాదు.. వంద మైళ్లు.. గంట ప్రయాణం చేస్తే చాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోతారు. కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిలిచిపోతారు. అవును... ఫరహాబాద్ ఫారెస్ట్‌లో అడుగుపెడితే అలాంటి అనుభూతే సొంతమవుతుంది. తెలంగాణలో అతిపెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ వెరీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.
అతి పెద్ద టైగర్‌జోన్..
తెలంగాణలో అతి పెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్ ఫరహాబాద్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేదారిలో.. సరిగ్గా నగరం నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఫరహాబాద్ ఫారెస్ట్ తారసపడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం. అమ్రాబాద్ అటవిలో మరో భాగమే ఫరహాబాద్. ప్రకృతి అందాలకు నెలవు. రంగు రంగుల పక్షులు, రకరకాల జంతువులు. మైమరిపించే నెమలి నాట్యాలు. లేడి పిల్లల గంతులు, కోయిల కిలకిలా రావాలు.. వీటన్నింటినీ చూడ్డానికి మనసు తహతహలాడుతుంది. కానీ అడవిలో ప్రయాణం మరింత సాహసోపేతంగా సాగాలంటే సొంత వాహనాల్లో కాదు.. జీపుల్లో జర్నీ చేయాల్సిందే. పచ్చని అడవిలో జీపులో ప్రయాణం.. కెమెరా కంటికి నిండైన పండుగ. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫరహాబాద్ ఫారెస్ట్ విజిట్ కోసం ప్రత్యేకంగా సఫారి జర్నీ ఆఫర్ చేస్తోంది. రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో జీపులో దాదాపు 8మంది వరకు ప్రయణించవచ్చు. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సఫారీ జర్నీకి అవకాశం ఉంటుంది. 
ఫరహాబాద్ వ్యూ పాయింట్..
  45 నిమిషాల ప్రయాణం. తొమ్మిది కిలోమీటర్లు ప్రయణిస్తే చాలు... అందమైన వ్యూ పాయింట్ కళ్లను కట్టిపడేస్తుంది. మార్గమధ్యంలో జింకలు, కోతుల గుంపులు, నెమలి నాట్యాలు, ఎన్నెన్నో అటవీ జంతువులు, పక్షులు (కొన్నిసార్లు పులులు కూడా) కనిపిస్తాయి. నీటి తావుల చుట్టూ కనిపించే లేడి పిల్లలు, పక్షుల గుంపులను చూడడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక దారి మధ్యలో ఏడోనిజాం విడిది గృహాన్ని చూడవచ్చు.
      నిజాం వేటకు వచ్చి ఇక్కడే విడిది చేసేవారని చెబుతుంటారు. చారిత్రక విశేషం కలిగిన ఈ అతిథి గృహం శిథిలావస్థలో ఉండడం విషాదం. చివరగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ అన్నింటికంటే హైలెట్‌గా చెప్పవచ్చు. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాల్ని చూడ్డం మర్చిపోలేని అనుభూతి. ఎత్తైన కొండమీది చూపు సారించిన దూరం పచ్చని అడవి కనిపిస్తుంది. అటవి మధ్యలో.. బ్రిటీష్ కాలంలో డాక్టర్ రస్సెల్స్ అనే అధికారి తవ్వించిన పెద్ద మానవ నిర్మిత సరస్సు కనిపిస్తుంది. 
 ఈ సరస్సు నాలుగు హెక్టార్లకుపైగా విస్తరించి ఉండడం గమనార్హం. ఇక్కడ క్యాంటి లివర్ బ్రిడ్జి... టూరిజం ప్లాజా ఉండేవి( ప్రస్తుతం లేవు). ఇన్ని అందాల నడుమ సాగే ప్రయాణాన్ని ముగించాలంటే కూడా మనసంగీకరించదు. అలాంటి అనుభూతుల్ని మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే.. మీరూ ఫరహాబాద్‌ని విజిట్ చేయండి మరి. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. (- నమస్తే తెలంగాణ)

Thursday, 19 March 2015

సీఎం కేసీఆర్‌కు 'పాపులర్ ఛాయిస్' అవార్డ్

* సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులో భాగంగా కేసీఆర్ కు పాపులర్‌ చాయిస్‌ పురస్కారం
* కేసీఆర్ తరపున అవార్డు అందుకున్న రాజ్యసభ సభ్యుడు కేకే 

 తె
లంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ ప్రతిష్ట జాతీయస్థాయిలో మరింత ఇనుమడించింది. ప్రముఖ న్యూస్ ఛానల్ ''సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ ఛాయిస్ ఆఫ్ ది ఇయర్- 2014'' అవార్డును సీఎం కేసీఆర్ సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తరపున ఈ అవార్డును రాజ్యసభ సభ్యుడు కేకే అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రజలతో పాటు అమరవీరులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు కేకే చెప్పారు.
          పాపులర్ ఛాయిస్ టైటిల్ పోరుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉద్దండులు పోటీపడ్డారు. ఆరంభం నుంచే టఫ్ కాంపిటిషన్ నడిచింది. కానీ తెలంగాణ సీఎం మాత్రం స్టార్టింగ్ నుంచే పోల్ లో దూసుకుపోయారు. పోలింగ్ ముందుకు సాగుతున్న కొద్దీ తెలంగాణ సీఎంకు అపూర్వమైన స్పందన లభించింది. కేసీఆర్ కు ఇతరులకు తేడా స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ పాపులారిటీ ముందు పలురంగాలకు చెందిన ప్రముఖులు వెనుకబడిపోయారు. పాపులర్ ఛాయిస్ రేసులో కాంపిటీటర్స్ మామూలోళ్లు కాదు.. అరుణ్ జైట్లీ, అమిత్ షా, మమతా బెనర్జీ లాంటి హేమాహేమీలు ఉన్నారు. అనితర సాధ్యమైన పాపులారిటీతో వాళ్లందరినీ వెనక్కు నెట్టి అవార్డును సొంతం చేసుకున్నారు సీఎం కేసీఆర్.
      సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డును నెటిజన్ల ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇంత టఫ్ కాంపిటిషన్ లోనూ సీఎం కేసీఆర్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం మాటలు కాదు. అందుకే యావత్ తెలంగాణ సీఎంకు లభించిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. బంగారు తెలంగాణ సాధన కోసం అహరహం పనిచేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జనమంతా కోరుకుంటున్నారు.
అవార్డులు పొందింది వారు:
అవార్డులు పొందింది వారు ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌: నరేంద్ర మోడీ 
అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌: అజీం ప్రమేజీ, కైలాశ్‌ సత్యార్థి 
పాపులర్‌ చాయిస్‌: కె. చంద్రశేఖర్‌రావు, పి. విజయన్‌ 
రాజకీయం: అరుణ్‌జైట్లీ ( కేంద్ర ఆర్థిక మంత్రి) 
గ్లోబల్‌ ఇండియన్‌: సత్య నాదెళ్ల (మైక్రోసాప్ట్‌ సీఈవో)
 క్రీడలు: జితు రాయ్‌ 
బిజినెస్‌: ఎన్‌. చంద్రశేఖరన్‌ (టీసీఎస్‌) 
వినోదరంగం: చేతన్‌ భగత్‌ (రచయిత) 
ప్రజాసేవ: తంగమ్‌ రినా (జర్నలిస్టు) 

Monday, 16 March 2015

నగరాభివృద్ధికి 330 విభాగాలు

* 330 విభాగాలుగా నగర విభజన.. కమిటీల ఏర్పాటు 
* ఇంటికొక చెట్టు, రెండు చెత్తడబ్బాలు, వీధుల్లో సీసీ కెమెరాలు 
* వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ 
* కాలినడకన కలియతిరుగుతూ సమస్యల పై ఆరా
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగోలు ప్రాంతంలోని వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో మార్చి 15న సీఎం పర్యటించారు. నగరాన్ని 330 విభాగాలుగా విభజించి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, గవర్నర్, సీఎస్, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలు వేస్తామన్నారు. ఈ కమిటీల ద్వారా వారికి కేటాయించిన కాలనీలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలంతా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రక్షణ కోసం చందాలు వేసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెంకటరమణ కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా చందాలతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సీఎం ప్రారంభించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తూ స్వయంగా వెయ్యి రూపాయల చందాను కాలనీ సంఘానికి అందజేశారు. ఎవరో వచ్చి ఏమో చేస్తారని ఆలోచించకుండా మనకు మనమే సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా ప్రతి ఇంట్లో రెండు చెత్త డబ్బాలు.. ప్రతి ఇంటికి చెట్టు.. రోడ్లకు ఇరువైపుల సుగంధ వాసననిచ్చే ఆయుర్వేద మొక్కలు.. ప్రతి కాలనీలో మహిళ, యువత, విద్యార్థులు కలిగిన వేర్వేరు కమిటీల ఏర్పాటు.. వివిధ విభాగాలతో గ్రేటర్‌ను గ్రీనరీగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. 
దేవుడి ఆశీస్సులతో...
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటరమణ, మమతానగర్ కాలనీలతోనే అభివృద్ధి ఆరంభం అవుతుందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగేలా ఈ రెండింటినీ మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలన్నారు. ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యెగ్గె మల్లేశం చేత రెండు సీసీ కెమెరాలను ఇప్పించాలని సూచించారు. కాలనీలో ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌కు ఆదేశించారు. గత ప్రభుత్వాలు నగరానికి హైటెక్ సిటీగా పేరు తెచ్చామని చెపుతున్నారు.. కానీ నగరంలోని ప్రతి కాలనీలో సమస్యలున్నాయని అన్నారు. శివారులో ఉన్న బీహెచ్‌ఈఎల్‌లోని ప్రగతినగర్ కాలనీని సందర్శించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం తరుపున రెండు బస్సుల్లో మమతానగర్, వెంకటరమణ కాలనీ వాసులను తీసుకెళ్తుందన్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులే స్ఫూర్తిగా ఈ కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రగతినగర్‌కు దోమలు లేని కాలనీగా పేరుంది. ఆ కాలనీలో ఔషధ మొక్కలు పెంచడమే అందుకుకారణమన్నారు. 
కాలనీలు కలియతిరిగి...
నాగోల్ ప్రాంతంలోని వెంకటరమణ, మమతా నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్వయంగా కాలినడకన కలయతిరిగారు. నగరంలోని ప్రజలకు నేను ఉన్నా అంటూ.. సీఎం భరోసా ఇచ్చారు. కాలనీలోని ఖాళీస్థలాలతో పాటు, శ్మశాన వాటికను సందర్శించి పలు సూచనలు చేశారు. విదేశాల తరహాలో జీహెచ్‌ఎంసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. 
శాంతి భద్రతల సంఘం....
కాలనీలోని యువకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలతో వేరువేరుగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. దీంతో కాలనీలోని ప్రతి ఒక్కరిని గుర్తుపట్టడానికి వీలుంటుందన్నారు. కాలనీలో నివసిస్తున్న, అద్దెకు ఉంటున్నవారి వివరాలను తీసుకోవడంతో దొంగల ఆచూకీని సీసీ కెమెరాలతో తెలుసుకునే ఆవకాశం ఉంటుందన్నారు. విభాగాల వారీగా ఉన్న కమిటీలు కలిసి శాంతి భద్రతల సంఘం కమిటీని నియమించుకొని సమస్యలను చర్చించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యొగ్గె మల్లేశం, వీరమల్ల రాంనర్సింహగౌడ్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, వస్పరి శంకర్, జిన్నారం విఠల్‌రెడ్డి, తుమ్మల పల్లి రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగన్‌గౌడ్, జహీర్‌ఖాన్, పాండు గౌడ్, రాగిరి ఉదయ్‌గౌడ్, మమతానగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 
మాటలు కాదు.. చేతల సీఎం
  సీఎం కేసీఆర్ పర్యటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించిన సీఎం కేసీఆర్... అంటూ కీర్తించారు. పదికాలాల పాటు సీఎం చల్లగా ఉండాలని దీవించారు. సీఎం కేసీఆర్ కాలనీకి వస్తానని చెప్పడమే కాదు.. ఆదివారం నాగోల్ ప్రాంతంలోని మమతానగర్, వెంకటరమణ కాలనీ వీధుల్లో కాలినడకన తిరిగి సమస్యలపై ఆకలింపు చేసుకున్నారు. కాలనీలను ఎలా తీర్చిదిద్దుకోవాలో విడమరిచి చెప్పారు. సున్నితంగా మందలిస్తూ ఆపై అన్ని సమస్యలు తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. కాలనీల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచనలు చేస్తూ అందుకు ఓ కథను చెప్పి ప్రజలను తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. సీఎం కేసీఆర్ సొంత మనిషిలా తమ కాలనీలోని వీధుల్లో తిరుగుతూ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు అభివృద్ధికి నిధులు ఇస్తానని హమీ ఇవ్వడంతో కాలనీవాసులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని, సినిమాల్లోనే చూశామంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రియల్ హీరో.. అంటూ జేజేలు పలికారు. 
జీవితాంతం రుణపడి ఉంటాం...
-మమతానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
మాట ఇచ్చి.. మళ్లీ వచ్చి మాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. మా కాలనీ సమస్యలన్నీ తీరిపోతే సుందరకాలనీగా మారుతుంది. రోడ్ల కోసం రూ. 2.20 కోట్లు మంజూరు చేయాలని కోరాం. సీఎం మా దగ్గరకొచ్చి.. మాతో మాట్లాడటం మా అదృష్టం. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి మూసీ వరకు ఉన్న ఓపెన్ నాలా బాగు చేయాలని కోరాం. కాలనీ అధ్యక్షుడిని పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రియల్ హీరో కేసీఆర్. సాధారణంగా సీఎంలు మాటలతోనే సరిపెడతారు.. కాని మన సీఎం కేసీఆర్ చేతల సీఎం. 
- నమస్తే తెలంగాణ,

Saturday, 14 March 2015

పాలమూరులో పాపికొండలు

పాపికొండలంటే గుర్తొచ్చేది గోదారమ్మే! కానీ.. అంతే స్థాయిలో కృష్ణమ్మ పొదువుకున్న సింగారాలున్నాయి! ఎత్తయిన కొండల మధ్య.. కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ.. ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు.. వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది! పడవ బయల్దేరితే..  ఆప్యాయంగా పలకరిస్తుంటుంది! మొన్నటిదాకా పోలీసులు, మావోయిస్టుల తుపాకులు పలకరించుకున్న ప్రాంతం.. ఇప్పుడు జాలర్లు హైలెస్సా అంటూ పాడే పాటలకు మౌనంగా గొంతుకలుపుతున్నది! అసలు అంతటి అద్భుత ప్రాంతం కృష్ణమ్మకు సొంతమని చాలా తక్కువ మందికే తెలుసు! అక్కడికి వెళ్లేవావరు? ఆ అందాలు వెలికి తీసి.. బయటి ప్రపంచానికి చాటేదెవరు? నమస్తే తెలంగాణ ఆ ప్రయత్నం చేసింది! బాధ్యత తీసుకుంది! భావి తెలంగాణలో మరో అద్భుత పర్యాటక ప్రాంతమయ్యేందుకు సకల అర్హతలూ ఉన్న ఒక ప్రకృతి నిలయాన్ని అత్యంత సాహసానికోర్చి.. కన్నులారా చూసింది! తన కళ్లతో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది!! ఎవరా ప్రకృతి రమణి? ఎక్కడుందా రమణీయ కాంతి? 
  హైదరాబాద్ నుంచి దాదాపు దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది. అలాగే కొల్లాపూర్ సమీపంలో పుణ్య క్షేత్రమైన సోమశిల, అమరగిరి తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు ఇలాంటి మరబోటులను ఏర్పాటు చేయవచ్చు.
సోమశిల నుంచి సుమారు 10 గంటలపాటు నదిపై మరబోటు ప్రయాణం చేస్తే శ్రీశైలం రిజర్వాయరు డ్యాం, పాతాళగంగకు చేరుకుంటారు. కొండకోనల్లో కృష్ణానది వంపు సొంపులుగా తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. పచ్చటి కొండల మధ్య చుట్టూ కనిపించే దట్టమైన అటవీ ప్రాంతాన్ని చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పేరెన్నికగన్న పర్యటక ప్రాంతమైన పాపికొండలను తలదన్నేట్లుగా ఉన్న నల్లమల కొండల మధ్య కృష్ణానదిలో ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే పాలమూరులో పూర్తిగా వెనకబడిపోయిన కొల్లాపూర్ నియోజకవర్గం రూపురేఖలు మొత్తం మారిపోతాయి. తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున మత్స్య సంపదకు మూల వనరుగా ఈ ప్రాంతం మారే అవకాశముంది. నవతెలంగాణ కల సాకారమవుతున్న వేళ...
          అక్కడ దట్టంగా విస్తరించి ఉన్న నల్లమల అందాలను ఆవిష్కరించే ప్రయత్నానికి ‘నమస్తే తెలంగాణ’ పూనుకున్నది. ఇది వరకు వెలుగు చూడని ఈ ప్రాంతాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉన్నా గట్టి సంకల్పంతో పని పూర్తి చేసింది. అన్వేషించదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ, క్లిష్టమైన ప్రయాణం కాబట్టి అమరగిరుల అందాలను పరిమితంగానే వెలుగులోకి తీసుకొచ్చింది.
సోమశిల నుంచి శ్రీశైలం
సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదీ తీరంలో వరుసగా నిలబడి ఉన్న కొండలు, గట్లు కనువిందు చేస్తాయి. ఒక్కో కొండపై ఒక్కో రకమైన నేల స్వభావం కలిగి ఉంటుంది. పక్కపక్కనే ఉన్న కొండల్లో కూడా చెట్లు పెరిగిన తీరులో కనిపించే రంగులో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొండల ఆకారాలు ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. అక్కడక్కడా రాళ్లతో కూడిన కొండలు సూర్యకాంతిలో బంగారు వర్ణంతో మెరిసిపోతుంటాయి. ఓ కొండ గుబురు చెట్లకు నిలయమైతే మరో కొండలో అక్కడక్కడ చెట్లు విస్తరించిన గడ్డితో ఉంటాయి. కోతులు, తిమ్మన్నలు, నెమళ్లు, చిరుతలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక నుంచి ఇక్కడి వరకు నిలిచిన కృష్ణమ్మ చలచల్లని గాలికి చిన్న చిన్న అలలుగా పలకరిస్తూ ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. సోమశిల నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే పచ్చని అందాలు కనువిందు చేస్తుంటాయి. ఎత్తైన కొండలు... ఆ కొండలను ఆవరించిన పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలితో స్వాగతం పలుకుతాయి... ఇంకొంచెం ముందుకు సాగగానే.. నీట మునిగిన అమరగిరి ఊరు ఆనవాళ్లు.. పునరావాసం పొందిన గ్రామాలు కనిపిస్తాయి. నీటి మునిగిన అమరగిరికి గుర్తుగా ఓ పెద్ద రావిచెట్టు, భక్తి పారవశ్యాన్ని కలిగించే శివలింగం దర్శనమిస్తాయి. అక్కడ ఉండే సొరంగం ఎక్కడి వరకు ఉంటుందో అంతు తెలియదని అందులో పెద్ద బొంగులు తోసినా లోపలికే వెళతాయని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీశైలం రిజర్వాయరు నిర్మాణం కోసం నీట మునిగిన పాత అమరగిరి, మారుగుంది, ఎర్రమటం, మాడ్గుల, రాంపురం, ముక్కిడి గుండం, నార్లాపూర్, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలు ఈ ప్రవాహం కిందే ఉంటాయి. నీటి మట్టం తగ్గితే తప్ప వాటి ఆనవాళ్లను మనం చూడలేం. అయితే నదికి ఇరువైపులా ఆదివాసీలు, చెంచులు, జాలరులు చేపలవేటే ప్రధాన వృత్తిగా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారానికొకసారి సమీపంలో ఉన్న కొల్లాపూర్ సంతకు రావడమే తప్ప బాహ్య ప్రపంచం వీరికి తెలియదు. 
ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ.. జొన్నల రాశిని గుర్తుకు తెచ్చే జొన్నలరాశి బోడ గట్టు, అమరగిరి ద్వీపాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం నీటిని తోడిపోసే ప్రదేశం.. ఎత్తిపోతలపై సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది. జానపండ్లకు పేరెన్నికగన్న జానళ్లకొండలు, మత్స్యకారులు నివాసం ఏర్పాటు చేసుకున్న ఎర్రగుండు, ఒకప్పుడు ఎర్రగట్టు బొల్లారంగా పేరెన్నికగన్న కోతిగుండు కనిపిస్తాయి. విశాలమైన నదీ పరీవాహక ప్రాంతం ‘దుర్గం బయలు’గా కనిపిస్తోంది. కొండలు, గుట్టలు ఉన్నా అక్కడికి దూరంగా ఉండటం వల్ల నది విస్తారంగా ఆవరించి కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు వైపు సాగుతున్న ప్రయాణంలో గుండ్లపెంట, సోములకుంట, సోములకుంటవాగు, బేతంచర్ల కాలువ, ఒకప్పుడు వరదకు కొట్టుకొచ్చి గట్టుకు చేరడంతో ఆ పేరొచ్చిన ఎద్దులకొండ, లింగమయ్యపెంట, ఒకప్పుడు అధికంగా గొర్రెలు మేతకు వచ్చే ‘తుమ్మతోక’ కనువిందు చేస్తాయి. బంగారు రంగుతో కనిపించే దేవుని కొండ, పచ్చగూటి, నీటి గంగ, ప్రమాదాలు పొంచి ఉన్న సుడిగుండాలు అచ్చెరువొందిస్తాయి. 
మత్స్యసంపద
నిత్యం 50కిపైగా మరబోట్లతోపాటు పుట్టీల ద్వారా వందల సంఖ్యలో మత్సకారులు చేపల వేట, వ్యాపారం చేస్తారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేసిన వారు కోట్లకు పడగపూత్తినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రా వేటగాళ్ల అడ్డాలు
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు ప్రధానంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. సుమారు 50 ప్రాంతాల్లో వీరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికులు అడ్డుకొని కేసుల దాకా వెళ్లినా వారి ఆధిపత్యం కొనసాగుతోంది. స్థానిక వ్యాపారులు కొందరు వారికి అడ్వాన్సులు చెల్లించి చేపలను సేకరిస్తుంటారు. 
అపారమైన కలప
నల్లమలలోని విలువైన తదితర కలప ఈ నీటి ద్వారా సరఫరా అవుతోంది. కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా చెట్టను కొట్టి పుట్టీల్లో తరలిస్తున్నారు. ఈ విధంగా ఓ భారీ మొద్దు తరలించేందుకు రూ. 5వేల వరకు కూడా వెచ్చిస్తున్నారు. 
పర్యాటకానికి భారీ అవకాశం
పేరు గాంచిన అనేక పర్యాటక స్థలాలతో పోలిస్తే సోమశిల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పర్యటన చాలా రెట్లు ఆహ్లాదభరితంగా ఉంటుంది. వాస్తవానికి 2002 సెప్టెంబరులోనే శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు పర్యాటక శాఖ వారు సోమశిల సమీపంలోని చెల్లెపాడు వద్ద శైలశిరి పేరుతో ఓ బోటును నిర్మించే పనిలో ఉండగానే.. మావోయిస్టులు దాన్ని పేల్చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు. పర్యాటక శాఖ చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని నిపుణులతో పూర్తి స్థాయిలో సర్వే చేసి కొంతమేరకైనా అభివృద్ధి చేస్తే ప్రతి సంవత్సరం ప్రాజెక్టులో నీరు బాగా ఉండే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి పర్యాటకుల నుంచి లాభం చేకూరే అవకాశం ఉన్నది. నవ తెలంగాణ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారనుంది. పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనున్నది.
   ఆకుపచ్చటి రంగు పులుముకొని.. నిటారుగా నిలబడి గంభీరంగా మనకేసి చూస్తుండే దట్టమైన నల్లమల కొండలు. అనంతమైన అందాలను ఇముడ్చుకున్న ఈ దుర్గమారణ్యాన్ని సరిగ్గా మధ్యలోకి చీలుస్తూ.. సుడులు తిరుగుతూ.. చిట్టిపొట్టి జలపాతాలన్నింటినీ తనలో కలిపేసుకుని బిరాబిరా ముందుకురికే కృష్ణమ్మ. ఈ ప్రవాహపు ధాటికి తలొగ్గి నీటిలోనే దాగిపోయి వేదఘోష చేస్తూ.. కృష్ణవేణికి అంజలి ఘటించే వందలాది గోపురాలు. అడుగడుగునా వర్ణాలు మారుతూ దర్శనమిచ్చే గోవర్ధనాలు. సేద దీరేందుకు.. పంక్తి భోజనాలు చేసేందుకు ఆశ్రయమిచ్చే వృక్షరాజాలు. అలలపై కనిపించి చటుక్కున మాయమయ్యే చిలిపి చేపలు. మదిని స్పృశించే నీటి తుంపరలు. గురితప్పని వేట కోసం కాచుకుని కూర్చున్న చిరుతలు. చెట్టు కొమ్మలపై సయ్యాటలాడే తిమ్మన్నలు. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. వీటన్నింటికీ పున్నమి వెలుగులు కలిస్తే.. మధురమైన కృష్ణా తరంగాల సారంగ రాగాలు. అలాంటి అందమైన అడవుల్లో వడివడిగా సాగే కెరటాలపై ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే.. పాలమూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ప్రచారకాంతి ప్రసరించని నల్లమల అడవుల్లో దాగిపోయి రతనాల రాశుల్లాగా పడి ఉన్న ప్రకృతి అందాలను చూసి తరించాల్సిందే!                                            
ఒకప్పుడు..: దట్టమైన నల్లమల దుర్గమారణ్యం. పగలు పోలీసులు.. రాత్రుళ్లు మావోయిస్టులు ఒకరి ఒకరు ఒకరి కోసం మరొకరు వెతుకులాడిన ప్రాంతం. అన్నల ఉద్యమానికి అడ్డా. ఏ రోజు ఎవరొస్తారో ఎవరికి ఆశ్రయమివ్వాలో..ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో గజగజలాడిపోయిన గ్రామాలు.. ఎక్కడెక్కడో జరిగే ఉద్యమ సంచలనాలకు సంఘటనలకు బీజం పడి.. ఎర్రబావుటా ఆశయాలకు నెలవైన చారివూతక ప్రాంతం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం పొదువుకున్న అందాలు చాన్నాళ్ల వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉండిపోయాయి.
ఇప్పుడు..: పరిస్థితి మారింది. వేగంగా పయనించిన కాలం.. అనేక మార్పులు చేసింది. ఇప్పుడక్కడ ఏ చడీ చప్పుడూ లేదు. అన్నలు లేరు. వారిని వెతికేందుకు పోలీసులూ రారు. మునుపటి భయం వీడి ఆయా గ్రామాల ప్రజలు ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు. అయితే.. ఈ ప్రాంతపు వెనుకబాటుతనాన్ని, ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్న రాబందులు మాత్రం నల్లమల అటవీ సంపదపై కన్నేశాయి. కబళించేస్తున్నాయి. జరుగుతున్న అన్యాయాన్ని నిస్సహాయంగా చూసేవారు కొందరైతే.. కళ్లప్పగించి చూస్తున్నది మరికొందరు. అందుకే.. ఇప్పుటికీ ఈ ప్రాంతం అనామకంగానే ఉండిపోయింది.
చుక్కల కొండ
కృష్ణానదీ ప్రవాహంలో చూపరులను మైమరపించే ప్రదేశం చుక్కల కొండ. నదిలో వెళుతుండగా రెండు ఒడ్ల నుంచి చెట్లు కమ్మేసి ఆకాశం కనిపించదు.. చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ చుక్కల్లా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి చుక్కల కొండ అని పేరు వచ్చింది. 
అక్కమహాదేవి గుహలు
శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. శ్రీశైలం వైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రం. అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది. 
క్లిష్టమైన ప్రయాణం.. కొంచెం ఓపిక పట్టండి
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో నమస్తే తెలంగాణ బృందం చేసిన ప్రయాణం పూర్తిగా సంక్లిష్టమైనది. దాదాపు వంద కిలోమీటర్ల పొడవునా సాగే ఈ నదీ దారిలో మొబైల్ సిగ్నల్ ఉండదు. కిలోమీటరు వెడల్పు ఉండే ఈ ప్రవాహానికి అటూ ఇటూ ఎక్కడో ఒక చోట జాలర్లు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. జాలర్లు నదిలో పేర్చిన చేపల వలలు తగిలితే బోటు గల్లంతే. ఈతరాని వారు జలసమాధి అవుతారు. ఈతొచ్చిన వారు గట్టుకు చేరుకున్నా ఆ తర్వాత ఎటు దిక్కుతోచనంత పెద్ద అడవులవి. అదీగాక.. ఇదే ప్రాంతంలో పుట్టి మునిగి వందల మంది నీటిలో జలసమాధి అయ్యారు. కొన్నాళ్ల క్రితం వెనుకవైపు సిద్దేశ్వరం నుంచి మంచాల కట్ట వైపు వస్తున్న సింగోటం లక్ష్మీనర్సిహ్మ స్వామి వారి భక్తులు 62 మంది నీట మునిగి మరణించారు. అంతకుముందు నల్లమలలో క్యాడర్ నిర్మించిన మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అలియాస్ సాంబశివుడు కూడా ఈ ప్రాంతంలోనే ఇలాగే ప్రయాణం చేస్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇవిగాక నాటు పడవలు, మరబోట్ల ప్రమాదాల్లో అనేక మంది మత్సకారులు చనిపోయారు. అయినా సరే.. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సాధ్యాసాధ్యాలపై అనుమానాలు, శషభిషలు ఎదురైనా అనుకున్న ప్రయాణాన్ని కొనసాగించింది. కేవలం చేపల సరఫరా కోసం మాత్రమే ఉపయోగించే ‘తోకబోటు’లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేకుండానే రిస్కు తీసుకొని మరీ బయలుదేరి గమ్యం చేరుకున్నది. ఓ మంచి ఆవిష్కరణను పరిచయం చేయాలనే దృఢ చిత్తంతో ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వం ముందుకొచ్చి సురక్షితమైన బోట్లు ఏర్పాటు చేస్తేనే ప్రయాణం క్షేమంగా సాగుతుంది. లేదంటే అనవసరంగా కష్టాలు కొనితెచ్చుకున్నట్టే. అందుకే అప్పటిదాకా ఓపికపట్టండి!!
ఆంకాళమ్మ కోట
చీమల తిప్పకు పక్కనే ఆంకాళమ్మ కోట ఉన్నది. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉంది. కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు, చెంచులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈకోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గుప్త నిధుల వేటలో కాళికాదేవి విగ్రహం కూడా శిధిలమైంది. కొన్నేళ్ల క్రితం మత్స్యకారులు, చెంచులు చందాలు పోగు చేసుకొని కాళికాదేవి విగ్రహాన్ని పునఃవూపతిష్ఠించి గుడిని నిర్మించారు.

నదీ తీరంలో 600 అడుగుల ఎత్తయిన దుర్బేధ్యమైన ఈ కోటలోకి మత్స్యకారులు, చెంచులు నడిచి వెళ్లేందుకు మార్గం సుగమమం చేశారు. కోటపైన సుమారు 20 ఎకరాల్లో దట్టమైన అడవి విస్తరించి ఉన్నది. ఈ గుట్టపై స్నానాల గుండం ఉండడం కూడా విశేషం. ఆంకాళమ్మ .. పేరు వినేందుకు భయంకరంగా ఉన్నా గుడిలోని అమ్మవారు మాత్రం సింహాసనంపై ఆసీనురాలై ప్రశాంత వదనంతో భక్తులకు అభయహస్తం ఇస్తూ కనిపిస్తుంది. గతంలో ఇక్కడ రాజుల కాలంలో జాతర కూడా జరిగేదని, మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులు చెబుతున్నారు. అమ్మవారి ముందు పొట్టేలు, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి పూజారులు చెంచులు. వాళ్లే అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తారు. కొల్లాపూర్ నల్లమల అటవీ తీర గ్రామాలైన అమరగిరి, మొలచింతలపల్లి, సోమశిల, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, దుర్గం, కొల్లాపూర్‌తో పాటు వివిధ చెంచు గ్రామాల నుంచి భక్తులు ప్రతి మంగళవారం తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కోటలోకి వెళ్లగానే ముందుగా ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత కాళికాదేవి విగ్రహం కొలువు తీరి ఉన్నది. అక్కడికి కొంత దూరంలో స్నానాల గుండం ఉంది,. అదే మార్గంలో శివుడు, వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కోటపైకి ఇప్పుడిప్పుడే భక్తుల సందడి పెరుగుతుండటంతో ఆంకాళమ్మ కోటకు పూర్వ వైభవం దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ కోటను దశాబ్దం క్రితం అప్పటి పురావస్తు డైరెక్టర్ డాక్టర్ వీవీ కృష్ణశాస్త్రి, ఈమని శివనాగిడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కొప్పుల రాజు సందర్శించి.. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి వారు సూచనలు చేసినా లాభం లేకుండా పోయింది. 
చీమల తిప్ప 
సోమశిల నుంచి నదిలో మూడు కిలోమీటర్లు పయనిస్తే నయనమనోహరంగా కనిపించే ‘చీమల తిప్ప’ ద్వీపం ఎదురవుతుంది. విశాఖ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్స్యకారులు 20 ఏళ్ల క్రితమే ఇక్కడికి వలస వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. చేపల వ్యాపారానికి ఈ తిప్ప ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఇక్కడి నుంచే ఏటా కోట్ల రూపాయల చేపల వ్యాపారం జరుగుతున్నది. అక్కడ నివసించే మత్స్యకారుల పిల్లలకు చదువు ఉండదు. కనీస వసతులు ఉండవు. 2009లో వచ్చిన వరదల్లో గట్టు పైకి వెళ్లి తలదాచుకున్నారు తప్ప..ఇప్పటికీ వారు తిప్పను వదలలేదు. ఆ పక్కనే ఉన్న ఆంకాలమ్మ కోటపై నుంచి చీమల తిప్పను చూస్తే ఆ అనుభూతిని వర్ణించడం సాధ్యం కాదు.- నమస్తే తెలంగాణ

Friday, 13 March 2015

మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం

* మన ఊరు- మన చెరువు పథకాన్ని సదాశివనగర్‌లో ప్రారంభించిన సీఎం కేసీఆర్ 
* పూడిక మట్టి తవ్వి.. తట్ట మోసిన ముఖ్యమంత్రి
* తెలంగాణ భుజాలపై మరో చరిత్రాత్మక సంకల్పం
* రాష్ట్రంలో 46వేల పైచిలుకు చెరువులు
* అన్నింట్లోనూ పూడిక పోవాలె
* అదృష్టం బాగుండి ఒక్క సంవత్సరం కాలమైతే..మూడేండ్లదాకా కరువు మర్రి చూడదు
* అందరం కలిస్తే మిషన్ విజయవంతమైతది
* దొంగ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి
* మిషన్ కాకతీయ ప్రారంభోత్సవంలో కేసీఆర్
* ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాల జల్లు
* కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పాటుకు హామీ
  మరో చరిత్రాత్మక సంకల్పాన్ని తెలంగాణ భుజానికెత్తుకున్నది! సమైక్య పాలకుల దశాబ్దాల వివక్షను సమాధి చేస్తూ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తన ఆయువుపట్టయిన చెరువులను పునరుద్ధరించుకునేందుకు ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది! వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి.. దశాబ్దాలుగా నిర్లక్ష్యం పూడుకుపోయిన దాదాపు 46వేలకుపైగా చెరువులను మళ్లీ జలకళలాడించేందుకు కంకణం కట్టుకున్నది! అపురూపమైన ఈ సందర్భానికి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువు వేదికైంది! పూడికతో నిండిపోయిన పాత చెరువు.. ఇప్పుడు కొత్త కాంతులీనేందుకు తయారవుతున్నది! కొత్తనీటిని పొదువుకుని.. చెరువుపై ఆధారపడిన సకల సామాజికవర్గాల బతుకు చిత్రాన్ని మార్చేయబోతున్నది! రాష్ట్రంలో పాత చెరువులాంటి 46వేలకుపైగా చెరువుల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక మిషన్ కాకతీయ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి.. దీనిని పవిత్ర యజ్ఞంలా భావించాలని పిలుపునిచ్చారు. గురువారం పాతచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. మిషన్ కాకతీయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడే గడ్డపార చేతబట్టి చెరువులోని పూడిక మట్టిని తవ్వారు. 
తవ్విన మట్టిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తట్టలో ఎత్తారు. తట్టను మొదట మంత్రి హరీశ్‌రావు నెత్తిమీదకి ఎత్తడంతో ఆయన పక్కనే ఉన్న ట్రాక్టర్లో ఆ మట్టిని వేశారు. ఆ తర్వాత మంత్రి పోచారం, ఏనుగు రవీందర్‌రెడ్డి కలిసి సీఎం కేసీఆర్‌కు మట్టితట్ట నెత్తికెత్తారు. సీఎం తట్టలో మట్టిని మోస్తూ పక్కనే ఉన్న ట్రాక్టర్ వద్దకు నడిచివెళ్లి అందులో మట్టిని వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగసభను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని అందరూ ఏకమై విజయవంతం చేయాలన్నారు. గతంలో పనుల్లో అవకతవకలు చేసిన కాంట్రాక్టర్లకు మళ్లీ పనులు అప్పగించొద్దని, వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఆంధ్ర పాలకులవల్లే చెరువులు పూర్తిగా నాశనమైపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అరవై ఏండ్ల సిలుము.. ఒక్కరోజుతోని వదుల్తాది
సదాశివనగర్ పాతచెరువులో ఏడు ఎనిమిది ఫీట్ల మట్టి పూడికపోయి ఉన్నది. మరి అరవై ఏండ్ల శిలుము కదా.. ఒకరోజుతోని వదుల్తాది! ఇంత నాశనం చేసిండ్రు! ఎక్కడబోయినా మన చెరువుల బతుకింతే. వాళ్లట్లచేస్తే.. మనం కూడా రైతులమేంజేసినం..? బస్త కాదు రెండు బస్తాలు చల్లుదాంరా అని జెప్పి చెర్లమట్టిని తీస్కపొయి పొలాల కొట్టుకునుడు కూడా బంజేసినం. మునుపైతే ఎండకాలమొస్తే.. అప్పుడు ట్రాక్టర్లు లేకుండే.. ఎడ్లబండ్లతోనైనా సరే చెర్లమట్టంతా పొలాలల్లకు కొట్టేది. మంచి సారం పెరిగేది భూమిలో. వాళ్లాంధ్రోళ్లట్ల జేసిండ్రు.. మనం ఎరువులు బస్తాలెక్కువేసి పొలాలు ఖరాబు చేసుకున్నం. చెర్లన్నీ పూడిక తెచ్చుకున్నం. దాని ఫలితమేమైంది? చెర్లన్నీ తాంబాళంలాగా మారిపోయినయి. అడవులు నరికేసిండ్రు. మంచి వర్షాలు పడేదే తక్కువ. ఎప్పుడన్నా గాచారం బాగుండి మంచికాలమైతే చెర్వులలో నీళ్లు నిల్వయ్. ఎక్కడియక్కడ ఎళ్లిపోతయ్. ఉద్యమం సమయంలో ప్రతీ ఉపన్యాసంలో నేన్జెప్పిన. కామారెడ్డిలో నేను ఇన్‌చార్జిగా వచ్చినప్పుడు ఆరోజు నేను నగర్‌కు కూడా ఓ రోజు వచ్చి ఉండిపోయిన. ఆరోజు కూడా ఈ చెర్వుల మీద నేను మాట్లాడిన.. మొత్తం చెరువులు నాశనమైనయని. మా తెలంగాణ రాష్ట్రం మేం తెచ్చుకుంటం. మళ్లీ కాకతీయ, రెడ్డిరాజులకు దండం పెట్టి మేం కచ్చితంగా మా చెరువులు కళకళలాడేటట్టు చేసుకుంటమని ఉద్యమ సందర్భంలో నేన్చెప్పిన. ఉద్యమం గెలిచింది. తెలంగాణ వచ్చింది. ఎన్నికలు జరిగినయ్. ఉద్యమ నాయకత్వానికే ప్రజలు పట్టం గట్టిండ్రు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, జైళ్లకు పోయిన నాయకులనే ఇయల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మీరే దీవించి అవకాశం ఇచ్చి నిలబెట్టిండ్రు. మరియాల ఏం జరగాల? యాడాది తిర్గకముందే మొత్తమంత కూడా.. అధికారులు లేకపోయినా, వననరులు సరిగా లేకపోయినా, కొత్త రాష్ట్రమైనా.. మొత్తం విషయాలన్నీ అర్థం చేసుకొని, సర్వే చేయించి ఇంజినీర్లను ఉరుకుల పరుగులబెట్టించి మొత్తం వివరాలు తెప్పించుకున్నం. పోయినయ్ పోయినయ్. మిగిలిన వాటిల్లో 46వేలచిల్లర చెరువులున్నయ్. వీటన్నింటిలో కచ్చితంగా మొత్తం పూడిక పోవాలె. కట్టలన్నీ బందబస్తు కావాలె. మత్తడ్లు, తూములన్నీ బందబస్తు కావాలె. పంటకాల్వలు కూడా మంచికావాలె. మన అదృష్టం మంచిగుండి ఒక్క సంవత్సరం కాలమైతే మూడేండ్లదాక కరువు మనదిక్కు మర్రి చూడదు. ఆ పరిస్థితి మనందరం తెచ్చుకోవాలె. కచ్చితంగా అందరం పిడికిలి పట్టాలె. అందరం ఎక్కడోళ్లమక్కడ పూనుకుంటేనే తయారైతది. నేను మంత్రి హరీశ్‌రావుగారికి చెప్పిన. ఎక్కడ్నైతే గ్రామాలలో రైతులు ముందుకొస్తరో.. పువ్వు మట్టి అంతా మీదమీదుండే మట్టి వాళ్ల పొలాలల్లకియ్యండీ.. మీరు గవర్నమెంటు తవ్వండి. ట్రాక్టర్లు వాళ్లు పెట్టుకుంటరు. మంచి లాభం జరుగుతదని నేన్చెప్పిన. రైతు సోదరులందరికీ నేను మనవి చేస్తావున్నా.. దయచేసి మీరందరు.. ఇంత మంచి అవకాశం దొరకదు. ఈ వేదిక నుంచి, నగర్‌నుంచి నేనీరోజు తెలంగాణ యావన్మంది రైతులకు ఈ సందేశం చెప్తావున్నా. ఈ రెండుమూడు నెల్లపాటు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా.. మీరు చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా తొమ్మిదివేల చెరువుల మరమ్మతులు బ్రహ్మాండంగా జరగబోతాయి. 
ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి
  కాంగ్రెస్ నాయకులు పాపం.. మాదంతా బూజువట్టిన యవ్వారం.. మాలెక్కనే మీరుగూడ ఉండాలంటరు. నేను ఇంజినీరు సోదరులకు మనవి చేస్తా వున్నా.. జిల్లా కలెక్టర్‌కు కూడా ప్రత్యేకంగా చెప్తావున్నా. గతంలో మీదమీద పన్జేసీ.. దొంగ బిల్లులు లేవట్టుకుంటే ఇదే జిల్లాలో మరమ్మత్తులు చేసిన అనేక చెరువులు తెగిపోయినయ్. ఆ తెగిపోవడానికి ఎవడెవడైతే బాధ్యుడున్నడో వాళ్లకెట్టి పరిస్థితుల పన్లు ఇయ్యొద్దని చెప్పి వాళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు ఆదేశం ఇసావున్నా. ఈ దొంగ కాంట్రాక్టర్లు మనకవసరం లేదు. గతంలో ఏ చెరువుమీద ఎవడు పన్జేసిండు? ఏ చెరువు తెగిపోయింది? ఆ వివరాలనీ తీయించాలె. ఆ దొంగలు మళ్లా వస్తే మళ్లా మొదటికే వస్తది కాబట్టి ఆన్‌లైన్‌లో ఓపెన్ టెండర్లు పిలుస్తావున్నం. దానికి వీళ్లూవాళ్లనే బేధం లేదు. ఎవ్వరు టెండర్లేసినా పాల్గోవచ్చు. పనులు చేయవచ్చు. నాణ్యత ప్రకారం ఎవ్వరైతే చేయ్యరో జైలుకు పంపిచ్చేది కూడా ఖాయం. ఇది గత సమయం కాదు. గత ప్రభుత్వం కాదు. ఇది మన తెలంగాణకు ప్రాణం.
నేల విడిచి సాము చేయొద్దు
        ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులమంటే నేలవిడిచి సాముచేయొద్దు. మనం చేసే పని ఎక్కడ్నో హైదరాబాద్‌లో లేదు. ఢిల్లీలోలేదు. ఇగో మనం చేసే పని సదాశివనగర్ పాత చెరువులో ఉన్నది. ఎల్లారెడ్డిలోని గ్రామ గ్రామన ఉన్న చెరువులో ఉన్నది. ఎమ్మెల్యేలందరూ చిన్నపాటి టెంటేసుకొని చెర్లనే పండాలె. చెర్లనే ఉండాలె. రైతులతోని కలిసి అన్నం తినాలె. అంత పట్టుపట్టాలె. అంత మొండి పట్టుపడితెనే పనివరుస అయితది. తెలంగాణ మాత్రం వట్టిగచ్చిందా మనకు. ఎన్ని బాధలు పడ్డం.. ఎన్ని తిప్పలు పడ్డం. చివరకు సచ్చెదాక తయారయినం. అంత తెగిస్తెనే తెలంగాణొచ్చింది. ఇపుడు కూడా తెలంగాణ నిలిసి గెలవాలె. దేశం ముందు రుజువు చేసుకోవాలె. భేష్.. తెలంగాణ బిడ్డలు గొప్పోళ్ల్రా.. సాధించుకున్నరు. అగ జూడు వాళ్లు కాకతీయ మిషన్ ఎట్ల చేసుకున్నరో. అగ జూడు రోడ్లెట్లజేస్కుంటున్నరో అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలె. దాని కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి నాలుగురోజులైతే అసెంబ్లీ అయితది. మీరు హైదరాబాద్‌ల కనవడద్దు. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట, కుంటల పొంటనే ఉండాలె. ఇగ మన ముందు కనబడ్తా ఉన్నది దరిద్రమంతా అగో.. అయ్యే లొట్టపీసు చెట్లంటం మనం. మొత్తంఅదే. నేను మళ్లా యాడాదినాడు హెలికాప్టర్‌ల గీడనే దిగుతా. కచ్చితంగా దిగుతా. ఇది నేను స్టార్ట్ చేసిన చెరువు కాబట్టి ఇది అన్ని రకాలుగా కావాలె. ఈ తూటిచెట్లు, లొట్టపీసు చెట్ల జాగల నీళ్ల తళకులు కనబడాలె. బ్రహ్మాండంగా నీళ్లు కనబడాలె. అప్పుడే మనకు సంతోషమైతది. ఇగవో కాంగ్రెస్‌యానున్నదీడ. యాదున్నదా మీకు? చెల్లని రూపాయొటుండే ఈడ. ఆ రూపాయి కామారెడ్డిల చెల్లలే.. నా ఎల్లారెడ్డిల చెల్లలే. కానీ యాడ చెల్లింది.. ఢిల్లీల సోనియా గాంధింట్ల చెల్లింది. ఆయనకో ఎమ్మెల్సీ పోస్టచ్చింది. దానికాయన ఫర్మానాల పెడ్తుండు ఫర్మానాలు. ఏం జేత్తన్నవ్ కేసీఆర్..! షబ్బీర్ అలీ.. దా! ఈడ నాలుగు తట్టలుమొయ్యి. మేం గీ పన్లో ఉన్నం. కనబడ్తలేవా నీకీపన్లన్నీ. ఏంజేసేదీ కనబడ్తలేదా..? మీరు రెండు వందల రూపాయల పెన్షనిస్తే.. ఈ రోజు మా తల్లులకు, మా అన్నదమ్ములకు, మా వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షనిచ్చేది కనబడ్తలేదా షబ్బీర్ అలీ? ఇస్తాండ్రామ్మా వెయ్యిరూపాయల పింఛన్లు.. వికలాంగులకు పదిహేను వందల పెన్షన్ ఇస్తున్నరా? రేషన్‌కార్డు మీద పరిమితిలేకుండా ఆరుకిలోల బియ్యం ఇస్తున్నరా? ఇస్తున్నరు కదా! నిన్న అంగన్‌వాడీలకు జీతాలు పెరిగినయ్‌కదా? ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినయా? ఇయాల చెరువులు తవ్వుడు మొదలయిందా? బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలొచ్చిందా? బీడీ కార్మికులందరికీ అక్కజెళ్లలకు ఒక్కటే జెప్తావున్నా. ఎవలెవలకతే వచ్చిందో వచ్చినవాళ్లు మీ పెన్షన్ తీసుకోండి. రాని వాళ్లు ఎమ్మార్వో ఆఫీసుకు పోయి దరఖాస్తియ్యండి. ప్రతీ బీడీకార్మికురాలికి సహాయమందించాలన్నదే మా ఉద్దేశం. జిల్లా కలెక్టర్ మంజూరు చేసి వారం పదిరోజుల్లో మీఇంటికి తీసుకొచ్చిస్తారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు మనవి చేస్తున్నాం. వచ్చినవాళ్లకు మొదటి విడత ఇప్పించుకోండి.. రాని వాళ్లకు రెండో విడత ఎమ్మార్వో కార్యాలయంలో వెంటనే దరఖాస్తు పెట్టించుకోండి. ప్రతీ ఒక్క మనిషికి నేను ఇప్పిస్తానని హామీనిస్తావున్నా. ఎవరు కూడా దానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇగ ఈవిధంగా పనిచేస్తున్నం షబ్బీర్ అలీ.. ఈ పనులన్నీ కనబడ్తలేవా? దళితబిడ్డలకు గిరిజన బిడ్డలకు పెండ్లిలయ్‌తుంటే కల్యాణలక్ష్మికింద 51వేల రూపాయలు మంజూరు చేస్తావున్నాం. 
     క్రైస్తవులకు గానీ, ముస్లింలకు గానీ సిక్కు సోదరులకు గానీ వాళ్ల ఇండ్లలో పిల్లలుంటేగూడ 51వేల రూపాయలు మంజూరు చేస్తావున్నాం. ఇవన్నీ పనులు చేసుకుంట ముందుకు పోతావున్నాం. పాతరాజకీయంలాగా లేదు. మీలాగ మేంజేస్తలేము. ప్రజలు మమ్మల్ని గెలిపిచ్చిండ్రు.. మిమ్ముల్ని పక్కకుండుమన్నరు. మీరు సొల్లుపురాణాలు మాని మీరు పక్కకుండండి. మేం పనిచేస్తాం. మేం పనిచేస్తేనే మళ్లీ ఐదేండ్లకు పరీక్ష పాసయితం. మీరు, మేము మళ్లా ఐదేండ్లకు తలపడదాం. ఇపుడు మాత్రం సొల్లువాగుడు బంజేయుండ్రని చెప్పి నేను మనవి చేస్తావున్నా. మీ పిచ్చి పురాణాలు మాని నిర్మాణాత్మకమైన సూచనలివ్వండి. మంచి పద్ధతుల్లో మీరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనండి. పెన్షన్ ఎవలకన్నా రాకపోతే మాకు సూచించండి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నం. పిచ్చి ధర్నాలు చేసి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ఆరోపణలు చేస్తే మీ గౌరవమే పోతది. సూర్యుని మీద ఉమ్మితే మీమీదనే పడుతది తప్పా ప్రభుత్వానికొచ్చే నష్టం కూడా ఏమిలేదని నేను మనవి చేస్తావున్నాను. 
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాలు..
ఒక ఊళ్లే ఎగిర్తం సుట్టమొచ్చిండట ఒకాయనె. పొద్దుగాల్నుంచి నేను జెల్దిపోతా జెల్దిపోతా అంటే ఇంట్లో పెద్దమనిషుండి బిడ్డా శాన దూరం పోవాలెకదా.. అన్నం కాకపాయె. బుక్కెడంత సలన్నం ఉన్నది తినిపోతవ బిడ్డా అన్నదంట. ఎందుకు పెద్దమ్మా చలన్నం తింటా. ఉడుకన్నమయెదాక ఉంటా అన్నడంట. రవీందర్‌రెడ్డిది కూడా గదే కతున్నది. చెరువుమందమేమో రమ్మన్నడు. ఈడికచ్చినంక ఇగ దుకాణం మొదలుపెట్టిండు. పెట్టవల్సిందే. ఇట్లాంటి ఎమ్మెల్యేలుంటనే సమస్యలు తెగితెనే బాగుపడ్తం. ఆయన స్పిరిట్‌కు అభినందిస్తావున్నా. ఆయనకు ఆరాటం బాగున్నది అని కేసీఆర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 132కేవీ సబ్‌స్టేషన్, 11 33/11కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఐటీఐ, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని ఆయన మంజూరు చేశారు. కాగిత లంబాడీలను ఎస్టీల రిజర్వేషన్ల పెట్టేందుకు కమిటీ నియామకం జరిగిందని సీఎంతెలిపారు. కాగితపు లంబాడీలను కచ్చితంగా లంబాడా కులంలో కలిపే బాధ్యత నేను తీసుకుంటా. మీకందరికీ త్వరలోనే ఈ శుభవార్త కూడ వస్తది. ఎస్టీలకొచ్చే సదుపాయమంతా కాగితపు లంబాడీ అన్నదమ్ములకు కూడా వస్తది అని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని చెరువుల మరమ్మతులకు రూ.30 కోట్లకు బదులు మరో రూ.60 కోట్లు పెంచుతున్నామని, శుక్రవారమే జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలోనే తెలంగాణలో కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. వందశాతం కామారెడ్డి జిల్లా చేసే బాధ్యత నాది. కామారెడ్డి జిల్లా అయినతర్వాత పునాది రాయి వేయడానికి నేను వస్తానని చెప్పి కూడా హామీ ఇస్తావున్నాను. గంపగోవర్ధన్‌కు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తావున్న. 
సమాజానికి వాస్తవాలు చెప్పిన విద్యాసాగర్‌రావు
      ప్రభుత్వ నీటిపారుదలరంగ సలహాదారుడు ఆర్ విద్యాసాగర్‌రావును కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజులలో.. ఒక చీఫ్ ఇంజినీర్‌గా రిటైరయిపోయి కూడా నేను మౌనం పాటించకూడదు.. నా తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తున్నరు. కచ్చితంగా తెలంగాణ బిడ్డలకు నీళ్లలో జరిగే అన్యాయమేందో ఊరూరికి తిరిగి చెప్తా.. అని ప్రతిజ్ఞ తీసుకొని అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చేసి, తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పి.. నీళ్లు-నిజాలు అనే అద్భుతమైన పుస్తకాన్ని, వాస్తవాల్ని.. నిప్పులాంటి నిజాల్ని ప్రపంచం ముందు పెట్టారు అని కేసీఆర్ ప్రశంసించారు. 
     తెలంగాణ ప్రజలకు నాదొక విజ్ఞప్తి మంచినీళ్ల బాధ ఉండకూడదని సుమారు 40వేల కోట్ల రూపాయల్తోని చాలా బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టొకటి చేపడ్తున్నం. ఇది ఆశామాషి కార్యక్రమం కాదు. కచ్చితంగా నాలుగేండ్లలోపు నల్లాతో మంచినీళ్లియ్యపోతే టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో ఓట్లడగదని చెప్పిన. ఆ మాటకు కట్టుబడి ఉన్నా. కేసీఆర్ మాటంటే తప్పుడు. మీకు తెల్సావిషయం. తలతెగన్నవడాలె. అది అమలన్నాకావాలె. ఈ పనిచేయడంలో జిల్లాలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో, అందరితో నేనుకోరుతా ఉన్నా. పదిహేను వేల జాగలలో మనం చాలా విషయాలు దాటాలి. రోడ్లు దాటాలె. రైలు పట్రీలు దాటాలె. అనేక కాలువలు దాటాలె. చిన్నచిన్న వాగులు వంకలు వొర్రెలన్నీ దాటాలె. అట్లయితేనే ఆ నీళ్లు మనకు రాగల్గుతయ్. ఎవల ఊరికాడ ఏ సమస్య వచ్చినా దయచేసి ఏ గ్రామస్తులు ఆ గ్రామస్తులు ఆ గ్రామానికి కథానాయకులై పైప్‌లైన్లు ముందుకు పోయేటట్లు మీరు సాకారం చేయాలె. వీటితో పాటు రోడ్లకోసం పదిహేను వేల కోట్లు మంజూరు చేస్తున్నాం. ఆర్‌అంబ్‌బీ గానీ పంచాయతీరాజ్ రోడ్లు గానీ వాటిని కూడా మీమీ గ్రామాల్లో పనులు జరిగేటప్పుడు మీరందరు కాపలా కాయాలె. నాణ్యతతోని రోడ్లు వేయించుకోవాలె. దొంగ కాంట్రాక్టర్లుంటే తరిమి కొట్టాలె. ఆ రోడ్డు మనకేస్తే ఐదేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండాలె. భారతదేశంలో మంచిరోడ్లు ఎక్కడున్నయ్‌రా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలె. అంత బాగా రోడ్ల నిర్మాణం కూడా జరగబోతా ఉంది. సంక్షేమకార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ రంగంలో గానీ పరిశ్రమల రంగంలో కానీ ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మనం తెచ్చినం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలె. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టం కావాలె. పేదలు, రైతులు ప్లస్ పరిశ్రమలు మూడు భాగాలుగా చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ అండదండలు మీ దీవనెలు ఉంటే అన్నిట్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తమని మనవి చేస్తున్నాను. 
పాత చెరువుకు అదనంగా కోటిన్నర
ఈ చెరువు కూడా హరీశ్‌రావు 38 లక్షలేమో ఇచ్చిండు. అవి ఏటూ సరిపోవు. దీన్ని నేను చేసినకాబట్టి నా డబ్బుల్నుంచి ఇంకా ఒక కోటి యాభై లక్షలు మంజూరు చేస్తావున్నా. మినీ ట్యాంక్‌బండ్‌లాగా.. సదాశివనగర్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు బతుకమ్మ ఏసుకున్నా ఈ చెరువు కట్టమీద గర్వంగా కుసుండి సద్దులు తినే విధంగా చెరువు కట్ట బల్వాలె. ఈత చెట్లు పెట్టాలె. మన గీతకార్మికులు చక్కని ఈత కల్లుపోయాలె. ఈ మందుకల్లు బందుకావాలె. మొత్తం చెర్లల్ల ఈత చెట్లన్నీ కూడా తయారు చేస్తున్నం. ఇప్పటికే 28 లక్షలున్నాయ్. కట్టకింది భాగానా నిమ్ము బాగుంటది. దాని వాళ్ల ఈత చెట్లు ఏపుగా పెరుగతయ్. కళ్లుకూడా బాగపారతది. చాలా బ్రహ్మాండంగ ఉంటది. నాకు ఇంజినీర్లు చెప్పిండ్రు. ఈత చెట్టు పెట్టాల్సార్ అని. కట్ట బుంగలు పడుతదేమోనని అంటే.. పడది సార్.. బాగ గట్టిగా కట్టని కాపాడ్తది. మనంకూడా కింది భాగంలో ఈదులు పెట్టుకోవాలని చెప్పిండ్రు. నిజామాబాద్ జిల్లాకు మీకు ప్రత్యేకంగా చెట్లు ఎక్కువ ఇప్పిస్తాం. అన్ని చెరువులకు ఈత చెట్లు ఇప్పిస్తాం. గీతకార్మికులకు కూడా సాయం చేసినట్లవుతది. ఒకటి, ఒకటి చేసుకుంటూ తెలంగాణ మొత్తం ముందుకు పోవాలె. చెరువులు చేసుకోవాలె. ప్రాజెక్టులు చేసుకోవాలె. తప్పకుండా ప్రాణహిత చేవెళ్ల నీళ్లు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కనీసం 50 వేల ఎకరాలకు రావాలె. తెచ్చి ఇస్తా. అది నా బాధ్యత. వందశాతం ఆ నీళ్లు వీలైనంత సమయంలో.. అందరితో పాటు మీకుకూడా వచ్చేటట్లు చేస్తా. మీకెక్కడ్నో ప్రాణహిత నంచిరావు. మన ఎస్సారెస్పీ డ్యామ్ నుంచి రావాలె. దానికి మార్గాలున్నయ్. సర్వేలు చేసిపెట్టిండ్రు. అంచనాలు తయారయినయ్. చెరువులతో పాటు ఇక్కడికా నీళ్లు కూడా రావాలె. 
విరాళాల వెల్లువ..
గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన చెరువు పథకం మిషన్ కాకతీయకు ప్రారంభోత్సవంనాడే విరాళాల వరద రావడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు చెరువులను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన సైమెట్ ల్యాబ్స్ చైర్మన్ దొడ్డ మోహన్‌రావు మిషన్ కాకతీయ పథకానికి కోటి 50లక్షల విరాళం ప్రకటించడంతో ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలోని కమాలాపురం పెద్దచెరువుతోపాటు వరంగల్ జిల్లాలోని ఆయన స్వంత గ్రామమైన లింగాగిరి గ్రామంలోని మూడు చెరువుల అభివృద్ధికి మోహన్‌రావు కోటిన్నర చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. నల్గొండ జిల్లాకు చెందిన రిజెన్సిస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి బొమ్మల రామారంలోని నల్లచెరువు అభివృద్ధికి పది లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. 
      నల్గొండ జిల్లా మాందాపురం సర్పంచ్ సోలిపురం రాంరెడ్డి బెంజెరు వారి చెరువు అభివృద్ధికి ఆరు లక్షల 27వేల రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు తమ ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయకు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వ్యవహరించగా.. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి జోషి, ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్‌రావు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఏ రవీందర్‌రెడ్డి, ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
మిషన్ కాకతీయ విరాళాలకు..
మిషన్ కాకతీయ పథకానికి విరాళాలు ప్రకటించే దాతలు రాజధానిలోని పంజాగుట్ట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లోని అకౌంట్ నంబర్ 62400709179కు నేరుగా పంపవచ్చు. 
నీరడిలా పనిచేస్తా: మంత్రి హరీశ్‌రావు
చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. ఇంత గొప్ప కార్యక్రమానికి మనమంతా సాక్షులమైతే.. సీఎం కేసీఆర్ చరితార్థులు అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. పాతరోజుల్లో నీరడి ఉండేవాడు. చెరువులో ఉండే నీటిని రైతులకు అందించే నీరడిలా తెలంగాణ రాష్ర్టానికి పనిచేస్తా. ప్రతీ జిల్లాలో రైతులందరికీ నీళ్లందించేందుకు కృషిచేస్తా అని ప్రకటించారు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వెయ్యేండ్ల్లక్రితం కాకతీయుల కాలంలో గణపతిదేవుడు తవ్వించిన చెరువులివన్నీ. రాష్ట్రంలో 46,445 చెరువులున్నాయి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని చెరువులు ఇక్కడున్నాయి అని చెప్పారు. ఇంత వారసత్వ సంపద అయిన చెరువులను ఆంధ్రపాలకులు ఒక్కరోజుకూడా పట్టించుకున్న పాపాన పోలేదని దయ్యబట్టారు. తెలంగాణ సాధించుకున్న వెనువెంటనే ఇక్కడి ప్రజలకు తక్షణం ప్రయోజనం కలిగించే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారని హరీశ్ తెలిపారు. పాతరోజులు మళ్లీ మనకొస్తాయి. ఒకప్పుడు గంగాళంలా ఉండే చెరువులు ఇప్పుడు తాంబాళంలా మారిపోయాయి. మొత్తం పూడికమట్టితో నిండిపోయాయి. పూడికనంతా తొలగించి చెరువుల్లో పూర్వపు సామర్థ్యాన్ని సాధించడమే మిషన్‌కాకతీయ లక్ష్యం అని చెప్పారు. గత ప్రభుత్వాలు పనిచేసినా.. కేవలం కాంట్రాక్టర్లు, కార్యకర్తలు జేబులు నింపుకునే కార్యక్రమాలు చేపట్టాయని హరీశ్‌రావు విమర్శించారు. కట్టమీద మట్టిపోసి తప్పుడు బిల్లులు లేపి జేబులు నింపుకునే కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయను ప్రజా ఉద్యమంగా నిర్వహించాలన్నదే కేసీఆర్ ఆకాంక్షని చెప్పారు. వెయ్యేండ్ల క్రితం గణపతిదేవుడు చెరువులు తవ్విస్తే ఇప్పటికీ ఆయన్ను గుర్తుచేసుకుంటున్నామని హరీశ్ అన్నారు.
చెరువులే అన్నింటికీ ఆలంబన: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  చెరువు బాగుంటే ఆయకట్టు బాగుంటుందని, అన్ని కులాలకు ఆలంబనగా ఉంటుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ట్రాక్టర్లు పెట్టుకొని రైతులు పూడిక తీసుకొని పొలాల్లో వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఎండకాలం పోచారంలో పొలంలో మట్టిని తరలించేవాళ్లమని తన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు తగ్గుతాయని, అదే సమయంలో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను ప్రస్తావిస్తూ.. ఆన్‌లైన్ టెండర్లు పిలుస్తున్నాం. ఎక్కడా మా కార్యకర్తలకిచ్చుకునే సంస్కృతి మాకులేదు. మీ కడుపుబ్బుతున్నది. రాబోయే రోజుల్లో పుట్టగతులుండవనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారు అని పోచారం మండిపడ్డారు. 
వెల్లువలా తరలొచ్చిన జనం

మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఇందూరు జనం జాతరలా సదాశివనగర్‌కు తరలివచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవం ఉండగా దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమం ఆలస్యమైంది. ఉదయం తొమ్మిది గంటలకే సభాస్థలికి చేరుకున్న అశేష జనం.. సీఎం రాకకోసం ఓపికగా ఎదురు చూశారు. ఈలోపే ఆటపాటలతో ఉద్యమ గీతాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. పండుగ వాతావరణాన్ని తలపించింది. మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా పాత చెరువును పునరుద్ధరించే పనుల్లో సీఎం స్వయంగా గడ్డపార చేబూని పూడిక మట్టిని తవ్వి, తవ్విన మట్టిని తట్టలోకెత్తి నెత్తిపై మోసి ట్రాక్టర్‌లో వేయడం.. అక్కడికి చేరుకున్న ప్రజలు, రైతుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. రాష్ట్ర సాధన ఉద్యమంలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో శుక్రవారంనుంచి ఇక రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ పనులు ఉద్యమంలా ఉరకలెత్తనున్నాయి.
చెరువు మన కల్పతరువుచెరువు మన గుండెకాయ. చెరువు మన కల్పతరువు. అది బాగుంటే ఎన్నెన్ని బాగుంటయో హరీశ్ చెప్పిండు. ఒక చెరువు మంచిగుంటె ఎంత మంది బత్కుతమో.. ఎంత మందికి ఆదెరువుంటదో వివరించి చెప్పాడు. చెరువు నిండితే ఎట్లుంటదో.. చెరువు ఎండితే ఎట్లుంటదో మాకన్న మీకే బాగ తెల్సు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలె. యావత్ తెలంగాణ రైతాంగం కచ్చితంగా దీన్నొక పవిత్ర యజ్ఞంలాగా భావించాలె. మన భవిష్యత్తుకు బతుకుకు ఆధారంగా ఈ చెరువులన్నీ అద్భుతంగా తయారు చేసుకోవాలి. చెరువులంటే ఏందో నేర్పిన కాకతీయులువెయ్యేండ్ల కింద కాకతీయ, రెడ్డిరాజులు వాటర్‌షెడ్డంటే ఏందో ప్రపంచానికే నేర్పించే విధంగా అద్భుతమైనటువంటి డ్బ్భై, ఎనభై వేల గొలుసుకట్టు చెరువులు తెలంగాణలో నిర్మాణం చేసినారు. అప్పుడు తెలంగాణ అద్భుతంగా అన్నం తిన్నది. చాల గొప్పగ బత్కినం. ఒకప్పుడు కాకతీయ రాజులు.. తదనంతరం కులీకుతుబ్‌షాలు.. ఆ తదనంతరం నిజాం నవాబులు నిర్మించినటువంటి చెరువులన్నీ కూడా 15నుంచి 16 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రాంతంలో నీళ్లందించేవి. ఈరోజు లక్షా రెండు లక్షలు గూడ లేదు. ఎక్కడికిపోయింది మన ఆయకట్టు? ఎవలెత్కోని పోయిండ్రు? ఇయాల తెలంగాణ సమాజం బాగా గట్టిగ ఆలోచించాల్సిన విషయం ఇది. 
   కాకతీయ, రెడ్డిరాజులు ఆనాడు ఒక శిలాశాసనం పెట్టిండ్రు. ఆ శాసనమేందంటే.. రాజులన్నప్పుడు యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతయ్ కాబట్టి ఒకవేళ మా సామ్రాజ్యం మీద ఎవలైనా రాజులు దండయాత్ర చేసి మా రాజ్యాన్ని గుంజుకుంటే గుంజుకున్నరు.. మనుషులను చంపినా మంచిదే. మా బురుజులు, కోటలు కూలగొట్టిన మంచిదేగానీ.. ప్రజలకు అన్నంపెట్టే చెరువులు మాత్రం ధ్వంసం చేయొద్దని పదకొండు వందల ఏండ్లనాడు మన రాజులు శత్రువులకు కూడా విజ్ఞప్తి చేసిండ్రు. కాకతీయులు చాల యుద్ధాలు చేసిండ్రు. చాల దాడులు జరిగినయ్. శత్రురాజులొచ్చి ఆక్రమించుకున్నరు. ఆనాటి రాజులు.. శత్రురాజులైనప్పటికి కూడా మన చెరువులు నాశనం చేయలే. నిబద్ధతను పాటించినారు. కానీ 1956లో మన ఖర్మకాలి ఆంధ్రప్రదేశ్‌లో కలిసినపుణ్యానికి ఆంధ్రా రాజులు మాత్రం మన చెరువులన్నీ నాశనం చేసినారు. 
- (నమస్తే తెలంగాణ)

Thursday, 12 March 2015

బంగారు తెలంగాణ దిశగా

* తేల్చిచెప్పిన సామాజిక ఆర్థికసర్వే
* పెరిగిన తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం
* పారిశ్రామిక, సేవా రంగాలలో పురోగతి 
 నూతన రాష్ట్రం నూతన ఆవిష్కరణలు చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు పట్టిన దారిద్య్రాన్ని పారదోలే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు పట్టుదలతో కృషి చేస్తున్నది. ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. 2013-14లలో తెలంగాణ జీడీపీ 4.8శాతంగా ఉండగా, 2014-15లలో ఇది 5.3శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగంలో అనేక ప్రతికూలతలు ఎదురైనా గ్రామీణ వ్యవసాయం, పశు సంపద పూర్తిగా తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా మత్స్యరంగం, ఆటవీశాఖలు అనుకూల ఫలితాలు సాధించాయి. పారిశ్రామిక రంగంలో 4.1, సేవారంగంలో 9.7 శాతం ఉత్పత్తి ఫలితాలు రావడంతో తెలంగాణ జీడీపీ బలపడింది.
    తలసరి ఆదాయం రూ.2014-15లలో రూ.1,03,889 కాగా 2013-14లలో రూ.95,361గా ఉన్నది. ఇది దేశ జాతీయ సగటుకన్నా అధికం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఆసరా పింఛన్ పథకం, వితంతువులు, నేత పనివారు, గీతకార్మికులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. వారి కనీస జీవన ప్రమాణాన్ని కాపాడేందుకు నెలకు వేయి రూపాయలు ఈ తరగతులకు అందజేయాలని నిర్ణయించారు. వీరితో పాటుగా బీడి కార్మికులకు కూడా నెలకు వేయిరూపాయలు ఇవ్వాలని, కష్టాలలో ఉన్న చేనేత కుటుంబాలను కూడా వేయి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు. నిరుపేదలైన దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి సమస్త సౌకర్యాలతో వ్యవసాయానికి ఏర్పాట్లు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ఫథకాలను కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 
  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో 3,85,892 మంది ఎన్యూమరేటర్లు పాల్గొని వివరాలు నమోదుజేశారు. మొత్తం జనాభాలో అత్యధికులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా 80శాతం ఉంది. ఎస్సీలు 15.44 శాతం కాగా, ఎస్టీలు 8.60శాతం ఉన్నారు. బీసీల జనాభా 52శాతం ఉంది. రాష్ట్ర భవిష్యత్ ఈ తరగతులపైనే ఆధారపడి ఉంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకునేందుకు వారి జీవనప్రమాణాలను మెరుగు పరచడమే రాష్ట్ర అభివృద్ధికి మూల సూత్రం అవుతుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 101.83 లక్షల ఇండ్లున్నాయి. జనాభా 3.63 కోట్లు కాగా ఇండ్లు కోటి మందికి మాత్రమే ఉన్నాయి. ఇందువల్ల గృహనిర్మాణ అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో 66.46శాతం అక్షరాస్యత ఉందని సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. అతితక్కువ విద్యావంతులున్న జిల్లా మహబూబ్‌నగర్ కాగా గరిష్టంగా 83.25శాతం అక్షరాస్యతతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. చదువుకున్న వారిలో ఆడపిల్లలు 57.92శాతం కాగా మొగపిల్లలు 74.95శాతం ఉన్నారు. ఈ రెండు తరగతుల మధ్య పూడ్చడానికి వీలులేనంత తేడా ఉన్నది. సామాజికంగా చూసినప్పుడు ఎస్సీలలో 58.90 శాతం, ఎస్టీలలో 49.51 శాతం అక్షరాస్యత ఉన్నది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 40.3 శాతం మంది విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తున్నారు. వీరిలో 62.8శాతం మంది ఎస్టీలే ఉంటున్నారు. వీరితో పోల్చినప్పుడు ఎస్టీల సంఖ్య తక్కువగా ఉన్నది. మాతా శిశు మరణాల సంఖ్య అదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నది. తెలంగాణలో ఆరు జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలోనే మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. అదిలాబాద్ జిల్లాలో ప్రసూతి సమయంలో మరణిస్తున్న వారి సంఖ్య యేటా 152, కాగా జాతీయ స్థాయి సగటు 167గా ఉన్నది. జాతీయ సర్వే ప్రకారం ఇప్పటికీ 11.5శాతం ఇండ్లలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అదిలాబాద్‌ను ప్రమాదకరమైన జిల్లాగా అంతర్జాతీయ జనాభా శాస్త్రం ముంబాయి శాఖ పేర్కొంది.
     రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సామాజిక ఆర్థిక సర్వే మూడు ప్రధాన భాగాలుగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంగా వర్గీకరించింది. వ్యవసాయ రంగంలో పశుసంపద, ఆటవీ భూములు, మత్స్య సంపద, పారిశ్రామికరంగంలో మైనింగ్, క్వారీలు, విద్యుత్ ఉత్పాదన, గ్యాస్, నీటిసరఫరా గృహనిర్మాణం, సర్వీస్ సెక్టార్‌లో వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్లు ట్రాన్స్‌పోర్టు, శీతలీకరణ గిడ్డంగులు, రైల్వేలు, సమాచార రంగం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఇండ్లు అద్దెలకు ఇవ్వడంతో పాటు ఇతర వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను సేవారంగాలుగా ఈ సర్వే గుర్తించింది. 9.7 శాతం వృద్ధితో ఈ మూడు డివిజన్లలో సర్వీస్‌సెక్టార్ అగ్రగామిగా నిలిచింది. పారిశ్రామిక వృద్ధి 4.1శాతంగా, వ్యవసాయ రంగం -10.3 శాతంగా నమోదైంది. గడిచిన పదేళ్ల్లుగా వ్యవసాయ రంగం క్రమంగా బలహీన పడుతున్నది. సేవారంగం బలపడుతూ వచ్చింది. సాధారణంగా ఇది అబివృద్ధి సూచిక. కానీ, అహార భద్రత కల్పించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం. తెలంగాణలో వ్యవసాయానికి ప్రధానమైన ఇబ్బంది సకాలంలో వర్షాలు రాకపోవడమే.. ఇతర ప్రాకృతిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. వీటి నుంచి బయటపడటం అహారభద్రతకు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయరంగాన్ని బలపరచడం, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించినప్పుడు వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామిక రంగానికి ఇతోధిక ప్రాధాన్యం ఇస్తూనే సేవారంగాలను కూడా బలపరచాలని సర్వే చెప్పింది. అందుకోసమే ఈ బడ్జెట్‌లో ప్రధానంగా సాగునీటి వనరులు, విద్యుత్ రంగం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించింది.

Friday, 6 March 2015

'యాదాద్రి'గా.. యాదగిరిగుట్ట

* నవగిరుల యాదాద్రి
*  సీఎం కేసీఆర్ కోరిక మేరకు గుట్ట క్షేత్రం పేరుమార్చిన చినజీయర్‌స్వామి 
* చుట్టూ ఎనిమిది గుట్టలతో నవగిరులుగా అభివృద్ధి 
* యాదాద్రిపై నరసింహస్వామి 32 అవతారాల ప్రతిష్ఠాపన 
* ఆగమశాస్త్రం ప్రకారమే గుట్ట అభివృద్ధి: సీఎం కేసీఆర్ 
* చినజీయర్‌స్వామితో కలిసి ఏరియల్ సర్వే 
* ఆరున్నర ఎకరాల్లో ఆలయం విస్తరణ 
* భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇక నుంచి యాదాద్రిగా అభివృద్ధి చెందనుంది. యాదగిరీశుడి చల్లని దీవెనలతో భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం తన చుట్టూ ఉన్న మరో ఎనిమిది గిరులతో కలిసి నవగిరులుగా ప్రసిద్ధికెక్కనుంది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దేశంలోని ప్రముఖ హిందూ క్షేత్రాలన్నింటికీ దీటుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరికమేరకు త్రిదండి చినజీయర్‌స్వామి పుణ్యక్షేత్రం పేరు మార్చారు. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో యాదాద్రితోపాటు దానికి ఆనుకొని ఉన్న ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులుగా పిలుచుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటికి కూడా నామకరణం చేయాలని చినజీయర్‌స్వామిని కోరగా, త్వరలో వాటిపేర్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 
 ఆలయాన్ని ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గుట్ట అభివృద్ధి కోసం శరవేగంగా చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి గురువారం చినజీయర్‌స్వామితో కలిసి యాదగిరిగుట్ట పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆలయ విస్తరణ, మౌలికసదుపాయాల పెంపు, పర్యాటక ప్రాంతంగా గుట్టను అభివృద్ధి చేసేందుకు ఉన్న సౌకర్యాలను వారు పరిశీలించారు. ఆలయ విస్తరణకోసం రూపొందించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ముఖమండపంలో ముఖ్యమంత్రి, వేదపండితులు, అర్చకులు, అధికారులు, సిబ్బందికి చినజీయర్‌స్వామి ప్రవచనం చేశారు. యాదగిరి కొండపై ఇప్పుడున్న గర్భగుడిని కేంద్రంగా చేసుకొని ఆరున్నర ఎకరాల్లో ప్రాకారాలు, నిర్మాణాలు చేయాలన్న సీఎం ఆలోచనలకు చినజీయర్‌స్వామి ఆమోదముద్ర వేశారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు. స్థపతులు, వాస్తుశిల్పులు రూపొందించిన ప్లాన్లను చూసిన చినజీయర్‌స్వామి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. నిర్మాణమయ్యే ప్రాకారంలోనే శ్రీవారి కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా కల్యాణ మండపం, సాధారణ భక్తులు వివాహాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం మరో సాధారణ మండపం నిర్మించాలని సూచించారు. గర్భాలయం నుంచి ప్రాకారం 462 - 452 సైజుల్లో ఉండాలని, ప్రాకారం చివరలో ప్రసాదాల విక్రయాలు ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు.
ప్రధాన గుడి ముందు హరితనందనం
గుట్టపై ప్రధాన గుడికి ముందు భాగంలో మరో పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితనందనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించే పదార్థాల తయారీకి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్టపైన వంద వాహనాలు, గుట్ట కింద ఐదువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాన ఆలయంఉన్న యాదగిరిగుట్టతోపాటు చుట్టూఉన్న మరో ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు ఏర్పాటుచేస్తామని సీఎం వివరించారు. 
సీఎం, జీయర్‌స్వామి ఏరియల్ సర్వే
యాదరిగిగుట్ట అభివృద్ధి కోసం గుట్ట చుట్టూ చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్‌స్వామి గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్టతోపాటు అభివృద్ధి చేయాలనుకున్న చుట్టుపక్కల గుట్టలను కూడా చినజీయర్‌స్వామికి సీఎం చూపించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట మార్గాలను, ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులను వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
        యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు ఫారెస్టును నరసింహస్వామి అభయారణ్యంగా మార్చే ప్రతిపాదన ఉన్నదని చెప్పారు. జాతీయరహదారి, రైల్వే లైను పక్కనే ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సులువుగా పుణ్యక్షేత్రానికి రావచ్చని వివరించారు. అనంతరం 12 గంటలకు కొండపైకి చేరుకొని లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చినజీయర్‌స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువణువును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేర్వేరు ఎత్తుల్లో అందుబాటులో ఉందని, ఆరు ఎకరాల్లో ప్రధాన ఆలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని మ్యాప్‌ల ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. ప్రతిపాదిత స్థలాలను, దిక్కులను చూపించారు.
    దేశంలోని 32 నరసింహుడి రూపాలను యాదగిరి గుట్టలో ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. ఆలయ నిర్మాణ రూపశిల్పులు, స్థపతి, వేదపండితులు, దైవ క్షేత్రాల నిర్మాణ, నిర్వహణలో అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తీసుకొని డిజైన్లు రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షల కోసం ఒక మంటపాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.                                      (-నమస్తే తెలంగాణ)

Thursday, 5 March 2015

'క్వాలిటీ ఆఫ్ లివింగ్' లో హైదరాబాద్ కు మొదటి స్థానం

              
  విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. మెరుగైన జీవనం విషయంలో ఇండియాలోనే హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా నిలిచింది. గ్లోబల్‌ మొబిలిటీ సంస్థ విడుదల చేసిన క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ రిపోర్టులో భాగ్యనగరం అగ్రస్థానం పొందింది. ఆ తర్వాత స్థానం పుణెకు దక్కింది. కాలుష్య నివారణపై వరల్డ్ హెల్త్ ఆర్గనైషన్ తాజాగా ప్రచురించిన జాబితాలో ఇండియాలో హైదరాబాద్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. నీటి పరిశుభ్రత, గాలి కాలుష్యం, ట్రాఫిక్ లాంటి అంశాలపై దేశంలోని మొత్తం 20 టాప్ సిటీస్ ను పరిగణలోకి తీసుకున్న డబ్ల్యూ. హెచ్.వో… హైదరాబాద్ కే అగ్ర తాంబూలం ఇచ్చింది. పుణెకు రెండో స్థానమిచ్చింది. ముంబై, ఢిల్లీ 3, 4 స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించే ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, ఇంగ్లీష్‌ బోధించే అత్యుత్తమ పాఠాశాలలు, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ కారణంగా.. హైదరాబాద్‌ కు ఇండియాలోనే ఫస్ట్‌ ప్లేస్‌ దక్కినట్టు సర్వే తేల్చింది. పెరిగిన జనాభా, వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబై మెరుగైన జీవనం జాబితాలో వెనకబడ్డాయి.
        మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వేలోనూ హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. రాజకీయ సుస్థిరత, క్రైమ్, మీడియా స్పాన్సర్ షిప్, మెడికల్ సర్వీసెస్, నాణ్యమైన విద్య, ప్రజా రవాణా వ్యవస్థ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ.. భాగ్యనగరానికే జై కొట్టింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి మెట్రో సిటీస్ ను సైతం వెనక్కి తోసి.. ది బెస్ట్ లివింగ్ ప్లేస్ లో హైదరాబాద్ ఛాన్స్ కొట్టేసింది.
        మొన్నటికి మొన్న హైదరాబాద్ కు అరుదైన ఘనత దక్కింది. 2015లో ప్రపంచ పర్యాటకులు తప్పనిసరి చూడాల్సిన ప్రదేశాల్లో నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ మాగజైన్ హైదరాబాద్ కు చోటిచ్చింది. భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే. ఇక బ్రిటన్ కు చెందిన డైలీ మెయిల్ పత్రిక కూడా హైదరాబాద్ ఘనతను విశ్వవ్యాప్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు నగరాలను ఫేవరేట్లుగా ఎంపిక చేయగా… అందులో హైదరాబాద్ కు చోటు దక్కింది.