* తేల్చిచెప్పిన సామాజిక ఆర్థికసర్వే
* పెరిగిన తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం
* పారిశ్రామిక, సేవా రంగాలలో పురోగతి
నూతన రాష్ట్రం నూతన ఆవిష్కరణలు చేస్తున్నది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు పట్టిన దారిద్య్రాన్ని పారదోలే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆదిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు పట్టుదలతో కృషి చేస్తున్నది. ఈ విషయాన్ని సామాజిక ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. 2013-14లలో తెలంగాణ జీడీపీ 4.8శాతంగా ఉండగా, 2014-15లలో ఇది 5.3శాతానికి పెరిగింది. వ్యవసాయ రంగంలో అనేక ప్రతికూలతలు ఎదురైనా గ్రామీణ వ్యవసాయం, పశు సంపద పూర్తిగా తగ్గిపోయినా ప్రత్యామ్నాయంగా మత్స్యరంగం, ఆటవీశాఖలు అనుకూల ఫలితాలు సాధించాయి. పారిశ్రామిక రంగంలో 4.1, సేవారంగంలో 9.7 శాతం ఉత్పత్తి ఫలితాలు రావడంతో తెలంగాణ జీడీపీ బలపడింది.
తలసరి ఆదాయం రూ.2014-15లలో రూ.1,03,889 కాగా 2013-14లలో రూ.95,361గా ఉన్నది. ఇది దేశ జాతీయ సగటుకన్నా అధికం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే ఆసరా పింఛన్ పథకం, వితంతువులు, నేత పనివారు, గీతకార్మికులు, వృద్ధులు, ఎయిడ్స్ రోగులు ఈ పథకం కింద లబ్దిపొందుతున్నారు. వారి కనీస జీవన ప్రమాణాన్ని కాపాడేందుకు నెలకు వేయి రూపాయలు ఈ తరగతులకు అందజేయాలని నిర్ణయించారు. వీరితో పాటుగా బీడి కార్మికులకు కూడా నెలకు వేయిరూపాయలు ఇవ్వాలని, కష్టాలలో ఉన్న చేనేత కుటుంబాలను కూడా వేయి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు. నిరుపేదలైన దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి సమస్త సౌకర్యాలతో వ్యవసాయానికి ఏర్పాట్లు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టింది. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ ఫథకాలను కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో 3,85,892 మంది ఎన్యూమరేటర్లు పాల్గొని వివరాలు నమోదుజేశారు. మొత్తం జనాభాలో అత్యధికులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా 80శాతం ఉంది. ఎస్సీలు 15.44 శాతం కాగా, ఎస్టీలు 8.60శాతం ఉన్నారు. బీసీల జనాభా 52శాతం ఉంది. రాష్ట్ర భవిష్యత్ ఈ తరగతులపైనే ఆధారపడి ఉంది. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకునేందుకు వారి జీవనప్రమాణాలను మెరుగు పరచడమే రాష్ట్ర అభివృద్ధికి మూల సూత్రం అవుతుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 101.83 లక్షల ఇండ్లున్నాయి. జనాభా 3.63 కోట్లు కాగా ఇండ్లు కోటి మందికి మాత్రమే ఉన్నాయి. ఇందువల్ల గృహనిర్మాణ అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో 66.46శాతం అక్షరాస్యత ఉందని సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. అతితక్కువ విద్యావంతులున్న జిల్లా మహబూబ్‌నగర్ కాగా గరిష్టంగా 83.25శాతం అక్షరాస్యతతో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. చదువుకున్న వారిలో ఆడపిల్లలు 57.92శాతం కాగా మొగపిల్లలు 74.95శాతం ఉన్నారు. ఈ రెండు తరగతుల మధ్య పూడ్చడానికి వీలులేనంత తేడా ఉన్నది. సామాజికంగా చూసినప్పుడు ఎస్సీలలో 58.90 శాతం, ఎస్టీలలో 49.51 శాతం అక్షరాస్యత ఉన్నది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 40.3 శాతం మంది విద్యార్థులు మధ్యలో చదువు మానేస్తున్నారు. వీరిలో 62.8శాతం మంది ఎస్టీలే ఉంటున్నారు. వీరితో పోల్చినప్పుడు ఎస్టీల సంఖ్య తక్కువగా ఉన్నది. మాతా శిశు మరణాల సంఖ్య అదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నది. తెలంగాణలో ఆరు జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలోనే మాతాశిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. అదిలాబాద్ జిల్లాలో ప్రసూతి సమయంలో మరణిస్తున్న వారి సంఖ్య యేటా 152, కాగా జాతీయ స్థాయి సగటు 167గా ఉన్నది. జాతీయ సర్వే ప్రకారం ఇప్పటికీ 11.5శాతం ఇండ్లలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అదిలాబాద్‌ను ప్రమాదకరమైన జిల్లాగా అంతర్జాతీయ జనాభా శాస్త్రం ముంబాయి శాఖ పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సామాజిక ఆర్థిక సర్వే మూడు ప్రధాన భాగాలుగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగంగా వర్గీకరించింది. వ్యవసాయ రంగంలో పశుసంపద, ఆటవీ భూములు, మత్స్య సంపద, పారిశ్రామికరంగంలో మైనింగ్, క్వారీలు, విద్యుత్ ఉత్పాదన, గ్యాస్, నీటిసరఫరా గృహనిర్మాణం, సర్వీస్ సెక్టార్‌లో వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్లు ట్రాన్స్‌పోర్టు, శీతలీకరణ గిడ్డంగులు, రైల్వేలు, సమాచార రంగం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ఇండ్లు అద్దెలకు ఇవ్వడంతో పాటు ఇతర వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను సేవారంగాలుగా ఈ సర్వే గుర్తించింది. 9.7 శాతం వృద్ధితో ఈ మూడు డివిజన్లలో సర్వీస్‌సెక్టార్ అగ్రగామిగా నిలిచింది. పారిశ్రామిక వృద్ధి 4.1శాతంగా, వ్యవసాయ రంగం -10.3 శాతంగా నమోదైంది. గడిచిన పదేళ్ల్లుగా వ్యవసాయ రంగం క్రమంగా బలహీన పడుతున్నది. సేవారంగం బలపడుతూ వచ్చింది. సాధారణంగా ఇది అబివృద్ధి సూచిక. కానీ, అహార భద్రత కల్పించడం వ్యవసాయం ద్వారానే సాధ్యం. తెలంగాణలో వ్యవసాయానికి ప్రధానమైన ఇబ్బంది సకాలంలో వర్షాలు రాకపోవడమే.. ఇతర ప్రాకృతిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. వీటి నుంచి బయటపడటం అహారభద్రతకు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయరంగాన్ని బలపరచడం, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించినప్పుడు వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామిక రంగానికి ఇతోధిక ప్రాధాన్యం ఇస్తూనే సేవారంగాలను కూడా బలపరచాలని సర్వే చెప్పింది. అందుకోసమే ఈ బడ్జెట్‌లో ప్రధానంగా సాగునీటి వనరులు, విద్యుత్ రంగం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించింది.
- (నమస్తే తెలంగాణ)
No comments:
Post a Comment