* సీఎం కేసీఆర్ కోరిక మేరకు గుట్ట క్షేత్రం పేరుమార్చిన చినజీయర్‌స్వామి
* చుట్టూ ఎనిమిది గుట్టలతో నవగిరులుగా అభివృద్ధి
* యాదాద్రిపై నరసింహస్వామి 32 అవతారాల ప్రతిష్ఠాపన
* ఆగమశాస్త్రం ప్రకారమే గుట్ట అభివృద్ధి: సీఎం కేసీఆర్
* చినజీయర్‌స్వామితో కలిసి ఏరియల్ సర్వే
* ఆరున్నర ఎకరాల్లో ఆలయం విస్తరణ
* భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇక నుంచి యాదాద్రిగా అభివృద్ధి చెందనుంది. యాదగిరీశుడి చల్లని దీవెనలతో భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం తన చుట్టూ ఉన్న మరో ఎనిమిది గిరులతో కలిసి నవగిరులుగా ప్రసిద్ధికెక్కనుంది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దేశంలోని ప్రముఖ హిందూ క్షేత్రాలన్నింటికీ దీటుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరికమేరకు త్రిదండి చినజీయర్‌స్వామి పుణ్యక్షేత్రం పేరు మార్చారు. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో యాదాద్రితోపాటు దానికి ఆనుకొని ఉన్న ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులుగా పిలుచుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటికి కూడా నామకరణం చేయాలని చినజీయర్‌స్వామిని కోరగా, త్వరలో వాటిపేర్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఆలయాన్ని ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గుట్ట అభివృద్ధి కోసం శరవేగంగా చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి గురువారం చినజీయర్‌స్వామితో కలిసి యాదగిరిగుట్ట పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆలయ విస్తరణ, మౌలికసదుపాయాల పెంపు, పర్యాటక ప్రాంతంగా గుట్టను అభివృద్ధి చేసేందుకు ఉన్న సౌకర్యాలను వారు పరిశీలించారు. ఆలయ విస్తరణకోసం రూపొందించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ముఖమండపంలో ముఖ్యమంత్రి, వేదపండితులు, అర్చకులు, అధికారులు, సిబ్బందికి చినజీయర్‌స్వామి ప్రవచనం చేశారు. యాదగిరి కొండపై ఇప్పుడున్న గర్భగుడిని కేంద్రంగా చేసుకొని ఆరున్నర ఎకరాల్లో ప్రాకారాలు, నిర్మాణాలు చేయాలన్న సీఎం ఆలోచనలకు చినజీయర్‌స్వామి ఆమోదముద్ర వేశారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు. స్థపతులు, వాస్తుశిల్పులు రూపొందించిన ప్లాన్లను చూసిన చినజీయర్‌స్వామి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. నిర్మాణమయ్యే ప్రాకారంలోనే శ్రీవారి కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా కల్యాణ మండపం, సాధారణ భక్తులు వివాహాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం మరో సాధారణ మండపం నిర్మించాలని సూచించారు. గర్భాలయం నుంచి ప్రాకారం 462 - 452 సైజుల్లో ఉండాలని, ప్రాకారం చివరలో ప్రసాదాల విక్రయాలు ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు.
ప్రధాన గుడి ముందు హరితనందనం
గుట్టపై ప్రధాన గుడికి ముందు భాగంలో మరో పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితనందనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించే పదార్థాల తయారీకి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్టపైన వంద వాహనాలు, గుట్ట కింద ఐదువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాన ఆలయంఉన్న యాదగిరిగుట్టతోపాటు చుట్టూఉన్న మరో ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు ఏర్పాటుచేస్తామని సీఎం వివరించారు.
సీఎం, జీయర్‌స్వామి ఏరియల్ సర్వే
యాదరిగిగుట్ట అభివృద్ధి కోసం గుట్ట చుట్టూ చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్‌స్వామి గురువారం ఏరియల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్టతోపాటు అభివృద్ధి చేయాలనుకున్న చుట్టుపక్కల గుట్టలను కూడా చినజీయర్‌స్వామికి సీఎం చూపించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట మార్గాలను, ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులను వివరించారు. రాయగిరి, యాదగిరిగుట్ట చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు ఫారెస్టును నరసింహస్వామి అభయారణ్యంగా మార్చే ప్రతిపాదన ఉన్నదని చెప్పారు. జాతీయరహదారి, రైల్వే లైను పక్కనే ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సులువుగా పుణ్యక్షేత్రానికి రావచ్చని వివరించారు. అనంతరం 12 గంటలకు కొండపైకి చేరుకొని లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చినజీయర్‌స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువణువును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేర్వేరు ఎత్తుల్లో అందుబాటులో ఉందని, ఆరు ఎకరాల్లో ప్రధాన ఆలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని మ్యాప్‌ల ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. ప్రతిపాదిత స్థలాలను, దిక్కులను చూపించారు.
దేశంలోని 32 నరసింహుడి రూపాలను యాదగిరి గుట్టలో ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. ఆలయ నిర్మాణ రూపశిల్పులు, స్థపతి, వేదపండితులు, దైవ క్షేత్రాల నిర్మాణ, నిర్వహణలో అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తీసుకొని డిజైన్లు రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆంజనేయస్వామి విగ్రహానికి అనుబంధంగా భక్తుల మండల దీక్షల కోసం ఒక మంటపాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. (-నమస్తే తెలంగాణ)
No comments:
Post a Comment