పాపికొండలంటే గుర్తొచ్చేది గోదారమ్మే! కానీ.. అంతే స్థాయిలో కృష్ణమ్మ పొదువుకున్న సింగారాలున్నాయి! ఎత్తయిన కొండల మధ్య.. కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ.. ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు.. వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది! పడవ బయల్దేరితే.. ఆప్యాయంగా పలకరిస్తుంటుంది! మొన్నటిదాకా పోలీసులు, మావోయిస్టుల తుపాకులు పలకరించుకున్న ప్రాంతం.. ఇప్పుడు జాలర్లు హైలెస్సా అంటూ పాడే పాటలకు మౌనంగా గొంతుకలుపుతున్నది! అసలు అంతటి అద్భుత ప్రాంతం కృష్ణమ్మకు సొంతమని చాలా తక్కువ మందికే తెలుసు! అక్కడికి వెళ్లేవావరు? ఆ అందాలు వెలికి తీసి.. బయటి ప్రపంచానికి చాటేదెవరు? నమస్తే తెలంగాణ ఆ ప్రయత్నం చేసింది! బాధ్యత తీసుకుంది! భావి తెలంగాణలో మరో అద్భుత పర్యాటక ప్రాంతమయ్యేందుకు సకల అర్హతలూ ఉన్న ఒక ప్రకృతి నిలయాన్ని అత్యంత సాహసానికోర్చి.. కన్నులారా చూసింది! తన కళ్లతో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది!! ఎవరా ప్రకృతి రమణి? ఎక్కడుందా రమణీయ కాంతి?
హైదరాబాద్ నుంచి దాదాపు దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్‌నగర్ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది. అలాగే కొల్లాపూర్ సమీపంలో పుణ్య క్షేత్రమైన సోమశిల, అమరగిరి తదితర ప్రాంతాల నుంచి శ్రీశైలం వరకు ఇలాంటి మరబోటులను ఏర్పాటు చేయవచ్చు.
సోమశిల నుంచి సుమారు 10 గంటలపాటు నదిపై మరబోటు ప్రయాణం చేస్తే శ్రీశైలం రిజర్వాయరు డ్యాం, పాతాళగంగకు చేరుకుంటారు. కొండకోనల్లో కృష్ణానది వంపు సొంపులుగా తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటుంది. పచ్చటి కొండల మధ్య చుట్టూ కనిపించే దట్టమైన అటవీ ప్రాంతాన్ని చూస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పేరెన్నికగన్న పర్యటక ప్రాంతమైన పాపికొండలను తలదన్నేట్లుగా ఉన్న నల్లమల కొండల మధ్య కృష్ణానదిలో ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే పాలమూరులో పూర్తిగా వెనకబడిపోయిన కొల్లాపూర్ నియోజకవర్గం రూపురేఖలు మొత్తం మారిపోతాయి. తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున మత్స్య సంపదకు మూల వనరుగా ఈ ప్రాంతం మారే అవకాశముంది. నవతెలంగాణ కల సాకారమవుతున్న వేళ...
అక్కడ దట్టంగా విస్తరించి ఉన్న నల్లమల అందాలను ఆవిష్కరించే ప్రయత్నానికి ‘నమస్తే తెలంగాణ’ పూనుకున్నది. ఇది వరకు వెలుగు చూడని ఈ ప్రాంతాన్ని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉన్నా గట్టి సంకల్పంతో పని పూర్తి చేసింది. అన్వేషించదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నప్పటికీ, క్లిష్టమైన ప్రయాణం కాబట్టి అమరగిరుల అందాలను పరిమితంగానే వెలుగులోకి తీసుకొచ్చింది.
సోమశిల నుంచి శ్రీశైలం
సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదీ తీరంలో వరుసగా నిలబడి ఉన్న కొండలు, గట్లు కనువిందు చేస్తాయి. ఒక్కో కొండపై ఒక్కో రకమైన నేల స్వభావం కలిగి ఉంటుంది. పక్కపక్కనే ఉన్న కొండల్లో కూడా చెట్లు పెరిగిన తీరులో కనిపించే రంగులో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొండల ఆకారాలు ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. అక్కడక్కడా రాళ్లతో కూడిన కొండలు సూర్యకాంతిలో బంగారు వర్ణంతో మెరిసిపోతుంటాయి. ఓ కొండ గుబురు చెట్లకు నిలయమైతే మరో కొండలో అక్కడక్కడ చెట్లు విస్తరించిన గడ్డితో ఉంటాయి. కోతులు, తిమ్మన్నలు, నెమళ్లు, చిరుతలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వెనుక నుంచి ఇక్కడి వరకు నిలిచిన కృష్ణమ్మ చలచల్లని గాలికి చిన్న చిన్న అలలుగా పలకరిస్తూ ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. సోమశిల నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే పచ్చని అందాలు కనువిందు చేస్తుంటాయి. ఎత్తైన కొండలు... ఆ కొండలను ఆవరించిన పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలితో స్వాగతం పలుకుతాయి... ఇంకొంచెం ముందుకు సాగగానే.. నీట మునిగిన అమరగిరి ఊరు ఆనవాళ్లు.. పునరావాసం పొందిన గ్రామాలు కనిపిస్తాయి. నీటి మునిగిన అమరగిరికి గుర్తుగా ఓ పెద్ద రావిచెట్టు, భక్తి పారవశ్యాన్ని కలిగించే శివలింగం దర్శనమిస్తాయి. అక్కడ ఉండే సొరంగం ఎక్కడి వరకు ఉంటుందో అంతు తెలియదని అందులో పెద్ద బొంగులు తోసినా లోపలికే వెళతాయని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. శ్రీశైలం రిజర్వాయరు నిర్మాణం కోసం నీట మునిగిన పాత అమరగిరి, మారుగుంది, ఎర్రమటం, మాడ్గుల, రాంపురం, ముక్కిడి గుండం, నార్లాపూర్, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలు ఈ ప్రవాహం కిందే ఉంటాయి. నీటి మట్టం తగ్గితే తప్ప వాటి ఆనవాళ్లను మనం చూడలేం. అయితే నదికి ఇరువైపులా ఆదివాసీలు, చెంచులు, జాలరులు చేపలవేటే ప్రధాన వృత్తిగా ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారానికొకసారి సమీపంలో ఉన్న కొల్లాపూర్ సంతకు రావడమే తప్ప బాహ్య ప్రపంచం వీరికి తెలియదు.
ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ.. జొన్నల రాశిని గుర్తుకు తెచ్చే జొన్నలరాశి బోడ గట్టు, అమరగిరి ద్వీపాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం నీటిని తోడిపోసే ప్రదేశం.. ఎత్తిపోతలపై సంపూర్ణ అవగాహన కలిగిస్తుంది. జానపండ్లకు పేరెన్నికగన్న జానళ్లకొండలు, మత్స్యకారులు నివాసం ఏర్పాటు చేసుకున్న ఎర్రగుండు, ఒకప్పుడు ఎర్రగట్టు బొల్లారంగా పేరెన్నికగన్న కోతిగుండు కనిపిస్తాయి. విశాలమైన నదీ పరీవాహక ప్రాంతం ‘దుర్గం బయలు’గా కనిపిస్తోంది. కొండలు, గుట్టలు ఉన్నా అక్కడికి దూరంగా ఉండటం వల్ల నది విస్తారంగా ఆవరించి కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు వైపు సాగుతున్న ప్రయాణంలో గుండ్లపెంట, సోములకుంట, సోములకుంటవాగు, బేతంచర్ల కాలువ, ఒకప్పుడు వరదకు కొట్టుకొచ్చి గట్టుకు చేరడంతో ఆ పేరొచ్చిన ఎద్దులకొండ, లింగమయ్యపెంట, ఒకప్పుడు అధికంగా గొర్రెలు మేతకు వచ్చే ‘తుమ్మతోక’ కనువిందు చేస్తాయి. బంగారు రంగుతో కనిపించే దేవుని కొండ, పచ్చగూటి, నీటి గంగ, ప్రమాదాలు పొంచి ఉన్న సుడిగుండాలు అచ్చెరువొందిస్తాయి.
మత్స్యసంపద
నిత్యం 50కిపైగా మరబోట్లతోపాటు పుట్టీల ద్వారా వందల సంఖ్యలో మత్సకారులు చేపల వేట, వ్యాపారం చేస్తారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేసిన వారు కోట్లకు పడగపూత్తినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రా వేటగాళ్ల అడ్డాలు
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారులు ప్రధానంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. సుమారు 50 ప్రాంతాల్లో వీరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికులు అడ్డుకొని కేసుల దాకా వెళ్లినా వారి ఆధిపత్యం కొనసాగుతోంది. స్థానిక వ్యాపారులు కొందరు వారికి అడ్వాన్సులు చెల్లించి చేపలను సేకరిస్తుంటారు.
అపారమైన కలప
నల్లమలలోని విలువైన తదితర కలప ఈ నీటి ద్వారా సరఫరా అవుతోంది. కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా చెట్టను కొట్టి పుట్టీల్లో తరలిస్తున్నారు. ఈ విధంగా ఓ భారీ మొద్దు తరలించేందుకు రూ. 5వేల వరకు కూడా వెచ్చిస్తున్నారు.
పర్యాటకానికి భారీ అవకాశం
పేరు గాంచిన అనేక పర్యాటక స్థలాలతో పోలిస్తే సోమశిల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పర్యటన చాలా రెట్లు ఆహ్లాదభరితంగా ఉంటుంది. వాస్తవానికి 2002 సెప్టెంబరులోనే శ్రీశైలం వరకు ప్రయాణించేందుకు పర్యాటక శాఖ వారు సోమశిల సమీపంలోని చెల్లెపాడు వద్ద శైలశిరి పేరుతో ఓ బోటును నిర్మించే పనిలో ఉండగానే.. మావోయిస్టులు దాన్ని పేల్చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు. పర్యాటక శాఖ చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని నిపుణులతో పూర్తి స్థాయిలో సర్వే చేసి కొంతమేరకైనా అభివృద్ధి చేస్తే ప్రతి సంవత్సరం ప్రాజెక్టులో నీరు బాగా ఉండే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి పర్యాటకుల నుంచి లాభం చేకూరే అవకాశం ఉన్నది. నవ తెలంగాణ నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారనుంది. పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనున్నది.
ఆకుపచ్చటి రంగు పులుముకొని.. నిటారుగా నిలబడి గంభీరంగా మనకేసి చూస్తుండే దట్టమైన నల్లమల కొండలు. అనంతమైన అందాలను ఇముడ్చుకున్న ఈ దుర్గమారణ్యాన్ని సరిగ్గా మధ్యలోకి చీలుస్తూ.. సుడులు తిరుగుతూ.. చిట్టిపొట్టి జలపాతాలన్నింటినీ తనలో కలిపేసుకుని బిరాబిరా ముందుకురికే కృష్ణమ్మ. ఈ ప్రవాహపు ధాటికి తలొగ్గి నీటిలోనే దాగిపోయి వేదఘోష చేస్తూ.. కృష్ణవేణికి అంజలి ఘటించే వందలాది గోపురాలు. అడుగడుగునా వర్ణాలు మారుతూ దర్శనమిచ్చే గోవర్ధనాలు. సేద దీరేందుకు.. పంక్తి భోజనాలు చేసేందుకు ఆశ్రయమిచ్చే వృక్షరాజాలు. అలలపై కనిపించి చటుక్కున మాయమయ్యే చిలిపి చేపలు. మదిని స్పృశించే నీటి తుంపరలు. గురితప్పని వేట కోసం కాచుకుని కూర్చున్న చిరుతలు. చెట్టు కొమ్మలపై సయ్యాటలాడే తిమ్మన్నలు. పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. వీటన్నింటికీ పున్నమి వెలుగులు కలిస్తే.. మధురమైన కృష్ణా తరంగాల సారంగ రాగాలు. అలాంటి అందమైన అడవుల్లో వడివడిగా సాగే కెరటాలపై ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే.. పాలమూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ప్రచారకాంతి ప్రసరించని నల్లమల అడవుల్లో దాగిపోయి రతనాల రాశుల్లాగా పడి ఉన్న ప్రకృతి అందాలను చూసి తరించాల్సిందే!
ఒకప్పుడు..: దట్టమైన నల్లమల దుర్గమారణ్యం. పగలు పోలీసులు.. రాత్రుళ్లు మావోయిస్టులు ఒకరి ఒకరు ఒకరి కోసం మరొకరు వెతుకులాడిన ప్రాంతం. అన్నల ఉద్యమానికి అడ్డా. ఏ రోజు ఎవరొస్తారో ఎవరికి ఆశ్రయమివ్వాలో..ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో గజగజలాడిపోయిన గ్రామాలు.. ఎక్కడెక్కడో జరిగే ఉద్యమ సంచలనాలకు సంఘటనలకు బీజం పడి.. ఎర్రబావుటా ఆశయాలకు నెలవైన చారివూతక ప్రాంతం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం పొదువుకున్న అందాలు చాన్నాళ్ల వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉండిపోయాయి.
ఇప్పుడు..: పరిస్థితి మారింది. వేగంగా పయనించిన కాలం.. అనేక మార్పులు చేసింది. ఇప్పుడక్కడ ఏ చడీ చప్పుడూ లేదు. అన్నలు లేరు. వారిని వెతికేందుకు పోలీసులూ రారు. మునుపటి భయం వీడి ఆయా గ్రామాల ప్రజలు ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు. అయితే.. ఈ ప్రాంతపు వెనుకబాటుతనాన్ని, ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్న రాబందులు మాత్రం నల్లమల అటవీ సంపదపై కన్నేశాయి. కబళించేస్తున్నాయి. జరుగుతున్న అన్యాయాన్ని నిస్సహాయంగా చూసేవారు కొందరైతే.. కళ్లప్పగించి చూస్తున్నది మరికొందరు. అందుకే.. ఇప్పుటికీ ఈ ప్రాంతం అనామకంగానే ఉండిపోయింది.
చుక్కల కొండ
కృష్ణానదీ ప్రవాహంలో చూపరులను మైమరపించే ప్రదేశం చుక్కల కొండ. నదిలో వెళుతుండగా రెండు ఒడ్ల నుంచి చెట్లు కమ్మేసి ఆకాశం కనిపించదు.. చీకటిగా ఉంటుంది. అక్కడక్కడ చుక్కల్లా కనిపిస్తాయి. దీంతో ఆ ప్రాంతానికి చుక్కల కొండ అని పేరు వచ్చింది.
అక్కమహాదేవి గుహలు
శ్రీశైలం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నల్లమల గట్టుపై అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. శ్రీశైలం వైపు ప్రాజెక్టు నీటిలో ఉన్న చివరి పర్యాటక కేంద్రం. అక్కడికి నేరుగా పాతాళ గంగ నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నది.
క్లిష్టమైన ప్రయాణం.. కొంచెం ఓపిక పట్టండి
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో నమస్తే తెలంగాణ బృందం చేసిన ప్రయాణం పూర్తిగా సంక్లిష్టమైనది. దాదాపు వంద కిలోమీటర్ల పొడవునా సాగే ఈ నదీ దారిలో మొబైల్ సిగ్నల్ ఉండదు. కిలోమీటరు వెడల్పు ఉండే ఈ ప్రవాహానికి అటూ ఇటూ ఎక్కడో ఒక చోట జాలర్లు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. జాలర్లు నదిలో పేర్చిన చేపల వలలు తగిలితే బోటు గల్లంతే. ఈతరాని వారు జలసమాధి అవుతారు. ఈతొచ్చిన వారు గట్టుకు చేరుకున్నా ఆ తర్వాత ఎటు దిక్కుతోచనంత పెద్ద అడవులవి. అదీగాక.. ఇదే ప్రాంతంలో పుట్టి మునిగి వందల మంది నీటిలో జలసమాధి అయ్యారు. కొన్నాళ్ల క్రితం వెనుకవైపు సిద్దేశ్వరం నుంచి మంచాల కట్ట వైపు వస్తున్న సింగోటం లక్ష్మీనర్సిహ్మ స్వామి వారి భక్తులు 62 మంది నీట మునిగి మరణించారు. అంతకుముందు నల్లమలలో క్యాడర్ నిర్మించిన మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ అలియాస్ సాంబశివుడు కూడా ఈ ప్రాంతంలోనే ఇలాగే ప్రయాణం చేస్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇవిగాక నాటు పడవలు, మరబోట్ల ప్రమాదాల్లో అనేక మంది మత్సకారులు చనిపోయారు. అయినా సరే.. అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సాధ్యాసాధ్యాలపై అనుమానాలు, శషభిషలు ఎదురైనా అనుకున్న ప్రయాణాన్ని కొనసాగించింది. కేవలం చేపల సరఫరా కోసం మాత్రమే ఉపయోగించే ‘తోకబోటు’లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేకుండానే రిస్కు తీసుకొని మరీ బయలుదేరి గమ్యం చేరుకున్నది. ఓ మంచి ఆవిష్కరణను పరిచయం చేయాలనే దృఢ చిత్తంతో ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి ప్రయాణం అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వం ముందుకొచ్చి సురక్షితమైన బోట్లు ఏర్పాటు చేస్తేనే ప్రయాణం క్షేమంగా సాగుతుంది. లేదంటే అనవసరంగా కష్టాలు కొనితెచ్చుకున్నట్టే. అందుకే అప్పటిదాకా ఓపికపట్టండి!!
ఆంకాళమ్మ కోట
చీమల తిప్పకు పక్కనే ఆంకాళమ్మ కోట ఉన్నది. ఇక్కడ కాళికాదేవి కొలువై ఉంది. కృష్ణానదిలో చేపల వేట కొనసాగిస్తున్న మత్స్యకారులకు, చెంచులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈకోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గుప్త నిధుల వేటలో కాళికాదేవి విగ్రహం కూడా శిధిలమైంది. కొన్నేళ్ల క్రితం మత్స్యకారులు, చెంచులు చందాలు పోగు చేసుకొని కాళికాదేవి విగ్రహాన్ని పునఃవూపతిష్ఠించి గుడిని నిర్మించారు.
నదీ తీరంలో 600 అడుగుల ఎత్తయిన దుర్బేధ్యమైన ఈ కోటలోకి మత్స్యకారులు, చెంచులు నడిచి వెళ్లేందుకు మార్గం సుగమమం చేశారు. కోటపైన సుమారు 20 ఎకరాల్లో దట్టమైన అడవి విస్తరించి ఉన్నది. ఈ గుట్టపై స్నానాల గుండం ఉండడం కూడా విశేషం. ఆంకాళమ్మ .. పేరు వినేందుకు భయంకరంగా ఉన్నా గుడిలోని అమ్మవారు మాత్రం సింహాసనంపై ఆసీనురాలై ప్రశాంత వదనంతో భక్తులకు అభయహస్తం ఇస్తూ కనిపిస్తుంది. గతంలో ఇక్కడ రాజుల కాలంలో జాతర కూడా జరిగేదని, మొక్కుబడులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులు చెబుతున్నారు. అమ్మవారి ముందు పొట్టేలు, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి పూజారులు చెంచులు. వాళ్లే అమ్మవారికి నైవేద్యాలను సమర్పిస్తారు. కొల్లాపూర్ నల్లమల అటవీ తీర గ్రామాలైన అమరగిరి, మొలచింతలపల్లి, సోమశిల, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, దుర్గం, కొల్లాపూర్‌తో పాటు వివిధ చెంచు గ్రామాల నుంచి భక్తులు ప్రతి మంగళవారం తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కోటలోకి వెళ్లగానే ముందుగా ఆంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత కాళికాదేవి విగ్రహం కొలువు తీరి ఉన్నది. అక్కడికి కొంత దూరంలో స్నానాల గుండం ఉంది,. అదే మార్గంలో శివుడు, వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ కోటపైకి ఇప్పుడిప్పుడే భక్తుల సందడి పెరుగుతుండటంతో ఆంకాళమ్మ కోటకు పూర్వ వైభవం దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ కోటను దశాబ్దం క్రితం అప్పటి పురావస్తు డైరెక్టర్ డాక్టర్ వీవీ కృష్ణశాస్త్రి, ఈమని శివనాగిడ్డి, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కొప్పుల రాజు సందర్శించి.. దీని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి వారు సూచనలు చేసినా లాభం లేకుండా పోయింది.
చీమల తిప్ప
సోమశిల నుంచి నదిలో మూడు కిలోమీటర్లు పయనిస్తే నయనమనోహరంగా కనిపించే ‘చీమల తిప్ప’ ద్వీపం ఎదురవుతుంది. విశాఖ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్స్యకారులు 20 ఏళ్ల క్రితమే ఇక్కడికి వలస వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. చేపల వ్యాపారానికి ఈ తిప్ప ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఇక్కడి నుంచే ఏటా కోట్ల రూపాయల చేపల వ్యాపారం జరుగుతున్నది. అక్కడ నివసించే మత్స్యకారుల పిల్లలకు చదువు ఉండదు. కనీస వసతులు ఉండవు. 2009లో వచ్చిన వరదల్లో గట్టు పైకి వెళ్లి తలదాచుకున్నారు తప్ప..ఇప్పటికీ వారు తిప్పను వదలలేదు. ఆ పక్కనే ఉన్న ఆంకాలమ్మ కోటపై నుంచి చీమల తిప్పను చూస్తే ఆ అనుభూతిని వర్ణించడం సాధ్యం కాదు.- నమస్తే తెలంగాణ
No comments:
Post a Comment