Tuesday 24 July 2018

తండ్రిని కాపాడిన మూడేళ్ల చిన్నారి.. ఎలాగంటే?


సరిగా మాటలు కూడా రాని మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైన తన తండ్రిని వీడియోకాల్ ద్వారా కాపాడింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని వించెస్టర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. వించెస్టర్‌కు చెందిన ట్రెవర్ మెక్‌‌కేబ్, డెవాన్ మెక్‌‌కేబ్ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. డెవాన్ మెక్‌‌కేబ్ ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న ట్రెవర్ మెక్‌‌కేబ్ తన మూడేళ్ల కూతురు మాలితో ఆడుకుంటుండగా.. హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కింద పడిపోయాడు. 

తన తండ్రి ఎంతకూ లేవకపోవడంతో.. మాలి ఏడ్వటం మొదలు పెట్టింది. తన తండ్రిని తడుతూ లేపడానికి ప్రయత్నించింది. అయినా తండ్రిలో స్పందన రాలేదు. దీంతో మాలీ తన తండ్రి జేబులోని సెల్‌ఫోను తీసుకుని 'ఫేస్‌టైమ్' ద్వారా తన తల్లికి వీడియో కాల్ చేసింది. తల్లి ఫోన్ తీయగానే బిగ్గరగా ఏడుస్తూ.. నాన్నకు ఒంట్లో బాలేదని చెప్పి.. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. ఫోన్ కెమెరాను తండ్రివైపు ఉంచి తల్లికి చూపించింది. 

దీంతో అప్రమత్తమైన చిన్నారి తల్లి 911కి ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ట్రెవర్‌ హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో చికిత్స చేసి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ విషయమై డెవాన్ మెక్‌‌కేబ్ మీడియాతో మాట్లాడుతూ.. తన చిన్నారి కారణంగా అద్భుతం జరిగి, భర్త ప్రాణాలు నిలిచాయని ఆనందం వ్యక్తం చేసింది. తన కూతురు 'సూపర్ మ్యాన్' అంటూ ప్రశంసించింది. దీంతో వించెస్టర్ ప్రాంతంలో ఈ చిన్నారి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. 

Saturday 14 July 2018

థాయ్ గుహ: 9 రోజులు ఆహారం లేకుండా ఎలా గడిపారు..?


17 రోజులపాటు థాయ్‌లాండ్‌లోని థామ్‌ లూవాంగ్‌ గుహలో చిక్కుకున్న 12 మంది బాలలను, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను రెస్య్కూ టీమ్ సురక్షితంగా కాపాడిన సంగతి తెలిసిందే. వీరంతా జూన్ 23న గుహలోకి వెళ్లారు.. అక్కడ చిక్కుకున్న వీరి ఆచూకీని 9 రోజుల తర్వాత అధికారులు గుర్తించారు. వారంపాటు కష్టపడి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే 9 రోజులు ఆ చీకటి గుహలో, కనీసం ఆహారం కూడా లేకుండా ఆ చిన్నారులు ఎలా గడిపారు, వారికి అంత శక్తి ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 

ధ్యానం ద్వారానే సాధ్యమైంది: 
ఆహారం లేకున్నా పిల్లలంతా ఉండటానికి కారణం బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన 'ధ్యానమే'. ధ్యానం చేయడం ద్వారానే పిల్లలు శక్తిని పొంది 9 రోజులపాటు ఆహారం లేకుండా ఉండగలిగారు. ధ్యానమే వారిని కాపాడింది. అండర్-16 ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులైన పిల్లలందరూ 11 నుంచి 14 ఏళ్ల లోపువారే, వీరికి కోచ్‌గా 25 ఏళ్ల ఎకపోల్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ధ సన్యాసి. ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది. అందులో భాగంగానే చిన్నవయసులోనే ఆయన అండర్-16 ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావడంతో వారంతా లోపలే చిక్కుకుపోయారు. 

ఆధ్యాత్మిక ప్రభోదాలు: 
అయితే.. పిల్లలను బతికించేందుకే బౌద్ధ సన్యాసి, కోచ్ అయిన ఎకపోల్.. పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై వారికి పాఠాలు చెప్పారు. ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశారు. ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవడం ద్వారా బతకవచ్చని.. పిల్లలతో ధ్యానం చేయించారు. తన వెంట తీసుకెళ్లిన బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు పంచిపెట్టాడు. అందులో ఒక్క ముక్క కూడా అతను తీసుకోలేదు. రోజూ నాలుగుసార్లు పిల్లలతో ధ్యానం చేయించారు. పిల్లల్లో ఆందోళనను దూరం చేసి, వారిని కాపాడగలిగారు.

రియల్ హీరో: 
ఈ సంఘటనకు తానే బాధ్యుడినంటూ.. గుహలోనుంచే చిన్నారుల తల్లిదండ్రులకు కోచ్‌ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖను థాయ్‌ నేవీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ‘చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. అందరూ నైతిక మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. పిల్లల తల్లిదండ్రులందరినీ క్షమించమని వేడుకుంటున్నా’ అని కోచ్‌ కోరిన సంగతి తెలిసిందే. అయితే నేర్పుతో పిల్లలను కాపాడిన కోచ్‌ను ప్రపంచం ఇప్పుడు రియల్ హీరోగా కీర్తిస్తోంది.

వారంతా గుహలో ఇలా చిక్కుకున్నారు: 
థాయ్‌లాండ్‌లోని చియంగ్‌ రాయ్ అనే రాష్ట్రంలో డోయ్ నంగ్ పర్వతంలో ఈ గుహలు ఉన్నాయి. ఇవి కొండ లోపలికి దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఓ ఫుట్‌బాల్ టీమ్ కోచ్.. తన జూనియర్ టీమ్ సభ్యులతో కలిసి జూన్ 23న సైక్లింగ్ చేసుకుంటూ ఈ గుహల వద్దకు వచ్చారు. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండంతో గుహలోపలికి వెళ్లారు. గుహ ప్రవేశమార్గం మొత్తం నీటితో నిండిపోవడంతో సురక్షిత ప్రాంతంలో తలదాచుకునేందుకు వారంతా గుహ లోపలకి వెళ్లడం మొదలుపెట్టారు. వారు లోపలికి వెళ్లేకొద్ది నీరు కూడా వారిని వెంబడించడం మొదలుపెట్టింది. అలా వారు ఆ నీటిలో చిక్కుకోకుండా గుహలో దాదాపు నాలుగు కిలోమీటర్లు లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత వరద పెరిగి గుహలో ఉన్న భారీ గుంతల్లో నీరు చేరుకుంది. దీంతో వారు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఆ గుహలోనే చిక్కుకుపోయారు. 

Tuesday 3 July 2018

ఒకే ఒక్కడు.. వందల ప్రాణాలు కాపాడాడు!


రైల్వేట్రాక్ వెంట చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునే వ్యక్తి.. తన సమయస్ఫూర్తి, సాహసంతో వందలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాలోని ధలాయ్ జిల్లా దంచార గ్రామానికి చెందిన స్వపన్ దిబ్బార్మ అనే వ్యక్తి.. స్వపన్‌ దిబ్రామ రైల్వేట్రాక్‌ వెంబడి సేకరించిన చిత్తుకాగితాలనూ, ప్లాస్టిక్‌ బాటిల్లనూ అమ్ముకుంటూ వాటితో జీవనం సాగిస్తున్నాడు. రోజూలానే ఆ రోజు కూడా పనికోసం, తన చిన్నారి కూతురుతో కలిసి రైల్వేట్రాక్ మీదకి వచ్చాడు. అలా ముందుకు నడుస్తూ… దొరికిన ప్లాస్టిక్‌ బాటిల్లను, చేతిక తగిలించుకున్న సంచిలో వేసుకుంటున్నాడు. ఇంతలో ఓ దృశ్యాన్ని చూసి సడన్‌గా ఆగిపోయాడు. ఎదురుగా విరిగి ఉన్న రైలు పట్టా చూసి షాక్ తిన్నాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ఒక రైలు కూత వేసుకుంటూ.. విరిగిన రైలు పట్టావైపు వస్తోంది. రైలు ఇంతవరకూ వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తనకి తెలుసు. ఎవరికైనా చెబుదామంటే చుట్టూ ఎవరూ లేరు. చెప్పే టైము కూడా లేదు. ఎలాగోలా తనే ధైర్యం చేశాడు. కూతురిని పక్కనే ఉండమని చెప్పి, పట్టాల మధ్యలో నిలబడ్డాడు.

తనపాప వేసుకున్న చొక్కాను తిప్పుతూ… రైలుని ఆపమని డ్రైవర్‌కి సైగ చేశాడు. ఎలాంటి స్పందన లేదు. తన చొక్కానూ విప్పి, రెండింటిని కలుపి ఊపుతూ పెద్దగా కేకలేసాడు. ఈ సారి కూడా ఎలాంటి మార్పూ లేదు. ఇక లాభం లేదనుకుని, ఒకసారి తన కూతురు మొహం వైపు చూసి.. రైలుకు ఎదురుగా, కేకలు వేస్తూ, చొక్కాలు తిప్పుతూ పరిగెత్తాడు. ఈసారికి డ్రైవర్‌ తనను గమనించాడు. అయితే ఆ రైలుకు స్పీడ్‌ బ్రేకుల్లేవు. డ్రైవర్‌ అలర్ట్‌ అయి బ్రేకులు వేసాక, రైలు క్రమక్రమంగా వేగం తగ్గుతూ కదులుతోంది. అది గమనించి తన దగ్గరకు వచ్చాక స్వపన్‌ పక్కకి తప్పుకున్నాడు. పట్టాలు విరిగిన స్థలానికి, కొన్ని గజాల ముందు వరకూ వచ్చి రైలు ఆగిపోయింది. ఏ స్టేషనూ లేనిచోట రైలు ఆగడంతో, ఎంతోమంది ప్రయాణికులు అసహనంతో రైలు దిగారు. కారణం తెలుసుకుని విస్తుపోయి, దిబ్బార్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సమయంలో రైలులో దాదాపు 2000 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న త్రిపుర మినిస్టర్ రాయ్ బర్మన్.. ఈ తండ్రీకూతుళ్లను.. అతని అధికార నివాసానికి పిలిపించి.. ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి వీఐపీలు డిన్నర్ చేసే చోట వారితో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనుంది. వీరికి త్రిపుర ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించనుంది. దేశంలోని ప్రముఖులందరి ఇప్పుడు వీరిద్దరిని అభినందనలతో ముచ్చెతడంతో పాటు.. వారికి ప్రభుత్వం వెంటనే అవార్డులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


భారత మాజీ క్రికెటర్ వీరెంద్రసెహ్వాగ్ కూడా దిబ్రామ సాహసాన్ని మెచ్చుకున్నారు. రియల్ హీరోస్ అంటూ ఈ తండ్రీకూతుళ్లను కొనియాడారు.
https://twitter.com/virendersehwag/status/1008936071466401792