17 రోజులపాటు థాయ్‌లాండ్‌లోని థామ్ లూవాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది బాలలను, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను రెస్య్కూ టీమ్ సురక్షితంగా కాపాడిన సంగతి తెలిసిందే. వీరంతా జూన్ 23న గుహలోకి వెళ్లారు.. అక్కడ చిక్కుకున్న వీరి ఆచూకీని 9 రోజుల తర్వాత అధికారులు గుర్తించారు. వారంపాటు కష్టపడి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. అయితే 9 రోజులు ఆ చీకటి గుహలో, కనీసం ఆహారం కూడా లేకుండా ఆ చిన్నారులు ఎలా గడిపారు, వారికి అంత శక్తి ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
ధ్యానం ద్వారానే సాధ్యమైంది:
ఆహారం లేకున్నా పిల్లలంతా ఉండటానికి కారణం బుద్ధుడు ఈ ప్రపంచానికి నేర్పిన 'ధ్యానమే'. ధ్యానం చేయడం ద్వారానే పిల్లలు శక్తిని పొంది 9 రోజులపాటు ఆహారం లేకుండా ఉండగలిగారు. ధ్యానమే వారిని కాపాడింది. అండర్-16 ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులైన పిల్లలందరూ 11 నుంచి 14 ఏళ్ల లోపువారే, వీరికి కోచ్‌గా 25 ఏళ్ల ఎకపోల్ ఉన్నారు. ఆయన ఓ బౌద్ధ సన్యాసి. ఏదైనా సాధించాలనే తపన ఆయనలో ఉంది. అందులో భాగంగానే చిన్నవయసులోనే ఆయన అండర్-16 ఫుట్‌బాల్ కోచ్‌గా నియమితులయ్యారు. గుహలోకి వెళ్లిన తర్వాత వరదలు రావడంతో వారంతా లోపలే చిక్కుకుపోయారు.
ఆధ్యాత్మిక ప్రభోదాలు:
అయితే.. పిల్లలను బతికించేందుకే బౌద్ధ సన్యాసి, కోచ్ అయిన ఎకపోల్.. పిల్లలతో ధ్యానం చేయించారు. శరీరంలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై వారికి పాఠాలు చెప్పారు. ధైర్యం కోల్పోకుండా ఆధ్యాత్మిక ప్రభోదాలు చేశారు. ఒంట్లోని ఒక్కో అవయవం నుంచి శక్తిని తీసుకోవడం ద్వారా బతకవచ్చని.. పిల్లలతో ధ్యానం చేయించారు. తన వెంట తీసుకెళ్లిన బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను పిల్లలకు పంచిపెట్టాడు. అందులో ఒక్క ముక్క కూడా అతను తీసుకోలేదు. రోజూ నాలుగుసార్లు పిల్లలతో ధ్యానం చేయించారు. పిల్లల్లో ఆందోళనను దూరం చేసి, వారిని కాపాడగలిగారు.
రియల్ హీరో:
ఈ సంఘటనకు తానే బాధ్యుడినంటూ.. గుహలోనుంచే చిన్నారుల తల్లిదండ్రులకు కోచ్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖను థాయ్ నేవీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘చిన్నారులందరూ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. అందరూ నైతిక మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. పిల్లల తల్లిదండ్రులందరినీ క్షమించమని వేడుకుంటున్నా’ అని కోచ్ కోరిన సంగతి తెలిసిందే. అయితే నేర్పుతో పిల్లలను కాపాడిన కోచ్‌ను ప్రపంచం ఇప్పుడు రియల్ హీరోగా కీర్తిస్తోంది.
వారంతా గుహలో ఇలా చిక్కుకున్నారు:
థాయ్‌లాండ్‌లోని చియంగ్ రాయ్ అనే రాష్ట్రంలో డోయ్ నంగ్ పర్వతంలో ఈ గుహలు ఉన్నాయి. ఇవి కొండ లోపలికి దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఓ ఫుట్‌బాల్ టీమ్ కోచ్.. తన జూనియర్ టీమ్ సభ్యులతో కలిసి జూన్ 23న సైక్లింగ్ చేసుకుంటూ ఈ గుహల వద్దకు వచ్చారు. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండంతో గుహలోపలికి వెళ్లారు. గుహ ప్రవేశమార్గం మొత్తం నీటితో నిండిపోవడంతో సురక్షిత ప్రాంతంలో తలదాచుకునేందుకు వారంతా గుహ లోపలకి వెళ్లడం మొదలుపెట్టారు. వారు లోపలికి వెళ్లేకొద్ది నీరు కూడా వారిని వెంబడించడం మొదలుపెట్టింది. అలా వారు ఆ నీటిలో చిక్కుకోకుండా గుహలో దాదాపు నాలుగు కిలోమీటర్లు లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత వరద పెరిగి గుహలో ఉన్న భారీ గుంతల్లో నీరు చేరుకుంది. దీంతో వారు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఆ గుహలోనే చిక్కుకుపోయారు.
No comments:
Post a Comment