Thursday 25 July 2013

జజ్జనకరి జనారే.. తెలంగాణ ఖరారే


* హస్తినలో టీ కసరత్తు ముమ్మరం
* కేబినెట్‌నోట్ సిద్ధం చేస్తున్న హోంశాఖ!
* కోర్‌కమిటీ నుంచి సీడబ్ల్యూసీకి .. అటు నుంచి పార్లమెంటుకు.. వేగంగా సాగుతున్న తెలంగాణ ఫైలు
* ఈ నెల 28న సీడబ్ల్యూసీ సమావేశం?
* దానికి ముందే 26న కోర్ కమిటీ భేటీ!
* మళ్లీ హస్తినకు రమ్మని ఆ ముగ్గురికీ పిలుపు
* ఢిల్లీకి వెళుతున్న సీఎం, డిప్యూటీ, పీసీసీ చీఫ్
*  శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం!
* 145 రోజుల్లో ముగియనున్న ప్రక్రియ
* తాజా పరిణామాలే నిదర్శనం.. స్పష్టమైన సంకేతాలే నమ్మకం
* ఆజాద్ స్థానంలో దిగ్విజయ్ నియామకమే తొలి అడుగు
* బిల్లు రెడీ చేయాలంటూ అధికారులకు హోం మంత్రి ఆదేశం!
*  టీ కాంగ్రెస్‌లో పెరిగిన జోరు.. డీలా పడిన విభజన వ్యతిరేకులు

ఆంధ్రప్రదేశ్ విభజన.. అనివార్యం! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం! అవును.. వరుస పరిణామాలు ఇస్తున్న విస్పష్ట సంకేతాలివి! మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి.. విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడం మొదలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో వెనక్కు తగ్గేదే లేదని, బిల్లు సిద్ధం చేయాలని హోంశాఖ అధికారులకు స్వయానా హోంమంత్రి షిండే ఆదేశించారన్న తాజా వార్తలదాకా! డీలా పడిన విభజన వ్యతిరేకులు.. స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకులు! రెట్టించిన జోరులో టీ వాదులు! ఒక శిబిరంలో నిరాశ.. మరో శిబిరంలో ఉత్సాహ సమ్మేళనాలు! కోర్ కమిటీలు.. సీడబ్ల్యూసీలు.. ఎన్నో సంకేతాలు.. అన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగానే!! దశాబ్దాల కల సాకారమయ్యే తీరాలకే! తెలంగాణ తల్లి ఒడిలోకి చేరిన వెయ్యి మందికిపైగా అమరవీరుల త్యాగాలు తెలంగాణ గడ్డపై అభివృద్ధి మొక్కలై.. మళ్లీ పుష్పించడానికే!!


స్పష్టమైన సిగ్నల్స్
దిగ్విజయ్ రాకతో ఊపందుకున్న తెలంగాణ
దిగ్విజయ్‌సింగ్.. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు ఆ పరిణామాలను దగ్గరుండి సమన్వయం చేసిన సీఎం. ఆ అనుభవం జోడిస్తారనే డిగ్గీరాజాను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా కాంగ్రెస్ నియమించింది. ఆయన చేతలు, మాటలు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సానుకూలమన్న అభిప్రాయాలు కల్గించాయి.

అధిష్ఠానం ఆదేశాలతోనే టీ సాధన సభ!
తెలంగాణ సాధన సభ నిర్వహణ విశేషమే. దిగ్విజయ్ పర్యటనకు ముందే సభ జరగడం.. ఎన్నడూ తెలంగాణవాదం వినిపించని నేతలు సైతం సభ ఏర్పాట్లు పర్యవేక్షించడం.. దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చి.. తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడం.. దామోదరను కూడా కోర్‌కమిటీకి రావాలని సూచించడం అన్నీ తెలంగాణకు మంచి శకునాలేనన్న అభిప్రాయం కలిగింది.

తెలంగాణపై ప్రధానంగా కోర్ కమిటీ చర్చ
కాంగ్రెస్ కోర్‌కమిటీ తెలంగాణపై చర్చించిందని వార్తలు రావడమే కానీ.. నిజానికి ఈ అంశంపై నికరంగా ఎన్నడూ చర్చలు జరిగింది లేదనే అభిప్రాయం ఉంది. అలాంటిది మొదటిసారి తెలంగాణపైనే కోర్‌కమిటీ జరగడం.. తుది నిర్ణయానికి సీడబ్ల్యూసీకి నివేదించడం తెలంగాణపై సానుకూల నిర్ణయం వెలువరించేందుకేనని భావిస్తున్నారు. 

ఆసక్తి రేపిన రాజకీయేతర పర్యటనలు
తెలంగాణపై కొంతకాలం క్రితం వరకూ రాజకీయ పర్యటనలేసాగేవి. అలాంటిది.. మొదటిసారి గవర్నర్ నరసింహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్, డీజీపీ దినేష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారుల పర్యటనలు ఆసక్తి రేపాయి. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని చేపట్టాల్సిన బాధ్యత స్పీకర్‌ది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత గవర్నర్‌ది. ఈ పరిణామాలలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సింది డీజీపీ. ఈ నేపథ్యంలో వీరి పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

హైదరాబాద్, జూలై 24 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్నది. ఐదు దశాబ్దాల ప్రత్యేక ఆకాంక్ష.. ఎట్టకేలకు సాకారం కాబోతున్నది. తెలంగాణ అనుకూల శక్తులే కాదు.. సమైక్యత ముసుగులో విభజనను వ్యతిరేకిస్తున్నవారి నోట కూడా ఇప్పుడు ఇదే మాట! హస్తినలో జరుగుతున్న రాజకీయ, పరిపాలనాపరమైన హడావుడి.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరూ ఇదే అభివూపాయం వ్యక్తం చేయడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ‘ఇక వెనక్కి వెళ్ళడం కుదరదు. వెంటనే బిల్లు సిద్ధం చేయండి’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన శాఖ అధికారులకు సూచించడంతో ఆ మేరకు రాష్ట్ర విభజన కసరత్తులు ముమ్మరమయినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియను ముగించుకుని.. నిర్ణయాత్మక దశకు చేరుకున్న కాంగ్రెస్.. ఈ నెల 26న మరోసారి కోర్‌కమిటీలో ఈ అంశాన్ని చర్చించనుంది. ఈ సమావేశం జరిగే సమయంలో అందుబాటులో ఉండాల్సిందిగా గతంలో కోర్‌కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు మరోసారి ఆహ్వానం అందడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహణ తేదీపై ఇక్కడ తుది నిర్ణయం జరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ విషయంలో కీలకమైనదిగా మారిన సీడబ్ల్యూసీ సమావేశం ఈ నెల 28న జరిగే అవకాశాలు ఉన్నట్లు ఏఐసీసీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

మధ్యవూపదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడంతోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు కాంగ్రెస్ అధిష్ఠానం శ్రీకారం చుట్టిందన్న వాదన ఉంది. దాన్ని బలపర్చే రీతిలో తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్.. రాష్ట్రాన్ని విభజించడమో..కలిపి ఉంచడమో త్వరలోనే తేల్చేస్తామని ప్రకటించారు. పార్టీ అంతర్గత వేదికల్లో మాట్లాడిన సందర్భంగా విభజన అనివార్యమన్న సంకేతాలు ఇచ్చినట్లువార్తలు వచ్చాయి. దీనికి ముందు హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గతంలో తెలంగాణ పేరెత్తడానికీ ఆలోచించే పలువురు నేతలు సైతం ఈ సభ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొన్నారు.

ప్రకటించే నిర్ణయాన్ని క్యాష్ చేసుకునేందుకే అధిష్ఠానం సూచనల మేరకు ఈ సభ జరిగిందని, అందుకే టీ కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఇందులో భాగస్వామ్యం పొందిందని ఒక దశలో అభివూపాయాలు వెలువడ్డాయి. అక్కడి నుంచి తెలంగాణ అంశం హస్తినలో హాట్ టాపిక్‌గా మారింది. అధిష్ఠానం పెద్దలతో టీ కాంగ్రెస్ నేతలు వరుస భేటీలు జరిపారు. కోర్‌కమిటీ సమావేశానికి అధిష్ఠానం ఆదేశాల మేరకు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లు రోడ్‌మ్యాప్‌లతో హాజరయ్యారు. 

అక్కడ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీకి తెలంగాణపై నిర్ణయానికి నివేదించారు. రోడ్‌మ్యాప్‌లలో ఎవరేం చెప్పారన్న చర్చ జరుగుతుండగానే గవర్నర్, స్పీకర్ ప్రత్యేకంగా ఢిల్లీ పర్యటన జరిపారు. వివిధ శాఖల అధికారులు సైతం ఢిల్లీలో తమ విభాగాధినేతలను కలిశారు. డీజీపీ కూడా హస్తిన వెళ్లి విభజన అంశంపై హోంశాఖ వర్గాలతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల్లోనే తెలంగాణ రావటం ఖాయమన్న వాదన స్థిరపడింది. మరోవైపు అప్పటికే అధిష్ఠానం ఆదేశాలతో పలువురు కరడుగట్టిన సమైక్యవాదులు తమ మాటల్లో తీవ్రత తగ్గించారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ప్రకటనలు చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ పరిణామాలు.. వాటి సందర్భంగా పలువురు నేతలు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న లీకులు అన్నీ తెలంగాణకు సానుకూలంగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు వచ్చిందనటానికి ఇవి నిదర్శమని అంటున్నారు. కేంద్ర కేబినెట్‌కు సమర్పించాల్సిన నోట్‌పై కసరత్తులు జరుగుతున్నాయన్న సమాచారం.. హోంశాఖలో హడావుడి చూస్తుంటే.. రాజకీయ నిర్ణయం వెలువడటానికి ముందే తెలంగాణ బిల్లు సిద్ధమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.

సీమాంధ్ర నేతల్లో తగ్గిన దూకుడు
తెలంగాణను విడిపోనివ్వమంటూ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల్లో గణనీయమైన మార్పు ఇటీవలి కాలంలో కనిపిస్తున్నది. గతంలో ఉన్న హడావుడి వారిలో ఇప్పుడు కనిపించడం లేదు. వారిలోనూ ప్రత్యేకించి ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, అనంత వెంకవూటామిడ్డి, కేవీపీ రామచంవూదరావు, మంత్రులు టీజీ వెంక సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ మోహన్, మాజీ మంత్రులు గాదె వెంకట్‌డ్డి, జేసీ దివాకర్‌డ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందడ్డిలాంటి వాళ్లు విభజనకు వ్యతరేకంగా గతంలో మాదిరిగా హడావిడి చేస్తున్న వాతావరణం కనిపించడం లేదు. విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో నిర్వహించాలనుకున్న సభను కూడా రద్దు చేసుకున్నారు. అధిష్ఠానం ఆదేశాలతోనే ఈ సభ రద్దయిందన్న వాదన ఉంది.

అక్కడక్కడ వేదికల ద్వారా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చివరగా పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. అయితే.. చివరి ప్రయత్నంగా బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమైన పలువురు సీమాంధ్ర మంత్రులు.. తాజా పరిణామాలపై చర్చించుకుని.. మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.

తమ వంతు ప్రయత్నం చేసి అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తీర్మానించారు. ఇక విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రి పదవి దక్కినప్పటి నుంచి ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోందంటూ సీమాంధ్ర నేతలే అంగీకరిస్తున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటానని ఆయన పదేపదే స్పష్టం చేయడం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన స్పీడు తగ్గించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరో మంత్రి టీజీ వెంక మాత్రం రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్‌లతో పాటు నెల్లూరు జిల్లాను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

టీడీపీ నేతలు కూడా తమ రాజకీయ అవసరాల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా మారిపోయారు. సోనియా కోరిన విధంగా లేఖ రాసి ఇచ్చేందుకు సిద్ధమని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కోడెల శివవూపసాద్ ప్రకటించడం మారిన టీడీపీ ధోరణికి నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణపై సానుకూల వైఖరి తీసుకున్నప్పటికీ.. కోస్తా జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారుల విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం లేకపోవడాన్ని టీడీపీ సరిగ్గానే గుర్తించిందని వారు అంటున్నారు.

దిగ్విజయ్ రాక వెనుక వ్యూహం ఇదేనా?
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి మార్పు తెలంగాణ ఏర్పాటు కసరత్తులో భాగమేనని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఇవ్వాలని తీర్మానించుకున్నాకే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా గులాం నబీ ఆజాద్ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ను నియమించిందంటున్నారు. తెలంగాణ విషయంలో ఆజాద్ సానుకూలంగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. ఆయన సీమాంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే వారంటూ పలు సందర్భాల్లో టీ కాంగ్రస్ నేతలే ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించి పలు సందర్భాల్లో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పంగా మారి.. పార్టీని ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునే సమయంలో కొత్త ఇన్‌చార్జి ఉంటే మేలన్న అభివూపాయంతో... గతంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సానుకూలంగా మాట్లాడిన, ఛత్తీస్‌గఢ్ ఏర్పాటులో తన వంతు సహాయం అందించిన దిగ్విజయ్‌సింగ్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించిందని అంటున్నారు.

గతంలో రాష్ట్ర ఇన్‌చార్జిగా పనిచేసిన అనుభవం కూడా ఉండటం, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలపై అవగాహన కలిగి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నేతలతో సంబంధాలు కలిగి ఉండటం వల్లే దిగ్గిరాజాను మళ్లీ తెరపైకి తెచ్చారన్న వాదన ఉంది. రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన అనంతరం తన తొలి పర్యటనలోనే దిగ్విజయ్‌సింగ్ తెలంగాణపై తేల్చేస్తామని, ఇంకా జాప్యం చేయబోమని స్పష్టం చేశారు. కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొనడం చూస్తే తెలంగాణ ఇస్తున్నామనే స్పష్టత కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అధిష్ఠానం సూచనలతోనే టీ సాధన సభ?
దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ పర్యటనకు ఒక రోజు ముందే టీ కాంగ్రెస్ నేతలు ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో తెలంగాణ సాధన సభ జరిగింది. అధిష్ఠానం సూచనల మేరకే ఈ సభ జరిపారని వార్తలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇస్తుందని, మరే పార్టీతో తెలంగాణ సాధ్యం కాదని స్పష్టమైన సంకేతాలు ప్రజలకు వెళ్లేందుకే ఈ సభ పెట్టారన్న అభివూపాయాలు ఉన్నాయి. చెట్టుకొకరు, పుట్టకొకరుగా విడిపోయి.. ఒకరు సమావేశాలు పెడితే మరొకరు దూరం పాటిస్తూ, పరస్పరం విమర్శలు చేసుకున్న టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సాధన సభ విషయంలో కలిసికట్టుగా వ్యవహరిస్తున్నామని, తెలంగాణ కోసం పాటుపడుతున్నామని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేశారు. సీఎం అనుకూల వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, టీ కాంగ్రెస్ ఉద్యమంలో ఏనాడూ కనిపించని నేతలు కూడా సభ నిర్వహణలో కీలక పాత్ర పోషించడం టీ వాదులను ఆశ్చర్యపర్చింది. 

సాధన సభ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి కే జానాడ్డి, మరి కొందరు టీ కాంగ్రెస్ నేతలు, ఆ సభ మరుసటి రోజు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి తెలంగాణ రాష్ట్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సభలో నేతల ప్రసంగ సారాంశం, చేసిన తీర్మానాలను రాజనర్సింహ, జానాడ్డి నేతృత్వంలో నేతలు దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి అందజేశారు. ఇదంగా ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం జరిగినదేనన్న అనుమానం లేకపోలేదు.

తెలంగాణపై కోర్ కమిటీ
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఆంశంపై ప్రధానంగా చర్చించారు. గత నాలుగేళ్ళుగా తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా ప్రతి శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో ఏనాడు కూడా తెలంగాణ ఆంశంపై పెద్దగా చర్చించలేదు. అలాంటిది ఈ నెల 12వ తేదీన సుమారు రెండు గంటలకు పైగా సమావేశమైన కోర్ కమిటీ తెలంగాణ ఆంశంపైనే చర్చించింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లు సమర్పించిన రోడ్ మ్యాప్ నివేదికలను పరిశీలించింది. వారు చెప్పినది విన్నది. అయితే.. తెలంగాణ ఇస్తే ఏం జరుగుతుంది? ఇవ్వకుంటే ఏం జరుగుతుంది? అన్న విషయంలో అధిష్ఠానానికి వీరి ఇచ్చే నివేదికలే కీలకం కాదని, నిర్ణయం ముందు వారి వాదన వినడం కోసంలాంఛనంగానే వారిని పిలిచారని విశ్లేషణలు వచ్చాయి. 

సమైక్య గళంతో స్క్రీన్‌పై వచ్చిన ఏపీఎన్జీవో
ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తే, ఇప్పుడు విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవో అకస్మాత్తుగా తెరమీదికి వచ్చింది. హస్తినలో తెలంగాణ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు జరుగుతుండటంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ఏపీఎన్జీవో సమైక్యత పేరుతో హడావిడి మొదలుపెట్టిందంటున్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఆ సంఘం ఇప్పడే సమైక్యవాదం ఎత్తుకోవడం వెనుక ఉద్దేశమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వస్తున్నందునే ఆ సంఘం హంగామా చేస్తున్నదని విశ్లేషకులు అభివూపాయపడున్నారు. 

హస్తినకు పెరిగిన టీ నేతల తాకిడి
తెలంగాణ ఆంశంపై ఇరు ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకున్న సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఢిల్లీ చుట్టూ తిరిగేవారు. హస్తినలో వాలిపోయి అధిష్ఠానం నేతలను కలిసేవారు. తెలంగాణ ఏర్పడకుండా గట్టిగా లాబీయింగ్ చేసే వారు. అయితే అలాంటి నేతలకు ఇప్పుడు హస్తిన టూర్లు దూరాభారంగా మారిపోయాయి. ఆ స్థానంలో టీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఢిల్లీ వైపు ఎక్కువగా పరుగులు తీస్తున్నారు. టీ మంత్రులు మొదలుకుని, టీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, మాజీలు... ఇలా బృందాలుగా ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్ నేతలను కలుస్తూ పార్టీ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. టీ మంత్రులు జానాడ్డి, డీ శ్రీధర్‌బాబు, డీకే అరుణ, జే గీతాడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఉత్తంకుమార్‌డ్డి తదితరులు తరచు ఢిల్లీ వెళుతున్నారు. 

మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటీవల ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, పూర్వ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీలను కలిసిశారు. మరి కొందరు టీ నేతలు కోర్ కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ సభ్యులు, రాహుల్, సోనియాగాంధీలతో భేటీలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు వారితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పలు ఆంశాలపై ఆరా తీస్తున్నట్లు వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

కీలక భేటీలు వారివే! 
నేతల టూర్లు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో కీలక వ్యక్తులుగా ఉన్న గవర్నర్ నరసింహన్, స్పీకర్ మనోహర్, డీజీపీ దినేష్‌డ్డి పర్యటనలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. వీరితోపాటు సాగునీరు, రెవిన్యూవంటి కీలక రంగాల ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్ళి కేంద్రంలోని కీలక అధికారులతో సమావేశమవుతున్నారు. కోర్ కమిటీ సమావేశానికి కొద్ది రోజుల ముందు గవర్నర్ ఢిల్లీ వెళ్ళి షిండే, దిగ్విజయ్‌సింగ్, మరికొందరు సీనియర్ నేతలను కలిశారు. స్పీకర్ గత వారం జరిపిన పర్యటనలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు, షిండే, దిగ్విజయ్, ఆజాద్‌లతో సమావేశమయ్యారు. విభజనకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను ఎలా అమలు చేయాలనే విషయంలో వీరు ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. డీజీపీ ఇటీవలి కాలంలో రెండు మార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు అంశాలపై ఆయన హోంశాఖకు నివేదికలు అందజేసినట్లు తెలుస్తోంది.


ప్రక్రియ145 రోజులకు కుదింపు
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా బిల్లు, కేబినెట్ నోట్ తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా ప్రక్రియ మొదలుపె సిద్ధమైనట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనే పట్టుదలతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సన్నాహాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీంతో అనుకున్న సమయానికి ముందే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని టీ కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ నిర్ణయం రావడానికి ముందే ముసాయిదా బిల్లును రూపొందించడంపై హోం శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో ఇప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం లేదని, వెంటనే బిల్లు సిద్ధం చేయాలంటూ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తన మంత్రిత్వ శాఖ అధికారులను సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

దీంతో ఆ శాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గతంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఏర్పాటైనప్పుడు ఆయా రాష్ట్రాలు అంతర్భాగంగా ఉన్న అసెంబ్లీలలో తీర్మానాలు ఆమోదించారు. తెలంగాణ విషయంలో ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించకుండానే విభజన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సమాయన్ని కుదించారని, ఇది ఎంతలేదన్నా 145 రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగంలోని 2వ అధికరణం ప్రకారం పార్లమెంట్‌కు సర్వాధికారాలు ఉంటాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అలాగే మూడవ అధికరణం ప్రకారం రెండు రాష్ట్రాలను విలీనం చేయడం లేదా, రాష్ట్రాలను పునర్వవ్యస్థీకరించడం, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, ఆ రాష్ట్రాల్లోని ప్రాంతాలను కలపడం, రాష్ట్రం నుంచి ఒక ప్రాంతాన్ని వేరు చేయడంలాంటి అధికారాలు పార్లమెంట్‌కు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

సీడబ్ల్యూసీ భేటీలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న వెంటనే న్యాయ శాఖ సహాయంతో హోం శాఖ తెలంగాణ బిల్లును, కేబినెట్ నోట్‌ను రూపొందిస్తుందని, ఆ తర్వాత వాటిని రాజకీయ వ్యవహరాల కేబినెట్ కమిటీకి పంపుతారని, అక్కడ అవి ఆమోదం పొందాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆ పిదప తెలంగాణ బిల్లును పార్లమెంట్‌కు పంపించాలని రాష్ట్రపతిని కేంద్రం కోరుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు తెలంగాణ బిల్లుపై తన అభివూపాయాన్ని తెలియజేయాల్సిందిగా రాష్ట్ర అసెంబ్లీని రాష్ట్రపతి కోరుతూ ఇందుకు నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తారని, శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందక పోయినా, లేక నిర్దిష్ట సమయంలో సభ ఆ విషయంలో నిర్ణయం తీసుకోకపోయినా, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను రాష్ట్రపతి ప్రారంభించవచ్చని, అందు కోసం పార్లమెంట్‌లో సాధారణ మెజారిటితో బిల్లు ఆమోదం పొందితే చాలని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ 28న సీడబ్ల్యూసీ?
తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 28న సీడబ్ల్యూసీ సమావేశం కానున్నది. తెలంగాణ ఏర్పాటు దిశగానే ఈ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలుంటాయని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ సమావేశానికి ముందే ఈ నెల 26న జరిగే కోర్ కమిటీ భేటీకి హాజరయ్యేందుకు మళ్ళీ ఢిల్లీ రావాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లకు కాంగ్రెస్ అధిష్ఠానం వర్తమానం పంపింది. కీలక నిర్ణయం ముందు వీరిని పిలిపించడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కసరత్తుల్లో భాగమేనని పార్టీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన కోర్ కమిటీలో సీఎం, పీసీసీ చీఫ్‌లు తమ తమ రోడ్ మ్యాప్‌లలో పేర్కొన్న ఆంశాలు, వినిపించిన వాదనలకు కౌంటర్‌గా మరో నివేదికతో దామోదర రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి.. బుధవారం సాయంవూతానికి తిరిగి వచ్చారు. సీఎం, పీసీసీ చీఫ్ చేసినట్లు వచ్చిన వాదనల్లో ఏ మాత్రం పస లేదని, అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయని తన తాజా నివేదికలో దామోదర స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన మంగళవారం సీడబ్ల్యూసీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిసి తన నివేదికను అందజేశారు.

Monday 22 July 2013

రాష్ట్రాన్ని విభజిస్తే ఏం జరుగుతుంది?


రాష్ట్రాన్ని ఒకవేళ విభజిస్తే పరిష్కరించలేని సమస్యలుంటాయా? విభజనతో విపరీతమైన ఇబ్బందులు వస్తాయా? అసలు ప్రపంచంలో విభజన డిమాండ్ కొత్తగా ఇక్కడే పుట్టిందా? విభజన అంటూ జరిగితే.. పారే నీళ్లు, బొగ్గులు మండితే వచ్చే విద్యుత్, వివిధ పనుల్లో జనానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, భూములు.. అవి సృష్టించిన బూమ్‌లు.. అవి పుట్టించిన ప్రైవేటు సంపదలు.. వాటి నుంచి మొలిచిన రాజకీయ అధికారాలు.. ఆ అధికారాలను కిందిస్థాయిలో పాలనగా మార్చే అధికార యంత్రాంగాలు.. అవి కేంద్రంగా ఉండే రాజధాని!! సకల రంగాల్లో సమస్యలు ఏపాటివి? విభజన జరుగకపోతే ఫలితమేంటో అనుభవాలు ఉండనే ఉన్నాయి. అవి అప్రస్తుతం! రాష్ట్రాన్ని విభజిస్తే ఏం జరుగుతుంది? తలెత్తే సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? పరిష్కారాలను చేరుకునే తొవ్వలేంటి? విభజన అనేది బీభత్స రస ప్రధాన దృశ్యం కానేకాదు. ఎవరైనా అలా అంటే కచ్చితంగా అది వారి స్వప్రయోజ నాల కోసమేనని భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈ వాదనలు కొత్తవేమీ కావు. 

విభజన అనంతర పరిస్థితులపై మేధావులు కాచివడపోసినవే. నీళ్లు.. విద్యుత్.. ఉద్యోగాలు.. రాజధాని! ఎటు చూసినా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్న కీలక రంగాలు ఇవే! విభజన జరిగితే.. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి పారే నదుల నీటిలో ఆంధ్రకు హక్కు ఎగిరిపోదు. ఎందుకంటే ఈ అంశం కొత్తగా ఏర్పడే తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఉండదు! దీనికి ట్రిబ్యునళ్లు ఉంటాయి. అంతర్జాతీయ జల పంపకాల సూత్రాల ప్రకారం అవి ప్రకటించే అవార్డులుంటాయి. వాటిని పర్యవేక్షించే కోర్టులుంటాయి! ఉద్యోగాలు పోతాయన్న బెంగే లేదు. ఎందుకంటారా.. తెలంగాణ విభజనతో మిగిలే సీమాంధ్ర ప్రాంతాల రాష్ట్రానికి అంతే స్థాయిలో అధికార యంత్రాంగం అవసరం! నీటి వనరుల పంపిణీకి ప్రత్యేక విధానాలున్నట్లే.. విద్యుత్ విషయంలోనూ మార్గదర్శకాలున్నాయి. ఇక మరో కీలక అంశం రాజధాని! వాస్తవానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతం మరింత వృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 

కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతానికి అందే వేల కోట్లు.. కూలి పని చేసినా.. కాంట్రాక్టులు చేసినా.. అంతిమంగా వెళ్లేది స్థానిక ప్రజల్లోకే! వీటన్నింటికి మించి రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకునేవారికి కోరుకున్నన్ని! ప్రస్తుత రాజకీయ చిత్రంలో చూస్తే.. తెలంగాణ ఏర్పాటుతో.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా పుంజుకుంటుంది. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అనివార్యంగా కాంగ్రెస్‌లో విలీనం కాక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రీత్యా కాంగ్రెస్‌కు ఇక్కడ ఇది అత్యంత ప్రయోజనకారి. మరి సీమాంవూధలో? అక్కడా కాంగ్రెస్‌కు లబ్ధి కలిగేందుకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవి సహా అనేక మంది సీమాంవూధులే. తెలంగాణలో కొత్తగా వచ్చే బలంతో కాంగ్రెస్‌కు పెరిగే పునాది సహజంగానే సీమాంవూధలోనూ కలిసివస్తుంది. 

ఊపుతగ్గిందని భావిస్తున్న జగన్ పార్టీ రేపోమాపో కాంగ్రెస్‌లో కలిసే అవకాశాలూ లేకపోలేదు! ఈ రీత్యా అక్కడా కాంగ్రెస్‌కు జయమే! దేశంలో ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన అనేక చోట్ల విభజన అనుభవాలున్నాయి. సామరస్యపూర్వకంగా ఎలా విడిపోవచ్చో అవి నిరూపించాయి. విడిపోయి అభివృద్ధి దిశగా ఎలా దూసుకుపోవాలో పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా తోడు చేసుకోవాల్సింది ఒక సుహృద్భావపూర్వక వాతావరణమే! ఒక తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా శక్తిని రెట్టింపు చేసుకునేందుకు దీర్ఘకాలం తర్వాత లభిస్తున్న సువర్ణావకాశం! విభజనపై కాంగ్రెస్‌పార్టీ దాని నేతృత్వంలోని ప్రభుత్వం అటో ఇటో తేల్చేస్తామని చెప్పి, ఏం జరిగితే ఏమవుతుందో రోడ్‌మ్యాప్‌ల తయారీ నిమిత్తం తన పార్టీలోని ముగ్గురు ముఖ్య నేతలను ఆదేశించిన క్రమంలో.. తెలంగాణ ప్రజల తరఫున ‘నమస్తే తెలంగాణ’ ఒక చొరవ చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, ఆత్మబలిదానాల నుంచి, దశాబ్దాల అన్యాయాల నుంచి అక్షరీకరించిన ‘తొవ్వ’ను కేంద్ర పాలకులకు అందజేస్తున్నది.

Tuesday 16 July 2013

ఆలంపూర్ జోగులాంబ..

అడుగడుగున గుడి ఉంది! 
                              

    భారతదేశంలోని అయిదవశక్తి పీఠంగా, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా, దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన అలంపూర్ ఆలయ ప్రాంగణాల్లోకి అడుగు మోపిందే తడవు భువిపై వెలసిన దేవుళ్ల చెంతకు చేరామన్న అసాధారణ తృప్తి కలుగుతుంది. ఇక్కడి బాల బ్రహ్మేశ్వరుడు, జోగులాంబల దర్శనభాగ్యాన్ని ‘జన్మజన్మల పాపపరిహారం’గా భక్తులు నమ్ముతారు.ముఖ్య ఆలయంలో బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు ఎంత ప్రాశస్త్యమో అలంపురంలో బాలబ్రహ్మేశ్వరుడు అంతగా ప్రసిద్ధిగాంచాడు. అక్కడ కాశీ, ఇక్కడ ‘హేమలాపురం’ (అలంపూర్ పూర్వనామం) అన్నదీ ప్రజల మాటే. ఒకనాటి హేమలాపురమే కాలక్రమేణా ‘హతఃపురం’, ‘జోగుళాపురం’గా మారి, ఇప్పటికి అలంపూర్ అయింది. మన దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఆలంపూర్ అయిదవది. కాశీలో విశాలాక్షి అమ్మవారుకు ఉన్నంత భక్తి ప్రాధాన్యమే ఇక్కడి జోగుళాంబదేవికి కూడా ఉన్నట్టు భక్తులు చెప్తారు. సాధారణంగా ఈశ్వరుని అన్ని లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ, అలంపూర్‌లో మాత్రం మహాశివుడు ‘గోస్పాద ముద్రిక రసాత్మ లింగం’గా వెలిశాడు. అంటే ‘ఆవు పాదం మోపితే వచ్చేలాంటి ఆకృతి’ అన్నమాట. అందుకే, దీనిని విశేష లింగంగానూ చెబుతారు. 
‘ఊర్ధ దంత పంక్తి’ శక్తిపీఠం                  
 
ఆలంపూర్‌ను పరశురామ క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగానూ పిలుస్తారు. ఇక్కడ నవబ్రహ్మల పేరుతో ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో మూల స్వామితోపాటు బ్రహ్మదేవునికి ప్రత్యేకమైన విగ్రహాలూ ఉన్నాయి. వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే కాశీని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంది. దాదాపు 1400 సంవత్సరాల క్రితం (6-7వ శతాబ్దాల కాలంలో) బాదామి చాళుక్య వంశంలోని రెండవ పులకేశి అలంపూర్‌లో ఈ ఆలయాలను నిర్మించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి అష్టాదశ శక్తి పీఠం ప్రతిష్ఠాపన వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ఈ శక్తిమాతకు చెందిన ‘ఊర్ధ దంతపంక్తి’ ఇక్కడ పడినట్లు పురాణ కథ చెబుతోంది. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం నిర్వహిస్తూ, అందరి ముందే శివనిందకు పాల్పడతాడు. ఈ అవమానాన్ని భరించలేని సతీదేవి దు:ఖంతో యజ్ఞగుండంలో పడి దేహత్యాగం చేస్తుంది. దీనికి ఆగ్రహించిన పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై దక్షుని యాగాన్ని సమూలంగా నాశనం చేసి, అగ్నికి ఆహుతైన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజస్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. ఈ దక్షయజ్ఞం కథలోని ముగింపే అష్టాదశ పీఠాల స్థాపనకు కేంద్రమైంది.ఈశ్వరుడ్ని శాంతింప జేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది శకలాలుగా విభజించాడన్నది పౌరాణిక కథాంశం. ఆ పద్దెనిమిది భాగాలు భరతఖండంలోని వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి. అవే పరమపవిత్ర శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆదిశంకరాచార్యుల వారు వాటికి ఆయా పుణ్యస్థలాలలోనే ప్రాణ ప్రతిష్ట చేసినట్లు చరిత్ర. 
నవబ్రహ్మల దివ్యధామం
 జోగులాంబ శక్తిపీ ఇక్కడే నవవూబహ్మల ఆలయాలు ఉండడం మరో విశేషం. ‘బ్రహ్మదేవుడికి ఒకేచోట తొమ్మిది గుడులా?’- ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. కానీ, ఇది నిజం. పద్నాలుగు శతాబ్దాల కిందటే అక్కడ ‘నవబ్రహ్మలు’ కొలువుదీరారు. అయితే, ‘వీళ్లు నిజంగా త్రిమూర్తుల్లోని బ్రహ్మదేవుని అవతారాలేనా?’ అంటే ఖచ్చితమైన సమాధానం లేదు. కాకపోతే, అన్ని శతాబ్దాల కిందట వెలసిన ఇక్కడి ఆలయాలలోని ఈ నవవూబహ్మల్లోని ఆరుగురు ఒకనాటి రససిద్ధులు ఉపయోగించిన ఓషధుల పేర్లుగా చరిత్రకారులు ఉటంకిస్తారు. మరి, మిగిలిన ముగ్గురు ఎవరు!? ఆధ్యాత్మికవేత్తలు అన్వేషించాల్సిన ప్రశ్నే ఇది.ఒకప్పుడు అదొక పెద్ద కోటగోడ ప్రాంతం. ఇప్పుడు చాలావరకు నాటి చారివూతక ప్రదేశాలు, గుళ్లు శిథిలమైనాయి. మొత్తం తొమ్మిది మంది నవబ్రహ్మల ఆలయాలకు గాను ఒకే ఒక ప్రధాన గుడి బ్రమేశ్వరాలయం) దివ్యంగా ఉంది. అందులో నిత్యం పూజా పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే జోగులాంబ శక్తిమాత కొలువై ఉంది. మిగిలినవన్నీ నామమాత్రంగా ఉన్నవే. ఆ పరిసరాలలో ఎక్కడ చూసినా శిథిల ఆలయ స్తంభాలు, అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రభుత్వ ఆధీనంలో సంరక్షించబడుతున్నప్పటికినీ చరిత్రకారులు, భక్తులు, పర్యాటకులు వాటిలోని కళాకౌశలానికి ముగ్ధులవుతుంటారు.ఒక చిన్న ద్వారం గుండా కోట ప్రదేశం లోపలికి వెళితే మరో పెద్ద ద్వారం వస్తుంది. దాన్ని దాటి ముందడుగు వేస్తే నవబ్రహ్మల గుళ్ల చోటుకు చేరుకుంటాం. 
అవి:
బాల, కుమార, అర్క, వీర, విశ్వ, పద్మ, గరుడ, స్వర్గ, తారక బ్రహ్మలు.
వీటిలో మొదటి ఆరింటిని ఓషధుల పేర్లుగా చెప్తారు. ఈ నవవూబహ్మ ఆలయాల మీద అష్టదిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు ముగ్ధ మనోహరంగా సృష్టించబడ్డాయి. కోటగోడ ప్రవేశద్వారానికి చెందిన ఉత్తరాశిమీద ఉన్న శిల్పంపై ఆ గుళ్ల ప్రాశస్త్యాన్ని గురించిన చారివూతక కథను వెల్లడించే దృశ్యం చెక్కబడి ఉన్నట్టు ప్రసిద్ధ రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ గతంలో ‘ఆలంపురం’పై విడుదల చేసిన అద్భుత గ్రంథంలో పేర్కొన్నారు. ‘బ్రహ్మక్ష్రేత్ర మహత్యం’లోని అయిదో అధ్యాయంలో పేర్కొన్నట్టుగా విలసితుడు అనే రాజు దైవంపై నమ్మకం లేక ఈ గుళ్లను పడ గొట్టించాడట. దాంతో సిద్ధులు అతణ్ని శపిస్తారు. ఫలితంగా అతను రాజ్యవూభష్టుడవుతాడు. తర్వాత తానే తిరిగి జ్ఞానోదయానికి వచ్చి కూల్చిన గుళ్లను కట్టించి, బ్రహ్మేశ్వర స్వామిని ఆరాధించాడన్నది ఆ కథనం.కాగా, అలంపూర్‌కు సమీపంలోనే ‘పాపనాశని తీర్థం’ ఉంది. దీనినీ భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. ‘అష్టాదశ తీర్థాల’లో ఒకటిగా దీనిని చెబుతారు. ఇక్కడి మిగిలిన తీర్థాలు చాలావరకు శిథిలావస్థలోనే ఉన్నాయి. ఏమైనా, ప్రశాంత వాతావరణంలో సాగే ‘ఆలంపూర్ యాత్ర’ ప్రతి ఒక్కరికీ ఒక అద్వితీయ అనుభూతిని మిగులుస్తుంది. భక్తులకైతే పరిపూర్ణ తృప్తినిస్తుంది.
                                               - రఘునాథడ్డి (గద్వాల, టీమీడియా)