Saturday 12 January 2013

హస్తిన చర్చ.. రాజధానిపైనే


తాత్కాలిక ఉమ్మడి క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎన్నేళ్లు?
* కాంగ్రెస్ కోర్ కమిటీలో నేతల తర్జనభర్జన.. విస్తృత అంశాల నడుమ తెలంగాణ చర్చ
* బైఠక్‌లోనే తెలంగాణపై తీర్మానం?.. చురుకుగా కదులుతున్న కాంగ్రెస్
*  ఢిల్లీలో సమావేశాల పరంపర

-  చింతన్ బైఠక్‌లో తీర్మానాలు.. అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ

పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలేంటి?
-సరిహద్దు ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయి?
-  పెట్రో ధరల పెంపుదలపై ఏం చేద్దాం?
-  జార్ఖండ్ సంక్షోభాన్ని కొలిక్కితేవటం ఎలా?
-  ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహమేంటి?
-  కీలక అంశాలపై చర్చించిన నేతలు 
న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ బైఠక్ ఒకవైపు.. మధ్యలో ముందుకు వచ్చిన జార్ఖండ్ సంక్షోభం మరోవైపు.. తాజాగా భారత్-పాక్ మధ్య ఘర్షణపూరిత వాతావరణం.. రైల్వే చార్జీల పెంపుదల, పెట్రో ధరల అంశం.. ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన! ఇంతటి విస్తృత చర్చనీయాంశాల జాబితా ఉన్నప్పటికీ.. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చకు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కొనసాగిన సమావేశాల పరంపరలో తెలంగాణ అంశానికి సైతం ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఇప్పటికే సంకేతాలు ఇస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజధాని విషయంలోనే తర్జన భర్జన పడినట్లు సమాచారం.
                ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం.. హైదరాబాద్‌ను ఎన్నేళ్లపాటు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న అంశంపైనే చర్చ జరిపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. తెలంగాణ విషయంలో హైదరాబాద్‌ను సీమాంధ్ర నేతలు వివాదాస్పదం చేస్తుండటం.. తెలంగాణవాదులు మాత్రం హైదరాబాద్ సహిత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పట్టుబట్టుతుండటంతో దీని పరిష్కారంపై చర్చ జరిగిందని తెలిసింది. అంతకు ముందు గతంలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా పని చేసినవారు, ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో సంబంధాల్లో ఉన్నవారు మధ్యాహ్నం సోనియా నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
                  ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వీరప్పమొయిలీ, గతంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత అంబికాసోని తదితరులు ఉన్నారు. ఈ భేటీకి ముందే ఉదయం 11 గంటలకు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే టెన్‌జన్‌పథ్‌కు చేరుకుని సోనియాతో భేటీ అయ్యారు. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నివాసం సెవెన్ రేస్‌కోర్స్‌లో సోనియా సహా కోర్ కమిటీ సభ్యులందరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జైరాం రమేశ్, చిదంబరం, ఆంటోని, ఆజాద్, మొయిలీ, అంబికాసోనీ, దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా జైపూర్‌లో జరుగనున్న మేధో మథనంలో చేపట్టాల్సిన రాజకీయ తీర్మానాలు, జార్ఖండ్ రాజకీయ సంక్షోభంతోపాటు తెలంగాణపైనా చర్చించారు.
ఉత్కంఠ రేపుతున్న చర్చలు
                       డిసెంబర్ 28న కేంద్రం తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, అందులో నెలలోపు నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి షిండే ఉద్ఘాటించడం తెలిసిందే. అప్పటినుంచి కేంద్రంలో చర్చల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం మినహా మరే పార్టీ వ్యతిరేకించలేదు. ఎంఐఎం కూడా విభజించాల్సి వస్తే హైదరాబాద్‌తో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనను సీపీఎం వ్యతిరేకించినా.. సత్వరమే తేల్చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుకూలంగానే కేంద్రం నిర్ణయం ఉండబోతున్నదన్న సంకేతాలు వస్తున్నాయి. రషీద్‌అల్వీ తదితర నేతలు సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో షిండే విధించుకున్న గడువులోపే నిర్ణయం వస్తుందన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. గడువు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ సంప్రదింపుల్లో వేగం పుంజుకుంది. సోనియా ఆధ్వర్యంలో జరిగిన వరుస కోర్ కమిటీసమావేశాలు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి కోర్‌కమిటీ సమావేశంలో ఇతర అంశాలతోపాటు తెలంగాణపైనా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 
 చింతన్ బైఠక్‌లో రాజకీయ తీర్మానాలు:
దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై జైపూర్ చింతన్ బైఠక్‌లో చేయబోయే తీర్మానాలపై కోర్‌కమిటీ సమావేశం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ తీర్మానాల్లో తెలంగాణ అంశం కూడా ఉన్నదని విశ్వసనీయవర్గాల కథనం. తెలంగాణపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రాజధాని అంశంలోనే తర్జనభర్జనలు పడిందని సమాచారం. దానితోపాటు అందరి అభివూపాయాలు తెలుసుకోవడం, పలువైపులనుండి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించడం వరకే సమావేశం పరిమితమైందని తెలుస్తోంది. ఏది ఏమైనా సోనియాగాంధీ మనసులో ఉన్న ఆలోచనే తెలంగాణపై ప్రకటనగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2004 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, పుట్టిన రోజు కానుక విషయంలో వెనక్కు తగ్గరాదని సోనియా భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 
              ఈ నేపథ్యంలోనే తెలంగాణపై తుది ప్రకటనకు జైపూర్ మేధో మథనం వేదిక అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మేధో మథనానికి ముందే ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏఐసీసీ వర్గాలు చెబుతుండటం విశేషం. 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం ఆంధ్రవూపదేశ్‌లో నెలకొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి చేయబోయే ప్రకటన విషయంలో సోనియా పకడ్బందీగా వ్యవహరించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే బైఠక్‌లో చర్చించే ఇతర అంశాలతో సమానంగా తెలంగాణను సోనియా చూడటం లేదని, దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐసీసీలో చర్చ జరుగుతోంది. 
              వివిధ రాష్ట్రాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అపరిష్కృత సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే దిశగా కోర్‌కమిటీ చర్చలు జరిపిందని సమాచారం. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలు, త్వరలో పెంచనున్న పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ల పరిమితి, సబ్సిడీల కుదింపుతోపాటు.. జార్ఖండ్ విషయంలో వ్యవహరించాల్సిన వైఖరి, రాబోయే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపైనా కోర్‌కమిటీ చర్చించిందని తెలుస్తోంది.

Friday 11 January 2013

నిర్ణయం దిశగా

‘యుద్ధ’ ప్రాతిపదికన కాంగ్రెస్ కసరత్తులు
వార్ రూంలో మూడుగంటలపాటు భేటీ!
తెలంగాణపై తేల్చేద్దామని నిశ్చయం!..
  
తదుపరి పరిణామాలనూ పరిష్కరిద్దాం
మరింత స్పష్టతతో సాగుతున్న ప్రక్రియ..
 
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రకటనకు ఇక కొద్దిరోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ‘కీలక నిర్ణయం’ ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే విషయంలో తాను అఖిలపక్షంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన తరువాత కొద్ది సమయంలోనే కాంగ్రెస్ సీనియర్లు వార్ రూంకు చేరుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. గురువారం తల్‌కటోరా రోడ్డులోని వార్ రూంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోం మంత్రి షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన గులాం నబీ ఆజాద్‌లతోపాటు అహ్మద్ పటేల్ కూడా కీలక సమావేశంలో పాల్గొన్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ కూడా హాజరైనట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటనకు ముందు జరపాల్సిన కసరత్తుకు సంబంధించి మరోసారి వారు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు కోర్ కమిటీ భేటీలలో తెలంగాణపై చర్చించిన సీనియర్లు రేపటి జైపూర్ మీటింగులో ‘కీలక నిర్ణయాన్ని’ చర్చకు ఉంచాలా వద్దా అని మల్లగుల్లాలు పడ్డట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఎన్నికల వ్యవహార కోణంలో తెలంగాణపై చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమెంత నష్టమెంత అనే సాంకేతిక కోణంలో వారు తర్జనభర్జన పడ్డట్టు సమాచారం. తెలంగాణను ప్రకటించడం అనివార్యం కనుక రెండు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులకు సంతృప్తి కలిగించే ప్రకటన చేసేందుకే వారు మొగ్గు చూపారని తెలిసింది. ఒకవైపు తెలంగాణలో బలమైన ప్రజాఉద్యమం, మరోవైపు తెలంగాణను అడ్డుకునే ‘విలువైన’ రాజకీయ నాయకులు.. వీటిని బేరీజు వేస్తూ నిర్ణయం ఉండాలన్నదే లక్ష్యంగా వారి చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ విషయంలో సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 
                   కాగా కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీమాంధ్ర నాయకులను అప్రమత్తం చేస్తూ, అధిష్ఠానం పెద్దలకు వినతి పత్రాలు ఇప్పిస్తూ, సీక్రెట్‌గా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఢిల్లీలో సీమాంధ్ర ‘ఆత్మ’గా సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల అంచనా. సదరు పెద్దమనిషి తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, 254 నియోజకవర్గాలలో కేవలం 50 నుంచి 60 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే తెలంగాణ కోరుకుంటున్నారని, తదితర నిరుత్సాహపరిచే నివేదికలు తయారుచేయించి పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండురోజుల క్రితం మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర ప్రజావూపతినిధుల సంతకాలతో కూడిన వినతిపవూతాన్ని కేంద్ర హోంమంత్రి షిండేకు అందజేశారు. తనకు ‘కొంతమంది మిత్రులు ఇట్లా చెయ్యండి అట్లా చెయ్యండి అని రాతపూర్వక సమాచారమిస్తున్నారు’ అని షిండే గురువారం విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఇదే కోణంలో నుంచి విశ్లేషిస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సంతకాల పేరుతో బయటకు కనిపించేది శైలాజ్‌నాథ్ మాత్రమే అయినా కనిపించని అదృశ్య శక్తులు ఢిల్లీలో సంచరిస్తున్నాయనేది వాస్తవమంటున్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ రెండు రోజుల క్రితం ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా అదే ఆరోపణ చేశారు. తెలంగాణపై కేంద్రం చేయబోయే ప్రకటనను అడ్డుకునేందుకు తెరచాటు ప్రయత్నాలను సీమాంధ్ర రాజకీయ నాయకులు ముమ్మరం చేశారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు కూడా షిండేకు ఇచ్చిన సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే గురువారంనాటి వార్ రూం సమావేశానికి ముందు ఆజాద్ సోనియాను కలిసి తన వద్దకు వచ్చిన సమాచారంపై చర్చించారని తెలిసింది. అక్కడినుంచి ఆజాద్ నేరుగా వార్ రూం సమావేశానికి వెళ్ళారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చించిన కాంగ్రెస్ సీనియర్లు ‘తెలంగాణపై సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 

Thursday 3 January 2013

ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో తెలంగాణను ముడిపెట్టొద్దు ..

* నెలలోగా నిర్ణయం 
* వస్తుందని ఆశిస్తున్నాం
 *తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌కు  గుండెకాయలాంటిది
* ఏఐసీసీ నేత రషీద్ అల్వీ
     తెలంగాణను ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాట వాస్తవమే అయినప్పటికీ తెలంగాణ అంశాన్నే ముందు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, అందులో తెలంగాణ ప్రాంతం తమకు గుండెకాయ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించినట్లుగా నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఆయన జనవరి 1న  ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
            గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై లోకాయుక్త విచారణ, యువతి గ్యాంగ్ రేప్ తదితర విషయాలపై మాట్లాడిన అనంతరం తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందంటూ విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్షం నిర్వహించారు. అన్ని పార్టీలతో చర్చించారు. నెలరోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
         తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ- ‘మొన్నటి అఖిలపక్షంలో కేంద్ర హోం మంత్రి చెప్పారు. షిండే ప్రకటన కాంగ్రెస్ పార్టీ వైఖరిగానే ఉంటుంది’ అని తెలిపారు. దేశంలో విదర్భలాంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయి కదా.. వాటి పరిస్థితి ఏమిటి అని అడిగిన ప్రశ్నకు- ‘విదర్భ రాష్ట్ర డిమాండు కూడా పురాతనమైనదే. అట్లా ఇంకా అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాటా వాస్తవమే. అయితే తెలంగాణ రాష్ట్ర డిమాండును ఇతర రాష్ట్రాల డిమాండుతో ముడిపెట్టరాదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్  కీలక రాష్ట్రం. అందులో తెలంగాణ ప్రాంతం మాకు గుండెకాయ లాంటిది’ అని రషీద్ అల్వీ అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే మిగిలిన రాష్ట్రాల సమస్యలపై దృష్టి పెడతామన్నారు.