Thursday, 3 January 2013

ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో తెలంగాణను ముడిపెట్టొద్దు ..

* నెలలోగా నిర్ణయం 
* వస్తుందని ఆశిస్తున్నాం
 *తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌కు  గుండెకాయలాంటిది
* ఏఐసీసీ నేత రషీద్ అల్వీ
     తెలంగాణను ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాట వాస్తవమే అయినప్పటికీ తెలంగాణ అంశాన్నే ముందు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, అందులో తెలంగాణ ప్రాంతం తమకు గుండెకాయ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించినట్లుగా నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఆయన జనవరి 1న  ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
            గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై లోకాయుక్త విచారణ, యువతి గ్యాంగ్ రేప్ తదితర విషయాలపై మాట్లాడిన అనంతరం తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందంటూ విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్షం నిర్వహించారు. అన్ని పార్టీలతో చర్చించారు. నెలరోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
         తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ- ‘మొన్నటి అఖిలపక్షంలో కేంద్ర హోం మంత్రి చెప్పారు. షిండే ప్రకటన కాంగ్రెస్ పార్టీ వైఖరిగానే ఉంటుంది’ అని తెలిపారు. దేశంలో విదర్భలాంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయి కదా.. వాటి పరిస్థితి ఏమిటి అని అడిగిన ప్రశ్నకు- ‘విదర్భ రాష్ట్ర డిమాండు కూడా పురాతనమైనదే. అట్లా ఇంకా అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాటా వాస్తవమే. అయితే తెలంగాణ రాష్ట్ర డిమాండును ఇతర రాష్ట్రాల డిమాండుతో ముడిపెట్టరాదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్  కీలక రాష్ట్రం. అందులో తెలంగాణ ప్రాంతం మాకు గుండెకాయ లాంటిది’ అని రషీద్ అల్వీ అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే మిగిలిన రాష్ట్రాల సమస్యలపై దృష్టి పెడతామన్నారు.

No comments:

Post a Comment