Friday, 29 March 2013

వీరులారా .. వందనం.


ఇంకా మాటలు కూడా రాని ముద్దులొలికే చిన్నారి.. ఆమె చేతుల్లో! మాటలకందని మహా విషాదం.. ఆమె మనసు పొరల్లో! బతికినంత కాలం కష్టం.. ఆమె జీవితంలో! ఇది మామిడాల జ్యోతి కన్నీటి వ్యథ.. మాత్రమే కాదు! వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అనుభవిస్తున్న గోస!! చెట్టంత కొడుకు ఉద్యమం కోసం చనిపోతే.. మనుమరాలిని సాదుకుంటున్న తాత కంటిలో ఇప్పటికీ ఉబికివస్తున్న
కన్నీటి చుక్క! అన్నం పెట్టాల్సిన బిడ్డ.. అందనంత దూరానికి వెళ్లి పోతే..

కాటికి కాళ్లు చాపిన ఓ ముసలి తల్లి 
గొంతులో అసహాయపు జీర! పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కూతురిని 
చేతులతో కాటికి తీసుకుపోయిన దృశ్యాన్ని మరువలేకపోతున్న తండ్రి! వీరే కాదు.. 
కాస నాగలక్ష్మి.. ఉప్పల మల్లమ్మ.. గూడర్రు లింగయ్య.. దర్శనాల శివన్న.. అజ్గరీ బేగం.. ఎందరెందరో! ఒక్కొక్కరిది ఒక్కో కష్టం! నమస్తే తెలంగాణ తన వంతు బాధ్యతగా బరువు పంచుకున్న వేళ.. 
ఒక్క చోట గుమిగూడిన తెలంగాణ త్యాగం! 
ఆత్మబలిదానాలొద్దు.. బతికుండి తెలంగాణ సాధిద్దాం... యువతకు, విద్యార్థులకు ఉద్యమసారథుల పిలుపు
తెలంగాణ అమరవీరులకు ఉద్యమశ్రేణుల అంజలి.. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం పంపిణీ
  ప్రతి మరణ వాంగ్మూలం.. తెలంగాణ గోసకు ప్రతిబింబం
అమరవీరుల సహాయ నిధి పంపిణీ సభలో కోదండరాం
‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నానికి అభినందనలు
ఇది ప్రారంభం మాత్రమే.. మరింత అండగా ఉంటాం
అర్హులకు ఉద్యోగాలు .. ఉపాధికి చేయూత
నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం 
త్వరలో అమరుల త్యాగాల వివరాలతో పుస్తకం.. పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ ప్రకటన
   దిక్కులేని ఇళ్లలో దీపంలేని జీవితాలు! పలుకరిస్తే కట్టలు తెంచుకుంటున్న కన్నీరు! ఏం పాపంజేసెరా తెలంగాణ? ఎందుకీ వేదన? ఎందుకీ కన్నీళ్లు! వెలకట్టలేనిది ప్రాణం.. విలువ కట్టలేనిది ప్రాణత్యాగం! మరి ప్రాణత్యాగాలతో ఇంటి మూల స్తంభాలను కోల్పోయిన వెయ్యి మందికి పైగా తల్లులు.. తండ్రులు.. తండ్రులను కోల్పోయిన బిడ్డలు.. బిడ్డలను కోల్పోయిన తండ్రులు.. జీవితాంతం కలిసి నడవాల్సిన నీడ కోల్పోయిన తోడు! వీరి జీవితకాలపు కష్టాన్ని కొలిచే సాహసం ఎవరు చేయగలరు? అమ్మల గర్భశోకాన్ని ఆపడానికి కన్నీరు నిలుపుకొని వచ్చేదెవరు? తెగించి కొట్లాడాల్సిన వేళ.. బరిగీసి తెలంగాణ సాధించుకోవాల్సిన తరుణాన.. మీరు చేసుకున్న బలిదానాలు ఎంత దుఃఖాన్ని నింపి వెళ్లాయో! చూస్తున్నారా? వీరులారా.. వందనం!
         మీ త్యాగాన్ని శంకించడం లేదు.. మీ మార్గమే సరికాదంటున్నాం! అమరవీరులారా.. మీ ఆకాంక్షలను తక్కువ చేయడం లేదు.. మరణానికి సైతం జంకని మీ ఆవేశానికే కలతపడుతున్నాం! త్యాగజీవులారా.. నిరుపమానమైన మీ సాహసానికి తల వంచి సలాం చేస్తున్నాం.. మీ బలిదానాలకు కన్నీటి నివాళులర్పిస్తున్నాం! మీరు లేనిలోటు ఉద్యమానికే కాదు.. మీ ఇంటికీ తీరనిదే! అందుకే.. మీరువదిలి వెళ్లిన మీ ఇంటిని ఆదుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నం! నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యంలో తొలి విడతగా 260 మందికి ఆర్థిక సహాయం అందించే కార్యక్షికమం! వీరులారా వందనం!! తెలంగాణ కోసం పోరాడుదాం.. కానీ.. ప్రాణ త్యాగాలతో కాదు..! బరిగీసి కొట్లాడుదాం.. బతికుండి తెలంగాణ సాధిద్దాం!! ఉద్వేగాలు.. ఉద్విగ్నాలు.. కన్నీళ్లు.. కర్తవ్యస్ఫూర్తి కలగలిసిన వాతావరణంలో ఉద్యమ సారథులు ఇచ్చిన పిలుపు ఇది! 
     రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతే.. గూడు చిన్నబోతుంది! తల్లి గుండె తల్లడిల్లుతుంది! ఇన్నాళ్లూ నా ఒడిలో సేదదీరిన బిడ్డ ఇక నా దగ్గరకు రాడా.. అని గూడు దిక్కులు చూస్తుంది! పక్షి తల్లి.. చెట్టూ పుట్టా గాలిస్తుంది! అయినా.. బిడ్డ కనిపించకపోతే, ఎక్కడ ఉన్నా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కన్నబిడ్డను తల్లి దీవిస్తుంది! అదే బిడ్డ రెక్కలను వేటగాడి వేటు విరిచేస్తే..? పక్షితల్లి గుండె చెరువవుతుంది! గూడు చెదిరిపోతుంది! బిడ్డక్కలు విరిగిపోతేనే పక్షితల్లి హృదయం అంతగా తల్లడిల్లితే.. మరి, కళ్లముందే బిడ్డ నిప్పు కణికల్లో మలమల మాడిపోతే..?! దేహంలోని అణువణువును దహించే కాలకూట విషాన్ని మింగితే..?! ఉఛ్వాస.. నిశ్వాసాలను ఉరికొయ్య బంధిస్తే..? ఆ తల్లి ఏం కావాలి?! ఆ గూడు ఏమవ్వాలి..?! ఒక ఆకాంక్ష కోసం.. నాలుగున్నరకోట్ల ప్రజల నినాదం కోసం... ఆరిపోయిన దీపాలు వెయ్యిపైనే! గుండెపగిలిన హృదయాలు లెక్కలేనన్ని!!
    మార్చి 28న  ఉదయం 11.30 గంటలు! చంకన పిల్ల, చేతిలో సంచి పట్టుకొని.. వెంట అన్నను తోలుకుంటూ ఓ మహిళ..! చూస్తే నిండా 20ఏళ్లూ లేవు! ఆమె ముఖం చిన్నబోయింది! అమరవీరుడి భార్యే!! తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుడి భార్యే! పలుకరిస్తే నిజమని తేలింది. అమ్మా.. ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు మొదలైంది కన్నీరు! ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపూ ఆ కన్నీరు సెలయేరులా పారుతూనే ఉంది! ఎర్రబారిన కళ్లు ఆమె అనుభవిస్తున్న కష్టాలను చెప్పకనే చెప్పాయి! అలాగే మరొకరు..!
      ఏడాది నిండని బాబు.. ముద్దొచ్చే ముఖం. మాటలు కూడా సరిగ్గారావు! అమ్మ చేయిపట్టుకొని.. వచ్చీపోయేవాళ్లను చూస్తున్నాడు! ఆ తల్లి ముఖంలో జీవం లేదు! ఏడ్చిఏడ్చి కన్నీరు ఇంకిపోయినట్లుంది! ఆమెకు కూడా 20ఏళ్లు ఉన్నట్లుగా లేవు. ఆ తల్లిని కట్టుకున్నోడు అమరుడయ్యాడు. పలుకరిస్తే.. ఆమె నోట మాట పెకలలేదు! మరో తల్లి..! చేతికొచ్చిన కొడుకు.. కళ్లముందే పెయ్యిమీద పెట్రోలు పోసుకొని కాల్చుకున్నాడు. తెలంగాణ తప్ప నాకేం వద్దంటూ ప్రాణాలొదిలాడు. సలసల కాలిపోతున్న బిడ్డను చూసి ఆ తల్లి గుండె పగిలింది. శోకం సంద్రమైంది. అవసాన దశలో అండగా ఉంటాడనుకున్న కొడుకుకే ఆమె తలకొరివిపెట్టాల్సి వచ్చింది! ‘నా బిడ్డ ఆస్తుల కోసం పోరాడలేదు. జాగ కోసం కోట్లాడలేదు. నాలుగున్నర కోట్ల ప్రజల కోసమని నిండు ప్రాణాన్ని విడిచిండు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయన్నడు. ఇప్పుడు బిడ్డ లేడు! నోట్ల ముద్ద పెట్టుకున్నప్పుడల్లా బిడ్డనే యాదికొస్తున్నడు. బువ్వ దిగుతలేదు. ఎవరు నాయినా మాకు దిక్కు..’ అంటూ ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది. ఇలా ఒకరా.. ఇద్దరా.. 200కు పైగా కుటుంబాలు!
మార్చి28న  హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానభవన్‌లో ‘నమస్తే తెలంగాణ’ ఏర్పాటు చేసిన ‘అమరవీరుల సహాయనిధి పంపిణీ’ కార్యక్ర మానికి తెలంగాణ నలుమూలల నుంచి అమరుల కుటుంబాలు తరలివచ్చాయి. వారిని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రతినిధుల బృందం కలిసి పలకరించింది. ఇంటర్వ్యూ చేసింది. అంతులేని విషాదం, కడుపుకోత, వీదిన పడ్డ జీవితాలు.. వారి మాటల్లో కనిపించాయి. ఓ ప్రజాప్రతినిధి... ఓ ఉన్నతాధికారి.. ఇలా చాలా మందినే వృత్తిపరంగా ఇంటర్వ్యూ చేశాం. కానీ.. అమరుల కుటుంబాలను పలుకరించడం, వారిని ఇంటర్వ్యూ చేయడం.. కన్నీటిని దిగమింగుకుంటే కానీ కుదరదు! మనసును రాయి చేసుకుంటే కానీ కలం కదలదు! తెలంగాణ అమరుల కుటుంబాలను చూస్తే.. కన్నీరు ఆగలేదు. మా బృందానికే కాదు.. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కన్నీరు ఆగలేదు! అయినా.. మాలోని కన్నీటి కడలికి కట్టలు వేసుకున్నాం. మా మనసులు రాయిగా మార్చుకున్నాం..! 
- టీ మీడియా, హైదరాబాద్ సిటీబ్యూరో

Thursday, 28 March 2013

రామయ్య పెళ్లికి తలంబ్రాలు సిద్ధం ..భద్రాచలం: ఏప్రిల్‌ 19న జరగనున్న ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవానికి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. తలంబ్రాలు కలిపే వేడుక మార్చి 27న వైభవోపేతంగా జరిగింది. 50 క్వింటాళ్ల బియ్యానికిగానూ తొలివిడతగా 10 క్వింటాళ్ల బియ్యంలో పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, తానీషా ప్రభువు కాలం నుంచి వాడుతున్న గులాంను కలిపి తలంబ్రాలు తయారు చేశారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి డోలోత్సవం చేశారు.

Tuesday, 26 March 2013

సోలార్ రూఫ్ టాప్ పాలసీ వాడుకోండి.. మిగిలింది అమ్ముకోండి..

* సౌర విద్యుత్‌పై ... ఇదీ సర్కారీ విధానం
* కిలోవాట్ ఉత్పాదక  యూనిట్‌కు లక్షన్నర  పైన ఖర్చు
* త్రీఫేజ్ వినియోగదారులకు 30% సబ్సిడీ
* సింగిల్‌ఫేజ్‌కు వర్తించదు
* మిగులు విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం
* ఈఆర్సీ నిర్ణయం మేరకు చార్జీల చెల్లింపు
        రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సొంత అవసరాలకు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ పాలసీని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో చిన్నతరహా సోలార్ ఫోటో వోల్టాయిక్(ఎస్‌పీవీ) పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా ప్రభుత్వం ‘నెట్ మీటరింగ్ ఫర్ సోలార్ గ్రిడ్ ఇంటరాక్టివ్ రూఫ్-టాప్ అండ్ స్మాల్ ఎస్‌పీవీ పవర్ ప్లాంట్స్’ పాలసీని తీసుకువచ్చింది. విద్యుత్‌సౌధలో ఏపీ ట్రాన్స్‌కో 100 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటుచేసి విజయవంతంగా నిర్వహిస్తున్నది. దీనిని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి స్వయంగా సందర్శించి దాని పనితీరును పరిశీలించిన విషయం తెలిసిందే.
        500 కిలోవాట్ల సామర్థ్యం వరకు సోలార్ పవర్ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30% మేరకు సబ్సిడీలను అందిస్తున్నాయి. ఇక కిలోవాట్ సామర్థ్యం గల రూప్ టాప్ సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం రూ. 1.65 లక్షల మేరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ కొత్త విధానం ప్రకారం వివిధ అపార్ట్‌మెంట్లు, భవంతులపై సోలార్ పవర్ జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. అవి ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను అవసరాల మేరకు వినియోగించుకుని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి విక్రయించే అవకాశం ఉంది.
           ఇందుకోసం నెట్ మీటరింగ్ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. నెట్ మీటరింగ్ అంటే సోలార్ పవర్ యూనిట్ ఉత్పతి చేసే విద్యుత్‌ను రికార్డు చేయడంతో పాటు అందులో విద్యుత్ వినియోగం, గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్ వివరాలు రికార్డు అవుతాయి. అయితే నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కేవలం త్రీ-ఫేజ్ వినియోగదారులు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఉత్పత్తిచేసే సోలార్ పవర్‌ను నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. వినియోగదారుడు వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు మళ్లుతుంది. దాని ధరను విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు లోబడి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) నిర్ణయిస్తుంది. ఎస్‌పీవీ జనరేటర్లు (సోలార్ పవర్ ఉత్పత్తిదారులు) డిస్కమ్‌లు రూపొందించిన నమూనాలో నెట్ మీటరింగ్ బిల్లింగ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.

Saturday, 23 March 2013

స్వేచ్ఛా పోరాటాల స్ఫూర్తి కిరణం..

* చెవిటివారికీ వినిపించే శబ్దం
* విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ 82వ వర్ధంతి
                                     
        తుపాకులు నాటితే.. తుపాకుల చెట్టు మొలిస్తే.. చెట్టుకు కాసిన ఆ తుపాకులన్నీ పట్టుకుని బ్రిటిష్ వలసపాలకులను వెళ్లగొడితే? పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి మనసులో మెదిలిన ఆలోచన! దేశ ప్రజలపై దాష్టీకాలకు పాల్పడుతున్న బ్రిటిషర్లను అర్ధరాత్రి ఎటాక్ చేసి.. కనీసం దేహశుద్ధి చేయడం ద్వారానైనా కసి తీర్చుకోవాలన్న ఓ యువకుడి ఆవేశం! పెళ్లి చేసుకుంటే దేశ స్వాతంత్య్రం కోసం తన పోరాటానికి ఎక్కడ విఘాతం కలుగుతుందోనని కలతపడి.. తన లక్ష్యం దేశ స్వాతంత్య్ర సాధనేనని ప్రకటించి ఇంటి నుంచి అర్ధరాత్రిపూట విప్లవ సమరాంగణంలోకి నడుచుకుంటూ పోయిన ఓ ఆవేశపరుడి అభీష్టం! తుపాకి పట్టినా.. మార్క్సిజమే ఈ దేశ సకల సమస్యల పరిష్కారానికి మార్గమని గుర్తించి.. సైద్ధాంతిక పరిణితి చెందిన ఓ సోషలిస్టు జీవితం! హస్ హస్‌కే జాన్ లుటానే.. ఆవాజ్ సవేరా లానే! తన నిర్ణయంతో జీవితం ముగిసిపోతుందని తెలిసినా.. తన బలిదానం ముందు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మి.. ఉద్నిగ్నత.. ఉత్సాహం కలగలిసిన సమ్మిళిత భావోద్వేగాల నడుమ తన సహచరులతో కలిసి ఉరికొయ్యలకు ఊయలలూగిన ఓ విప్లవకారుడి నిరుపమాన త్యాగం! భగత్ సింగ్! చరిత్ర ఉన్నంత కాలం.. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి.. ఒక జాతిని వేరొక జాతిని దోచుకుంటున్నంత కాలం.. చెలరేగే విప్లవాలకు.. ప్రజ్వరిల్లే ఉద్యమాలకు నిత్యస్ఫూర్తి కిరణం! 
                             
          సరిగ్గా 82ఏళ్ల క్రితం ఇదే రోజున హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నాయకుడు భగత్‌సింగ్‌ను బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య కేసులో లాహోర్ కేంద్ర కార్యాలయంలో గుట్టుచప్పుడుకాకుండా ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. భగత్‌సింగ్‌తో పాటు అతడి సహచరులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను కూడా ఉరితీశారు! నిజానికి మార్చి 24న భగత్‌సింగ్ అతడి సహచరులను ఉరి తీయాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే ఉరితీసిన జైలు సిబ్బంది.. ఆ ముగ్గురి మృతదేహాలను సట్లెజ్ నది సమీపాన ముక్కలుముక్కలుగా నరికి.. తగులబెట్టి.. సగంకాలిన శరీరభాగాలను నదిలోకి విసిరిపారేశారు! భారతదేశ ముద్దుబిడ్డలను అత్యంత కిరాతకంగా చంపి.. చివరి చూపులకూ ఆస్కారం లేకుండా చేశారు! కానీ.. అతడు రగిల్చిన స్ఫూర్తిని మాత్రం ఆపలేక పోయారు. తన బలిదానం ముందు తరాలకు స్ఫూర్తినిస్తుందన్న అతడి నమ్మకం వమ్ముకాలేదు. 23 ఏళ్ల లేత వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన భగత్‌సింగ్.. 82 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ జనం గుండెల్లో గూడుకట్టునే ఉన్నాడు. ఉంటాడు! 
                        
           భగత్‌సింగ్ జీవితాన్ని మలుపుతిప్పింది మార్క్సిజమే! తొలి నాళ్లలో గాంధీకి తీవ్రంగా ప్రభావితుడైన భగత్‌సింగ్.. తర్వాతి కాలంలో గాంధీ సిద్ధాంతాలకు దూరమయ్యాడు. బ్రిటిష్ సర్కారు దాష్టీకాలను ఎదుర్కొనాలంటే అహింసాయుత పోరాటం సమాధానం కాదన్నది ఆయన సిద్ధాంతం. ప్రత్యేకించి చౌరాచౌరీ ఘటన (పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి భారతీయులు దానికి  నిప్పుపెట్టి అందులో ఉన్న పోలీసులను సజీవ దహనం చేశారు) అనంతరం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నిలిపివేయడం భగత్‌సింగ్‌ను పూర్తిగా మార్చివేసింది. భగత్‌సింగ్ జీవితంలో మరో ఆసక్తికర అంశం ఆయన నాస్తికవాదిగా మారడం. మార్క్సిస్టు మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్, లెనిన్ రచనలతో తీవ్రంగా ప్రభావితుడైన భగత్‌సింగ్.. దేశ స్వాతంత్ర సాధనకే కాకుండా.. సకల జనుల సమస్యల పరిష్కారానికి సమసమాజమే మార్గమని నమ్మాడు. అందుకే తాను పని చేసిన హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరులో సోషలిస్టు అన్న పదం చేర్చి.. దానిని హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌గా మార్పు చేశాడు. మృత్యువు ముంగిట్లో సైతం నాస్తికుడిగానే నిలబడ్డాడు                             
    అరెస్టయి.. కోర్టు విచారణ సమయంలో తమ అసోసియేషన్ లక్ష్యాలను, నినాదాలను దేశంలో వ్యాప్తి చేయడానికి, తద్వారా దేశ యువతను స్వాతంత్రో ద్యమానికి పురికొల్పడానికి భగత్‌సింగ్ సాహసం చేశాడు. ‘చెవిటివారికి వినిపించేందుకు పెద్ద శబ్దం చేయటం’ అనే ఉద్దేశంతో న్యూఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో 1924, ఏప్రిల్ 8న ఎలాంటి హాని చేయని రెండు పొగబాంబులను దత్‌తో కలిసి భగత్ విసిరాడు. అనంతరం స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. ఆ సమయంలో ‘లాంగ్ లివ్ రివల్యూషన్.. ఇంక్విలాబ్ జిందాబాద్..’ అంటూ వారు చేసిన నినాదాలు.. ఇప్పటికీ కోట్ల మంది కార్మికులు, శ్రామికులు.. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నవారికి తారక మంత్రాలయ్యాయి. విచారణ సమయంలో భగత్‌సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కోర్టు వేదికగా బ్రిటిష్ పాలకుల దాష్టీకాలను భగత్ ఎండగట్టాడు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం 64 రోజుల పాటు తన సహచరులతో కలిసి కఠోర నిరాహార దీక్ష చేశాడు. ఆ సమయంలో గాంధీని మించిన పేరును భగత్ సంపాదించాడని చెబుతుంటారు. ఒక ద్రోహి కారణంగా శాండర్స్ హత్య కేసులో ఉరిశిక్షకు గురయ్యాడు. అయితే.. భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష తప్పించే అవకాశాన్ని గాంధీ విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి వైశ్రాయి లార్డ్ ఇర్విన్‌తో ఒప్పందం సందర్భంగా భగత్‌సింగ్ అతని సహచరుల ఉరిశిక్షకు గాంధీ కనీసం పట్టుబట్టలేదన్న వాదనలు ఉన్నాయి! భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 150వ వార్షికోత్సవాల సందర్భంగా విడుదల చేసిన ‘లోగో’లో నాలుగు సంవత్సరాలను ప్రస్తావించగా.. అందులో మొదటిది 1857(సిపాయిల తిరుగుబాటు), 1947 (దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం), 2007 పధమ స్వాతంత్య్ర సంగ్రామానికి 150 ఏళ్లు నిండిన సంవత్సరం) ఉంటే.. అందులో చోటు చేసుకున్న మరో సంవత్సరం 1907.. భగత్‌సింగ్ జన్మ సంవత్సరం! ఇదీ భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్‌సింగ్ పొందిన అత్యున్నత స్థానం!

Friday, 22 March 2013

సీతారాముల పర్ణశాల

      రామాయణ కాలం నాటి చారిత్రాత్మక ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయని నమ్మే పర్ణశాల ఖమ్మం జిల్లా భద్రాచలానికి 36 కి.మీ. దూరంలో ఉంది. మారీచుడిని వధించిన స్థలంగా దీన్ని పేర్కొంటరు. బంగారు లేడి ఉదంతం జరిగిన ప్రదేశంగానూ, రావణుడు సీతను అపహరించిన ప్రాంతంగానూ ఇది ప్రచారంలో ఉంది. ఇక్కడి గోదావరి నదీ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటది. 
నిర్మల్ కొయ్య బొమ్మలు
      ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మలు, చిత్రకళకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కొయ్యబొమ్మలు తయారుచేసే కళాకారులను ఇక్కడికి తీసుకువచ్చి ఉపాధి కల్పించాడు. అలా ఆ కుటుంబాలు ఇప్పటికీ అక్కడ అదే వృత్తిని కొనసాగిస్తున్నయి. హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా అన్ని దేశాలకు ఈ బొమ్మలను ఎగుమతి చేస్తున్నరు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, ఇచ్చోడ అటవీ ప్రాంతాల్లో లభించే ‘పొనికి’ చెట్ల కలపతో వీటిని తయారు చేస్తరు.
కార్ఖానా జిందా తిలిస్మాత్:


        హైదరాబాద్‌లో అంబర్‌పేట ప్రాంతంలో మహమ్మద్ మోహినొద్దీన్ ఫరూఖీ 1920లో ఈ ప్యాక్టరీని ప్రారంభించారు. యునానీ వైద్యంలో డిగ్రీ చేసిన పరూఖీ నొప్పుల బాధ నివారణ కోసం జిందా తిలిస్మాత్‌ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారాన్ని తన కలల ప్రాజెక్టుగా స్థాపించారు. శతాబ్దానికి పైగా చరిత్ర గల ఈ పరిశ్రమ నేటికీ తన ఉత్పత్తిని కొనసాగిస్తోంది.
ఎల్లమ్మ జాతర

               
తెలంగాణలో గ్రామదేవతలకు జరిగే జాతరలో పోలేపల్లి జాతర కూడా చాలా పెద్దది. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం పోలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మహా శివరాత్రికి ముందు వచ్చే శుక్రవారం ఘనంగా జరుగుతయి. ఇటివల మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమం. ఆ వేడుక తెలిపేదే ఈ ఫొటో. 200 సంవత్సరాల చరిత్ర గల ఈ జాతరను కనులారా దర్శించడానికి మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం రెండు లక్షల మంది దాకా భక్తులు హాజరయ్యారు.
ఇల్లందకుంట రామాలయం

      ‘అపర భద్రాద్రి’ గా పిలువబడే అత్యంత పురాతనమైన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి 5 కి.మీ. దూరంలోని ఇల్లందకుంట గ్రామంలో ఉంది. పూర్వం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా దండకారణ్యంలో విహరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడంటరు. అప్పుడే దశరథుడు మరణించాడని తెలియడంతో ‘ఇల్లంద’ విత్తనాలతో ఇక్కడ పిండ ప్రధానం చేయడం మూలంగా ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిందని గ్రామస్తులు అంటరు.

Thursday, 21 March 2013

ANKOR VAT Temple..

సడక్‌బంద్ గ్రాండ్ సక్సెస్...           టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 
      పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్తకోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
    ఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాక్టర్
 శ్రవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 
   అలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌ నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.

Wednesday, 20 March 2013

హిందువులు సంఘటితం కావాలి..


- మతాలు వేరైనా అందరి దేవుడొక్కడే 
- శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీజీ
- బాలికలను చిన్నచూపు చూడొద్దు
- నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం
కరీంనగర్ (మార్చి 19):  అందరి దేవుడొక్కడేనని, మతాలే వేరని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. ధర్మ జాగరణ సమితి కరీంనగర్ శాఖ అధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన ‘హిందూ శంఖారావం’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి సభ్యురాలు, నమస్తే తెలంగాణ దినపత్రిక డైరెక్టర్ విజయరాజంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించేదే హిందూ మతమని పేర్కొన్నారు. హిందువులు ఆదరిస్తేనే ఇతర మతాలు మనగలుగుతున్నాయని, అందుకు బదులుగా వారు దానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరికీ హాని చేయని మతం హిందూ మతమని అన్నారు. దేశంలో అతి పెద్ద మతంగా గుర్తింపు పొందిన హిందూ మతస్తులపై కొన్ని మతాల వారు మత మార్పిడికి పాల్పడుతుండగా, మరి కొందరు బాంబులతో దాడి చేస్తూ మారణకాండ సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గో మాంసం తినాలని, 15 నిముషాల సమయం ఇస్తే హిందువులను ఊచకోత కోస్తానని అనడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో కటకటాలు లెక్కించాడని, తాను అలా అనలేదని మాట మార్చడం సబబు కాదన్నారు.
       అక్బరుద్దీన్‌కు శరీరంలో బుల్లెట్లు దిగినప్పుడు, కత్తి గాయాలైనప్పుడు వైద్యం అందించింది హిందూ ఆస్పవూతేనని, హిందు వైద్యులేనని అన్నారు. ఒవైసీ ఆసుపత్రి ఉన్నప్పటికీ నమ్మకం లేకనే హిందూ ఆస్పత్రి లో చేరి ఆరోగ్యం మెరుగుపరుచుకున్నారని గుర్తు చేశారు. మతాన్ని మతంగానే చూడాలని, మతాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టి ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల మృతికి కారకులయ్యారని, ఇక్కడ మరణించింది మతం కాదని మానవులని అన్నారు. మానవత్వం లేనప్పుడు దైవత్వమెందుకని అన్నారు. హిందువులందరూ ఒకే గొడుగు కిందకు ‘హిందూ సమాజం’లోకి రావాలని పిలుపునిచ్చారు. సంఘటితంగా ఉంటూ దేశాన్ని కబళించాలని చూసే దుష్ట శక్తులను పారదోలాలని అన్నారు. విజయ రాజం మాట్లాడుతూ మహిళగా జన్మించినందుకు మహిళలు గర్వపడాలని అన్నారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానముందని, బాలికలను చిన్న చూపు చూడవద్దని సూచించారు. ప్రతి ఇల్లాలు ఇంటిని రక్షించుకున్నట్లే సమాజాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ ప్రచారకులు శ్రీనివాసానంద స్వామీజీ మాట్లాడుతూ భారతీయులమని గర్వంగా చెప్పుకోవాలని, మాతృభాషను ప్రేమించాలని, హిందువుగా జీవించాలని అన్నారు. హిందూ శంఖారావం హైందవ జాతికి మేలుకొలుపు కావాలన్నారు. దేశ రక్షణే మనకు ఊపిరి కావాలని పేర్కొన్నారు.
            తల్లిదండ్రులను మించిన దైవం లేదని, దేశ సేవను మించిన భాగ్యం మరొకటి లేదని చెప్పారు. హిందువులపై ఇతర మతాల వారు రెచ్చగొటే ప్రసంగాలు చేయడం సరికాదన్నారు. హిందూ ధర్మ ప్రచారకులు ప్రమోద్ చైతన్య మాట్లాడుతూ అన్ని మతాలు సమానమేనని, దుష్ట సంస్కృతికి పాల్పడే వారి బుద్ధిని మార్చే ప్రయత్నం చేయాలని అన్నారు. దుర్మార్గులను సన్మార్గంలో నడిపించాలన్నారు. సహనానికి మారు పేరు హిందువులన్నారు. డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార శాస్త్రి, స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రాంతీయ కార్యదర్శి అప్పాల ప్రసాద్ తదితరులు మాట్లాడారు. అప్పాల ప్రసాద్ రచనలో వెలువడిన వివేకానందుడి పాటల సీడీని పరిపూర్ణానంద స్వామి ఆవిష్కరించారు. సినీ రచయిత జేకే భారవి మాట్లాడుతూ ఇక్కడి మట్టి గొప్పదని, దేశానికే హిందూ శంఖారావం సభ మోడల్ సభగా మారిందన్నారు. ఆదిశంకరాచార్య సినిమా నిర్మించానని, దాన్ని ఆదరించాలని కోరారు. ధర్మ జాగరణ సమితి ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ శంఖారావంలో జిల్లా నలుమూలల నుంచి హిందువులు, నగర ప్రముఖులు, వేద పండితులు, వైద్యులు, వీహెచ్‌పీ, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
హిందూ మతంలో చేరిన క్రైస్తవ కుటుంబం:
ఐదు తరాలుగా క్రైస్తవులుగా ఉంటున్న రామడుగు మండలం కొరటపల్లి గ్రామానికి చెందిన మన్నె సురేందర్ కుటుంబం హిందూ మతంలోకి మారింది. సురేందర్ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా శివలింగం బయల్పడడంతో ఆయనలో మార్పు వచ్చింది. దీంతో పాస్టర్‌గా ఉన్న ఆయన పరిపూర్ణానంద స్వామి సమక్షంలో హిందూ మతంలో చేరారు.

Tuesday, 19 March 2013

ఇంటర్నెట్‌ వైతాళికులకు రూ.8 కోట్ల బహుమతి..

లండన్‌: సాంకేతిక అద్భుతాల్లో ఒకటైన ఇంటర్నెట్‌ను తీర్చిదిద్దటంలో కీలకపాత్ర వహించిన ఐదుగురు ఇంజినీర్లకు భారీ బహుమతి దక్కనుంది. ఇంజినీరింగ్‌లో నోబెల్‌ బహుమతిగా భావించే క్వీన్‌ ఎలిజబెత్‌ ప్రైజ్‌కు వీరిని ఎంపిక చేసినట్లు బ్రిటన్‌కు చెందిన నిర్వాహకులు ప్రకటించారు. అమెరికాకు చెందిన రాబర్ట్‌ కాన్‌, వింటన్‌ సెర్ఫ్‌, మార్క్‌ ఆండ్రీసెన్‌లతో పాటు ఫ్రాన్స్‌కు చెందిన లూయీ పౌజిన్‌, బ్రిటన్‌కు చెందిన టిమ్‌ బెర్నర్‌లు రూ.8.10కోట్ల (1.5 మిలియన్‌ డాలర్లు) విలువైన ఈ బహుమతిని పంచుకోనున్నారు. దార్శనీకులైన ఈ ఐదుగురిని కలిపి ఇంతకుముందెన్నడూ సత్కరించలేదని నిర్వాహక కమిటీ పేర్కొంది. జూన్‌లో లండన్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌-2 స్వయంగా ఈ అవార్డును విజేతలకు అందజేయనున్నారు.

Tuesday, 12 March 2013

తెలంగాణ పట్ల విద్యుత్ వివక్ష...విద్యుత్ రంగంలో తెలంగాణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. మొత్తం సమాజాన్ని సంక్షోభంలో ముంచెత్తుతున్నది. తన బతుకేదో తాను బతికే తెలంగాణ రైతులు ఇవాళ ఆగ్రహించి బజారుకెక్కి ధర్నాలకు, ఇతర ఆందోళనలకు దిగుతున్నాడంటే, కారణం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణే. తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కష్టాలను ప్రకృతిపై తోసేయడం విచిత్రం. పైగా ఇప్పుడు కరెంటు కోత అనివార్యమని, వానదేవుడు కరుణిస్తే కష్టాలు తీరుతాయని, లేకపోతే మరింత కాలం కటకట తప్పదని అంటున్నది. తెలంగాణ ఇంతగా కరెంటు లేక అల్లాడడానికి కారణం ఆంధ్ర పాలకవర్గం చూపిన, చూపుతున్న వివక్షే. కానీ ఈ విషయం అంగీకరించకుండా, అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ వారిపై బురద చల్లడానికి ప్రభుత్వం కానీ, ఆంధ్ర పాలకవర్గ ప్రతినిధులు కానీ వెనుకాడరు. 
          చేతికొస్తుందనుకున్న పంట కండ్ల ముందే ఎండిపోతుంటే, రైతన్నలు భరించలేక ఆందోళనలకు దిగవలసి వస్తున్నది. రోజుకు ఏడు గంటలు కరెంటు సరఫరా చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం తీరా ఇప్పుడు నాలుగైదు గంటలకు మించి సరఫరా చేయడం లేదు. అదీ ఒకే దఫా కాకుండా, నాలుగైదు సార్లు అందిస్తున్నది. దీంతో రైతులు పంట భూముల దగ్గరే రాత్రనక, పగలనక కావలి కాయాల్సి వస్తున్నది. వాన రాకడ, పానం పోకడ చెప్పొచ్చు గని, కరెంటు రాకపోకలు కనిపెట్టలేకపోతున్నమని రైతులు వాపోతున్నరు. నీళ్ళుండి కూడా కరెంటు లేక మక్కజొన్న, పల్లి పంటలు ఎండి పోతున్నాయి. దీంతో దిక్కుతోచని రైతన్నలు వారం రోజులుగా విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్, సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, శాయం పేట, మహబూబా బాద్ మండలం శనిగరం తదితర ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుని సబ్‌స్టేషన్లను ముట్టడించారు. 
           శాయంపేటలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గూడూరు, నెక్కొండ, స్టేషన్ ఘన్‌పూర్, ఇప్పగూడెం, జనగామ తదితర ప్రాంతాలన్నీ ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. భూపాల పల్లి ప్రాంతంలో మహిళలు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రంగాడ్డి జిల్లా దోమ మండలంలో మోత్కూరు రోడ్డుపై రైతులు బైఠాయించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు సాగాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, మిర్యాల గూడ, చిట్యాల, నకిరేకల్ తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు సాగాయి. కరీంనగర్, నిజామాబాద్ మెదక్ మొదలుకొని రాజధాని హైదరాబాద్ నగరం వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. ప్రతి చోట రైతులు అధికారులను నిలదీస్తున్నారు. 
       కరెంటు కోత ప్రభావం రైతుల మీదనే కాదు, అన్ని వర్గాలపై ఏదో రూపంలో పడుతున్నది. విద్యుత్ సరఫరా లోపం వల్ల మాకు మంచినీళ్ళు కూడా రావడం లేదని కొన్ని చోట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పరీక్షల కాలం కనుక చదువుకునే పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతున్నది. వ్యాపార రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నది. విద్యుత్ సంక్షోభం వల్ల ఏడాది కాలంలోనే తొమ్మిది వేల కంపెనీలు మూత పడినయి. విద్యుత్ కోత భరించలేక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయని, పారిశ్రామిక వర్గాలు బహిరంగంగా చెబుతున్నాయి. 
        రైతులు కొత్తగా అడుగుతున్నదేమీ లేదు. ఏడు గంటల పాటు రైతులకు కరెంటు సరఫరా చేయడం పాత హామీ. ప్రతి ఎన్నికల్లో ఇదొక కచ్చితమైన హామీగా ముందుకొస్తున్నది. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు చెప్పలేనంత అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలపై ఆధారపడవలసిన గతి పట్టింది. అందువల్ల తెలంగాణ రైతుకు కరెంటు తగినంతగా, ఉచితంగా సరఫరా చేయాలనేది దశాబ్దాలుగా సార్వవూతిక ఆమోదం పొందిన డిమాండ్. ఇది తెలంగాణ రైతుల హక్కు. ఈ విషయం తెలిసి కూడా పట్టనట్టు ఉండడాన్ని వివక్ష చూపడంగా, అణచివేత చర్యగా భావించాలె. కరెంటు కోత పోయినేడాది కూడా ఉన్నది. ఈ సారి కూడా ఉంటుందనేది ప్రభుత్వానికి తెలిసిందే. అయినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ఆంధ్ర పాలకులు సంజాయిషీ ఇవ్వాలె. 
            నేదునూరు ప్రాజెక్టు వంటి అనేక పథకాలను పక్కన పెట్టి, ఇక్కడి బొగ్గును మరోచోటికి కొంచబోయి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అనేక విధాలుగా ఆంధ్ర పాలకులు నాటకాలు ఆడుతున్నారు. నీటి ప్రాజెక్టులు కట్టకుండా నోరు కొట్టినా ఇవాళ తెలంగాణ రైతులు సొంత చెమటను, నెత్తుటిని పెట్టుబడిగా మార్చి, బోరు బావులు తవ్వుకుని రికార్డు స్థాయిలో వ్యయసాయ ఫలాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది సహించలేకనే కరెంటు కోతతో వేధిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, అల క్ష్యం వల్ల కరెం టు కోత వచ్చింది. దీని వల్ల సమాజం అనేక విధాలుగా నష్టపోతున్న ది. అయినా ఈ విషయం గుర్తించకుండా తెలంగాణ వారి కష్టాలకు ఇక్కడి ప్రజలే కారణమని నమ్మించడానికి అనేక సందర్భాలలో ఆంధ్ర పాలకవర్గం ప్రయత్నించింది.
           సకల జనుల సమ్మె చేస్తే దాని వల్ల విద్యార్థులు నష్టపోతారని మీడియా కోడై కూసింది. తెలంగాణ ఉద్యమం వల్ల పరిక్షిశమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని ప్రచారం సాగింది. సకల జనుల సమ్మె వల్లనే రైతులకు విద్యుత్ రావడం లేదని ప్రచారం సాగింది. మరి ఇప్పుడు కరెంటు కోతకు, విద్యార్థుల కష్టాలకు, పరిక్షిశమల మూతకు, పెట్టుబడులు తరలి పోవడానికి కారణాలు ఎవరో ప్రభుత్వమే చెప్పాలె. తెలంగాణపై ఆంధ్ర పాలకవర్గం సాగిస్తున్న కుట్ర వల్లనే ఈ కష్టాలని తెలుస్తూనే ఉన్నది. ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తేవడం ద్వారానే ప్రజలు కరెంటు కష్టాల నుంచి గట్టెక్కుతారు. తెలంగాణ ఏర్పడితే మాత్రమే ప్రజలు తమ ప్రాధాన్యాలను గుర్తించి, అభివృద్ధి పథకాలు రూపొందించుకోగలరు.

ధీర నాయకురాలు ఈశ్వరీబాయి..    తరతరాలుగా దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత ఈశ్వరీబాయి... తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరిచేవి. 
       కుల వివక్ష, దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా అంకిత భావంతో ప్రతిఘటించిన ధీర నాయకురాలు శ్రీమతి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్ వాసి నిజాం రైల్వేస్‌లో గూడ్స్ మాష్టారుగా పనిచేసే దళిత కుటుంబానికి చెందిన బలరామస్వామి, రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయి 1918, డిసెంబర్ 1న ఆమె జన్మించారు. కీ న్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈశ్వరీబాయికి 13వ ఏట పూనా నివాసి డా.జె. లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఆ దంపతుల ఏకైక సంతానం గీత. అనతికాలంలో భర్త మరణించటంతో పూనా నుంచి సికింద్రాబాద్‌లోని తండ్రి దగ్గరకు కుమార్తెతో సహా మకాం మార్చారు. స్త్రీ స్వయం ప్రతిపత్తి, స్వావలంబన భావాలుగల ఈశ్వరీబాయి పరోపకారిణి. పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా జీవితం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖలో ఉద్యోగినిగా పనిచేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో 'గీతా విద్యాలయం' పాఠశాలను స్థాపించి ఆ ప్రాంతంలో స్త్రీలందరినీ చేరదీసి వారికి చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేశారు.
         నాటి సమాజంలో అంటరానితనం కారణంగా దళితులు పడుతున్న అవస్థలు ఈశ్వరీబాయిని కదిలించాయి. బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ఉద్యమాలు, ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. విమోచన ఉద్యమాలవైపు అడుగులు వేయటం ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుంచి భారత ప్రభుత్వంలో కలుపుకున్న తరువాత 1951లో హైదరాబాద్-సికింద్రాబాద్ నగర పాలక సంస్థకు ప్రప్రథమంగా జరిగిన ఎన్నికలలో చిలకలగూడ (సీతాఫల్‌మండి) వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కార్మికులు, దళితులు, స్త్రీల శ్రేయస్సు కోసం ఈశ్వరీబాయి విశేషంగా కృషి చేశారు. అధికార పార్టీలో చేరాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ప్రలోభాలకు లొంగక బాబాసాహెబ్ సిద్ధాంతాలు విడువక 'అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య'లో చేరి హైదరాబాద్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. బి. జగన్నాధం అధ్యక్షులుగా ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు నాయకత్వం అందించారు.
          1956, అక్టోబర్ 4న నాగపూర్‌లో బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ధమ్మదీక్ష స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేసి 5 లక్షల మంది అనుయాయులతో బౌద్ధమతం స్వీకరించారు. ఆ కార్యక్రమంలో ఈశ్వరీబాయి కీలకపాత్ర వహించారు. అనేకమంది అనుయాయులతో దీక్షను స్వీకరించారు. 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈశ్వరీబాయి పోటీచేసి గెలుపొందారు. బాబాసాహెబ్ రాజకీయ వారసురాలన్న గుర్తింపే ఆమెను ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దేవాదాయ శాఖ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మిపై గె లిచేందుకు దోహదం చేసింది. తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం మొదలైన ప్రతిపక్ష నాయకుల సరసన ఆమె అదే హోదాను పొందారు. ఆ తరువాత జరిగిన 1972 శాసనసభ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండవ సారి ఎన్నికయ్యారు.
            మొదటి సారి శాసనసభలో ప్రతిపక్షనాయకురాలిగా అడుగిడిన ఈశ్వరీబాయి సభలో అనేక సమస్యలను ప్రస్తావించారు. చర్చల్లో చురుగ్గా పాల్గొని తన సలహాలను అందిచారు. సమసమాజ స్థాపన, రాజ్యసామ్యవాదం, కార్మికుల రక్షణ-భద్రత, కనీసవేతన చట్టం, భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి బంజరు భూమి పంపిణీ, అస్పృశ్యత నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలుపరచాలని, అస్పృశ్యత పాటించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బలహీనవర్గాల కార్మికులకు ఇతర నిరుపేదలకు నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని, బౌద్ధమతం స్వీకరించిన అస్పృశ్యులకు ఎస్.సి. హోదా కల్పించాలని (1992లో నియో బౌద్ధులను ఎస్.సి.లుగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది), ఇంటర్‌మీడియేట్ వరకు స్త్రీలకు ఉచిత విద్య అందించాలని, వితంతువులకు పింఛనులు ఇవ్వాలని, పట్టణ ప్రాంతంలోని మురికివాడలలో నివసించే వారికి పక్కా గృహాలను నిర్మించి మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని, హైదరాబాద్‌లోని ముస్లిం మహిళలకు ఉచిత విద్య-ఉపాధి కల్పించాలని ప్రభుత్వంపై ఈశ్వరీబాయి ఒత్తిడి తెచ్చారు. అప్పటి ప్రభుత్వం ఈశ్వరీబాయిని ఆంధ్రప్రదేశ్ మహిళా-శిశు సంక్షేమ సంస్థకు అధ్యక్షురాలిగా నియమించింది.
       ఆ హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి స్త్రీలు, శిశువుల స్థితిగతులను వారి సమస్యలను తెలుసుకొని అనేక సంస్కరణలను ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులకు ఉచిత విద్య ఉండాలని, శిశు సంరక్షణకు మార్గదర్శకాలను సూచించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (ఐ.సి.ఎస్.డబ్ల్యూ) హైదరాబాద్ చాప్టర్‌కు సభ్యురాలిగా సేవలందించారు. ఇండియన్ రెడ్ క్రాస్‌కు రాష్ట్ర సభ్యురాలిగా పనిచేశారు. సివిక్ రైట్ కమిటీ (సి.డబ్ల్యూ.సి.) స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఈశ్వరీబాయి ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి. భారతదేశంలోనే దళితుల ఏకైక నాయకురాలిగా ఎలాంటి సమస్య పరిష్కారానికైనా యాచించే విధానాలను విడనాడి న్యాయపరమైన హక్కు, పోరాటం ద్వారా సాధించాలన్న డా. అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రతీకగా ఉండేది ఆమె వ్యవహార శైలి. పిడికిలి బిగించి గర్జించే స్వభావం ఆమెది. నిజాయితీగా చిత్తశుద్ధితో కుండబద్దలైనట్లు మాట్లాడటం ఆమె నైజం. ఎన్ని త్యాగాలనైనా భరించి స్త్రీ సమాజంలో స్వేచ్ఛా సమానత్వం సాధించాలన్నదే ఈశ్వరీబాయి ప్రబోధం. ఆమె సభలకు, సమావేశాలకు స్త్రీలు అధికంగా పాల్గొనేవారు. పురుషులు వ్యసనాలకు ముఖ్యంగా తాగుడుకు బానిసలు కాకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత స్త్రీలే వహించాలని అనేవారు.
            1968లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విద్యార్థులు, న్యాయవాదులు, 'తెలంగాణ ప్రజా సమితి' నేర్పాటు చేశారు. డా. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సమితి కార్యనిర్వాహక సభ్యురాలిగా ఈశ్వరీబాయి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్ లాంటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అనేక సభల్లో ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. దాంతో తెలంగాణ ప్రాంతంలో ఆమె పేరు ప్రఖ్యాతులు పెంపొందాయి. అగ్రకుల నాయకులు పదవులకు అమ్ముడుపోయినప్పటికీ ఈశ్వరీబాయి తెలంగాణ సమస్యలపై నిరంతరం నిస్వార్థమైన పోరాటం నిర్వహించారు.
         తరతరాలుగా అంటరానితనం అంటగట్టబడి దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో 'ఫైర్‌బ్రాండ్ లేడీ లీడర్'గా ఖ్యాతి పొందారు. మహామహులైన ముఖ్యమంత్రుల చేత నీళ్ళు తాగించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కె) జాతీయ అధ్యక్షురాలిగా దేశం నలుచెరుగుల అభిమానులను, శిష్యులను సంపాదించుకున్న నాయకురాలు.
        కృష్ణా జిల్లా కంచికచర్లలో కోటేశు అనే దళిత యువకుడిని అగ్రవర్ణాలు సజీవంగా దహనం చేసిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈశ్వరీబాయి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి క్షమాపణలు చెప్పారు. అయినా ఈశ్వరీబాయిలో ఆవేదన, ఆక్రోశం తగ్గలేదు. ఇం తలో నాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి వ్యంగ్యంగా ఎత్తిపొడిచే ధోరణిలో.. 'దొంగతనం చేస్తే ముద్దు పెట్టుకుంటారా...' అన్న మాటలు పూర్తికాకుండానే 'షటప్, ఇంకొక్కమాట మాట్లాడితే చెప్పుతో కొడతా జాగ్రత్త...' అంటూ చెప్పుచేతబూని మంత్రి వైపుకు దూసుకెళుతున్న ధీర సభ్యురాలిని 'అమ్మా శాంతించు... శాంతించు...' అంటూ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈశ్వరీబాయి ఆవేశానికి గాబరాగా అడ్డుకుంటూ క్షమించమని ప్రాధేయపడ్డారు.
            తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్ట, నిగర్వి. సామాన్యుడికి సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండే మనస్తత్వం ఆమెది. నిరాడంబర సంఘసేవకురాలుగా గుర్తింపు పొందారు. తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరుస్తాయి. అటువంటి ఈశ్వరీబాయి ఆకస్మాత్తుగా అస్వస్థతకు లోనై చికిత్స చేయించుకుంటూ 1991, ఫిబ్రవరి 24న తుదిశ్వాస వదిలారు. ఈశ్వరీబాయి ఆశయాలను ప్రస్తుతం ఆమె కుమార్తె గీతారెడ్డి సారధ్యంలో 'ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్' కొనసాగిస్తోంది. మహిళలకు వృత్తి విద్య శిక్షణ, పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడం, మహిళలకు విద్యావకాశాలు కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం తదితర లక్ష్యాలతో ఆ ట్రస్టు పనిచేస్తోంది. ఈశ్వరీబాయి జీవితం అందరికి మార్గదర్శకం. ఆమె కీర్తి అజరామరం.
                                                                       - డా. జె. గీతారెడ్డి
                                                                        రాష్ట్ర మంత్రివర్యులు