Tuesday, 12 March 2013

తెలంగాణ పట్ల విద్యుత్ వివక్ష...



విద్యుత్ రంగంలో తెలంగాణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. మొత్తం సమాజాన్ని సంక్షోభంలో ముంచెత్తుతున్నది. తన బతుకేదో తాను బతికే తెలంగాణ రైతులు ఇవాళ ఆగ్రహించి బజారుకెక్కి ధర్నాలకు, ఇతర ఆందోళనలకు దిగుతున్నాడంటే, కారణం ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణే. తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కష్టాలను ప్రకృతిపై తోసేయడం విచిత్రం. పైగా ఇప్పుడు కరెంటు కోత అనివార్యమని, వానదేవుడు కరుణిస్తే కష్టాలు తీరుతాయని, లేకపోతే మరింత కాలం కటకట తప్పదని అంటున్నది. తెలంగాణ ఇంతగా కరెంటు లేక అల్లాడడానికి కారణం ఆంధ్ర పాలకవర్గం చూపిన, చూపుతున్న వివక్షే. కానీ ఈ విషయం అంగీకరించకుండా, అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ వారిపై బురద చల్లడానికి ప్రభుత్వం కానీ, ఆంధ్ర పాలకవర్గ ప్రతినిధులు కానీ వెనుకాడరు. 
          చేతికొస్తుందనుకున్న పంట కండ్ల ముందే ఎండిపోతుంటే, రైతన్నలు భరించలేక ఆందోళనలకు దిగవలసి వస్తున్నది. రోజుకు ఏడు గంటలు కరెంటు సరఫరా చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం తీరా ఇప్పుడు నాలుగైదు గంటలకు మించి సరఫరా చేయడం లేదు. అదీ ఒకే దఫా కాకుండా, నాలుగైదు సార్లు అందిస్తున్నది. దీంతో రైతులు పంట భూముల దగ్గరే రాత్రనక, పగలనక కావలి కాయాల్సి వస్తున్నది. వాన రాకడ, పానం పోకడ చెప్పొచ్చు గని, కరెంటు రాకపోకలు కనిపెట్టలేకపోతున్నమని రైతులు వాపోతున్నరు. నీళ్ళుండి కూడా కరెంటు లేక మక్కజొన్న, పల్లి పంటలు ఎండి పోతున్నాయి. దీంతో దిక్కుతోచని రైతన్నలు వారం రోజులుగా విద్యుత్ సబ్‌స్టేషన్‌ల వద్ద ధర్నాలకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్, సారంగాపూర్ తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, శాయం పేట, మహబూబా బాద్ మండలం శనిగరం తదితర ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుని సబ్‌స్టేషన్లను ముట్టడించారు. 
           శాయంపేటలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గూడూరు, నెక్కొండ, స్టేషన్ ఘన్‌పూర్, ఇప్పగూడెం, జనగామ తదితర ప్రాంతాలన్నీ ఆందోళనల తో అట్టుడుకుతున్నాయి. భూపాల పల్లి ప్రాంతంలో మహిళలు ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రంగాడ్డి జిల్లా దోమ మండలంలో మోత్కూరు రోడ్డుపై రైతులు బైఠాయించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు సాగాయి. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, మిర్యాల గూడ, చిట్యాల, నకిరేకల్ తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు సాగాయి. కరీంనగర్, నిజామాబాద్ మెదక్ మొదలుకొని రాజధాని హైదరాబాద్ నగరం వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. ప్రతి చోట రైతులు అధికారులను నిలదీస్తున్నారు. 
       కరెంటు కోత ప్రభావం రైతుల మీదనే కాదు, అన్ని వర్గాలపై ఏదో రూపంలో పడుతున్నది. విద్యుత్ సరఫరా లోపం వల్ల మాకు మంచినీళ్ళు కూడా రావడం లేదని కొన్ని చోట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పరీక్షల కాలం కనుక చదువుకునే పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతున్నది. వ్యాపార రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నది. విద్యుత్ సంక్షోభం వల్ల ఏడాది కాలంలోనే తొమ్మిది వేల కంపెనీలు మూత పడినయి. విద్యుత్ కోత భరించలేక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోతున్నాయని, పారిశ్రామిక వర్గాలు బహిరంగంగా చెబుతున్నాయి. 
        రైతులు కొత్తగా అడుగుతున్నదేమీ లేదు. ఏడు గంటల పాటు రైతులకు కరెంటు సరఫరా చేయడం పాత హామీ. ప్రతి ఎన్నికల్లో ఇదొక కచ్చితమైన హామీగా ముందుకొస్తున్నది. నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు చెప్పలేనంత అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలపై ఆధారపడవలసిన గతి పట్టింది. అందువల్ల తెలంగాణ రైతుకు కరెంటు తగినంతగా, ఉచితంగా సరఫరా చేయాలనేది దశాబ్దాలుగా సార్వవూతిక ఆమోదం పొందిన డిమాండ్. ఇది తెలంగాణ రైతుల హక్కు. ఈ విషయం తెలిసి కూడా పట్టనట్టు ఉండడాన్ని వివక్ష చూపడంగా, అణచివేత చర్యగా భావించాలె. కరెంటు కోత పోయినేడాది కూడా ఉన్నది. ఈ సారి కూడా ఉంటుందనేది ప్రభుత్వానికి తెలిసిందే. అయినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ఆంధ్ర పాలకులు సంజాయిషీ ఇవ్వాలె. 
            నేదునూరు ప్రాజెక్టు వంటి అనేక పథకాలను పక్కన పెట్టి, ఇక్కడి బొగ్గును మరోచోటికి కొంచబోయి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అనేక విధాలుగా ఆంధ్ర పాలకులు నాటకాలు ఆడుతున్నారు. నీటి ప్రాజెక్టులు కట్టకుండా నోరు కొట్టినా ఇవాళ తెలంగాణ రైతులు సొంత చెమటను, నెత్తుటిని పెట్టుబడిగా మార్చి, బోరు బావులు తవ్వుకుని రికార్డు స్థాయిలో వ్యయసాయ ఫలాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇది సహించలేకనే కరెంటు కోతతో వేధిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత, అల క్ష్యం వల్ల కరెం టు కోత వచ్చింది. దీని వల్ల సమాజం అనేక విధాలుగా నష్టపోతున్న ది. అయినా ఈ విషయం గుర్తించకుండా తెలంగాణ వారి కష్టాలకు ఇక్కడి ప్రజలే కారణమని నమ్మించడానికి అనేక సందర్భాలలో ఆంధ్ర పాలకవర్గం ప్రయత్నించింది.
           సకల జనుల సమ్మె చేస్తే దాని వల్ల విద్యార్థులు నష్టపోతారని మీడియా కోడై కూసింది. తెలంగాణ ఉద్యమం వల్ల పరిక్షిశమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని ప్రచారం సాగింది. సకల జనుల సమ్మె వల్లనే రైతులకు విద్యుత్ రావడం లేదని ప్రచారం సాగింది. మరి ఇప్పుడు కరెంటు కోతకు, విద్యార్థుల కష్టాలకు, పరిక్షిశమల మూతకు, పెట్టుబడులు తరలి పోవడానికి కారణాలు ఎవరో ప్రభుత్వమే చెప్పాలె. తెలంగాణపై ఆంధ్ర పాలకవర్గం సాగిస్తున్న కుట్ర వల్లనే ఈ కష్టాలని తెలుస్తూనే ఉన్నది. ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తేవడం ద్వారానే ప్రజలు కరెంటు కష్టాల నుంచి గట్టెక్కుతారు. తెలంగాణ ఏర్పడితే మాత్రమే ప్రజలు తమ ప్రాధాన్యాలను గుర్తించి, అభివృద్ధి పథకాలు రూపొందించుకోగలరు.

No comments:

Post a Comment