Wednesday, 23 May 2012

''నిర్మల''మైన అందాలు

నిర్మల్ చిత్రాలు:
నిర్మల్ బొమ్మలు: ఇక్కడి కళాకారులు తయారు చేసే బొమ్మల్లో ఇట్టే ఆకర్షించే గుణమేదో ఉంది. చూపరుల హృదయాల్లో కళాతృష్ణను తట్టి లేపి, రసస్వాదనలో సమ్మోహితుల్ని చేసే అంతర్లీనమైన రంగుల పరిమళమేదో ఉంది. అందుకే, ఇవి అజరామరమై భాసిల్లుతూ విశ్వఖ్యాతి ప్రశంసలు అందుకుంటున్నాయి.ఆదినుండి నిర్మల్ ప్రసిద్ధి చెందిన కళాకేంద్రం. శిల్పకళాకారులు, చిత్రకళాకారులు, నటులు ఇంకా అనేక కళల్లో ఆరితేరిన సృజనులకు ఇది నెలవు. గత 300 సంవత్సరాలుగా నిర్మల్ చిత్రకళకు, బొమ్మలకు నిలయంగా మారింది. నిర్మల్ కళాకారులు కర్రతో బొమ్మలు తయారు చేస్తూ చెక్కకు రెక్కలు తొడిగి జీవం పోస్తున్నారు. వీరు తాము తయారు చేసుకున్న కాన్వాసులపై కమనీయ చిత్రాలు గీస్తూ అంతర్జాతీయ కీర్తిని గడిస్తున్నారు. 
  ~ తుమ్మల దేవరావ్, నిర్మల్
                                                      
                         సహజాతి సహజంగా వివిధ వర్ణశోభితమైన ఆ చిత్తరువులను చూడగానే హృదయం చిత్తడి నేలవుతుంది. ప్రఖ్యాతి గాంచిన అజంతా వర్ణచివూతాలు సజీవ ఆకృతుల్లా గోడలకు కొలువు తీరి ఉంటే చూసిన కళ్ళల్లో వింత వెలుగు జిలుగులు. వేల సంవత్సరాల అజంతా చిత్రాలు ప్రపంచంలోనే అద్భుతం. చెట్ల రసాల్ని, పువ్వులనుండి తీసిన రంగులను వాడుకొని అత్యద్భుత చిత్రాలను నాటి కళాకారులు వేశారు. మరి, అటువంటి అజంతా వర్ణ చిత్రాల్ని కొత్త అందాల్లో సజీవ రీతుల్లో చిత్రించగల నేర్పు మన నిర్మల్ కళాకారులది. ఒక్కొక్క పెయింటింగ్ అలౌకిక ఆనంద పారవశ్యంలో మనల్ని ముంచేయడమే కాదు, మనల్ని ఒక ప్రపంచ పర్యాటకుడ్ని చేస్తాయి. అది ఒక నృత్య భంగిమ. అటు చూడగానే జడమయమైన కళాప్రియత్వం మేల్కొంటుంది. మనసు మయూరంలా పురివిప్పి నాట్యం చేస్తుంది. ఝరీ ప్రవాహంలా నర్తకి నృత్యం సల్పుతుంటే డమరుకలు మోగిస్తూ ఉత్తేజపరుస్తున్నాడు వాయిద్యకారుడు. ఈ అద్భుత చిత్రంలోని కళా సమ్మోహనం చూసి తీరవలసిందే. ఎన్నిసార్లు చూసినా తనవి తీరని ఆ కళాఖండం స్ప్రే చేసిన కాన్వాసుపై కమనీయ రంగుల నృత్య వసంతమనే చెప్పాలి. భక్తి పారవశ్యంతో కృష్ణుని గీతాలను ఆలపిస్తున్న మీరా చిత్రం. రాజకుమారి వేషధారణను వదిలి సామాన్య స్త్రీగా మారి నిరంతరం కృష్ణున్ని ధ్యానిస్తూ, పాడుతూ, ఆడుతూ ఉండే చిత్రం. రాజ్యాన్ని, అది ఇచ్చే వైభవాన్ని, అహంకారాన్ని గడ్డిపోచలా భావించి వదులుకున్న మీరాబాయి గొప్ప భక్తురాలు. రాజరిక సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛగా బతికిన వనిత. వీణ ఒక చేతిలో ధరించి, మరో చేతిలో చిరుతలు ధరించి ‘పాడెను మీరా’ అంటూ భజన పాడుతున్నట్లుగా ఉంది.‘ముకుళిత’ ఆకర్షణీయమైన శరీరం గల స్త్రీ జీవితంలోకి పురుషుడు ప్రవేశించడం, పురుషుని జీవితంలోకి స్త్రీ ప్రవేశించడం గొప్ప సాహసోపేతమైన అనుభవం. ప్రపంచంలోని వీరుల, కవుల, కళాకారుల చరివూతలు ఇవే తెలియపరుస్తాయి. ఇవి కరువైతే వారి జీవితంలో శూన్యం పర్చుకుంటుందో ఏమో? ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి, ప్రణయ గాథలు విప్పుకుంటున్న ‘ప్రియుడు-ప్రియురాలు’ చిత్రం చూశాక ఇది నిజమే అనిపిస్తుంది.ప్రియమైన వారికోసం ఎదురుచూశాక కళ్ళు ఆశ్రుపూరితాలౌతాయి. మనసు ద్వైదిభావనతో విచలితమైతుంది. పరిపరివిధాల తలపుల్ని తలపోసుకుంటుంది. దుష్యంతుని రాకకోసం ‘వస్తాడు నా రాజు’ అంటూ విషాద గీతిక పాడుకుంటున్న దమయంతి తన ప్రియుని రాక కోసం ఆశాభావంతో బతుకుతున్న పెయింటింగ్ మేఘసందేశం చదివిన అనుభూతినిస్తుంది.విరబూసిన పువ్వు తనంతట తానే కొద్దిరోజుల తరువాత వాడిపోతుంది. భావుకులు పుష్పవిలాపాల్ని అనుభవిస్తారు. ప్రకృతి రహస్యాల్ని, అందాల్ని ఆస్వాదిస్తున్న స్త్రీ తనే ఒక ప్రకృతిగా మారినట్లుంది. అలాంటి ‘పుష్పసుందరి’ చిత్రం ప్రకృతిలోకి వెళ్ళి వచ్చిన అనుభూతినిస్తుంది. యుద్ధభూమిలో విచలిత మనస్సుతో బాధపడుతున్న అర్జునునికి కృష్ణుడు ‘గీతాబోధ’ చేస్తున్న పెయింటింగ్ కూడా చూపుల నుండి, మనసు నుండి చెరిగిపోదు.నయాగరా జలపాతం ఆ నడుములో ఒదిగిందేమో, నిండు చందమామ ఆ మోములో దాగిందేమో, చూడచక్కని స్త్రీ ఆమె. ఇంకేం తాను అద్దంలో చూసుకునే సరికి, తనకు తానే పోటీగా భావిస్తుంది. ముఖం వింత కాంతితో విచ్చుకుంటుంది, వయసు వరదలా పొంగుతుంది. మనస్సు రాగరంజిత మౌతుంది. అది పద్మపాణి వర్ణచిత్రం. ఈ చిత్రాన్ని చూసి పద్మపాణి పరిణయం అని ఒక ప్రేమకావ్యమే రాసేయవచ్చు. చూపరులకు వర్ణింపశక్యంగాని అందాన్ని వెదజల్లుతుంది. అజంతా తైలవర్ణ చిత్రంలో పద్మపాణి విశిష్టమైంది. అణువణువు ముగ్ధత్వంతో తొణికిసలాడుతుంది. అజంతాను దర్శించిన వారిని ఈ చిత్రం వెంటాడుతూ ఉంటుంది. ఇట్లా ఒకటని కాదు, ప్రతి నిర్మల్ చిత్రం చూడగానే భద్రపర్చుకోవాలనిపిస్తుంది.
                  
                                                        
యవ్వన సిరులతో ప్రియునికోసం ఎదురుచూస్తూ, ప్రియుడ్ని ధ్యానిస్తూ జలపాతం దగ్గర జాగరణ చేస్తున్న ‘రాగిణి’ పెయింటింగ్స్‌ను ఊరికే చూడలేం. రాగిణి నిగూడ సౌందర్యం ఆస్వాదించకుండా ఉండలేం. నీటి పక్కన చెట్టు కొమ్మను పట్టుకుని పచ్చిక బయళ్ళ మధ్య వింతశోభతో వెలిగి పోతున్నట్లుగా ఉంటుంది. కళ్ళల్లో నిరీక్షణ తాలూకు వేదన స్పష్టంగా కన్పిస్తుంది. అట్లాగే పాలపాత్రతో నెచ్చెలి గోపాలుడికోసం ఎదురుచూపుల చిత్తరువు కళ్ళకు కట్టినట్లు చేస్తుంది. గోపిక ప్రణయాన్ని గుంభనంగా చెప్పే పెయింటింగ్ ఇది.ప్రతి పెయింటింగ్ దేనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రాచీన కథానాయిక, నాయకుల చిత్రాల్లో సున్నితమైన శృంగారం వివిధ భంగిమల్లో కనిపించడంతో వీక్షకుడు రసికుడై పోతాడు.ఇంకా సజీవంలా కనిపించే వివిధ జంతువుల ఆకృతులు, పక్షులు, పిచ్చుకలు, నెమళ్ళు, పావురాళ్ళు, పాములు, పాము-రాబంధు వేట, నోరూరించే వివిధ పండ్ల నమూనాలు, పాన్‌దాని, సింహాలు, చిలుకలు ఇంకెన్నో బొమ్మలు... బారులు తీరి కనువిందు చేస్తాయి. వాటిని తిలకించిన వారికి అపూర్వ కావ్య పఠనం చేసిన అనుభూతి కల్గుతుంది. స్వప్న సుందరీమణులు వేషధారులై కళ్ళముందు ఎదురు నిలిచిన అనుభవం మిగులుతుంది. సహజత్వం, సమ్మోహనం ఇక్కడి నకాశీ చిత్ర కళాకారుల ప్రత్యేకత. చారివూతక నేపథ్యంగల కోటలు, బురుజులు, రాజరిక పోకడలు, గడ్డి గుడిసెలు, రైతుల సేద్యం, శ్రామిక జీవనం, మలిసంధ్య వెలుగులు, ఉషాకాంతులు వృద్ధాప్యపు ఛాయలు, శిథిలసౌధాలు... మొదలగు ప్రాకృతిక దృశ్యాపూన్నో ఎంబోస్ చేయడం వీరి విశిష్టత. వీటిని చూడగానే వాస్తవ దృశ్యాలు కళ్ళముందు నిలుస్తాయి.స్త్రీలు, పిల్లలు, యువకులు కొయ్య బొమ్మల తయారీని వృత్తిగాను, జీవనాధారంగానూ భావిస్తారు. దాదాపు 200 కుటుంబాలు స్థానికంగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి. బొమ్మల తయారీలో మహిళలదే కీలకపాత్ర, ఇంటి వద్ద బొమ్మలు తయారు చేసి సహకార సంఘానికి విక్రయిస్తారు. చిత్రాలు గీయడంలో వీరు తమ పూర్వీకులు అనుసరించిన పద్ధతినే అనుసరిస్తారు. సంప్రదాయం సహజత్వం కలిగేలా కొయ్య బొమ్మలకు అవసరమైనంత పొనికి కర్ర లభించకపోవడం వల్ల కళాకారులు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ వేదన పడాల్సిన తరుణంలో అందరూ ఏకమై 1955లో ‘కొయ్యబొమ్మల పారిక్షిశామిక సహకార సంఘం’ (నిర్మల్ టాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ), నిర్మల్ పెయింటింగ్ లాంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, హరిత వనాలన్నీ మోడు వనాలౌతున్నాయి. ఈ తరుణంలో పొనికి కర్రను కాపాడుకోవడంలోగానీ, ప్రత్యామ్నాయంగా బీడుల్లో పొనికి వృక్షాలను పెంచడం గానీ జరగడం లేదు. భవిష్యత్తులో పొనికి కర్ర లభించడం కష్టమే!
                                                
                 రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు రాయితీలు కల్పిస్తూ ఆర్థిక సహకారం అందిస్తూ వీరి పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. గతంలో కొందరు ఉన్నతాధికారులు వీరికి చేయూతనిస్తూ కళను ప్రోత్సహించారు. భవన నిర్మాణానికి ఉచిత స్థలంతో పాటు తగు ఆర్థిక సహాయం అందించారు. జిల్లాకే కాక రాష్ట్రానికి వన్నె తెస్తున్న కొయ్యబొమ్మలకు, పెయింటింగ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం 1990లో అమ్మకం పన్ను రద్దు చేసింది. వీటిని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో విక్రయించడానికి అవసరమైన స్టాల్సు గతంలో ఏర్పాటు చేశారు. అయితే, జీవనాధారంగా ఈ వృత్తిని స్వీకరించిన నకాశి కుటుంబీకులు స్వయంసమృద్ధి కోసం చేసే ఆరాటం, తపన అధికారులకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు.సృజనాత్మకత, వైవిధ్యం కలిగిన వీరి చిత్రాలకు లభిస్తున్న ఆదరణ నామమావూతమే.చెక్కకు రెక్కలు తొడిగి చేతనత్వం పోసే సృజనశీలురు నిర్మల్ కళాకారులు...కానీ, వారి పరిస్థితి దయనీయం...హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ‘నిర్మల్ కళాకేంద్రం’ ఎంతో ప్రసిద్ధి చెందింది. నిర్మల్ నుండి కళాకారులు వెళ్ళి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక్కడి పెయింటింగ్స్ దేశ విదేశాల్లో ఎంతో పేరుగాంచాయి. ఒక్కొక్క పెయింటింగ్ ఒక లక్ష రూపాయల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. హబీబ్ అనే చిత్రకారుడు నిర్మల్ పెయింటింగ్‌లో శిక్షణ పొంది అంతర్జాతీయ కీర్తి గడించాడు.ఏడవ నంబర్ జాతీయ రహదారిపై గల ‘నిర్మల్ పెయింటింగ్స్’ నిర్మల్ కొయ్యబొమ్మల పారిక్షిశామిక సహకార సంఘం చూపరులను ఆకర్షించి కళాపిపాసుల్ని సేద తీరుస్తాయి. జపాన్, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఖ్యాతిని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. సందర్శకులకు కళావిందు చేసి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిస్తున్నాయి.అయినా, వీరి చిత్రాలకు లభిస్తున్న ఆదరణ నామమావూతమే. ఒక్కొక్క పెయింటింగ్ ధర 200 రూపాయలు మొదలుకొని 1000 రూపాయలు వరకూ ఉంటుంది. ఖరీదైన ఇండ్లల్లో శోభను చేకూర్చే ఈ పెయింటింగ్స్ మధ్యతరగతి ప్రజల అభిరుచులకు ఆమడ దూరమే! తాత ముత్తాతల నుండి అబ్బిన సాంప్రదాయ కళను బతికించుకునేందుకు తపనపడే వీరి జీవితాల్లో చీకటి ఇతిహాసమే రాజ్యమేలుతోంది. పొట్టకూటి కోసం అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస ఒక్కొక్కరి జీవితాల్లో బాధా సంఘటనలు మనల్ని వికలపరుస్తాయి. నూతన పోకడలకు త్వరగా అలవాటు పడకపోవడం వీరి జీవితాల్లో కన్పిస్తుంది. ఉన్నత చదువులు చదివిన వారు స్వల్పం. చాలామంది కొయ్యబొమ్మల తయారీని అర్ధాంతరంగా మానుకుంటున్నారు. లారీ, జీపు డ్రైవర్లుగా, టైలరింగ్‌లో స్థిరపడటం దురదృష్టకరం. భవిష్యత్తులో వీరి పిల్లలు ఈ వృత్తిని సాగిస్తారన్న విశ్వాసం కల్గడం లేదు. ఇతరాత్ర ఉపాధి మార్గాలు వెతుక్కోవడంతప్ప వీరికి మరో గత్యంతరం కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వం చేయూతనీయకపోవడం, పొనికి కర్ర లభించకపోవడం కారణాలవుతున్నాయి. నిర్మల్ కళలు అంతరించకుండా అందరూ కలిసి కాపాడుకోవాలి. ఈ సాంప్రదాయిక కళల్ని బతికించుకుంటేనే మన సమాజం మరింత కళకళలాడుతుంది.

చారిత్రక కథనం:
కాకతీయుల సామంతరాజు నిమ్మనాయుడు. ఇతడు పద్మనాయక వంశానికి చెందినవాడు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకొని నిర్మల్ ప్రాంతాన్ని పాలించాడు. కళారాధన, కళాపోషణ అభిమాన వ్యాపకాలుగా గల నిమ్మనాయుడు మరట్వాడ ప్రాంతంలో నివసించే నకాశి కళాకారులను నిర్మల్‌కు రప్పించి వారికి ఉపాధి కల్పించాడు. ‘నకాశి’ కళాకారులకు కసుబా ప్రాంతంలో గృహాలు నిర్మించాడు. సారగమ్మ దేవాలయం కసుబాకు తూర్పున అభిముఖంగా ఉన్న గ్రామదేవత. సారగమ్మ దేవాలయం వెనుక నకాశి కళాకారుల నివాసగృహాలున్నాయి. వీరు తయారుచేసిన బొమ్మలు, వీరు వేసిన చిత్రాలు పొరుగు రాజ్యాధిపతులను ఆకట్టుకోవడం వీరి సృజనాత్మక కళా వైశిష్ట్యానికి మచ్చుతునకగా నిలిచాయి.ఇక్కడి కళాఖండాలు, బొమ్మలు 17వ శతాబ్దంలోని ఇరుగు పొరుగు రాజులైన నిజాం రాజులు, మహారాష్ట్ర బోంస్లేరాజులు, గోండు రాజులు బహమనీ సుల్తానులు, వెలమరాజులు మొదలగు ఎందరో రాజులకు ఇవి ప్రీతి పాత్రమైనాయి. నిమ్మనాయుడి ఆదరణతో నకాశి కుటుంబీకులకు గౌరవవూపదమైన జీవనోపాధి లభించింది. ఆయన పాలనలో నిర్మల్ పేరు నాలుగు దిక్కులా వ్యాపించి విశ్వవ్యాప్తమైంది. వీరి అనంతరం పాలించిన శ్రీనివాసరావు, జలపతిరావు, వెంగళరావు, కుంటి వెంకవూటాయుడు, థంసా ఈ కుటుంబాలను ఆదుకొని నిర్మల్ కళలు అంతరించిపోకుండా వెన్నుదన్నుగా నిలిచారు. రాజుల పోషణలో ఊపిరిపోసుకున్న ఈ కళ నేడు బతుకు వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. గ్లోబల్ గాలానికి చిక్కి గిలగిల్లాడుతోంది. వీరి కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తే శాతవాహన కాలం నుండే ఈ కళ పరంపరగా వస్తున్నట్లు తెలుస్తుంది. అజంతాలోని వర్ణచివూతాలను పోలిన బొమ్మలు వేయడమే ఇందుకు సాక్ష్యం.
                                                 
కర్రతో కమనీయం:
సహ్యాద్రి పర్వతక్షిశేణులు, అమాయకమైన ఆదివాసులు, బాసర సరస్వతీ ఆలయం, నిర్మల్ పెయింటింగ్‌లు ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక అందాలు. జిల్లాకు ప్రధాన ద్వారంగా, ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉన్న నిర్మల్ మొదటి నుండి రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక, కళారంగాలలో ప్రధాన కూడలిగా నిలిచింది. నిర్మల్ డివిజన్ పరిధిలోని జన్నారం, ఖానాపూర్ అడవుల్లో లభించే ‘పొనికి’ కర్ర కొయ్యబొమ్మలకు జీవగర్ర. ఈ కర్ర తేలికగా ఉంటుంది. దీన్ని అటవీశాఖ నుండి కొనుగోలు చేస్తారు. పొనికి కర్రను కావాల్సిన తీరులో మలిచి చింతగింజల గుజ్జును పూస్తారు. ఎండలో నిర్ణీత సమయం వరకు ఆరబెట్టిన తర్వాత కోరుకున్న ఆకృతిలోకి మలచడానికి అనుపుగా చేస్తారు. సహజ సిద్ధమైన రంగులు పూస్తారు. రంగులు వేసే సందర్భంలో కళాకారులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. అనంతరం షో కేసుల్లో కొలువుదీరిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సహజత్వం కోసం వీరు అహోరాత్రులు శ్రమిస్తే గానీ మనం చూస్తున్న రూపురాదు.
కళ - కళాకారులు:
నిర్మల్ పెయింటింగ్ గురించి ఎంతసేపయినా ముచ్చటించుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాది చిత్రకళ ప్రభావం గానీ, మొగలుల ప్రభావం, మధుబని ప్రభావం గాని లేని దక్కనీ సంస్కృతికి చెందిన నిఖార్సయిన శైలి ఈ కళలో ఆవిష్కృతమౌతుంది. 
నిర్మల్ కళాకారులు వేసిన చిత్రాల్లో భాగవతం, రామాయణం, మహాభారతాల నుండి తీసుకున్న సంఘటనలుంటాయి. హంస రాయబారం పంపడం, తల దువ్వుకోవడం, విరహంతో వేగి పోవడం లాంటి అంతర్ ప్రణయ భావాలకు ప్రతిరూపంగా చిత్రితమైన అందమైన పెయింటింగ్‌లు ఉంటాయి.వీటితో పాటు వెంక సాయిబాబ, బుద్ధుడు, శివపార్వతులు తదితర దేవతా చిత్రాలు కూడా కమనీయంగా వేస్తారు. వీటిని చూడగానే భక్తుల హృదయాలు పారవశ్యంతో, ఆధ్యాత్మిక భావనతో నిండి పోతాయి. అంతేగాక, మనిషి జీవితంలోని సాధారణ సంఘటనలు కూడా చిత్రాల ద్వారా వేసి వేల భావాలను వీరు పలకరింప చేస్తారు.వివిధ మతాలకు సంబంధించిన సింబాలిక్ పెయింటింగ్‌లు, లిపి, ఆలయాలు, ఇత్యాదివి చిత్రీకరిస్తారు. అటు మత సంబంధమైనవి - మత ప్రమేయం లేని లౌకిక జీవనం తాలుకూ విశేషాలనూ హృద్యంగా చిత్రీకరించడంలో నిర్మల్ కళాకారులు సిద్ధహస్తులు. అందుకే వీరి శైలిని, సాంప్రదాయాన్ని, వైవిధ్యాన్ని పరిగణించి వీరు చిత్రించే పెయింటింగ్‌లను నిర్మల్ పెయింటింగ్‌లుగా, తయారు చేసిన బొమ్మలను నిర్మల్ కొయ్యబొమ్మలుగా పేరు పడ్డాయి. నకాశి వీరి కుటుంబానికి గల పేరు మాత్రమే గానీ, వీరు సృష్టించే కళ కాదు. ‘నక్ష’ అనే ఉర్దూ పదానికి ‘డిజైన్’ లేదా ‘రూపకల్పన’ అనే అర్థం వస్తుంది. వివిధ నమూనాల్లో చిత్రాలు చిత్రీకరించే వీరిని మహ్మదీయుల పాలనా కాలంలో ‘నకాశి’లుగా గుర్తించి ఉండవచ్చు.పాలకొండ విఠల్, బ్రహ్మరైతు లింబాద్రి, శిల్ప గురువు రాచర్ల లింబాద్రి, బ్రహ్మరైతు సుధాకర్, భూస్వామి నర్సింగు పి. లింబయ్య, జి. లింబయ్య, పద్మాకర్ మొదలగువారు మేటి కళాకారులు. వీరితో మాట్లాడినప్పుడు ఎన్నో మాటలు రాసులు రాసులుగా, నీటి ప్రవాహంలా కాలంతో పాటు కదిలిపోయే మధుర అనుభూతులను మిగులుస్తాయి. వీరిలో బి.నర్సింగు, రాచర్ల లింబాద్రి, విఠల్ వంటి వారు జాతీయ స్థాయిలో హస్తకళల విభాగంలో అవార్డు గ్రహీతలు. జీవన మలిసంధ్యలో ఉన్న వీరిని పలకరిస్తే గుండెలు ద్రవిస్తాయి. ‘‘ఏం దొరుకుతుంది సార్, రోజు కూలీ కూడా పడదు. పెద్దలిచ్చిన యిద్య ఇది. దీన్ని వదులబుద్దిగాదు. ఏ పని చేయలేక దీనిమీద బతుకుతున్నాం. ఇయాల్టి పిల్లలకు దీని మీద యాసనే లేదు’’ అంటూ నిర్వేదంతో విచారం వ్యక్తపరుస్తారు. ‘పొద్దస్తమానం పనిచేసిన పస్తులుండుట తప్పదయ్యా’’ అంటారు స్త్రీలు.
నిర్మల్ పెయింటింగ్స్‌పై కథలు:
                                      
నిర్మల్ పేయింటింగ్స్‌పై ఆసక్తికరమైన కథలెన్నో ఉన్నాయి. నాటి రాజులను మెప్పించడమే కాదు, స్వాతంత్య్రం అనంతరం ఎందరో నేతల్ని ముగ్దుల్ని చేసిన ఘనత నిర్మల్ కళాకారులది. 1975లో పోచంపాడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వచ్చినప్పుడు అల్పాహారంగా ఆయన పండ్లు కావాలన్నారట. అక్కడే ఉన్న సెక్రటరీ ట్రేలో కొన్ని ద్రాక్ష పండ్లు పెట్టి తెచ్చాడు. అందులో ఒక గుత్తి నిర్మల్ కళాకారులు తయారుచేసినవి. నెహ్రూ దాన్ని తెంపి తిందామనుకుంటే ఎంతకి పండ్లు ఊడి రాలేదు. నెహ్రూ నవ్వి ఎంతో మెచ్చుకున్నాడట. కొందరు సీనియర్ కళాకారులు చెప్పిన యదార్థగాథ ఇది.ఆరు దశాబ్దాల కిందటి ఈ ముచ్చటను ఇప్పుడున్న పెద్ద మనుషులు గర్వంగా చెప్పుతారు. ఈ సంఘటన చెప్పేటప్పుడు వారి కళ్ళల్లో ముత్యాల మెరుపు కన్పిస్తుంది. వారి తాలుకు తాత ముత్తాతల ఘనకీర్తి గుర్తుకు వచ్చి పొంగిపోతారు. గోదావరిపై సొన్నపూలు (సోన్ బ్రిడ్జి) కడ్తున్నారన్న వార్త పల్లెపప్లూకు పాకింది. విశాలమైన గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారన్నది వింతలో వింతగా తోచింది. అంతేగాక సాక్షాత్తు యువరాజు మీర్ ఉస్మాన్ ఆలిఖాన్ ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రజలందరికీ దండోరా ద్వారా తెలిసిపోయింది. వేలాదిగా ప్రజలు బండ్లు కట్టుకొని సొన్న (సోన్) చేరుకున్నారు. కాలినడకన మరెందరో చేరుకున్నారు. ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే అక్కడ ఉన్న అతిథి గృహానికి చేరుకున్నాడు నిజాం రాజు. వెళ్ళి కుర్చీపై మీద కూర్చోగానే పైనుండి మల్లెపూలు నెత్తిన అక్షతలుగా కురిసాయి. సన్నని కట్టె బెరడుతో తయారు చేసిన మల్లెపూలను చూసి నిజాం రాజు ఆశ్చర్యపోయారట. అక్కడే ఉన్న తహసీల్‌దారు నిర్మల్ కళాకారుల అద్భుత పనితనం గురించి సవివరంగా తెలియజేశారట. దాంతో నిజాం రాజు ఆనాటి నిర్మల్ కళాకారులను అభినందించి తగు నజరానాలిస్తానని హామీ ఇచ్చాడట.

Monday, 14 May 2012

సాయుధ పోరాట యోధులు-ఆరుట్ల దంపతులు


ఆరుట్ల కమలాదేవి

తెలంగాణ సాయుధ పోరాటంలో బందూకు పట్టిన వీరనారి ఆమె! తెలంగాణ సాయుధ సమరసేనాని ఆరుట్ల రామ చంద్రరెడ్డి సతీమణే ‘ఆరుట్ల కమలాదేవి’. తండ్రి పి. వెంకట్ రామ్‌రెడ్డి. వీరి సొంత ఊరు నల్గొండ జిల్లా, ఆలేరు మండలంలోని మంతపురి. 1920లో ఆమె పుట్టారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన మేనబావ ఆరుట్ల రామ చంద్రా రెడ్డితో 11సం॥ వయసులోనే పెండ్లి జరిగింది. కమలాదేవి అసలు పేరు ‘రుక్మిణి’. అప్పట్లో పేర్గాంచిన మహిళా నాయకురాలు ‘కమలాదేవి చటోపాధ్యాయ’ స్ఫూర్తితో పెండ్లిలో రామ చంద్రా రెడ్డి, తన పేరును ‘కమలాదేవి’గా మార్చారు. భర్త ప్రోత్సాహంతో హైదరాబాద్ రెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో ఆమె మెట్రిక్ వరకు చదివారు. తర్వాత చదువుకు స్వస్తి చెప్పి భర్తతో తెలంగాణ సాయుధ పోరాట కార్యరంగంలోకి దూ కారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్యసమా జ్ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేసారు.
          సాయుధ పోరాటంలో ‘గెరిల్లా’ శిక్షణ తీసుకున్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రజాకారు సైన్యాలపై గెరిల్లా దళాలు చేసిన దాడుల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చాలా రోజులు అజ్ఞాత జీవితం గడిపారు. నల్గొండ, వరంగల్, సికింద్రాబాద్ జైళ్లలో రెండున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి 1951లో విడుదలయ్యారు. 1952 నుండి 1971 వరకు ఆలేరు నియోజక వర్గానికి వరుసగా మూడుసార్లు ఎమ్.ఎల్.ఎ.గా గెలిచారు. అనేక ప్రజాసమస్యల పరిష్కారానికి ఆమె నిరంతరం కృషి చేసారు.

ఆరుట్ల రామచంద్రారెడ్డి
             వెట్టి చాకిరీ చేసే మట్టి మనుషుల్ని పోరాటయోధులుగా చేసి, నియంతల గుండెలదర గొట్టిన తెలంగాణ సాయుధ సమరసేనాని ‘ఆరుట్ల రామ చంద్ర రెడ్డి’. ఈయన 1909లో భువనగిరి తాలూకాలోని కొలనుపాక గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉండి, నాంపల్లి హైస్కూల్‌లో మెట్రిక్ చదివారు. 1930లో జరిగిన ‘దండి సత్యాక్షిగహం’తో ఉత్తేజితులయ్యారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచారు. 1931-33లో ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. నిజాం ఆంధ్రమహాసభల్లో క్రియాశీలక ప్రతినిధిగా పనిచేశారు. 1945లో పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయి హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం ఉన్నారు. తెలంగాణ పోరాట సమయంలో, 1947లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి గెరిల్లా శిక్షణ తరగతికి హాజరయ్యారు. ఈ శిక్షణ తర్వాత బందూకు పట్టుకొని సాయుధ పోరాటంలో సాగిపోయారు. ఈ పోరాట సమయంలో పోలీసులకు పట్టుబడి 1952 జనవరి వరకు నిర్బంధంలో ఉన్నారు.
        1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల పార్టీ టికెట్ లభించలేదు. అయినా, నల్లగొండ జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు సి.పి.ఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి సలిపారు. 1962లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరి నియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.

Tuesday, 1 May 2012

పిల్లలమర్రిచెట్టు...
పిల్లలమర్రిచెట్టు (Pillalamarri Tree) మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.

              ఇక్కడొక మహా మర్రివృక్షం కనిపిస్తుంది. కనీసం 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది. చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి సుమా! అనుకునేట్టుగా పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్బుత అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిని తప్పక చూడాలి. పిల్లల మర్రి నీడలో దర్జాగా వెయ్యిమంది కూర్చోవచ్చునన్నది నిజంగానే నిజమైన నమ్మలేని నిజం. ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియంఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడి ఏర్పాట్లు కూడ చురుగ్గా సాగుతున్నాయి. పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్, అక్వేరియం చూపురులకు ఆకట్టుకొంటున్నాయి.                పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియం లో పొందుపర్చినారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మద్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చినారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.

 
                       
విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తుశాఖ, అటవీశాఖాధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు.పురావస్తుశాఖచే మ్యూజియం ఏర్పాటుచేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా, 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టింపచేశారు.