Monday 14 May 2012

సాయుధ పోరాట యోధులు-ఆరుట్ల దంపతులు


ఆరుట్ల కమలాదేవి

తెలంగాణ సాయుధ పోరాటంలో బందూకు పట్టిన వీరనారి ఆమె! తెలంగాణ సాయుధ సమరసేనాని ఆరుట్ల రామ చంద్రరెడ్డి సతీమణే ‘ఆరుట్ల కమలాదేవి’. తండ్రి పి. వెంకట్ రామ్‌రెడ్డి. వీరి సొంత ఊరు నల్గొండ జిల్లా, ఆలేరు మండలంలోని మంతపురి. 1920లో ఆమె పుట్టారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన మేనబావ ఆరుట్ల రామ చంద్రా రెడ్డితో 11సం॥ వయసులోనే పెండ్లి జరిగింది. కమలాదేవి అసలు పేరు ‘రుక్మిణి’. అప్పట్లో పేర్గాంచిన మహిళా నాయకురాలు ‘కమలాదేవి చటోపాధ్యాయ’ స్ఫూర్తితో పెండ్లిలో రామ చంద్రా రెడ్డి, తన పేరును ‘కమలాదేవి’గా మార్చారు. భర్త ప్రోత్సాహంతో హైదరాబాద్ రెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో ఆమె మెట్రిక్ వరకు చదివారు. తర్వాత చదువుకు స్వస్తి చెప్పి భర్తతో తెలంగాణ సాయుధ పోరాట కార్యరంగంలోకి దూ కారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్యసమా జ్ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేసారు.
          సాయుధ పోరాటంలో ‘గెరిల్లా’ శిక్షణ తీసుకున్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రజాకారు సైన్యాలపై గెరిల్లా దళాలు చేసిన దాడుల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చాలా రోజులు అజ్ఞాత జీవితం గడిపారు. నల్గొండ, వరంగల్, సికింద్రాబాద్ జైళ్లలో రెండున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి 1951లో విడుదలయ్యారు. 1952 నుండి 1971 వరకు ఆలేరు నియోజక వర్గానికి వరుసగా మూడుసార్లు ఎమ్.ఎల్.ఎ.గా గెలిచారు. అనేక ప్రజాసమస్యల పరిష్కారానికి ఆమె నిరంతరం కృషి చేసారు.

ఆరుట్ల రామచంద్రారెడ్డి
             వెట్టి చాకిరీ చేసే మట్టి మనుషుల్ని పోరాటయోధులుగా చేసి, నియంతల గుండెలదర గొట్టిన తెలంగాణ సాయుధ సమరసేనాని ‘ఆరుట్ల రామ చంద్ర రెడ్డి’. ఈయన 1909లో భువనగిరి తాలూకాలోని కొలనుపాక గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉండి, నాంపల్లి హైస్కూల్‌లో మెట్రిక్ చదివారు. 1930లో జరిగిన ‘దండి సత్యాక్షిగహం’తో ఉత్తేజితులయ్యారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచారు. 1931-33లో ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. నిజాం ఆంధ్రమహాసభల్లో క్రియాశీలక ప్రతినిధిగా పనిచేశారు. 1945లో పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయి హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం ఉన్నారు. తెలంగాణ పోరాట సమయంలో, 1947లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి గెరిల్లా శిక్షణ తరగతికి హాజరయ్యారు. ఈ శిక్షణ తర్వాత బందూకు పట్టుకొని సాయుధ పోరాటంలో సాగిపోయారు. ఈ పోరాట సమయంలో పోలీసులకు పట్టుబడి 1952 జనవరి వరకు నిర్బంధంలో ఉన్నారు.
        1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల పార్టీ టికెట్ లభించలేదు. అయినా, నల్లగొండ జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు సి.పి.ఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి సలిపారు. 1962లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరి నియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.

No comments:

Post a Comment