Monday, 27 May 2013

తెలంగాణ విహారస్థలాలు

   స్థూలంగా చెప్పాలంటే పర్యాటకం రెండు రకాలు...
* వారసత్వ కట్టడాలు (హెరి టూరిజం),
* పర్యావరణ పర్యాటకం (ఎకో టూరిజం).
     ఈ రెండు రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. యావత్ తెలుగుదేశాన్ని పాలించిన రాజవంశాలన్నింటికీ తెలంగాణే పుట్టినిల్లు కావడంతో వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ భౌగోళికంగానూ పీఠభూమి కావడంతో గుట్టలు, లోయలు, వాటి మధ్య పారే నదీ నదాలు, వాగులు వంకలతో తద్వారా ఏర్పాటైన చెరువులతో, పచ్చని అడవులతో పర్యావరణ పర్యాటకానికి కూడా అనువుగా ఉంది. ఒక్క సమువూదతీర పర్యాటకం (బీచ్ టూరిజం) తప్ప అన్ని రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో సముద్రం లేదని తెలంగాణ రాజులు, ప్రత్యేకించి కాకతీయులు పెద్ద చెరువులను నిర్మించి వాటికి ‘సముద్రాల’నే పేర్లు పెట్టారు.ఈ విధంగా అన్ని రకాల పర్యాటక విశేషాలకు ఆలవాలమైన తెలంగాణను పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు వీలున్నప్పుడల్లా పరిచయం చేయవలసిందే. ఆయా స్థలాలకు వెళ్లేలా ప్రోత్సహించవలసిందే. తద్వారా వచ్చే ఆదాయంతో పర్యాటక స్థలాలలోని స్థానికులూ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని ఆర్థికంగానూ ఎదుగుతారు. అంతేకాదు, సమాచార సాంకేతికత (ఐ.టి) పరిక్షిశమ తరువాత ఆర్థికాభివృద్ధికి దోహదపడే పరిక్షిశమ పర్యాటక రంగానిదే కాబట్టి, తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేసుకొని, దర్శించి, తెలంగాణ ప్రజలు తమ వారసత్వ సంపదపట్ల సగర్వం పెంచుకోవాలని, వాటిని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేయాలన్నదే మన ఆకాంక్ష. కాగా, ఎండాకాలంలో కావలసినవి నీడ, నీళ్ళు. కాబట్టి వాటిని ఇచ్చే అడవులు, నదుల ప్రాంతాల్లోని పర్యావరణ, పర్యాటక స్థలాలను సంక్షిప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. గమనించగలరు. 
హైదరాబాద్ - కుంతాల మార్గంలో సందర్శించాల్సినవి...
            హైదరాబాద్ నుంచి తూప్రాన్, రామాయంపేటల మీదుగా 110 కిలోమీటర్లు ప్రయాణించి మెదక్ చేరుకోవచ్చు. మెదక్‌లో సుమారు వందేళ్ళ కిందట (1914లో) పోస్నేట్ అనే క్రైస్తవ సన్యాసి కట్టించిన 173 అడుగుల ఎత్తైన చర్చి ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దది (వాటికన్ చర్చి తర్వాత). ఇందులో ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేయవచ్చు. బయట నుంచి వచ్చే వెలుతురును ప్రతిఫంపజేస్తూ చర్చి లోపలున్న జీసస్ తదితర పేయింటింగ్స్ రంగులతో మెరిసిపోతూ మనల్ని మురిపిస్తాయి. ఈ చర్చి ఎదురుగా కిలోమీటరు దూరంలోనే మెదక్ దుర్గం కోట గోడలు కన్పిస్తాయి. యాత్రికులు ఎక్కి ఆనందించవలసినవి అవి.అలాగే, మెదక్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మంజీరా నది ఏడు పాయలుగా చీలి పారుతుంది. వాటి మధ్య అమ్మవారి దేవాలయం కొండగుహలో ఉంది. ఈ ఏడుపాయల్లో స్నానం చేసి ఆలయం చుట్టూ గుహలో ప్రదక్షిణ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఆలయానికి ఎదురుగా ఫర్లాంగు దూరంలో కట్టిన చెక్‌డ్యామ్ పైనుంచి దూకే నీళ్ళు చిన్న జలపాతం లాగా ఏర్పడతాయి. వాటిలో చెంగు చెంగున ఎదుక్కుతున్న వేలాది చేపలు మనకు నయనానందాన్ని కలిగిస్తాయి.మెదక్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే 1922లో కట్టిన పోచారం ప్రాజెక్టు ఉంది. దీనిమీది నుంచి దూకే చిన్న జలపాతం లాంటి మత్తడి నీళ్ళలో కేరింతలు కొడుతూ స్నానం చేయవచ్చు. అప్పుడు నిజాం కట్టించిన గెస్ట్‌హౌజ్‌ను, పెట్టించిన బోటు సౌకర్యాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. పర్యాటకులను ప్రాజెక్ట్ నీటి మధ్యలో ఉన్న ద్వీపం (ఐలాండ్) వరకు తీసుకెళ్ళి పక్షుల దర్శనం చేయించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ప్రాజెక్ట్ నీళ్ళు పక్కనే ఉన్న వన్య ప్రాణుల ఉద్యానవనం (వైల్డ్ లైఫ్ పార్క్)లోకి కూడా చొరబడతాయి. ఈ ఉద్యానవనంలో సొంత వాహనంలో వెళ్ళి, అందులో స్వేచ్ఛగా తిరిగే లేళ్ళు, ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు తదితర జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.
               పోచారం నుంచి గోపాల్‌పేట్ మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి నిజాంసాగర్ ప్రాజెక్టు అంచున ఉన్న ‘త్రిలింగ రామేశ్వరాలయాన్ని’ దర్శించవచ్చు. దీన్ని సుమారు 1100 సంవత్సరాల కిందట వేములవాడ చాళుక్య రాజులు కట్టించినట్లు, వారి రాజలాంఛనమైన ‘విజృంభించే సింహ శిల్పం’ నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడికి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఎల్లాడ్డి ఉంటుంది. అక్కడా చారివూతక గుళ్ళున్నాయి. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిజాంసాగర్ డ్యాం ఉంది. డ్యామ్ కట్టమీద నడుస్తూ నిండుగ ఉన్న ఆ నీటి సౌందర్యాన్ని చూడవచ్చు. చివరన కనిపించే ఆనాటి రెండంతస్థుల గోల్ బంగ్లాను, స్విమ్మింగ్ ఫూల్‌ను చూడవచ్చు. డ్యాం ప్రారంభంలో ఉన్న గెస్ట్ హౌజ్ నుంచి మర బోట్లలో అల్లంత దూరంలోని విద్యుత్ ప్లాంట్ వరకు విహారం చేయవచ్చు. డ్యాం కింద వర్షాకాలంలో నురగలు కక్కుతూ దూకే నీటి సౌందర్యాన్ని చూసి తీరాలి. డ్యాం కింద సహజంగా ఏర్పడిన విశాలమైన ‘నదీ ద్వీపం’ (రివర్ ఐలాండ్) మీద పూర్వపు నిజాం రాజు ఏర్పాటు చేసినట్లు గార్డెన్స్, పండ్ల తోటలను ఏర్పాటు చేస్తే మైసూర్ కృష్ణరాజసాగర్ డ్యాంను నిజాంసాగర్ డ్యాం తలదన్నుతుంది.కామాడ్డికి దగ్గర్లో ఉన్న తాడ్వాయి గుడి చూసి, అక్కడ్నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంతాయిపేట శివార్లలో పారుతున్న భీమేశ్వర వాగు మధ్యలో కట్టిన వేయేళ్ళనాటి భీమేశ్వర క్షేత్రాన్ని, దాని మీదుగా కట్టిన చెక్ డ్యాం పైనుంచి పడుతున్న నీటి సౌందర్యాన్ని డ్యాం నీళ్ళలో సాయం సంధ్యా సమయంలో ప్రతిఫలిస్తున్న పొద్దు గుంకుతున్న సూర్యబింబం సౌందర్యాన్ని చూస్తే గాని ‘జీవితం తరించదు’ అన్పిస్తుంది.
        కామారెడ్డి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధమైన ఇస్సన్నపల్లి వీరభద్రాలయాన్ని దర్శించుకొని తూంపల్లి-చిమన్‌పల్లి మీదుగా అందమైన అడవులు, లోయలు, వాగు వంకల గుండా ప్రయాణించి హుస్సేన్‌నగర్ సమీపంలో గుట్టల మధ్యలో నెలకొన్న లొంక రామలింగేశ్వరాలయాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడి ప్రకృతి కాశ్మీర్‌ను తలపిస్తుంది.ఆదిలాబాద్‌లోకి ప్రవేశించగానే మనల్ని పలకరించేది సోన్‌పేట. చిన్నదైనా చిత్రమైన కోట అది. దానికి పది కిలోమీటర్ల దూరంలోనే నిర్మల్ కోటగోడలు, బురుజులు కన్పిస్తాయి. నిర్మల్ నుంచి భైంసా రూట్‌లో 12 కిలోమీటర్లు ప్రయాణించి దిలావర్‌పూర్ మీదుగా ‘కదిలె’ చేరుకోవచ్చు. ఇక్కడ చుట్టూ గుమిగూడిన గుట్టల మధ్య లోయలో ఊరుతున్న ఏరు గట్టున చారిత్రక పాపన్న గుడి ఉంది. అందులో శివలింగం కదులుతుంది. దాని కింద ఉబికే ఊటల ధాటికి ఇక్కడున్న సప్తగుండాలు ‘సంతానాన్నిచ్చే నీటిని కలిగి ఉన్నాయని’ భక్తులు విశ్వసిస్తారు. జలజలా పారుతున్న ఏరు మధ్యలో ఏపుగా పెరిగిన చెట్ల సౌందర్యాన్ని చూస్తూ ఏరులోనే ట్రెక్కింగ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. ఇక్కడి 18 చెట్ల మహావృక్షం కూడా మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దిలావర్‌పూర్ నుంచి భైంసా మీదుగా వెళితే గోదావరి ఒడ్డున నెలకొన్న బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. చాలామంది ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. గోదావరిలో బోటు విహారం చేయవచ్చు. సమీప ప్రాంతాల్లో ఉన్న శిథిల బౌద్ధ, జైన స్థూపాలను ఆసక్తి గలవారు దర్శించవచ్చు.
           నిర్మల్ నుంచి ఉత్తరంగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే నేరేడిగొండ వస్తుంది. ఇక్కడ 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో 5 జలపాతాలున్నాయి. నేరేడిగొండ టోల్‌గేట్ రావడానికి ముందు కుడివైపున రోడ్ పక్కనే ఒక చిన్న జలపాతముంది. నేరేడిగొండ నుంచి ఎడమ వైపున పది కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతముంది. దానికింద స్నానం చేయవచ్చు. ముప్పైవేల సంవత్సరాల ముందు కూడా ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని తెలిపే వారి ఆయుధాలు, పనిముట్లు ఇక్కడ దొరికాయి. పొచ్చెరకు మరికొంచెం దూరంలో ఘన్‌పూర్ గ్రామ పరిధిలో బుంగనాల అనే మరో జలపాతముంది. నేరేడిగొండకు కుడివైపున సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే పెద్దదిగా పేరుమోసిన కుంతల జలపాతముంది. మూడు దఫాలుగా దూకే దాని సౌందర్యం ఎంతటిదో దానికి సమాంతరంగా సాగుతున్న గుట్టల మధ్య లోయ సౌందర్యమూ అంతటిదే. ఇక్కడ 8 దశాబ్దాల నాటి గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తవి కడుతున్నారు. నేరేడిగొండ దాటి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగానే రోడ్‌కు ఎడమవైపున కోరటికల అనే మరో చిన్న జలపాతం కన్పిస్తుంది.నేరేడిగొండ నుంచి ఇచ్చోడ వైపు సాగి కొంచెం ముందు నుంచే కుడివైపుకు సుమారు పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే సిరిచెల్మ చేరుకోవచ్చు. ఇక్కడ అడవుల మధ్యనున్న చెరువు మధ్యలో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక ప్రాధాన్యానికి నెలవు ఈ సిరిచెల్మ.
హైదరాబాద్ - కాళేశ్వరం మార్గంలో...    
 
                              

 హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్గంలో 70 కిలోమీటర్లు ప్రయాణించగా వచ్చే కుకునూరుపల్లి నుండి కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనంతసాగర్ అనే గ్రామాన్ని చేరుకోవచ్చు. తెలంగాణలోనే ఎక్కువ సరస్వతీ ఆలయాలున్నాయనడానికి ఈ గ్రామ సరస్వతీ దేవాలయం ఒక నిదర్శనం. ఈ ఆలయం సమీపంలో రెండు నీటిదొనలున్నాయి. ఒకటి రాగిదొన. రెండవది పాలదొన. రాగిదొనలో నీళ్ళు ఎర్రగా ఉంటాయి. పాల దొనలోని నీళ్లు తెల్లగా ఉంటాయి. ఈ దొనలు ఆ రెండు కాలాల్లో కూడా ఎండిపోక పోవడం ఇక్కడి ప్రత్యేకత.కుకునూరుపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటలో కోటిలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడొక డ్యాం ఉంది. ఆలయంలో పెద్దలు ఆధ్యాత్మికంగా ఆనందిస్తే... పిల్లలేమో బోటింగ్ చేసి ఆనందించవచ్చు. సిద్దిపేట నుంచి కరీంనగర్, పెద్దపెల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మంథని చేరుకోవచ్చు. మంథని తెలంగాణలో అనాదిగా బ్రాహ్మణ పండితులకు, వైదిక సంస్కృతికి కేంద్రంగా భాసిల్లుతూ వస్తున్నది. ఇక్కడ ఎన్నో చారివూతక ఆలయాలున్నాయి. గోదావరి తీరాన ఉన్న శిథిల త్రికూటాలయం వాస్తు శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ తూర్పు నుంచి ఉత్తరం వైపుకు, మళ్ళీ తూర్పు వైపుకు తిరుగుతూ హొయలు పోతున్న గోదావరి సౌందర్యం చూసి తీరవలసిందే.
          ఇక్కడ్నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తే మనకు మొదట కన్పించేది శివ్వారం. ఈ గ్రామంలో ఆటో తీసుకుని లేదా ఎవరినైనా తోడు తీసుకొని ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఎర్రచెరువు మీదుగా పచ్చని కొండల మీదుగా ‘లంజమడుగు’ చేరుకోవచ్చు. లంజమడుగు ముఖ్యంగా మూడు అంశాలకు ప్రసిద్ధి. ఒకటి: ఇది రాష్ట్రంలోనే అరుదైన అందమైన మొసళ్ళ పెంపక కేంద్రం. రెండు: ఇక్కడి ప్రదేశం తెలంగాణలో పారే గోదావరి నదీ సౌందర్యానికి పరాకాష్ట. అది ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో అనేక మలుపులు తిరుగుతూ అడ్డువచ్చిన అడవులు-గుట్టలను చీల్చుకొని పారుతూ, అంతు తెలియని అందమైన పెద్ద మడుగును ఏర్పరచింది. మూడు: తెలంగాణలో గుహలో తొలిచి నిర్మించిన ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.లంజమడుగు ప్రాంతం కేరళలోని సముద్ర పర్యాటక స్థలాలను తలదన్నేలా ఉంటుంది. విశాలమైన ఈ మడుగు సమువూదాన్ని లేదా బ్యాక్ వాటర్‌ను పోలి ఉండగా దాని తీరపు ఇసుక తిన్నెలు బీచ్‌లను మరిపిస్తాయి. మడుగు మరో తీరం చెక్కినట్లున్న ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని ఎత్తైన అడవులతో ఎనలేని ఆనందాన్నిస్తుంది. వీటన్నింటి ఆనందాన్ని ఈ మడుగులో స్థానిక జాలర్ల బోట్లలో విహరిస్తూ ఆస్వాదించవచ్చు. మనం విహరించే బోట్ల కింద మొసళ్ళూ విహరిస్తుంటాయి. మడుగు ఒడ్డు ఒకచోట మూడు వందల అడుగుల ఎత్తు నిటారుగా ఉంటుంది. దాని అంచునే స్థానికులు ‘లంజగుళ్ళు’ అని పిలుస్తోన్న రెండు గుహాలయాల సముదాయాలున్నాయి. అవి తమ నీడలను కింద ఉన్న గోదావరి నీళ్ళల్లో ప్రతిబింబిస్తూ అందంలో అజంతా గుహలను తలదన్నుతాయి. వీటికి ఎడమ వైపున ఫర్లాంగు దూరంలో మరో గుహాలయాల సముదాయముంది. వాటి పేరు కోమటి గుళ్ళు. గోమఠేశ్వరుడు అనే జైనమత దేవుని భక్తులై కోమట్లు అని పిలువబడిన వారిలో సుమారు ఎనిమిదవ శతాబ్దం ప్రాంతంలో ప్రబలిన వేశ్యాలోలత్వం కారణంగా వారు కట్టించిన గుళ్ళను ‘లంజగుళ్ళు’ అని, ‘కోమటిగుళ్ళు’ అని పిలుస్తున్నారు. ఇది తెలియని వారు స్థానికంగా వేశ్యాతనం చేసిన రాణి కథను కూడా విన్పిస్తుంటారు.మంథని నుంచి సుమారు 50 కిలోమీటర్లు కాళేశ్వరం వరకు పచ్చని కొండలు, కోనల గుండా ప్రయాణించడమే ఆహ్లాదకరమైన అనుభూతిని మిగులుస్తుంది. కాళేశ్వరం గోదావరి-వూపాణహిత నదుల సంగమ ప్రదేశంలో ఉన్నదే త్రిలింగ క్షేత్రం. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానవట్టంపై ముక్తేశ్వర, కాళేశ్వర పేర్న రెండు శివలింగాలున్నాయి. ముక్తేశ్వర లింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా గోదావరి - ప్రాణహిత నదుల్లోకి పారి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం చేస్తుంది. ఈ క్షేత్రం ఇంకా ఎన్నో ప్రాచీన ఆలయాలు, వాస్తు శిల్ప సౌందర్యాలతో అలరారుతోంది. 
హైదరాబాద్ - మల్లూరు మార్గంలో...
           హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఏటూరు నాగారం, మల్లూరు ప్రయాణించే రూటులో సుమారు 80 కిలోమీటర్లు దాటాక ఆలేరు నుంచి ఎడమ వైపున వచ్చే కొలనుపాకలో అద్భుతమైన వాస్తు శిల్పాలతో ఒప్పారుతున్న చారివూతక జైన దేవాలయాలను, సోమేశ్వరాలయం తదితర హిందూ దేవాలయాలను కళా పిపాసకులు చూసి తీరవలసిందే. ఆలేరుకు 120 కిలోమీటర్ల దూరంలోని రామప్ప దేవాలయాలు తెలంగాణలో హిందూ వాస్తు శిల్ప సౌందర్యాలకు పరాకాష్టగా నిలుస్తాయి. వాటిని చూసి సమీపంలోనే ఉన్న విశాలమైన రామప్ప చెరువులో బోటు విహారం చేయవచ్చు. రామప్పకు కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు కొండలు, అడవుల్లో చిక్కుకుని మరీ అందంగా కన్పిస్తుంది. నీళ్ళ మధ్య ద్వీపాలలాగా ఏర్పడిన ఆ పచ్చని కొండలు నాలుగింటి మీదికి ఊగే తాళ్ళ వంతెనలు ఏర్పాటు చేశారు. వాటి మీద నడుస్తూ ఒక ద్వీపానికి చేరుకొని అక్కడున్న పర్యాటక శాఖ రెస్టాంట్‌లో భోజనం చేసి, వీలైతే అక్కడే ఉన్న కాటేజీల్లో (వసతి గృహాల్లో) ఒకరోజు బసచేయవచ్చు. అడవులు, నీళ్ళ మీదుగా వచ్చే చల్లగాలులను ఆస్వాదిస్తూ అక్కడ గడపడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది. చెరువు నీళ్ళలో స్నానం చేయవచ్చు, బోట్లలో విహరించవచ్చు. లక్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం నుండి అందమైన అటవీ మార్గంలో మంగపేట మీదుగా మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి మల్లూరు చేరుకోవచ్చు. చల్లని గోదావరి నదీ తీరాన పచ్చని కొండకోనల మధ్య వెలసిన నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికానందానికి, ప్రకృతి సౌందర్యానికి నెలవు. స్వామి పొట్టలో వేలుపెడితే అది రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. పురాతన కాలంలో ఒక గిరిజనుడు చూడక స్వామి పొట్టలో గునపం దింపాడట. అందుకే రక్తం ఇంకా కారుతూనే ఉందంటారు.
హైదరాబాద్ - పాపికొండలు మార్గంలో...
           హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో సూర్యాపేటకు ముందు పిల్లలమర్రి వస్తుంది. ఈ గ్రామం 800 ఏళ్ళ కిందట కాకతీయుల సామంతులైన రేచర్ల రాజులకు రాజధాని. కాబట్టి, ఇక్కడ కోట గోడలుండేవి. ఇప్పుడు అవి లేవు. కాని, వాటి మధ్య ఆ రాజ వంశీకులు కట్టించిన ఎరకేశ్వర, నామేశ్వర దేవాలయ సమూహాలున్నాయి. ఇందులో ప్రధాన దేవాలయ స్తంభాలకు, వాటిమీది దూలాలకు చెక్కిన నల్లరాతి శిల్పాలు అతి సుందరమైనవి. అంతరాళం, మంటపం మధ్యనున్న రెండు శిలా దూలాలపై చిత్రించిన రామ-రావణ యుద్ధం, క్షీరసాగర మథనం చిత్రాలు (పెయింటింగ్స్) తెలంగాణలో ఆ తరహావి అవి రెండే ఇప్పటి వరకు నిలిచి ఉన్నవి. ఇదే గ్రామంలో చాలా ఎత్తైన పీఠం మీద అదే కాలపు దేవాలయం మరొకటుంది.భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా సహజ సౌందర్యానికి నిలయమైన ప్రాంతం కూడా. ఉత్తరం నుండి వస్తున్న గోదావరి ఇక్కడ భద్రగిరి రాయాలయం చుట్టూ తిరిగి మళ్ళీ తూర్పు దిశకు ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకోవచ్చు. భద్రగిరికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో వచ్చే మోతెగడ్డ గ్రామ సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఒక ద్వీపకొండపైన వీరభద్ర స్వామి క్షేత్రముంది. నీటిమధ్య కొండ క్షేత్రంపై నిల్చుని చుట్టూ ఉన్న పరిసరాల సౌందర్యాన్ని చూసి పరవశించిపోవచ్చు. భద్రావూదికి ఆవల 13 కిలోమీటర్ల దూరంలో ఇరి గ్రామంలో రుక్మిణీ సత్యభామ సహిత వేణుగోపాలస్వామి ఆలయముంది. దీన్ని చూసే రామదాసు భద్రాచలంలో సీతారామాలయాన్ని కట్టించాడంటారు.భద్రాచలానికి ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాముల పర్ణశాల, అక్కడి నదుల సంగమం చూడదగిన పర్యాటక స్థలాలు. భద్రాచలానికి తూర్పువైపు 40 కిలోమీటర్లు ప్రయాణించి కుకునూర్ - పేరంటాలపల్లి నుంచి గోదావరిలో బోట్లపైన పాపికొండల మధ్య సాగే విహారమూ మరో పేర్గాంచిన పర్యటనే.
నాగార్జునసాగర్..

 
                          
సుమారు అర్థ శతాబ్దం కింద కట్టిన అద్భుత మానవ నిర్మాణం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 124 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాతి డ్యామ్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో వెలికి తీసిన చారివూతక అవశేషాలు... ప్రత్యేకించి బౌద్ధ అవశేషాలు, విశేషాలను ప్రాజెక్ట్ నీళ్ళ మధ్యలో ఉన్న నాగార్జున కొండపై ఏర్పాటుచేసిన మ్యూజియంలో భద్రపరిచారు. అక్కడికి సాగర్ నీటిలో బోటులో 9 కిలోమీటర్లు ప్రయాణించడం అరుదైన అనుభూతినిస్తుంది. సాగర్ డ్యామ్ కూడా చూశాక పైలాన్-హిల్ కాలనీ పరిసరాల్లో 279 ఎకరాల్లో బుద్ధుడు ప్రవచించిన ‘అష్టాంగమార్గ’ స్ఫూర్తితో నిర్మించిన కట్టడాలు, పార్క్‌లు చూడదగినవి. సాగర్ కిందుగా 11 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాతం ఉంది. దీని సౌందర్యం విధిగా చూడదగింది. అయితే, ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు కావలసిన సకల సౌకర్యాలున్నాయి.
హైదరాబాద్ - నల్లమల     

                             


రాష్ట్రంలోనే అత్యంత విశాలమైనవి నల్లమల అడవులు. అందుకే దేశంలోనే పెద్దదైన ‘పులుల సంరక్షణా కేంద్రం’ సుమారు నాలుగు దశాబ్దాల కిందట ఇక్కడ ఏర్పాటైంది. నల్లమలలోనే రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన శ్రీశైల క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం ఉత్తరద్వార క్ష్రేత్రమైన ఉమామహేశ్వరంతో తెలంగాణలో (మహబూబ్‌నగర్ జిల్లాలో) నల్లమల అడవులు ప్రారంభమవుతాయి. సర్పాకారంగా కమ్ముకున్న పచ్చని కొండల కంఠ స్థానంలో సహజంగా ఏర్పడిన గుహల్లో పైనుండి పడుతున్న నీటి ధారల కింద ప్రతిష్టితమైన స్వయంభు శివలింగం తేజస్సు చూడదగింది. ఉమామహేశ్వరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూరులో చీతల్ రెస్టాంట్‌లో భోజనం చేసి, అందులోని వనమాలిక కాటేజీల్లో విశ్రాంతి తీసుకొని, అక్కడున్న చెంచులక్ష్మి, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనే మ్యూజియంలను సందర్శించవచ్చు. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండం సందర్శించదగ్గదే. రోడ్ మీదే ఉన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి టికెట్ రుసుము చెల్లించి వారి వాచ్‌మన్ సహాయంతో సమీపంలో ఉండే ‘గుండం’ వరకు వెళ్ళి నట్టడివిలో వన్యజీవులు, పక్షుల స్వేచ్ఛా విహారాలను వీక్షించవచ్చు.‘గుండం’కు ఫ్లర్లాంగు దూరంలో కిందివైపు లొద్ది ఉంది. దానిలోతు సుమారు వేయి అడుగులు. దాని అడుగున విశాలమైన గుండం ఉంది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి ఒక జలపాతం దూకగా ఏర్పడిందది. ఆ జలపాతపు నీటిని ఇప్పుడు స్థానికులు వ్యవసాయం కొరకని చెరువులోకి మళ్ళించుకున్నారు. అయినా వర్షాకాలంలో పారిన వరద నీటికి నిండిన ఈ గుండం ఎండాకాలం కూడా ఎండిపోదు. పైగా ఎండాకాలంలోనే దీని దగ్గర ఎక్కువ ఆనందించే వాతావరణం ఉంటుంది. కాబట్టే, ఎండాకాలంలో వచ్చే వైశాఖ బుద్ధ పౌర్ణమికి జాతర జరుగుతుంది. (ఈ నెలలో 24,25,26 తేదీలలో). గుండానికి రెండువైపులా ఉన్న సహజమైన గుహల్లో విష్ణుకుండిణల కాలపు (1600 సంవత్సరాల) శివాలయాలున్నాయి. వాటి మధ్య ఎత్తైన చెట్ల మధ్యనున్న గుండంలో కేరింతలు కొడుతూ ఈత కొట్టడం, ఆ కేరింతల ప్రతిధ్వనులు కొండల మధ్య వింతగా విన్పించడం... ఇవన్నీ స్వయంగా ఆస్వాదించదగిన అనుభూతులు.
       లొద్ది నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే నిజాం కాలం నాటి ఫరహాబాద్ గేట్ వస్తుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు తమ జీపులో టైగర్ సఫారీకి తీసుకు చివరన గల ఒక కొండ అంచుకు తీసుకెళ్తారు. ఆ అంచు ఎత్తు భూమి ఉపరితలానికి సుమారు ఒక కిలోమీటరుంటుంది. అంత ఎత్తులో ఉన్న మన మీదికి రయ్య్‌మని వీస్తున్న గాలుల అనుభూతులను ఆస్వాదిస్తూ, పచ్చని అడవుల మధ్య ఎన్నో కిలోమీటర్ల దూరంలో చెలిమలలాగా కనిపిస్తున్న పెద్ద చెరువులను చూస్తూ, పక్కనే నిజాం కట్టించుకున్న శిథిల భవనాలను ఆసక్తిగా వీక్షిస్తూ అక్కడ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి జీపులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు మార్గ మధ్యలో జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, పులులు మొదలైన వన్య జంతువులూ కన్పించవచ్చు.ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్లెల తీర్థం అనే జలపాతాన్ని చేరుకోవచ్చు. చుట్టూ ఆవరించుకున్న పచ్చని కొండల మధ్య వంద అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న గిలిగింతలు పెట్టే చల్లని జలపాతపు ధారల కింద, ఏర్పడిన గుండం, దాని నుండి ఎత్తైన చెట్ల గుండా ప్రశాంతంగా పారుతున్న ఏరు హొయలు చూడదగ్గవి.
          వటవర్లపల్లి నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహల క్రాస్ కనిపిస్తుంది. అక్కడి నుండి సుమారు 6 కిలోమీటర్లు అందమైన అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేసి కృష్ణానది ఒడ్డున గల విశాలమైన గుహ సముదాయం చేరుకోవచ్చు. సహజంగా ఏర్పడిన రెండు స్తంభాల మీద విశాలమైన రాతి సల్పపై లాగా అమరి దాని కింద మూడువైపులా వందేసి మూరల గుహలు ఏర్పడ్డాయి. పడమటి వైపు గుహ చివరన స్వయంభు లింగం పీఠం మీద ఉంది. ఆ లింగాన్నే 12వ శతాబ్దంలో అక్క మహాదేవి అనే భక్తురాలు పూజించి, శివున్ని ప్రత్యక్షం చేసుకొని అతనిలో ఐక్యమైందట. ఈ గుహ ప్రాంగణంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి అందాలను చూస్తూ వేల మంది సేదతీరవచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగ వరకు 22 కిలోమీటర్ల దూరం పర్యాటక శాఖ నడుపుతున్న బోట్లలో కూడా ప్రయాణించవచ్చు.
హైదరాబాద్ - అనంతగిరి            
                                
                            

   హైదరాబాద్ రాజధానిగా పాలించిన ముస్లిం రాజులకు కూడా పర్యావరణ స్పృహ నాలుగున్నర శతాబ్దాల కింది నుంచే ఉంది. ఆ స్పృహ నుండి పుట్టిన హుస్సేన్‌సాగర్‌లో బోటులో విహరిస్తూ చేసే డిన్నర్, బుద్ధ దర్శనం చక్కటి అనుభూతులు. ఆనాటి కుతుబ్షాహీ రాజులకు (గోల్కొండ కోటపైకి) నీటిని అందించిన దుర్గం చెరువులో బోట్లలో విహరిస్తూ చేపలు పట్టడం, చేప కూరతోనూ భోంచేయడం ఇప్పటికీ సాధ్యమే.
          హైదరాబాద్ నుంచి సుమారు డ్బ్బై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. అందంలో విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండలను తలదన్నే కొండలివి. ఈ అడవుల మధ్య నిజాం కాలంలోనే కుష్టు వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటై ఇప్పటికీ పనిచేస్తోంది. ఇక్కడి వాతావరణంలోనే కుష్టు వ్యాధిని నయం చేయగల మహత్తు ఉందని ఆనాడే గుర్తించారు. ఈ కేంద్రం ముందర విశాలమైన, లోతైన లోయ ఉంది. సాహసికులు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తే వారికి అడవుల మధ్య అందమైన చెరువు కన్పిస్తుంది. సాహసించని వారు ఈ కేంద్రానికి వెనుక వైపునున్న దేవాలయాన్ని దర్శించుకుని దాని కిందుగా జంటగా ఉన్న కోనేరులోని మంచి నీటిని, మరోవైపు మురికి నీటిని చూసి, వెనుదిరిగి వచ్చి పర్యాటక శాఖవారు ఏర్పాటుచేసిన రెస్టాంట్‌లో షడ్రసోపేతమైన భోజనం చేయవచ్చు. వీలు చూసుకునేవారు అక్కడే ఉన్న ఏ.సి. గదుల్లో ఉండిపోవచ్చు.
       ఈ విధంగా అరకు, హార్స్‌లీ హిల్స్‌లను తలదన్నే చల్లని పర్యాటక కేంద్రాలు మన చుట్టు పక్కలే తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి.
                                              - డాక్టర్  ద్యావనపల్లి సత్యనారాయణ,
                                                         94909 57078

Saturday, 25 May 2013

ఎన్నికల తెల్లారే తెలంగాణ


*
ఢంకా బజాయించి తెచ్చుకుంటాం
* బాన్సువాడ శిక్షణాశిబిరంలో కేసీఆర్
* తెలంగాణపై మహానాడులో తీర్మానం చేయండి
* చంద్రబాబుకు టీఆర్‌ఎస్ అధినేత సవాల్
* చలో అసెంబ్లీలో తాడోపేడో తేల్చుకుందాం
నిజామాబాద్, టీ మీడియా: వంద అసెంబ్లీ స్థానాలు, 15 లోక్‌సభ స్థానాల్లో పార్టీ గెలిస్తే ఎన్నికలైన తెల్లారే ఢంకా బజాయించి తెలంగాణ తెచ్చుకుంటామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అందరికంటే ఎక్కువ లాభపడేది లంబాడీలేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రకారంవారికి ఆరు శాతం రిజర్వేషన్లే అందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లు వస్తాయని అన్నారు. ముస్లింల కోసం ఇప్పుడున్న 250 కోట్ల బడ్జెట్‌ను వెయ్యికోట్లకు పెంచుతామని చెప్పారు. సింగూరు నీళ్లను ఇందూరుకు మళ్లించి ఇక్కడి ప్రజల పాదాలకు అభిషేకం చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం బాన్సువాడలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి అధ్యతన జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ సాధనకు ఎదురవుతున్న అడ్డంకులను వివరించిన ఆయన.. రాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగే అభివృద్ధిని విపులీకరించారు. త్వరలో జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమంతో తాడోపేడో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. 

నిజంగా టీడీపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాలు విసిరారు. ఎల్లాడ్డి ఎమ్మెల్యే రవీందర్‌డ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి కరిమెల్ల బాపురావు, జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగాడ్డి, ఐఏఎస్ అధికారి రమణాచారి, ప్రొఫెసర్ సాంబయ్య, రసమయి బాలకిషన్, పార్టీ నేతలు బిగాల గణేష్ గుప్త, జీవన్‌డ్డి, డాక్టర్ భూపతిడ్డి, నల్లమడుగు సురేంధర్, లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఒక్కటిగా నిలవాలె :
తెలంగాణ గడ్డపై ఆంధ్రపార్టీలకు తావేలేదని తేల్చిచెప్పాలి. ఊరికో కథానాయకుడు పుట్టాలి. ఆడబిడ్డలంతా ఎల్లమ్మ, సమ్మక్క సారలక్క, రాణి రుద్రమదేవివలే పిడికిలి బిగించాలె. కిరణ్, చంద్రబాబు, జగన్ వేలకోట్లతో వాలుతారు. చీప్ లిక్కర్ పారిస్తరు. కానీ మనకొలువులు, మన నీళ్లు, మన నిధులు మనగ్గావాలంటే తెలంగాణ రావాలె. తెలంగాణ రావాలంటే సమాజమంతా ఒక్కటిగా నిలవాలే. ఆంధ్రపార్టీలను పాతరేసి 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. అప్పుడే ఎన్నికల తెల్లారే ఢిల్లీని శాసించి ఢంకా బజాయించి తెలంగాణ తెచ్చుకోగలుగుతాం.
ఎక్కువలాభపడేది లంబాడీలే :తెలంగాణ రాగానే అందరికంటే ఎక్కువ లాభపడేది లంబాడీలే. ఆంధ్రవూపదేశ్ జనాభా లెక్కల ప్రకారం వాళ్లకు ఇప్పుడు 6శాతమే రిజర్వేషన్లున్నాయి. తెలంగాణ ఏర్పడితే 12% అమలవుతాయి. చదువుకున్న ఏ లంబాడ బిడ్డ కొలువులేకుండా ఉండరు. వాళ్లకు రాజకీయాల్లోను రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. వాళ్ల భాష, వస్త్ర సంప్రదాయం కాపాడడానికి చర్యలుతీసుకుంటాం. తాండాలన్నింటినీ ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం.

ఆంధ్రపార్టీలు అవసరమా? : 
తెలంగాణకు అడ్డం పడుతున్న చంద్రబాబు, కిరణ్, జగన్, వాళ్ల పార్టీలతో మనకు అవసరముందా? ఆంధ్రపార్టీల పెత్తనం ఎంతకాలం? ఆ పార్టీలో ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి మనోడైతడా? పార్టీ అధ్యక్షుడినైనా చేస్తారా? పెత్తనమంతా వారిదే. శాశ్వతంగా గులామ్‌గిరీ చేసుడేనా? మన జెండా మనం ఎగరేసి గల్ల ఎగరేద్దామా? ఆంధ్ర పార్టీలను ఐదు కిలోమీటర్ల లోతులో పాతిపెడితేనే తెలంగాణ వస్తది. ఈ సంగతిని ఊరూరా రచ్చబండమీద చర్చపెట్టాలి. ధర్మయుద్ధంలో మనమే గెలుస్తాం. వందమంది కౌరవులు అధర్మంతోనే పాండవుల చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల కురుక్షేవూతంలో తెలంగాణ గెలుస్తది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఎక్కడికెళ్లినా నా రెట్టకు ఇమామే జామీన్ కడుతుండ్రు. యుద్ధంలో గెలిచి క్షేమంగా విజయంతో తిరిగిరమ్మనే ఇది కడుతుండ్రు. ఇక చంద్రబాబు మోకాళ్లపై నడిసొచ్చినా ఆయనకు ఓట్లురావుకదా చేతిలో ఉచ్చపోసే దిక్కుండదు.

పదవి తీసుకోను... : 
తెలంగాణ వచ్చినంక ఏ పదవి తీసుకోను. దళితుడినే సీఎంను చేస్తా. పక్కనుండే తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తా. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతా. వచ్చే తెలంగాణలో మనదే అధికారం. మన కేబినెట్‌లో పోచారం ముఖ్యమైన స్థానంలో ఉంటరు. 
8 గంటల విద్యుత్ సరఫరా : తెలంగాణ రాంగనే వ్యవసాయానికి 8గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది. రెప్పపాటు కూడా కరెంటు పోనియ్యం. పక్కరాష్ట్రాల నుండి కరెంటును కొంటాం. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లకు గోదావరి నీళ్లతో, మన బొగ్గుతో 5వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. ఆ రెండేళ్లకే మరో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొని ఛత్తీస్‌గఢ్, గుజరాత్ వలే తెలంగాణలో 24గంటల కరెంటు సరఫరా చేస్తాం. 

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు : 
ముస్లిం సోదరులకు 12%రిజర్వేషన్లు తెలంగాణలోనే సాధ్యం. దొంగలోల్లే దోచుకున్న వక్ఫ్ భూములను వాళ్ల సంక్షేమం కోసమే వినియోగిస్తాం. 250 కోట్ల ముస్లింల బడ్జెట్‌ను వెయ్యికోట్లకు పెంచుతాం. బీసీలు, ఇతర పేదలు ఆత్మగౌరవంతో బతికేటట్లు పథకాలు అమలు చేస్తాం. 2లక్షలు ఖర్చుపెట్టి వాళ్లకు రెండు బెడ్‌రూంలతో ఇండ్లను కట్టిస్తాం. పన్నుల రూపంలో మనం 47వేల కోట్లు కడితే ఆంధ్రోళ్లు 15వేల కోట్లే కడుతున్నారు. ఇంకా పెన్షన్‌ల విషయంలో హర్రాసుపాట పాడినట్లు పాడుతున్నరు. ఎవడి సొమ్ము ఎవడికిస్తరు? తెలంగాణ వస్తే వృద్ధులు, వితంతువులకు ప్రతినెల వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాం. వికలాంగులకు 15వందల పెన్షన్ ఇస్తాం. 21లక్షల రైతు కుటుంబాలకు పంట రుణాలను మాఫీ చేస్తాం.

సింగూర్ జలాలు తెచ్చి అభిషేకం చేయిస్తా...: 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సింగూరు నీళ్లను ఇందూరుకు మళ్లించి ఇక్కడి ప్రజల పాదాలకు అభిషేకం చేయిస్తా. నిజామాబాద్, మెదక్ రైతులకోసం నిజాం నిర్మించిన నిజాంసాగర్‌పై ఆంధ్ర పాలకులు కుట్రపూరితంగా సింగూరును కట్టిండ్రు. ఈ నీళ్లను హైదరాబాద్‌కు తరలిస్తుండ్రు. తెలంగాణ రాగానే కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌కు తరలిస్తాం. సింగూరు నీళ్లంటినీ నిజాంసాగర్‌కే మళ్లిస్తాం.

Thursday, 23 May 2013

సింగరేణి వైద్య కళాశాలకు మోక్షమెప్పుడు?


     దాదాపు 124 ఏండ్ల ‘సింగరేణి తల్లి’ ఒడిలో నాలుగు తరాలుగా ఎన్నో కష్టనష్టాలకోడ్చి ఒక కుటుంబ సభ్యులుగా, కులమతాలకతీతంగా ఒక నూతన పారిశ్రామిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.ఎక్కడో ఖమ్మం జిల్లాలో ‘సింగరేణి’ గ్రామంలో వెలసిన మన పిన్నమ్మ ఈరోజు నాలుగు జిల్లాల పరిధిలో వేల ఎకరాల్లో తన గర్భంలో నల్ల బంగారాన్ని దాచుకున్నది. ఒకప్పుడు లక్షా 35వేల కార్మిక కుటుంబాలకు ఉపాధిని పంచిన బొగ్గుతల్లి, నేడు 64 వేల కార్మికులకు ప్రత్యక్షంగా మరో ఆరు లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధినిస్తూ దిన దిన ప్రవర్థమానమై విరాజిల్లుతున్నది. ఇంకో రెండు వందల సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలను సింగరేణి తన కడుపులో దాచుకున్నది. కానీ ఈనేల పొరల్లో, భూగర్భ సొరంగాల్లో పనిచేసి అలసి ఈ నేలపాలైన మన తాతలు, తండ్రులు, సోదరులకు కంపెనీ మానవాళి కనీస అవసరాలైన నీరు, గూడు,విద్య, వైద్యం అందించడంలో సవతి తల్లి ప్రేమను చూపుతున్నది.
             మొదటి తరం కార్మికుల అభ్యర్థన, కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు వారి పిల్లల కనీస చదువుల కోసం 1975లో ‘సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఏర్పడింది. నాటి మూల కార్మికుల పిల్లల విద్య కోసం కొత్తగూడెంలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ప్రాథమిక విద్యను ప్రారంభించింది.అప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు లేక దిన దిన గండంగా బతుకు వెళ్లదీస్తున్న కార్మికుల పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించారు. అధికారుల పిల్లలు మాత్రం సింగరేణి పాఠశాలలో చదివేవారు. కానీ నేటి తరం కార్మికుల పిల్లలు బోధనా విలువలు పడిపోయి, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమై ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువు‘కొంటున్నారు’. నాడు నిత్యం కార్మికులకు, యాజమాన్యానికి ఘర్షణ పరిస్థితులు ఉండేవి. కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడుతుండేవారు. మరోవైపు సీమాంధ్ర యాజమాన్యం అణచివేత విధానాన్ని అవలంబించే ది. రోజూ బందులు, ర్యాలీలతో పిల్లల చదువులు గందరగోళంగా ఉండేవి. 
         కానీ నేటి పరిస్థితులు వేరు. సింగరేణి యాజమాన్యం ప్రపంచదేశాలకు ధీటుగా భూగర్భ, ఉపరితల గనుల ద్వారా నిర్దేశించుకున్న ఉత్పతి లక్ష్యాన్ని గడువు కంటే ముందే చేరుకుంటున్నది. ఇది శుభపరిణామం. ఇదంతా ఇక్కడి శ్రమ జీవుల, అధికారుల, సమష్టి కృషి  ఫలితం. కానీ నాటినుంచి నేటి వరకు ఇక్కడి పిల్లల విద్యా బోధన కోసం ఏర్పడిన ‘సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ’ ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక విద్యకే పరిమితమైంది. ఉన్నత విద్య అయిన ‘వైద్య విద్య’ కోసం కార్మికుల పిల్లలు నగరాలకు, ఉన్నతాధికారుల పిల్లలు విదేశాలకు వెళుతున్నారు. ఏమాత్రం నాణ్యతలేని విద్య కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. నేటికీ సంస్థ అభివృద్ధికి సమాంతరంగా సాంకేతిక విద్య గానీ, ఉన్నత వైద్యం కానీ మెరుగుపడలేదు. దీనికి కారణం కీలకమైన వైద్య, విద్యరంగాలకు యాజమాన్యం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
          మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్నేళ్లుగా సింగరేణిలో ‘వైద్య కళాశాల(ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. అందులో సీమాంధ్రలో తొమ్మిది మెడికల్ కాలేజీలుండగా, తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం కనీసం ఆరు వైద్య కళాశాలు ఉండాలి. అరకొర వసతులతో ఈ మధ్య నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రారంభించినా ఇంకా అందులో బోధనకు నోచుకోలేదు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న సీమాంధ్ర పాలకులు ఇక్కడే ఉన్న ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో సీట్ల పెంపుకు తగినన్ని పరికరాలు, భవన మరమ్మతులకు నిధులు విడుదల చేయలేదు.
            స్థానిక ప్రభుత్వాలు నిధుల లేమితో ప్రభుత్వ వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయడం అసాధ్యమని తేల్చాయి. వైద్య రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు ఎప్పుడూ అరకొరగానే ఉంటున్నాయి. ఇటీవల ‘భారతీయ వైద్య మండలి’ (MCI) పరిక్షిశమలకు అనుబంధంగా ఉన్న కళాశాలలకు నిబంధనలను సడలించి, 300 పడకలున్న ఆస్పత్రులకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆదేశించింది. ఈ నిబంధనలకు నూటికి నూరుశాతం సరిపోయేలా ఉన్న సింగరేణి వైద్య, ఆరోగ్య, విభాగానికి నాలుగు జిల్లాల పరిధిలో 845 పడకల ఆస్పత్రి భవనాలు, 2500 పైగా పారామెడికల్ సిబ్బంది, 250పైగా వైద్యులున్నారు. సింగరేణి ఏరియా పరిధిలో ఆస్పవూతులు, వాటి పడకలు, వాటి అనుబంధ డిస్పెన్సరీల వివరాలు కింది విధంగా ఉన్నాయి. 
     ఏరియా ఆస్పత్రులన్నింటిని ఆధునీకరించి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని కంపెనీ ఆలోచిస్తున్నది. ఇప్పటి వరకు ప్రతి ఏటా గని ప్రమాదాల వల్ల అస్వస్థత గురైన కార్మికులకు, అధికారులకు స్పెషాలిటీ వైద్య సేవల కోసం నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు 10-12 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది.
      ఇక అరకొర వసతులతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా 27 ఉన్నాయి. అందులో సొసైటీల పేరుతో నాలుగు, ట్రస్టుల పేరుతో 23 కాలేజీలు నడుస్తున్నాయి. నాలుగు కళాశాలలు మాత్రం డీమ్డ్ యూనివర్సిటీలుగా విదేశీ పెట్టుబడులతో విరాజిల్లుతున్నాయి. వాటిలో 19 సీమాంవూధుల ఆధీనంలో ఉండగా, ఐదు కళాశాలలు మాత్రమే తెలంగాణ వారివి. సొసైటీ, ట్రస్టుల పేరుతో నడిచే వైద్య కళాశాలలు, విద్యా బోధన, నిర్వహణ ఆర్థిక లావాదేవీలతో అవకతవకలు మనం శోధించినా ఛేదించలేనివి. కానీ ఎంతో పారదర్శకంగా నడపబడుతున్న ‘సింగరేణి ఎడ్యుకేషనల్’ సొసైటీ ప్రతి ఏటా ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక విద్య వరకు సుమారు 10571 విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నది. ఇప్పటి వరకు లక్షలాదిమంది తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్రవ్యాప్తంగా, దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. వారంతా ఇక్కడి విద్యావకాశాలు మెరుగుపడాలని వైద్య విద్య అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ కాంట్రాక్టు స్థాయి కార్మికుడి నుంచి అత్యున్నత స్థాయి అధికారిగా పదవీ విరమణ పొందిన కార్మికులు ఒకవైపు ఉండగా, అదే కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి నాలుగు దశాబ్దాలుగా తమ రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించి అరకొర వసతులతో జీవనం సాగిస్తున్నారు. పదవీ విరమణ సమయానికి కనీసం సొంతగూడుగాని, పిల్లలకు సుస్థిర జీవనానికిగానీ నోచుకొని కార్మికులను మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కంపెనీలో నిజాయితీగా పనిచేసిన కార్మికుని జీవితానికి అంతే నిజాయితీగా పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారి జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే పెద్దగా వ్యత్యాసం లేదు. చాలీచాలని పెన్షన్‌లు, ఆకాశాన్నంటుతున్న ధరలు, అంతుచిక్కని దీర్ఘకాలిక వ్యాధు లు, నిలు కాలుష్యమయమైన వారి తనువు చూస్తుంటే మానవతావాదుపూవరికైనా మనసు ద్రవిస్తుంది. 
         ఇటువంటి విశ్రాంత కార్మికుల ఆరో గ్య పరిరక్షణకు, వైద్యానికి సింగరేణి యాజమాన్యం చూపుతున్న వైఖరి శోచనీయం. వైద్యం లేకపోగా అత్యవసర సమయాల్లో, ప్రాణాంతకమైన గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడ్డప్పుడు ఇక్కడి హాస్పిటల్‌లో చేర్చుకోవటంలేదు. పై స్థాయి వైద్యశాలలకు కూడా సిఫారసు చేసే పరిస్థితి లేదు. ఇదెంతటి అమానుషమో ప్రజాసంఘాలు, కార్మిక నాయకులు, ప్రజా వూపతినిధులు ఆలోచించాలి.ఇది అత్యంత ఆందోళనకర విషయం.
            అదే ‘సింగరేణిలో వైద్యకళాశాల’ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవటమే కాకుండా ఇక్కడి పిల్లల బంగారు భవిష్యత్తుకు నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఈ ప్రాంత విశ్రాంత కార్మికులకు, పరిస ర ప్రాంత ప్రజానీకానికి, మెరుగైనన వైద్యసేవలు అందుతాయి. ఇక యాజమాన్యానికి మెడికల్ కాలేజీ నిర్వహణా ‘భారం’ అనేది అత్యంత శోచనీయం. సింగరేణి అంటే ‘వన్ ఫ్యామిలీ- వన్ విజన్- వన్ మిషన్’ అని ఉటంకించే అధికారులు, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలో నడిచే ఉన్నతస్థాయి పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ ఎలా సాధ్యమైందో ఆలోచించాలి. మన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ మన పిల్లల భవిష్యత్తు ఎలా భారమవుతుందో పునరాలోచించాలి. ప్రభుత్వ ఆధీనంలోని జేఎన్‌టీయూ మంథని సంస్థకు 20 కోట్ల గ్రాంటు ఇచ్చి కేవలం ఐదు శాతం సీట్ల కార్మికుల పిల్లలకు కేటాయింపు ఏవిధంగా సరైనదో ఆలోచించాలి. ఇదంతా కూడా సంస్థ నిర్వహించే ‘సామాజిక ధర్మం’ సీఎస్‌ఆర్- ప్రోగ్రాం గా అభివర్ణిస్తుంది. అంతే బాధ్యతతో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రభుత్వం, అధికారులు ఈ విద్యాసంవత్సరానికి ‘Essentiality certificate ’ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఆదేశించాలని మనవి. తదనుగుణంగా కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు, ప్రాంతీయవాదానికి అతీతంగా ప్రభుత్వంపై ‘ఒత్తిడి’ పెంచి ఇక్కడి ప్రజానీకాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. 
         అనుకోని పరిస్థితులలో విశ్రాంత కార్మికులు మృత్యువాత పడితే, గని కార్మికులు ప్రమాదాల వల్ల మరణిస్తే, ‘శవ పరీక్ష’కు సరైన వైద్యులు గానీ పార్థివ దేహాన్ని భద్రపరచే ‘మార్చురీ’ (శవాల గది) గాని ఇక్కడలేవు. వాయు కాలుష్యం వల్ల వృత్తిరీత్యా సంక్రమించే వ్యాధులైన కోల్ వర్కర్స్ ‘న్యూమోకోనియోసిస్', ‘Black lung Disease’ ఉపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారినపడ్డ కార్మికుల ఊసేలేదు. ఎన్నో ఏళ్లు పారిక్షిశామిక జీవ నం గడిపిన అనేక కార్మికులు నేడు గ్రామాల్లో రైతుకూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. నేటి పరిస్థితులను చూసి జాతి సంపదను తన కడుపులో దాచుకున్న ఈ నేల తల్లి ఇవాళ విలవిలలాడుతుంది. ఈ నేల సొరంగాల్లోకి, కటిక చీకట్లో అడుగులో అడుగువేస్తూ నడిచిన కాళ్ళకు అనేక గాయాలైన ఆ ‘గుండె’లను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ నాగరిక సమాజానికి ఉన్నది.
-డాక్టర్ దాసారపు శ్రీనివాస్
సింగరేణి కోల్‌బెల్ట్ డాక్టర్స్ ఫోరమ్ చైర్మన్

Tuesday, 21 May 2013

మల్లెల తీర్థం                                                
                             
          మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అరణ్యంలో ఉన్న అందమైన ప్రకృతి జలపాతం ‘మల్లెలతీర్థం’. శ్రీశైలం దేవాలయానికి 58 కి.మీ. దూరంలో ఇది ఉంది. అడవి నుంచి ప్రవహించే కృష్ణానది నుండి ఈ జలపాతం ఏర్పడింది. దీన్ని చేరుకోవాలంటే 350 మెట్లు దిగాల్సి ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలంలో ఈ జలపాతం చూడడానికి బాగుంటుంది. అత్యంత ఎత్తైన కొండలపై నుంచి పడే నీటిని చూడడానికి రెండు కళ్లు చాలవు!
కబూతర్ ఖానా
                                   

పావురాలపై హైదరాబాదీల ప్రేమకు చిహ్నం కబూతర్ ఖానా. పావురాల నివాసం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ నివాసాలు కోఠిలోని హస్మత్‌గంజ్, హుస్సేనీ ఆలంలోనూ ఉన్నాయి. కోఠిలో 1941లో నిర్మిస్తే, హుస్సేనీ ఆలంలో 200 సంవత్సరాలకు పూర్వమే వీటిని నిర్మించారు. దీన్ని సిద్ది ఇబ్రహీం అనే వ్యక్తి కట్టించాడంటారు. ఇందులో సుమారు వెయ్యి పావురాలు నివాసం ఉండేందుకు వీలుగా 135 తొర్రలు ఉన్నయి. వందలాది పావురాలు ఇక్కడ నివసిస్తున్నయి.
ఏకశిల మహాగణపతి        

                     
పచ్చని పొలాల మధ్య కొలువుతీరిన 30 అడుగుల మహాగణపతి విగ్రహం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలోని ఆవంచ గ్రామంలో ఉంది. క్రీ.శ. 12 శతబ్దానికి చెందిన ఈ ఏకశిల గణపతి విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజు బాదామి విక్రమాదిత్యుని రెండో కుమారుడు తైలపుడు చెక్కించాడు. కొన్ని కారణాలతో విగ్రహ ప్రతిష్టాపన నిలిచిపోయిందట. ఎనిమిదిన్నర శతబ్దాల చరిత్ర కలిగిన ఈ విగ్రహనికి గుడి కట్టాలని స్థానికులు ప్రయత్నిస్తున్నరు.
కాళేశ్వరం యమకోణం                    
                                       

     కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో ఈ యమకోణం ఉంది. చాళుక్యులు నిర్మించినట్లు చెప్పే ఈ దేవాలయాన్ని కాకతీయులు పునఃవూపతిష్టించినట్లు తెలుస్తోంది. శివుడు, యముడు ఒకే పానపట్టం పై ఉండే ఈ దేవాలయం ప్రాంగణంలోని యమకోణం చాలా పురాతనమైంది. ఈ కోణంలో నుండి ఈగితే పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తరు.
జన్నాయిగూడెం దుర్గం                     
                                    
రంగాడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరరావిరాల సమీపంలో ఈ దుర్గం ఉంది. గోల్కొండ చివరి నవాబు తానిషా వద్ద సేనాధిపతులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నలు దీన్ని నిర్మించినట్లు చెబుతరు. ఈ దుర్గంలో రహస్యగదులు, సైనిక స్థావరాలు మంత్రముగ్ధులను చేస్తయి. మరాఠా వీరుడు శివాజీ శ్రీశైలం దర్శనానికి వెళ్తూ ఇక్కడి వచ్చినట్లు చెబుతరు. ఆయన రాక సందర్భంగా ఈ దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

Tuesday, 14 May 2013

రాచరిక వైభవానికి ఆనవాలు కొల్లాపూర్!

                           


ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలిన సురభి రాజుల వారసులు ఇప్పుడు అపురూపమైన వివాహ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ కళ్యాణ కాంతుల వేళ వారి ఒకనాటి పాలనా వైభవాన్ని తెలిపే ప్రత్యేక కథనం.   
      
తెలంగాణలో పేరెన్నిక గన్న సంస్థానాలలో కొల్లాపూర్ ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీషుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి.  ఆలయాల  అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి తోడు వివిధ రంగాల కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీషులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు.
పిల్లలమర్రి భేతాళనాయుడే మూలపురుషుడు!
       క్రీ.శ.16వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతం నుంచి వీరి పరిపాలన ప్రారంభమైంది. క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వారి మూల పురుషుడైన పిల్లలమర్రి భేతాళనాయుడు సురభి వంశస్తులకే కాక వెంకటగిరి వెలుగోటి వారికి, మైలవరం సురపనేని వారికి, బొబ్బిలి పిఠాపురం రావు వారికి కూడా మూలపురుషుడే. 
          సురభి రాజ సంస్థానాధీషులు మొదట్లో జటప్రోలు సంస్థానంగా కొల్లాపూర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్‌ను సంస్థానంగా మార్చుకొన్నారు. పెంట్ల రాజధానిగా వారు పాలన సాగించారు. సురభి వంశస్తుల పూర్వీకులు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. వారు తొలుత జటవూపోలులో విశాలమైన ప్రాంతంలో పెద్ద కోటను నిర్మించుకున్నారు. నిజాం నవాబుకు సామంతులుగా పరిపాలన సాగించారు. ఇక్కడ సుమారు 600 సంవత్సరాల పాటు వారి పాలన సాగినట్లు పలు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

    కొల్లాపూర్‌ను రాజాధానిగా చేసుకొని పరిపాలించిన ఆ సంస్థానాధీషులు కాలక్రమంలో ఇదే కొల్లాపూర్‌ను సంస్థానంగానూ చేసుకొన్నారు. పెంట్ల రాజధానిగా అప్పట్లో వారు పరిపాలన కొనసాగించారు. అయితే, సమీపంలో ఉన్న కృష్ణానది జలాల తాకిడికి వారు నిర్మించిన కోట జలమయమైంది. మండు వేసవిలో మంచినీటికి సైతం ఇబ్బంది తలెత్తింది. దాంతో అప్పటి సంస్థానాధీషుడు సురభి రామారావు తన మకాంను పెంట్లవెల్లికి  మార్చారు. 
    స్వయంగా వ్యాకరణ తర్కపండితుడుగా అప్పట్లో ప్రసిద్ధుడైన మాధవరావు ఆనాటి కవి పండితులను ఎంతో ఆదరించడమేకాక సత్కరించినట్లు తెలుస్తోంది. ‘చంద్రికాపరిణయం’ పేర్న ఒక కావ్యాన్ని ఆయన రాశారు. వీరి అనంతరం గద్దె నెక్కిన రెండవ జగన్నాథరావు కొల్లాపూర్‌లో సువిశాలమైన కోటను నిర్మించి పాలన కొనసాగించారు. 
‘చంద్రమహల్’ నుంచి ‘షాదీ మహల్’ వరకూ!
       అది 1871వ సంవత్సరం. ఈ సమయంలోనే ఆయన కొల్లాపూర్ కోటలో భాగంగా ‘చంద్రమహల్’ అనే అందమైన భవనాన్ని నిర్మించాడు. తర్వాత తన మకాంను అందులోకి మార్చాడు. జగన్నాథరావు అనంతరం రాజా సురభి వెంకటలక్ష్మారావు 1887 మార్చి 6న సింహాసనం అధిష్టించినట్లు చెబుతారు. అయితే, ఈయన కాలంలోనే కొల్లాపూర్ సంస్థానం పరిపాలన పకడ్బందీగా సాగినట్లు వినికిడి. 
           నిజాం నవాబు నుంచి నిజాం నవాజ్ వంతు బహుద్దూర్ బిరుదు పొందిన రాజా వెంకటలక్ష్మారావు గురితప్పని గొప్ప వేటగాడుగా పేరు పొందారు. క్రూరమృగాలను సైతం వెంటాడి, వేటాడి చంపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1908లో పెద్ద తోటలో ‘సుందర మహాల్’ను నిర్మించినట్లు చెబుతారు. ‘చంద్రమహల్’కు పైభాగంలో 1961లో దర్బార్ హాల్, విజయమహల్, షాదీమహల్‌లను అన్ని హంగులతో నిర్మించి, సుందరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. 
రాచ పట్టణంగా కొల్లాపూర్:
        రాజా వెంకటలక్ష్మారావు హయాంలోనే రాచ పట్టణంగా వెలుగొందిన కొల్లాపూర్‌ను సుందరంగా తీర్చిదిద్దినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆనాడే ప్రజలకు విద్యుత్ సరఫరాతోపాటు పబ్లిక్ కుళాయిల ద్వారా తాగు నీటిని సరఫరా చేయడమూ విశేషం. సురభి రాజా వారు ఆయుర్వేదం, సాహిత్యం, కళలు, టౌన్ ప్లానింగ్ అంశాలకు విశేష ప్రోత్సాహాన్ని అందించారు. కృష్ణా ఉపనదిపై లక్ష్మాసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం (నేడు కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం), సింగవట్నంలో లక్ష్మీనర్సింహ సాగర్ పేరుతో పెద్ద తటాకం నిర్మించారు. దీనినే ప్రస్తుతం ‘సింగవట్నం శ్రీవారి సముద్రం చెరువు’గా పిలుస్తారు. 
     జటప్రోలులో పునర్ నిర్మించిన మాధవ గోపాలస్వామి ఆలయాన్ని ఇప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. మూడు, నాలుగు వందల ఏళ్ల క్రితమే సైఫన్ పద్ధతిలో ఈ ప్రాంతంలో చెరువులు నిర్మించినట్లు తెలుస్తోంది. నాటి రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలకులు చూసేవారు. స్వాతంత్ర్యానికి పూర్వమే విమానంలో రావడానికి కొల్లాపూర్ జఫర్ మైదానాన్ని ఒక విమానాశ్ర యంగానూ వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. 
      నేటికీ అక్కడ స్థూపం ఆకారంలో నిలు రాతి స్తంభం ఒకటి ఉంది. పరిపాలనాధక్షుడైన లక్ష్మారావు అప్పట్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిపించేవారు. ఈ సందర్భంగా కవి పండితులను, మల్లయోధులను, శిల్పులను అభినందించేవారు. ధర్మకార్యాలు చేయడంలోను వారు ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబరిచారని ప్రజలు చెప్పుకుంటారు. 
సురభి రాజుల వారసులు
     రాజా సురభి వెంకటలక్ష్మారావుకు ఇద్దరు ఆడపిల్లలు. వెంకట రాజరాజేశ్వరిదేవి, వెంకట సరస్వతీదేవి. వారికి మగ సంతానం లేకపోవడంతో ఆయన అన్న బొబ్బిలి మహారాజు అయిన శ్రీ రావుశ్వేజా చలపతి కృష్ణారంగారావు మనుమడిని ఆరేళ్ల వయస్సులో దత్తత తీసుకొన్నారు. ఆ పిల్లాడికి మూడవ వెంకట జగన్నాథరావుగా నామకరణం చేశారు. చిన్నతనం నుంచి ఈ కుర్రాడికి ధైర్య సాహసాలు నూరిపోసి పెంచారాయన. ఆ బాలుడు మైనర్‌గా ఉండగానే వెంకటలక్ష్మారావు 1928లో కన్నుమూశారు. వారి వంశంలోని ఆఖరి సురభి రాజే ఆ జగన్నాథరావు. ఆయన హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో జూనియర్ కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్ కోర్సులను పూర్తి చేశారు. కాగా, వెంకటలక్ష్మారావు పరమపదించాక ఆయన ధర్మపత్ని రాణి రత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా సంస్థాన నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె కూడా భర్త అడుగుజాడల్లో పరిపాలన సాగించి అనేక సంస్కరణలు చేపట్టారని స్థానికులు చెబుతుంటారు. 
        అప్పట్లో రాజు స్థానికంగా ఉంటే కోటపైన తెల్లటి జెండా, గంట గంటకు సమయసూచికను చూస్తూ సిబ్బంది గంట కొడుతూ వచ్చే వారుట. సింగవట్నంలోని రత్నగిరి కొండపై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడే ఒక ‘పద్మ నిలయం’ అనే చక్కని బంగ్లాను తమ విడిది కోసం వారు నిర్మించారు. ఇక్కడే లక్ష్మినరసింహస్వామి ఆలయానికి, కొల్లాపూర్‌లోని బండయ్యగుట్ట వెంక ఆలయానికి గాలి గోపురాలను కూడా నిర్మింపజేశారు. 
      మైనార్టీ తీరిన జగన్నాథరావు 1943లో జటప్రోలు సంస్థానానికి రాజుగా పట్టాభిశిక్తులయ్యారు. వీరి హయాంలో చెప్పుకోదగ్గ సంస్కరణలు జరగకపోయినా పరిపాలన మాత్రం ప్రశాంతంగా జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన పరిపాలన కూడా స్వర్గీయ రాజా వెంకటలక్ష్మారావు అడుగు జాడల్లోనే కొనసాగింది. క్రూర జంతువులను వేటాడటంలో వీరు కూడా దిట్ట. పూర్వీకుల మాదిరే పండితులను, కళాకారులను ఆయనా సత్కరించారు.
ఆధునిక పదవులకు దూరంగా...
           ఇక, కొల్లాపూర్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఆయన్ను రాజకీయాల్లో ప్రభుత్వ ఉన్నత పదవుల్లోకి రావాలని పలువురు కోరారు. వారు దానిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్తారు. పలు సేవా, ఆధ్యాత్మిక రంగాలనే ఆయన ఎంచుకున్నారు. గుర్రపు స్వారీ అంటే ఆసక్తిగల రాజా వెంకట జగన్నాథరావు ‘భారత సేవక్ సమాజ్’కు అధ్యక్షుడిగా పనిచేశారు. తన భార్య రాణి ఇందిరాదేవి పేరున ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అవసరమైన భవనం కోసం ఏడెకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు, రెవెన్యూ, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి భవనాల్ని, పెంట్ల అవుట్ పోస్టు భవనాన్ని, ప్రస్తుత ఆర్‌ఐడీ హైస్కూల్‌కు భవనాలను ఆయన ఉచితంగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 
          1962లో 300 ఎకరాల తన సొంత భూమిని జటప్రోలు మాధవ గోపాలస్వామి, మల్లేశ్వరం, మల్లికార్జున స్వామి, జకేశ్వరాలయం, అమరేశ్వరస్వామి, రత్నలక్ష్మి అమ్మవారు, శ్రీలక్ష్మి నర్సింహ్మస్వామి ఆలయాలకు ఉచితంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాలకు వంశానుగత ధర్మకర్తగా వారు కొనసాగుతూ వచ్చారు. కాగా, 1980 జూన్ 22వ తేదీన అకస్మాతుగా ఆయన కన్ను మూశారు. 
        కాగా, రాజా జగన్నాథరావుకు ఇద్దరు సంతానం. వెంకటకుమార బాలాదిత్య లకా్ష్మరావు, రత్న సుధాబాల. కుమారుడు హైదరాబాద్‌లో వ్యాపారంలో స్థిరపడ్డారు. బాలాదిత్య లక్ష్మారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోదరి రత్న సుధాబాల కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం వెంకటకుమార్ బాలాధిత్య లక్ష్మారావు వంశపారంపర్యంగా వస్తున్న ఆలయాలకు ధర్మకర్తగా ఉంటూ కొల్లాపూర్‌లో కోట వ్యవహారాలను చూస్తున్నారు. 
కొల్లాపూర్ వెళ్లేదెలా? 
      మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కొల్లాపూర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, ఇది మన హైదరాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరం. కొల్లాపూర్ పట్టణం నడిబొడ్డులో సుమారు 10 ఎకరాల సువిశాల స్థలంలో సుందరంగా, కళాత్మకంగా సురభి రాజా సంస్థానాధీషులు తమ ప్యాలెస్‌లను నిర్మించారు. అయితే, ఎవరినైనా ముందు అనుమతి లేకుండా ప్యాలెస్‌లలోకి అనుమతించరు. సందర్శకులు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కళ్యాణ శుభవేళ...
         కొల్లాపూర్ సురభి సంస్థానాధీషుల ప్రస్తుత వారసుడైన సురభి వెంకట బాలాధిత్య తనయుడు సురభి వెంకట అనిరుద్ర జగన్నాథరావు వివాహ సందర్భంగా రాజా ప్యాలెస్‌లను సుందరంగా ముస్తాబు చేశారు. మే 11న హైదరాబాద్‌లో వీరి కళ్యాణం జరగ్గా, రాజభవనాలలో రిసెప్షన్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వచ్చే అతిథుల కోసం 32 రకాల వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, కొల్లాపూర్ ప్యాలెస్‌లో ఈనెల 16న ఉదయం 11 గంటలకు నూతన దంపతులచే నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం సందర్భంగా వచ్చే అతిథుల కోసం 16 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సురభి రాజా ప్యాలెస్ ఉద్యోగులు తెలిపారు.
హైదరాబాద్‌లో కల్యాణోత్సవం!
          రాజా సురభి వేంకట కుమారకృష్ణ బాలాదిత్య లకా్ష్మరావు, శ్రీమతి రాణి సురభి మాధవి దంపతుల ప్రథమ పుత్రుడు వేంకట అనిరుద్ధ జగన్నాథరావు వివాహం రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుడు, కేవీపీ సమీప బంధువు డాక్టర్ చెలికాని రామకృష్ణ, సంధ్యల ఏకైక కుమార్తె పద్మాసుభద్ర సుస్మిత అమృత వర్షిణితో మే 11న హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. కాగా, ఆనవాయితీ ప్రకారం ముందుగా మాల కుల దంపతులకు మే 4న కొల్లాపూర్ రాజా ప్యాలెస్‌లో కల్యాణోత్సవం కూడా జరిపారు. వారికి కావాల్సిన మాంగళ్యం, నూతన వస్త్రాల కోసం డబ్బులు ఇచ్చారు. 
        నాడు సురభి రాజుల తరపున ప్రాణత్యాగం చేసిన ముందే రేచీడ్ అనే మాల కులస్థుడి కోరిక మేరకు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ‘మా పెళ్లి ముందు జరిగాక ఆ తర్వాత మీ ఇంట్లో పెళ్లి జరగాలని’ ఆయన ఆదేశించిన మేరకు ఈ ఆనవాయితీ నాటి నుంచీ కొనసాగుతోంది. దీని ప్రకారం సురభి రాజా వంశస్థులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌కు చెందిన బి.శివుడు, చెన్నమ్మ దంపతులకు ఈనెల 4న వివాహం జరిగింది. వీరి కల్యాణోత్సవం ప్యాలెస్‌లోని షాదీమహల్‌లోనే నిర్వహించడం విశేషం. దంపతుల తలంబ్రాల బియ్యాన్ని హైద్రాబాద్‌లో జరిగే అనిరుద్ధ జగన్నాథరావు వివాహ తలంవూబాలతో కలిపి నిర్వహించడం ద్వారా రాజు కుటుంబీకులు తమ కృతజ్ఞతా ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. 
- నాగశేషయ్య సహకారంతో
మల్లు మధుసూదన్‌డ్డి, 
టీ మీడియా ప్రతినిధి, మహబూబ్‌నగర్

Saturday, 11 May 2013

తెలంగాణ కోసం పోరాడుతున్నది కేసీఆరే: కడియం


వరంగల్ : తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుదే అని టీడీపీని వీడిన కడియం శ్రీహరి అన్నారు. 12 ఏళ్లుగా తెలంగాణ కోసం నిర్విరామంగా పోరాడుతున్న వ్యక్తి ఒక్క కేసీఆర్ మాత్రమే అని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కేసీఆర్ ఢిల్లీ వరకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎప్పటికైనా ఆంధ్రా పార్టీలను వీడి బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. శనివారం ఉదయం టీడీపీకి కడియం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Wednesday, 8 May 2013

సౌర విద్యుత్తుకు ప్రోత్సాహకాలు

*  పైకప్పు యూనిట్లు, వ్యవసాయ పంపుసెట్లకు వర్తింపు 
* పైకప్పు యూనిట్ల నుంచి విద్యుత్తు ఇస్తే డబ్బులు 
* 30 శాతం రాయితీ ఇస్తున్న కేంద్రం 
దీనికి అదనంగా 20 శాతం ఇచ్చేందుకు ముందుకొస్తున్న
    సర్కారు 
సంక్షేమ హాస్టళ్లకు సౌర వెలుగులు 
* మంత్రివర్గ ఉపసంఘం ముందు ప్రతిపాదనలు                  
ఈనాడు - హైదరాబాద్‌:
 
ఇంటి పైకప్పుపై సౌర విద్యుదుత్పత్తిదారులు, సౌర విద్యుత్తు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడిలో 20 శాతం రాయితీగా భరించడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. కేంద్రం ఇచ్చే 30 శాతం రాయితీకి ఇది అదనం. అలానే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో సౌర వాటర్‌ హీటర్లు, వంటశాలలతోపాటు దీపాలు ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. మంగళవారం సౌర విద్యుత్తు విధానంపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా పై మూడు ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తు యూనిట్లు(రూఫ్‌టాప్‌) ఏర్పాటుచేసుకునేందుకు ప్రభుత్వం నెట్‌ మీటరింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్తుని సొంతానికి వాడుకోవడంతో పాటు గ్రిడ్‌(డిస్కంలకు) ఇవ్వడానికి అనుమతించింది. గ్రిడ్‌కి విద్యుత్తు ఇస్తే సగటు కొనుగోలు ధర(యూనిట్‌కి రూ.3.50 వరకు ఉండొచ్చు) ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలానే రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లు పెట్టుకుంటే అయ్యేవ్యయంలో 30 శాతం వరకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రాయితీగా చెల్లిస్తోంది. ఇలా 3 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్‌ యూనిట్లకు రాయితీ ఇస్తోంది. ప్రస్తుత విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో ఈ విధానాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 శాతం రాయితీ ఇచ్చే విషయాన్ని ఉపసంఘం చర్చించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. సౌర నీటి వేడి యంత్రాలు(సోలార్‌ వాటర్‌ హీటర్లు)కు కూడా కేంద్రం ఇచ్చే 30 శాతంతోపాటు రాష్ట్రప్రభుత్వం 20% రాయితీ ఇవ్వ డానికి ఉపసంఘం సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లకు 50%రాయితీ లభిస్తుంది.
సంక్షేమ హాస్టళ్లకు సౌర వెలుగులు:             రాష్ట్రవ్యాప్తంగా 5600 సంక్షేమ వసతి గృహాలు, దాదాపు 1000కిపైగా గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం సొంత భవనాలున్నాయి. వీటికి రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకొచ్చింది. సౌరవంట(సోలార్‌కుకింగ్‌), సౌర నీటి వేడి(సోలార్‌ వాటర్‌ హీటర్‌), సౌర విద్యుత్తు సరఫరా చేయాలనే ప్రతిపాదనకు ఉపసంఘంలో సానుకూలత వ్యక్తమైంది. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఏ మేరకు అమలు సాధ్యమవుతుందో వివరాలతో రావాలని రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌క్యాప్‌)ను ఆదేశించింది.
సౌర పంపుసెట్లకు ప్రోత్సాహం:
      వ్యవసాయానికి సౌర విద్యుత్తు పంపుసెట్లు పెట్టుకుంటే ప్రోత్సాహకం అందించడానికి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించనుంది. ఇందిర జలప్రభ కింద 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లకు సౌర విద్యుత్తు యూనిట్‌లను ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచి వంద శాతం రాయితీపై ఇవ్వడానికి ఉపసంఘం ప్రతిపాదించినట్లు మంత్రి ఆనం తెలిపారు. విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు కూడా వంద శాతం రాయితీపై సౌర విద్యుత్‌ యూనిట్లు ఇస్తామన్నారు. ఇతర రైతులకు కేంద్రం నుంచి 30 శాతం, రాష్ట్రం నుంచి 20 శాతం రాయితీతో యూనిట్లు ఇచ్చే విషయమై ఉపసంఘం చర్చించింది. రాష్ట్రంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లను త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి ఆనం మీడియాకు తెలిపారు. సగటు ధర కింద యూనిట్‌కి రూ.6.49 నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదేధరకు ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్‌ 4 వరకు కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అలానే క్యాప్టివ్‌ సౌర విద్యుత్తు యూనిట్ల కోసం 274 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ముందుకొచ్చాయనీ.. ఇందులో 19 మెగావాట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.

Monday, 6 May 2013

ప్రయోగాల సేద్యం!

వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న తెరాస అధినేత 
 తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి 
 'గ్రీన్‌హౌజ్‌' ద్వారా అధిక దిగుబడి 
ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఆలవాలం కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రం 
'ఈనాడు-ఈటీవీ'తో అనుభవాలు పంచుకున్న కేసీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌: 
         తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయ నేతగానే తెరాస అధినేత కేసీఆర్‌ మనకు తెలుసు. అయితే ఆయనలో మనకు తెలియని మరో పార్శ్యం కూడా దాగుంది. అదే.. సేద్యం చేసే రైతన్న రూపం. సాగు ఎందుకు లాభసాటిగా ఉండదన్న ఆలోచన ఆయనలో మొదలైంది. దీంతో వ్యవసాయ రంగంలో ఉన్న ఆధునిక పోకడలేమిటి? ఎలా చేస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చు అన్న చర్చను లేవదీశారు. సుమారు రెండేళ్ల క్రితం తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ క్షేత్రాలతో రూ.లక్షలు ఆర్జించే అవకాశం ఉందని ఆయన ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం శివారు వెంకటాపూర్‌ గ్రామంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రం ప్రయోగాలకు నెలవుగా మారింది. తన వ్యవసాయ క్షేత్ర విశేషాలను ఆయన 'ఈనాడు-ఈటీవీ'తో పంచుకున్నారు. ఈ విశేషాలు కేసీఆర్‌ మాటల్లోనే..
45 ఎకరాల క్షేత్రం.. 
     నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడు. రాజీనామా చేస్తే వచ్చిన సొమ్ముతో సుమారు 22 ఎకరాల భూమి కొన్నాడు. అక్కడే నేను కూడా కొంతభూమిని కొన్నా. ఇప్పుడు అక్కడ 45 ఎకరాలుంది. అక్కడ వ్యవసాయం చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నా. నీటి వసతి తక్కువగానే ఉంది. ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ అధిక దిగుబడి సాధించడంపై దృష్టిపెట్టాను. ప్రయోగాలు చేయాలంటే డబ్బు కావాలి. అందుకే మొట్టమొదట నేను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.42 లక్షల రుణం తీసుకున్నాను. ఈ డబ్బుతో మొదటి సంవత్సరం ఆనపకాయ, మిరప, పసుపు, ఆలుగడ్డలు పండించాను. తర్వాత క్యాప్సికం వేశాను. మంచి దిగుబడి వచ్చింది. ఏడాదిలోనే మేం బ్యాంక్‌ నుంచి తీసుకున్న అప్పును తీర్చగలిగా.గ్రీన్‌హౌజ్‌ విధానంతో అధికరాబడి
                        
                  

 వ్యవసాయోత్పత్తుల్లో అధిక దిగుబడి, మంచి నాణ్యత సాధించాలంటే ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. ఉత్పత్తి ఎంత ముఖ్యమో మార్కెట్‌ చేయడమూ అంతే ముఖ్యం. మార్కెట్‌ అవసరాలు తెలుసుకొని పంటలు వేస్తే లాభాలు వస్తాయి. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోగలిగితే ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు కూడా మంచి దిగుబడి సాధించగలరు. మనదేశంలో టమాటలు సాధారణంగా ఎకరానికి 20-30 టన్నులు మించి పండవు. అదే గ్రీన్‌హౌజ్‌ విధానంలో ఇజ్రాయెల్‌లో ఎకరానికి 200 టన్నులు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో దిగుబడి పెరగడంతోపాటు నాణ్యత కూడా ఉంటుంది. నేను మొదటి పంట అప్పు తీర్చిన తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి పది ఎకరాల్లో గ్రీన్‌హౌజ్‌ నిర్మాణానికి రూ.మూడున్నరకోట్లు రుణం తీసుకున్నా. గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటుకు ఒక్కొక్క ఎకరానికి రూ.28 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది ఒకేసారి పెట్టే ఖర్చుమాత్రమే. ప్రస్తుతం గ్రీన్‌హౌజ్‌లో బీన్స్‌ పంట వేశాను. ఎకరానికి సుమరు 40 టన్నుల మేర దిగుబడి ఉంటుంది. ఒక ఎకరానికి కనీసం 15 లక్షల ఆదాయం వస్తుంది. దీనికయ్యే ఖర్చు ఎకరానికి రూ.15 వేలకు మించదు. త్వరలో నా గ్రీన్‌హౌజ్‌లో 'చీవ్స్‌' అన్న రకాన్ని పండించాలని యోచిస్తున్నాను. దీన్ని ఎక్కువగా జర్మనీ దేశంలో ఉపయోగిస్తారు. 'చీవ్స్‌' పంట ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఒక టన్నుకు రూ.25 లక్షల వరకు ధర పలుకుతుంది. అంటే ఎకరానికి కనీసం రూ. రెండుకోట్లు వస్తాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. అయితే, మార్కెటింగ్‌ చేసుకునే నైపుణ్యాన్ని రైతులు పెంచుకోవాలి. నా వ్యక్తిగత సహాయకులను జర్మనీకి పంపించాలని నిర్ణయించాను. వారు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వస్తారు. దీనిపై ఇప్పటికే కొంత కసరత్తు చేశాం. ఇంటర్నెట్‌లో కావాల్సిన సమాచారం ఉంది. రైతులు ఇంటర్నెట్‌ ఉపయోగించుకోగలిగితే ఎంతో లబ్ధి పొందవచ్చు. మహారాష్ట్రలోని సాంగ్లి, పుణేల్లో రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను ఇప్పటికే అవలంబించి మంచి లాభాలు గడిస్తున్నారు. గ్రీన్‌హౌజ్‌లో కలర్‌ క్యాప్సికం పండించాలని కూడా యోచిస్తున్నాం. దుబాయ్‌లో ఒక కిలోకు రూ.115 వరకు పలుకుతుంది. మనం పండించి, ఎగుమతి చేయడానికి రూ.45 ఖర్చవుతుంది. ఖర్చులో కూడా ప్రభుత్వం నుంచి కొంత మొత్తం సబ్సిడీ వస్తుంది.
మనరాష్ట్రంలో అద్భుతమైన నేలలున్నాయి
          మన రాష్ట్రంలో పంటలు పండేందుకు అవసరమైన వాతావరణం, అద్భుతమైన నేలలున్నాయి. వీటిని ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన పంటలు వేయవచ్చు. దిగుబడి కూడా బాగుంటుంది. ఇప్పుడు సమాచార విప్లవంతో సమస్త సమాచారం రైతులు తెలుసుకునే వీలుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. గ్రీన్‌హౌజ్‌లో పంట పండిస్తే మొక్కకు ఎంత వరకు నీళ్లు అవసరమో అంతే అందుతుంది. నీటి వృథా ఉండదు. అలాగే, ఎరువులు కూడా నీటిలోనే కలిపి ఇస్తాం. పురుగు మందులను వాడే అవసరం రాదు. దీంతో ఇక్కడ పండే పంటతో ఆరోగ్యానికి హాని ఉండదు. ఈ విధానంలో అన్నిరకాల పంటలు, అన్ని కాలాల్లోనూ పండుతాయి.
గ్రీన్‌హౌజ్‌కు రాయితీ సదుపాయం.. 
        గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటుకు రూ.28 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి నీటి పంపింగ్‌ కోసం నెటాజెట్‌ అనే పరికరాన్ని కూడా గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటు చేసే కంపెనీ వాళ్లే సమకూరుస్తారు. నేను పది ఎకరాలకు రూ.మూడున్నరకోట్ల రుణం తీసుకున్నాను. ఈ రుణంలో రూ.90 లక్షలను 'నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు' సబ్సిడీగా ఇస్తామని చెప్పింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకుంటే రైతులకు భారం తగ్గుతుంది. పంట బాగా పండుతుంది. వచ్చే ఆదాయంతో ఒక్క ఏడాదిలోనే అప్పుమొత్తాన్ని తీర్చేయవచ్చు.
ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి 
           ''ఇజ్రాయెల్‌ను మన ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ రైతులకు సంబంధించిన భూములను ప్రభుత్వమే పూర్తిగా సర్వేచేస్తుంది. భూసార పరీక్షలు కూడా చేస్తుంది. ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వమే మార్గదర్శనం చేస్తుంది. ఆ మేరకు విత్తనాలు కూడా ఇస్తుంది. రైతు పంట పండించిన తర్వాత మార్కెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంది. మన దేశంలో వ్యవసాయ శాఖ అంటే కేవలం ఎక్స్‌టెన్షన్‌ యాక్టివిటికే పరిమితమైంది. దేశంలో వ్యవసాయ విస్తరణ పెరిగింది. కానీ, వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మీడియా కొంత వరకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తున్నా ఇది సరిపోదు. ప్రభుత్వం కృషిచేయాలి'' అని కేసీఆర్‌ వివరించారు.
మొదటి నుంచి వ్యవసాయంపై మక్కువ.. 
      తనకు వ్యవసాయంపై మక్కువ పెరగడానికి తన తండ్రి రాఘవరావు కారణమని కేసీఆర్‌ తెలిపారు. తన తండ్రి అభ్యుదయ రైతు అని, ఆయన వ్యవసాయంపై అనేక ప్రయోగాలు చేశారని 'ఈనాడు-ఈటీవీ'తో కేసీఆర్‌ చెప్పారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నపుడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో కూడా 20 ఎకరాల వ్యవసాయక్షేత్రాన్ని అభివృద్ది చేశానని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో అక్కడి క్షేత్రాన్ని అమ్మేయాల్సి వచ్చిందని వివరించారు.
సౌకర్యాల నిలయం.... వ్యవసాయక్షేత్రం
         కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ క్షేత్రంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో ప్రస్తుతం ఒక పెద్ద బావిని తవ్వుతున్నారు. ఇది వర్షపు నీటిని నిలువ చేయడానికి ఉపయోగపడడంతోపాటు వ్యవసాయక్షేత్రానికి అవసరమైన నీటిని తీసుకోవడానికి అనువుగా రూపొందిస్తున్నారు. కోళ్లు, గేదెలు, బాతులు, సీమకోళ్లు కూడా పెంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన సేంద్రీయ ఎరువులను ఇక్కడే తయారు చేస్తున్నారు. వర్మీ కంపోస్టు యూనిట్‌ కూడా ఉంది. ఇక్కడ పనిచేసే కూలీలకు ప్రత్యేకంగా నివాస సదూపాయం కల్పించారు. తనది ఫాం హౌజ్‌ కాదని.. ఫార్మర్‌ హౌజ్‌ అని కేసీఆర్‌ చెబుతున్నారు. కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రంలో కొంతమేరకు కాకర వేశారు. కాకర కూడా ఎకరానికి సుమారు 70 టన్నులు దిగుబడి వస్తోంది.

బయ్యారం ఉక్కు అంశం పై హెచ్ ఎం టి వి విశ్లేషణ...

బయ్యారం ఉక్కు అంశం పై హెచ్ ఎం టి వి విశ్లేషణ...: "బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు" అంశం పై హెచ్ ఎం టి వి చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారి అత్యద్బుత, సమగ్ర విశ్లేషణ...

బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు..!

బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు..!: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు కర్మాగారం సాధించుకున్న విషయం ఆంధ్ర పెత్తందారులు అప్పుడే మరిచి పోయినట్టున్నారు. కేజీ బేసిన్ గ్యాస్...

Friday, 3 May 2013

గ్యాస్‌కు ‘ఆధార్’కు లింకులేదు: పీవీ రమేష్

హైదరాబాద్: వంటగ్యాస్‌కు ఆధార్ కార్డుకు ఎలాంటి సంబంధంలేదని నగదు బదిలీ అమలు పథకం కార్యదర్శి పీవీ రమేష్ తెలిపారు. గ్యాస్ సబ్సీడీతోనే ‘ఆధార్’కు సంబంధం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆధార్ కార్డు వినియోగదారులకు ముందుగానే బ్యాంకు ఖాతో రూ.600 వందల సబ్సీడీ సొమ్మును డిపాజిట్ చేస్తామని, గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ అవుతుందని ఆయన వివరించారు. ఈనెల 15 నుంచి ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకంను అమలు చేస్తామని రమేష్ పేర్కొన్నారు. జూలై 1 నుంచి రెండో దశ నగదు బదిలీ పథకం చేపట్టనున్నట్టు తెలిపారు.