Tuesday, 14 May 2013

రాచరిక వైభవానికి ఆనవాలు కొల్లాపూర్!

                           


ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలిన సురభి రాజుల వారసులు ఇప్పుడు అపురూపమైన వివాహ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ కళ్యాణ కాంతుల వేళ వారి ఒకనాటి పాలనా వైభవాన్ని తెలిపే ప్రత్యేక కథనం.   
      
తెలంగాణలో పేరెన్నిక గన్న సంస్థానాలలో కొల్లాపూర్ ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీషుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి.  ఆలయాల  అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి తోడు వివిధ రంగాల కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీషులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు.
పిల్లలమర్రి భేతాళనాయుడే మూలపురుషుడు!
       క్రీ.శ.16వ శతాబ్దం నుంచి కొల్లాపూర్ ప్రాంతం నుంచి వీరి పరిపాలన ప్రారంభమైంది. క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వారి మూల పురుషుడైన పిల్లలమర్రి భేతాళనాయుడు సురభి వంశస్తులకే కాక వెంకటగిరి వెలుగోటి వారికి, మైలవరం సురపనేని వారికి, బొబ్బిలి పిఠాపురం రావు వారికి కూడా మూలపురుషుడే. 
          సురభి రాజ సంస్థానాధీషులు మొదట్లో జటప్రోలు సంస్థానంగా కొల్లాపూర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్‌ను సంస్థానంగా మార్చుకొన్నారు. పెంట్ల రాజధానిగా వారు పాలన సాగించారు. సురభి వంశస్తుల పూర్వీకులు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. వారు తొలుత జటవూపోలులో విశాలమైన ప్రాంతంలో పెద్ద కోటను నిర్మించుకున్నారు. నిజాం నవాబుకు సామంతులుగా పరిపాలన సాగించారు. ఇక్కడ సుమారు 600 సంవత్సరాల పాటు వారి పాలన సాగినట్లు పలు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

    కొల్లాపూర్‌ను రాజాధానిగా చేసుకొని పరిపాలించిన ఆ సంస్థానాధీషులు కాలక్రమంలో ఇదే కొల్లాపూర్‌ను సంస్థానంగానూ చేసుకొన్నారు. పెంట్ల రాజధానిగా అప్పట్లో వారు పరిపాలన కొనసాగించారు. అయితే, సమీపంలో ఉన్న కృష్ణానది జలాల తాకిడికి వారు నిర్మించిన కోట జలమయమైంది. మండు వేసవిలో మంచినీటికి సైతం ఇబ్బంది తలెత్తింది. దాంతో అప్పటి సంస్థానాధీషుడు సురభి రామారావు తన మకాంను పెంట్లవెల్లికి  మార్చారు. 
    స్వయంగా వ్యాకరణ తర్కపండితుడుగా అప్పట్లో ప్రసిద్ధుడైన మాధవరావు ఆనాటి కవి పండితులను ఎంతో ఆదరించడమేకాక సత్కరించినట్లు తెలుస్తోంది. ‘చంద్రికాపరిణయం’ పేర్న ఒక కావ్యాన్ని ఆయన రాశారు. వీరి అనంతరం గద్దె నెక్కిన రెండవ జగన్నాథరావు కొల్లాపూర్‌లో సువిశాలమైన కోటను నిర్మించి పాలన కొనసాగించారు. 
‘చంద్రమహల్’ నుంచి ‘షాదీ మహల్’ వరకూ!
       అది 1871వ సంవత్సరం. ఈ సమయంలోనే ఆయన కొల్లాపూర్ కోటలో భాగంగా ‘చంద్రమహల్’ అనే అందమైన భవనాన్ని నిర్మించాడు. తర్వాత తన మకాంను అందులోకి మార్చాడు. జగన్నాథరావు అనంతరం రాజా సురభి వెంకటలక్ష్మారావు 1887 మార్చి 6న సింహాసనం అధిష్టించినట్లు చెబుతారు. అయితే, ఈయన కాలంలోనే కొల్లాపూర్ సంస్థానం పరిపాలన పకడ్బందీగా సాగినట్లు వినికిడి. 
           నిజాం నవాబు నుంచి నిజాం నవాజ్ వంతు బహుద్దూర్ బిరుదు పొందిన రాజా వెంకటలక్ష్మారావు గురితప్పని గొప్ప వేటగాడుగా పేరు పొందారు. క్రూరమృగాలను సైతం వెంటాడి, వేటాడి చంపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1908లో పెద్ద తోటలో ‘సుందర మహాల్’ను నిర్మించినట్లు చెబుతారు. ‘చంద్రమహల్’కు పైభాగంలో 1961లో దర్బార్ హాల్, విజయమహల్, షాదీమహల్‌లను అన్ని హంగులతో నిర్మించి, సుందరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. 
రాచ పట్టణంగా కొల్లాపూర్:
        రాజా వెంకటలక్ష్మారావు హయాంలోనే రాచ పట్టణంగా వెలుగొందిన కొల్లాపూర్‌ను సుందరంగా తీర్చిదిద్దినట్లు చరిత్రకారులు చెబుతారు. ఆనాడే ప్రజలకు విద్యుత్ సరఫరాతోపాటు పబ్లిక్ కుళాయిల ద్వారా తాగు నీటిని సరఫరా చేయడమూ విశేషం. సురభి రాజా వారు ఆయుర్వేదం, సాహిత్యం, కళలు, టౌన్ ప్లానింగ్ అంశాలకు విశేష ప్రోత్సాహాన్ని అందించారు. కృష్ణా ఉపనదిపై లక్ష్మాసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం (నేడు కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం), సింగవట్నంలో లక్ష్మీనర్సింహ సాగర్ పేరుతో పెద్ద తటాకం నిర్మించారు. దీనినే ప్రస్తుతం ‘సింగవట్నం శ్రీవారి సముద్రం చెరువు’గా పిలుస్తారు. 
     జటప్రోలులో పునర్ నిర్మించిన మాధవ గోపాలస్వామి ఆలయాన్ని ఇప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. మూడు, నాలుగు వందల ఏళ్ల క్రితమే సైఫన్ పద్ధతిలో ఈ ప్రాంతంలో చెరువులు నిర్మించినట్లు తెలుస్తోంది. నాటి రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాలకులు చూసేవారు. స్వాతంత్ర్యానికి పూర్వమే విమానంలో రావడానికి కొల్లాపూర్ జఫర్ మైదానాన్ని ఒక విమానాశ్ర యంగానూ వినియోగించుకున్నట్లు కూడా తెలుస్తోంది. 
      నేటికీ అక్కడ స్థూపం ఆకారంలో నిలు రాతి స్తంభం ఒకటి ఉంది. పరిపాలనాధక్షుడైన లక్ష్మారావు అప్పట్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిపించేవారు. ఈ సందర్భంగా కవి పండితులను, మల్లయోధులను, శిల్పులను అభినందించేవారు. ధర్మకార్యాలు చేయడంలోను వారు ప్రత్యేక శ్రద్ధాసక్తులు కనబరిచారని ప్రజలు చెప్పుకుంటారు. 
సురభి రాజుల వారసులు
     రాజా సురభి వెంకటలక్ష్మారావుకు ఇద్దరు ఆడపిల్లలు. వెంకట రాజరాజేశ్వరిదేవి, వెంకట సరస్వతీదేవి. వారికి మగ సంతానం లేకపోవడంతో ఆయన అన్న బొబ్బిలి మహారాజు అయిన శ్రీ రావుశ్వేజా చలపతి కృష్ణారంగారావు మనుమడిని ఆరేళ్ల వయస్సులో దత్తత తీసుకొన్నారు. ఆ పిల్లాడికి మూడవ వెంకట జగన్నాథరావుగా నామకరణం చేశారు. చిన్నతనం నుంచి ఈ కుర్రాడికి ధైర్య సాహసాలు నూరిపోసి పెంచారాయన. ఆ బాలుడు మైనర్‌గా ఉండగానే వెంకటలక్ష్మారావు 1928లో కన్నుమూశారు. వారి వంశంలోని ఆఖరి సురభి రాజే ఆ జగన్నాథరావు. ఆయన హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో జూనియర్ కేంబ్రిడ్జ్, సీనియర్ కేంబ్రిడ్జ్ కోర్సులను పూర్తి చేశారు. కాగా, వెంకటలక్ష్మారావు పరమపదించాక ఆయన ధర్మపత్ని రాణి రత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా సంస్థాన నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె కూడా భర్త అడుగుజాడల్లో పరిపాలన సాగించి అనేక సంస్కరణలు చేపట్టారని స్థానికులు చెబుతుంటారు. 
        అప్పట్లో రాజు స్థానికంగా ఉంటే కోటపైన తెల్లటి జెండా, గంట గంటకు సమయసూచికను చూస్తూ సిబ్బంది గంట కొడుతూ వచ్చే వారుట. సింగవట్నంలోని రత్నగిరి కొండపై రత్నలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అక్కడే ఒక ‘పద్మ నిలయం’ అనే చక్కని బంగ్లాను తమ విడిది కోసం వారు నిర్మించారు. ఇక్కడే లక్ష్మినరసింహస్వామి ఆలయానికి, కొల్లాపూర్‌లోని బండయ్యగుట్ట వెంక ఆలయానికి గాలి గోపురాలను కూడా నిర్మింపజేశారు. 
      మైనార్టీ తీరిన జగన్నాథరావు 1943లో జటప్రోలు సంస్థానానికి రాజుగా పట్టాభిశిక్తులయ్యారు. వీరి హయాంలో చెప్పుకోదగ్గ సంస్కరణలు జరగకపోయినా పరిపాలన మాత్రం ప్రశాంతంగా జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన పరిపాలన కూడా స్వర్గీయ రాజా వెంకటలక్ష్మారావు అడుగు జాడల్లోనే కొనసాగింది. క్రూర జంతువులను వేటాడటంలో వీరు కూడా దిట్ట. పూర్వీకుల మాదిరే పండితులను, కళాకారులను ఆయనా సత్కరించారు.
ఆధునిక పదవులకు దూరంగా...
           ఇక, కొల్లాపూర్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఆయన్ను రాజకీయాల్లో ప్రభుత్వ ఉన్నత పదవుల్లోకి రావాలని పలువురు కోరారు. వారు దానిని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్తారు. పలు సేవా, ఆధ్యాత్మిక రంగాలనే ఆయన ఎంచుకున్నారు. గుర్రపు స్వారీ అంటే ఆసక్తిగల రాజా వెంకట జగన్నాథరావు ‘భారత సేవక్ సమాజ్’కు అధ్యక్షుడిగా పనిచేశారు. తన భార్య రాణి ఇందిరాదేవి పేరున ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అవసరమైన భవనం కోసం ఏడెకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. మున్సిఫ్ కోర్టు, సబ్ జైలు, రెవెన్యూ, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి భవనాల్ని, పెంట్ల అవుట్ పోస్టు భవనాన్ని, ప్రస్తుత ఆర్‌ఐడీ హైస్కూల్‌కు భవనాలను ఆయన ఉచితంగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 
          1962లో 300 ఎకరాల తన సొంత భూమిని జటప్రోలు మాధవ గోపాలస్వామి, మల్లేశ్వరం, మల్లికార్జున స్వామి, జకేశ్వరాలయం, అమరేశ్వరస్వామి, రత్నలక్ష్మి అమ్మవారు, శ్రీలక్ష్మి నర్సింహ్మస్వామి ఆలయాలకు ఉచితంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాలకు వంశానుగత ధర్మకర్తగా వారు కొనసాగుతూ వచ్చారు. కాగా, 1980 జూన్ 22వ తేదీన అకస్మాతుగా ఆయన కన్ను మూశారు. 
        కాగా, రాజా జగన్నాథరావుకు ఇద్దరు సంతానం. వెంకటకుమార బాలాదిత్య లకా్ష్మరావు, రత్న సుధాబాల. కుమారుడు హైదరాబాద్‌లో వ్యాపారంలో స్థిరపడ్డారు. బాలాదిత్య లక్ష్మారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సోదరి రత్న సుధాబాల కూడా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం వెంకటకుమార్ బాలాధిత్య లక్ష్మారావు వంశపారంపర్యంగా వస్తున్న ఆలయాలకు ధర్మకర్తగా ఉంటూ కొల్లాపూర్‌లో కోట వ్యవహారాలను చూస్తున్నారు. 
కొల్లాపూర్ వెళ్లేదెలా? 
      మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కొల్లాపూర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా, ఇది మన హైదరాబాద్‌కు సుమారు 185 కిలోమీటర్ల దూరం. కొల్లాపూర్ పట్టణం నడిబొడ్డులో సుమారు 10 ఎకరాల సువిశాల స్థలంలో సుందరంగా, కళాత్మకంగా సురభి రాజా సంస్థానాధీషులు తమ ప్యాలెస్‌లను నిర్మించారు. అయితే, ఎవరినైనా ముందు అనుమతి లేకుండా ప్యాలెస్‌లలోకి అనుమతించరు. సందర్శకులు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కళ్యాణ శుభవేళ...
         కొల్లాపూర్ సురభి సంస్థానాధీషుల ప్రస్తుత వారసుడైన సురభి వెంకట బాలాధిత్య తనయుడు సురభి వెంకట అనిరుద్ర జగన్నాథరావు వివాహ సందర్భంగా రాజా ప్యాలెస్‌లను సుందరంగా ముస్తాబు చేశారు. మే 11న హైదరాబాద్‌లో వీరి కళ్యాణం జరగ్గా, రాజభవనాలలో రిసెప్షన్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వచ్చే అతిథుల కోసం 32 రకాల వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, కొల్లాపూర్ ప్యాలెస్‌లో ఈనెల 16న ఉదయం 11 గంటలకు నూతన దంపతులచే నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం సందర్భంగా వచ్చే అతిథుల కోసం 16 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సురభి రాజా ప్యాలెస్ ఉద్యోగులు తెలిపారు.
హైదరాబాద్‌లో కల్యాణోత్సవం!
          రాజా సురభి వేంకట కుమారకృష్ణ బాలాదిత్య లకా్ష్మరావు, శ్రీమతి రాణి సురభి మాధవి దంపతుల ప్రథమ పుత్రుడు వేంకట అనిరుద్ధ జగన్నాథరావు వివాహం రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుడు, కేవీపీ సమీప బంధువు డాక్టర్ చెలికాని రామకృష్ణ, సంధ్యల ఏకైక కుమార్తె పద్మాసుభద్ర సుస్మిత అమృత వర్షిణితో మే 11న హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. కాగా, ఆనవాయితీ ప్రకారం ముందుగా మాల కుల దంపతులకు మే 4న కొల్లాపూర్ రాజా ప్యాలెస్‌లో కల్యాణోత్సవం కూడా జరిపారు. వారికి కావాల్సిన మాంగళ్యం, నూతన వస్త్రాల కోసం డబ్బులు ఇచ్చారు. 
        నాడు సురభి రాజుల తరపున ప్రాణత్యాగం చేసిన ముందే రేచీడ్ అనే మాల కులస్థుడి కోరిక మేరకు ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ‘మా పెళ్లి ముందు జరిగాక ఆ తర్వాత మీ ఇంట్లో పెళ్లి జరగాలని’ ఆయన ఆదేశించిన మేరకు ఈ ఆనవాయితీ నాటి నుంచీ కొనసాగుతోంది. దీని ప్రకారం సురభి రాజా వంశస్థులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లాపూర్‌కు చెందిన బి.శివుడు, చెన్నమ్మ దంపతులకు ఈనెల 4న వివాహం జరిగింది. వీరి కల్యాణోత్సవం ప్యాలెస్‌లోని షాదీమహల్‌లోనే నిర్వహించడం విశేషం. దంపతుల తలంబ్రాల బియ్యాన్ని హైద్రాబాద్‌లో జరిగే అనిరుద్ధ జగన్నాథరావు వివాహ తలంవూబాలతో కలిపి నిర్వహించడం ద్వారా రాజు కుటుంబీకులు తమ కృతజ్ఞతా ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. 
- నాగశేషయ్య సహకారంతో
మల్లు మధుసూదన్‌డ్డి, 
టీ మీడియా ప్రతినిధి, మహబూబ్‌నగర్

No comments:

Post a Comment