Monday 27 May 2013

తెలంగాణ విహారస్థలాలు

   స్థూలంగా చెప్పాలంటే పర్యాటకం రెండు రకాలు...
* వారసత్వ కట్టడాలు (హెరి టూరిజం),
* పర్యావరణ పర్యాటకం (ఎకో టూరిజం).
     ఈ రెండు రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. యావత్ తెలుగుదేశాన్ని పాలించిన రాజవంశాలన్నింటికీ తెలంగాణే పుట్టినిల్లు కావడంతో వారు కట్టించిన కోట గోడలు, దేవాలయాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ భౌగోళికంగానూ పీఠభూమి కావడంతో గుట్టలు, లోయలు, వాటి మధ్య పారే నదీ నదాలు, వాగులు వంకలతో తద్వారా ఏర్పాటైన చెరువులతో, పచ్చని అడవులతో పర్యావరణ పర్యాటకానికి కూడా అనువుగా ఉంది. ఒక్క సమువూదతీర పర్యాటకం (బీచ్ టూరిజం) తప్ప అన్ని రకాల పర్యాటక స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో సముద్రం లేదని తెలంగాణ రాజులు, ప్రత్యేకించి కాకతీయులు పెద్ద చెరువులను నిర్మించి వాటికి ‘సముద్రాల’నే పేర్లు పెట్టారు.ఈ విధంగా అన్ని రకాల పర్యాటక విశేషాలకు ఆలవాలమైన తెలంగాణను పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు వీలున్నప్పుడల్లా పరిచయం చేయవలసిందే. ఆయా స్థలాలకు వెళ్లేలా ప్రోత్సహించవలసిందే. తద్వారా వచ్చే ఆదాయంతో పర్యాటక స్థలాలలోని స్థానికులూ ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని ఆర్థికంగానూ ఎదుగుతారు. అంతేకాదు, సమాచార సాంకేతికత (ఐ.టి) పరిక్షిశమ తరువాత ఆర్థికాభివృద్ధికి దోహదపడే పరిక్షిశమ పర్యాటక రంగానిదే కాబట్టి, తెలంగాణ పర్యాటకాన్ని పరిచయం చేసుకొని, దర్శించి, తెలంగాణ ప్రజలు తమ వారసత్వ సంపదపట్ల సగర్వం పెంచుకోవాలని, వాటిని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేయాలన్నదే మన ఆకాంక్ష. కాగా, ఎండాకాలంలో కావలసినవి నీడ, నీళ్ళు. కాబట్టి వాటిని ఇచ్చే అడవులు, నదుల ప్రాంతాల్లోని పర్యావరణ, పర్యాటక స్థలాలను సంక్షిప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. గమనించగలరు. 
హైదరాబాద్ - కుంతాల మార్గంలో సందర్శించాల్సినవి...
            హైదరాబాద్ నుంచి తూప్రాన్, రామాయంపేటల మీదుగా 110 కిలోమీటర్లు ప్రయాణించి మెదక్ చేరుకోవచ్చు. మెదక్‌లో సుమారు వందేళ్ళ కిందట (1914లో) పోస్నేట్ అనే క్రైస్తవ సన్యాసి కట్టించిన 173 అడుగుల ఎత్తైన చర్చి ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దది (వాటికన్ చర్చి తర్వాత). ఇందులో ఒకేసారి 5000 మంది ప్రార్థనలు చేయవచ్చు. బయట నుంచి వచ్చే వెలుతురును ప్రతిఫంపజేస్తూ చర్చి లోపలున్న జీసస్ తదితర పేయింటింగ్స్ రంగులతో మెరిసిపోతూ మనల్ని మురిపిస్తాయి. ఈ చర్చి ఎదురుగా కిలోమీటరు దూరంలోనే మెదక్ దుర్గం కోట గోడలు కన్పిస్తాయి. యాత్రికులు ఎక్కి ఆనందించవలసినవి అవి.అలాగే, మెదక్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మంజీరా నది ఏడు పాయలుగా చీలి పారుతుంది. వాటి మధ్య అమ్మవారి దేవాలయం కొండగుహలో ఉంది. ఈ ఏడుపాయల్లో స్నానం చేసి ఆలయం చుట్టూ గుహలో ప్రదక్షిణ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఆలయానికి ఎదురుగా ఫర్లాంగు దూరంలో కట్టిన చెక్‌డ్యామ్ పైనుంచి దూకే నీళ్ళు చిన్న జలపాతం లాగా ఏర్పడతాయి. వాటిలో చెంగు చెంగున ఎదుక్కుతున్న వేలాది చేపలు మనకు నయనానందాన్ని కలిగిస్తాయి.మెదక్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే 1922లో కట్టిన పోచారం ప్రాజెక్టు ఉంది. దీనిమీది నుంచి దూకే చిన్న జలపాతం లాంటి మత్తడి నీళ్ళలో కేరింతలు కొడుతూ స్నానం చేయవచ్చు. అప్పుడు నిజాం కట్టించిన గెస్ట్‌హౌజ్‌ను, పెట్టించిన బోటు సౌకర్యాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. పర్యాటకులను ప్రాజెక్ట్ నీటి మధ్యలో ఉన్న ద్వీపం (ఐలాండ్) వరకు తీసుకెళ్ళి పక్షుల దర్శనం చేయించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ప్రాజెక్ట్ నీళ్ళు పక్కనే ఉన్న వన్య ప్రాణుల ఉద్యానవనం (వైల్డ్ లైఫ్ పార్క్)లోకి కూడా చొరబడతాయి. ఈ ఉద్యానవనంలో సొంత వాహనంలో వెళ్ళి, అందులో స్వేచ్ఛగా తిరిగే లేళ్ళు, ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు తదితర జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది.
               పోచారం నుంచి గోపాల్‌పేట్ మీదుగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి నిజాంసాగర్ ప్రాజెక్టు అంచున ఉన్న ‘త్రిలింగ రామేశ్వరాలయాన్ని’ దర్శించవచ్చు. దీన్ని సుమారు 1100 సంవత్సరాల కిందట వేములవాడ చాళుక్య రాజులు కట్టించినట్లు, వారి రాజలాంఛనమైన ‘విజృంభించే సింహ శిల్పం’ నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక్కడికి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఎల్లాడ్డి ఉంటుంది. అక్కడా చారివూతక గుళ్ళున్నాయి. అక్కడ్నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో నిజాంసాగర్ డ్యాం ఉంది. డ్యామ్ కట్టమీద నడుస్తూ నిండుగ ఉన్న ఆ నీటి సౌందర్యాన్ని చూడవచ్చు. చివరన కనిపించే ఆనాటి రెండంతస్థుల గోల్ బంగ్లాను, స్విమ్మింగ్ ఫూల్‌ను చూడవచ్చు. డ్యాం ప్రారంభంలో ఉన్న గెస్ట్ హౌజ్ నుంచి మర బోట్లలో అల్లంత దూరంలోని విద్యుత్ ప్లాంట్ వరకు విహారం చేయవచ్చు. డ్యాం కింద వర్షాకాలంలో నురగలు కక్కుతూ దూకే నీటి సౌందర్యాన్ని చూసి తీరాలి. డ్యాం కింద సహజంగా ఏర్పడిన విశాలమైన ‘నదీ ద్వీపం’ (రివర్ ఐలాండ్) మీద పూర్వపు నిజాం రాజు ఏర్పాటు చేసినట్లు గార్డెన్స్, పండ్ల తోటలను ఏర్పాటు చేస్తే మైసూర్ కృష్ణరాజసాగర్ డ్యాంను నిజాంసాగర్ డ్యాం తలదన్నుతుంది.కామాడ్డికి దగ్గర్లో ఉన్న తాడ్వాయి గుడి చూసి, అక్కడ్నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంతాయిపేట శివార్లలో పారుతున్న భీమేశ్వర వాగు మధ్యలో కట్టిన వేయేళ్ళనాటి భీమేశ్వర క్షేత్రాన్ని, దాని మీదుగా కట్టిన చెక్ డ్యాం పైనుంచి పడుతున్న నీటి సౌందర్యాన్ని డ్యాం నీళ్ళలో సాయం సంధ్యా సమయంలో ప్రతిఫలిస్తున్న పొద్దు గుంకుతున్న సూర్యబింబం సౌందర్యాన్ని చూస్తే గాని ‘జీవితం తరించదు’ అన్పిస్తుంది.
        కామారెడ్డి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధమైన ఇస్సన్నపల్లి వీరభద్రాలయాన్ని దర్శించుకొని తూంపల్లి-చిమన్‌పల్లి మీదుగా అందమైన అడవులు, లోయలు, వాగు వంకల గుండా ప్రయాణించి హుస్సేన్‌నగర్ సమీపంలో గుట్టల మధ్యలో నెలకొన్న లొంక రామలింగేశ్వరాలయాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడి ప్రకృతి కాశ్మీర్‌ను తలపిస్తుంది.ఆదిలాబాద్‌లోకి ప్రవేశించగానే మనల్ని పలకరించేది సోన్‌పేట. చిన్నదైనా చిత్రమైన కోట అది. దానికి పది కిలోమీటర్ల దూరంలోనే నిర్మల్ కోటగోడలు, బురుజులు కన్పిస్తాయి. నిర్మల్ నుంచి భైంసా రూట్‌లో 12 కిలోమీటర్లు ప్రయాణించి దిలావర్‌పూర్ మీదుగా ‘కదిలె’ చేరుకోవచ్చు. ఇక్కడ చుట్టూ గుమిగూడిన గుట్టల మధ్య లోయలో ఊరుతున్న ఏరు గట్టున చారిత్రక పాపన్న గుడి ఉంది. అందులో శివలింగం కదులుతుంది. దాని కింద ఉబికే ఊటల ధాటికి ఇక్కడున్న సప్తగుండాలు ‘సంతానాన్నిచ్చే నీటిని కలిగి ఉన్నాయని’ భక్తులు విశ్వసిస్తారు. జలజలా పారుతున్న ఏరు మధ్యలో ఏపుగా పెరిగిన చెట్ల సౌందర్యాన్ని చూస్తూ ఏరులోనే ట్రెక్కింగ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది. ఇక్కడి 18 చెట్ల మహావృక్షం కూడా మనలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. దిలావర్‌పూర్ నుంచి భైంసా మీదుగా వెళితే గోదావరి ఒడ్డున నెలకొన్న బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. చాలామంది ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. గోదావరిలో బోటు విహారం చేయవచ్చు. సమీప ప్రాంతాల్లో ఉన్న శిథిల బౌద్ధ, జైన స్థూపాలను ఆసక్తి గలవారు దర్శించవచ్చు.
           నిర్మల్ నుంచి ఉత్తరంగా సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే నేరేడిగొండ వస్తుంది. ఇక్కడ 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో 5 జలపాతాలున్నాయి. నేరేడిగొండ టోల్‌గేట్ రావడానికి ముందు కుడివైపున రోడ్ పక్కనే ఒక చిన్న జలపాతముంది. నేరేడిగొండ నుంచి ఎడమ వైపున పది కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతముంది. దానికింద స్నానం చేయవచ్చు. ముప్పైవేల సంవత్సరాల ముందు కూడా ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారని తెలిపే వారి ఆయుధాలు, పనిముట్లు ఇక్కడ దొరికాయి. పొచ్చెరకు మరికొంచెం దూరంలో ఘన్‌పూర్ గ్రామ పరిధిలో బుంగనాల అనే మరో జలపాతముంది. నేరేడిగొండకు కుడివైపున సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే పెద్దదిగా పేరుమోసిన కుంతల జలపాతముంది. మూడు దఫాలుగా దూకే దాని సౌందర్యం ఎంతటిదో దానికి సమాంతరంగా సాగుతున్న గుట్టల మధ్య లోయ సౌందర్యమూ అంతటిదే. ఇక్కడ 8 దశాబ్దాల నాటి గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తవి కడుతున్నారు. నేరేడిగొండ దాటి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగానే రోడ్‌కు ఎడమవైపున కోరటికల అనే మరో చిన్న జలపాతం కన్పిస్తుంది.నేరేడిగొండ నుంచి ఇచ్చోడ వైపు సాగి కొంచెం ముందు నుంచే కుడివైపుకు సుమారు పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే సిరిచెల్మ చేరుకోవచ్చు. ఇక్కడ అడవుల మధ్యనున్న చెరువు మధ్యలో హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు అనేకం ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి, చారిత్రక ప్రాధాన్యానికి నెలవు ఈ సిరిచెల్మ.
హైదరాబాద్ - కాళేశ్వరం మార్గంలో...    
 
                              

 హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్గంలో 70 కిలోమీటర్లు ప్రయాణించగా వచ్చే కుకునూరుపల్లి నుండి కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనంతసాగర్ అనే గ్రామాన్ని చేరుకోవచ్చు. తెలంగాణలోనే ఎక్కువ సరస్వతీ ఆలయాలున్నాయనడానికి ఈ గ్రామ సరస్వతీ దేవాలయం ఒక నిదర్శనం. ఈ ఆలయం సమీపంలో రెండు నీటిదొనలున్నాయి. ఒకటి రాగిదొన. రెండవది పాలదొన. రాగిదొనలో నీళ్ళు ఎర్రగా ఉంటాయి. పాల దొనలోని నీళ్లు తెల్లగా ఉంటాయి. ఈ దొనలు ఆ రెండు కాలాల్లో కూడా ఎండిపోక పోవడం ఇక్కడి ప్రత్యేకత.కుకునూరుపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేటలో కోటిలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడొక డ్యాం ఉంది. ఆలయంలో పెద్దలు ఆధ్యాత్మికంగా ఆనందిస్తే... పిల్లలేమో బోటింగ్ చేసి ఆనందించవచ్చు. సిద్దిపేట నుంచి కరీంనగర్, పెద్దపెల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మంథని చేరుకోవచ్చు. మంథని తెలంగాణలో అనాదిగా బ్రాహ్మణ పండితులకు, వైదిక సంస్కృతికి కేంద్రంగా భాసిల్లుతూ వస్తున్నది. ఇక్కడ ఎన్నో చారివూతక ఆలయాలున్నాయి. గోదావరి తీరాన ఉన్న శిథిల త్రికూటాలయం వాస్తు శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ తూర్పు నుంచి ఉత్తరం వైపుకు, మళ్ళీ తూర్పు వైపుకు తిరుగుతూ హొయలు పోతున్న గోదావరి సౌందర్యం చూసి తీరవలసిందే.
          ఇక్కడ్నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తే మనకు మొదట కన్పించేది శివ్వారం. ఈ గ్రామంలో ఆటో తీసుకుని లేదా ఎవరినైనా తోడు తీసుకొని ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఎర్రచెరువు మీదుగా పచ్చని కొండల మీదుగా ‘లంజమడుగు’ చేరుకోవచ్చు. లంజమడుగు ముఖ్యంగా మూడు అంశాలకు ప్రసిద్ధి. ఒకటి: ఇది రాష్ట్రంలోనే అరుదైన అందమైన మొసళ్ళ పెంపక కేంద్రం. రెండు: ఇక్కడి ప్రదేశం తెలంగాణలో పారే గోదావరి నదీ సౌందర్యానికి పరాకాష్ట. అది ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో అనేక మలుపులు తిరుగుతూ అడ్డువచ్చిన అడవులు-గుట్టలను చీల్చుకొని పారుతూ, అంతు తెలియని అందమైన పెద్ద మడుగును ఏర్పరచింది. మూడు: తెలంగాణలో గుహలో తొలిచి నిర్మించిన ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.లంజమడుగు ప్రాంతం కేరళలోని సముద్ర పర్యాటక స్థలాలను తలదన్నేలా ఉంటుంది. విశాలమైన ఈ మడుగు సమువూదాన్ని లేదా బ్యాక్ వాటర్‌ను పోలి ఉండగా దాని తీరపు ఇసుక తిన్నెలు బీచ్‌లను మరిపిస్తాయి. మడుగు మరో తీరం చెక్కినట్లున్న ఎత్తైన కొండలు, లోయలు, పచ్చని ఎత్తైన అడవులతో ఎనలేని ఆనందాన్నిస్తుంది. వీటన్నింటి ఆనందాన్ని ఈ మడుగులో స్థానిక జాలర్ల బోట్లలో విహరిస్తూ ఆస్వాదించవచ్చు. మనం విహరించే బోట్ల కింద మొసళ్ళూ విహరిస్తుంటాయి. మడుగు ఒడ్డు ఒకచోట మూడు వందల అడుగుల ఎత్తు నిటారుగా ఉంటుంది. దాని అంచునే స్థానికులు ‘లంజగుళ్ళు’ అని పిలుస్తోన్న రెండు గుహాలయాల సముదాయాలున్నాయి. అవి తమ నీడలను కింద ఉన్న గోదావరి నీళ్ళల్లో ప్రతిబింబిస్తూ అందంలో అజంతా గుహలను తలదన్నుతాయి. వీటికి ఎడమ వైపున ఫర్లాంగు దూరంలో మరో గుహాలయాల సముదాయముంది. వాటి పేరు కోమటి గుళ్ళు. గోమఠేశ్వరుడు అనే జైనమత దేవుని భక్తులై కోమట్లు అని పిలువబడిన వారిలో సుమారు ఎనిమిదవ శతాబ్దం ప్రాంతంలో ప్రబలిన వేశ్యాలోలత్వం కారణంగా వారు కట్టించిన గుళ్ళను ‘లంజగుళ్ళు’ అని, ‘కోమటిగుళ్ళు’ అని పిలుస్తున్నారు. ఇది తెలియని వారు స్థానికంగా వేశ్యాతనం చేసిన రాణి కథను కూడా విన్పిస్తుంటారు.మంథని నుంచి సుమారు 50 కిలోమీటర్లు కాళేశ్వరం వరకు పచ్చని కొండలు, కోనల గుండా ప్రయాణించడమే ఆహ్లాదకరమైన అనుభూతిని మిగులుస్తుంది. కాళేశ్వరం గోదావరి-వూపాణహిత నదుల సంగమ ప్రదేశంలో ఉన్నదే త్రిలింగ క్షేత్రం. ఇక్కడి ప్రధానాలయంలో ఒకే పానవట్టంపై ముక్తేశ్వర, కాళేశ్వర పేర్న రెండు శివలింగాలున్నాయి. ముక్తేశ్వర లింగం మీద పోసిన అభిషేక జలం దాని మధ్యలో ఉన్న రంధ్రం గుండా గోదావరి - ప్రాణహిత నదుల్లోకి పారి ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం చేస్తుంది. ఈ క్షేత్రం ఇంకా ఎన్నో ప్రాచీన ఆలయాలు, వాస్తు శిల్ప సౌందర్యాలతో అలరారుతోంది. 
హైదరాబాద్ - మల్లూరు మార్గంలో...
           హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఏటూరు నాగారం, మల్లూరు ప్రయాణించే రూటులో సుమారు 80 కిలోమీటర్లు దాటాక ఆలేరు నుంచి ఎడమ వైపున వచ్చే కొలనుపాకలో అద్భుతమైన వాస్తు శిల్పాలతో ఒప్పారుతున్న చారివూతక జైన దేవాలయాలను, సోమేశ్వరాలయం తదితర హిందూ దేవాలయాలను కళా పిపాసకులు చూసి తీరవలసిందే. ఆలేరుకు 120 కిలోమీటర్ల దూరంలోని రామప్ప దేవాలయాలు తెలంగాణలో హిందూ వాస్తు శిల్ప సౌందర్యాలకు పరాకాష్టగా నిలుస్తాయి. వాటిని చూసి సమీపంలోనే ఉన్న విశాలమైన రామప్ప చెరువులో బోటు విహారం చేయవచ్చు. రామప్పకు కుడివైపున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం చెరువు కొండలు, అడవుల్లో చిక్కుకుని మరీ అందంగా కన్పిస్తుంది. నీళ్ళ మధ్య ద్వీపాలలాగా ఏర్పడిన ఆ పచ్చని కొండలు నాలుగింటి మీదికి ఊగే తాళ్ళ వంతెనలు ఏర్పాటు చేశారు. వాటి మీద నడుస్తూ ఒక ద్వీపానికి చేరుకొని అక్కడున్న పర్యాటక శాఖ రెస్టాంట్‌లో భోజనం చేసి, వీలైతే అక్కడే ఉన్న కాటేజీల్లో (వసతి గృహాల్లో) ఒకరోజు బసచేయవచ్చు. అడవులు, నీళ్ళ మీదుగా వచ్చే చల్లగాలులను ఆస్వాదిస్తూ అక్కడ గడపడం ఒక మరిచిపోలేని మధురానుభూతిని మిగులుస్తుంది. చెరువు నీళ్ళలో స్నానం చేయవచ్చు, బోట్లలో విహరించవచ్చు. లక్నవరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరు నాగారం నుండి అందమైన అటవీ మార్గంలో మంగపేట మీదుగా మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి మల్లూరు చేరుకోవచ్చు. చల్లని గోదావరి నదీ తీరాన పచ్చని కొండకోనల మధ్య వెలసిన నరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికానందానికి, ప్రకృతి సౌందర్యానికి నెలవు. స్వామి పొట్టలో వేలుపెడితే అది రక్తపు వాసన రావడం ఇక్కడి ప్రత్యేకత. పురాతన కాలంలో ఒక గిరిజనుడు చూడక స్వామి పొట్టలో గునపం దింపాడట. అందుకే రక్తం ఇంకా కారుతూనే ఉందంటారు.
హైదరాబాద్ - పాపికొండలు మార్గంలో...
           హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో సూర్యాపేటకు ముందు పిల్లలమర్రి వస్తుంది. ఈ గ్రామం 800 ఏళ్ళ కిందట కాకతీయుల సామంతులైన రేచర్ల రాజులకు రాజధాని. కాబట్టి, ఇక్కడ కోట గోడలుండేవి. ఇప్పుడు అవి లేవు. కాని, వాటి మధ్య ఆ రాజ వంశీకులు కట్టించిన ఎరకేశ్వర, నామేశ్వర దేవాలయ సమూహాలున్నాయి. ఇందులో ప్రధాన దేవాలయ స్తంభాలకు, వాటిమీది దూలాలకు చెక్కిన నల్లరాతి శిల్పాలు అతి సుందరమైనవి. అంతరాళం, మంటపం మధ్యనున్న రెండు శిలా దూలాలపై చిత్రించిన రామ-రావణ యుద్ధం, క్షీరసాగర మథనం చిత్రాలు (పెయింటింగ్స్) తెలంగాణలో ఆ తరహావి అవి రెండే ఇప్పటి వరకు నిలిచి ఉన్నవి. ఇదే గ్రామంలో చాలా ఎత్తైన పీఠం మీద అదే కాలపు దేవాలయం మరొకటుంది.భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాకుండా సహజ సౌందర్యానికి నిలయమైన ప్రాంతం కూడా. ఉత్తరం నుండి వస్తున్న గోదావరి ఇక్కడ భద్రగిరి రాయాలయం చుట్టూ తిరిగి మళ్ళీ తూర్పు దిశకు ప్రవహిస్తుంది. ఇక్కడ నదీ స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకోవచ్చు. భద్రగిరికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో వచ్చే మోతెగడ్డ గ్రామ సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఒక ద్వీపకొండపైన వీరభద్ర స్వామి క్షేత్రముంది. నీటిమధ్య కొండ క్షేత్రంపై నిల్చుని చుట్టూ ఉన్న పరిసరాల సౌందర్యాన్ని చూసి పరవశించిపోవచ్చు. భద్రావూదికి ఆవల 13 కిలోమీటర్ల దూరంలో ఇరి గ్రామంలో రుక్మిణీ సత్యభామ సహిత వేణుగోపాలస్వామి ఆలయముంది. దీన్ని చూసే రామదాసు భద్రాచలంలో సీతారామాలయాన్ని కట్టించాడంటారు.భద్రాచలానికి ఉత్తరంగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాముల పర్ణశాల, అక్కడి నదుల సంగమం చూడదగిన పర్యాటక స్థలాలు. భద్రాచలానికి తూర్పువైపు 40 కిలోమీటర్లు ప్రయాణించి కుకునూర్ - పేరంటాలపల్లి నుంచి గోదావరిలో బోట్లపైన పాపికొండల మధ్య సాగే విహారమూ మరో పేర్గాంచిన పర్యటనే.
నాగార్జునసాగర్..

 
                          
సుమారు అర్థ శతాబ్దం కింద కట్టిన అద్భుత మానవ నిర్మాణం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. 124 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాతి డ్యామ్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో వెలికి తీసిన చారివూతక అవశేషాలు... ప్రత్యేకించి బౌద్ధ అవశేషాలు, విశేషాలను ప్రాజెక్ట్ నీళ్ళ మధ్యలో ఉన్న నాగార్జున కొండపై ఏర్పాటుచేసిన మ్యూజియంలో భద్రపరిచారు. అక్కడికి సాగర్ నీటిలో బోటులో 9 కిలోమీటర్లు ప్రయాణించడం అరుదైన అనుభూతినిస్తుంది. సాగర్ డ్యామ్ కూడా చూశాక పైలాన్-హిల్ కాలనీ పరిసరాల్లో 279 ఎకరాల్లో బుద్ధుడు ప్రవచించిన ‘అష్టాంగమార్గ’ స్ఫూర్తితో నిర్మించిన కట్టడాలు, పార్క్‌లు చూడదగినవి. సాగర్ కిందుగా 11 కిలోమీటర్ల దూరంలో 70 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న ఎత్తిపోతల జలపాతం ఉంది. దీని సౌందర్యం విధిగా చూడదగింది. అయితే, ఇది గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు కావలసిన సకల సౌకర్యాలున్నాయి.
హైదరాబాద్ - నల్లమల     

                             


రాష్ట్రంలోనే అత్యంత విశాలమైనవి నల్లమల అడవులు. అందుకే దేశంలోనే పెద్దదైన ‘పులుల సంరక్షణా కేంద్రం’ సుమారు నాలుగు దశాబ్దాల కిందట ఇక్కడ ఏర్పాటైంది. నల్లమలలోనే రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన శ్రీశైల క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం ఉత్తరద్వార క్ష్రేత్రమైన ఉమామహేశ్వరంతో తెలంగాణలో (మహబూబ్‌నగర్ జిల్లాలో) నల్లమల అడవులు ప్రారంభమవుతాయి. సర్పాకారంగా కమ్ముకున్న పచ్చని కొండల కంఠ స్థానంలో సహజంగా ఏర్పడిన గుహల్లో పైనుండి పడుతున్న నీటి ధారల కింద ప్రతిష్టితమైన స్వయంభు శివలింగం తేజస్సు చూడదగింది. ఉమామహేశ్వరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూరులో చీతల్ రెస్టాంట్‌లో భోజనం చేసి, అందులోని వనమాలిక కాటేజీల్లో విశ్రాంతి తీసుకొని, అక్కడున్న చెంచులక్ష్మి, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనే మ్యూజియంలను సందర్శించవచ్చు. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండం సందర్శించదగ్గదే. రోడ్ మీదే ఉన్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారికి టికెట్ రుసుము చెల్లించి వారి వాచ్‌మన్ సహాయంతో సమీపంలో ఉండే ‘గుండం’ వరకు వెళ్ళి నట్టడివిలో వన్యజీవులు, పక్షుల స్వేచ్ఛా విహారాలను వీక్షించవచ్చు.‘గుండం’కు ఫ్లర్లాంగు దూరంలో కిందివైపు లొద్ది ఉంది. దానిలోతు సుమారు వేయి అడుగులు. దాని అడుగున విశాలమైన గుండం ఉంది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి ఒక జలపాతం దూకగా ఏర్పడిందది. ఆ జలపాతపు నీటిని ఇప్పుడు స్థానికులు వ్యవసాయం కొరకని చెరువులోకి మళ్ళించుకున్నారు. అయినా వర్షాకాలంలో పారిన వరద నీటికి నిండిన ఈ గుండం ఎండాకాలం కూడా ఎండిపోదు. పైగా ఎండాకాలంలోనే దీని దగ్గర ఎక్కువ ఆనందించే వాతావరణం ఉంటుంది. కాబట్టే, ఎండాకాలంలో వచ్చే వైశాఖ బుద్ధ పౌర్ణమికి జాతర జరుగుతుంది. (ఈ నెలలో 24,25,26 తేదీలలో). గుండానికి రెండువైపులా ఉన్న సహజమైన గుహల్లో విష్ణుకుండిణల కాలపు (1600 సంవత్సరాల) శివాలయాలున్నాయి. వాటి మధ్య ఎత్తైన చెట్ల మధ్యనున్న గుండంలో కేరింతలు కొడుతూ ఈత కొట్టడం, ఆ కేరింతల ప్రతిధ్వనులు కొండల మధ్య వింతగా విన్పించడం... ఇవన్నీ స్వయంగా ఆస్వాదించదగిన అనుభూతులు.
       లొద్ది నుంచి 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే నిజాం కాలం నాటి ఫరహాబాద్ గేట్ వస్తుంది. అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు తమ జీపులో టైగర్ సఫారీకి తీసుకు చివరన గల ఒక కొండ అంచుకు తీసుకెళ్తారు. ఆ అంచు ఎత్తు భూమి ఉపరితలానికి సుమారు ఒక కిలోమీటరుంటుంది. అంత ఎత్తులో ఉన్న మన మీదికి రయ్య్‌మని వీస్తున్న గాలుల అనుభూతులను ఆస్వాదిస్తూ, పచ్చని అడవుల మధ్య ఎన్నో కిలోమీటర్ల దూరంలో చెలిమలలాగా కనిపిస్తున్న పెద్ద చెరువులను చూస్తూ, పక్కనే నిజాం కట్టించుకున్న శిథిల భవనాలను ఆసక్తిగా వీక్షిస్తూ అక్కడ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి జీపులో ప్రయాణిస్తున్నప్పుడు మనకు మార్గ మధ్యలో జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, పులులు మొదలైన వన్య జంతువులూ కన్పించవచ్చు.ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మల్లెల తీర్థం అనే జలపాతాన్ని చేరుకోవచ్చు. చుట్టూ ఆవరించుకున్న పచ్చని కొండల మధ్య వంద అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న గిలిగింతలు పెట్టే చల్లని జలపాతపు ధారల కింద, ఏర్పడిన గుండం, దాని నుండి ఎత్తైన చెట్ల గుండా ప్రశాంతంగా పారుతున్న ఏరు హొయలు చూడదగ్గవి.
          వటవర్లపల్లి నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహల క్రాస్ కనిపిస్తుంది. అక్కడి నుండి సుమారు 6 కిలోమీటర్లు అందమైన అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేసి కృష్ణానది ఒడ్డున గల విశాలమైన గుహ సముదాయం చేరుకోవచ్చు. సహజంగా ఏర్పడిన రెండు స్తంభాల మీద విశాలమైన రాతి సల్పపై లాగా అమరి దాని కింద మూడువైపులా వందేసి మూరల గుహలు ఏర్పడ్డాయి. పడమటి వైపు గుహ చివరన స్వయంభు లింగం పీఠం మీద ఉంది. ఆ లింగాన్నే 12వ శతాబ్దంలో అక్క మహాదేవి అనే భక్తురాలు పూజించి, శివున్ని ప్రత్యక్షం చేసుకొని అతనిలో ఐక్యమైందట. ఈ గుహ ప్రాంగణంలో శ్రీశైలం ప్రాజెక్టు నీటి అందాలను చూస్తూ వేల మంది సేదతీరవచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలంలోని పాతాళగంగ వరకు 22 కిలోమీటర్ల దూరం పర్యాటక శాఖ నడుపుతున్న బోట్లలో కూడా ప్రయాణించవచ్చు.
హైదరాబాద్ - అనంతగిరి            
                                
                            

   హైదరాబాద్ రాజధానిగా పాలించిన ముస్లిం రాజులకు కూడా పర్యావరణ స్పృహ నాలుగున్నర శతాబ్దాల కింది నుంచే ఉంది. ఆ స్పృహ నుండి పుట్టిన హుస్సేన్‌సాగర్‌లో బోటులో విహరిస్తూ చేసే డిన్నర్, బుద్ధ దర్శనం చక్కటి అనుభూతులు. ఆనాటి కుతుబ్షాహీ రాజులకు (గోల్కొండ కోటపైకి) నీటిని అందించిన దుర్గం చెరువులో బోట్లలో విహరిస్తూ చేపలు పట్టడం, చేప కూరతోనూ భోంచేయడం ఇప్పటికీ సాధ్యమే.
          హైదరాబాద్ నుంచి సుమారు డ్బ్బై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలున్నాయి. అందంలో విశాఖ జిల్లాలోని అనంతగిరి కొండలను తలదన్నే కొండలివి. ఈ అడవుల మధ్య నిజాం కాలంలోనే కుష్టు వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటై ఇప్పటికీ పనిచేస్తోంది. ఇక్కడి వాతావరణంలోనే కుష్టు వ్యాధిని నయం చేయగల మహత్తు ఉందని ఆనాడే గుర్తించారు. ఈ కేంద్రం ముందర విశాలమైన, లోతైన లోయ ఉంది. సాహసికులు అక్కడికి ట్రెక్కింగ్ చేస్తే వారికి అడవుల మధ్య అందమైన చెరువు కన్పిస్తుంది. సాహసించని వారు ఈ కేంద్రానికి వెనుక వైపునున్న దేవాలయాన్ని దర్శించుకుని దాని కిందుగా జంటగా ఉన్న కోనేరులోని మంచి నీటిని, మరోవైపు మురికి నీటిని చూసి, వెనుదిరిగి వచ్చి పర్యాటక శాఖవారు ఏర్పాటుచేసిన రెస్టాంట్‌లో షడ్రసోపేతమైన భోజనం చేయవచ్చు. వీలు చూసుకునేవారు అక్కడే ఉన్న ఏ.సి. గదుల్లో ఉండిపోవచ్చు.
       ఈ విధంగా అరకు, హార్స్‌లీ హిల్స్‌లను తలదన్నే చల్లని పర్యాటక కేంద్రాలు మన చుట్టు పక్కలే తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి.
                                              - డాక్టర్  ద్యావనపల్లి సత్యనారాయణ,
                                                         94909 57078

No comments:

Post a Comment