దాదాపు 124 ఏండ్ల ‘సింగరేణి తల్లి’ ఒడిలో నాలుగు తరాలుగా ఎన్నో కష్టనష్టాలకోడ్చి ఒక కుటుంబ సభ్యులుగా, కులమతాలకతీతంగా ఒక నూతన పారిశ్రామిక జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.ఎక్కడో ఖమ్మం జిల్లాలో ‘సింగరేణి’ గ్రామంలో వెలసిన మన పిన్నమ్మ ఈరోజు నాలుగు జిల్లాల పరిధిలో వేల ఎకరాల్లో తన గర్భంలో నల్ల బంగారాన్ని దాచుకున్నది. ఒకప్పుడు లక్షా 35వేల కార్మిక కుటుంబాలకు ఉపాధిని పంచిన బొగ్గుతల్లి, నేడు 64 వేల కార్మికులకు ప్రత్యక్షంగా మరో ఆరు లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధినిస్తూ దిన దిన ప్రవర్థమానమై విరాజిల్లుతున్నది. ఇంకో రెండు వందల సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలను సింగరేణి తన కడుపులో దాచుకున్నది. కానీ ఈనేల పొరల్లో, భూగర్భ సొరంగాల్లో పనిచేసి అలసి ఈ నేలపాలైన మన తాతలు, తండ్రులు, సోదరులకు కంపెనీ మానవాళి కనీస అవసరాలైన నీరు, గూడు,విద్య, వైద్యం అందించడంలో సవతి తల్లి ప్రేమను చూపుతున్నది.
మొదటి తరం కార్మికుల అభ్యర్థన, కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు వారి పిల్లల కనీస చదువుల కోసం 1975లో ‘సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఏర్పడింది. నాటి మూల కార్మికుల పిల్లల విద్య కోసం కొత్తగూడెంలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని ప్రాథమిక విద్యను ప్రారంభించింది.అప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు లేక దిన దిన గండంగా బతుకు వెళ్లదీస్తున్న కార్మికుల పిల్లలు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించారు. అధికారుల పిల్లలు మాత్రం సింగరేణి పాఠశాలలో చదివేవారు. కానీ నేటి తరం కార్మికుల పిల్లలు బోధనా విలువలు పడిపోయి, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమై ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువు‘కొంటున్నారు’. నాడు నిత్యం కార్మికులకు, యాజమాన్యానికి ఘర్షణ పరిస్థితులు ఉండేవి. కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడుతుండేవారు. మరోవైపు సీమాంధ్ర యాజమాన్యం అణచివేత విధానాన్ని అవలంబించే ది. రోజూ బందులు, ర్యాలీలతో పిల్లల చదువులు గందరగోళంగా ఉండేవి.
కానీ నేటి పరిస్థితులు వేరు. సింగరేణి యాజమాన్యం ప్రపంచదేశాలకు ధీటుగా భూగర్భ, ఉపరితల గనుల ద్వారా నిర్దేశించుకున్న ఉత్పతి లక్ష్యాన్ని గడువు కంటే ముందే చేరుకుంటున్నది. ఇది శుభపరిణామం. ఇదంతా ఇక్కడి శ్రమ జీవుల, అధికారుల, సమష్టి కృషి ఫలితం. కానీ నాటినుంచి నేటి వరకు ఇక్కడి పిల్లల విద్యా బోధన కోసం ఏర్పడిన ‘సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ’ ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక విద్యకే పరిమితమైంది. ఉన్నత విద్య అయిన ‘వైద్య విద్య’ కోసం కార్మికుల పిల్లలు నగరాలకు, ఉన్నతాధికారుల పిల్లలు విదేశాలకు వెళుతున్నారు. ఏమాత్రం నాణ్యతలేని విద్య కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. నేటికీ సంస్థ అభివృద్ధికి సమాంతరంగా సాంకేతిక విద్య గానీ, ఉన్నత వైద్యం కానీ మెరుగుపడలేదు. దీనికి కారణం కీలకమైన వైద్య, విద్యరంగాలకు యాజమాన్యం సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొన్నేళ్లుగా సింగరేణిలో ‘వైద్య కళాశాల(ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. అందులో సీమాంధ్రలో తొమ్మిది మెడికల్ కాలేజీలుండగా, తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం కనీసం ఆరు వైద్య కళాశాలు ఉండాలి. అరకొర వసతులతో ఈ మధ్య నిజామాబాద్ మెడికల్ కాలేజీ ప్రారంభించినా ఇంకా అందులో బోధనకు నోచుకోలేదు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న సీమాంధ్ర పాలకులు ఇక్కడే ఉన్న ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో సీట్ల పెంపుకు తగినన్ని పరికరాలు, భవన మరమ్మతులకు నిధులు విడుదల చేయలేదు.
స్థానిక ప్రభుత్వాలు నిధుల లేమితో ప్రభుత్వ వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయడం అసాధ్యమని తేల్చాయి. వైద్య రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు ఎప్పుడూ అరకొరగానే ఉంటున్నాయి. ఇటీవల ‘భారతీయ వైద్య మండలి’ (MCI) పరిక్షిశమలకు అనుబంధంగా ఉన్న కళాశాలలకు నిబంధనలను సడలించి, 300 పడకలున్న ఆస్పత్రులకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆదేశించింది. ఈ నిబంధనలకు నూటికి నూరుశాతం సరిపోయేలా ఉన్న సింగరేణి వైద్య, ఆరోగ్య, విభాగానికి నాలుగు జిల్లాల పరిధిలో 845 పడకల ఆస్పత్రి భవనాలు, 2500 పైగా పారామెడికల్ సిబ్బంది, 250పైగా వైద్యులున్నారు. సింగరేణి ఏరియా పరిధిలో ఆస్పవూతులు, వాటి పడకలు, వాటి అనుబంధ డిస్పెన్సరీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఏరియా ఆస్పత్రులన్నింటిని ఆధునీకరించి కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని కంపెనీ ఆలోచిస్తున్నది. ఇప్పటి వరకు ప్రతి ఏటా గని ప్రమాదాల వల్ల అస్వస్థత గురైన కార్మికులకు, అధికారులకు స్పెషాలిటీ వైద్య సేవల కోసం నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులకు 10-12 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది.
ఇక అరకొర వసతులతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా 27 ఉన్నాయి. అందులో సొసైటీల పేరుతో నాలుగు, ట్రస్టుల పేరుతో 23 కాలేజీలు నడుస్తున్నాయి. నాలుగు కళాశాలలు మాత్రం డీమ్డ్ యూనివర్సిటీలుగా విదేశీ పెట్టుబడులతో విరాజిల్లుతున్నాయి. వాటిలో 19 సీమాంవూధుల ఆధీనంలో ఉండగా, ఐదు కళాశాలలు మాత్రమే తెలంగాణ వారివి. సొసైటీ, ట్రస్టుల పేరుతో నడిచే వైద్య కళాశాలలు, విద్యా బోధన, నిర్వహణ ఆర్థిక లావాదేవీలతో అవకతవకలు మనం శోధించినా ఛేదించలేనివి. కానీ ఎంతో పారదర్శకంగా నడపబడుతున్న ‘సింగరేణి ఎడ్యుకేషనల్’ సొసైటీ ప్రతి ఏటా ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక విద్య వరకు సుమారు 10571 విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నది. ఇప్పటి వరకు లక్షలాదిమంది తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్రవ్యాప్తంగా, దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. వారంతా ఇక్కడి విద్యావకాశాలు మెరుగుపడాలని వైద్య విద్య అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ కాంట్రాక్టు స్థాయి కార్మికుడి నుంచి అత్యున్నత స్థాయి అధికారిగా పదవీ విరమణ పొందిన కార్మికులు ఒకవైపు ఉండగా, అదే కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి నాలుగు దశాబ్దాలుగా తమ రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించి అరకొర వసతులతో జీవనం సాగిస్తున్నారు. పదవీ విరమణ సమయానికి కనీసం సొంతగూడుగాని, పిల్లలకు సుస్థిర జీవనానికిగానీ నోచుకొని కార్మికులను మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కంపెనీలో నిజాయితీగా పనిచేసిన కార్మికుని జీవితానికి అంతే నిజాయితీగా పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారి జీవితాన్ని దగ్గరగా పరిశీలిస్తే పెద్దగా వ్యత్యాసం లేదు. చాలీచాలని పెన్షన్‌లు, ఆకాశాన్నంటుతున్న ధరలు, అంతుచిక్కని దీర్ఘకాలిక వ్యాధు లు, నిలు కాలుష్యమయమైన వారి తనువు చూస్తుంటే మానవతావాదుపూవరికైనా మనసు ద్రవిస్తుంది.
ఇటువంటి విశ్రాంత కార్మికుల ఆరో గ్య పరిరక్షణకు, వైద్యానికి సింగరేణి యాజమాన్యం చూపుతున్న వైఖరి శోచనీయం. వైద్యం లేకపోగా అత్యవసర సమయాల్లో, ప్రాణాంతకమైన గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడ్డప్పుడు ఇక్కడి హాస్పిటల్‌లో చేర్చుకోవటంలేదు. పై స్థాయి వైద్యశాలలకు కూడా సిఫారసు చేసే పరిస్థితి లేదు. ఇదెంతటి అమానుషమో ప్రజాసంఘాలు, కార్మిక నాయకులు, ప్రజా వూపతినిధులు ఆలోచించాలి.ఇది అత్యంత ఆందోళనకర విషయం.
అదే ‘సింగరేణిలో వైద్యకళాశాల’ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవటమే కాకుండా ఇక్కడి పిల్లల బంగారు భవిష్యత్తుకు నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఈ ప్రాంత విశ్రాంత కార్మికులకు, పరిస ర ప్రాంత ప్రజానీకానికి, మెరుగైనన వైద్యసేవలు అందుతాయి. ఇక యాజమాన్యానికి మెడికల్ కాలేజీ నిర్వహణా ‘భారం’ అనేది అత్యంత శోచనీయం. సింగరేణి అంటే ‘వన్ ఫ్యామిలీ- వన్ విజన్- వన్ మిషన్’ అని ఉటంకించే అధికారులు, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలో నడిచే ఉన్నతస్థాయి పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ ఎలా సాధ్యమైందో ఆలోచించాలి. మన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ మన పిల్లల భవిష్యత్తు ఎలా భారమవుతుందో పునరాలోచించాలి. ప్రభుత్వ ఆధీనంలోని జేఎన్‌టీయూ మంథని సంస్థకు 20 కోట్ల గ్రాంటు ఇచ్చి కేవలం ఐదు శాతం సీట్ల కార్మికుల పిల్లలకు కేటాయింపు ఏవిధంగా సరైనదో ఆలోచించాలి. ఇదంతా కూడా సంస్థ నిర్వహించే ‘సామాజిక ధర్మం’ సీఎస్‌ఆర్- ప్రోగ్రాం గా అభివర్ణిస్తుంది. అంతే బాధ్యతతో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రభుత్వం, అధికారులు ఈ విద్యాసంవత్సరానికి ‘Essentiality certificate ’ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఆదేశించాలని మనవి. తదనుగుణంగా కార్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు, ప్రాంతీయవాదానికి అతీతంగా ప్రభుత్వంపై ‘ఒత్తిడి’ పెంచి ఇక్కడి ప్రజానీకాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది.
అనుకోని పరిస్థితులలో విశ్రాంత కార్మికులు మృత్యువాత పడితే, గని కార్మికులు ప్రమాదాల వల్ల మరణిస్తే, ‘శవ పరీక్ష’కు సరైన వైద్యులు గానీ పార్థివ దేహాన్ని భద్రపరచే ‘మార్చురీ’ (శవాల గది) గాని ఇక్కడలేవు. వాయు కాలుష్యం వల్ల వృత్తిరీత్యా సంక్రమించే వ్యాధులైన కోల్ వర్కర్స్ ‘న్యూమోకోనియోసిస్', ‘Black lung Disease’ ఉపిరితిత్తుల క్యాన్సర్ వంటి రోగాల బారినపడ్డ కార్మికుల ఊసేలేదు. ఎన్నో ఏళ్లు పారిక్షిశామిక జీవ నం గడిపిన అనేక కార్మికులు నేడు గ్రామాల్లో రైతుకూలీలుగా బతుకు వెళ్లదీస్తున్నారు. నేటి పరిస్థితులను చూసి జాతి సంపదను తన కడుపులో దాచుకున్న ఈ నేల తల్లి ఇవాళ విలవిలలాడుతుంది. ఈ నేల సొరంగాల్లోకి, కటిక చీకట్లో అడుగులో అడుగువేస్తూ నడిచిన కాళ్ళకు అనేక గాయాలైన ఆ ‘గుండె’లను ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత ఈ నాగరిక సమాజానికి ఉన్నది.
-డాక్టర్ దాసారపు శ్రీనివాస్
సింగరేణి కోల్‌బెల్ట్ డాక్టర్స్ ఫోరమ్ చైర్మన్
No comments:
Post a Comment