Monday, 6 May 2013

ప్రయోగాల సేద్యం!

వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న తెరాస అధినేత 
 తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి 
 'గ్రీన్‌హౌజ్‌' ద్వారా అధిక దిగుబడి 
ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఆలవాలం కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రం 
'ఈనాడు-ఈటీవీ'తో అనుభవాలు పంచుకున్న కేసీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌: 
         తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయ నేతగానే తెరాస అధినేత కేసీఆర్‌ మనకు తెలుసు. అయితే ఆయనలో మనకు తెలియని మరో పార్శ్యం కూడా దాగుంది. అదే.. సేద్యం చేసే రైతన్న రూపం. సాగు ఎందుకు లాభసాటిగా ఉండదన్న ఆలోచన ఆయనలో మొదలైంది. దీంతో వ్యవసాయ రంగంలో ఉన్న ఆధునిక పోకడలేమిటి? ఎలా చేస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చు అన్న చర్చను లేవదీశారు. సుమారు రెండేళ్ల క్రితం తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ క్షేత్రాలతో రూ.లక్షలు ఆర్జించే అవకాశం ఉందని ఆయన ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం శివారు వెంకటాపూర్‌ గ్రామంలో ఉన్న ఆయన వ్యవసాయక్షేత్రం ప్రయోగాలకు నెలవుగా మారింది. తన వ్యవసాయ క్షేత్ర విశేషాలను ఆయన 'ఈనాడు-ఈటీవీ'తో పంచుకున్నారు. ఈ విశేషాలు కేసీఆర్‌ మాటల్లోనే..
45 ఎకరాల క్షేత్రం.. 
     నా కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడు. రాజీనామా చేస్తే వచ్చిన సొమ్ముతో సుమారు 22 ఎకరాల భూమి కొన్నాడు. అక్కడే నేను కూడా కొంతభూమిని కొన్నా. ఇప్పుడు అక్కడ 45 ఎకరాలుంది. అక్కడ వ్యవసాయం చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నా. నీటి వసతి తక్కువగానే ఉంది. ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ అధిక దిగుబడి సాధించడంపై దృష్టిపెట్టాను. ప్రయోగాలు చేయాలంటే డబ్బు కావాలి. అందుకే మొట్టమొదట నేను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.42 లక్షల రుణం తీసుకున్నాను. ఈ డబ్బుతో మొదటి సంవత్సరం ఆనపకాయ, మిరప, పసుపు, ఆలుగడ్డలు పండించాను. తర్వాత క్యాప్సికం వేశాను. మంచి దిగుబడి వచ్చింది. ఏడాదిలోనే మేం బ్యాంక్‌ నుంచి తీసుకున్న అప్పును తీర్చగలిగా.గ్రీన్‌హౌజ్‌ విధానంతో అధికరాబడి
                        
                  

 వ్యవసాయోత్పత్తుల్లో అధిక దిగుబడి, మంచి నాణ్యత సాధించాలంటే ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. ఉత్పత్తి ఎంత ముఖ్యమో మార్కెట్‌ చేయడమూ అంతే ముఖ్యం. మార్కెట్‌ అవసరాలు తెలుసుకొని పంటలు వేస్తే లాభాలు వస్తాయి. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోగలిగితే ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు కూడా మంచి దిగుబడి సాధించగలరు. మనదేశంలో టమాటలు సాధారణంగా ఎకరానికి 20-30 టన్నులు మించి పండవు. అదే గ్రీన్‌హౌజ్‌ విధానంలో ఇజ్రాయెల్‌లో ఎకరానికి 200 టన్నులు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో దిగుబడి పెరగడంతోపాటు నాణ్యత కూడా ఉంటుంది. నేను మొదటి పంట అప్పు తీర్చిన తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి పది ఎకరాల్లో గ్రీన్‌హౌజ్‌ నిర్మాణానికి రూ.మూడున్నరకోట్లు రుణం తీసుకున్నా. గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటుకు ఒక్కొక్క ఎకరానికి రూ.28 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది ఒకేసారి పెట్టే ఖర్చుమాత్రమే. ప్రస్తుతం గ్రీన్‌హౌజ్‌లో బీన్స్‌ పంట వేశాను. ఎకరానికి సుమరు 40 టన్నుల మేర దిగుబడి ఉంటుంది. ఒక ఎకరానికి కనీసం 15 లక్షల ఆదాయం వస్తుంది. దీనికయ్యే ఖర్చు ఎకరానికి రూ.15 వేలకు మించదు. త్వరలో నా గ్రీన్‌హౌజ్‌లో 'చీవ్స్‌' అన్న రకాన్ని పండించాలని యోచిస్తున్నాను. దీన్ని ఎక్కువగా జర్మనీ దేశంలో ఉపయోగిస్తారు. 'చీవ్స్‌' పంట ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఒక టన్నుకు రూ.25 లక్షల వరకు ధర పలుకుతుంది. అంటే ఎకరానికి కనీసం రూ. రెండుకోట్లు వస్తాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. అయితే, మార్కెటింగ్‌ చేసుకునే నైపుణ్యాన్ని రైతులు పెంచుకోవాలి. నా వ్యక్తిగత సహాయకులను జర్మనీకి పంపించాలని నిర్ణయించాను. వారు వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వస్తారు. దీనిపై ఇప్పటికే కొంత కసరత్తు చేశాం. ఇంటర్నెట్‌లో కావాల్సిన సమాచారం ఉంది. రైతులు ఇంటర్నెట్‌ ఉపయోగించుకోగలిగితే ఎంతో లబ్ధి పొందవచ్చు. మహారాష్ట్రలోని సాంగ్లి, పుణేల్లో రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను ఇప్పటికే అవలంబించి మంచి లాభాలు గడిస్తున్నారు. గ్రీన్‌హౌజ్‌లో కలర్‌ క్యాప్సికం పండించాలని కూడా యోచిస్తున్నాం. దుబాయ్‌లో ఒక కిలోకు రూ.115 వరకు పలుకుతుంది. మనం పండించి, ఎగుమతి చేయడానికి రూ.45 ఖర్చవుతుంది. ఖర్చులో కూడా ప్రభుత్వం నుంచి కొంత మొత్తం సబ్సిడీ వస్తుంది.
మనరాష్ట్రంలో అద్భుతమైన నేలలున్నాయి
          మన రాష్ట్రంలో పంటలు పండేందుకు అవసరమైన వాతావరణం, అద్భుతమైన నేలలున్నాయి. వీటిని ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన పంటలు వేయవచ్చు. దిగుబడి కూడా బాగుంటుంది. ఇప్పుడు సమాచార విప్లవంతో సమస్త సమాచారం రైతులు తెలుసుకునే వీలుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. గ్రీన్‌హౌజ్‌లో పంట పండిస్తే మొక్కకు ఎంత వరకు నీళ్లు అవసరమో అంతే అందుతుంది. నీటి వృథా ఉండదు. అలాగే, ఎరువులు కూడా నీటిలోనే కలిపి ఇస్తాం. పురుగు మందులను వాడే అవసరం రాదు. దీంతో ఇక్కడ పండే పంటతో ఆరోగ్యానికి హాని ఉండదు. ఈ విధానంలో అన్నిరకాల పంటలు, అన్ని కాలాల్లోనూ పండుతాయి.
గ్రీన్‌హౌజ్‌కు రాయితీ సదుపాయం.. 
        గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటుకు రూ.28 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి నీటి పంపింగ్‌ కోసం నెటాజెట్‌ అనే పరికరాన్ని కూడా గ్రీన్‌హౌజ్‌ ఏర్పాటు చేసే కంపెనీ వాళ్లే సమకూరుస్తారు. నేను పది ఎకరాలకు రూ.మూడున్నరకోట్ల రుణం తీసుకున్నాను. ఈ రుణంలో రూ.90 లక్షలను 'నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు' సబ్సిడీగా ఇస్తామని చెప్పింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకుంటే రైతులకు భారం తగ్గుతుంది. పంట బాగా పండుతుంది. వచ్చే ఆదాయంతో ఒక్క ఏడాదిలోనే అప్పుమొత్తాన్ని తీర్చేయవచ్చు.
ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి 
           ''ఇజ్రాయెల్‌ను మన ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ రైతులకు సంబంధించిన భూములను ప్రభుత్వమే పూర్తిగా సర్వేచేస్తుంది. భూసార పరీక్షలు కూడా చేస్తుంది. ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వమే మార్గదర్శనం చేస్తుంది. ఆ మేరకు విత్తనాలు కూడా ఇస్తుంది. రైతు పంట పండించిన తర్వాత మార్కెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంది. మన దేశంలో వ్యవసాయ శాఖ అంటే కేవలం ఎక్స్‌టెన్షన్‌ యాక్టివిటికే పరిమితమైంది. దేశంలో వ్యవసాయ విస్తరణ పెరిగింది. కానీ, వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించలేకపోతున్నాం. మీడియా కొంత వరకు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తున్నా ఇది సరిపోదు. ప్రభుత్వం కృషిచేయాలి'' అని కేసీఆర్‌ వివరించారు.
మొదటి నుంచి వ్యవసాయంపై మక్కువ.. 
      తనకు వ్యవసాయంపై మక్కువ పెరగడానికి తన తండ్రి రాఘవరావు కారణమని కేసీఆర్‌ తెలిపారు. తన తండ్రి అభ్యుదయ రైతు అని, ఆయన వ్యవసాయంపై అనేక ప్రయోగాలు చేశారని 'ఈనాడు-ఈటీవీ'తో కేసీఆర్‌ చెప్పారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నపుడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో కూడా 20 ఎకరాల వ్యవసాయక్షేత్రాన్ని అభివృద్ది చేశానని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో అక్కడి క్షేత్రాన్ని అమ్మేయాల్సి వచ్చిందని వివరించారు.
సౌకర్యాల నిలయం.... వ్యవసాయక్షేత్రం
         కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ క్షేత్రంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో ప్రస్తుతం ఒక పెద్ద బావిని తవ్వుతున్నారు. ఇది వర్షపు నీటిని నిలువ చేయడానికి ఉపయోగపడడంతోపాటు వ్యవసాయక్షేత్రానికి అవసరమైన నీటిని తీసుకోవడానికి అనువుగా రూపొందిస్తున్నారు. కోళ్లు, గేదెలు, బాతులు, సీమకోళ్లు కూడా పెంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన సేంద్రీయ ఎరువులను ఇక్కడే తయారు చేస్తున్నారు. వర్మీ కంపోస్టు యూనిట్‌ కూడా ఉంది. ఇక్కడ పనిచేసే కూలీలకు ప్రత్యేకంగా నివాస సదూపాయం కల్పించారు. తనది ఫాం హౌజ్‌ కాదని.. ఫార్మర్‌ హౌజ్‌ అని కేసీఆర్‌ చెబుతున్నారు. కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రంలో కొంతమేరకు కాకర వేశారు. కాకర కూడా ఎకరానికి సుమారు 70 టన్నులు దిగుబడి వస్తోంది.

No comments:

Post a Comment