Monday 12 September 2016

5 సెకన్ల లోపు తిన్నా ప్రమాదమే!

‘కింద పడిన ఆహారాన్ని ఐదు సెకన్ల లోపు తీసుకొని తింటే ఏ హానీ జరగదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధిలో బ్యాక్టీరియా వాటిలోకి ప్రవేశించదు’... ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఓ భావన ఇది. అయితే, ఈ భావన తప్పని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. కిందపడిన ఆహారంలోకి బ్యాక్టీరియా ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలోనే వచ్చి చేరే అవకాశముందని స్పష్టంచేసింది. అమెరికాలోని రుట్జెర్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య డోనాల్డ్‌ స్కాఫ్నర్‌ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తుప్పుపట్టని ఉక్కు, సిరామిక్‌, కలప, కార్పెట్‌ ఉపరితలాలపై పుచ్చకాయ, వెన్న పూసిన బ్రెడ్డు వంటి వేర్వేరు ఆహార పదార్థాలను కిందపడేసి.. వేర్వేరు కాల వ్యవధిలో వాటిని పైకి తీసి పరిశీలించారు. పుచ్చకాయ వంటి తేమ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లోకి అత్యంత వేగంగా బ్యాక్టీరియా వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. చాలా సందర్భాల్లో ఇతర ఆహార పదార్థాల్లోకి కూడా ఐదు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే బ్యాక్టీరియా వచ్చేసిందని వివరించారు.
- ఈనాడు.

పంచకర్మ చికిత్సతో గుండె పదిలం!

శరీరంలో నూతనోత్తేజాన్ని నింపే ఆయుర్వేద చికిత్స పంచకర్మతో మరో ఉపయోగం బయటపడింది. వారం రోజులపాటు దీన్ని తీసుకుంటే గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుందని వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా వైద్య విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేపట్టింది. పంచకర్మలో ధ్యానం, యోగా, నూనెలతో మర్దనా తదితర క్రియలుంటాయి. దీన్ని తీసుకునేటప్పుడు శాకాహారమే తినాలి. హానికర విష పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపే ఆయుర్వేద చికిత్సగా ఇది ప్రసిద్ధిగాంచింది. తాజాగా రక్తంలోని కొవ్వు స్థాయిల నియంత్రణతోపాటు హృద్రోగ సమస్యల ముప్పును కూడా ఇది తగ్గిస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు. జీవక్రియా విధానంపై పంచకర్మ గణనీయమైన ప్రభావం చూపుతున్నట్లు గుర్తించామని శాస్త్రవేత్త దీపక్‌ చోప్రా తెలిపారు. 30 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న 119 మందిపై అధ్యయనం చేపట్టిన అనంతరం తాము ఈ అవగాహనకు వచ్చామన్నారు.                                   
 - ఈనాడు.

Saturday 3 September 2016

ఏడు గంటలకే భోజనం... గుండెపోటు దూరం!

రాత్రి భోజనాన్ని ఏడు గంటలకల్లా తినడం ద్వారా గుండెపోటు ముప్పును చాలామటుకు తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది! బాగా పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకోవడం అధిక రక్తపోటుకు దారితీసే ప్రమాదముందనీ, తద్వారా హృద్రోగ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు... ఏడు గంటలకు ముందే భోజనం ముగించడం వల్ల రాత్రంతా రక్తపోటు స్థాయిలు సాధారణంగానే ఉండి, గుండె పదిలంగా ఉంటుందట. ఈ అంశంపై టర్కీలోని డోకుజ్‌ యెలూల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన హృద్రోగ నిపుణుడు ఆచార్య డా.ఇబ్రూ ఓపెలిట్‌ ఇటీవల పరిశోధించారు. సగటు వయసు 53 ఏళ్లున్న 721 మంది అధిక రక్తపోటు బాధితుల ఆహార అలవాట్లను గమనిస్తూ వచ్చారు. వారు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఉప్పు వాడకం ఎలా ఉంది, ఉదయం వేళ ఏం తింటున్నారు, రాత్రి భోజనం ఎప్పుడు చేస్తున్నారనే వివరాలను సేకరించారు. తర్వాత వారి రక్తపోటు స్థాయిలను గమనించారు. ‘‘సాధారణంగా రాత్రి వేళల్లో రక్తపోటు స్థాయిలు తక్కువగా ఉంటాయి. కానీ, పడుకునే ముందు ఆహారం తీసుకుంటే శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. ఒత్తిడికి దారితీసే హార్మోన్ల స్థాయి అధికమవుతుంది. హైబీపీతో బాధపడేవారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదముంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆహార వేళలు కూడా అంతే ముఖ్యం. పడుకోవడానికి మూడు గంటల ముందే తేలికపాటి రాత్రి భోజనాన్ని ముగించాలి’’ అని డా.ఇబ్రూ వివరించారు. ‘‘బాగా రాత్రయ్యాక భోజనం చేయడం వల్లే చాలామందిలో రక్తపోటు అదుపులో ఉండటం లేదు. ఈ పరిశోధన ఫలితాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది’’ అని బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ సంచాలకులు వీస్‌బెర్గ్‌ పేర్కొన్నారు. యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ ఇటీవల రోమ్‌లో నిర్వహించిన ప్రపంచస్థాయి సదస్సులో ఈ పరిశోధన ఆకర్షణగా నిలిచింది.
 - ఈనాడు