ఏడు గంటలకే భోజనం... గుండెపోటు దూరం!
రాత్రి భోజనాన్ని ఏడు గంటలకల్లా తినడం ద్వారా గుండెపోటు ముప్పును చాలామటుకు తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో తేలింది! బాగా పొద్దుపోయిన తర్వాత ఆహారం తీసుకోవడం అధిక రక్తపోటుకు దారితీసే ప్రమాదముందనీ, తద్వారా హృద్రోగ ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు... ఏడు గంటలకు ముందే భోజనం ముగించడం వల్ల రాత్రంతా రక్తపోటు స్థాయిలు సాధారణంగానే ఉండి, గుండె పదిలంగా ఉంటుందట. ఈ అంశంపై టర్కీలోని డోకుజ్ యెలూల్ విశ్వవిద్యాలయానికి చెందిన హృద్రోగ నిపుణుడు ఆచార్య డా.ఇబ్రూ ఓపెలిట్ ఇటీవల పరిశోధించారు. సగటు వయసు 53 ఏళ్లున్న 721 మంది అధిక రక్తపోటు బాధితుల ఆహార అలవాట్లను గమనిస్తూ వచ్చారు. వారు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, ఉప్పు వాడకం ఎలా ఉంది, ఉదయం వేళ ఏం తింటున్నారు, రాత్రి భోజనం ఎప్పుడు చేస్తున్నారనే వివరాలను సేకరించారు. తర్వాత వారి రక్తపోటు స్థాయిలను గమనించారు. ‘‘సాధారణంగా రాత్రి వేళల్లో రక్తపోటు స్థాయిలు తక్కువగా ఉంటాయి. కానీ, పడుకునే ముందు ఆహారం తీసుకుంటే శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. ఒత్తిడికి దారితీసే హార్మోన్ల స్థాయి అధికమవుతుంది. హైబీపీతో బాధపడేవారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదముంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆహార వేళలు కూడా అంతే ముఖ్యం. పడుకోవడానికి మూడు గంటల ముందే తేలికపాటి రాత్రి భోజనాన్ని ముగించాలి’’ అని డా.ఇబ్రూ వివరించారు. ‘‘బాగా రాత్రయ్యాక భోజనం చేయడం వల్లే చాలామందిలో రక్తపోటు అదుపులో ఉండటం లేదు. ఈ పరిశోధన ఫలితాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది’’ అని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సంచాలకులు వీస్‌బెర్గ్ పేర్కొన్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవల రోమ్‌లో నిర్వహించిన ప్రపంచస్థాయి సదస్సులో ఈ పరిశోధన ఆకర్షణగా నిలిచింది.
- ఈనాడు
No comments:
Post a Comment