Friday, 26 December 2014

గణతంత్రంలో మన శకటం.. ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర

   ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో రాష్ట్ర శకటం సందడి చేయనుంది. మన శకటం ప్రదర్శనకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డిసెంబరు 25న టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. రక్షణ శాఖనుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయమై త్వరలోనే లేఖ అందనుంది. ఈసారి పరేడ్‌లో ఇప్పటిదాకా మనతో కలిపి మొత్తం పద్నాలుగు రాష్ర్టాల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు పండుగ ముఖ్యాంశంగా మన రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. ప్రతిఏటా జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ర్టాలు తమ తమ సంస్కృతి, అభివృద్ధి ఇతివృత్తంగా శకటాలను ప్రదర్శిస్తాయి. ఆయా రాష్ర్టాలు ప్రదర్శించబోయే థీమ్ నమూనాలను రిపబ్లిక్ డే సెరిమోనియల్ కమిటీ అక్టోబర్ నెలలోనే ఆహ్వానిస్తుంది. పరిశీలన తర్వాత మార్పుచేర్పులు, తిరస్కరణలు ఉంటాయి. మన రాష్ట్రంనుంచి బోనాలు థీమ్‌కు సంబంధించి నమూనాను పంపాలని గత అక్టోబర్ నెలలో ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల విభాగానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బోనాలు డిజైన్ నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కమిటీకి సమర్పించారు. తర్వాత కమిటీ సూచించిన కొన్ని మార్పులు చేశారు. నవంబర్ 4వ తేదీన త్రీ-డీ నమూనాను తీసుకురావాలని వివిధ రాష్ర్టాలకు సమాచారమిచ్చిన కమిటీ, తెలంగాణ రాష్ర్టానికి ఆహ్వానం పంపలేదు. ఆ విధంగా జాబితా నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని తొలగించినట్లయింది. 
రక్షణ మంత్రికి లేఖ రాసిన సీఎం..
ఈ విషయమై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అప్పటి రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాసి, తెలంగాణ రాష్ర్టానికి శకటాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే మొట్టమొదటి సారి జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సెప్టెంబర్ 29వ తేదీన, అక్టోబర్ 7వ తేదీన రిపబ్లిక్ ఉత్సవ కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని ప్రదర్శించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో పాటు ఇదే విషయంపై టీఆర్‌ఎస్ ఎంపీల బృందం పలుసార్లు రక్షణ శాఖ మంత్రిని విజ్ఞప్తి చేసింది. తర్వాత రక్షణ మంత్రి మారారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి నూతన రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గత మంగళవారం కలిసి ఒక కొత్త రాష్ట్రంగా తమ మనోభావాలను ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన పారికర్ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గురువారం ఉదయమే స్వయంగా జితేందర్‌రెడ్డికి ఫోన్ చేసి శుభవార్త అందించారు. ఈ విషయమై జితేందర్‌రెడ్డి టీ మీడియాతో మాట్లాడుతూ, రక్షణ మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శకటానికి సంబంధించిన థీమ్‌పై ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ సభ్యులు చర్చించినందున అదే థీమ్‌ను వారు చేసిన సూచనల మేరకు వీలైనంత త్వరగా రూపొందించే పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారని తెలిపారు. బోనాలు థీమ్‌తో రిపబ్లిక్ డే పెరేడ్‌లో తెలంగాణ శకట ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 
బోనాలు థీమ్‌లో పోతురాజు:
అక్టోబర్ 28వ తేదీన సెర్మోనియల్ కమిటీ చేసిన సూచనల మేరకు మన శకటానికి ఆర్టిస్టు రమణారెడ్డి బోనాలు థీమ్ డిజైన్ నమూనాను తయారు చేశారు. బోనాలు పండుగలో గోల్కొండకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేయడానికి ఆ కోటను తన డిజైన్‌లో చూపించారు. పండుగలో మహిళల పాత్రను తెలియజేసే విధంగా తలపైన పూల బుట్టలు, గ్రామదేవతకు పూజలు చేయడం, ఊరేగింపు దృశ్యాలను తన డిజైన్‌లో పొందుపరిచారు. ఇక బోనాలు పండుగలో పోతురాజు పాత్రకు,ఘటంకు ఉన్న ప్రాధాన్యతకు డిజైన్‌లో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఈ శకటం డిజైన్‌ను చూసిన వారికి తెలంగాణలో బోనాల పండుగ జరిగేతీరు ఇందులో మహిళల పాత్ర తదితర విషయాలు కండ్లకు కడతాయి. సెర్మోనియల్ కమిటీ సూచనలు, సలహాల మేరకు డిజైన్‌లో ఉన్న గోల్కొండ కోటకు కొన్ని మార్పులు చేసి రాళ్ళను కోటలాగా చూపించే స్వల్పమైన మార్పులు తుది డిజైన్‌లో చోటుచేసుకుంటున్నాయి. 
ఇవీ నిబంధనలు..
శకటం బరువు పది టన్నులకు మించకుండా చూడాలని కమిటీ నిబంధన విధించింది. వెడల్పు ఎనిమిది అడుగులు , ఎత్తు 4.2 అడుగులు, పొడవు 24.8 అడుగులు మించరాదని స్పష్టంగా పేర్కొన్నది. మినీ లారీ వెనకభాగంలో బేస్‌మెంట్ మొదలు 4.2 అడుగుల ఎత్తులో తెలంగాణ బోనాలు థీమ్ డిజైన్ ఉంటుంది. ఇక వాహనంతో పాటు డిజైన్ వివరాలను కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే మొత్తం పొడవు గరిష్టంగా 45 అడుగులు, వెడల్పు 14 అడుగులు, ఎత్తు 16 అడుగులు దాటరాదు. వీటిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారుల సమక్షంలో తగిన భద్రతా చర్యల నడుమ ఈ శకటం తయారీ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ 13 రాష్ర్టాలను ఎంపిక చేసి ఆయా రాష్ర్టాలకు సూచించిన డిజైన్ నమూనాలను విశ్లేషించి పనులను కూడా ప్రారంభించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ పనులు కూడా దాదాపు సగం మేరకు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలో మాత్రం నిర్ణయం ఇప్పుడే జరిగినందున తెలంగాణ సమాచార పౌర సంబంధాల విభాగం ఈ పనులను ఈ వారంలో ప్రారంభించనుంది. 

Thursday, 25 December 2014

భారత 'రత్నాలు'


- బహుముఖ ప్రజ్ఞాశాలి మాలవ్యకు కూడా..
- మహోన్నత నేతలకు అత్యున్నత పౌర పురస్కారం 
- ఇద్దరిదీ నేడే జన్మదినం.. ఒకరోజు ముందు అవార్డు
 
- రాజకీయాలకతీతంగా స్వాగతించిన పార్టీలు 
టల్ బిహారీ వాజపేయి.. అతివాద పార్టీ నుంచి వచ్చినా.. మితవాద దృక్కోణంలో తన పాలనతో దేశవాసులను మెప్పించిన నేత! మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో ఆయన నిలువెత్తు లౌకికరూపం! మదన్ మోహన్ మాలవ్య.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.. హిందూ సమాజ సంఘటితానికి కృషిచేసిన సంఘ సంస్కర్త! ఒకరు స్వాతంత్య్రానంతర రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేస్తే.. మరొకరు స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశాన్ని ప్రభావితం చేశారు!!
ఈ ఇద్దరు గొప్ప నేతలకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఇద్దరూ హిందూత్వ భావాలు కలిగినవారు కావడం ఒక విశేషమైతే.. ఇద్దరి జన్మదినమూ ఒకే రోజు కావడం మరో ప్రత్యేకత! సంఘ్‌పరివారానికి సంబంధించిన ఒక వ్యక్తి భారతరత్న పురస్కారానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వాజపేయి ఆ కోవలోకి వస్తే.. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో మాలవ్య 12వ మహనీయుడు! ఈ ఇద్దరి జన్మదినాలకు ఒక రోజు ముందు వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారతరత్న అవార్డులను ప్రకటించారు...
          మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైన మదన్‌మోహన్ మాలవ్యను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మహోన్నత వ్యక్తిత్వాలతో దేశానికి ఎనలేని సేవలందించి, భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వీరికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ డిసెంబరు 24న ప్రకటన విడుదల చేసింది. 
వాజపేయి డిసెంబరు 25న 90వ పుట్టినరోజు జరుపుకోనుండగా, అదేరోజు మాలవ్య 153వ జయంతి కావడం విశేషం. సందర్భోచితంగా ఒకరోజు ముందు వారికి అవార్డు ప్రకటించటంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈ ఇద్దరు నేతలకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. అందుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ఇద్దరితో భారతరత్న పురస్కారం పొందినవారి సంఖ్య 45కు చేరింది. మరణానంతరం భారతరత్న పొందినవారిలో మాలవ్య 12వ వారు. గతేడాది ఈ పురస్కారాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్‌టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు ప్రకటించారు. వాజపేయి, మాలవ్యకు భారతరత్న ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ దేశం గర్వించదగ్గ గొప్పనేతలకు సముచిత గౌరవం లభించిందని వ్యాఖ్యానించారు. 
అజాత శత్రువు వాజపేయి
స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన నేతల్లో అటల్ బిహారీ వాజపేయి ముందువరుసలో ఉంటారు. 1998- 2004 మధ్య దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెస్సేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మహోన్నత వ్యక్తిత్వంతో దేశ రాజకీయాల్లో ఆయన అజాత శత్రువన్న పేరు సంపాదించుకున్నారు.
  రాజకీయ సభ అయినా, సమావేశమైనా వాజపేయి మాట్లాడుతున్నారంటే దేశమంతా గొప్ప హితోపదేశంలా వింటుంది. నేటితరం రాజకీయ నేతలంతా వాజపేయి అంతటి ఉపన్యాసకులు కావాలని కలలు కంటారంటే అతిశయోక్తికాదు. దేశ రాజకీయ యవనికపై బీజేపీని శక్తిమంతమైన రాజకీయపక్షంగా నిలబెట్టడంలో వాజపేయి నాయకత్వపటిమ పాత్ర ఎంత ఉందో, ఆయన వ్యక్తిత్వం పాత్ర కూడా అంతే ఉంది. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన వేలెత్తిచూపలేని గొప్ప వ్యక్తిత్వంతో తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. ప్రధానిగా దేశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా వాజపేయి చెరగని ముద్రవేశారు.
  శాంతిసామరస్యాలపై అచంచల విశ్వాసంగల ఆయన, పొరుగుదేశం పాకిస్థాన్‌తో స్నేహసంబంధాలకోసం బస్సుయాత్ర చేపట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దేశాభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యాలున్న వాజపేయి, సత్వరాభివృద్ధికి రహదారులే కీలకమని నమ్మి తన పదవీకాలంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయరహదారుల విస్తరణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. వయసుతోపాటు సంక్రమించిన అనారోగ్యంతో ఆయన కొన్నేండ్లుగా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. భారతరత్న పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి బీజేపీ నాయకుడు వాజపేయే కావటం గమనార్హం.
హిందూ జాతీయోద్ధరణ దివిటీ మాలవ్య
దేశాన్ని జలగలా పీల్చిపిప్పిచేసిన శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒకానొక దశలో వణికించి, ముచ్చెమటలు పట్టించిన నిప్పుకణికలాంటి స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ మదన్‌మోహన్ మాలవ్య. విద్యావేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఆయన, భారతీయ సమాజాన్ని ఆధునీకరించటంకోసం ఎనలేని కృషిచేశారు. బ్రిటిష్ అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా భారతీయులను పోరాటానికి సమాయత్తులను చేసి, ముందుకురికించారు.1886లో కలకత్తా (నేటి కోల్‌కతా)లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో మొదటిసారి పాల్గొన్న ఆయన ప్రసంగం విని దాదాభాయ్ నౌరోజీలాంటి మహామహులే అచ్చెరువొందారు. తన అసాధారణ నాయకత్వ పటిమతో 1909, 1918 సంవత్సరాల్లో రెండుసార్లు ఐఎన్‌సీకి అధ్యక్షుడయ్యారు. దురాచారాలతో ముక్కిమూలుగుతున్న హిందూ సమాజాన్ని సంస్కరించి, సంఘటితం చేసేందుకు 1914లో లాలా లజపతిరాయ్ తదితరులతో కలిసి అఖిల భారత హిందూమహాసభను స్థాపించారు. అదే అనంతరకాలంలో బలమైన హిందూ జాతీయవాద ఉద్యమానికి మూలమైంది. భారతీయులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు యూపీలో బనారస్‌లో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యావ్యాప్తికి విశేష కృషిచేశారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన మాలవ్యకు ఎప్పుడో భారతరత్న పురస్కారం ఇవ్వాల్సి ఉన్నా తగ ప్రభుత్వాలు ఆయనను నిర్లక్ష్యం చేశాయనే విమర్శ ఉంది. ఆలస్యంగానైనా ఎట్టకేలకు నరేంద్రమోదీ ప్రభుత్వం మాలవ్యను సమున్నతంగా గౌరవించింది.

Tuesday, 9 December 2014

నడిగడ్డ పౌరుషం.. గద్వాల సంస్థానం..

* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం 
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా అవతారం 
* మేల్కొనకుంటే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం
* కాకతీయుల ఏలుబడిలో వర్ధిల్లిన దో ఆబ్ ప్రాంతం
* 18వ శతాబ్దంలో కోట నిర్మాణం
* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యం
* దుండగుల చేతిలో ధ్వంసమవుతున్న చారిత్రక కట్టడం
* మేల్కొనకుంటే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం 
      రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. ఆనాటి కట్టడాలు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. ఒకప్పుడు స్వతంత్య్ర రాజ్యంగా ఎదిగిన గద్వాల సంస్థానంలోని మట్టి ప్రాకారాలు, ఇప్పుడు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.. కోటలో గుప్తనిధులు ఉన్నాయని కొందరు వాటిని ధ్వంసం చేయడంతో ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి.. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే కోట మచ్చకైనా కనిపించని పరిస్థితులు నెలకొనున్నాయి..
అనగనగనగా.. ఒక సంస్థానం.. కాకతీయుల కాలంలో దో ఆబ్ ప్రాంతంగా విరాజిల్లిన మహా నగరం.. ఆ నగరాన్ని ఆనుకొని 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి ప్రకారం.. చుట్టూ శత్రువులు దరి చేరలేని విధంగా మొసళ్లతో నిండిన పెద్ద కందకం.. అబ్బుర పరిచే శిల్ప కళా సౌందర్యం.. పౌరుషానికి మారుపేరుగా నిలిచిన ఇక్కడి రాజుల వీరమరణం.. ఇదంతా విద్వద్గద్వాలగా పేరుగాంచిన గద్వాల ఖిల్లా ప్రాశస్త్యం.. నవాబుల కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా బాసిల్లి, సాహితి, సకల కళలకు పుట్టినిల్లుగా నిలిచిన ఆ సంస్థానంపై ప్రత్యేక కథనం..
సంస్థానం ఆవిర్భావం
చరిత్ర ప్రకారం.. గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉంద్భవించిందట. రుద్రాంబ, ప్రతాపరుద్రుని కాలంలో రాయచూర్, దో ఆబ్ (రెండు నదులు ఉన్న ప్రాంతం) అరణ్య ప్రాంతాలుగా ఉండేవట. కాకతీయ సామంతులైన గోన వం శానికి చెందిన కామారెడ్డి, అతని కుమారుడు కాటారెడ్డి దో ఆబ్ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చి, అభివృద్ధిలోకి తీసుకొచ్చారట. ఐజ (అయిజ) నాడేగౌడ (ఒక ప్రాంతానికి అధిపతి) బుడ్డారెడ్డి స హాయ సహకారాలు అందించాడట. 
   క్రీ.శ. 1290 లో బుడ్డారెడ్డిని కాకతీయ సామంతులు మానవపాడు, బెళుదోణ, రాయచూర్, మోసలకల్లు, అలంపు రం, ఆదోని, ఐజ అనే ఏడు సీమలకు నాడగౌరికం (ఆధిపత్యాన్ని) ఇచ్చారట. క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం కావడంతో, సామంతులంద రూ స్వాతంత్య్రం ప్రకటించుకున్నారట. అదే సమయంలోనే ఐజ నాడేగౌడలు స్వస్థలం వీడి కర్నూలు మండలం గోసునూరు, అనంతపురములకు వెళ్లి, అక్కడి పాలకులైన వడెము వంశీయులకు సామంతులయ్యారట. అదే సమయంలో విజయనగరం రాజులు కర్నూలు, నంద్యాల తదితర భూ భాగాల ను స్వాధీన పర్చుకోగా, 1344లో హరిహరుడు ఏకశిలా నగరమును ముట్టడించినప్పుడు ఆ ముట్టడి లో ఐజ నాడేగౌడలు రాజుకు సహాయపడ్డారట. అందుకు ప్రతిఫలంగా నాడేగౌడలకు కర్నూలు మం డలంలోని కొన్ని గ్రామాలకు అధిపతులుగా చేశారట. 1347లో బహమనీ సుల్తానులు కర్నూల్, దో-ఆబ్, రాయచూర్ ప్రాంతాలను జయించడంతో, గౌడాలు సుల్తానుల వశమయ్యారట. తిరిగి వారి ప్రాం తాలను సాధించుకునేందుకు, బీజాపూర్ రాజులను సామంతులుగా కావాలని కోరారట. 15వ శతాబ్దం నాటికి ఐజ ప్రాంతాన్ని తిరిగి సాధించుకున్నారట. 17వ శతాబ్దం ప్రారంభంలో పెద్దనృపతి ఐజ, కందనూలు (కర్నూల్), సీమలకు నాడేగౌడగా నియమితులయ్యారట. ఇతను పూడూరు సీమకు నాడగౌడగా ఉన్న వీరారెడ్డి కూతురు బక్కమాంబను పెండ్లి చేసుకొని, పూడూరు సీమకు అధిపతి అయ్యాడట. పెద్దనృపతి కుమారుడు పెదసోమభూపాలుడు 166 3-1712 మధ్య నాడ గౌడరికంకు వచ్చాడట. ఇతని ఆధ్వర్యంలోనే గద్వాల సంస్థానం రూపుదిద్దుకున్నదట.
మట్టి గోడలతో కోట నిర్మాణం
18వ శతాబ్దం ప్రారంభంలో గద్వాల ప్రాంతానికి వచ్చిన పెదసోమభూపాలునికి, ఈ ప్రాంతంలో వేట కుక్కలను కుందేలు తరిమిన దృశ్యం కనిపించిందట. పౌరుషానికి పేరుగాంచిన ఈ గడ్డపై కోటను నిర్మించాలని భావించి, వెంటనే ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాడట. 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి గోడలను ఏర్పాటు చేసి, కోటను నిర్మించాడట. చుట్టూ పెద్ద కందకాన్ని తవ్వించి, శత్రువులు కోటలకి రాకుండా అందులో మొసళ్లను వదిలాడట. కోట మధ్యలో రాజప్రసాదాలు, సౌద ప్రాంగణాలు, ఏడంకణాల సోఫా, ప్రాకారాలను నిర్మించాడట. పూడూరును చాళుక్యులు పాలించగా, చాళుక్యులు, పల్లవులకు జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గద, వాలము అనే ఆయుధాలను ప్రయోగించాడట. అందుకుగానూ తాను చేపట్టిన కోటకు గదవాల అని పేరు పెట్టారట.
వీర మరణం పొందిన సోమభూపాలుడు
1663లో అస్తిత్వంలోకి వచ్చిన గద్వాల సంస్థానం ఆనాటి నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుని హయంలో స్వత్రంత్య రాజ్యంగా ఉండేదట. ఢిల్లీలో మొగల్ సింహాసనాన్ని అధిష్టించిన బహదూర్‌షా బలహీనుడుగా ఉండడంతో, దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్ తనకుతానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడట. బహదూర్‌షా అనుయాయులైనందున గద్వాల సంస్థానాన్ని, సంస్థానం ఆధీనంలో ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ముల్క్ తన సేనాని దిలీప్‌భానుడిని గద్వాల సంస్థానంపై దాడి చేసేందుకు పంపించాడట. పెదసోమభూపాలుడికి, దిలీప్‌భానుడికి మధ్య కర్నూల్ సమీపంలోని నిడుమార్ వద్ద యుద్ధం జరుగగా, సోమభూపాలుడు వీరమరణం పొందాడట. కాని నిజాం సంస్థానాన్ని వశం చేసుకోలేదట. పెదసోమభూపాలుని భార్య లింగమ్మ ముల్క్‌తో సంధి చేసుకొని, అతని అధికారాన్ని అంగీకరించిందట. నిజాం రాజ్యంలో గద్వాల సంస్థానం స్వతంత్య్ర రాజ్యంగా అవతరించి, 1949 వరకు నిజాం రాజ్యంలో విశేష మర్యాదలు అందుకున్నదట.
రాజులు, మహారాణుల పాలన
1663 నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుడు (49సంవత్సరాలు), దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్‌తో సంధి ఒప్పందం కుదుకుర్చుని పెదసోమభూపాలుని భార్య లింగమ్మ 1712 నుంచి 1723 వరకు తనకు నమ్మిన బంటు అయిన కళ్ల వెంకటన్న, రమణయ్యలతో రాజ్య పాలన సాగించారు. అనంతరం అమ్మక్క 1723-24 వరకు, రాణి లింగమ్మ 1724-1737, రాజా తిరుమల్‌రావు 1739-1742, రాణి మంగమ్మ 1742-1743, రాణి లింగమ్మ, రాణి చుక్కమ్మ 1743-47, రాజారామభూపాలరావు 1748-61, రాజా సోమభూపాలుడు 1762-93, రాజా రామభూపాలుడు-2 1794-1807, రాజా సీతరామభూపాలుడు-1 1807-40, 1840-41 రాణి లింగమ్మ పాలించింది. రాజాసోమభూపాలుడు-1 (ఒక్క ఏడాది), సీతారామభూపాలుని మూడో భార్య రాణి వేంకట లక్ష్మమ్మ 1841-65, రాజారాంభూపాల్-2 1865-1901, రాజా సీతారామభూపాలుడు 1901-24, అనంతరం అతని భార్య మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ 1924-49 వరకు పాలనను కొనసాగించారు.
ప్రభుత్వ ఆధీనంలో రాజప్రసాదాలు
1949లో రాణి పాలన ముగిసిన అనంతరం కోటలోని వివిధ రాజప్రసాదములు, అద్భుత కట్టడాలలో కళాశాలను ఏర్పాటు చేశారు. అందులో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలతోపాటు వివిధ విభాగాల పరిశోధన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు సెక్రటరీగా దివంగత నేత పాగపుల్లారెడ్డి వ్యవహరించారు. అనంతరం డీకే సత్యారెడ్డి వ్యవహరించారు. 1965లో కళాశాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 
ఆలయాలు మంత్రాలయం పరం
కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, లక్ష్మిదేవి, శ్రీ రాముని ఆలయాలతోపాటు ఎన్నో ప్రధానాలయాలు ఉన్నాయి. రాజుల పాలన అంతరించడంతో వాటికి ఆదరణ తగ్గింది. నానాటికి ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటుడడంతో ఆ ఆలయాలను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మంత్రాలయ పీఠాధిపతులతో సంప్రదింపులు జరిపి సంస్థానాధీశుల వారసుల అనుమతితో 2007లో మంత్రాలయ పీఠానికి అప్పచెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు మంత్రాలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ధ్వంసమవుతున్న శిల్ప సంపద
కోటలోని ప్రధాన కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొందరు గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పటికే కోటలోని చాలా కట్టడాలను ధ్వంసం చేశారు. కోట గోపురం మీద ఉన్న ఐదు కలశాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవే గాక కోటలోని చాలా చోట్ల తవ్వకాలు చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అ లసత్వం కారణంగా ప్రస్తుతం కోట శిథిలమైపోయిం ది. కోట బురుజులు ఆక్రమణకు గురయ్యాయి. చుట్టూ ఉన్న కందకాలు పరుల పాలయ్యాయి. 
ప్రభుత్వంపైనే భారం
సీమాంధ్రుల పాలనలో ఇక్కడి కట్టడాలు ఆదరణలకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అందున తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో ఆశలు రెక్కెత్తున్నాయి. అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, కోట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అందరూ ఎదురు చూస్తున్నారు.

Thursday, 4 December 2014

ఓయూ ఆర్ట్స్‌కళాశాలకి 75 వసంతాలు


దువుల ఒడిలో చైతన్యదీప్తిగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల అక్కడ...వంద పూలు వికసించినయ్ వేయి ఆలోచనలూ సంఘర్షించినయ్ అస్తిత్వ కాంక్షలూ రగిలినయ్ చైతన్య భావాలూ పురుడుపోసుకున్నయ్ అభ్యుదయ ప్రపంచానికి కొత్త దారులూ తెరుచుకున్నయ్ ఏ ఆయుధాలూ లేకుండానే శాంతియుత విప్లవాలూ ముస్తాబైనయ్ కాలం పురోగమిస్తున్న కొద్దీ సమాజానికి అన్నమంత అవసరమైన విప్లవాలూ జలించినయ్ సమసమాజ నిర్మాణానికి కొత్త బాటలు పరుచుకున్నయ్...            విద్య.. అధ్యయనం.. లక్ష్యసాధన.. నిరంతర శోధన.. ఇవన్నీ ఓయూ ఆర్ట్స్‌కళాశాల సొంతం. ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడంతో పాటు పలు ఉద్యమాలకు కేంద్రంగా వర్ధిల్లింది. ఆర్ట్స్ కళాశాల లేని ఉస్మానియా యూనివర్సిటీని ఉహించలేం. నిజాంకాలం నుంచి ఎన్నో మైలురాళ్లను దాటుతూ, ఉద్యమ ప్రస్థానంలో త్యాగాలకు, గాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అక్షరాలతో పాటు అలుపెరగని పోరాట పాఠాలు నేర్పిన కళాశాల నేడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నా వన్నె తరగని విద్యా శిఖరంగా నిలిచింది.
   1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలోనే పరీక్షల కేంద్రం, వీసీ కార్యాలయం, లా, తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. కళాశాల 1919 ఆగస్టు 28న గన్‌ఫౌండ్రిలో 25మంది ఉపాధ్యాయులు, 225 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులతో ప్రారంభమైంది. కళాశాలకు సర్ రోస్ మసూద్ మొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కళాశాల నిర్మాణానికి 1934 జులై 5న ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం 1939 డిసెంబర్ 4న పూర్తి కావడంతో అదే రోజున ఆర్ట్స్ కళాశాలను నిజాం ప్రారంభించారు. అప్పటి నైజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ వర్సిటీకి చాన్స్‌లర్‌గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. 
అకడమిక్, విద్యా విభాగాలు..
ఆర్ట్స్‌కళాశాలలో చదివిన ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కళాశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను 1973లో వేరు చేశారు. దీన్ని పూర్తిగా పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పరిశోధనలకు ఉపయోగపడేలా పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలగా మార్చారు. ప్రస్తుతం కళాశాల 25 విభాగాలతో సేవలు కొనసాగిస్తున్నది. 2207 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ విభాగాలలో మొదటి సంవత్సరంలో 163 మంది, రెండవ సంవత్సరంలో 157 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు.
అధ్యాపకులు.. సిబ్బంది
కళాశాలలో 56 మంది అధ్యాపకులు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 125 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితోపాటుగా అకడమిక్ కన్సల్టెంట్‌లు, కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. 
33 మంది ప్రిన్సిపాల్స్..
కళాశాల ప్రారంభమైన్పటి నుంచి ఇప్పటివరకు 33 మంది ప్రిన్సిపాల్స్‌గా సేవలు అందించారు. ప్రిన్సిపాల్ రోస్ మసూద్ మొదటి వ్యక్తికాగా, ప్రస్తుతం ప్రొ.టి.క్రిష్ణారావు కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌లుగా పనిచేసిన సిద్ధిఖీ, తిరుపతిరావులు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేయడం విశేషం. గతంలో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ప్రొ.మల్లేష్ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా వెళ్లారు. 
అపురూపం... కళాశాల ఆర్కిటెక్చర్..

7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆర్ట్స్ కళాశాల నిర్మాణం కోసం కృషి చేశారు. ఆర్ట్స్ కళాశాల ఈజిప్టు కైరోలోని సుల్తాన్ హసన్ కళాశాలను పోలి ఉందని, వాటి నమూనాగా చెప్తారు. 16 వందల ఎకరాల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల భవనం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కళాశాలలో అన్ని వైపులా వెలుతురు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు. కళాశాల భవనం మధ్యలో నిర్మాణంలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లున్నాయి. రెండు విమానాలు నిలిచిపోయేవిధంగా రాతి నిర్మాణాలు ఉన్నాయి. పింకిష్ రాతి కట్టడాలు అజంతా, ఎల్లోరా శిల్పాలను పోలీ ఉంటాయి. మొదటి, రెండవ అంతస్తు పూర్తిగా షాబాద్ బండలతో నిర్మించారు. సెక్యులర్ భావాలను ప్రతిబింబించేలా ఈ కట్టడాన్ని నిర్మించారు. హిందూ దేవాలయ నిర్మాణాలను పోలి ఉండే సరెసనిక్, ఉస్మాన్ షాహి, మధ్య ఇస్లాం, అరబిక్, మూరిష్‌లతో పాటు గోతిక్ శైలిలో దీని నిర్మాణం జరిగింది. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు పొడవైన స్తంభాలను చూస్తే వీక్షకులు అచ్చెరువొందాల్సిందే. వీటి మధ్య పెద్ద ఆర్చ్ ఉంటుంది. డోమ్ నిర్మాణం డబుల్ డెక్‌డ్ నిర్మాణంగా చెప్తారు. మొదటి డెక్ 16 కిటికీలు, రెండవ డెక్ మొదటి డెక్‌ను కలిపేవిధంగా మరో16 కిటికీలు ఉంటాయి. ఒకదాని నుంచి వెలుతురు మరో దానిపై ప్రతిబింబించేలా వీటిని నిర్మించారు. భవన నిర్మాణంలో అవసరమైన చోట అద్భుతమైన షాండ్లియర్‌ను వాడి అందాన్ని మరింత ఇనుమడింపజేశారు.
నిర్మాణానికి ప్రపంచదేశాల సందర్శన..
భవన నిర్మాణం కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్‌లను నియమించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలైన విశ్వవిద్యాలయాలతో పాటు యూరప్, జపాన్, ఈజిప్ట్, టర్కీ తదితర దేశాలను సందర్శించారు. బెల్జియంకు చెందిన ఇ.జస్సార్‌ను సలహాదారుగా నియమించి ఆర్ట్స్ కళాశాల, లా, ఇంజనీరింగ్ కళాశాలలు, లైబ్రెరీ, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. 
టూరిస్టు స్పాట్‌గా..
ఓయూకు వచ్చే విదేశీయులెందరో ఆర్ట్స్ కళాశాలను సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పర్యటనకు వచ్చే కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఈ భవన నిర్మాణాన్ని చూడకుండా వెనుదిరగరు. నగరవాసులు కూడా వారాంతాల్లో, సాయంత్రం సమయం ప్రశాంతంగా గడిపేందుకు ఈ భవన ఆవరణనే ఎంచుకుంటారు. 
మైలురాళ్లు.. ప్రశంసలు...
యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు, యూనివర్సిటీ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్(యూపీఈ) గుర్తింపు పొందడంలోనూ ఓయూ ఆర్ట్స్‌కళాశాల పాత్ర ఎంతో ఉంది. ఓయూ ఆర్ట్స్‌అండ్ సోషల్ సైన్స్ కళాశాలను గుర్తించి భారత ప్రభుత్వం 1969 మార్చి 15న ఈ భవనంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 1981లో రాష్ట్ర ప్రభుత్వం పురాతన కట్టడాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆర్ట్స్ కళాశాలను హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించింది. 
అందరి చూపు ఆర్ట్స్‌కళాశాల వైపే...
ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్స్‌కళాశాలకు గుర్తింపు ఉంది. పలువురు ప్రముఖులు ఈ కట్టడం చూసి ముగ్ధులయ్యారు. కళాశాలలో విద్య, వసతులు, సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధానులు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, ఐకే.గుజ్రాల్, పీవీ నర్సింహారావు, పాలస్తీనా మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్, జోర్డాన్ రాజు హుస్సేన్, మైసూర్ మహారాజు జయ చామరాజ వడియార్, మద్రాసు గవర్నర్ హెచ్‌జీ ప్రకాశ్ తదితరులు కళాశాలను సందర్శించారు. 
ఉద్యమాలకు కేంద్రంగా....
ఎన్నో ఉద్యమాలు, సమావేశాలు, కీలక ఘట్టాలకు ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది. పలు పార్టీల విద్యార్థి బహిరంగ సభలకు కళాశాలే వేదికైంది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన అనంతరం జేఏసీ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన విద్యార్థుల సింహగర్జన ఆర్ట్స్ కళాశాల ఆవరణలోనే జరిగింది. కొందరు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసుకుంది కూడా ఈ భవన పరిసరాలలోనే కావడం విషాదకరం.
ముఖ్య సమావేశాలకు వేదికగా రూం నెం. 57...

సామాజిక, చైతన్య పూరితమైన సమావేశాలు, సదస్సులకు పుట్టినిల్లుగా ఆర్ట్స్ కళాశాలలోని రూం. నెం. 57 భాసిల్లుతోంది. సామాజిక, అస్తిత్వ ఉద్యమాలకు కేంద్రంగా, చర్చలు, సమావేశాలు, సంఘాల ఆవిర్భావం, కార్యవర్గాల ఎన్నిక, సమావేశాలకు ఈ గదితోపాటు న్యూ సెమినార్ హాల్ వేదికగా నిలుస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులకు వీటితో అనుబంధం ఉంది. 
ప్రజా ప్రతినిధులకు కేంద్రబిందువు..
ఓయూ ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారిలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితర ప్రముఖులు ఎందరో ఉన్నారు. మాజీ ఎంపీ జైపాల్‌రెడ్డి, ఎంపీ కే.కేశవరావు తదితరులతో పాటు ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్ట్స్‌కళాశాలతో అనుబంధం ఉన్నావారే. సీవీ.ఆనంద్, ఉమేష్‌చంద్ర, పరదేశీనాయుడు, కమలాసన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితర అధికారులు ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారే. 
ఎంతోమంది సేవలకు నిలయం..
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు సంజయ్‌బారు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సీ.నారాయణరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి, ఓయూ మాజీ వీసీలు ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వైకుంఠం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీలు ప్రొఫెసర్ ఎన్. గోపి, ప్రొఫెసర్ నాయిని కృష్ణకుమారి, ప్రొఫెసర్ జీవీ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, ప్రొఫెసర్ ఆవుల మంజులత, ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ పి. యశోదారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్‌లు ప్రొఫెసర్ మల్లేషం, ప్రొఫెసర్ వెంకటాచలం, సభ్యురాలు ప్రొఫెసర్ సూర్యధనుంజయ లాంటి ఎంతోమంది ఇక్కడ పాఠాలు బోధించడమో, విద్యాభ్యాసం చేయడమో చేశారు. 
వేడుకకు హాజరుకానున్న ప్రముఖులు..
ఆర్ట్స్ కళాశాల 75వ వసంతాల ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వేడుకలకు అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, వర్సిటీ ఇంచార్జి వీసీ వికాస్ రాజ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ. సురేష్‌కుమార్, మాజీ వీసీలు ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ప్రొఫెసర్ టి. తిరుపతిరావు, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. మధుసూదన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
నిరంతర కార్యక్రమాలు...ఉత్సవాలు
కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది మొత్తం కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రకాల ఉత్సవాలు, సదస్సులు, సమావేశాలు ఇందులో భాగం కానున్నాయి. ఆర్కిటెక్చ్‌ర్, అకడమిక్ అంశాలపై కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సింపోజియంలు నిర్వహించనున్నారు. ఆర్ట్స్‌కళాశాల ఆవశ్యకత జరిగిన అంశాలతో కూడిన సావనీర్‌ను తీసుకువస్తున్నారు. కళాశాల ఘనకీర్తిని చాటిచెప్చేలా ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. 
కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం..
ఆర్ట్స్ కళాశాల అందరికీ ఒక రోల్‌మాడల్. ఎన్నో ఉన్నత లక్ష్యాల సాధనకు వేదికగా నిలిచింది. విద్యావ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. నేను ఆర్ట్స్‌కళాశాలలో చదువుకున్నా అని గర్వంగా చెప్పుకునేలా విద్యా బోధన చేస్తున్నాం. కళాశాల కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పించాం. 
-ప్రొఫెసర్ క్రిష్ణారావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్
చారిత్రక ప్రాధాన్యతకు నిలయం ఆర్ట్స్ కళాశాల..
మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా ఆర్ట్స్ కళాశాల భవన కట్టడం ఉంది. 1985లో విజన్ ఆఫ్ ఉస్మానియాను ప్రారంభించి, అందులో విశ్వవిద్యాలయ చరిత్ర, కళాశాల ప్రాధాన్యత, భవన నిర్మాణ ఫొటోలు ఉంచడం విశేషం. విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఆర్ట్స్ కళాశాల పాత్ర ఎంతో ఉంది. కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఓయూకు గర్వకారణం. 
-ఫజులుద్దీన్, ఓయూ మనుస్క్రిప్ట్స్ ఇన్‌చార్జి
మేధావులను అందించిన ఘనత..
ఓయూ ఆర్ట్స్‌కళాశాల దేశంలోనే గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు తలమానికంగా నిలుస్తుంది. ఎంతోమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మేధావులను అందించిన ఘనత కళాశాలది. ఇలాంటి కళాశాలలో చదవడం, పనిచేయడం అదృష్టమే. నేడు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉంది. 
- ప్రొ. ఎస్వీ.సత్యనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు
ప్రపంచ స్థాయి గుర్తింపు..
ఓయూ అంటేనే ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలగా చెప్తారు. ఈ కళాశాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఇలాంటి కట్టడం ఓయూలో ఉండటం గర్వకారణం. కళాశాల వైభవాన్ని, ఖ్యాతిని చాటేలా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు కృషిచేయాలి. నేడు 75 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం సంతోషం కలిగిస్తోంది.
- ప్రొ.లిలిత్‌కుమార్, ప్రభుత్వపాలనశాస్త్ర విభాగాధిపతి, ఆర్ట్స్ కళాశాల

Tuesday, 2 December 2014

తన పాలన మన ముద్ర

* ఆరు నెలల్లో దశాబ్దాల ఆశలకు దిశ
   పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణలో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆరు దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలు కోల్పోయిన వైభవాన్ని పున:ప్రతిష్ట చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ పనితీరు అంచనాకు ఆరునెలల కాలం పెద్ద సమయం కాకపోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సర్కారు పయనం వేగంగా సాగుతున్నది. 
పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనిపిస్తున్నది. పండుగైనా.. పథకమైనా అంతా మనదే. మన పీవీని..మన కాళోజీని..మన దాశరథిని.. మన బాపూజీని గౌరవించుకున్నా.. లాల్‌దర్వాజ బోనాల జాతరైనా.. ట్యాంకుబండ్ మీద బతుకమ్మ విశ్వరూపం కనిపించినా అన్నింటా స్వరాష్ట్ర సౌరభాల పరిమళాలే. లక్ష కోట్ల బడ్జెట్ అయినా.. ప్రపంచాన్ని ఆకర్షించే పారిశ్రామిక విధానమైనా.. సమగ్ర కుటుంబ సర్వే అయినా.. చెరువుల పునరుద్ధరణ పథకమైనా.. వాటర్ గ్రిడ్ పథకమైనా.. దేశమంతా ప్రశంసలు కురిపించే కార్యక్రమాలే. 
       రేపటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే విధానాలే. పారిశ్రామిక వైభవానికి శ్రీకారం చుట్టబోతున్నాం. పదివేల కోట్లతో రహదార్లు వేసుకోబోతున్నాం. వెయ్యికోట్లతో వంతెనలు కట్టుకోబోతున్నాం. ఇంటింటికీ నల్లా నీరు పట్టుకోబోతున్నాం. చెరువులు నింపుకోబోతున్నాం. అవును అక్షరాలా బంగారు తెలంగాణను సాధించుకోబోతున్నాం. 
మూడునెలల క్రితం కశ్మీర్‌లో ప్రళయ భీకరంగా భారీ వరదలు వచ్చాయి. దేశంలో అనేక రా ష్ర్టాలు చలించిపోయి అనేక రకా ల సహాయం అందించాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలకు నీటిశుద్ధి మిషన్లు పంపించింది. అక్కడి ప్రజలు ఈ సహాయాన్ని వేనోళ్ల కొనియాడారు. అక్కడి సీఎం మరిన్ని మిషన్లు పంపించమని కోరారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆహారం కన్నా ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య బురదనీరు. 
      ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాన్ వచ్చింది.. మళ్లీ చాలా మంది చాలా రకాల సహాయాలు చేశారు. తుఫాన్ ధాటికి అక్కడ అన్నింటికన్నా ఎక్కువగా కుప్పకూలింది విద్యుత్ రంగమే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు, పరికరాలు, సిబ్బందిని పంపించింది. అతి స్వల్పకాలంలో అనేక గ్రామాల్లో దీపాలు వెలిగాయి. ఈ రెండు ఉదాహరణలు చాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనితీరు నిర్ధారించడానికి. 
    సమస్య ఏమిటి? పరిష్కారమేమిటి? ప్రణాళిక ఏమిటి? ఇదే కేసీఆర్ అనుసరించే పాలనా విధానం. ఎక్కడా తొట్రుపాటు ఉండదు. గందరగోళం ఉండదు. లక్ష్యానికి నేరుగా గురిపెట్టడం.. ఛేదించడం అంతే. ఈ విధానం వల్లనే ఆరునెలల తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కలలు నెరవేర్చే దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తు మీద భరోసా ఇస్తున్నాయి. 
పోగొట్టుకున్నవి పొందే దిశగా..
జూన్ రెండవ తేదీన అధికార పగ్గాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటినుంచి ఇప్పటిదాకా చేస్తున్నది ఒకటే .... ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఏం పొగొట్టుకున్నారో అవి అందించడం. మొక్కవోని దీక్షతో ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నది. విమర్శలు రావొచ్చు.. ఎదురు దాడులు జరగొచ్చు.. అయినా కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఉద్యోగుల సమస్య.. ఫీజు రీఇంబర్స్‌మెంట్ సమస్య... గురుకుల్ భూముల విముక్తి .. చెరువుల పునరుద్ధరణ..అన్నింటా అదే విధానం. రుణమాఫీలు, ఆసరా., చేనేత రుణ మాఫీలు.. వంటివి అన్నీ ప్రజలకు తక్షణ మేలు కోసమేననే విషయం కేసీఆర్‌కు తెలుసు అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అనే దీర్ఘకాల ప్రణాళికను ఆయన ఎక్కడా విస్మరించలేదు. 
        పాలన కాస్త దారిన పడగానే తెలంగాణ జీవనరేఖ అయిన గొలుసుకట్టు చెరువుల అంశాన్ని తీసుకున్నారు. డజన్ల కొద్దీ సమీక్షల తర్వాత కార్యక్రమాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. తెలంగాణ కరెంటు కష్టాలు తెలిసివాడు కావడం వల్లనే విద్యుత్ ఉత్పత్తిని భారీగా విస్తరించే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. మూడేండ్లలో రెప్పపాటు కరెంటు కూడా పోదు అని ఢంకా బజాయించడం వెనక కేసీఆర్ ఆత్మవిశ్వాసం దాగిఉంది. పాలనలోనైనా పథకాల్లోనైనా సంపూర్ణంగా తెలంగాణ ముద్ర వేశారు. గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా తెలంగాణ చరిత్రను దేశానికి చాటారు. 
       తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. ట్యాంకుబండ్ మీద జరిగిన బతుకమ్మ పండుగలు నాలుగు కోట్ల ప్రజలను సమ్మోహితులను చేశాయి. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? అని వెకిలి ప్రశ్నలు వేసిన వారికి బతుకమ్మ పండగ వైభవం సమాధానం చెప్పింది. ఒక రాష్ట్రం ఆత్మ గౌరవంతో పాలన చేసుకుంటే ఎలా ఉంటుందో అద్దం పట్టింది. దశాబ్దాల తరబడి అవహేళనలకు గురైన చోట మన రాష్ట్రం మన పండుగ అనుకోవడంలోని గొప్ప భావనను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర చిహ్నాల ప్రకటనలో అదే ముద్ర స్పష్టమైంది. 
     మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జయశంకర్ సార్, ప్రజాకవి కాళోజి నారాయణరావు, సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణామాచారి , ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని నిర్వహించింది. విప్లవ వీరుడు కొమురం భీమ్, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా తెలంగాణ వైతాళికుల జయంత్యుత్సవాల నిర్వహణ ద్వారా తెలంగాణవాదుల మన్ననలు పొందారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు భారీ నిధులు, రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు సెలవులు, దూరదర్శన్‌లో తెలంగాణ చానెల్‌కు యాదగిరి పేరు అన్నింటా తెలంగాణ ముద్ర వేశారు. 
మ్యానిఫెస్టో అమలు దిశగా...:
కేసీఆర్ అధికారం చేపట్టిన రెండు రోజులు తిరగకుండానే నేరుగా అధికారులతో విశ్లేషణలు ప్రారంభించారు. రాజధాని నగరంలో పరిస్థితిని వాకబు చేసి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే ఊపులో వివిధ శాఖల అధ్యయనం ఆదేశాలు కొనసాగాయి. తొలి మంత్రిమండలి సమావేశంలోనే 43 తీర్మానాలు ఆమోదించి రికార్డు సృష్టించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన దాదాపు అన్ని వాగ్దానాలకు మంత్రిమండలిలో అధికారిక ముద్ర వేయించారు. చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని చాటారు. అసెంబ్లీ సమావేశంలోనూ అవే వెల్లడించారు. 
     మ్యానిఫెస్టోలోని పంటరుణాల మాఫీ అంశంపై అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ప్రక్రియ ప్రారంభించారు. రిజర్వ్‌బ్యాంకు పూర్తి స్థాయి సహాయ నిరాకరణతో ఎదురైన ఇబ్బందులను దాటుకుని రూ. 4,200 కోట్లు విడుదల చేసి రుణమాఫీని విజయవంతంగా అమలు చేశారు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టారు. ఎన్నో విమర్శలు.. ఎన్నో అభాండాలు.. లెక్క చేయకుండా పూర్తి చేశారు. దళితులకు భూ పంపిణీ, ఆసరా పథకం, ఆహార భద్రత పథకం, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఆటో, ట్రాక్టర్ ట్రాలీల పన్నుల రద్దు..కల్లు దుకాణాల పునరుద్ధరణ, ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంటు, ఉద్యమ కేసులు ఎత్తివేత, ఇలా ఒక్కొక్కటిగా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగించారు. తాజా బడ్జెట్‌లో మైనార్టీలకు, దళితులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు భారీగా నిధులు కేటాయించారు. ఓవైపు వ్యవసాయ రంగానికి భారీ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పారిశ్రామిక విధానం మీద భారీ కసరత్తు జరిపారు. ఇక సంక్షేమం మరొకరు అందుకోని స్థాయికి తీసుకువెళ్లారు. 
భారీ స్వప్నాలు..:
ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయన కలలు, ప్రణాళికలు అన్నీ భారీవే. జనగణన ఎవరు చేసినా నెలల తరబడి జరుపుతారు. కానీ కేసీఆర్ ఒక్క రోజులో చేయాలనుకున్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులను రంగంలోకి దించి సాధించారు. హరిజనులకు జానా బెత్తెడు భూమి ఇచ్చే చోట మూడెకరాలు అన్నారు. ఏడాది ఖర్చుకూడా అన్నారు. తాగునీటి సమస్య వస్తే సమస్యాత్మక గ్రామాలు గుర్తించి నీరివ్వడం సాధారణంగా అంతా చేస్తారు. కానీ కేసీఆర్ రాష్ట్రమంతా నీరివ్వాలని ప్రతిపాదించారు. అలాగే చెరువులు.. 45 వేల చెరువులు అన్నీ పునరుద్ధరించాలనుకున్నారు.. పనులు పట్టాలెక్కించారు. విద్యారంగ అభివృద్ధి కేజీ టు పీజీ అన్నారు..హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఇక జరిగేది కాదని అంటారంతా. కానీ కేసీఆర్ దాన్ని మంచినీటి చెరువుగా చూడాలనుకున్నారు. వినాయక నిమజ్జనాలకు ప్రత్యామ్నాయం చెప్పారు. నలాల నీరుకు దారి చూపించారు. చెరువు నీరంతా తోడిపారేయాలన్నారు. ఇవాళ ఆ తటాకం చుట్టూ ఆకాశహర్మ్యాలు కలగంటున్నారు. అదికూడా ప్రపంచంలో అన్నింటికన్నా ఎత్తుగా ఉండాలని.. అవును హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచమంతా మార్మోగాలంటే అది కావాలిసిందే. ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి అంటే పాత బోర్నవీటా డబ్బాలాంటి హైటెక్‌సిటీ అనబడే ఓ వృత్తకార భవనమేనా? ప్రపంచమంతా మెడలు విరిగేలా తలెత్తి చూసే ఆకాశహర్మ్యం రేపు హైదరాబాద్ ఐకాన్ కాబోతున్నది. నిజాం కట్టిన ట్యాంకుబండ్‌కు రంగులేసి తామే కట్టినంత బిల్డప్ ఇచ్చిన సీమాంధ్ర ముద్రలు సమూలంగా తుడుచుకుపోనున్నాయి. ఒక్క పీవీ ఎక్స్‌ప్రెస్ వే కట్టి అహో ఓహో అన్నారు సీమాంధ్ర పాలకులు. నగరానికి నాలుగు దిక్కులా వాటిని తెస్తున్నారు. నగరంలో మల్టీలేయర్ స్కైవేలకు ప్రణాళికలు వేస్తున్నారు.యాదగిరిగుట్టను వాటికన్ తరహా అభివృద్ధి అన్నారు. తక్షణమే వందకోట్లు విడుదల చేశారు. 
రాజకీయ చాణక్యం..:
ఆరు నెలల కాలం అంటే హానీమూన్ పీరియడ్ ముగిసినట్టేననేది రాజకీయ నిర్వచనం. కానీ ఆరు నెలల కాలంలో కేసీఆర్ రాజకీయంగా విశ్వరూపం చూపించారు. 
మూడు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలు కూడా ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ఓ ప్రకటన చేశారు. సోనియా తెలంగాణ ఇస్తే ... కేసీఆర్ ఇంటిముందు ఎవరూ మిగలరు అంటూ ప్రకటన చేశారు. కానీ ఇవాళ గాంధీ భవన్‌ముందు జనసంచారం తగ్గిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా వెలవెలబోతున్నది.