చదువుల ఒడిలో చైతన్యదీప్తిగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల అక్కడ...వంద పూలు వికసించినయ్ వేయి ఆలోచనలూ సంఘర్షించినయ్ అస్తిత్వ కాంక్షలూ రగిలినయ్ చైతన్య భావాలూ పురుడుపోసుకున్నయ్ అభ్యుదయ ప్రపంచానికి కొత్త దారులూ తెరుచుకున్నయ్ ఏ ఆయుధాలూ లేకుండానే శాంతియుత విప్లవాలూ ముస్తాబైనయ్ కాలం పురోగమిస్తున్న కొద్దీ సమాజానికి అన్నమంత అవసరమైన విప్లవాలూ జలించినయ్ సమసమాజ నిర్మాణానికి కొత్త బాటలు పరుచుకున్నయ్... విద్య.. అధ్యయనం.. లక్ష్యసాధన.. నిరంతర శోధన.. ఇవన్నీ ఓయూ ఆర్ట్స్‌కళాశాల సొంతం. ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడంతో పాటు పలు ఉద్యమాలకు కేంద్రంగా వర్ధిల్లింది. ఆర్ట్స్ కళాశాల లేని ఉస్మానియా యూనివర్సిటీని ఉహించలేం. నిజాంకాలం నుంచి ఎన్నో మైలురాళ్లను దాటుతూ, ఉద్యమ ప్రస్థానంలో త్యాగాలకు, గాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అక్షరాలతో పాటు అలుపెరగని పోరాట పాఠాలు నేర్పిన కళాశాల నేడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నా వన్నె తరగని విద్యా శిఖరంగా నిలిచింది.
1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలోనే పరీక్షల కేంద్రం, వీసీ కార్యాలయం, లా, తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. కళాశాల 1919 ఆగస్టు 28న గన్‌ఫౌండ్రిలో 25మంది ఉపాధ్యాయులు, 225 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులతో ప్రారంభమైంది. కళాశాలకు సర్ రోస్ మసూద్ మొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కళాశాల నిర్మాణానికి 1934 జులై 5న ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం 1939 డిసెంబర్ 4న పూర్తి కావడంతో అదే రోజున ఆర్ట్స్ కళాశాలను నిజాం ప్రారంభించారు. అప్పటి నైజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ వర్సిటీకి చాన్స్‌లర్‌గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు.
అకడమిక్, విద్యా విభాగాలు..
ఆర్ట్స్‌కళాశాలలో చదివిన ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కళాశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను 1973లో వేరు చేశారు. దీన్ని పూర్తిగా పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పరిశోధనలకు ఉపయోగపడేలా పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలగా మార్చారు. ప్రస్తుతం కళాశాల 25 విభాగాలతో సేవలు కొనసాగిస్తున్నది. 2207 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ విభాగాలలో మొదటి సంవత్సరంలో 163 మంది, రెండవ సంవత్సరంలో 157 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు.
అధ్యాపకులు.. సిబ్బంది
కళాశాలలో 56 మంది అధ్యాపకులు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 125 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితోపాటుగా అకడమిక్ కన్సల్టెంట్‌లు, కాంట్రాక్టు ఉద్యోగులున్నారు.
33 మంది ప్రిన్సిపాల్స్..
కళాశాల ప్రారంభమైన్పటి నుంచి ఇప్పటివరకు 33 మంది ప్రిన్సిపాల్స్‌గా సేవలు అందించారు. ప్రిన్సిపాల్ రోస్ మసూద్ మొదటి వ్యక్తికాగా, ప్రస్తుతం ప్రొ.టి.క్రిష్ణారావు కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌లుగా పనిచేసిన సిద్ధిఖీ, తిరుపతిరావులు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేయడం విశేషం. గతంలో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ప్రొ.మల్లేష్ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా వెళ్లారు.
అపురూపం... కళాశాల ఆర్కిటెక్చర్..
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆర్ట్స్ కళాశాల నిర్మాణం కోసం కృషి చేశారు. ఆర్ట్స్ కళాశాల ఈజిప్టు కైరోలోని సుల్తాన్ హసన్ కళాశాలను పోలి ఉందని, వాటి నమూనాగా చెప్తారు. 16 వందల ఎకరాల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల భవనం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కళాశాలలో అన్ని వైపులా వెలుతురు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు. కళాశాల భవనం మధ్యలో నిర్మాణంలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లున్నాయి. రెండు విమానాలు నిలిచిపోయేవిధంగా రాతి నిర్మాణాలు ఉన్నాయి. పింకిష్ రాతి కట్టడాలు అజంతా, ఎల్లోరా శిల్పాలను పోలీ ఉంటాయి. మొదటి, రెండవ అంతస్తు పూర్తిగా షాబాద్ బండలతో నిర్మించారు. సెక్యులర్ భావాలను ప్రతిబింబించేలా ఈ కట్టడాన్ని నిర్మించారు. హిందూ దేవాలయ నిర్మాణాలను పోలి ఉండే సరెసనిక్, ఉస్మాన్ షాహి, మధ్య ఇస్లాం, అరబిక్, మూరిష్‌లతో పాటు గోతిక్ శైలిలో దీని నిర్మాణం జరిగింది. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు పొడవైన స్తంభాలను చూస్తే వీక్షకులు అచ్చెరువొందాల్సిందే. వీటి మధ్య పెద్ద ఆర్చ్ ఉంటుంది. డోమ్ నిర్మాణం డబుల్ డెక్‌డ్ నిర్మాణంగా చెప్తారు. మొదటి డెక్ 16 కిటికీలు, రెండవ డెక్ మొదటి డెక్‌ను కలిపేవిధంగా మరో16 కిటికీలు ఉంటాయి. ఒకదాని నుంచి వెలుతురు మరో దానిపై ప్రతిబింబించేలా వీటిని నిర్మించారు. భవన నిర్మాణంలో అవసరమైన చోట అద్భుతమైన షాండ్లియర్‌ను వాడి అందాన్ని మరింత ఇనుమడింపజేశారు.
నిర్మాణానికి ప్రపంచదేశాల సందర్శన..
భవన నిర్మాణం కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్‌లను నియమించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలైన విశ్వవిద్యాలయాలతో పాటు యూరప్, జపాన్, ఈజిప్ట్, టర్కీ తదితర దేశాలను సందర్శించారు. బెల్జియంకు చెందిన ఇ.జస్సార్‌ను సలహాదారుగా నియమించి ఆర్ట్స్ కళాశాల, లా, ఇంజనీరింగ్ కళాశాలలు, లైబ్రెరీ, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు.
టూరిస్టు స్పాట్‌గా..
ఓయూకు వచ్చే విదేశీయులెందరో ఆర్ట్స్ కళాశాలను సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పర్యటనకు వచ్చే కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఈ భవన నిర్మాణాన్ని చూడకుండా వెనుదిరగరు. నగరవాసులు కూడా వారాంతాల్లో, సాయంత్రం సమయం ప్రశాంతంగా గడిపేందుకు ఈ భవన ఆవరణనే ఎంచుకుంటారు.
మైలురాళ్లు.. ప్రశంసలు...
యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు, యూనివర్సిటీ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్(యూపీఈ) గుర్తింపు పొందడంలోనూ ఓయూ ఆర్ట్స్‌కళాశాల పాత్ర ఎంతో ఉంది. ఓయూ ఆర్ట్స్‌అండ్ సోషల్ సైన్స్ కళాశాలను గుర్తించి భారత ప్రభుత్వం 1969 మార్చి 15న ఈ భవనంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 1981లో రాష్ట్ర ప్రభుత్వం పురాతన కట్టడాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆర్ట్స్ కళాశాలను హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించింది.
అందరి చూపు ఆర్ట్స్‌కళాశాల వైపే...
ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్స్‌కళాశాలకు గుర్తింపు ఉంది. పలువురు ప్రముఖులు ఈ కట్టడం చూసి ముగ్ధులయ్యారు. కళాశాలలో విద్య, వసతులు, సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధానులు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, ఐకే.గుజ్రాల్, పీవీ నర్సింహారావు, పాలస్తీనా మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్, జోర్డాన్ రాజు హుస్సేన్, మైసూర్ మహారాజు జయ చామరాజ వడియార్, మద్రాసు గవర్నర్ హెచ్‌జీ ప్రకాశ్ తదితరులు కళాశాలను సందర్శించారు.
ఉద్యమాలకు కేంద్రంగా....
ఎన్నో ఉద్యమాలు, సమావేశాలు, కీలక ఘట్టాలకు ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది. పలు పార్టీల విద్యార్థి బహిరంగ సభలకు కళాశాలే వేదికైంది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన అనంతరం జేఏసీ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన విద్యార్థుల సింహగర్జన ఆర్ట్స్ కళాశాల ఆవరణలోనే జరిగింది. కొందరు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసుకుంది కూడా ఈ భవన పరిసరాలలోనే కావడం విషాదకరం.
ముఖ్య సమావేశాలకు వేదికగా రూం నెం. 57...
సామాజిక, చైతన్య పూరితమైన సమావేశాలు, సదస్సులకు పుట్టినిల్లుగా ఆర్ట్స్ కళాశాలలోని రూం. నెం. 57 భాసిల్లుతోంది. సామాజిక, అస్తిత్వ ఉద్యమాలకు కేంద్రంగా, చర్చలు, సమావేశాలు, సంఘాల ఆవిర్భావం, కార్యవర్గాల ఎన్నిక, సమావేశాలకు ఈ గదితోపాటు న్యూ సెమినార్ హాల్ వేదికగా నిలుస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులకు వీటితో అనుబంధం ఉంది.
ప్రజా ప్రతినిధులకు కేంద్రబిందువు..
ఓయూ ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారిలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితర ప్రముఖులు ఎందరో ఉన్నారు. మాజీ ఎంపీ జైపాల్‌రెడ్డి, ఎంపీ కే.కేశవరావు తదితరులతో పాటు ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్ట్స్‌కళాశాలతో అనుబంధం ఉన్నావారే. సీవీ.ఆనంద్, ఉమేష్‌చంద్ర, పరదేశీనాయుడు, కమలాసన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితర అధికారులు ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారే.
ఎంతోమంది సేవలకు నిలయం..
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు సంజయ్‌బారు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సీ.నారాయణరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి, ఓయూ మాజీ వీసీలు ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వైకుంఠం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీలు ప్రొఫెసర్ ఎన్. గోపి, ప్రొఫెసర్ నాయిని కృష్ణకుమారి, ప్రొఫెసర్ జీవీ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, ప్రొఫెసర్ ఆవుల మంజులత, ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ పి. యశోదారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్‌లు ప్రొఫెసర్ మల్లేషం, ప్రొఫెసర్ వెంకటాచలం, సభ్యురాలు ప్రొఫెసర్ సూర్యధనుంజయ లాంటి ఎంతోమంది ఇక్కడ పాఠాలు బోధించడమో, విద్యాభ్యాసం చేయడమో చేశారు.
వేడుకకు హాజరుకానున్న ప్రముఖులు..
ఆర్ట్స్ కళాశాల 75వ వసంతాల ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వేడుకలకు అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, వర్సిటీ ఇంచార్జి వీసీ వికాస్ రాజ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ. సురేష్‌కుమార్, మాజీ వీసీలు ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ప్రొఫెసర్ టి. తిరుపతిరావు, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. మధుసూదన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
నిరంతర కార్యక్రమాలు...ఉత్సవాలు
కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది మొత్తం కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రకాల ఉత్సవాలు, సదస్సులు, సమావేశాలు ఇందులో భాగం కానున్నాయి. ఆర్కిటెక్చ్‌ర్, అకడమిక్ అంశాలపై కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సింపోజియంలు నిర్వహించనున్నారు. ఆర్ట్స్‌కళాశాల ఆవశ్యకత జరిగిన అంశాలతో కూడిన సావనీర్‌ను తీసుకువస్తున్నారు. కళాశాల ఘనకీర్తిని చాటిచెప్చేలా ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం..
ఆర్ట్స్ కళాశాల అందరికీ ఒక రోల్‌మాడల్. ఎన్నో ఉన్నత లక్ష్యాల సాధనకు వేదికగా నిలిచింది. విద్యావ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. నేను ఆర్ట్స్‌కళాశాలలో చదువుకున్నా అని గర్వంగా చెప్పుకునేలా విద్యా బోధన చేస్తున్నాం. కళాశాల కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పించాం.
-ప్రొఫెసర్ క్రిష్ణారావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్
చారిత్రక ప్రాధాన్యతకు నిలయం ఆర్ట్స్ కళాశాల..
మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా ఆర్ట్స్ కళాశాల భవన కట్టడం ఉంది. 1985లో విజన్ ఆఫ్ ఉస్మానియాను ప్రారంభించి, అందులో విశ్వవిద్యాలయ చరిత్ర, కళాశాల ప్రాధాన్యత, భవన నిర్మాణ ఫొటోలు ఉంచడం విశేషం. విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఆర్ట్స్ కళాశాల పాత్ర ఎంతో ఉంది. కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఓయూకు గర్వకారణం.
-ఫజులుద్దీన్, ఓయూ మనుస్క్రిప్ట్స్ ఇన్‌చార్జి
మేధావులను అందించిన ఘనత..
ఓయూ ఆర్ట్స్‌కళాశాల దేశంలోనే గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు తలమానికంగా నిలుస్తుంది. ఎంతోమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మేధావులను అందించిన ఘనత కళాశాలది. ఇలాంటి కళాశాలలో చదవడం, పనిచేయడం అదృష్టమే. నేడు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉంది.
- ప్రొ. ఎస్వీ.సత్యనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు
ప్రపంచ స్థాయి గుర్తింపు..
ఓయూ అంటేనే ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలగా చెప్తారు. ఈ కళాశాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఇలాంటి కట్టడం ఓయూలో ఉండటం గర్వకారణం. కళాశాల వైభవాన్ని, ఖ్యాతిని చాటేలా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు కృషిచేయాలి. నేడు 75 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం సంతోషం కలిగిస్తోంది.
- ప్రొ.లిలిత్‌కుమార్, ప్రభుత్వపాలనశాస్త్ర విభాగాధిపతి, ఆర్ట్స్ కళాశాల
No comments:
Post a Comment