Tuesday 2 December 2014

తన పాలన మన ముద్ర

* ఆరు నెలల్లో దశాబ్దాల ఆశలకు దిశ
   పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణలో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆరు దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలు కోల్పోయిన వైభవాన్ని పున:ప్రతిష్ట చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ పనితీరు అంచనాకు ఆరునెలల కాలం పెద్ద సమయం కాకపోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సర్కారు పయనం వేగంగా సాగుతున్నది. 
పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనిపిస్తున్నది. పండుగైనా.. పథకమైనా అంతా మనదే. మన పీవీని..మన కాళోజీని..మన దాశరథిని.. మన బాపూజీని గౌరవించుకున్నా.. లాల్‌దర్వాజ బోనాల జాతరైనా.. ట్యాంకుబండ్ మీద బతుకమ్మ విశ్వరూపం కనిపించినా అన్నింటా స్వరాష్ట్ర సౌరభాల పరిమళాలే. లక్ష కోట్ల బడ్జెట్ అయినా.. ప్రపంచాన్ని ఆకర్షించే పారిశ్రామిక విధానమైనా.. సమగ్ర కుటుంబ సర్వే అయినా.. చెరువుల పునరుద్ధరణ పథకమైనా.. వాటర్ గ్రిడ్ పథకమైనా.. దేశమంతా ప్రశంసలు కురిపించే కార్యక్రమాలే. 
       రేపటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే విధానాలే. పారిశ్రామిక వైభవానికి శ్రీకారం చుట్టబోతున్నాం. పదివేల కోట్లతో రహదార్లు వేసుకోబోతున్నాం. వెయ్యికోట్లతో వంతెనలు కట్టుకోబోతున్నాం. ఇంటింటికీ నల్లా నీరు పట్టుకోబోతున్నాం. చెరువులు నింపుకోబోతున్నాం. అవును అక్షరాలా బంగారు తెలంగాణను సాధించుకోబోతున్నాం. 
మూడునెలల క్రితం కశ్మీర్‌లో ప్రళయ భీకరంగా భారీ వరదలు వచ్చాయి. దేశంలో అనేక రా ష్ర్టాలు చలించిపోయి అనేక రకా ల సహాయం అందించాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలకు నీటిశుద్ధి మిషన్లు పంపించింది. అక్కడి ప్రజలు ఈ సహాయాన్ని వేనోళ్ల కొనియాడారు. అక్కడి సీఎం మరిన్ని మిషన్లు పంపించమని కోరారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆహారం కన్నా ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య బురదనీరు. 
      ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాన్ వచ్చింది.. మళ్లీ చాలా మంది చాలా రకాల సహాయాలు చేశారు. తుఫాన్ ధాటికి అక్కడ అన్నింటికన్నా ఎక్కువగా కుప్పకూలింది విద్యుత్ రంగమే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు, పరికరాలు, సిబ్బందిని పంపించింది. అతి స్వల్పకాలంలో అనేక గ్రామాల్లో దీపాలు వెలిగాయి. ఈ రెండు ఉదాహరణలు చాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనితీరు నిర్ధారించడానికి. 
    సమస్య ఏమిటి? పరిష్కారమేమిటి? ప్రణాళిక ఏమిటి? ఇదే కేసీఆర్ అనుసరించే పాలనా విధానం. ఎక్కడా తొట్రుపాటు ఉండదు. గందరగోళం ఉండదు. లక్ష్యానికి నేరుగా గురిపెట్టడం.. ఛేదించడం అంతే. ఈ విధానం వల్లనే ఆరునెలల తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కలలు నెరవేర్చే దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తు మీద భరోసా ఇస్తున్నాయి. 
పోగొట్టుకున్నవి పొందే దిశగా..
జూన్ రెండవ తేదీన అధికార పగ్గాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటినుంచి ఇప్పటిదాకా చేస్తున్నది ఒకటే .... ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఏం పొగొట్టుకున్నారో అవి అందించడం. మొక్కవోని దీక్షతో ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నది. విమర్శలు రావొచ్చు.. ఎదురు దాడులు జరగొచ్చు.. అయినా కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఉద్యోగుల సమస్య.. ఫీజు రీఇంబర్స్‌మెంట్ సమస్య... గురుకుల్ భూముల విముక్తి .. చెరువుల పునరుద్ధరణ..అన్నింటా అదే విధానం. రుణమాఫీలు, ఆసరా., చేనేత రుణ మాఫీలు.. వంటివి అన్నీ ప్రజలకు తక్షణ మేలు కోసమేననే విషయం కేసీఆర్‌కు తెలుసు అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అనే దీర్ఘకాల ప్రణాళికను ఆయన ఎక్కడా విస్మరించలేదు. 
        పాలన కాస్త దారిన పడగానే తెలంగాణ జీవనరేఖ అయిన గొలుసుకట్టు చెరువుల అంశాన్ని తీసుకున్నారు. డజన్ల కొద్దీ సమీక్షల తర్వాత కార్యక్రమాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. తెలంగాణ కరెంటు కష్టాలు తెలిసివాడు కావడం వల్లనే విద్యుత్ ఉత్పత్తిని భారీగా విస్తరించే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. మూడేండ్లలో రెప్పపాటు కరెంటు కూడా పోదు అని ఢంకా బజాయించడం వెనక కేసీఆర్ ఆత్మవిశ్వాసం దాగిఉంది. పాలనలోనైనా పథకాల్లోనైనా సంపూర్ణంగా తెలంగాణ ముద్ర వేశారు. గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా తెలంగాణ చరిత్రను దేశానికి చాటారు. 
       తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. ట్యాంకుబండ్ మీద జరిగిన బతుకమ్మ పండుగలు నాలుగు కోట్ల ప్రజలను సమ్మోహితులను చేశాయి. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? అని వెకిలి ప్రశ్నలు వేసిన వారికి బతుకమ్మ పండగ వైభవం సమాధానం చెప్పింది. ఒక రాష్ట్రం ఆత్మ గౌరవంతో పాలన చేసుకుంటే ఎలా ఉంటుందో అద్దం పట్టింది. దశాబ్దాల తరబడి అవహేళనలకు గురైన చోట మన రాష్ట్రం మన పండుగ అనుకోవడంలోని గొప్ప భావనను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర చిహ్నాల ప్రకటనలో అదే ముద్ర స్పష్టమైంది. 
     మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జయశంకర్ సార్, ప్రజాకవి కాళోజి నారాయణరావు, సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణామాచారి , ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని నిర్వహించింది. విప్లవ వీరుడు కొమురం భీమ్, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా తెలంగాణ వైతాళికుల జయంత్యుత్సవాల నిర్వహణ ద్వారా తెలంగాణవాదుల మన్ననలు పొందారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు భారీ నిధులు, రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు సెలవులు, దూరదర్శన్‌లో తెలంగాణ చానెల్‌కు యాదగిరి పేరు అన్నింటా తెలంగాణ ముద్ర వేశారు. 
మ్యానిఫెస్టో అమలు దిశగా...:
కేసీఆర్ అధికారం చేపట్టిన రెండు రోజులు తిరగకుండానే నేరుగా అధికారులతో విశ్లేషణలు ప్రారంభించారు. రాజధాని నగరంలో పరిస్థితిని వాకబు చేసి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే ఊపులో వివిధ శాఖల అధ్యయనం ఆదేశాలు కొనసాగాయి. తొలి మంత్రిమండలి సమావేశంలోనే 43 తీర్మానాలు ఆమోదించి రికార్డు సృష్టించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన దాదాపు అన్ని వాగ్దానాలకు మంత్రిమండలిలో అధికారిక ముద్ర వేయించారు. చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని చాటారు. అసెంబ్లీ సమావేశంలోనూ అవే వెల్లడించారు. 
     మ్యానిఫెస్టోలోని పంటరుణాల మాఫీ అంశంపై అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ప్రక్రియ ప్రారంభించారు. రిజర్వ్‌బ్యాంకు పూర్తి స్థాయి సహాయ నిరాకరణతో ఎదురైన ఇబ్బందులను దాటుకుని రూ. 4,200 కోట్లు విడుదల చేసి రుణమాఫీని విజయవంతంగా అమలు చేశారు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టారు. ఎన్నో విమర్శలు.. ఎన్నో అభాండాలు.. లెక్క చేయకుండా పూర్తి చేశారు. దళితులకు భూ పంపిణీ, ఆసరా పథకం, ఆహార భద్రత పథకం, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఆటో, ట్రాక్టర్ ట్రాలీల పన్నుల రద్దు..కల్లు దుకాణాల పునరుద్ధరణ, ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంటు, ఉద్యమ కేసులు ఎత్తివేత, ఇలా ఒక్కొక్కటిగా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగించారు. తాజా బడ్జెట్‌లో మైనార్టీలకు, దళితులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు భారీగా నిధులు కేటాయించారు. ఓవైపు వ్యవసాయ రంగానికి భారీ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పారిశ్రామిక విధానం మీద భారీ కసరత్తు జరిపారు. ఇక సంక్షేమం మరొకరు అందుకోని స్థాయికి తీసుకువెళ్లారు. 
భారీ స్వప్నాలు..:
ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయన కలలు, ప్రణాళికలు అన్నీ భారీవే. జనగణన ఎవరు చేసినా నెలల తరబడి జరుపుతారు. కానీ కేసీఆర్ ఒక్క రోజులో చేయాలనుకున్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులను రంగంలోకి దించి సాధించారు. హరిజనులకు జానా బెత్తెడు భూమి ఇచ్చే చోట మూడెకరాలు అన్నారు. ఏడాది ఖర్చుకూడా అన్నారు. తాగునీటి సమస్య వస్తే సమస్యాత్మక గ్రామాలు గుర్తించి నీరివ్వడం సాధారణంగా అంతా చేస్తారు. కానీ కేసీఆర్ రాష్ట్రమంతా నీరివ్వాలని ప్రతిపాదించారు. అలాగే చెరువులు.. 45 వేల చెరువులు అన్నీ పునరుద్ధరించాలనుకున్నారు.. పనులు పట్టాలెక్కించారు. విద్యారంగ అభివృద్ధి కేజీ టు పీజీ అన్నారు..హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఇక జరిగేది కాదని అంటారంతా. కానీ కేసీఆర్ దాన్ని మంచినీటి చెరువుగా చూడాలనుకున్నారు. వినాయక నిమజ్జనాలకు ప్రత్యామ్నాయం చెప్పారు. నలాల నీరుకు దారి చూపించారు. చెరువు నీరంతా తోడిపారేయాలన్నారు. ఇవాళ ఆ తటాకం చుట్టూ ఆకాశహర్మ్యాలు కలగంటున్నారు. అదికూడా ప్రపంచంలో అన్నింటికన్నా ఎత్తుగా ఉండాలని.. అవును హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచమంతా మార్మోగాలంటే అది కావాలిసిందే. ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి అంటే పాత బోర్నవీటా డబ్బాలాంటి హైటెక్‌సిటీ అనబడే ఓ వృత్తకార భవనమేనా? ప్రపంచమంతా మెడలు విరిగేలా తలెత్తి చూసే ఆకాశహర్మ్యం రేపు హైదరాబాద్ ఐకాన్ కాబోతున్నది. నిజాం కట్టిన ట్యాంకుబండ్‌కు రంగులేసి తామే కట్టినంత బిల్డప్ ఇచ్చిన సీమాంధ్ర ముద్రలు సమూలంగా తుడుచుకుపోనున్నాయి. ఒక్క పీవీ ఎక్స్‌ప్రెస్ వే కట్టి అహో ఓహో అన్నారు సీమాంధ్ర పాలకులు. నగరానికి నాలుగు దిక్కులా వాటిని తెస్తున్నారు. నగరంలో మల్టీలేయర్ స్కైవేలకు ప్రణాళికలు వేస్తున్నారు.యాదగిరిగుట్టను వాటికన్ తరహా అభివృద్ధి అన్నారు. తక్షణమే వందకోట్లు విడుదల చేశారు. 
రాజకీయ చాణక్యం..:
ఆరు నెలల కాలం అంటే హానీమూన్ పీరియడ్ ముగిసినట్టేననేది రాజకీయ నిర్వచనం. కానీ ఆరు నెలల కాలంలో కేసీఆర్ రాజకీయంగా విశ్వరూపం చూపించారు. 
మూడు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలు కూడా ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ఓ ప్రకటన చేశారు. సోనియా తెలంగాణ ఇస్తే ... కేసీఆర్ ఇంటిముందు ఎవరూ మిగలరు అంటూ ప్రకటన చేశారు. కానీ ఇవాళ గాంధీ భవన్‌ముందు జనసంచారం తగ్గిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా వెలవెలబోతున్నది.

No comments:

Post a Comment