ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో రాష్ట్ర శకటం సందడి చేయనుంది. మన శకటం ప్రదర్శనకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డిసెంబరు 25న టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. రక్షణ శాఖనుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయమై త్వరలోనే లేఖ అందనుంది. ఈసారి పరేడ్‌లో ఇప్పటిదాకా మనతో కలిపి మొత్తం పద్నాలుగు రాష్ర్టాల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు పండుగ ముఖ్యాంశంగా మన రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. ప్రతిఏటా జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ర్టాలు తమ తమ సంస్కృతి, అభివృద్ధి ఇతివృత్తంగా శకటాలను ప్రదర్శిస్తాయి. ఆయా రాష్ర్టాలు ప్రదర్శించబోయే థీమ్ నమూనాలను రిపబ్లిక్ డే సెరిమోనియల్ కమిటీ అక్టోబర్ నెలలోనే ఆహ్వానిస్తుంది. పరిశీలన తర్వాత మార్పుచేర్పులు, తిరస్కరణలు ఉంటాయి. మన రాష్ట్రంనుంచి బోనాలు థీమ్‌కు సంబంధించి నమూనాను పంపాలని గత అక్టోబర్ నెలలో ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల విభాగానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బోనాలు డిజైన్ నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కమిటీకి సమర్పించారు. తర్వాత కమిటీ సూచించిన కొన్ని మార్పులు చేశారు. నవంబర్ 4వ తేదీన త్రీ-డీ నమూనాను తీసుకురావాలని వివిధ రాష్ర్టాలకు సమాచారమిచ్చిన కమిటీ, తెలంగాణ రాష్ర్టానికి ఆహ్వానం పంపలేదు. ఆ విధంగా జాబితా నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని తొలగించినట్లయింది.
రక్షణ మంత్రికి లేఖ రాసిన సీఎం..
ఈ విషయమై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అప్పటి రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాసి, తెలంగాణ రాష్ర్టానికి శకటాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే మొట్టమొదటి సారి జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సెప్టెంబర్ 29వ తేదీన, అక్టోబర్ 7వ తేదీన రిపబ్లిక్ ఉత్సవ కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని ప్రదర్శించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో పాటు ఇదే విషయంపై టీఆర్‌ఎస్ ఎంపీల బృందం పలుసార్లు రక్షణ శాఖ మంత్రిని విజ్ఞప్తి చేసింది. తర్వాత రక్షణ మంత్రి మారారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి నూతన రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గత మంగళవారం కలిసి ఒక కొత్త రాష్ట్రంగా తమ మనోభావాలను ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన పారికర్ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గురువారం ఉదయమే స్వయంగా జితేందర్‌రెడ్డికి ఫోన్ చేసి శుభవార్త అందించారు. ఈ విషయమై జితేందర్‌రెడ్డి టీ మీడియాతో మాట్లాడుతూ, రక్షణ మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శకటానికి సంబంధించిన థీమ్‌పై ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ సభ్యులు చర్చించినందున అదే థీమ్‌ను వారు చేసిన సూచనల మేరకు వీలైనంత త్వరగా రూపొందించే పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారని తెలిపారు. బోనాలు థీమ్‌తో రిపబ్లిక్ డే పెరేడ్‌లో తెలంగాణ శకట ప్రదర్శన ఉంటుందని చెప్పారు.
బోనాలు థీమ్‌లో పోతురాజు:
అక్టోబర్ 28వ తేదీన సెర్మోనియల్ కమిటీ చేసిన సూచనల మేరకు మన శకటానికి ఆర్టిస్టు రమణారెడ్డి బోనాలు థీమ్ డిజైన్ నమూనాను తయారు చేశారు. బోనాలు పండుగలో గోల్కొండకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేయడానికి ఆ కోటను తన డిజైన్‌లో చూపించారు. పండుగలో మహిళల పాత్రను తెలియజేసే విధంగా తలపైన పూల బుట్టలు, గ్రామదేవతకు పూజలు చేయడం, ఊరేగింపు దృశ్యాలను తన డిజైన్‌లో పొందుపరిచారు. ఇక బోనాలు పండుగలో పోతురాజు పాత్రకు,ఘటంకు ఉన్న ప్రాధాన్యతకు డిజైన్‌లో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఈ శకటం డిజైన్‌ను చూసిన వారికి తెలంగాణలో బోనాల పండుగ జరిగేతీరు ఇందులో మహిళల పాత్ర తదితర విషయాలు కండ్లకు కడతాయి. సెర్మోనియల్ కమిటీ సూచనలు, సలహాల మేరకు డిజైన్‌లో ఉన్న గోల్కొండ కోటకు కొన్ని మార్పులు చేసి రాళ్ళను కోటలాగా చూపించే స్వల్పమైన మార్పులు తుది డిజైన్‌లో చోటుచేసుకుంటున్నాయి.
ఇవీ నిబంధనలు..
శకటం బరువు పది టన్నులకు మించకుండా చూడాలని కమిటీ నిబంధన విధించింది. వెడల్పు ఎనిమిది అడుగులు , ఎత్తు 4.2 అడుగులు, పొడవు 24.8 అడుగులు మించరాదని స్పష్టంగా పేర్కొన్నది. మినీ లారీ వెనకభాగంలో బేస్‌మెంట్ మొదలు 4.2 అడుగుల ఎత్తులో తెలంగాణ బోనాలు థీమ్ డిజైన్ ఉంటుంది. ఇక వాహనంతో పాటు డిజైన్ వివరాలను కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే మొత్తం పొడవు గరిష్టంగా 45 అడుగులు, వెడల్పు 14 అడుగులు, ఎత్తు 16 అడుగులు దాటరాదు. వీటిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారుల సమక్షంలో తగిన భద్రతా చర్యల నడుమ ఈ శకటం తయారీ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ 13 రాష్ర్టాలను ఎంపిక చేసి ఆయా రాష్ర్టాలకు సూచించిన డిజైన్ నమూనాలను విశ్లేషించి పనులను కూడా ప్రారంభించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ పనులు కూడా దాదాపు సగం మేరకు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలో మాత్రం నిర్ణయం ఇప్పుడే జరిగినందున తెలంగాణ సమాచార పౌర సంబంధాల విభాగం ఈ పనులను ఈ వారంలో ప్రారంభించనుంది.
No comments:
Post a Comment