- బహుముఖ ప్రజ్ఞాశాలి మాలవ్యకు కూడా..
- మహోన్నత నేతలకు అత్యున్నత పౌర పురస్కారం
- ఇద్దరిదీ నేడే జన్మదినం.. ఒకరోజు ముందు అవార్డు
- రాజకీయాలకతీతంగా స్వాగతించిన పార్టీలు
అటల్ బిహారీ వాజపేయి.. అతివాద పార్టీ నుంచి వచ్చినా.. మితవాద దృక్కోణంలో తన పాలనతో దేశవాసులను మెప్పించిన నేత! మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో ఆయన నిలువెత్తు లౌకికరూపం! మదన్ మోహన్ మాలవ్య.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.. హిందూ సమాజ సంఘటితానికి కృషిచేసిన సంఘ సంస్కర్త! ఒకరు స్వాతంత్య్రానంతర రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేస్తే.. మరొకరు స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశాన్ని ప్రభావితం చేశారు!!
- ఇద్దరిదీ నేడే జన్మదినం.. ఒకరోజు ముందు అవార్డు
- రాజకీయాలకతీతంగా స్వాగతించిన పార్టీలు
అటల్ బిహారీ వాజపేయి.. అతివాద పార్టీ నుంచి వచ్చినా.. మితవాద దృక్కోణంలో తన పాలనతో దేశవాసులను మెప్పించిన నేత! మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో ఆయన నిలువెత్తు లౌకికరూపం! మదన్ మోహన్ మాలవ్య.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.. హిందూ సమాజ సంఘటితానికి కృషిచేసిన సంఘ సంస్కర్త! ఒకరు స్వాతంత్య్రానంతర రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేస్తే.. మరొకరు స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశాన్ని ప్రభావితం చేశారు!!
ఈ ఇద్దరు గొప్ప నేతలకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఇద్దరూ హిందూత్వ భావాలు కలిగినవారు కావడం ఒక విశేషమైతే.. ఇద్దరి జన్మదినమూ ఒకే రోజు కావడం మరో ప్రత్యేకత! సంఘ్‌పరివారానికి సంబంధించిన ఒక వ్యక్తి భారతరత్న పురస్కారానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వాజపేయి ఆ కోవలోకి వస్తే.. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో మాలవ్య 12వ మహనీయుడు! ఈ ఇద్దరి జన్మదినాలకు ఒక రోజు ముందు వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారతరత్న అవార్డులను ప్రకటించారు...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైన మదన్‌మోహన్ మాలవ్యను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మహోన్నత వ్యక్తిత్వాలతో దేశానికి ఎనలేని సేవలందించి, భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వీరికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ డిసెంబరు 24న ప్రకటన విడుదల చేసింది.
వాజపేయి డిసెంబరు 25న 90వ పుట్టినరోజు జరుపుకోనుండగా, అదేరోజు మాలవ్య 153వ జయంతి కావడం విశేషం. సందర్భోచితంగా ఒకరోజు ముందు వారికి అవార్డు ప్రకటించటంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈ ఇద్దరు నేతలకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. అందుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ఇద్దరితో భారతరత్న పురస్కారం పొందినవారి సంఖ్య 45కు చేరింది. మరణానంతరం భారతరత్న పొందినవారిలో మాలవ్య 12వ వారు. గతేడాది ఈ పురస్కారాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్‌టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు ప్రకటించారు. వాజపేయి, మాలవ్యకు భారతరత్న ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ దేశం గర్వించదగ్గ గొప్పనేతలకు సముచిత గౌరవం లభించిందని వ్యాఖ్యానించారు.
అజాత శత్రువు వాజపేయి
స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన నేతల్లో అటల్ బిహారీ వాజపేయి ముందువరుసలో ఉంటారు. 1998- 2004 మధ్య దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెస్సేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మహోన్నత వ్యక్తిత్వంతో దేశ రాజకీయాల్లో ఆయన అజాత శత్రువన్న పేరు సంపాదించుకున్నారు.
రాజకీయ సభ అయినా, సమావేశమైనా వాజపేయి మాట్లాడుతున్నారంటే దేశమంతా గొప్ప హితోపదేశంలా వింటుంది. నేటితరం రాజకీయ నేతలంతా వాజపేయి అంతటి ఉపన్యాసకులు కావాలని కలలు కంటారంటే అతిశయోక్తికాదు. దేశ రాజకీయ యవనికపై బీజేపీని శక్తిమంతమైన రాజకీయపక్షంగా నిలబెట్టడంలో వాజపేయి నాయకత్వపటిమ పాత్ర ఎంత ఉందో, ఆయన వ్యక్తిత్వం పాత్ర కూడా అంతే ఉంది. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన వేలెత్తిచూపలేని గొప్ప వ్యక్తిత్వంతో తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. ప్రధానిగా దేశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా వాజపేయి చెరగని ముద్రవేశారు.
శాంతిసామరస్యాలపై అచంచల విశ్వాసంగల ఆయన, పొరుగుదేశం పాకిస్థాన్‌తో స్నేహసంబంధాలకోసం బస్సుయాత్ర చేపట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దేశాభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యాలున్న వాజపేయి, సత్వరాభివృద్ధికి రహదారులే కీలకమని నమ్మి తన పదవీకాలంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయరహదారుల విస్తరణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. వయసుతోపాటు సంక్రమించిన అనారోగ్యంతో ఆయన కొన్నేండ్లుగా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. భారతరత్న పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి బీజేపీ నాయకుడు వాజపేయే కావటం గమనార్హం.
హిందూ జాతీయోద్ధరణ దివిటీ మాలవ్య
దేశాన్ని జలగలా పీల్చిపిప్పిచేసిన శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒకానొక దశలో వణికించి, ముచ్చెమటలు పట్టించిన నిప్పుకణికలాంటి స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ మదన్‌మోహన్ మాలవ్య. విద్యావేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఆయన, భారతీయ సమాజాన్ని ఆధునీకరించటంకోసం ఎనలేని కృషిచేశారు. బ్రిటిష్ అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా భారతీయులను పోరాటానికి సమాయత్తులను చేసి, ముందుకురికించారు.1886లో కలకత్తా (నేటి కోల్‌కతా)లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో మొదటిసారి పాల్గొన్న ఆయన ప్రసంగం విని దాదాభాయ్ నౌరోజీలాంటి మహామహులే అచ్చెరువొందారు. తన అసాధారణ నాయకత్వ పటిమతో 1909, 1918 సంవత్సరాల్లో రెండుసార్లు ఐఎన్‌సీకి అధ్యక్షుడయ్యారు. దురాచారాలతో ముక్కిమూలుగుతున్న హిందూ సమాజాన్ని సంస్కరించి, సంఘటితం చేసేందుకు 1914లో లాలా లజపతిరాయ్ తదితరులతో కలిసి అఖిల భారత హిందూమహాసభను స్థాపించారు. అదే అనంతరకాలంలో బలమైన హిందూ జాతీయవాద ఉద్యమానికి మూలమైంది. భారతీయులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు యూపీలో బనారస్‌లో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యావ్యాప్తికి విశేష కృషిచేశారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన మాలవ్యకు ఎప్పుడో భారతరత్న పురస్కారం ఇవ్వాల్సి ఉన్నా తగ ప్రభుత్వాలు ఆయనను నిర్లక్ష్యం చేశాయనే విమర్శ ఉంది. ఆలస్యంగానైనా ఎట్టకేలకు నరేంద్రమోదీ ప్రభుత్వం మాలవ్యను సమున్నతంగా గౌరవించింది.
No comments:
Post a Comment