Saturday 29 November 2014

చందుపట్లలో రాణిరుద్రమ తుదిశ్వాస

* అంబదేవుడి చేతిలో వీరమరణం పొంది నేటికి 725 ఏండ్లు
* శాసనం వేయించిన రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి 
* పురావస్తుశాఖ దృష్టిసారిస్తే వెలుగులోకి రానున్న చరిత్ర
    కాకతీయుల పోరు కెరటం.. ఒంటిచేత్తో రాజ్యాలను జయించిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి వీరగాధలు ఎన్నెన్నో. శతాబ్దాల కిందటే కత్తిపట్టి శత్రువులను తుదముట్టించి మహిళాశక్తిని నేల నలుదిశలా చాటిన పరాక్రమశాలి రుద్రమదేవి. వరంగల్ కేంద్రంగా పాలన సాగించిన రుద్రమదేవి 80 ఏండ్ల వయస్సులోనూ శత్రుసైన్యంపైకి కత్తిదూసి కదనరంగంలో కన్నుమూసింది. వీరమరణం పొందిన ప్రాంతం నేటి నల్లగొండ జిల్లాలోని చందుపట్ల అనేందుకు శిలాశాసనం ఆధారంగా నిలిచింది. ఈ శాసనం ప్రకారం 1289 నవంబర్ 27న అంబదేవుడితో జరిగిన యుద్ధంలో తుదిశ్వాస విడిచింది. ఓరుగల్లు వీరవనిత రాణిరుద్రమ మరణించి నేటికి 725 ఏండ్లు అవుతున్న సందర్భంగా మరణశాసనం వెలిసిన చందుపట్లపై ప్రత్యేక కథనం. 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన శాసనం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్లలోకి ప్రవేశించగానే నాలుగు అడుగుల ఎత్తున్న గద్దెపై కొలువైన చారిత్రక శాసనం స్వాగతం పలుకుతుంది. సుమారు 700 ఏండ్ల కిందటిదైనా ఐదేండ్ల కిందటే దాని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కాకతీయుల వీరవనిత, రాయగజకేసరి రాణీరుద్రమదేవి వీరమరణాన్ని ఈ శాసనం ధ్రువీకరిస్తున్నది. ఐదేండ్ల కిందటి వరకు శ్రావణమాసంలో బోనాల పండుగ సందర్భం గా దేవతా విగ్రహంగా ఈ శాసనం పూజలందుకున్నది. గ్రామంలోని కొందరు ఔత్సాహికులు శిలా శాసనమని గుర్తిం చి 2009 నవంబర్ 27న గద్దెపై ప్రతిష్టించారు. 
రుద్రమదేవి శివసాయిజ్యం ఇక్కడే
తండ్రికి తగ్గ తనయగా, గణపతి దేవుడి బిడ్డగా పేరు గడించి కాకతీయ సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పాలించిన రుద్రమదేవి.. అంబదేవుడి చేతిలో హతమైనట్లు త్రిపురాంతక శాస నం సూచిస్తున్నది. కాయస్థ వంశ మహారాజైన అంబదేవుడు అన్నిరాజ్యాలనూ జయించిన రాజుగా ఆ శాసనంలో కీర్తించుకున్నాడు. సర్వాన్ ఆంధ్ర మహీపతింజిత్వ రణముఖే యశోలబ్దవాన్ అని రాసుకున్న సంస్కృత పదాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో రుద్రమదేవి కూడా అతడి చేతుల్లోనే వీరమరణం పాలైనట్లు ఆధారాలు లభిస్తున్నాయి. 
      80 ఏండ్ల వయస్సులో ఉన్న రుద్రమను చంపానని చెప్పుకోవడం వీరత్వం అనిపించుకోనందునే.. త్రిపురాంతక శాసనంలో అంబదేవుడు ఆమె పేరు రాయలేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీరమరణాలకు గుర్తుగా రుద్రమదేవి సేవకుడు పువ్వుల ముమ్మడి ఈ శాసనం వేయించాడు. 1289 నవంబర్ 27న రుద్రమ, మల్లికార్జుననాయకుడు శివసాయిజ్యం పొందినట్లు శాసనంలో లిఖించి ఉన్నది. శాసనం ప్రతిష్ఠించిన గద్దెకు పక్కనే సోమనాథ ఆలయానికి పువ్వుల ముమ్మడి కొంత భూమి దానం చేసినట్లు శాసనంలో ఉన్నది. గ్రామశివారులో ఉన్న నేటిచెరువు సైతం ఆనాడే రా-సముద్రం పేరుతో తవ్వించినట్లు శాసనం చెప్తున్నది. ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన కాకతీయులు ఆనాడు ఈ మార్గం నుంచే శ్రీశైలానికి వెళ్లే వారని, పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల, పానగల్లు పట్టణాల మీదుగా పయనం సాగేదని చరిత్రకారులు చెప్తున్నారు. 
చందుపట్లలో చారిత్రక ఆనవాళ్లు అనేకం
గ్రామంలో ఈ శాసనం పక్కనే అలనాటి సోమనాథ ఆలయం కాకతీయుల కాలానికి ఆధారం. ప్రస్తుతం గ్రామ దేవతాలయంగా పూజలు అందుకునే ఇక్కడి గుడి ఒకప్పటి శివాలయమేనని ప్రచారంలో ఉంది. గ్రామం నడిబొడ్డున కనిపించే అనేక విగ్రహాలు భూమిలో కూరుకుపోతున్నా నాపరాతి బండలపై కొలువైన విగ్రహ రూపాలు కాకతీయుల శిల్పకళకు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. రామప్ప ఆలయంలో ఉండే గణపతి ప్రతిమను పోలిన ఓ విగ్రహం ఇక్కడ ఉన్నది. దానికి ఎదురుగా గుర్రంపై స్వారీ చేస్తున్న వీరవనిత ఆకారపు శిల్పం మరింత ఆసక్తి కలిగిస్తుంది. మరో తెల్లరాతి శిలపై ఒదిగిన శిల్పకళ సైతం చరిత్రకారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 
గ్రామస్తుల కృషితో పాఠ్యాంశంగా శాసనం
రుద్రమదేవి శివసాయిజ్యం పొందడాన్ని ధ్రువీకరిస్తున్న ఈ శాసనం వెలుగులోకి తేవడానికి చందుపట్లలోని వివేకానంద యువజన మండలి కృషి చాలా ఉంది. వాళ్ల కష్టానికి ఫలితంగా ఐదేండ్ల కిందట ప్రతిష్ఠకు నోచుకున్న శాసనం వివరాలు దూరవిద్యను అభ్యసించే ఎంఏ తెలుగు విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. చందు(డ్రు)పట్ల శాసనం పేరుతో పాఠంగా బోధిస్తున్నారు. అధికారులు, దాతల సహకారంతో శాసనం స్థాపించిన ప్రాంతానికి సమీపంలోనే రుద్రమదేవి విగ్రహం ప్రతిష్ఠించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠంచనున్నారు.
రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
- టంగుటూరి సైదులు, చందుపట్ల 
మా ఊరిలో శిలాశాసనం పునరుద్ధరణ కోసం చాలా కష్టపడ్డాం. అనేకమంది సహకారంతో ఐదేండ్ల క్రితం ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడు రుద్రమదేవి విగ్రహాన్ని తయారుచేయించాం. త్వరలోనే ఇక్కడే ప్రతిష్ఠిస్తాం. ఇప్పటికే చం దుపట్ల శాసనం పాఠ్యాంశంగా దూరవిద్య తెలుగు పుస్తకంలో పొందుపరిచారు. దీన్ని పాఠశాలస్థాయి పుస్తకాల్లోనూ చేర్చితే మన ప్రాంత చరిత్ర భావితరాలకు తెలుస్తుంది. రుద్రమదేవి వర్ధంతిని సైతం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది.

No comments:

Post a Comment