* చెవిటివారికీ వినిపించే శబ్దం
* విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ 82వ వర్ధంతి
తుపాకులు నాటితే.. తుపాకుల చెట్టు మొలిస్తే.. చెట్టుకు కాసిన ఆ తుపాకులన్నీ పట్టుకుని బ్రిటిష్ వలసపాలకులను వెళ్లగొడితే? పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి మనసులో మెదిలిన ఆలోచన! దేశ ప్రజలపై దాష్టీకాలకు పాల్పడుతున్న బ్రిటిషర్లను అర్ధరాత్రి ఎటాక్ చేసి.. కనీసం దేహశుద్ధి చేయడం ద్వారానైనా కసి తీర్చుకోవాలన్న ఓ యువకుడి ఆవేశం! పెళ్లి చేసుకుంటే దేశ స్వాతంత్య్రం కోసం తన పోరాటానికి ఎక్కడ విఘాతం కలుగుతుందోనని కలతపడి.. తన లక్ష్యం దేశ స్వాతంత్య్ర సాధనేనని ప్రకటించి ఇంటి నుంచి అర్ధరాత్రిపూట విప్లవ సమరాంగణంలోకి నడుచుకుంటూ పోయిన ఓ ఆవేశపరుడి అభీష్టం! తుపాకి పట్టినా.. మార్క్సిజమే ఈ దేశ సకల సమస్యల పరిష్కారానికి మార్గమని గుర్తించి.. సైద్ధాంతిక పరిణితి చెందిన ఓ సోషలిస్టు జీవితం! హస్ హస్‌కే జాన్ లుటానే.. ఆవాజ్ సవేరా లానే! తన నిర్ణయంతో జీవితం ముగిసిపోతుందని తెలిసినా.. తన బలిదానం ముందు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మి.. ఉద్నిగ్నత.. ఉత్సాహం కలగలిసిన సమ్మిళిత భావోద్వేగాల నడుమ తన సహచరులతో కలిసి ఉరికొయ్యలకు ఊయలలూగిన ఓ విప్లవకారుడి నిరుపమాన త్యాగం! భగత్ సింగ్! చరిత్ర ఉన్నంత కాలం.. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి.. ఒక జాతిని వేరొక జాతిని దోచుకుంటున్నంత కాలం.. చెలరేగే విప్లవాలకు.. ప్రజ్వరిల్లే ఉద్యమాలకు నిత్యస్ఫూర్తి కిరణం!
సరిగ్గా 82ఏళ్ల క్రితం ఇదే రోజున హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ నాయకుడు భగత్‌సింగ్‌ను బ్రిటిష్ అధికారి శాండర్స్ హత్య కేసులో లాహోర్ కేంద్ర కార్యాలయంలో గుట్టుచప్పుడుకాకుండా ఉరి తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. భగత్‌సింగ్‌తో పాటు అతడి సహచరులు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను కూడా ఉరితీశారు! నిజానికి మార్చి 24న భగత్‌సింగ్ అతడి సహచరులను ఉరి తీయాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే ఉరితీసిన జైలు సిబ్బంది.. ఆ ముగ్గురి మృతదేహాలను సట్లెజ్ నది సమీపాన ముక్కలుముక్కలుగా నరికి.. తగులబెట్టి.. సగంకాలిన శరీరభాగాలను నదిలోకి విసిరిపారేశారు! భారతదేశ ముద్దుబిడ్డలను అత్యంత కిరాతకంగా చంపి.. చివరి చూపులకూ ఆస్కారం లేకుండా చేశారు! కానీ.. అతడు రగిల్చిన స్ఫూర్తిని మాత్రం ఆపలేక పోయారు. తన బలిదానం ముందు తరాలకు స్ఫూర్తినిస్తుందన్న అతడి నమ్మకం వమ్ముకాలేదు. 23 ఏళ్ల లేత వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన భగత్‌సింగ్.. 82 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ జనం గుండెల్లో గూడుకట్టునే ఉన్నాడు. ఉంటాడు!
భగత్‌సింగ్ జీవితాన్ని మలుపుతిప్పింది మార్క్సిజమే! తొలి నాళ్లలో గాంధీకి తీవ్రంగా ప్రభావితుడైన భగత్‌సింగ్.. తర్వాతి కాలంలో గాంధీ సిద్ధాంతాలకు దూరమయ్యాడు. బ్రిటిష్ సర్కారు దాష్టీకాలను ఎదుర్కొనాలంటే అహింసాయుత పోరాటం సమాధానం కాదన్నది ఆయన సిద్ధాంతం. ప్రత్యేకించి చౌరాచౌరీ ఘటన (పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి భారతీయులు దానికి నిప్పుపెట్టి అందులో ఉన్న పోలీసులను సజీవ దహనం చేశారు) అనంతరం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నిలిపివేయడం భగత్‌సింగ్‌ను పూర్తిగా మార్చివేసింది. భగత్‌సింగ్ జీవితంలో మరో ఆసక్తికర అంశం ఆయన నాస్తికవాదిగా మారడం. మార్క్సిస్టు మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్, లెనిన్ రచనలతో తీవ్రంగా ప్రభావితుడైన భగత్‌సింగ్.. దేశ స్వాతంత్ర సాధనకే కాకుండా.. సకల జనుల సమస్యల పరిష్కారానికి సమసమాజమే మార్గమని నమ్మాడు. అందుకే తాను పని చేసిన హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ పేరులో సోషలిస్టు అన్న పదం చేర్చి.. దానిని హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌గా మార్పు చేశాడు. మృత్యువు ముంగిట్లో సైతం నాస్తికుడిగానే నిలబడ్డాడు
అరెస్టయి.. కోర్టు విచారణ సమయంలో తమ అసోసియేషన్ లక్ష్యాలను, నినాదాలను దేశంలో వ్యాప్తి చేయడానికి, తద్వారా దేశ యువతను స్వాతంత్రో ద్యమానికి పురికొల్పడానికి భగత్‌సింగ్ సాహసం చేశాడు. ‘చెవిటివారికి వినిపించేందుకు పెద్ద శబ్దం చేయటం’ అనే ఉద్దేశంతో న్యూఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో 1924, ఏప్రిల్ 8న ఎలాంటి హాని చేయని రెండు పొగబాంబులను దత్‌తో కలిసి భగత్ విసిరాడు. అనంతరం స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. ఆ సమయంలో ‘లాంగ్ లివ్ రివల్యూషన్.. ఇంక్విలాబ్ జిందాబాద్..’ అంటూ వారు చేసిన నినాదాలు.. ఇప్పటికీ కోట్ల మంది కార్మికులు, శ్రామికులు.. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్నవారికి తారక మంత్రాలయ్యాయి. విచారణ సమయంలో భగత్‌సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కోర్టు వేదికగా బ్రిటిష్ పాలకుల దాష్టీకాలను భగత్ ఎండగట్టాడు. రాజకీయ ఖైదీల హక్కుల కోసం 64 రోజుల పాటు తన సహచరులతో కలిసి కఠోర నిరాహార దీక్ష చేశాడు. ఆ సమయంలో గాంధీని మించిన పేరును భగత్ సంపాదించాడని చెబుతుంటారు. ఒక ద్రోహి కారణంగా శాండర్స్ హత్య కేసులో ఉరిశిక్షకు గురయ్యాడు. అయితే.. భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష తప్పించే అవకాశాన్ని గాంధీ విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి వైశ్రాయి లార్డ్ ఇర్విన్‌తో ఒప్పందం సందర్భంగా భగత్‌సింగ్ అతని సహచరుల ఉరిశిక్షకు గాంధీ కనీసం పట్టుబట్టలేదన్న వాదనలు ఉన్నాయి! భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 150వ వార్షికోత్సవాల సందర్భంగా విడుదల చేసిన ‘లోగో’లో నాలుగు సంవత్సరాలను ప్రస్తావించగా.. అందులో మొదటిది 1857(సిపాయిల తిరుగుబాటు), 1947 (దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం), 2007 పధమ స్వాతంత్య్ర సంగ్రామానికి 150 ఏళ్లు నిండిన సంవత్సరం) ఉంటే.. అందులో చోటు చేసుకున్న మరో సంవత్సరం 1907.. భగత్‌సింగ్ జన్మ సంవత్సరం! ఇదీ భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్‌సింగ్ పొందిన అత్యున్నత స్థానం!
No comments:
Post a Comment