Tuesday, 24 July 2018

తండ్రిని కాపాడిన మూడేళ్ల చిన్నారి.. ఎలాగంటే?


సరిగా మాటలు కూడా రాని మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైన తన తండ్రిని వీడియోకాల్ ద్వారా కాపాడింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని వించెస్టర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. వించెస్టర్‌కు చెందిన ట్రెవర్ మెక్‌‌కేబ్, డెవాన్ మెక్‌‌కేబ్ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. డెవాన్ మెక్‌‌కేబ్ ఆఫీసుకు వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న ట్రెవర్ మెక్‌‌కేబ్ తన మూడేళ్ల కూతురు మాలితో ఆడుకుంటుండగా.. హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కింద పడిపోయాడు. 

తన తండ్రి ఎంతకూ లేవకపోవడంతో.. మాలి ఏడ్వటం మొదలు పెట్టింది. తన తండ్రిని తడుతూ లేపడానికి ప్రయత్నించింది. అయినా తండ్రిలో స్పందన రాలేదు. దీంతో మాలీ తన తండ్రి జేబులోని సెల్‌ఫోను తీసుకుని 'ఫేస్‌టైమ్' ద్వారా తన తల్లికి వీడియో కాల్ చేసింది. తల్లి ఫోన్ తీయగానే బిగ్గరగా ఏడుస్తూ.. నాన్నకు ఒంట్లో బాలేదని చెప్పి.. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. ఫోన్ కెమెరాను తండ్రివైపు ఉంచి తల్లికి చూపించింది. 

దీంతో అప్రమత్తమైన చిన్నారి తల్లి 911కి ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ట్రెవర్‌ హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో చికిత్స చేసి ప్రాణాలు కాపాడగలిగారు. ఈ విషయమై డెవాన్ మెక్‌‌కేబ్ మీడియాతో మాట్లాడుతూ.. తన చిన్నారి కారణంగా అద్భుతం జరిగి, భర్త ప్రాణాలు నిలిచాయని ఆనందం వ్యక్తం చేసింది. తన కూతురు 'సూపర్ మ్యాన్' అంటూ ప్రశంసించింది. దీంతో వించెస్టర్ ప్రాంతంలో ఈ చిన్నారి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. 

1 comment: