Friday 9 May 2014

నవ తెలంగాణా...నయా జిల్లాలు


తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్.. కొత్త రాష్ర్టంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తును కూడా అప్పుడే పూర్తి చేసింది. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అంశంపై నిర్దిష్టమైన అవగాహనకు వచ్చింది. ఏయే కేంద్రాలను జిల్లాలుగా మార్చాలి.. వాటిలో ఏయే నియోజకవర్గాలు ఉండాలనే దానిపై నిపుణులతో చర్చింది పూర్తిస్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసింది.
          ఈమేరకు తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా మార్చేందుకు నిర్ణయించింది. 23 జిల్లాల్లో ఐదేసి నియోజకవర్గాలు, ఆచార్య జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించింది. జనాభా, భౌగోళిక స్థితిని బట్టి చార్మినార్, వికారాబాద్, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌ల పరిధిలో నియోజకవర్గాల సంఖ్యను సర్దుబాటు చేయాలని భావిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందనే వాదన కూడా ఉంది. జిల్లాలను పెంచి, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సకల వసతులను ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ప్రపంచస్థాయి(గ్లోబల్ సిటీ) నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకునే వీలుంటుంది. ఈ ప్రాతిపదికతోనే తెలంగాణలోని జిల్లాలను 15 లక్షల సగటు జనాభాతో ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది.           ఇప్పుడున్న జిల్లా కేంద్రాలకు అదనంగా 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అందుకు రూ.14 వేల కోట్లు అవసరం. కొత్త జిల్లా కేంద్రాల్లో పాలనా ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి దాదాపుగా రెండు లేదా మూడేళ్లు పట్టవచ్చు.
టీఆర్‌ఎస్ ప్రతిపాదిత కొత్త జిల్లాలు..
1. సిద్దిపేట, 2. మెదక్, 3. మహబూబ్‌నగర్, 4. వనపర్తి, 5. నాగర్‌కర్నూలు, 6. నల్లగొండ, 7. సూర్యాపేట, 8. ఖమ్మం, 9. భద్రాచలం, 10. ఆదిలాబాద్, 11. మంచిర్యాల, 12. వరంగల్, 13. జనగాం, 14. ఆచార్య జయశంకర్ జిల్లా(భూపాలపల్లి), 15. జగిత్యాల, 16. కరీంనగర్, 17. నిజామాబాద్, 18. రంగారెడ్డి(జిల్లా కేంద్రం వికారాబాద్), 19. హైదరాబాద్ సెంట్రల్, 20. చార్మినార్, 21. గోల్కొండ, 22. హైదరాబాద్ ఈస్ట్ (జిల్లా కేంద్రం భువనగిరి), 23. సికింద్రాబాద్, 24. సంగారెడ్డి

No comments:

Post a Comment