ఉద్యోగుల పంపిణీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ మేరకు తెలంగాణ ఎన్జీవోలు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టి పారేయలేనిది. రాష్ట్ర విభజన తరువాత కూడా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే తిష్టవేసే ప్రమాదం ఉన్నదనీ, దీని వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని టీఎన్జీవోలు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వారు మంగళవారం తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని కలిసి హామీలు పొందారు. జోనల్, మల్టీ జోనల్ స్థానాల్లో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపాలనడంలో కూడా తప్పేమీ లేదు. ప్రొవిజనల్ జాబితాకు తుదిరూపం ఇచ్చే ముందు తమను సంప్రదించాలన్న టీ ఎన్జీవోల డిమాండ్ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనది. పైగా ఇంతకాలం నష్టపోయింది తెలంగాణ ఉద్యోగులే కనుక కీలక నిర్ణయాలను తీసుకునే ముందు బాధితుల అభిప్రాయాలను దష్టిలో పెట్టుకోవాలె. ఉద్యోగుల విభజనకు ఆంటిసిడెంట్, సర్వీసు బుక్‌లో నమోదు చేసిన స్థానికతే ప్రాతిపదిక కావాలనే సూచన కీలకమైంది. గిర్‌గ్లానీ కమిషన్ స్థానిక, స్థానికేతర ఉద్యోగుల విషయమై పరిశీలన జరుపుతున్నప్పుడు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం హాస్యాస్పదమైనది. ఉద్యోగి స్థానికుడా కాదా అనేది అతడినే మాట మాత్రంగా అడిగారు. అతడు స్థానికుడినే అని చెబితే దానినే ప్రాతిపదికగా తీసుకున్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సౌలభ్యం కోసమే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం స్థానికతను తేల్చడంలో తూతూ మంత్రంగా వ్యవహరించింది. గిర్‌గ్లానీకి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించలేదనేది వాస్తవం.
తెలంగాణ ఎంత నష్టపోయిందీ లెక్క తీయాలె. వీలైనంత మేర బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందే. అందరిపై చర్య తీసుకోవడం సాధ్యం కాకపోయినా, ఎంత మేర అన్యాయం జరిగిందో గుర్తించడం అవసరం. తెలంగాణకు నిధులు, నీళ్ళు, కొలువులు ఇతర రంగాలలో జరిగిన అన్యాయంపై లెక్క తీయడానికి ప్రత్యేకించి ఒక విచారణ సంఘాన్ని వేయాలె.
స్థానికేతరులను పంపించి వేయాలనే డిమాండ్‌ను తెలంగాణ ఉద్యోగులు తమ స్వార్థం కోసం చేయడం లేదు. సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడే కొనసాగినా ఈ టీఎన్జీవోల జీతభత్యాలకు ముప్పేమీ లేదు. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోతాయి. తెలంగాణ ఉద్యమ లక్ష్యం నెరవేరదు. అక్రమంగా చేరిన ఈ సీమాంధ్ర ఉద్యోగులను కొనసాగించడం వల్ల ఇంతకు మించిన ప్రమాదం కూడా ఉన్నది. పరిపాలనా రంగం సీమాంధ్ర ఉద్యోగుల చేతిలో ఉండడం వల్ల తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేతులు కట్టేసినట్టు అవుతుంది. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర వ్యాపార వర్గం, ఈ పరిపాలనా బందం కుమ్మక్కై తెలంగాణను శాసిస్తాయి. తెలంగాణ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలోని ఆంతర్యం ఇదే. ఉదాహరణకు జేఎన్‌టీయూను మూడు ప్రాంతాలలో మూడు విభాగాలుగా విభజించినప్పటికీ, సీమాంధ్రులు హైదరాబాద్ విభాగంలోనే కొనసాగారు. దీనివల్ల సీమాంధ్ర అధ్యాపక, పరిపాలకవర్గం తెలంగాణ విద్యార్థులను అరిగోస పోసుకుంటున్నదనే ఆరోపణలు ఉన్నాయి. రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సీమాంధ్ర పెద్దలు తెలంగాణ ప్రజల పట్ల వివక్షతో లేదా కక్షతో వ్యవహరించే అవకాశాలను కాదనలేమని ఆందోళన వ్యక్తమవుతున్నది. సీమాంధ్ర పాలకవర్గాల అక్రమ ఆస్తులను, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక కుట్రలో భాగంగానే స్థానికేతర ఉద్యోగులను ఇక్కడే కొనసాగించడానికి యత్నాలు సాగుతున్నాయనే ఆరోపణ ఉన్నది. అందువల్ల తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండడం అవసరం.
ఉద్యోగుల విభజన సందర్భంగా ఆరు దశాబ్దాలుగా జరిగిన ఉల్లంఘనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. 1956లో విలీ నం జరిగిన తరువాత సచివాలయం మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలను తమ పిడికిటిలో పెట్టుకోవడానికి సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలు అమలు జరిపారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరించినట్టు జస్టిస్ బేగ్ కమిటీ విచారణలో వెల్లడి కావడం గమనార్హం. తెలంగాణ అధికారి శాఖాధిపతిగా ఉంటే అతడి అధికారాలను తొలగించడం కోసం ఆయనపై మరో కొత్త పదవి సష్టించి, ఆ పదవిలో ఆంధ్ర అధికారిని నియమించిన దష్టాంతాలు ఉన్నాయని బేగ్ కమిటీ స్పష్టంగా వెల్లడించింది. గిర్‌గ్లానీ సిఫారసులు, జైభారత్ రెడ్డి కమిటీ తేల్చిన స్థానికేతరులను తేల్చడం మొదలైనవన్నీ ప్రాతిపదికలుగా తీసుకోవాలె.
సీమాంధ్ర ఉద్యోగులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరపాలని, ఆ విచారణ ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలని తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా న్యాయబద్ధమైనది. విచారణ జరపడమే కాదు, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన ఉద్యోగులపై చర్య తీసుకోవాలె. వేలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు నియామకాలు, బదిలీలు, డిప్యూటేషన్ల పేర తెలంగాణలో అడ్డా వేయడానికి దారితీయడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలె. ఒక్కోసారి నిబంధనలనే మార్చిన ఉదంతాలు ఉన్నాయి. జోనల్ స్థాయి పోస్టులను రాష్ట్ర స్థాయివిగా మార్చి సీమాంధ్ర అధికారులనే నియమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ అక్రమాల వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందీ లెక్కతీయాలె. వీలైనంత మేర బాధ్యులపై చర్య తీసుకోవాల్సిందే. అందరిపై చర్య తీసుకోవడం సాధ్యం కాకపోయినా, ఎంత మేర అన్యాయం జరిగిందో గుర్తించడం అవసరం. తెలంగాణకు నిధులు, నీళ్ళు, కొలువులు ఇతర రంగాలలో జరిగిన అన్యాయంపై లెక్క తీయడానికి ప్రత్యేకించి ఒక విచారణ సంఘాన్ని వేయాలె.
No comments:
Post a Comment