* సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఇదే గోల్కొండ కోట నుంచి మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ. ఒక్కొక్కటిగా బాలారిష్టాలను దాటుకుంటూ స్థిరమైన పాలన అందిస్తూ రెండేళ్ల తక్కువ సమయంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే మన రాష్ట్రం ఇరుగు పొరుగు రాష్ర్టాలతో స్నేహపూర్వక వైఖరి అవలంభిస్తోందని చాలా స్పష్టంగా ప్రకటించాను. ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి.
నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతో సయోధ్యను సాధించుకోగలిగాము. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందం కుదిరింది. మరో నాలుగు నెలల్లో రాష్ర్టానికి విద్యుత్ అందుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గోదావరి ప్రాజెక్టుల నిర్మాణం గత ప్రభుత్వాల విధానం వల్ల వివాదాల్లో చిక్కుకొని ముందుకు సాగలేదు. మహారాష్ట్రతో వివాదాలు పరిష్కరించుకునే విషయంలో గత పాలకులు సరైన విధానాన్ని అవలంభించకపోగా, మరింత జఠిలం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలించాయి. రెండు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆగస్టు 23న ముంబయిలోచారిత్రక ఒప్పందం జరగనుంది.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వంతో కూడా స్నేహ సంబంధాలు బలపడ్డాయి. దీని వల్ల మహబూబ్‌నగర్‌కు నీరందించే ఆర్డీఎస్ పనులు వేగవంతం అయ్యాయి. పోయిన ఎండకాలంలో తాగునీటి కోసం పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకోగలిగాము. కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో మన రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తున్నది. కేంద్రంలో సఖ్యంగా వ్యవహరిస్తున్నది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ వేదికగా ఇంటింటికీ నల్లా నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సాగు, తాగునీటి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, నిబద్ధతను మోడీ ప్రశంసించారు. జాతీయ రహదారుల విషయంలో మన రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాము. ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 2,592 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేది. ఈ రెండేళ్లలో కొత్తగా 1951 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేయించుకోగలిగాం. దీంతో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు మొత్తం 4,590 కిలోమీటర్లకు చేరింది.
కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి. అందుకోసం అటు కేంద్రంతోను, ఇటు పొరుగు రాష్ర్టాలతోను సత్సంబంధాలు కొనసాగిస్తాం. నిజమైన అభివృద్ధి అంటే పేద ప్రజలకు భరోసా ఇవ్వడం, భద్రత ఇవ్వడం. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 30 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీకందరికి తెలుసు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని సంతోషకరంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తున్నాం.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై విద్యా బోధన జరుగుతున్నది. మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయి. బీసీ విద్యార్థుల కోసం కూడా త్వరలోనే 50 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీనవర్గాల గురుకులాలతో బీజం పడినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పటికే 40 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతాం.
తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎస్టీలు, మైనార్టీలు పేదరికంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్టీలు, మైనార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు, మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయడానికి నియమించిన చెల్లప్ప, సుధీర్ కమిషన్లు ఇటీవలే నివేదికలు అందించాయి. త్వరలోనే ఎస్టీలు, మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు పెంచుతాం. పేద బ్రహ్మణుల కోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించడం జరిగింది. వారి అభివృద్ధి కోసం తగిన పథకాలు త్వరలోనే రూపొందించబడుతాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపే విధంగా లుంబినీ పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది’ అని సీఎం స్పష్టం చేశారు.
No comments:
Post a Comment