Monday 2 July 2012

బోనాల పండగ

ఆషాఢం: గ్రామ దేవతల ఆరాధన 

                                   
షాఢం అమ్మతల్లికి అంకితం చేశారు జానపదులు. జాతరలు, కొలువులు, పండగలు పేరు ఏదైనా అన్నీ గ్రామదేవతల ఆరాధనలే. గ్రామదేవతల ఆరాధన అతి పురాతన సంప్రదాయం. ఆదిమానవులు తమ పూజనీయ విధానాలు ఎలా కాపాడుకున్నారో తెలుసుకునే పండగలు గ్రామ దేవతల ఆరాధనలు.
                                     
తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమంతా అమ్మతల్లికి బోనాలు సమర్పిస్తూ జాతరలు జరుపుకుంటారు. ఇక్కడి గ్రామ దేవతలు -పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళి అని ఏడుగురిని ప్రసిద్ధమైన వారుగా ఆరాధిస్తారు. వీరికి తోడు ‘పోతురాజు’ అనే తమ్ముడు కూడ వీరి వెంట రక్షకుడుగా, గ్రామాధికారిగా వ్యవహరిస్తున్నాడని గ్రామీణుల విశ్వాసం. అందుకే గ్రామదేవతల ఆరాధనలో పోతురాజు వేషానికి, విన్యాసానికి అమిత ప్రాధాన్యం ఉంటుంది.
                                      
గ్రామదేవతల ఆరాధనలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. నేడు గ్రామదేవతలకు గుళ్ళు నిర్మిస్తున్నారు. కానీ, ఇది సంప్రదాయం కాదు. తొలినాళ్ళల్లో ఈ దేవతలకు గుళ్ళులేవు. ఊరి బయట చెరువు కట్టలు, ఊరిలో గడీలు, దొడ్లల్లో ‘గూడు’లు మాత్రమే ఈ దేవతల నెలవులు. ఎవరికి వారు ఈ ప్రదేశాల్లో ఓ బండరాయికి సున్నం కొట్టి పసుపు కుంకుమలతో అలంకరించి దేవతలుగా ఆరాధించేవారు.
                                      
ఈ దేవతలు ఒక్కో శక్తికి ప్రతీక. పోచమ్మ బ్రోచే అమ్మ. మశూచికి అది దేవత. ఈమెను ఆరాధిస్తే ‘మశూచి’ నుండి కాపాడుతుందని నమ్ముతారు. ఈమె వేపచెట్టు మొదట్లో ఉంటుంది. ‘కల్లు’ అంటే ప్రీతి, బోనాలు ఇష్టం. అందుకే ‘పోచమ్మకు బోనాలు... పీరిలకు కందూరు’ అనే సామెత పుట్టింది. పోచమ్మ సోకితే మశూచి సోకిందని అర్థం. ఆమెకు మొక్కితే వేప ఆకు పై పూతగా పూస్తే ఈ వ్యాధిని నివారిస్తుందని కనిపెట్టారు. అందుకే ఆమె నివాసం వేపచెట్టు మొదట్లో ఏర్పాటు చేశారు. అంతేగాదు, బోనాలు జరిపే వేళ వేపమండలు ఇంట్లో అలంకరిస్తారు. ఊరేగింపులో శివసత్తులు చేతుల్లో వేపమండలు ధరించి చిందులు వేస్తారు. ఈ దేవతలకు ప్రత్యేకించి పూజారులు ఉండరు. అందువల్ల ఇంట్లో ఎవరికి వారే పండగ జరుపుకోవచ్చు. వివాహాది శుభకార్యాలకు ముందు ‘పోచమ్మలకు చేసుడు’ అనే పండగను జరుపుతారు. ఊరి బయట నెలకొన్న పోచమ్మకు అసాదులు, బైయిండ్ల వారు, చాకలి, మంగలి, తెనుగ కులాలకు చెందిన వారు పూజారులుగా వ్యవహరిస్తారు.
                                         
గ్రామదేవతల్లో మైసమ్మ (మహిషమ్మ) పశువులను రక్షించే దేవత. ఈ తల్లి చెరువు కట్టలు కూడా కాపాడుతుంది. అందుకే ‘కట్ట మైసమ్మ’ అనే పేరుతో ఆరాధిస్తారు. ‘బాలమ్మ’ పిల్లలను సంరక్షించే దేవత. ఈ దేవత బాలారిష్టాల నుంచి పిల్లలను సంరక్షిస్తుందని నమ్ముతారు. ఈమెకు ఇంట్లోనే ‘గూడు’ ఏర్పాటు చేసి ఆరాధిస్తారు. ‘ఎల్లమ్మ’ ఎల్లలు, ఊరి పొలిమేరలు కాపాడుతుంది. అలాగే, దుష్టశక్తులు గ్రామాల్లోకి రాకుండా రక్షిస్తుందని నమ్ముతారు. పెద్దమ్మ, మహంకాళి శక్తి స్వరూపురాలు. రాక్షసులు, దెయ్యాలు, భూతాలు వంటి వాటి నుండి రక్షిస్తుందని నమ్ముతారు. 
                                     
 ఇలా గ్రామదేవతలంతా స్త్రీ మూర్తులే. వారి మహిమలను అనేకంగా వర్ణిస్తూ కధలు చెబుతారు. ఈ కథలు చెప్పే జానపద గాయకులు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ప్రత్యేకించి కొన్ని కులాల్లో కనిపిస్తారు. అన్నట్టు, ఈ దేవతలకు జంతు బలి ఇష్టం. అందుకే ‘ఏట కోస్తం’, ‘కోడి ఇస్తం’ అంటూ మొక్కుకుంటారు. ‘కల్లు’ సాక పోస్తామని కూడా మొక్కుకుంటారు. ‘కల్లు, మాంసం తొలినాటి ఆది మానవుల పూజల అవశేషంగా భావించాలి. నేటికీ ఇవన్నీ గ్రామదేవతల ఆరాధనలో కనిపిస్తాయి. అయితే, ఈ దేవతల ఆరాధనకు ప్రత్యేకంగా తిథి నక్షత్రాలతో పని లేదు. ఆషాఢంలో, ఆది, గురువారాల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. తొలినాళ్ళల్లో దైవభావన లేదు. ‘తల్లి’ సర్వస్వం. ఆమె పిల్లలను కంటుంది, రక్షిస్తుంది. ఆమె వ్యవసాయం కనిపెట్టి కడుపునింపింది. అందుకే ఆమె దేవతగాక మరేమవుతుంది!

బోనాలు:
                                           

బోనం’ అంటే ‘అన్నం’. కొత్త కుండలో దేవతలకు నైవేద్యంగా వండిన అన్నమే ‘బోనం’. బోనాల పండగ రోజు, ఇల్లంతా సందడిగా చుట్టపక్కాలతో ఉంటుంది. గ్రామ దేవతలకు బోనాలు ఇష్టం. సాధారణంగా పోచమ్మకు మన సికింవూదాబాదులో మహంకాళికి బోనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీన్ని ‘మహంకాళి జాతర’ అంటారు. ఇది బోనాల పండగే. ఈ పండగలో బోనాలు, ఊరేగింపు, ఘటాల ఊరేగింపు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రామాల్లో పోచమ్మలకు బోనాలు ఎత్తుతామని మొక్కుకుంటారు. తమ కోరికలు తీరగానే బోనాల పండగ వేళ అందరితో కలిసి బోనాల ఊరేగింపులో పాల్గొంటారు. ఇళ్ళల్లో శుభకార్యాల్లో ఎవరికి వారే వైయక్తికంగా కూడ పండగ జరుపుకుంటారు.
ప్రాథమికంగా ఏడుగురిని గ్రామదేవతలుగా ఆరాధించినప్పటికీ ఆయా ప్రాంతాల్లో మరి కొందరు గ్రామదేవతల్లో చేరిపోయారు. మన సంప్రదాయ ఆరాధనలో కూడ అదే జరిగింది. ‘‘బ్రాహ్మీ మహేశ్వరీచైవ కౌమాదీ వైష్ణవీ తథాఃవారాహి చైవ చెంద్రాణి చాముండీ సప్త మాధరః’’ ఇందులో కూడ ఆదిశక్తి స్త్రీ మూర్తిగా ఆమె ఏడు రూపాలతో అలరారుతున్నట్లుగా పేర్కొనడాన్నిబట్టి మొదట్లో తల్లి దేవతలు ఏడుగురని భావించవచ్చు. పండగలు జాతీయ సమైక్యతకు అనివార్యం అనే మాట ‘బోనాల’ పండగను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ పట్టణం చేరుకున్న శ్రామికులు అయా గ్రామ దేవతలకు చిన్నపాటి గుళ్ళు కట్టి పూజలు చేయడమే ఇందుకు నిదర్శనం.
                                           
  పండగ రోజు తలస్నానం చేసి ముత్తైదువులు కొత్త బట్టలు ధరించి కుమ్మరింటికి పోయి కొత్త కుండ తెస్తారు అందులో పొంగలి, బోనం వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు కుంకుమలతో అలంకరించి దీనిపై కంచుడులో నూనే పోసి వెలిగిస్తారు. దీనిని ‘బోనం జ్యోతి’ అంటారు. ఈ కుండను ఊరేగింపులో తలమీద కుదురుగా పెట్టుకొనిఎత్తుకుంటారు. బోనం ఎత్తుకున్న వాళ్ళను పవివూతంగా దేవత వలే చూస్తారు. ఊరేగింపులో బోనం ఎత్తుకున్న వాళ్ళపై నీడ కొరకు నలుగురు మగవాళ్ళు తెల్లని చాందినీ బట్ట నలువైపుల కప్పులా పట్టుకుంటారు. దీన్ని ‘ఉప్లూడ’ అంటారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు ఊర్లో చప్పుళ్ళు మొదలవుతాయి. ప్రతి ఇంటా అందరూ సిద్ధంగా ఉంటారు. పంబ, డప్పు మోతలతో ఊరేగింపు సాగుతుంది. మొదట్లో వాయిద్యాలు, తర్వాత బలి ఇచ్చే జీవి-గొర్రె, మేక వంటి వాటిని వేప మండలాలతో అలంకరించి, దాన్ని పట్టుకొని ఒకరు నడుస్తారు. తరువాత ‘శివసత్తులు’ శివమూగుతారు. 
                                       
శివమెత్తడమే శిగమూగుడు. అయా దేవతలతో తాధాత్మ్యం చెందడం అన్నమాట. వీళ్ళు చిందులు వేస్తుంటారు. కొన్ని చోట్ల పోతురాజులు ఒళ్ళంతా పసుపుతో, చేత కొరడాతో విన్యాసం చేస్తూ భయంకరంగా కనిపిస్తారు.
                                         
 వీరంతా ఊరేగింపుగా ఊరి బయటకు చేరగానే అప్పటికే అక్కడ శుభ్రం చేసిన చోట ముఖ్యంగా దేవతలు ఉన్న చోట బోనాలు దించి అందులోని అన్నం (బోనం) రాశిగా పోస్తారు. తరువాత గుడిలో దేవతల స్తోత్రాలు చదివి నాలుగు కాళ్ళ జీవిని గుడి ముందుకు తీసుకు రమ్మంటారు. ఓ యువకుడు ఈ జీవి తలను ఒక్క వేటులో నరకమని చెబుతాడు. అతను మెడ నరికి రక్తం బోనం రాశిలో పోస్తారు. బలి ఇచ్చిన జంతువు నోట ఆ జంతువు ‘కాలు’ పెడతారు. కల్లు చల్లి సాకగా పోసారని అంటారు. చుట్టూ నీళ్ళు పోసి అన్నం రాశిలోని కొంత అన్నం ఊరి పోలిమేరల్లో, పంటపొలాల్లో చల్లి రమ్మంటారు. తరువాత ఊరంతా అక్కడే భోజనాలు చేసి దేవతలకు మొక్కు చెల్లించామని సంతృప్తి చెందుతారు. మళ్ళీ బోనాల పండగకై ఎదురు చూస్తారు. కాగా, ఈ గ్రామదేవతల్లో కొందరు అయా కులస్థులకు ఇలవేల్పులుగానూ ఉంటారు. గౌడవాళ్ళకు ‘ఎల్లమ్మ’, తెనుగువారికి ‘పెద్దమ్మ’, మాలమాదిగలకు ‘మైసమ్మ’, ‘ముత్యాలమ్మ’ ఇలా వేర్వేరు కులస్థులు ప్రత్యేకించి ఆయా దేవతలను ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. వారి సేవలో భాగంగా ప్రత్యేకమైన గాథలు గానం చేస్తారు. వీరికి పురాణాలు కూడా ఉన్నాయి.
                                    
గ్రామదేవతల వృత్తి-వికాసం అనేకానేక విశేషాలతో శిష్ట సాంప్రదాయ సాహిత్యంలోని విశేషాలకు తీసిపోని విధంగా ఉంటుంది.మొత్తం మీద తెలుగునాట జానపద సంస్కృతిని కాపాడుతున్న వాటిలో గ్రామదేవతల ఆరాధన ప్రముఖమైంది. పండగలు జాతీయ సమైక్యతకు అనివార్యం అనే మాట ‘బోనాల’ పండగను చూస్తే తెలుస్తుంది. ఇప్పటికీ పట్టణం చేరుకున్న శ్రామికులు అయా గ్రామదేవతలకు చిన్నపాటి గుళ్ళు కట్టి పూజలు చేయడమే ఇందుకు నిదర్శనం.

No comments:

Post a Comment