Wednesday, 2 April 2014

మన రాష్ట్రం.. మన పత్రిక..మన మ్యానిఫెస్టో


రు దశాబ్దాల పోరాటం ఫలితంగా.. యాచించే స్థితి పోయింది! పన్నెండు వందలకుపైగా బలిదానాల ఫలితంగా.. మనల్ని మనమే పాలించే స్థితి కళ్లెదుట సాక్షాత్కరించింది! ఇప్పుడు ఆ శాసనాలు ఎలా ఉండాలి? ఆ శాసనకర్తల దృష్టి ఏ అంశాలపై ఉండాలి? తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సంబురాలు చేసుకుంటున్న నాలుగు కోట్ల మందికి కోటి ఆశలున్నాయి! బతుకు మారాలనే ఆకాంక్షలున్నాయి! వారి హృదయ స్పందన ప్రతి క్షణం బంగారు తెలంగాణ కోసం!

మరి బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? దానికి పునాదులేమిటి? ఆ పునాదుల నుంచి ఉద్భవించి.. భావి తెలంగాణ జనసౌధాన్ని నిలబెట్టే మూలస్తంభాలేవి? ఆ సౌధాన్ని.. ఇంకా పొంచే ఉన్న ముప్పుల నుంచి కాపాడే మహాకుడ్యమేది? ఎన్నికలు ముగించుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు కావడం తెలంగాణకు ఒక విశేషం. తనకు కావాల్సిన పాలకులను ఎన్నుకుని తెలంగాణ తొలి అడుగు వేయబోతున్న అపురూప సందర్భం.. తెలంగాణ దిశను నిర్ణయించే అద్భుత అవకాశం! అందుకే ఏ రాజకీయ పార్టీ తెలంగాణ కోసం ఏం చేసిందనేది ఒక అంశమైతే.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు పరిపూర్తి కావడానికి విధానపరంగా ఏం చేయబోతున్నదనేదే ఇప్పుడు అసలు లెక్క!

గడిచిన అరవై ఏళ్లలోనూ తెలంగాణ ఎదుర్కొనని కష్టం లేదు. ఇబ్బందిపడని వర్గం లేదు. రెండు జీవనదులు తెలంగాణలో పారుతున్నా.. గుక్కెడు నీళ్ల కోసం తెలంగాణ తపించిపోయింది. చెలుకపారే దిక్కులేక లక్షల ఎకరాల పొలం పడావు పడింది. ఒకప్పుడు తెలంగాణలో చెరువులు వంటి చిన్ననీటిపారుదల వనరులే భారీ నీటి వనరులుగా వర్థిల్లిన వైనం. చెరువు చుట్టూ ఒక సమగ్ర జీవన వ్యవస్థే విలసిల్లింది. కానీ.. ప్రపంచీకరణ విధానాలతో, పరాయిపాలకుల వివక్షాపూరిత వైఖరులతో ఆ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. 

చేతి వృత్తులు, హస్తకళలు, కుల వృత్తులు, తెలంగాణ కుటీర పరిశ్రమలు చిన్నాభిన్నమయ్యాయి. వారి వృత్తులను మింగేసిన ఇతరేతర శక్తుల నుంచి కాపాడే ప్రత్యామ్నాయాలు కరువయ్యాయి. ఫలితం.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి. చేనేతకే తలమానికంగా వెలుగొందిన సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి వంటి ప్రాంతాలు ఆకలిచావులు.. ఆత్మహత్యలతో పెను జీవన విధ్వంసానికి సాక్షీభూతంగా నిలిచాయి. మొన్నటిదాకా రైతునని గర్వంగా చెప్పుకున్న ఆసాములు.. నగరాల్లో యూనిఫాం వేసుకుని సెక్యూర్టీ గార్డులైపోయారు! ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూపోవడమే తప్పించి..

చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు రాక.. యువత తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఉన్న ఉద్యోగం కాపాడుకోవడానికి.. కనీస హక్కులు సాధించుకోవడానికే తెలంగాణ ఉద్యోగులు నానా యాతనలు పడాల్సిన పరిస్థితి. అడ్డదిద్దంగా రూల్స్ మార్చేసి.. తెలంగాణ పోస్టుల్లో ఆంధ్ర అధికారులు తిష్ఠవేసుకున్నారు. సచివాలయం లాంటి చోట్ల నూటికి 90 మంది ఆంధ్రా ఉద్యోగులే ఉండటం దీనికి నిలువెత్తు నిదర్శనం. మాకంటే గొప్పగా ఎవరూ అభివృద్ధి చేయలేదన్న నేతల వాదనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతూ తెలంగాణ జిల్లాలు అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచాయి. మరోవైపు సీమాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతిపై తీవ్ర అభ్యంతరకర పద్ధతిలో దాడి జరిగింది. తెలంగాణ యాసను, భాషను చిన్న చూపు చూశారు. 

తెలంగాణ సంస్కృతిని దారుణంగా అపహాస్యం చేశారు. ఇన్ని రంగాలు.. ఇన్ని వ్యవస్థలు దోపిడీని, దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నాయి కాబట్టే.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సబ్బండ వర్ణాలూ పాల్గొన్నాయి. సామాజిక న్యాయం కోరుకునే శక్తులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష భావజాల శక్తులు కలిసొచ్చాయి. అన్నింటికి మించి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం పాత్ర గణనీయమైనది. భిన్నమైన సెక్షన్ల కలయికతో పెల్లుబికిన ఉద్యమంలో తెలంగాణపై ఆకాంక్షలు సైతం భిన్నంగానే ఉంటాయి. అనేక రకాల భావోద్వేగాలను తనలో తెలంగాణ ఉద్యమం తనలో ఇముడ్చకుంది కాబట్టే వాటన్నింటినీ సంతృప్తిపర్చే విధానాలు ఇప్పుడు అవసరం. తెలంగాణ పునర్నిర్మాణం అంటారో.. నవ నిర్మాణం అంటారో.. వినిర్మాణం అంటారో.. లేక అభివృద్ధి అంటారో! ఏదైతేనేం.. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఇప్పుడు ఒక భరోసా కావాలి. నెరవేర్చుతామన్న నమ్మకం కలిగించాలి. తెలంగాణను తెలంగాణే పాలించుకునేలా రాజకీయ అస్తిత్వానికి హామీ ఇవ్వాలి. తెలంగాణవాడు తెలంగాణవాడిగా తలెత్తుకుని బతుకగలిగేలా ఉండాలి. మన పాలన మన చేతిలోనే ఉండాలి. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా.. సమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత చేకూరుతుంది! తక్షణం సాంత్వన కల్గించే అంశాలుంటాయి. కొంత కాలపరిమితిలో పూర్తిచేయగలవి ఉంటాయి! దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకుని సాధించాల్సినవీ ఉంటాయి.

అందుకే.. గతకాలపు చేదు అనుభవాలు దాటి.. వర్తమాన ఆందోళనలపై నిలబడి.. భవిష్యత్‌ను చూసే ప్రయత్నం ఇది. తెలంగాణకు నడిచొచ్చిన కొడుకుగా.. ఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించిన నమస్తే తెలంగాణ.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేసే అంశాలను రాజకీయ పార్టీలకు గుర్తు చేయడం కూడా బాధ్యతగా స్వీకరిస్తున్నది! ఆ మాటకొస్తే అది తన హక్కుగానే భావిస్తున్నది! అందుకే ఈ ప్రయత్నం! ఇది తెలంగాణ ప్రజల తరఫున వెల్లడిస్తున్న మ్యానిఫెస్టో! ఇది రాజకీయ పార్టీ మ్యానిఫెస్టో కాదు.. నికరమైన జనం మాట! అమరవీరుల త్యాగాలు వృథాపోరాదన్నదే మా వేదన! అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అనుభవించిన వివక్ష సొంత రాష్ట్రంలో సమసిపోవాలనేదే మా ఆలోచన! నీళ్లు.. నిధులు.. నియామకాల్లో వలసపాలకుల దోపిడీ ముగిసి.. తెలంగాణ తనకంటూ కొత్త అధ్యాయం లిఖించుకునే సమయాన.. 

ప్రాధమ్యాలను రాజకీయాలకు అతీతంగా ముందుకు తేవడమే మా ఉద్దేశం! తెలంగాణను అభివృద్ధి చేయడమే కాదు.. అభివృద్ధిని తెలంగాణీకరించడం మా సూత్రం! తనదైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వైవిధ్యతను కలిగి ఉన్న తెలంగాణ సమాజంలో లిడ్‌క్యాప్ మొదలుకుని ఐటీ వరకూ! బడుగు బలహీన వర్గాల సంక్షేమం మొదలుకుని.. పారిశ్రామికరంగం వరకూ! సాగునీరు.. తాగునీరు.. గుడులు.. బడులు.. ఆస్పత్రులు.. కోర్టులు.. సకలరంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రతిపాదనలే రేపటి నుంచి మేం ప్రచురించబోయే మ్యానిఫెస్టోలోని అంశాలు! ఇది మన రాష్ట్రంలో మన పత్రిక మన తెలంగాణ ప్రజలకు అందిస్తున్న మన మ్యానిఫెస్టో!!

No comments:

Post a Comment