Thursday, 3 April 2014

ఎవరెన్ని శాపాలు పెట్టినా.. టీఆర్‌ఎస్ సర్కారుఖాయం


* అది తెలంగాణకు అవసరం.. 
* కాంగ్రెస్, టీడీపీ పాలనలో దోపిడీ.. 
* ఆ పార్టీలను పక్కన పెట్టాలి.. 
* టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 
* టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, 
* పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి బాబుమోహన్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (టీ మీడియా):ఎవరెన్ని శాపాలు పెట్టినా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ మంత్రి బాబుమోహన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, నల్గొండ జిల్లా నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదన్నారు. తెలంగాణలోని కష్టాలకు, బాధలకు కరెంటు లోటుకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రాంతం, ప్రజల తలరాత మారాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం అవసరమని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీల 60 సంవత్సరాల పాలనలో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని కేసీఆర్ చెప్పారు. రాజకీయ అవినీతిని అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతికి పాతర వేసేవరకు తాను విశ్రమించబోనని చెప్పారు. వందల కోట్లు.. లక్ష కోట్లను దోచుకున్నవారికి అధికారం ఇస్తే భవిష్యత్‌లో కూడా దోపిడీ జరుగుతుందన్నారు. చావు కింద తలపెట్టి 14 సంవత్సరాలు ఉద్యమం నడిపామని కేసీఆర్ పేర్కొన్నారు. పోరాట ఫలితాలను సార్థకం చేసుకోవాలన్నారు. నిరర్థకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు గోల్‌మాల్ చేసేందుకు ప్రయత్నిస్తాయని, ప్రజలెవ్వరూ ఆగం కావద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో రూ.3 లక్షలతో పేదలకు ఇళ్ళు నిర్మిస్తామని, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని కాన్వెంట్ స్కూల్ ప్రమాణాలతో తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తామన్నారు. రెండేళ్ళలో కోటి ఎకరాలకు నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. విద్యుత్‌లోటును పూడ్చుకునేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన నాయకులే పునర్నిర్మాణంలో నాయకత్వం వహించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. 

టికెట్ల కేటాయింపులో వీరికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఫ్రొఫెసర్ సీతారాం నాయక్‌కు వరంగల్ జిల్లా నుంచి రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. బాబూమోహన్ పార్టీలోకి రావడం సంతోషమని కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా బాధ్యునిగా ఉన్న బండ నరేందర్‌రెడ్డి తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించారని, నరేందర్‌రెడ్డికి మొట్టమొదటి ఎమ్మెల్సీగా అవకాశమిస్తానని ప్రకటించారు. పార్టీలో చేరిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను బాధిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య పోవాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖకవి నందిని సిధారెడ్డి సంపాదకత్వంలో రానున్న జంబి త్రైమాసిక పత్రికను కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ నాయకులతో పాటు వారి అనుచరులు వేల మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

No comments:

Post a Comment