Saturday 13 June 2015

‘అవినీతికి తావులేకుండా పరిశ్రమలకు అనుమతులు’

రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐ-పాస్)కు శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఇవాళ నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతాలాపన అనంతరం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి టీఎస్ ఐపాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. అప్లికేషన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాదాపు 2 వేల 5 వందల మంది పారిశ్రామిక వేత్తలు, 250 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిటన్, అమెరికా, టర్కీ, మలేషియాకు చెందిన రాయబారులు హాజరయ్యారు. బీహెచ్‌ఈఎల్, మిథాని, బీడీఎల్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు విచ్చేశారు. 
          టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే 1 లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది. నూతన పారిశ్రామిక విధానం అమలులోకి రావడంతో ఇకపై పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడి దారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం రెండు వారాల్లోగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వనుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నారు. 
సీఎం ప్రసంగంలోని ప్రధానాంశాలు:
- పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది
- కోరుకున్న చోట పరిశ్రమలకు కావాల్సినంత భూమి ఇస్తాం
- ఆన్‌లైన్‌లో పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా అనుమతులు మంజూరు
- జాప్యం చేస్తే సంబంధిత అధికారికి రూ.1000 జరిమానా వేస్తాం
- సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు
- పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
- అన్ని పరిశ్రమల ఏర్పాటుకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా
- వాటర్‌గ్రిడ్ పైపులైన్ల ద్వారా పరిశ్రమలకు చాలినంత మంచినీటి సరఫరా
- వంద శాతం అవినీతి రహితంగా (కరప్షన్ ఫ్రీ) అనుమతులు మంజూరు
- సెల్ఫ్ సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం
- పరిశ్రమల అనుమతులకు పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం
- రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు ఐటీసీ ముందుకు వచ్చింది
- పరిశ్రమలకు తగిన రక్షణ కల్పిస్తాం
- హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రాంతం
- హైదరాబాద్‌లో భద్రతను పెంచాం
- లక్షా 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం
- మహిళల కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశాం

No comments:

Post a Comment