* ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు..
* ఇప్పటికి బచావత్ కేటాయింపులే!
* ఏడాది కాలానికి కుదిరిన ఒప్పందం
* రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ
* కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయాలు
* ఇది చారిత్రక విజయం: విద్యాసాగర్‌రావు
కృష్ణా నదీ జలాల్లో మన రాష్ర్టానికి కేటాయించిన నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై మనకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది బేసిన్‌లో మనకు లభించిన వాటా మేరకు మనం నీటిని ఏ ప్రాజెక్టు నుంచైనా పొందడానికి, వినియోగించుకోడానికి పూర్తి అధికారం లభించింది. గత సంవత్సరం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బోర్డు సమావేశంలో మనం పెట్టిన ప్రతిపాదన చివరకు నిర్ణయంగా మారింది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా మనం మనకు దక్కిన నీటిని వినియోగించుకునే అవకాశం లభించింది.
దీంతో ఇప్పటికి బచావత్ కేటాయింపులే అమల్లో ఉంటాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని, మినిట్స్‌ను బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. అక్కడినుంచి ప్రత్యేకమైన నోట్‌తో పాటు ఈ ఒప్పందం రెండు రాష్ర్టాలకూ చేరుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తర్వాత కేంద్రం నుంచి వచ్చే ఆదేశం మేరకు బోర్డు వీటిని రెండు రాష్ర్టాలకు మళ్ళీ పంపుతుంది. అప్పటినుంచి ఇది అమలులోకి వస్తుంది.
చారిత్రక విజయం
రెండు రాష్ర్టాలకు చేసిన కేటాయింపు మేరకు ఆ నీటిని వాటి ఇష్టప్రకారం వినియోగించుకునే స్వేచ్ఛ లభించడం ఈ సమావేశం సాధించిన చారిత్రక విజయం. గతంలో ఉన్న విధానం ప్రకారం ఆయా రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటాయింపులను మాత్రమే వినియోగించుకోవాలని, ఇష్టప్రకారం తరలించడం, ఇతర ప్రాజెక్టుల పరిధిలో వినియోగించడం సాధ్యం కానందువల్ల తెలంగాణ చాలా నష్టపోతున్నది. ముఖ్యంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు లభించిన నీటి కేటాయింపులను ఇష్టప్రకారం, అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ లభించడం చాలా పెద్ద విజయమని నీటిపారుదల నిపుణులు హర్షం ప్రకటిస్తున్నారు.
కీలక అంశాల్లో ఏకాభిప్రాయం
కృష్ణా నది నిర్వహణ బోర్డు అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్ అధ్యక్షతన ఇరు రాష్ర్టాల సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజినీర్లు, తెలంగాణ రాష్ట్ర సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు హాజరైన ఈ సమావేశం రెండు రోజుల పాటు జరిగింది. అనేక అంశాలపై చర్చలు జరిగిన అనంతరం రెండు రాష్ర్టాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మొత్తం 811 టీఎంసీల కృష్ణా నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీటి వాటా కేటాయించి ఉండగా.. మనకు కేటాయించబడిన నీటిని ఏ విధంగానైనా మనం వాడుకునే అవకాశం లభించింది. రానున్న ఏడాదికి మాత్రమే ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా ఈ నీటిని పొందవచ్చు. అదే సమయంలో ఇతర రాష్ర్టాల హక్కులకు కూడా భంగం కలగని రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది.
* ఉదాహరణకు మనకు నెట్టెంపాటు, బీమా ప్రాజెక్టులకు గతంలో నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తికానందువల్ల ఈ నీటిని మరో ప్రాంతానికి తరలించి వినియోగించుకునే అవకాశం ఇన్నాళ్ళూ లేదు. కానీ ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రెండు ప్రాజెక్టుల కింద లభ్యమయ్యే 30 టీఎంసీల నీటిని మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా తరలించుకుని వినియోగించుకునే వీలు కలిగింది.
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు
- విద్యుత్ ఉత్పత్తికోసం శ్రీశైలం డ్యామ్‌ను మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సార్బీసీ)కి సరఫరా చేస్తున్న 19 టీఎంసీల నీటికి ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు.
- రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద తుంగభద్ర జలాలు మనకు దీర్ఘకాలంనుంచి రావడంలేదు కాబట్టి కేసీ కెనాల్ దగ్గర గేట్లు బద్దలు కొట్టే లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఒకవేళ నికర జలాల్లో హెచ్చు తగ్గులు ఏర్పడినట్లయితే ప్రస్తుతం అమలవుతున్న నిష్పత్తి (512:299) లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంకోసం ఇరు రాష్ర్టాల తరఫున ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, బోర్డునుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఒకరు సభ్యులుగా ఉండే వర్కింగ్ మేనేజ్‌మెంట్ కమిటీ పర్యవేక్షణ, సమీక్ష జరుపుతుంది. ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి రెండు రాష్ర్టాల నుంచి నీటి అవసరాలకు సంబంధించి ఇండెంట్‌ను తీసుకుని నీటిని కేటాయించడం, విడుదల చేయడం తదితరాలను పర్యవేక్షిస్తుంది. ఏ రాష్ట్రం ఎంత మేర నీటిని వినియోగించుకున్నదనే వివరాలను బోర్డు నిర్వహిస్తుంది.
- ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవీ కూడా ట్రిబ్యునల్ వెలువరించిన ఉత్తర్వులకు, వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించిన అభిప్రాయాలకు విరుద్ధంగా లేనందువల్ల ఏడాదికోసం కుదిరిన ఈ ఒప్పందాన్ని రెండు రాష్ర్టాలూ ఆరోగ్యకరమైన తీరులో అమలు చేయాలని, ఘర్షణకు తావులేని విధంగా వ్యవహరించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. గత సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా ఇబ్బంది పెట్టినందున ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆంక్షలూ ఉండరాదని నిర్ణయం జరిగింది. అయితే చెన్నై, ఎస్సార్బీసీలకు చేసిన కేటాయింపులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా ఏకాభిప్రాయం కుదిరింది.
తెలంగాణకు మేలు చేసే నిర్ణయం: విద్యాసాగర్‌రావు
రెండు రాష్ర్టాల మధ్య ఘర్షణలను నివారించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, రెండు రోజుల చర్చల అనంతరం చాలా మంచి నిర్ణయం జరిగిందని, ఇది తెలంగాణకు చాలా మేలు చేస్తుందని సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు నమస్తే తెలంగాణతో అన్నారు. కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
గత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తితో పాటు నీటి వినియోగంలో రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు ఏర్పడి వివాదంగా మారినప్పుడు గవర్నర్ ద్వారా పరిష్కారం కుదిరిందని, ఈసారి అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకముందే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. రెండు రాష్ర్టాలూ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇతర రాష్ర్టాల హక్కులకు భంగం కలగని రీతిలో నీటి వినియోగంకోసం చర్చించి ఏకాభిప్రాయానికి రావడం ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండే పరిస్థితికి శ్రీకారం చుట్టినట్లయిందని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున విద్యాసాగర్‌రావుతో పాటు ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, నీటిపారుదల లీగల్ వ్యవహారాల నిపుణులు విద్యాసాగర్, చీఫ్ ఇంజినీర్ నాగేంద్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వర్లు, బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాల్గొన్నారు.
- నమస్తే తెలంగాణ.
No comments:
Post a Comment